ఒక భార్గవి – కొన్ని రాగాలు -9

మనసుని ఉప్పొంగించే రాగం—కానడ

-భార్గవి

మనసొక మహా సముద్రం అనుకుంటే ,అందులో ఉప్పొంగే భావాలే అలలు.అలా భావాలని ఉప్పొంగించే రాగం కానడ

మునిమాపు వేళ సన్నగా వీచేగాలికి ఆలయ ధ్వజస్తంభానికున్న చిరుగంటలు మోగినట్టూ-

కార్తీకమాసంలో ఓ రాత్రివేళ చిరుచలిలో తులసికోటలో నిశ్చలంగా వెలిగే నూనెదీపం లాగానూ

 మరిగిన పాల మీద కట్టిన చిక్కటి మీగడని చిలకితే వచ్చిన వెన్న నోట్లో కరిగిపోయినట్టూ

అనిపిస్తుంది ఈ రాగం ఆలపించినప్పుడు వింటే

కొంతమంది ఈ రాగాన్ని కన్నడ అని పిలిస్తే ఇంకొంత మంది కానడ అని పిలుస్తారు.కర్ణాటక అనే పదం నుండీ కన్నడ అనే పదం వచ్చిదంటారు.

ఇది చాలా ప్రాచీనమైన రాగం ,ఇందులో వచ్చే గాంధారం (అంటే”గ”)ప్రత్యేకంగా వుంటుందనీ ,ఒక్క గాంధారం ఆలపించినా చాలు రాగ స్వరూపం బోధపడుతుందని భావిస్తారు.ఇది గమక ప్రధానమైన రాగం ,అంటే సరైన చోట సరిగా గమకం పలికిస్తే చాలా బాగుంటుందనీ,అందుకే కచేరీలలో పాడటం కష్టమనీ అంటారు,కానీ  కొంతమంది కచేరీలలో రాగం తానం పల్లవి లో రాగం విస్తరించి పాడటానికి ఈ రాగాన్ని ఎన్నుకుంటూ వుంటారు.

అన్ని సమయాలలోనూ పాడదగిన రాగం,మనసులో తీవ్రమైన ఉద్వేగాలని రేకెత్తించే రాగం,ఒక విషాదాన్నీ,ఒక యెడబాటునీ సూచించడానికి ఈ రాగాన్ని ఉపయోగిస్తూ వుంటారు ,అయితే శృంగార గీతాలకు కూడా అప్పుడప్పుడూ ఈ రాగంలో మట్లు కడుతూ వుండటం కనపడుతుంది.ఎక్కువగా రాగమాలికల్లో  ఈ రాగం చోటు చేసుకుంటూ వుంటుంది

ఈ రాగం 22వ మేళకర్త అయిన ఖరహర ప్రియ నుండీ జన్యము.సంపూర్ణ రాగము అంటే యేడు స్వరాలూ వుంటాయి

ఈ రాగంలో ప్రముఖుల రచనలు కొన్ని పరిశీలిస్తే—

త్యాగరాజ కృతుల్లో ప్రాచుర్యంలో వున్నవి రెండు .ఒకటి “సుఖి ఎవ్వరో” రెండోది “శ్రీ నారద” అనేది.

స్వాతి తిరునాళ్ “మామవ సదాజనని” అనే కృతి కూడా  బాగాపాప్యులర్ 

రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ రచించిన 

“నెరనమ్మితి” అనే అటతాళ వర్ణము, థిల్లానా కానడ రాగంలో  వున్నాయి.

జి.యన్. బి .గా సుప్రసిధ్ధుడైన జి.యన్ .బాలసుబ్రహ్మణ్యం రచించిన “పరాన్ముఖ మేలనమ్మ” అనే కృతి చాలా బాగుంటుంది,దీనిని భానుమతి ఒక సినిమాలో కూడా పాడారు.

ఊత్తుకాడు వెంకటసుబ్బయ్య రచించిన “అలై పాయుదే” అనే కృతి కానడ రాగానికి చిరునామా అని చెప్పవచ్చు .ఇదే పేరుతోమణిరత్నం తమిళంలో సినిమా నిర్మించడమే కాదు,అందులో ఒకసన్ని వేశంలో “అలై పాయుదే ”  అని ఒక పాటగా  చిత్రంలో వాడుకున్నారు ,అదే సినిమా తెలుగులో “సఖి” పేరుతో వచ్చింది.అందులో కూడా “అలై పొంగెరా కన్నా” అంటూ  డబ్ చేసిన పాట ఈ రాగంలోనే వుంటుంది

ధర్మపురి సుబ్బరాయర్ కానడ రాగంలో రచించిన “వానిపొందు”జావళీ ప్రముఖమైనది.

అన్నమాచార్య పదాలలో ఈ రాగంలో చేసిన “రాముడు రాఘవుడు రవికులుడితడు” అనే పదం డి.పశుపతి గారు స్వరకల్పన చేశారు  చాలా బాగుంటుంది

సినిమా పాటలలో ఈ రాగాన్ని ఎక్కువగానే వాడినట్టు కనపడుతోంది.

ఘంటసాల స్వరపరచి తానే స్వయంగా పాడిన “లవకుశ” చిత్రంలోని “జగదభి రాముడే “అనే పాట కానడ రాగంలోనే చేశారు. 

అశ్వత్థామ సంగీత సారధ్యంలో పి.సుశీల పాడిన సి.నారాయణ రెడ్డి రచన “శ్రీగౌరి శ్రీగౌరియే “కానడ రాగానికి మచ్చుతునక.

ఈ రాగానికి మరొక మంచి ఉదాహరణ పెండ్యాల సంగీత దర్శకత్వంలో “బందిపోటు దొంగలు “సినిమాలో ఘంటసాల,సుశీలల గళంలో ధ్వనించిన “విన్నానులే ప్రియా “అనే సి.నా.రె .రచన

కొంజుం సెలంగై అనే తమిళ చిత్రం తెలుగులో “మురిపించే మువ్వలు “గా డబ్ అయింది,అందులో “కొంజుంసెలంగై ఓలి కేట్టు” అనే పాటకి తెలుగు వర్షన్ “సొంపౌ గజ్జల శృతి చేత” అనేది,రచన ఆరుద్ర,అద్భుతంగా పాడి రక్తి కట్టించింది పి.లీల ,రాగమాలికగా సాగే ఈ పాటను ట్యూన్ చేసింది యస్ .యమ్ .సుబ్బయ్య నాయుడు.

అలాగే తమిళంలో కె.బాలచందర్ దర్శకత్వంలో “సింధు భైరవి” అని రూపుదిద్దుకున్న సినిమా తెలుగులో కూడా అదే పేరుతో డబ్ అయింది,అందులో “పూమాల వాడెనుగా” అని జేసుదాస్ పాడిన పాట వున్నది కానడ రాగంలోనే. స్వరపరిచింది ఇళయ రాజా

 కె.బాలచందర్ దే ఇంకో సినిమా “ఇదికథకాదు” లో యం.యస్ .విశ్వనాథన్  స్వరపరిచిన ,ఆత్రేయ గీతం “సరిగమలూ గలగలలూ ” పాటలో తొంగి చూసేది కానడ రాగఛాయలే ,పాట పాడినది పి.సుశీల ,యస్ .పి.బాలసుబ్రహ్మణ్యం.ఎంతో చక్కని పాట

కె.వి.రెడ్డి దర్శకత్వంలో నాగయ్య నటించి సంగీత దర్శకత్వం వహించిన “భక్తపోతన” సినిమాలో స్వయంగా నాగయ్యే పాడిన “పావన గుణరామా హరే” అనే పాట అద్భుతంగా వుంటుంది

బి.యన్ .రెడ్డి గారి అపురూప సృష్టి “మల్లీశ్వరి” లో దేవులపల్లి వారి పద రచన కు రాజేశ్వరరావు గారి స్వర రచన తోడై దివ్యమైన పాటలు సిధ్ధించాయి .వాటిలో భానుమతి పాడిన విరహ గీతం “నెలరాజా వెన్నెల రాజాలో “కానడ రాగ ఛాయను వినవచ్చు శ్రీరాగం తోపాటు.

దేవులపల్లి వారిదే ఇంకో రచన “నిన్ను జూచు నందాక కన్నుల వెలుగుండేనా”అనేదానిని కూడా కానడలోనే స్వరపరిచారు స్వరశిల్పి పెండ్యాల “భక్త శబరి” సినిమాలో ,గానం చేసింది పి.సుశీల.

పి.సుశీలే పాడిన మరో పాట “ఏటి దాపుల తోటలోపల తేట తేనియలొలుకు పలుకుల యెవరినే పిలిచేవు కోయిల”అనేది చాలా వినూత్నం గా వుంటుంది.ఈ పాట రచన సి.నారాయణ రెడ్డి,బాణీ కట్టింది టి.చలపతి రావు ,చిత్రం “ప్రేమకానుక”

ఇదీ టూకీగా కానడ రాగ స్వరూపం,ఈ పాటికి కానడ రాగం మీ మనసులో కూడా  భావాల అలలను ఉప్పొంగించి వుంటుందని భావిస్తూ 

——శెలవ్


*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.