అతిసర్వత్ర వర్జయేత్
-వసంతలక్ష్మి అయ్యగారి
అర్థంపర్థం లేకుండా,వేళాపాళా లేకుండా,వివక్ష,విచక్షణ లేకుండా,రుచీపచీ లేకపోయినా ,తోచినాతోచకకొట్టుకుంటున్నా యాంత్రికంగా చేతులు తినుబండారాల భండారాలవద్దకేగి…అందినంతదోచి నోటిగూట్లో పడేసి గిర్నీ ఆడించి మరపట్టడం కచ్చితంగా యేదో మాయరోగమే.కాస్త తీక్షణంగా ఆలో చిస్తే బొత్తిగా మనకంటూ ఓ మంచి ఆరోగ్యకరమైన వ్యాపకం లేకపోవడం ఓ ముఖ్య కారణమైతే…మెదడు మరీ తీవ్రంగా ఫలానా నిర్ణయాత్మకవిషయమై
చిక్కుకు పోయుండడం యింకో కారణమని తోస్తుంది.
అంటే….కొంతమంది టెన్షన్ ఎక్కువగా ఉండి యీ రోగాన్ని ఆశ్రయిస్తే మరికొందరుబొత్తిగా తోచక దీని బారిన పడతారనుకుందాం.
కారణ మేమైనా పర్యవసానాలు పరమాపాయాలు.తిని తేన్చేసాకా ,యోగాసనాలెన్నివేసినా నిరుపయోగాలే!చిరుతిళ్ళ డబ్బాల చిరునామాకై తిరిగే తిరుగుడూ,యీ ప్రయాసలో పడ్డ ఆయాసాలూ,చాచే చేతులూ ,వంగే నడుమూ…ఆడేనోరూ,నమిలే పళ్ళూ,సాగే నాలుక,కొట్టుకునే కొండనాలుక…చివరకు తింటున్నంత సేపూ అన్యమనస్కంగా బిజీగా ఉండే మెదడు…యివేవీ కసరత్తు లెక్కలోకి రావట…వంటపనీ,యింటిపనీ లాగానే!!
అందుకే …యిలా చేసి చూడండి.
తెల్లారుతూనే వండే వంటకాలతో పాటూ..విధిగా ఓరెండు క్యారెట్లను చక్రాల్లా తరిగి ఓపళ్ళెం నింపి టేబుల్ పైకి చేర్చండి.యిలాగే..కీరా చక్రాలుకూడా..పైగా సమ్మరే కనుక డబుల్ ధమాకా!
కాబూలీ శనగలు లేదా నల్లవి నానేసి ,ఉడకేసి నీళ్ళు వాడ్చేశాకా ఫ్రిడ్జ్ లో పడేసుకుంటే కాసిన్ని మరో పళ్ళెంలో తీసుకుని టేబుల్ పై పెట్టుకోండి.
sweet corns కూడా ఈ కోవకి చేర్చొచ్చు.
యిలాగే..మరో రోజు క్యాబేజీ తురుము,…
రెండే రెండు నిముషాలు వేడినీళ్ళలో ఉంచి తీసిన కాలీ పూలు,
పచ్చికొబ్బరి తురుము యింకో రోజు.
పెసలు మొలకలొచ్చాకా ఒక్కనిముషం అవెన్ లో పెట్టి తీస్తే రుచికరంగా తయారౌతాయి…యివి మరో రోజు..!
టొమాటో యెప్పుడువాడినా నాలుగు ముక్కలు పక్కన చిరుతిండికైపెట్టండి.
అవిశ గింజలు కాస్త కాస్తచొప్పున పొడి చేసి యీ తిండి మీద జల్లుకుంటే అదో ఘనకార్యం సాధించిన వారమౌతాం.
సి విటమిన్ మొర్రో అంటారు కనుక..చల్లపెట్టెలో నిలవ చేసుకున్న ఉసిరి తొక్కు ను సలాడ్ల మీద జల్లుకుంటే సరి..ప్రతీ వంటకంలోనూ చేర్చేయడం కూడా మంచలవాటే!
మారు ఆలోచించకుండా కొత్తిమిరను తాజాగాఉన్నపుడే అన్నింటా పచ్చగా
అలంకరించేయడం అలవాటు గా మారాలి.
యిదే రకంగా ఒక రోజంతా తాగే నీళ్ల లో ఓ నిమ్మడిప్ప పిండేసుకోవడంమరో మంచి అలవాటు.ఉప్పు,చక్కెర అంటూ రుచుల యావ వద్దుసుమండీ.
రాగి జావ కీ నిమ్మరసం చేర్చి జీరా పొడి కలిపి తాగేయండి..దాంతో పొట్టనిండి ఆకలి మీ జోలికి రాదు.
జీలకర్రను,ధనియాలను కాస్త వేయించి పొడిచేసిఅందుబాటులో పెట్టుకుని అన్నింటా అడ్డంగా జల్లుకుంటూ పోవడమూ మంచి మాటే.
జీడిపప్పు,బాదాముపప్పుని చిన్ని ముక్కలు చేసి దాచుకోవడం వలన మనచేతులకీ నోటికి కట్టడి యేర్పడి తక్కువ వెళ్తాయి తెలుసా..
యివికాక..పచ్చిఅటుకులు,మరమరాలూ ,సన్నగా ముక్కలు చేసుకున్న జీడిపప్పు,బాదాములబద్దలు కాసిన్ని హాల్ లో బల్ల మీదకి మార్చిమార్చి పెట్టుకుంటూ ఉంటే…బయటకొన్నమిక్స్చరూ,సమోసాలూ,రస్కులూ…దరిచేర్చే అవసరముండదు.
త్వరలోనే మనకర్థమౌతుంది..మనం తోచక తింటున్నామే తప్ప…రుచికరమైన నూనె సరుకే ఉండాలని మనమనసు కోరడంలేదూ ..అని.!
యీ ప్రత్యామ్నాయాలు యింతో అంతో శరీరానికి మేలే చేస్తాయి కనుక…బెంగలేదు.
అడ్డదిడ్డపు వేళల్లో బాగా ఆకలిగా ఉండి ,యేమీ చేసుకునే ఓపిక లేనపుడు అటుకులకి పాలూ,ఓచుక్క తేనె లేదా కిస్మిస్…కలుపు కు తినేయడం ఉత్తమోత్తమం.కార్న్ ఫ్లేక్సైనా యింతే.
యిలా చేస్తే ..తప్పనిసరైనపుడు బయటతిన్నా గిల్టీ ఫీలింగ్ ఉండదు.
ఏంటో..నాకు తోచినట్టు రాసేశాను.మీరూ మరి నాలాగే వేలికి,మెదడు కి పని చెప్పి టకటకలాడించి చూడండి..ప్రజాప్రయోజకులమౌతామేమో!!
యీ సందర్భంగా నాకో రెండు కొత్తపదాలు పరిచయమయ్యాయి.
నాన్స్టాప్ సర్వీసు లాగ తింటూ…పోవడాన్ని బు లీ మి యా అంటారనీ..డైటింగ్ పేరుతో..క్రమేపీ…
తిండంటేనే వెగటు ఏర్పరుచుకునే టీనేజ్ పిల్లలు…ఎనరెక్సియా నెర్వోసా రోగం బారిన పడి…బలవంతంగా కుక్కితే..కక్కుకునే దాకా వారికి తోచని గంభీర దుస్థితి వస్తుందనీ తెలిసింది.మొత్తానికి ‘‘అతిసర్వత్ర వర్జయేత్ ”అని పెద్దలు ఊరికే అనలేదు.
*****