అనువాద రాగమంజరి

-వారణాసి నాగలక్ష్మి

(నెచ్చెలి తొలిసంచిక నుండి ధారావాహికరచనలు చేస్తూ ఇటీవల స్వర్గస్తులైన శ్రీమతి శాంతసుందరి గారికి నెచ్చెలి కన్నీటి నివాళులతో ఈవ్యాసాన్ని అందజేస్తోంది-)

శాంత గంభీరమైన ఆమె అంతరంగంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలు సహజీవనం చేస్తూంటాయి. అడుగు పెట్టగానే ఆ ఇంట్లోని సాహితీ పరిమళాలు మనని చుట్టేస్తాయి. సాహిత్యమే శ్వాసగా జీవించే శాంత సుందరి, రామవరపు సత్య గణేశ్వరరావు గార్ల అపురూప దాంపత్యం తెలుగు పొదరింటికి ఎన్నో గొప్ప ‘గ్రంథరాజా’లను తెచ్చిపెట్టింది, హిందీ సాహితీ వాటికకు మరెన్నో తెలుగు సురభిళ సాహితీ సుమాలను తీసుకువెళ్లింది. 

ఎంతటి లలిత కోమల కవితా సుమమైనా, ఎంతటి బృహద్గ్రంథమైనా చకచకా అనువాదం సాగించడం ఆమె పని. అవి చదివి తనకు తోచిన సవరణలను సూచించి, ఆ కాగితాలను డీటీపీ చేయించి, పబ్లిషర్స్ కి అందించడం రావుగారి పని. ఆంగ్లభాషలో అధ్యాపకులుగా దాదాపు నలభై సంవత్సరాలు పనిచేసిన గణేశ్వరరావుగారి సాహచర్యం, అనువాద సాహిత్య సృజనలో శాంతసుందరి గారి ప్రతిభకు వన్నెలద్దింది.

ఆ కళ్ళనిండా అక్షర వర్షాలు కురిసి చినుకులను బాష్పాలుగా మార్చే రసవాదం. ఒకేసారి రెండు భాషల్లో స్పందించే బహుజనీన రాగం. ఆ కళ్ళకు కీర్తి కన్నా ఆర్తి ప్రధానం అంటారొక కవితలో ప్రముఖ కవి శ్రీ ఎన్. గోపీ గారు. నిఘంటువులు చేతులెత్తేసిన పరిస్థితుల్లో కూడా తన అన్వేషణ కొనసాగించి, మాటలను మాణిక్యాలుగా మార్చే రసవీణగా ఆమెను అభివర్ణిస్తారాయన. తాను రచించిన ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ అనే కవితా సంపుటిని ‘సమయ్ కో సోనే నహీ దూంగా’ పేర హిందీలోకి అనువదించిన శాంతసుందరి గారి కళ్లకి కాటరాక్ట్ సర్జరీ అయినపుడు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ గోపీ గారు అందించిన కవితా పుష్పం

అక్షరాలదారుల వెంట 

పరుగెత్తీ పరుగెత్తీ 

అలిసిపోయిన కళ్ళు అంటూ  మొదలై 

రండి! అలిసిపోయిన ఆ కళ్ళను 

ఒక్కసారి కళ్ళ కద్దుకుందాం‘ 

అనడంతో ముగుస్తుంది. ‘మూల రచయిత తన భావపరంపరని కాగితం మీద పెడితే సరిపోతుందిగానీ అనువాదకులకు రెండుభాషలలోనూ ఒకేసారి స్పందిస్తూ, రెండు భాషల అక్షరాల వెంటా పరుగెత్తాల్సిన అవసరం ఉంటుం’దన్న సున్నితమైన పరిశీలన ఈ కవితలో కనిపిస్తుంది.

ప్రఖ్యాత రచయిత కీ.శే. శ్రీ కొడవటిగంటి కుటుంబరావు, శ్రీమతి వరూధిని దంపతులకి ప్రథమ సంతానంగా జన్మించిన శాంత సుందరి గారి ప్రాధమిక విద్య మద్రాసు లోని అడయార్ థియొసాఫికల్ సొసైటీ వారి బాల భారతి పాఠశాలలో జరిగింది. అక్కడి గురుకుల వాతావరణంలో చదువు పరుగు పందెంలా కాకుండా, జ్ఞానార్జన పట్ల అనురక్తీ, ఆసక్తీ కలిగేలా ఉండేది. ఒక్కొక్క విద్యార్ధీ వ్యక్తిగతంగా ఎలా ఎదుగుతున్నారని చూసేవారే గాని మార్కులూ, ర్యాంకులూ  ఉండేవి కావు. జవాబులు తప్పయితే వాటిని సరిదిద్దడమే గాని వివక్ష చూపేవారు కాదు. చిన్నారి శాంత సుందరిడవ తరగతి దాకా క్కడ చదివి, ఆ పాఠశాలని ఫండ్స్ దొరకని స్థితిలో మూసేయడంతో రామకృష్ణ మిషన్ వారు నడుపుతున్న శారదా విద్యాలయంలో చేరారు.

నిరంతరం సాహితీ సృజనలో తలమునకలుగా ఉన్నా పిల్లలతో గడిపే కొద్ది సమయంలోనే రకరకాల విషయాలలో ఆసక్తిని కలిగించే విధంగా కబుర్లు చెప్పేవారు తండ్రి కొడవటిగంటి కుటుంబరావు గారు. సాహితీ వ్యాసంగంతో తీరికలేని వ్యక్తే అయినా సమకాలీన సమాజ చిత్రం ఎపుడూ ఆయన దృష్టి పథంలోనే ఉండేది. అది శాంత సుందరి గారి మీద కూడా  ప్రభావం చూపి ఉండాలి. ఆయన వృత్తీ, ప్రవృత్తీ సాహిత్యమే అయినా సైన్సు, చరిత్ర లాంటి విషయాలలో కూడా పిల్లలకి ఆసక్తి ఏర్పడేలా ఉండేది ఆయన పెంపకం.

శాంత సుందరి గారి బాల్యమంతా చాలా హాయిగా గడిచిపోయింది. తండ్రి వైపు తాతా నాయనమ్మలు చిన్నప్పుడే పోవడం వల్ల శాంత గారికి తెలిసింది అమ్మమ్మా, తాతలే. వారి మొదటి మనవరాలుగా శాంత గారు ముద్దుమురిపాల మధ్య పెరిగారు. మేనమామ కొమ్మూరి సాంబశివరావు, ఇద్దరు పిన్నమ్మలూ కూడా ఆమెను గారాబం చేసి పాడుచేస్తున్నారని కుటుంబరావు గారు కోపగించుకునేవారు. మగపిల్లలైనా, ఆడపిల్లలైనా అన్ని ఒడిదుడుకులనీ తట్టుకుంటూ, ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ జీవించాలని భావించిన ఆయన దానికి తగినట్టే పిల్లల్ని పెంచారు. 

ఎవరిజోలికీ వెళ్లకుండా, నిరంతరం పుస్తకాలు చదువుకుంటూ గడిపేవారామె తల్లిదండ్రులు. వంటనేది ఆడవారిపనిగా భావించని కుటుంబరావుగారు తన వ్యాసంగంతో అలసినపుడల్లా వంటింట్లోకి వెళ్లి రకరకాల వంటలు చేసేవారు. ఏ విధమైన వివక్షా చూపని వారి స్వభావమే శాంత గారి మీద ప్రభావం చూపించిందనుకోవచ్చు.

చదువూ, సంగీతం, ఆటలూ.. ఇదే జీవితంగా గడిపిన శాంత గారి వివాహం పెద్దవాళ్ళు కుదిర్చినదే అయినా ఆదర్శంగా జరిగింది. శాంత గారి పిన్ని ఉషారాణీభాటియా కూడా ఢిల్లీలోనే ఉద్యోగం చేసేవారు. ఆమె కొలీగ్ ద్వారా ఢిల్లీ లో ఉద్యోగం చేస్తున్నగణేశ్వరరావుగారి విషయం వరూధిని గారికి తెలిసింది. 

గణేశ్వరరావుగారి తరపున పెద్దలెవరూ లేరని తెలిసి వారిని తమ ఇంట్లో కొద్ది రోజులు ఉండమని పిలిచారు కుటుంబరావుగారు. అలా ఒక దూరపు బంధువులాగా కుటుంబరావుగారింట్లో ఉండి, గణేశ్వరరావు గారు శాంత గారిని గమనించారు. ఈ విషయం తెలియక, పెద్దల గారాబంతో స్వేచ్ఛగా పెరిగిన రెండు జడల అల్లరిపిల్ల శాంతగారు, తమ్ముడితో పొట్లాడుతూ తన సహజ స్వభావంతో ఇంట్లో తిరుగుతూ ఉంటే గణేశ్వరరావుగారు చూసి ఆమెని ఇష్టపడడం జరిగింది. 1945 లోనే రిజిస్టర్ మారేజీ ద్వారా దంపతులైన శాంతసుందరి గారి తల్లిదండ్రులు తమ కుమార్తె వివాహమూ అలాగే జరిపించారు. 

పెళ్లైన మరునాడు చిట్టిబాబు గారి వీణకచేరీతో రిసెప్షన్ జరిగింది. చాలాకాలం పాటు వీణనభ్యసించిన శాంతసుందరి గారికి సంగీతంలోనూ చక్కని ప్రవేశం ఉంది. ఏడో ఏట వీణ నేర్చుకోడం మొదలుపెట్టి పదహారేళ్లు వచ్చేవరకు నేర్చుకున్నారు. చిట్టిబాబు గారికి తాను ఏకలవ్య శిష్యురాలినని చెప్పుకునేవారు. సుకుమార భావాలతో సురభిళమైన భాషతో ఆహ్లాదభరితంగా సాగే పాత హిందీపాటల్లోని సాహితీమాధుర్యాన్ని ఆస్వాదించే ఆమెకు ఆ భాష మీద అనురక్తి కలిగింది. ప్రాధమిక విద్యతో పాటుగా హిందీ ప్రచార సభలో హిందీ భాషా తరగతులకు వెళ్తూ హిందీ నేర్చుకుని తర్వాతి కాలంలో తన చదువు అందులోనే కొనసాగించి, వివాహానంతరం ఎమ్.ఎ, బి.ఎడ్ చేశారు. 

భర్తతో పాటు లిబియా వెళ్లిన ఆమె అక్కడ కొన్ని సంవత్సరాలపాటు హైస్కూల్ టీచర్ గా పనిచేశారు. 1980 లో లిబియా నుంచి తిరిగివచ్చాక ఆమె హిందీ నించి తెలుగుకీ, తెలుగు నించి హిందీకీ, ఇంగ్లీష్ నించి తెలుగుకీ విరివిగా అనువాదాలు సాగించారు. సాహితీ ప్రక్రియలన్నిటిలోనూ కవిత్వమే తనకు ఎక్కువ ఇష్టమనే ఆమె, వైరముత్తు కవితలని తమిళం నుంచి తెలుగులోకి అనువదించారు. 

ఇతర భాషల్లోని అద్భుతమైన పుస్తకాలు తెలుగులోకి వచ్చినా, తెలుగులోని గొప్ప రచనలు ఇతర భాషల్లోకి వెళ్లినా అనువాదకులు సమర్ధులు కానపుడు మూల రచనలోని ఆత్మ కనుమరుగైపోవడం, దానిలోని సరళతా సౌందర్యమూ మాయమైపోయి కేవలం ఇతివృత్తం మాత్రమే లక్ష్య భాషలోకి వెళ్లడం జరుగుతుంది

“మనకున్న మంచి అనువాదకులే కొద్దిమంది. వారి రచనలని వెలుగులోకి తెచ్చే సంస్థలు చాలా తక్కువ. కేంద్ర సాహిత్య అకాడమీ, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ లాంటివి హిందీలోకి అనువాదాలు చేయించినపుడు వాటిలో ఒకటో రెండో మాత్రమే తెలుగు పుస్తకాల అనువాదాలు ఉంటాయి. తెలుగేతరులకు తెలుగువారంటే చిన్న చూపు. జాతీయ స్థాయిలో కీలక స్థానాల్లో తెలుగువాళ్లు లేకపోవడం; ప్రభుత్వ సంస్థల్లో సలహామండలి సభ్యులుగా మనవాళ్లుండి ఈ సమస్యను పైకెత్తి చూపినా, నిర్ణయాధికారం వారి చేతుల్లో ఉండకపోవడం వల్ల తెలుగులో వచ్చిన అద్భుత సాహిత్యం జాతీయభాషలోకి వెళ్లకపోవడం, మన ప్రతిభ ఇతర భాషలవారికి తెలియకపోవడం జరుగుతోంది. తెలుగులో ఆణిముత్యాల్లాంటి కథలను ఇతర భాషలలోకి అనువదిస్తే, వాటి ప్రచురణకి ఆర్థికసాయం దొరకడం లేదు. బహుశా ఇతర భాషల్లో ఉండే మంచిని గ్రహించాలనే తపన మనకు ఉన్నంతగా మిగిలిన వాళ్లకి లేదేమో. మనం శరత్‌బాబుని ఆదరించినట్లు బెంగాలీలు తెలుగు రచయితలెవరినైనా ఆదరిస్తున్నారా?” అంటారు శాంతసుందరి. 

ఆమెకు తెలుగు నుంచి హిందీలోకి అనువదించడమే ఎక్కువ సంతృప్తిని ఇచ్చేది. ‘నా వాళ్ల గురించి ఇతరభాషల వాళ్లకి చెప్పాలని అనిపించడం సహజం కదా’ అంటారామె నవ్వుతూ. అనువాద రచనలకు చక్కని వేదికనిచ్చిన విపులపత్రికని ఆమె ఎంతో అభిమానించేవారు.

1967లో ఇరవై సంవత్సరాల వయసులో మొదలుపెట్టిన అనువాద రచన 2020లో తుది శ్వాస విడిచేదాకా కొనసాగించి, దాదాపు 80 పుస్తకాల వరకు  అనువదించి తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల మధ్య ఒక అందమైన సాహితీ వారధిని నిర్మించారు శాంత సుందరి. ఆమె నేషనల్ బుక్ ట్రస్ట్ వారికి ‘హిందీ ఏకాంకికలు’ అనే హిందీలో వచ్చిన ఏకాంక నాటికల సంకలనాన్ని అనువదించి ఇచ్చారు. ఆమె మొదటగా చేసిన అనువాద పుస్తకమే పన్నెండవ తరగతి విద్యార్ధులకి పాఠ్యగ్రంథం కావడం చెప్పుకోదగిన విషయం. 

కథ, కవిత, నవల, నాటకం, వ్యాసాలు, ఆత్మకథలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు… ఇలా ఆమె అనువాదం చేయని ప్రక్రియ లేదేమో అనిపిస్తుంది. కొకు రచన ‘చదువు’ని ఆమె ‘పఢాయీ’ పేర హిందీలోకి అనువదించారు. మహా శ్వేతా దేవి, ఆనంద్ నీలకంఠన్, డేల్ కార్నెగీ, ప్రేమ్ చంద్, బేబీ హాల్దార్, వైరముత్తు వంటి ప్రముఖుల రచనలను ఆమె సరళ సుందరంగా తెలుగులోకి అనువదించారు. పి సత్యవతి, ఓల్గా, చిల్లర భవానీదేవి,  సలీమ్, కె.శివారెడ్డి, ఎన్. గోపీ, వరవరరావు, డాక్టర్ దేవరాజు మహారాజు వంటి ప్రముఖ రచయితలూ, కవులను హిందీ పాఠకులకు పరిచయం చేశారు. డా. గోపాల్ కాబ్రా రచించిన 23 కథలని ‘కథ కాని కథ’ పేర తెలుగు లోకి అనువదించారు. వేర్వేరు భాషలనుండి ఆమె తెలుగులోకి అనువదించిన కథలు ‘కథా భారతి’ కథా సంకలనంగా వెలువడ్డాయి. 2020 లో యువల్ నో హరారి రచించిన ‘సేపియెన్స్’ పుస్తకాన్ని తెలుగులోకీ, గోపీ గారి ‘వృద్ధోపనిషత్’ కవితా సంపుటిని హిందీలోకీ అనువదించారు. 

హైదరాబాద్ లో స్థిరపడ్డాక ఆమె భూమిక, లేఖిని అనే మహిళా సాహితీ సంస్థలలో సభ్యులై, రచయిత్రుల కథలను హిందీలో కథా సంకలనాలుగా వెలువరించాలన్న ఆలోచనను స్వాగతించి, స్వచ్ఛందంగా వాటిని అనువదించి ఇచ్చారు. భూమిక తలపెట్టిన కథా సంపుటి ‘అప్నా సంఘర్ష్- తెలుగు నారీ వాదీ కహానియా’ పేర 2008 లో  వెలువడగా, లేఖిని రచయిత్రుల కథా సంకలనం ‘గుల్దస్తా-మహిళా కథాకారోంకీ కహానియా’ 2012 లో హిందీ పాఠకులకి అందుబాటులోకి వచ్చింది. 2018 లో నా కథలు పన్నెండిటిని ఎంపిక చేసుకుని హిందీలోకి అనువదించారు. వాటిని ‘బోలతీ తస్వీర్’ కథా సంపుటిగా అలోక్ ప్రకాశన్ వారు ప్రచురించారు.

ప్రేమ్ చంద్ ని అభిమాన రచయితగా ఆరాధించే ఆమె, ఆయన భార్య శివరాణీ ప్రేమ్ చంద్ రచించిన ‘ప్రేమ్ చంద్ ఘర్ మే’ పుస్తకాన్ని తెలుగులోకి ‘ఇంట్లో ప్రేమ్ చంద్’ పేర అనువదించి, 2014 సంవత్సరానికి గాను ‘కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారా’న్ని అందుకున్నారు. ఈ అనువాద నవల 2009 జనవరి నుంచి 2012 జులై వరకు భూమికలో సీరియల్ గా వచ్చింది. అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్లు దీన్ని పుస్తకంగా వెలువరించారు.

అంతకు ముందు ఆమె 2005 లో ఢిల్లీలోని భారతీయ అనువాద్ పరిషద్ వారి నుంచి ‘డాక్టర్ గార్గీ గుప్తా ద్వివాగీశ్’ పురస్కార్ అందుకున్నారు. ఈ పురస్కారాన్ని రెండు భాషలలోనూ తగినన్ని అనువాదాలు చేసినవారికి మాత్రమే ఇస్తారు. తెలుగు నుంచి హిందీకీ, హిందీ నుంచి తెలుగుకీ విరివిగా అనువాదాలు చేసిన ఆమెకు ఈ పురస్కారం లభించడంలో ఆశ్చర్యం లేదు. 2009 లో ఎయిడ్స్ వ్యాధి మీద సలీంగారు రచించిన పరిశోధనాత్మక నవల ‘కాలుతున్న పూలతోట’ ను ‘నయీ ఇమారత్ కే కందహార్’ అనే పేరుతో హిందీ పాఠకులకు అందించినందుకు ఢిల్లీ లోని జాతీయ మానవ హక్కుల సంఘం ప్రథమ బహుమతినిచ్చి గౌరవించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ అనువాద పురస్కారం, అమృతలత అపురూప పురస్కారం, లేఖిని పురస్కారం ఆమె అందుకున్న ఇతర పురస్కారాలు. 

అనువాదకుడి లక్ష్యం తను రాసేది పాఠకులకు అర్థమవడమే కాని తన భాషాజ్ఞానాన్ని ప్రదర్శించడం కాకూడదనీ, మూల సంస్కృతి ఒకటే కాబట్టి భారతీయ భాషల్లో పరస్పరం అనువాదం చేయడం అంత కష్టం కాదనీ అనేవారు శాంత సుందరి. రెండుభాషలనీ దృష్టిలో పెట్టుకుని సందర్భానుసారంగా తగిన పదాలను వాడడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఉదాహరణకి ఫైవ్‌ పాయింట్‌ సమ్‌వన్‌ని ఐఐటీలో అత్తెసరుగాళ్లు’ అనీ, Fatso  పదాన్ని బోండాం అనీ ప్రస్తావించడం ఆమె అనువాద ప్రతిభను చూపిస్తుంది. స్వయం ప్రతిబంధక వ్యాధులు (ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌), నగదు కదలిక (క్యాష్‌ఫ్లో) లాంటి కొన్ని అవసరమైన తెలుగు పదాలను ఆమె సృష్టించారు. చిన్నా పెద్దా అని లేకుండా ఎవరినుంచైనా తనకి తెలియనిది నేర్చుకుందుకు సిద్ధంగా ఉండే ఆమె, అనువాదాల్లో తప్పులు రాకుండా ఉండాలంటే నాకు ఇంత అనుభవం ఉంది, ఇంకొకరిని అడిగేదేమిటి?’ అనే అహంకారం వదిలెయ్యాలనేవారు.
శాంతగారి తెలుగు రచనల అనువాదాలు చదివి హిందీ వారు సంపాదకీయాల్లోనూ, పాఠకుల లేఖల్లోనూమనవాళ్లు తెలుగువాళ్లలా ఎందుకు రాయలేకపోతున్నారు? అని ప్రశ్నించారట. హిందీ సాహిత్యాన్ని విస్తృతంగా చదివిన అమె ‘వస్తువు, శైలి, సమస్యని చూసే కోణం, రచనా విధానం… అన్నిటిలోనూ మిగిలిన భాషల వాళ్ల కంటే మనం చాలా ముందున్నామనేవారు. ప్రతి ఏటా జరిగే ‘అమృతలత అపురూప’ పురస్కార ప్రదానాలలో భాగంగా, తన తండ్రీ, ప్రఖ్యాత రచయితా అయిన కీ. శే. కొడవటిగంటి కుటుంబరావు గారి పేర, కథారచనలో ప్రతిభ కనపరిచిన ఒక తెలుగు రచయిత్రికి పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్న శాంత సుందరి గారు, 2016 లో శ్రీవల్లీ రాధికకీ, 2017లో వారణాసి నాగలక్ష్మికీ ఈ పురస్కారాన్ని అందించారు.

సమాజంలో సాహిత్యం పాత్ర ఎక్కువమంది చదువరులని తయారు చెయ్యడమే. కానీ దీనికి తల్లిదండ్రులూ, స్కూల్ యాజమాన్యం కూడా దోహదం చెయ్యాలి. ఊహ తెలిసినప్పటినుంచే పిల్లల వయసుకి తగినట్టుగా సంగీతం, సాహిత్యం పరిచయం చేస్తే ఈ నాడు సమాజం ఇంతకన్నా మెరుగ్గా ఉండేదేమో! మనుషులు సరిగా ఉంటే సమాజం, దేశం, ప్రపంచం వాటంతట అవే సరైన దారిలో పడతాయి’ అన్న శాంత సుందరి గారి కృషి అనువాద సాహితీరంగంలో చిరస్మరణీయమై నిలిచిపోతుంది.  

***

చెయ్యి

ఈ చేత్తో నేను

ఆస్తుల్ని తగలబెట్టడం గురించి కవితా 

కొట్లాటల గురించి కథా 

రిజర్వేషన్ మీద వ్యాసం

అయోధ్య సమస్య గురించి వ్యాఖ్యా రాశాను

ఉగ్రవాదాన్ని ఖండిస్తూ సంతకాలు పోగుచేసి ఉద్యమం లేవనెత్తాను

ఢిల్లీ కనాట్ ప్లేస్ లో మానవహారం తో చెయ్యికలిపాను

సంప్రదాయవాదాన్ని వ్యతిరేకిస్తూ.

కానీ అలా సమస్తం తగలబడుతూ ఉంటే

నువ్వెక్కడికి పోయి దాక్కున్నావురా పిరికిపందా?”

అన్నాను.

అతను మాట్లాడలేదు

నా నున్నటి మెత్తటి చేతుల్ని చూస్తూ ఉండిపోయాడు.

తరవాత నెమ్మదిగా తన రెండు చేతుల్నీ జాపి

తగలబడుతున్న ఇంట్లో ఇరుక్కున్న

ఒక పిల్లవాణ్ణి కాపాడాను

తరవాత ఆస్పత్రిలో పడి ఉన్నాను ఇప్పటివరకూ!”

అన్నాడు.

*

హిందీ మూలం : రామ్ దరశ్ మిశ్ర్  (వీరి హిందీ కవిత్వ గ్రంథానికి 2015 కి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ప్రకటించింది. 1924 ఆగస్టు 15 న జననం. ఢిల్లీ విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ గా పనిచేశారు.)

                                                                       *****

Please follow and like us:

One thought on “అనువాద రాగమంజరి – శాంతసుందరి (నివాళి)”

  1. నాగలక్ష్మి గారు! శాంతసుందరిగారి గురించి చాలా రాసినవారు మీరే! ఆ శ్వేతవర్ణంనుంచి ఇంద్రధనుస్సు విచ్చుకున్నట్లు మీరుశాంతసుందరిగారి గురించి రాసిన ప్రతి ఆర్టికల్ ఏడు రంగులను చిత్రించారు. శాంతసుందరిగారి విశ్వరూపాన్ని ఆవిష్కరించారు మీ ఏడురంగులతో. నాకు వారిగురించి పూర్తిగా మీరురాసిన వ్యాసాలవలనే తెలిసుకున్నాను.అపురూపమైన వ్యక్తి ,వ్యక్తిత్వం! ఎంత నిండుమనిషి. ! Work is worship లా తమపని చేసుకువెళ్ళారు! ఏమిచ్చివీరిఋణంతీర్చుకోగలమూ!! మీకు మనఃపూర్వక అభినందనలు నాగలక్ష్మి గారు!!!

Leave a Reply

Your email address will not be published.