యదార్థ గాథలు

-దామరాజు నాగలక్ష్మి

కలిసొచ్చిన అదృష్టం

రజిత దగ్గిరకి చాలా రోజుల తర్వాత రోహిణి వచ్చింది. మొహం చాలా పీక్కుపోయి, జ్వరం వచ్చినట్లుగా వుంది. ముందేమీ అడగకుండా లోపలికి రమ్మని వేడి వేడి కాఫీ ఇచ్చింది. కాసేపయ్యాక రోహిణి ఏడవడం మొదలు పెట్టింది. ఏదో జరిగి వుంటుందని ఊహించింది రజిత. 

రోహిణీ నువ్వు ఏడుస్తే ఏమీ చెయ్యలేవు. ఏదైనా ధైర్యంగా వుంటేనే ఏదైనా చెయ్యగలుగుతావు. నిన్ను చూస్తే నీ పరిస్థితులు సరిగ్గా లేనట్లు అనిపిస్తోంది. ఏమయ్యిందో చెప్పు అంది. 

రోహిణీ ఏంచెప్పాలి. ఇంట్లో మా ఆయనకి ఉద్యోగం పోయింది. పిల్లలకి స్కూలు ఫీజు కట్టలేక వాళ్ళని ఇంట్లోనే వుంచేస్తున్నాను. వాళ్ళు గోల గోల పెడుతున్నారు. వాళ్ళ గోలకి మా ఆయన ఇంకా చికాకు పెడుతున్నాడు. చేతిలో పైసా లేదు. అమ్మా వాళ్ళు ఎన్నాళ్ళు పెడతారు. నాకు ఏంచెయ్యాలో అర్థం అవట్లేదు అంది. నువ్వే నాకు ఒక దారి చూపించాలి అంది. 

రజిత గబగబా రెడీ అయి నాకు తెలిసిన ఒక మేడమ్ వున్నారు. ఆవిడకి అసిస్టెంట్ ఎవరైనా కావాలన్నారు. పద వెళ్దాం అంది.

రోహిణీకి కొంచెం ఊరటగా అనిపించింది. రజితని నమ్ముకుంటే ఏదో ఒక దారి చూపిస్తుందని తెలుసు. 

ఇద్దరూ కలిసి సీతమ్మగారని ఒక పెద్దావిడ దగ్గిరకి వెళ్ళారు.  ఆవిడ చక్కగా నవ్వుతూ పలకరించి. ఇద్దరితో చాలాసేపు మాట్లాడారు. ఆవిడకి రోహిణి బాగా నచ్చింది. 

రేపటి నుంచీ పనిలోకి రామ్మా… నెలకి ప్రస్తుతం నాలుగువేలు ఇస్తాను. నీ పనిని బట్టి పెంచుతాను అన్నారు. 

రోహిణీకి అదే వరప్రసాదంలా అనిపించింది.

రోజూ టైము తప్పకుండా సీతమ్మగారింటికి వెడుతోంది. ఆవిడకి కావలసినవి టైపు చెయ్యడమే కాకుండా… ఇంటికి వచ్చిన పెద్ద మనుషులని గౌరవించడం, సీతమ్మగారు బయటికి వెడితే విషయం కనుక్కుని తర్వాత ఆవిడకి చెప్పడం లాంటి పనులు చాలా చక్కగా చేసేది. 

సీతమ్మగారు నెలకి ఇచ్చే జీతమే కాకుండా అప్పుడప్పుడూ పళ్ళు, వాళ్ళకి పొలంలో పండిన బియ్యం, పిల్లకి తినడానికి బిస్కట్లలాంటివి ఇస్తూవుండేవారు. ఆవిడ ప్రేమాదరాలు చూసి రోహిణీ మరింత శ్రద్ధగా పని చెయ్యడం మొదలు పెట్టింది. 

ఒకరోజు సీతమ్మగారు రేపు ఇంటికి బంధువులు ఎవరో వస్తున్నారు. స్వీట్స్, హాట్స్ తెప్పించాలని చెప్పారు. రోహిణీ అమ్మా…! మీరు బయటి నుంచి తెప్పించకండి నేను చేస్తాను. నేను చెప్పిన సరుకులు రవి చేత తెప్పించండి చాలు అంది. 

సీతమ్మగారు ఎందుకమ్మా నీకు కష్టం అన్నా కూడా రోహిణీ మైసూర్ పాకు, కాజా, లడ్డూ, మిక్చరు చేసింది. ఆరోజు ఆఫీసు పనులన్నీ పక్కకి పెట్టేసింది. 

 మర్నాడు ఒక 20 మంది బంధువులు వచ్చారు. ఇల్లు పెద్దది కావడంతో అంత ఇబ్బంది అవలేదు. రోహిణీ కూడా చక్కగా తయారయి వచ్చింది. రవి సాయంతో అందరికీ తను తయారు చేసిన స్వీట్లు, మిక్చరు పెట్టింది. 

సాయంత్రం అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాడు ప్రతి ఒక్కళ్ళూ సీతమ్మగారికి ఫోన్ చేసి నిన్న మీ ఇంట్లో తిన్న స్వీట్స్, మిక్చర్ ఎక్కడ తెప్పించారు చాలా బావున్నాయి. అడ్రస్ చెప్పమన్నారు. 

సీతమ్మగారు ఒక నవ్వు నవ్వి నేను ఎక్కడ నుంచీ తెప్పించలేదు. నా దగ్గిర పని చేస్తున్న రోహిణి చేసింది అందరికీ ఓపికగా  చెప్పారు.

వాళ్ళందరూ ఆశ్చర్యంగా… అవునా… అని, అయితే మాకు ఎప్పుడైనా కావాలంటే చేసి పెడ్తుందా అన్నారు. సరే కనుక్కుంటాను అని ఆవిడ ఫోను పెట్టేశారు. 

అమ్మా! రోహిణీ నిన్ను వెతుక్కుంటూ అదృష్టం వచ్చింది అని, అందరూ అడిగిన విషయం చెప్పారు. 

రోహిణీ ఒక్కసారి ఆశ్చర్యపోయి. అమ్మా…! నేను మీవరకు అయితే చేసి పెట్టాను. అందరికీ చేసి పెట్టడం నావల్ల ఎక్కడవుతుంది అంది సాలోచనగా…

రోహిణీ నీకు కావలసిన డబ్బు సాయం నేను చేస్తాను. మా వెనకవైపు రెండు గదుల చిన్న ఇల్లు వుంది. నువ్వు అక్కడ ఇవన్నీ చేసి అందరికీ అందించు అన్నారు. 

రోహిణి సీతమ్మగారిచేత ప్రారంభోత్సవం చేయించి, పని ప్రారంభించింది. ఒక ఐదుగురికి అందించడంతో మొదలైన వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. రోహిణీకి చేతినిండా డబ్బు. పిల్లలని తిరిగి స్కూలుకి పంపిస్తోంది. వాళ్ళాయనకి వేరే ఉద్యోగం అవసరం లేకుండా ఇంటి నుంచీ అందరికీ కావలసినవన్నీ అందించడం, డబ్బులెక్కలు చూసుకోవడం సరిపోతోంది. అలా ఐదారు సంవత్సరాలు గడిచాయి. మెల్లగా లోను పెట్టి ఒక ఇల్లు కొనుక్కున్నారు. చేసే పనిలో చాలా శ్రద్ధమాత్రం వుంచుతున్నారు. 

పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. చక్కగా చదువుకుని ఉద్యోగస్తులయ్యారు. 

రోహిణీ, వాళ్ళాయన మాత్రం తమకు ఓ దారి చూపించిన రజిత, సీతమ్మగారు చేసిన మేలు మాత్రం మర్చిపోలేదు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.