రమణీయం
బుద్ధుని జీవితం-ధర్మం-5
-సి.రమణ
గత సంచికలలో బౌద్ధధర్మం గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం. ఇంకా తెలుసుకోవలసినది అంతులేనంత ఉన్నది. ప్రపంచానికి పంచశీలాలు బోధించిన భూమి, మన భారతావని. పంచశీలాలను మననం చేసుకోకపోతే అసంపూర్ణమే, మన విషయ పరిజ్ఞానం. అందరికీ తెలిసినవే అయినా మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. శీలం అనే పదం వినగానే స్త్రీలకు సంబంధించిన విషయంగా అనుకుంటారు మనలో చాలామంది. అసలు శీలం అంటే ఏమిటి? శీలం అంటే నడవడిక , నైతిక ప్రవర్తన. ఆధునిక జీవనంలో వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. వ్యక్తిత్వం అనేది స్త్రీ, పురుష బేధం లేకుండా అందరికీ సంబంధించిన విషయం. తథాగతుడు బోధించిన పంచశీలాలు మానవజాతి మనుగడకు అత్యంత ప్రధానమైనవి. వాటిని పంచ సూత్రాలు అని కూడా అంటారు. అవి
1. జీవహింస చేయరాదు.
2. దొంగతనం చేయరాదు.
3. అసత్య మాడరాదు.
4. వ్యభిచారం చేయరాదు.
5. మత్తు పానీయాలు సేవింప రాదు.
ఈ పంచశీలాలు ఆచరించని వాడు బౌద్ధుడు కాడు, కాలేడు. బుద్ధునికి ముందు కాలంలో అనాగరికమైనటువంటి జీవహింస, దొంగతనం, వ్యభిచారం, సురాపానం చాలా సాధారణంగా జరిగే విషయాలు. మానవునికి తన దుఃఖాన్ని తొలగించుకోవడమే అంతిమ లక్ష్యం అయితే, ధర్మానుసారం ఆ దుఃఖాన్ని తొలగించుకోవడానికి 1. నిర్మలమైన జీవనం (పంచశీలాలు ) 2. ధర్మాచరణ ( అష్టాంగ మార్గము) 3. సౌశీల్య జీవనం (దశ పారమితలు) వంటి విధానాలలో పయనిస్తే దుఃఖం అంతమైపోతుందని తథాగతుడు బోధించాడు. నిర్మలమైన జీవనవిధానానికి బుద్ధుడు ప్రతిపాదించిన సూత్రాలు అయిదు. మరో విధంగా చెప్పాలంటే, మానవుని పతనానికి కారణం అయిన 5 నీవరణలు (బలహీనతలు) ఇవే.
1.జీవహింస: బౌద్ధ ధర్మం వెలుగు చూడక మునుపు, ప్రాచీన భారతంలో జంతుబలులు సర్వసాధారణం. అప్పటి రాజులు తమ మరణానంతరం, స్వర్గలోకప్రాప్తికై, అమర లోకపు ఆనందాలను పొందాలనే స్వార్థపూరిత కాంక్షతో, యజ్ఞయాగాదులు చేసేవారు. ప్రతి యజ్ఞ క్రతువు లోను జంతుబలి తప్పనిసరి. దాదాపు 3000 పైగా, రకరకాల జంతువులను ఆవులు, ఎద్దులు, ఒంటెలు, గుర్రాలు, దున్నపోతులు, మేకలు, గొర్రెలు మొదలగు వాటిని బలి ఇచ్చేవారు . రాజులు రాజ్య విస్తరణలో భాగంగా, పొరుగు రాజ్యాలతో యుద్ధం చేసి వారి రాజ్యాలను ఆక్రమించే వారు. ఆ క్రమంలో ఎందరో సైనికులు ఇరుప్రక్కలా మరణించేవారు. మానవరక్తంతో భూమి రక్తసిక్తమయ్యేది. ఇంతే కాకుండా, మృగయా వినోదం పేరిట, అడవిలోని జంతువులను వేటాడే వారు. వినోదం కోసం జీవహింస చేసేవారు. యజ్ఞశాలలో, యుద్ధాలలో, వినోదాలలో జీవహింసను నిరసించాడు శాక్యముని. సుస్థిరశాంతి స్థాపన కొరకు, అనివార్యమైతే తప్ప, యుద్ధం చేయరాదు.
జీవహింస అంటే చంపడం ఒక్కటే కాదు, తోటి మానవులను మాటలతో, చేతలతో బాధపెట్టడం, చులకనగా చూడటం, వెక్కిరింతగా మాట్లాడటం సూటిపోటి మాటలు అనడం, కించపరచడం, తూలనాడటం, శారీరక వైకల్యాన్ని పేరుగా పిలవడం, అవమానించడం, అనుమానించడం అన్నీ హింస కిందకే వస్తాయి.
2. దొంగతనం చేయరాదు: నీ కష్టార్జితం కానిది, ఏదీ నీది కాదు. అంటే మనం కష్టపడి సంపాదించినది మాత్రమే మనది. మనది కానిది, ఇతరులు ఇవ్వకుండా తీసుకోకూడదు. ఇవ్వబడనిదానిని తీసుకోవడం, దారిలో దొరికిన దానిని తీసుకోవడం దొంగతనమే అవుతుంది. ఇప్పటికీ బౌద్ధం ఆచరిస్తున్న స్వీడన్, జపాన్ వంటి దేశాలలో బౌద్ధ సంస్కృతి నేర్పిన ఈ నైతిక విలువలను పాటిస్తారు. బిక్షువులు శ్రమచేసి, భోజనవేళకు బిక్షకు వెళ్తారు. భిక్షకు ముందు కానీ, తర్వాత కానీ ధర్మప్రబోధం చేస్తారు. ఇతరులు ఇస్తే మాత్రం తీసుకోవచ్చు. మనది కానిది, ఇతరులకు చెందినది, దొరికినా సరే తీసుకోరాదు.
3.అసత్య మాడరాదు: అబద్ధం విషయంలో రాజీ ధోరణి లేదు బౌద్ధంలో. సత్యాన్ని విచక్షణతో చెప్పు. నీకు ప్రమాదకరమైనా, ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటే నిజం నిర్భయంగా చెప్పు అంటుంది బౌద్ధం. మోసంతో కూడిన మాటలు చెప్పడం, మాయమాటలు చెప్పి నమ్మించి లాభం పొందడం అబద్ధం కిందికే వస్తాయి. విద్య, వైద్యం, రాజకీయం, వాణిజ్యం వంటి అన్ని వ్యవస్థలలో అబద్ధం చోటుచేసుకున్న నేటి సమాజంలో, ఈ మూషావాద (మోసపు మాటలు) నిర్మూలన అత్యంత ఆవశ్యకం.
4.వ్యభిచారం చేయరాదు: కామ దురాచారం. ప్రాచీన కాలంలో కామ సుఖాల్లో నియమం పాటించాలన్న పట్టింపు అంతగా కనబడదు. వేదకాలంలో కూడా అంతే. ఉపనిషత్తు కాలంలో నియమాలు వచ్చాయి, కానీ ఆచరణ తక్కువ. బ్రాహ్మణులు కుల వ్యవస్థను స్థిరీకరించే క్రమంలో మిత్యాచారం (వివాహేతర సంబంధాలు) ప్రమాదకరమని భావించారు. కుటుంబ వ్యవస్థ, సమాజాన్ని నడిపిస్తున్న సత్సాంప్రదాయం. కుటుంబ వ్యవస్థకు మూలం వివాహం. వివాహానికి ప్రధాన లక్ష్యం జాతి మనుగడ. కామం లేకుండా వివాహం లేదు. కామ విషయం ప్రాకృతికంగా ఉండాలి కానీ విశృంఖలంగా ఉండకూడదు. వివాహేతర సంబంధాలు, ఘణిక దురాచారం (దేవదాసి), బహుభార్యత్వం కామ దురాచారం కిందకి వస్తాయి. స్త్రీని విలాస వస్తువుగా, భోగవస్తువుగా చూడటం ఏ సమాజంలోనైనా, ఏ కాలంలోనైనా దుర్మార్గమే. బౌద్ధ గ్రంథాలు దాంపత్య విషయంలో పవిత్రంగా ఉండమని నొక్కి చెబుతాయి.
5.మత్తుపదార్థ సేవనం: ప్రమత కలిగించే పదార్థాలు మనిషిని చెడుపనుల వైపు నెడతాయి. తనమీద తనకి అధీనత లేని మానసిక దౌర్బల్యుడవుతాడు. ప్రాచీన వైదిక ఆచారాలలో, తరచూ జరిగే యజ్ఞయాగాదులలో సురాపానం, సోమపానం, జంతుబలులు దైవకార్యంగా భావించేవారు. మైకంలో మంచి వాడు కూడా చెడ్డ పనులు చేస్తాడు. స్పృహ నశింపచేసి, నీచమైన పనులకు దారితీసే, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండమంటుంది బౌద్ధం. భారతదేశంలో మొట్టమొదట సంపూర్ణ మద్యపాన నిషేధం పాటించిన వారు బౌద్ధులే.
సంప్రదించిన గ్రంధాలు, లఘు చిత్రాలు:
1)బుద్ధ ధర్మ సారం – ఆంగ్ల మూలం: పి.లక్ష్మీ నరసు తెలుగు: డి.చంద్రశేఖర్
2)బుద్ధుని బోధనలు – మూలం: వల్పోల రాహుల తెలుగు: డి.చంద్రశేఖర్
3)గౌతమ బుద్దుడు – మూలం: ప్రొఫెసర్ మైకేల్ కారిథెర్స్ తెలుగు: డి.చంద్రశేఖర్
4)బుద్ధుడు – బౌద్ధ ధమ్మము రచన: బి.ఆర్.అంబేడ్కర్ అనువాదం: డా.యెండ్లూరి
5)విపశ్యన ధ్యానము – ఆచార్య శ్రీ సత్యనారాయణ గోయంకా
6)బుద్ధ-ధమ్మ-సంఘ – మూలం: ధర్మానంద కోసంబీ అనువాదం జె.లక్ష్మీరెడ్డి
7)బౌద్ధం అంటే – సంజీవదేవ్
8)బొర్రా గోవర్ధన్ – YouTube ఉపన్యాసాలు
9)మిసిమి మాస పత్రికలు
*****
(ఇంకా ఉంది)
సి.వి.రమణ: గృహిణి. హైదరాబాదు నివాసం. సంగీతం, పర్యావరణం, సాహిత్యం ఇష్టం. రక రకాల మొక్కలను పెంచటంలో ఆనందం. స్త్రీల సమస్యలపై ఆకాశవాణిలో పలు ఉపన్యాసాలిచ్చారు. కొన్ని కథలు, వ్యాసాలు వనితాజ్యోతి, విపుల వగైరా పత్రికలలో ప్రచురితమయ్యాయి.