వెనుతిరగని వెన్నెల(భాగం-17)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-17)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన సంవత్సరం లోనే అబ్బాయి పుడతాడు.

***

బాబుకి రెండు నెలలు నిండి మూడో నెల వచ్చిన మొదటి వారంలో నామకరణోత్సవం శేఖర్ వాళ్లింట్లో జరపడానికి నిర్ణయించారు

ఉదయానే ఫోను మోగింది

అమ్మగారింట్లో ఇన్నాళ్లూ తిష్ట వేసింది చాలు, బయలుదేరుఅన్నాడు శేఖర్.

అతని వ్యంగ్యాలకు నవ్వే ఓపిక లేదు తన్మయి దగ్గర.

ఇన్ని రోజులు నన్ను నా కొడుకుని చూడనీకుండా అమ్మగారింట్లో మకాం వేసేవు. వచ్చే వారంలో బాబుకి పేరు పెట్టగానే నాల్రోజుల్లో వైజాగు వెళ్లిపోదాం. ఇన్నాళ్లూ చిప్పకూడు తినలేక ఛస్తన్నాను. అన్నీ సర్దుకుని రా.” అన్నాడు

చాలా బావుందమ్మా మీ సంగతి. మా మనవణ్ణి చూసుకోవాలని మాకు మాత్రం ఉండదా? బాలింతవి. ఇంకా తేరుకోనేలేదు. ఊళ్లో అంతా నవ్విపోతారు. అయిదో నెలలో పంపుతాంలే. పేరేదో పెట్టుకున్నాక మీ ఆయన్ని ఇక్కడ దించి వెళ్లమని చెప్పు.” అంది జ్యోతి విసుగ్గా.

ప్రశ్నకు సమాధానం అత్తవారి నించి, శేఖర్ నించి ఎలా వస్తుందో తెలిసే తల్లి ఎందుకిలా అంటుందో అర్థం కాలేదు తన్మయికి.

తన్మయి మౌనం చూసిసర్లే, నీకు లేని బాధ నాకెందుకు?” అంది మళ్లీ.

సాయంత్రం బాబునెత్తుకుని మేడ మీదికి వచ్చింది తన్మయి. ప్రశాంతంగా గాలి వీస్తూచిరు చల్లగా ఆహ్లాదంగా ఉంది

తనకు అప్పుడప్పుడే పరిచయమవుతున్న కొత్త ప్రపంచాన్ని తనివి తీరా చూడాలన్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూడసాగేడు బాబు

అది చూసి మురిపెంగా ముద్దాడుతూ, ఆకాశంలో మారుతున్న అందమైన నారింజ రంగుల్ని చూపిస్తూ  “అదుగో నాన్నా, మా అమ్మమ్మ చెప్పేది, పేదరాశి పెద్దమ్మ ఆకాశంలో పసుపు, కుంకం ఆరబోసిందట….” అంటూ కబుర్లు చెప్పసాగింది.

రేపటి మీద దిగులు లేకుండా బతకడం మొదట నేర్చుకోవాలి మనంఅంది మధ్యలో గాఢంగా ఊపిరి పీల్చి.

తన్మయికి తన జీవితం తన చేతుల్లో లేదన్న విషయం ఎందుకో నచ్చడం లేదు. కానీ తప్పడం లేదు

దేనికీ తక్షణ పరిష్కారాలు కనుచూపు మేరలో లేవు. అసలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. అయినా మన కలలు సాకారమయ్యే ఒక రోజు వస్తుంది నాన్నా! నువ్వు జీవితంలో రెండు వదలకూడదు. ఒకటి అమ్మని, రెండు మంచి జీవితమ్మీద ఆశని. మొదటిది నువ్వు చెయ్యి, రెండోది నేను సంపాదించి పెడతాను.” అంది ఒళ్ళో మోకాళ్ళ మీద ఎదురుగా పడుకోబెట్టుకున్న బాబు కళ్ళ ల్లోకి చూస్తూ

తన మాటలు అర్థమయినట్లే బాబు ముఖంలో చిన్న చిర్నవ్వు కనిపించింది. నవ్వు తన్మయి కళ్ళల్లోంచి గుండెల్లోకి పాకి మురిపెంగా మారింది

బాబు చేతులని గట్టిగా పట్టుకుని, ముసురుతున్న ఆలోచనలతో కాస్సేపు ఆకాశం కేసి చూస్తూ మౌనంగా ఉండి పోయింది

చిన్నతనం నించీ అమ్మా, నాన్నా తనకేం కావాలో సమకూర్చి పెట్టారు. తను ఎప్పటికీ వాళ్లకి  చిన్నపిల్లే. తనకి ఒక వ్యక్తిత్వం ఉందనే విషయం వాళ్లకి చెప్పినా అర్థం కాదుతన వ్యక్తిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం కాకపోయినా, శేఖర్ తో ప్రేమైక జీవనాన్ని కోరుకుని మొదటి సారి తల్లిదండ్రుల మాట వినకుండా తన మాట నెగ్గించుకుంది

పెళ్లయ్యాక శేఖర్, అతని తల్లిదండ్రుల సంరక్షణలోకి మారింది. ఇక్కడ అసలు తనకు ఒక వ్యక్తిత్వం ఉంటుందనే ఆలోచన కూడా ఎవరికీ లేదు. తన పరిస్థితి మరింత దిగజారింది కానీ ఏం బాగుపడలేదు.

ఎన్నాళ్లిలా గడపాలో తనకే తెలీదు. ఒక పక్క చదువు ఎలా కొనసాగుతుందో కూడా తెలీని అగమ్యగోచర పరిస్థితి.

శేఖర్ ని ఎలా ఒప్పించాలో అర్థంకాని పరిస్థితి ఒక వైపు, యూనివర్శిటీ లో సీటు వస్తే బాబుతో చదువు ఎలానో అని దిగులు మరో వైపు.

మనసంతా అల్లకల్లోలంగా ఉంది తన్మయికి

పెళ్లి కానంత వరకూతన జీవితం ఎంత హాయైన జీవితమోఅని ఇప్పుడు అనిపించసాగింది

చంద్ర బింబం లాంటి బాబు ముఖం చూసినప్పుడల్లా జీవితమ్మీద గొప్ప ధైర్యం, ఆసక్తి కలగసాగేయి.

కానీ  గడిచిపోయిన విషయాలలో ఆలోచనల భారం తప్ప ఏం ఉంది? ఇవేళ్టి దిగులు రేపు ఉండదులే. మన జీవితంలో సంతోషకరమైన రోజులు వస్తాయి.” అని బాబుకి చెప్పి, తనకు తను ధైర్యం చెప్పుకుంది.

***

మర్నాడు నామకరణోత్సవమనగా పసివాడినెత్తుకుని అత్తవారింట్లో అడుగు పెట్టింది తన్మయి.

అరటి గెల, బిందెలతో సారె తీసుకుని జ్యోతీ, భానుమూర్తి కూతుర్ని దిగబెట్టడానికి వచ్చారు

దేవి మనవడికి, కోడలికి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది. శేఖర్ రాత్రి రైలుకి వచ్చేడు.

భోజనాలయ్యేక శేఖర్ తండ్రి  “..బావగారూ, పిల్లవాడు కలిగేడు. సంసారం పెరిగింది. ఖర్చులూ పెరుగుతాయి కదా! ఏం ఆలోచించేరు?” అన్నాడు.

అనుకోని సంభాషణకి గతుక్కుమన్న భానుమూర్తి గొంతు పెగుల్చుకునేలోగా  “ఆలోచించేది ఏం ఉంది? ఒక్కగానొక్క కూతురు కదా, అంతకంటే ఎక్కువ ఏం ఉన్నాయి మీకు? కాలవ కింది భూమేదో మీ అమ్మాయి పేర్న రాస్తే వాళ్లకీ కాస్త ఆదరువుగా ఉంటుంది. ఏం అంటారు అన్నయ్య గారూ?” అంది దేవి.

జ్యోతి మొదట్నించీ అనుమానపడ్తూనే ఉంది. “సీమంతం చెయ్యడానికి ఆనవాయితీ లేదని చెప్పిన వాళ్లునామకరణం అని హడావిడి ఎందుకు చేస్తున్నారా?” అని. ఇదన్నమాట సంగతి. వాళ్ల అబ్బాయి తమ ఇంటికి రాడు కాబట్టి, వంకతో ఇవన్నీ మాట్లాడడానికి తమని ఇక్కడికి పిలిపించారన్న మాట.” 

జ్యోతి అడ్డురాబోయే లోగా భానుమూర్తి సర్దుకుని, “చూడమ్మా, మీరన్నది నిజమే, మా ఆస్తి పాస్తులన్నిటీకీ వారసురాలు మా అమ్మాయే. అయితే ఇప్పటికిప్పుడు భూమి రాసిస్తే మా గతేంకానుమాకున్న ఆధారమే భూమి. సంవత్సరం వరదల వల్ల పంట నష్టంతో నానా కష్టాలూ పడతన్నాం. మా తదనంతరం అమ్మాయికే చెందేటట్లు రాస్తాం కదాఅన్నాడు.

పల్లెటూళ్లో మీ ఇద్దరి పొట్టలు గడవడం పెద్ద కష్టమా చెప్పండి మహా నగరంలో పిల్లలు నానా కష్టాలూ పడతన్నారు. అబ్బాయికి ఎంత కష్టపడినా వచ్చేది ఇంటద్దెకే సరిపోవడం లేదుమేమే బియ్యమూ, ఉప్పులూ, పప్పులూ సర్దుతున్నాం.” అంది దేవి.

సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో అని భయంతో తన్మయికి కాళ్లు ఒణకసాగేయి. గుండె దడ హెచ్చి, ముఖం నిండా చెమటలు పట్టేయి.

తల్లిదండ్రులు తన తరఫున మాట్లాడుతున్న ధీమాతో శేఖర్ నిశ్శబ్దంగా వింటున్నాడిదంతా. తన్మయినేమీ మాట్లాడొద్దన్నట్టు సైగ చేసేడు పైగా

మాకు చేతనైన సహాయం మేమూ చేస్తాం. పిల్లలు కష్టాలు పడ్తుంటే చూస్తూ ఊరుకోం కదాఅన్నాడు భానుమూర్తి.

పొలం కుదరక పోతే ఇంటిలో భాగం రాసియ్యండిఅంది దేవి.

కోపం నషాళానికంటుతున్నట్లున్న తల్లి ముఖం వైపు చూసింది తన్మయి.

వాళ్లనేమీ అనలేక తన్మయి వైపు ఈసడింపుగా చూసింది జ్యోతి.

మమ్మల్ని కాస్త ఆలోచించుకోనివ్వండి.” అని లేచాడు భానుమూర్తి.

పిన్ని వాళ్ళింటికెళ్లి పొద్దున్న వస్తామమ్మాఅన్నాడు తన్మయితో.

తల్లిదండ్రుల్ని ఇక అక్కడ ఉండమనే సాహసం చెయ్యలేకపోయింది తన్మయి. సమయంలో వాళ్లు వెళ్లడమే మంచిదనిపించి, తలూపింది.

ముదనష్టపు సంబంధం చేసుకున్నాం. ఏం చేస్తాం. మన ఖర్మ.” నెత్తి కొట్టుకుంది దేవి వాళ్లలా వెళ్లగానే.

ఒళ్లో ముద్దులొలికే చంటి పిల్లాణ్ణి పెట్టుకుని, మాటలేవిటో అర్థం కావడం లేదు తన్మయికి. అసలక్కడ పసిపిల్లాడు ఒకడున్నాడు, వాడితో ముద్దుగా ఆడదామని ఎవరికీ లేదు

శేఖర్ చేతుల్లోంచి బాబుని తీసుకుని లోపలికి వెళ్లిపోయింది తన్మయి

పాలుపడుతూచూసేవా నాన్నా, మన చుట్టూ ప్రపంచం. డబ్బు చుట్టూ ఎలా తిరుగుతూందో. ఇన్నాళ్ళ తర్వాత నిన్ను చూసేరు. నిన్ను ఎత్తుకుని, హత్తుకుని, నీ పాల బుగ్గలని తడిమే ఆలోచన కూడా లేదెవ్వరికీఅమ్మ చదువుకుని, మన కాళ్ల మీద మనం నిలబడే వరకూ మనకీ కష్టాలు తప్పవు. నాతో బాటూ నీకూ ఇలాంటి సంభాషణలు వినక తప్పడం లేదు. క్షమించు కన్నా!” అంది.

ప్రపంచమూ ఎరగని చిన్నారి పాలు తాగడం ఆపిఒక్క క్షణం తల్లి ముఖంలో ఆతృత కనిపెట్టినట్లు కళ్లలోకి చూసి చిర్నవ్వు నవ్వేడు.

అపురూపమైన అందమైన క్షణానికి పరవశించి పోయింది తన్మయి

కష్టం వచ్చినా భగవంతుణ్ణి తల్చుకోమ్మా, అన్ని కష్టాలూ తీరిపోతాయి.” అన్న అమ్మమ్మ మాటలు జ్ఞాపకం వచ్చాయి తన్మయికి.

కళ్లు మూసుకుని అజ్ఞాత మిత్రుణ్ణి తల్చుకుంది. “మిత్రమా! నువ్వే నా భగవంతుడివి. ఎన్నో దు:ఖాశ్రువుల్ని తుడిచేవు. బాధనూ నా మనస్సులోంచి తుడిచెయ్యవా? నాకో దారి చూపించవా?” అని మనసారా వేడుకుంది.

తన బుగ్గల పైని కన్నీటిని బాబు అప్రయత్నంగా తగిల్చిన  చిన్న చేతితో తడిమినట్లయ్యింది తన్మయికి.

చేతినలాగే పట్టుకుని కళ్లకద్దుకుంది. వేదనలన్నీ తీర్చే గొప్ప సాంత్వన నిండిన పసి వేళ్లవి. అరనిమిషంలో బాబుతో బాటూ నిద్రలోకి జారుకుంది.

గదిలోకి వస్తూనే శేఖర్ అరచిన అరుపుకి తుళ్ళిపడి లేచింది.

మేమక్కడ నెత్తులు బాదుకుని ఏడుస్తూంటే, నువ్విక్కడ దున్నపోతులా నిద్రపోతన్నావా? నీకు నిద్రెలా పడతందే? అవున్లే, మొగుడెలా పోతే నీకెందుకు? అల్లుడెలా ఛస్తే వాళ్లకెందుకుమీ అమ్మా, బాబూ ఎలా తప్పించుకున్నారో, నువ్వూ అంతే. రక్తం పంచుకుని పుట్టినదానివి కదాఇదుగో. ఇప్పుడే చెప్తున్నాను. నువ్విక వాళ్ల గుమ్మం తొక్కడానికి వీల్లేదు.” అన్నాడు నిప్పులు కురుస్తూన్న గొంతుతో.

గోడ వైపు తిరిగి దు:ఖంతో కుమిలి పోతూన్న తన్మయిని, పక్కన ప్రశాంతంగా నిద్రపోతున్న పసివాడిని పట్టించుకోకుండా, విసురుగా పెద్ద శబ్దంతో తలుపేసి బయటికెళ్లిపోయేడు.

మర్నాడు ఉదయానే నామకరణోత్సవానికి వాళ్ల చుట్టాలంతా వచ్చేరు. ఉపవాసంతో హోమం ముందు కూచోబెట్టేరు. పిల్లవాడు పుట్టే సమయానికి తండ్రి దగ్గర లేనందున తండ్రికి కీడు తగులుతుందని పంతులుగారు చెప్పేరట. శాంతి హోమం చేయించిన తర్వాత పేరు పెట్టడానికి సిద్ధమయ్యేరు పంతులు గారు

శేఖర్ఆంజనేయ స్వామిపేరు తప్పనిసరిగా కలవాలని చెప్పేడు.

దేవివెంకన్న బాబుకి అమ్మాయి తల్లి మొక్కుకుందండీ. పైగా మా కుల దైవం కూడానుఅంది.

తన్మయి ఎవరి ముఖ కవళికలూ పట్టించుకోకుండామృదుల్అని చేర్చమని ధీమాగా చెప్పింది.

వేళ్ల మీద ఏవో లెక్క వేసి, చివరికి పంతులు గారు  “అమ్మా! అబ్బాయి పేరువెంకట ఆంజనేయ మృదుల్“.  అబ్బాయి జాతకరీత్యా పేరులో మొదటి అక్షరంతో ప్రారంభం కావడం చక్కగా కుదిరింది. కానీ సంఖ్యాశాస్త్రం ప్రకారం మరో రెండక్షరాలు పెంచాలి. ఇంకెవరికైనా ఏవైనా మొక్కులుంటే చెప్పండి”  అన్నాడు

ఆలస్యంగా వచ్చిన జ్యోతి, భానుమూర్తి తమ మొక్కు కలిసినందుకు సంతోషించేరు

ఎవరోసాయిఅని అందించేరు.

వెంకటాంజనేయ సాయి మృదుల్అని ఖరారు చేసేరు. ముందంతా ఏం పేర్లు ఉన్నాతననుకున్న పేరు చివర కనబడినందుకుహమ్మయ్యఅని ఊపిరి పీల్చుకుంది తన్మయి.

***

రెండో వారంలో విశాఖ పట్నానికి చేరేరు

మా బాసు వాళ్లింట్లో అవుట్ హౌసు ఖాళీగా ఉందన్నారు. అద్దె తక్కువ కూడా. సామాన్లన్నీ మార్చేసేను.” అన్నాడు శేఖర్.

కొత్త ఇంటికి  ఆటో సందు మలుపు తిరగంగానే ఆశ్చర్యపోయింది తన్మయి. తన కళ్లని తనే నమ్మలేకపోయింది ఎదురుగా యూనివర్శిటీ గేటు చూసి.

యూనివర్శీటి నించి రెండు సందుల మలుపుల్లో ఉన్న పెద్ద బంగళాలో గేటుకి దగ్గర్లో ఉన్న చిన్న రెండు గదుల అవుట్ హౌసది.

పెద్ద ఇంటి ముందు కాలిబాట కిరుపక్కలా చక్కని పూలతోట. ప్రత్యేకించి అవుట్ హౌసునానుకుని ఉన్న నైట్ క్వీన్ తీగెల్ని చూసి మనస్సు గాలిలో తేలిపోయింది తన్మయికి.

చిన్న గదులైనా చక్కగా పరిశుభ్రంగా ఉంది ఇల్లు. తను ఎన్నాళ్లుగానో కలలు గన్న ఇల్లు

చీకట్లో ఆకాశం కేసి చూసిధన్యవాదాలు అజ్ఞాత మిత్రమా!” అని లోపల్లోపల అనుకుంది.

తన్మయి ముఖంలో అద్వితీయమైన ఆనందం చూసియూనివర్శిటీయో అని నా బుర్ర తింటున్నావుగా. నచ్చిందా ఇల్లు? నీకు యూనివర్శిటీ నించి ఉత్తరం వచ్చింది. మా తాతగారికి చూపించేను. నీకు సీటు రావడం ఖాయమన్నారు. చదివితే ఉద్యోగాలొస్తాయంటగామీ వాళ్లెలాగూ మనకేమీ పెట్టి పోసేటట్టు లేరు. నువ్వైనా బుద్ధిగా చదివి, క్లర్కుగానో ఉజ్జోగం సంపాయించు. పసివాడినెత్తుకుని చదువు, సామని పరుగెత్తకు. కావాలంటే పక్క వీథిలోనే ఉన్న  మా పిన్ని వాళ్లింట్లో చంటోడిని దించు. మా పిన్ని మనవడి కోసం పరితపించి పోతూంది.”  అన్నాడు శేఖర్

మాత్రానికే మహదానంద పడి దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకుంది శేఖర్ ని.

దు:ఖంతో గొంతు పూడుకుపోయింది. అనుకోని వరాలన్నీ ఒక్క సారే కురిసిన ఆనంద క్షణానికి ఉక్కిరిబిక్కిరయిపోయింది

థాంక్యూథాంక్యూఅంది.

ఇంత కాలానికి నా విలువ తెలిసొచ్చిందన్నమాట, ఇదిగో అవకాశం ఇచ్చాను కదా అని మొగుణ్ణి వెధవని చెయ్యడానికి చూడకు… ” అంటున్న  శేఖర్ మాటలు వినిపించుకోకుండా 

గబ గబా యూనివర్శిటీ ఉత్తరాన్ని విప్పి చూసింది.

3 ర్యాంకు చూసి సంతోషంగా గుండెలకి హత్తుకుంది. “యాభైలోపు ర్యాంకు వస్తే యూనివర్శీటీలో సీటు ఖాయంఎంట్రెన్సు పరీక్ష రాసి వస్తుండగా తన పక్కనే మెట్లు దిగుతూ ఎవరో అనుకున్న మాటలు చెవిలో గింగిరాలు తిరిగాయి,

వచ్చే వారంలో కౌన్సిలింగుకి వెళ్లి అఫీషియల్ గా అడ్మిషను తీసుకోవాలి. మరో రెండు నెలల్లో క్లాసులు ప్రారంభమవుతాయి

ఫీజులకి డబ్బులు మీ అమ్మనడుగుతావో, నాన్ననడుగుతావో నాకు తెలియదు.” అన్నాడు శేఖర్.

తన్మయి తన చేతి బంగారు గాజుల జత వైపు చూసుకుంది. “ఎవ్వరూ కట్టనక్కర లేదు. ఇవి అమ్మేసైనా చదూకుంటాను.” అని దృఢంగా నిర్ణయించుకుంది.

***

ముందు గదిలో బాబుకి చీర ఉయ్యాల కట్టింది. పొద్దున్నే వేడి వేడి నీళ్లు స్నానం చేయించి, పాలు పట్టి ఉయ్యాలలో వేస్తే చక్కగా నిద్రపోయాడు బాబు.

బాబు లేచే లోగా ఎంత చక చకా సామాన్లు సర్దుకున్నా ఇంకా పని మిగిలిపోతూనే ఉంది తన్మయికి.

శేఖర్ సాయంత్రం ఇంటి పట్టునే ఉండడం వల్ల ఇల్లు సర్దుకోవడానికి మరింత సమయం దొరుకుతూంది.

పెద్దింటికి, అవుటు హౌసుకి వాకిలి తుడిచి ముగ్గు పెట్టాల్సిన బాధ్యత తనది. పెద్ద వాకిలి రోజూ సాయంత్రం వొంగి ఊడవడం, కళ్లాపి జల్లి, ముగ్గేయడం కష్టమైన పనైనా

తనకి నచ్చిన పని కావడం వల్ల సంతోషంగా చేస్తూంది తన్మయి. పైగా ముగ్గులెయ్యడం లో సిద్ధ హస్తురాలు కదా.

ఇంటి వాళ్లు షిరిడీ వెళ్లేరు

వాళ్లు మరో వారానికి గాని రారు. ఎందుకంత కష్ట పడి రోజూ ఊడవడంవాళ్లొచ్చేక ఎలాగూ తప్పదు.” అన్నాడు శేఖర్.

ఎవరో ఉన్నపుడొకలాగ, లేనపుడొకలాగ పని చెయ్యడం తన్మయి స్వభావానికి విరుద్ధం.

శేఖర్ కి సమాధానం చెప్పకుండా చిర్నవ్వు నవ్వింది.

తను వేసిన చక్కని ముగ్గుని తనే తేరిపార చూసుకుంది. “మొక్కలన్నిటికీ పాదులు తీయాలి. ముందు ఇంటి పని తెమిలేక, రోజూ కొంత పని చక్కబెట్టాలి.” అంది.

మనకి  ఇల్లు చవకగా అద్దెకిచ్చినందుకు వాకిలి తుడిచి ముగ్గెయ్యమని మాత్రమే చెప్పింది ఇంటావిడ. రాసుకునీ, పూసుకునీ పన్లన్నీ చెయ్యకు. ఎంత చేసినా ఎదవలకి విశ్వాసం లేదు. సంవత్సరం బట్టీ  తెలిసున్న మనిషినైనా కనీసం కాఫీ కూడా ఇప్పించడు మా బాసు.” అన్నాడు శేఖర్.

***

అడ్మిషను రోజు రానే వచ్చింది. శేఖర్ని తీసుకు వెళ్ళమని అడగింది

రేపట్నించి మీ బాబొచ్చి తీసుకెళ్తాడా? నువ్వే పాట్లేవో పడు.” అని విసురుగా అని బైకు స్టార్టు చేసుకుని వెళ్లిపోయేడు. చిన్న విషయాలకి ఎందుకు ఇంత చికాకు పడతాడో అస్సలు అర్థం కాదు తన్మయికి

ఇప్పుడెళ్లి మళ్లీ పెద్ద పండగకి వస్తారో, లేదోబట్టలు కొనుక్కొండిఅని తల్లి తన చేతిలో పెట్టిన వెయ్యి రూపాయల్ని పెట్టెలోంచి తీసి పర్సులో పెట్టుకుంది.

బాబుని తీసుకుని శేఖర్ పిన్ని గారింట్లో ఉయ్యాలలో  పడుకోబెట్టి, పరుగులాంటి నడకతో యూనివర్శీటి వైపు నడిచింది తన్మయి.

గేటు దాటి లోపలికి వెళ్తూంటే మొదటి పాదం మోపుతున్న చోటే, ప్రపంచాన్ని జయించిన గొప్ప భావన. ఒక అద్వితీయమైన ఆనందం

పైకి తలెత్తి విశ్వ విద్యాలయం ద్వారతోరణం  వైపు చూసింది. “ఆంధ్ర విశ్వ విద్యాలయంతనని పూల వానతో ఆహ్వానిస్తున్న భ్రాంతికి లోనయ్యి పులకించి పోయింది

మిత్రమా! నేను జీవితాన్ని జయిస్తానుఅంది పైకి.  

వనజకీ విషయం చెప్పాలి. ఎంత సంతోషిస్తుందో. అన్నట్లు లక్ష్మికి కూడా చెప్పాలి. వీలైతే ఒకసారి వెళ్లి రావాలి. అని తలుచుకుంది.

 ఒక తెలీని ఆదుర్దాకి లోనయ్యింది. కాళ్లు నొప్పులు పుట్టసాగేయి

తనకు నచ్చిన బెంగాల్ కాటన్ చీర కొంగు భుజం చుట్టూ తిప్పుకుని నడిచివందలాది మంది ఉన్న అడ్మిషను హాలుకి చేరింది

మైకులో తన పేరు వినిపించగానే తడబడే అడుగుల్తో లేచింది

చేతికి అడ్మిషను పేపర్లు ఇస్తూయూనివర్శిటీలో తొలి అయిదు ర్యాంకుల్లో వచ్చిన వారిని తప్పక  గుర్తు పెట్టుకోవాలి మాస్టారూఅని పక్కన ఉన్న మరో ప్రొఫెసర్తో చెప్తూకంగ్రాట్స్ అండ్ వెల్ కమ్అంటున్న వ్యక్తి వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసి నమస్కరించింది

అమ్మా, ఈయన మీ డిపార్టుమెంటు డీన్. ఆయనే నిన్ను గుర్తు పెట్టుకున్నారు. నీ అదృష్టం పండింది”  అన్నాడు పక్కన ఉన్న మరో డిపార్ట్మెంటు డీన్.

తన వెనకే నాలుగో  ర్యాంకు తీసుకున్న వ్యక్తి  వెనక్కి వస్తూమొదటి స్టెప్పులోనే డీన్ మిమ్మల్ని మెచ్చుకున్నారు. ఎంత అదృష్టమండీఅన్నాడు.

పరిచయంగా మాట్లాడుతున్న అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న తన్మయి వైపు చూస్తూభలే వారండీ, మర్చిపోయేరా? యూనివర్శిటీ అప్లికేషను ఇవ్వడానికి వచ్చినపుడు మీకు దారి చెప్పీంది నేనేఅన్నాడు.

తనకు బొత్తిగా గుర్తులేని అతను, తనని అంతగా గుర్తు పెట్టుకోవడం ఆశ్చర్యం వేసింది తన్మయికి.

అదే అడిగింది

ఇన్ని వందల మందిలో మీరొక్కరే అప్పడూ, ఇప్పుడూ భుజం చుట్టూ కొంగు తిప్పుకుని నడుస్తున్నది. ఇన్ఫాక్ట్ అడ్మయిర్ ఇట్అన్నాడు స్నేహ పూర్వకంగా.

అప్పుడు మీరు భారంతో ఉన్నట్లు గుర్తు. అబ్బాయా? అమ్మాయా?” అన్నాడు మళ్లీ.

అబ్బాయి, మృదుల్అంది

చాలా మంచి పేరు. అన్నట్లు నా పేరు కరుణ. కరుణశ్రీ అంటే ఉన్న అభిమానంతో నా కలం పేరు అలా పెట్టుకున్నాను.” అన్నాడు

మీ అబ్బాయి పేరు చాలా బావుంది. నాలా కలం పేరు పెట్టుకోనవసరం లేదుఅన్నాడు నవ్వుతూ.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.