ఎండ్లూరి సుధాకర్ సుధామయ కవిత్వం గోదావరి తరంగిణీ శీతలత్వాన్ని , సామాన్య పాఠకుడికి కవితా కమ్మదనాన్ని అందిస్తూ, దళిత కవిత్వంతో నిప్పురవ్వల్ని రగిలించడమేకాక “స్త్రీవాదాన్ని” కూడా నిజాయితీగా నిలిపారు. స్త్రీల సమస్యలను సౌమనస్యంగా ఆవిష్కరించారు.
“నాన్న కొట్టినప్పుడు ఒక మూల
ముడుచుకొని పడుకున్న
“అమ్మ”లా ఉంటుంది ….”
అన్నప్పుడు ఇది ఏదో దైనందన సమస్యలా తోచవచ్చు. కానీ ఇది అన్ని ఇళ్లల్లో పురుషాహంకారానికి స్త్రీలు ఒగ్గి, మగ్గి పోవటానికి ఒక ప్రత్యక్ష దృశ్యం. ఆయన వర్ణించింది, వర్షించింది గోదావరి లోనే. గోదావరినే ఎంతో కమ్మగా ఉపమించినట్లున్నా, దాని వెనుక ఉన్న నేపథ్యం – ఒక భయానక సత్యానికి అక్షర నైవేద్యమే.
తన భార్యను స్త్రీగా ఎంతగా గౌరవించాడో ఆయన వ్రాసిన “సహచరి” అన్న కవిత లోని భావాన్ని చూస్తే తెలుస్తుంది.
“నువ్వు నాలో సగభాగమేమిటి
నేనే నీ అర్థాన్ని”
అన్నప్పుడు మనకు వినిపించే మరో చరణం కాళిదాసు కవి
“వాగర్ధా వివసం పృక్తౌ…. అనే అవిభాజ్యమైన అర్ధనారీశ్వర తత్వం. అందుకే-
” అనుభూతి కవిత్వం తో సామాజిక స్పృహను జోడించే కొద్దిమంది మంచి కవుల్లో సుధాకర్ ఒకరు” అంటారు ద్వా.నా.శాస్త్రి.
“వర్తమానం” అనే కవితా సంపుటిలో “మైసమ్మ మరణం” కవిత ఆయన సామాజిక స్పృహకు పరాకాష్ట.
“పిల్లలకు స్నానం చేయిస్తున్నంత ప్రేమగా ఆమె రోడ్లు ఊడ్చేది”
అంటూ మైసమ్మ లో “అమ్మ”ను చూడగలిగారు. సమస్త కల్మషాన్ని కడిగేసే గంగమ్మ తల్లి లా అనంతలోకాలకు వెళ్లిపోయిన మైసమ్మ కు పాఠకుల గుండెల్లో గుడి కట్టారు. శివారెడ్డి గారు “ఆమె ఎవరైతే మాత్రం” లో మాలకొండమ్మ లో శ్రమ సౌందర్యాన్ని చూస్తే- సుధాకర్ “మైసమ్మ” లో తన పని కే అంకితమైన అమ్మను చూడగలిగారు. “వర్తమానం” కవితా సంపుటిని సి.నారాయణ రెడ్డి గారికి అంకితమిచ్చారు. “అమ్మ లాంటి సి.నా.రె. గారికి” అని అమ్మదనం లోని అమోఘమైన శక్తిని, భక్తిని ఆవాహన చేసి – ఇలా అంకితమివ్వడం సుధాకర్ కి అమ్మ పట్ల ఉన్న అత్యంత అనురాగానికి చిహ్నం. ఇది తన గురువు గారికి ఇచ్చిన అమితమైన గౌరవం. స్త్రీవాదాన్ని, దాని ఆవశ్యకతను ప్రత్యక్షంగా, పరోక్షంగా నొక్కి చెప్పిన రచయిత ఎండ్లూరి సుధాకర్.
*భగ్వాన్ :*
ఈయన కలం నుండి వెలువడిన కవితల్లో “అనాధ”, “పనిమనిషి”అనేవి చెప్పుకోదగినవి.
బీదసాదలకు ప్రభుత్వం నెల నెల కురిపించే దయావరం అనే పింఛను ఎలా చేతికి దక్కుతుందో దయనీయంగా “అనాధ”లో చిత్రించారు. ఆ కొద్ది పింఛను ఇవ్వటానికి లంచం కోసం కక్కుర్తి పడే గుమస్తాల మస్తిష్కాల ముష్కరత్వాన్ని ఆవిష్కరించారు.
“పని మనిషి” అన్న కవితలో పేరుకే పనిమనిషి కానీ, దాదాపు అందరి ఇళ్లలోనూ ఇంటిలో మమేకమై సౌఖ్య సామ్రాజ్యాన్ని ఆత్మీయంగా పాలించే పని మనిషి గురించి చెప్తారు-
“బొంగరం లా తిరుగుతూ
మా తలలో నాలుక అవుతుంది.
మా ఇంటిముందు కళ్లాపవుతుంది .
మా ఇంట్లో తళతళలాడే
గిన్నెలవుతుంది .
మాశరీరాలపై ఉతికిన
దుస్తులవుతుంది
కాన్వెంట్ కెళ్ళి మా బాబి గాడి
బాడీ గార్డ్ అవుతుంది…’
అవుతుంది అవుతుంది – అని అతి సాధారణమైన అంత్యప్రాసల తో పాఠకుల హృదయాంతరాలలోకి నేరుగా ప్రవేశిస్తాడు కవి. అందుబాటులో ఉన్న అందమైన రూపకాలను అందంగా అలంకరించి కళ్ళకు కట్టినట్లు చెప్పారు. ఆమె చేసే పనులన్నీ ఏకరవు పెట్టిన ఆయన శైలి మనల్ని ఆకట్టుకుంటుంది. తన తట్టు తిప్పుకుంటుంది. తలలో నాలుకై బొంగరం లా తిరిగే పనిమనిషి ఏ కారణం చేతనో రాకపోతే –
“మా కన్నుల్లో దిగులౌతుంది
గిన్నెలు అడ్డం పడతాయి వస్తువులు పట్టు తప్పుతాయి విసుగులు ముసురుతాయి
చిరాకు విసురుతాయి”
అంటూ గుండెకు హత్తుకుపోయే విధంగా సహజత్వాన్ని త్రవ్వి తీస్తారు. ఇక్కడ కూడా క్రియల తో కూడిన అంత్యప్రాసలు వ్యావహారికాలై కవితా వ్యవహారాన్ని కమ్మగా కొనసాగిస్తారు. గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇంటిలోని వారి సోమరితనాన్ని ఎండకడతారు. మళ్లీ తెల్లవారిన తర్వాత ఆమెవస్తే-
“ఆమె చిరునవ్వు
మరుపు దుప్పటైంది
నిన్నటి అగచాట్లను
ఎంచక్కా కప్పుతుంది”..
అని చక్కని చిక్కని కవిత్వ భాషలో ఎంతో చక్కగా అక్షరాలు నగిషీలు చెక్కారు కవి. ఆమెతో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని సుందరమైన పెనుబంధాన్ని ఎంతో అందంగా చెప్పారు భగ్వాన్.
“నిజానికి ఆమె చుట్టూ అల్లుకుపోయిన తీగలం మేము
ఆమె చేతి చలువ వల్లే ఊపిరి
పీల్చే జీవులం మేము”..
ఇది ఒక అవినాభావ సంబంధం ప్రాణానికి ప్రాణికి ఉన్న సున్నితమైన సంబంధానికి ఉన్నతంగా ఉదాత్తంగా ఊపిరి పోశారు. ఒక స్త్రీ తన జీవన యాత్రలో ఎలా తన ఇల్లు వదిలి మరొకరి పంచన చేరి, వారిలో ఒకరిగా మారటం – కేవలం బతకడం కోసమే. ఆ ఇంటిలోని వారి అశక్తత ఆమెకు ఆధారమైంది. పరాన్నజీవులు గా మారిన వారి చేతకానితనాన్ని తూర్పార పట్టారు కవి. ఇది స్త్రీవాదానికి మరొక పార్శ్వం.
భగ్వాన్ కవిత “మంత్రదండం” లో ప్రాణం పోసుకున్న “అంకెల పడవలో* సర్కస్ గూడు కనిపిస్తుంది. అందులో ఎత్తుగా ఉన్న ఒంటి తీగ మీద ఫీట్స్ చేస్తున్న యువతి దృశ్యాన్ని కళ్లెదుట ప్రత్యక్ష చేస్తారు కవి. ఎక్కడ కాలు కనబడుతుందో, ఎక్కడ ఏకాగ్రత గాలిలో కలిసి పోతుందో, ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ ఉరకలెత్తుతుంది. బ్రతుకుతెరువు కోసం కత్తి మీద సాము లాంటి జీవనయాత్ర గడిపే “సర్కస్ జీవుల” ఉదంతంలో, ముఖ్యంగా ఆ యువతి పట్ల సానుభూతి తారస్థాయికి వెళుతుంది.
ఈ కొద్ది ఉదాహరణ చాలు భగ్వాన్ కవిత స్త్రీల పట్ల, స్త్రీ జీవితం పట్ల, స్త్రీల బ్రతుకుతెరువు పట్ల, వారి భవిష్యత్తు పట్ల, వారి యోగక్షేమాలు పట్ల ఎంత అంకితభావాన్ని అక్షరాల నగిషీలతో పాఠకుల గుండెలోకి నేరుగా చెప్పించారో అర్థమవుతుంది. అందుకే ఆయన కవితలు స్త్రీ వాద సమాహిత గా, వారి హితానికి సన్నిహితంగా మన్ననలు అందుకుంటున్నాయి.
*ఆసు రాజేంద్ర* :
“గుండెచప్పుళ్ళు” అనే కవితా సంపుటి లో కవి రాజేంద్ర ఎంతో ఎత్తిపొడుపు లతో, విమర్శల విసురులతో కవితల్ని చిత్రిస్తారు.
“సెప్టిక్కయ్యి
కుళ్ళిపోతున్న ఈ దేశానికి
ఎక్స్ రే తీసి చూస్తే ఏముంది
ఈ దేశాన్ని ఈడిస్తున్న
బుర్రనిండా తుప్పురేకులే’
ఈ మాటలు రాజకీయ నేతల మెదళ్ళకు తూటాలే. ఆయన “విచిత్రం”, “మృత్యువు”, “నీడ” కవితలు తన భావన బలానికి, ఆలోచన వైచిత్రికి అద్దం పడతాయి.
ముఖ్యంగా స్త్రీ వాద పరంగా అన్వయించుకోదగిన ‘ లైఫ్ లాంగ్ ” అనే కవిత చదవ దగినది.
“భార్యను కేవలం
బెడ్ లైట్ గా వాడుకునే భర్తకు
ఆ భార్య రెడ్ లైట్ గా మారితే
వాడి జీవితం
మిడ్ నైట్ అవుతుంది”
భార్యను తేలికగా తీసుకుని ఆమెకు ఇవ్వవలసిన ప్రేమాభిమానాలు పంచకపోతే వచ్చే తీవ్ర పరిణామాలు చెప్పారు. ఆంగ్ల పదాల లో చెప్పినా అది వ్యవహారిక భాష కావడంతో ఛురికలా దూసుకెళ్తుంది. చక్కని సందేశాన్ని చిక్కని భావంతో మేళవించి స్త్రీ వాదాన్ని వినిపిస్తున్న రచయిత ఆసు రాజేంద్ర.
(స్త్రీవాద భావాలతో వెలువడిన పురుష రచయితల కథానికలు తరువాయి భాగంలో…!)