గోర్ బంజారా కథలు-3
ఆదివాసి గిరిజన దినోత్సవం
-రమేశ్ కార్తీక్ నాయక్
1.
యూనివర్సిటీ ప్రాంగణ మైదానమంత పూల చెట్లతో నిండుగా ఉంది. మైదానానికి చుట్టూ అర్థ చంద్రాకారంలో చెట్లు ఉన్నాయి. కానీ ఆ చెట్లు ఏవికుడా ఎక్కువగా అడవుల్లో ఉండవు.రెండు రెండు చెట్లకు మద్య వేరే చెట్లు ఉన్నాయి.కొన్ని పూలతో, కొన్ని కాయలతో కొన్ని వివిధ రంగుల జెండాలు, బానార్లతో నిండి ఉన్నాయి.
దాదాపుగా అక్కడ ఉన్న చెట్ల పై మొలలు కొట్టి ఉన్నాయి.కొన్ని మొలలు చెట్టు పెరుగుదలలో కలిసిపోయాయి.కొన్ని అలాగే సిలుమెక్కి ఎండిన ఆకుల రంగుల్లో కనిపిస్తున్నాయి. కొన్ని చెట్ల దేహాల పై చాక్ పీస్తో పేర్లు రాసి ఉన్నాయి.
చెట్ల కింద అక్కడక్కడ పచ్చని గడ్డి ఉంది.కొంత భాగం ప్లాస్టిక్ ఇంకొంత సాధారణ పచ్చ గడ్డి. చెట్ల నీడల్లో కాసిన్ని చీమలు కొన్ని రంగుల పావురాల గుంపులు జీవిస్తున్నాయి.
యూనివర్సిటీ ముఖద్వారానికి ఎదురుగా ఉన్న స్తంభం పైన జెండా తల దించుకున్నట్లు వాలిపోయి ఉంది. స్తంభం అడుగు భాగం చుట్టూ ముగ్గు వేసి ఉంది.
యూనివర్సిటీ స్టాఫ్ అందరూ ముద్దుగా తయ్యారై హడావిడిగా ఉన్నారు. ప్రిన్సిపాల్ ఆదివాసీ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడడానికి ఉపన్యాసాన్ని కాగితంలో రాసి తను వేసుకున్న కోటు జేబులో పెట్టుకున్నాడు. మాటిమాటికీ కాగితాన్ని తడిమి చూసుకుంటున్నాడు. యూనివర్శిటీ పక్కనే రోడ్డు ఉండడంతో అతడి చూపులు రోడ్డు మీద పరిగెడుతున్న లగ్జరీ వాహనాల వైపు మల్లుతు ఉంది. లోపలెక్కడో కంగారు, ఏ పెద్ద ఆఫీసర్ ఎప్పుడు ఇన్స్పెక్షన్ కి వస్తారో అని. ఆ రోడ్డుకు అటూ వైపు కొన్ని పూల మొక్కలు ఉన్నాయి వాటికి చుట్టూ కంచెలు వేసి ఉన్నాయి.
డిపార్ట్మెంట అటెండర్లు , స్వీపర్లు అందరూ సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు స్టాఫ్ తో కలిసి ఆదివాసీ గిరిజనుల ప్లాస్టిక్ బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు.
ఒక వ్యక్తి ప్రత్యేకించి చేతిలో కట్టేపట్టుకుని నిల్చున్నాడు. అటుగా వస్తున్న కుక్కలను బెదరగొడుతున్నాడు.కుక్కలు అతని పై అతను కుక్కల పై అరుచుకుంటున్నారు.
ఒకటే హడావిడి. ముస్తాబుల మీద ముస్తాబులు చేస్తున్నారు. ఎవరికోసమో ? అదంతా ఏం సాదించారనో ? అక్కడ ఉన్న కొందరికైతే అదంతా ఎందుకు చేస్తున్నారో కూడా తెలీదు.
2.
ఓ లారి హారన్ కొడుతూ వచ్చి క్యాంపస్కి ముందు ఉన్న మైదానంలో ఆగింది. లారి ఆగింది.లారీలో వారు ఎప్పుడెప్పుడు బయిటికి వద్దామా అన్నట్లు నిల్చొని చూస్తున్నారు.క్యాంపస్ అంతా ఆ లారీలో వారిని చూసిందీ.కొందరు వారు దిగే దాకా చూస్తూ ఉంటే ఇంకొందరు లెక్కచేయలేదు.
లారి ఆగిన కాసేపటికి ఓ కారు వచ్చి ఆగింది.దాంట్లోంచి ఓ మహిళ ఆమెతో పాటు తన డ్రైవర్ జీవన్ ఇద్దరు దిగారు.దిగి దిగగానే స్టాఫ్ మరియు వారి అరేంజ్మెంట్స్లను దూరం నుండి చూస్తూ లారి దగ్గరికి చేరుకున్నారు.మళ్ళీ అక్కడ ఆగి ఏదో మాట్లాడుకుంటూ నిల్చున్నారు.లారిలోని వారి కళ్ళన్నీ ఆ ఇద్దరి పైనే ఉన్నాయి. ఓ పెద్దావిడ గుంపులోంచి “మమ్మల్ని కిందికి దింపుతారా ? ఇలాగే రోజంతా నిలబెడతారా ? అని అనడంతో జీవన్ కోపంగా చూసాడు.
అగుతలే… దింపుతా, ఓపిక ఓపిక అంటూ భయాన్ని తలపించే గొంతులో అన్నాడు.అని మళ్ళీ తన ఒనర్ మెడంతో మాటల్లో పడిపోయాడు.
లారీలో కొన్ని తెగల సమూహాలు ఉన్నాయి. పేరుకు అందరూ ఆదివాసీ గిరిజనులు కానీ ఒకరితో ఒకరికి పరిచయమే లేదు.వారు ఎవరో కూడా ఒకరికి ఒకరు తెలీదు.ఎవరికి వారు తండాలు, పెంటలు, గుడాలు ఇలా రకరకాలుగా ఏర్పాటు చేసుకుని ఏకాంతం, ఒంటరితనంలో జీవిస్తూ ఉంటారు.కొందరు అడవుల్లోపల కొందరు అడవులకు అంచున,ఇంకొందరు కొండల్లో ఉంటూ ఉంటారు.జింక పిల్లల్లా తిరిగే వారిని అలా లారీలో ఇరుకుగా కుక్కి నిలబెడితే ఎంత ఇబ్బందో ? కిందికి దిగడం రాదని కాదు. జీవన్ పెట్టిన శరత్తు ప్రకారం అతని మాటే వినాలి.వినకుంటే డబ్బులు రావు అదే అందరి భయం. ఒకరినొకరు తోసుకుంటూ చుట్టూ చూస్తున్నారు.
జీవన్ లారి వెనక ఉన్న డోర్ ను తీశాడు. లారి నుండి ఓ ఎనభైకి పై చిలుకు మనుషులు దిగారు. అందరూ వారికున్న దాంట్లో వారు తమని తాము తమ సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబు చేసుకుని ఉన్నారు. లారికి చుట్టూ విస్తరించిన వారిని చూస్తే పూల బొకేలా అనిపిస్తున్నారు.అందరూ దిగాక లారీలో ఏమైనా మర్చిపోయారెమో చూసుకున్నారు. కొందరు ఒళ్ళు విరుచుకుంటూ అవలించారు. కొందరు తిమ్మిరెక్కిన కాళ్ళను చేతులను కదిలిస్తున్నారు.అమ్మలక్కలు ఆకువక్క వేసుకున్నారు.
వారిలో వారు గుసగుసలాడుతున్నారు. “డాన్స్ చెయ్యాలి అన్నారు.ఇక్కడేమో ఏమో ఏమో చేస్తున్నారు. నిలబడి డాన్స్ చేసేంత జాగా లేదు” అంటూ ఓ మహిళ తన భర్తతో అంటే,
అతడు “మనకెందుకు వాళ్ళు ఏది చెప్తే అది చేద్దాం ఇడా ఇంత మందిల ఏమి మాట్లాడేది లేదు” అంటూ మూతి మీద చూపుడు వేలు పెట్టి “బంద్” అన్నాడు.వారిలాగా ఎందరో ఏవేవో మాట్లాడుకుంటున్నారు.
వారందరినీ మైదానంలో ఓ చెట్టుకిందికి తీసుకెళ్ళాడు జీవన్.జీవన్ వారందరినీ పోగుచేసుకుని మనిషికి ఇంత అని మాట్లాడుకుని క్యాంపస్కి తెచ్చిన వ్యక్తి. వారందరినీ ఆ చెట్టుకింద కూర్చోమని చెప్పి యూనివర్సిటీ ప్రిన్సిపాల్ని కలిశాడు జీవన్.
“వీళ్ళందరూ కొత్తోళ్ళలా ఉన్నారు”
” హా… అవును సార్” అంటూ తల గోక్కుంటూ అన్నాడు జీవన్
“వీళ్ళకి అసలు డాన్స్ వచ్చా?”
“హా, సార్ బాగా చేస్తారు”
“పాత వాళ్ళు ఎటు పోయారు?”
“మీరు ఇచ్చే డబ్బులు చాలా తక్కువ అని అన్నారు.ఎవరో మంత్రి ప్రోగ్రాంకి వెళ్తున్నాం అక్కడ చికను, మందు , చాయి అన్ని ఉంటాయట.డబ్బులు మీరు ఇచ్చే దానికంటే యాబై రూపాయలు ఎక్కువ అని అన్నారు. వీళ్ళు కూడా అతి కష్టం మీద దొరికారు. రాను రాను ముందు జమానాలో ఎవ్వరూ దొరకరేమో ?” ఎంటి సార్ మీరు ఇంత ఆలోచిస్తారు అన్నట్లు చేతి సైగ చేసాడు.
“సరే జీవన్ ఇంతకీ వీళ్లకు ఎంత అని చెప్పావు”
“రెండు వందల యాబై”
“సర్లే పోతే పోయినాయి” అని మనసులో అనుకున్నాడు ప్రిన్సిపాల్ మళ్లీ వెంటనే జీవన్తో
“అందర్నీ సిద్ధం చెయ్యి.ఇంకో గంటలో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈరోజు స్పెషల్ గెస్ట్” అని అన్నాడు.
“సరే సార్ కాని చాయ్ కోసం ఏమైనా” అని మెల్లిగా అన్నాడు జీవన్. చుట్టూ అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఎవరైనా చూస్తున్నారా ? అనుకుంటూ అటూ ఇటూ చూస్తూ ప్రిన్సిపాల్ తన జేబులోంచి ఐదొందలు తీసి జీవన్కి ఇచ్చాడు.జీవన్ వాటిని తీసుకుని చెట్టుకింద కూర్చుని ఉన్న ఆ ఆదివాసీ గిరిజన సమూహం దగ్గరికి వెళ్లాడు.
జీవన్ వారిని చేరుకునే సమయానికే కొందరు చెట్లపై పావురాలను కొట్టడం.కొందరు పూలు ఏరడం ఇలాంటివి చేస్తుంటే,
“ఇలా మీరు ఉరిలోలాగ చేస్తే మిదగ్గరికి వచ్చి మొఖం మీదనే చంప వాయిస్తారు. జాగర్త నేను మళ్ళీ మళ్ళీ చెప్పను” అంటూ అందర్నీ తన వెనకాల రండి అన్నట్లు సైగ చేసి క్యాంపస్ క్యాంటీన్ దగ్గరికి నడిచాడు.అతని వెంట అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆదివాసీ,గిరిజనుల్లో కొందరు ఎర్రగా, తెల్లగా, నల్లగా మరియు ఇతరేతర రంగుల్లో ప్రత్యేకమైన చిరునవ్వులతో సాధారణ వ్యక్తుల కంటే పెద్ద మెడలతో చేతి నిండా పచ్చబొట్లతో ఉన్నారు.నగల షాపుల్లో దొరకని డిజైన్ ఆభరణాలతో ప్రశాంతంగా కనిపిస్తున్నారు.
జీవన్ క్యాంటీన్ అతనితో వన్ బై టు అంటూ సైగ చేసి తనకు స్పెషల్ చాయి ఆర్డర్ ఇచ్చుకున్నాడు. జీవన్ వాళ్ల ఓనర్ ఎటు వెళ్లిందో కనిపించలేదు.ఎక్కడుందో ? అని పై పైన చూస్తు సిగరెట్ తాగడానికి పక్కకి వెళ్లిపోయాడు.
ఒక్కొక్కరిగా చాయి అందుకుని తాగుతూ చుట్టూ ఉన్న క్యాంపస్ మైదానం,పార్కింగ్ ప్లేస్, అన్ని ఒకే రకంగా ఉన్న చెట్లను, మొక్కలను అవి నిజమా ? అబద్దమా ? అన్నట్లు చూస్తున్నారు.నిజం అన్నట్లే ఉంది కానీ లోపలెక్కడో అనుమానం ఇదంత వారి బ్రమ అని అనుకున్నారు. పచ్చదనం నిమిషానికి ఒకసారి ఇచ్చే ఎన్నో అనుభూతుల్లో ఏ ఒక్క అనుభూతి వారికి కలగట్లేదు.
వారిలో పదేళ్ల అమ్మాయి పుస్పా తన నానమ్మ సల్కా బాయితో పాటు వచ్చింది.
*దాది ముత్ని ఆరిచ”
(“నానమ్మ ఉచ్చ వస్తుంది”)అంటూ దాది చెయ్యి పట్టి లాగింది.అటూ ఇటూ చూసింది సల్కా బాయి. కొంత దూరంలో పొదల్లా ఉన్న ప్రదేశం కనిపించింది. అటువైపు మనవరాలిని నడుం పైకి ఎత్తుకుని తీసుకెళ్ళింది.చుట్టూ చూసింది ఎవరైనా వస్తున్నారా ? అని. ఎవరు లేరు. మనవరాలిని కిందికి దించి పొయ్యి అంటూ చిన్నగా చెప్పింది భయపడుతూ వణుకుతున్న గొంతుతో.పుస్పా తను కిందికి దిగగానే తను దూరంగా చూసింది. నాలుగు అడుగులు ముందుకు వేసింది.వెనక్కి తిరిగి దాదితో
“ఎవరైనా ఇటుగా వస్తున్నారంటే చెప్పు” అంటూ సిగ్గుపడుతూ చెప్పి కింద కూర్చుంది. పని పూర్తి చేసుకుని ఎవరో కొట్టినట్లు వేగంగా తన నానమ్మ దగ్గరికి నాలుగు అడుగులను రెండడుగుల్లో దుకి దాదిని చేరింది.
“ఎంది ఏమైంది” భుజంపై చెయ్యి వేసి నెమ్మదిగా అడిగింది సల్కా బాయి.
“అక్కడ పెద్ద పెద్ద ఎలుకలున్నయి. నా వైపు వస్తుంటే నేను లేచి వచ్చేసాను” అంటూ అమాయకంగా చెప్పింది.
” ఇంతకీ పని అయ్యిందా లేదా ?” పుస్పాని సల్కా బాయి అడిగింది.
హా అయింది అన్నట్లు తల ఊపింది. ఇద్దరు మళ్లీ తిరిగి క్యాంటీన్ వైపు నడిచారు. వాతావరణం సగం ఎండతో సగం నీడతో నిండిపోయింది.సల్కా బాయి ఒక చేతితో మనువరాలి చెయ్యి పట్టుకుంది.ఇంకో చేతితో తల పై నుండి జారుతున్న ఘుంగ్టోను సరి చేసుకుని క్యాంటీన్ దగ్గర బీడీలు వెలిగించుకుని ముక్కు,ముతితో వదులుతున్న పొగను చూస్తూ, ఆ పొగని సొరంగంగా భావించి అందులోకి నడిచినట్లు నడుస్తూ వెళ్లి మందలో కలిసిపోయారు.చుట్టూ చెట్లు ఉండడంతో గాలి వీస్తుంది. పూలు ఆకులు రాలుతూ వాటికి వీలైనంత వరకు దొర్లుతున్నాయి.
కొందరు విద్యార్థులు తమవాళ్లను తాము గుర్తు పట్టి క్యాంటీన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. ఫోటోలు దిగుతున్నారు. ఆదివాసీ గిరిజనులు తమతో బాగా చదువుకున్న విద్యార్థులు ప్రేమగా మాట్లాడడం చూసి ఆనంద అశ్చర్యాలకి లోనౌతున్నారు.
ఇద్దరు మిత్రులు వీరు, సురేష్ క్యాంటీన్ వైపు నడిచి వెళ్లి అక్కడే మనవరాలిని ఎత్తుకుని ఉన్న సల్కా బాయిని పలుకరించి పరిచయం చేసుకున్నారు. బంజారాలోనే మాట్లాడారు.
సల్కా బాయి కూడా వారు ఎక్కడివారో ఎం పని మీద వచ్చారో ? అడిగింది.కొన్ని నిముషాల పాటు మాట ముచ్చట్ల తర్వాత వీరు పుస్పాని ఎత్తుకుని ముద్దు చేస్తూ క్యాంటీన్కి పక్కనే ఉన్న ఇంకో క్యాంటీన్కి తీసుకెళ్ళి డైరీ మిల్క్ కొనిచ్చాడు. సురేష్ పుస్పాతో గారాబం చేస్తున్న వీరు సోదరి సూర్తి ఎలా ఓ ప్రొఫెసర్ కామకలాపానికి బలైందో చెప్తున్నాడు. అంతలోనే వీరు పుస్పాతో నవ్వుతూ రావడం చూసి సురేష్ తను చెప్తున్నది సగంలోనే ఆపేశాడు. వీరు సల్కా బాయికి ఎదురుగా నిల్చుని పుస్పా చెయ్యిని మృదువుగా పట్టుకున్నాడు.
చుట్టూ ఉన్న ఆదివాసీ గిరిజనులు విద్యార్థి విద్యార్థుల చినిగిన బట్టల గురించి మాట్లాడుకుంటూ కనికనిపించని నవ్వుతో గుసగుసలాడుతున్నారు.సల్కా బాయి సూర్తి విషయం విన్నాకా పుస్పాను చదివించాల్సిన అవసరం లేదని అర్థమైంది. మళ్లీ వీరు పుస్పాని తీసుకుని సైకిల్ పై టిఫిన్ అమ్మడానికి వచ్చిన ఓ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి ఇడ్లీలు ఇప్పించాడు. మూడు తిని ఒకటి వదిలేసింది పుస్పా. వీరు మీద కొంచం నమ్మకం కలిగింది. అయినా ఇంకా లోపల భయంగానే ఉంది. బాగా చదువుకున్న వారు బాగా కొడతారని,అది కూడా పచ్చి కట్టెలతో అని ఆమె తన తండా స్కూల్లో విన్నది, చూసింది. మిగిలిన ఒక్క ఇడ్లీ వీరు తిని చెయ్యి కడిగేసుకుని పుస్పా చేతిని కడిగించి న్యూస్పేపర్తో ఆమె చేతి మీది తడిని తుడుస్తుంటే చుట్టూ దగ్గరలో ఏమైనా కట్టెలు ఉన్నాయేమో చూసింది. దగ్గరగా ఏమి కనబడలేదు,కంచెలేసి ఉన్న పూల మొక్కలు రోడ్డుకు అటూ వైపు కనిపించాయి. కట్టెలు దగ్గరలో ఎక్కడ కూడా అందుకునే ఎత్తులో లేనందున గట్టిగా ఊపిరి పీల్చుకుంది.
క్యాంటీన్ దగ్గరి వారు మెల్లిగా తాము కూర్చున్న చెట్టు దగ్గరికి ఒక్కొక్కరిగా వెళ్ళడం చూసి పుస్పా వీరు చేతిని పట్టుకుని త్వరగా నడువు అన్నట్లు బలంగా లాగుతూ నడ్చింది. సురేష్ సల్కా బాయితో మాట్లాడుతూనే ఉన్నాడు. జీవన్ సల్కాను రమ్మని పిలిచాడు.సరే అంటూ ఎవరిదారిన వారు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వీరు తను చాలా కాలం తర్వాత సల్కా బాయి లాంటి పూర్తిగా సాంప్రదాయంగా ఉన్న బంజారా మహిళను చూసిందే లేదు,పుస్పా సోయిలో సల్కాను అంత గమనించలేదు వీరు. వారితో మాట్లాడే అవకాశం ముగిసినందుకు వీరు ముఖంలో దిగులు పట్టుకుంది.మనసులో ఎక్కడో బాధ.చివరి చూపు అన్నట్లు కింద నుండి పై వరకూ ఆనందంతో చూసాడు వీరు.అతడు అలా చూస్తూ వుండగానే ఆమె పుస్పాను తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ తన మనసులో ఇలా అనుకుంది.
“అబ్బాయి బానే మాట్లా మాట్లాడిండు. కానీ చివరిగా అలా చూసిండు.అంటే నాలాంటోల్లు ఇక్కడికి రావద్దేమో” అనుకుంటూ నడిచింది.పుస్పా వీరుని మాటిమాటికీ వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది నడుస్తూ.తమ సమూహంలో కలిసే దాకా వీరు సురేష్ సల్కా బాయి, పుస్పాలను చూస్తూనే ఉన్నారు.
3.
సౌండ్ బాక్స్లో పాటలు మొదలయ్యాయి. ఓ ట్రాలీ ఆటో వచ్చి మైదానంలో ఆగింది. జీవన్ చెట్టుకింద నిల్చున్న వారందరినీ ట్రాలీ ఆటో దగ్గరికి తీసుకెళ్ళాడు.
ఆ ఆటో నుండి ఒక జంట దిగింది.అందరినీ లైన్లో నిలబెట్టి వారిలో యాబై మందిని ఎంపిక చేశారు.వారికి మాత్రమే బట్టలు ఇచ్చారు.గోండు,కోయా,బంజారా ఇలా కొన్ని రకాల వస్త్రాల్ని వారికి ఇచ్చారు.మిగిలిన వారిని ప్రోగ్రాం స్టార్ట్ అయ్యాక ముస్తాబైన వారి వెనక నిలబడమని చెప్పి. ఆ యాబై మందిని తీసుకుని క్యాంపస్ లోపల ఓ హాల్ లోకి తీసుకెళ్ళి మగ ఆడ వారిని వేరు చేసి హాల్లో ఉన్న రెండు గదుల్లోకి పంపారు. అందరూ ముస్తాబై బట్టలు వేసుకుని రూం నుండి బయిటికి హాల్లోకి వచ్చి ఒకరినొకరు చూసుకుని సంతోష పడ్డారు కాని మాట్లాడుకోలేదు.
అందరినీ ఒక దగ్గర నిలబెట్టి తన వైపు చూడమని అరిచాడు తమని అక్కడికి తీసుకుని వచ్చిన వ్యక్తి.అతడి పక్కనే వచ్చి చేరింది వారికి బట్టలు పంచిన మహిళ. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. ఆఫీసర్ రాగానే డాన్స్ చెయ్యాలి. “ఉర్లోలాగ ప్రవర్తించకండి” అంటూ అందరినీ స్తంభం ముందు ఉన్న మైదానంలో నిలబడమని చెప్పారు.
మిగిలిపోయిన వారిని ముస్తాబైన వారి దగ్గరికి రావాల్సిందిగా కోరారు. సల్కా బాయి పుస్పాని తను తిరిగి వచ్చే దాకా అక్కడే కూర్చుని ఉండమని చెప్పి గుంపుతో నడిచి వెళ్ళిపోయింది. అలా వదిలివెళ్ళడం ఒకలాంటి భావనను ఆమె మనసులో రేకెత్తింది.
వెళ్ళిన వారందరినీ లైన్లో నిలబెట్టి కొన్ని నియమనిబంధనలు చెప్పారు. ప్రిన్సిపాల్ ఇతర స్టాఫ్ నిలబడిన వారందరినీ గమనించారు. అటెండర్ స్వీపర్ తాము ఓ ట్రాలీ ఆటోలో తెచ్చిన చిన్న చిన్న డప్పులు ఇతర వాయిద్యాలను ఎంపిక చేసి జాగర్తలు చెప్పి మరీ ఇచ్చారు.
ప్రిన్సిపాల్ మాటిమాటికీ తన చేతిలోని గడియారాన్ని చూస్తున్నాడు.ఇంకా పది అవ్వడానికి ఇంకో ముప్పై ఐదు నిమిషాలు ఉంది.
అందరూ ఎవరికి వారు బొమ్మలా నిల్చుని వచ్చి పోతున్న విద్యార్థులను గమనిస్తున్నారు.సల్కా బాయి నిమిషానికి ఒకసారి పుస్పాని గమనిస్తూనే ఉంది.పుస్పా మాత్రం సల్కా బాయిని తప్పించి అందర్ని చూస్తుంది.ఏదో గుర్తుకు వచ్చినట్లు లేచి సల్కా బాయి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తనకి ఏదైనా కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వమని అడిగింది. సల్కా బాయి ఐదు రూపాయల బిళ్ళను మనవరాలి చేతిలో పెట్టింది. “నాకొక బొక్క గాజు ఇవ్వు అడుకుంటాను” అని అడిగింది. భయంతో సల్కా అటూ ఇటూ చూసి వెంటనే తీసి ఇచ్చింది. ఇస్తూ ఆ చెట్టు కింది నుండి కదలకంటూ చెప్పి పంపింది.
పుస్పా చెట్టు కిందికి చేరేదాక ఆమెలో అలజడి ఆగలేదు.ఎవరైనా వచ్చి తిడతారేమో తన దగ్గరికీ వచ్చిన మనవరాలి విషయం గురించి అని అనుకుంది.ఎవరు పట్టించుకోలేదు.వాతావరణం నిండుగా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ తెగల వారు వారి వేషాల్లో మెరిసిపోతున్నారు.
సౌండ్ బాక్స్లో తయ్యుం తతయ్యుమ్ తయ్యుం తతయ్యుమ్ పాట నడుస్తుంది.సంగీత వాయిద్యాలను కింద భూమిపై పెట్టీ నిల్చుని పాట వింటూ, తమ తలపాగా,తల పైన ఎద్దు కొమ్ముల కిరీటాలు,నెమలి పించపు కిరీటాలను సరిచేసుకున్నారు.
ప్రోగ్రామ్ మొదలు కాక ముందే విద్యార్థి విద్యార్థినులు ఆదివాసీల ఎద్దుకొమ్ముల కిరీటం,నెమలి కిరీటం తలల పై పెట్టుకుని ఫోటోలు దిగుతున్నారు.కొందరు అమ్మాయిలు బంజారా బొక్క గాజులను అడిగి తమ చేతులకు తొడుక్కుని తల పైనుండి అద్దాల ముసుగు వేసుకుని ఫోటోలు దిగి పరవశించిపోతున్నారు.
****
వీరు తన మిత్రుడు కైలాష్ కోసమని యూనివర్సిటీ మైదానం వైపు వస్తూ పుస్పాని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు.ఇద్దరు ముచ్చట్లు మొదలు పెట్టారు. కైలాష్ వీరును వెతుకుతూ వచ్చి
“ఎ వీరు నువ్వు రాసిన వ్యాసం ఈరోజు పత్రికలో ప్రచురితమైంది.ఇదిగో నీకోసం పేపర్ తెచ్చాను” అంటూ వీరుకు ఆ న్యూస్ పేపర్ ఇచ్చి చాయి తాగి వస్తానని క్యాంటీన్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
పుస్పా కైలాష్ కనుమరుగయ్యే దాకా అతడినే చూస్తా ఉంది. వీరు పేపర్ తన చేతికి తగలగానే మౌనంగా ఉండిపోయాడు.కాసేపు పుస్పా వీరును గమనించి తన ఆటలో తను మునిగిపోయింది.చెట్టు పై నుండి రాలుతున్న పూలను బొక్క గాజుకు చుట్టూ పోగు చేస్తా ఉంది. రోడ్డుకు అటూ వైపు ఉన్న పూల మొక్కలకు కంచెలు ఎందుకు ఎసిండ్రు. తండాలో ఎక్కడ ఏ పూల మొక్కకు కంచే లేదే ఎందుకు ఏసిండ్రో ? ఆ ప్రశ్న ఆమెలో గట్టిగా నాటుకుంది.తను తిరిగి ఇంటికి వెళ్లే లోపు అక్కడికి వెళ్లి కంచె రహస్యం ఎంటో తెలుసుకోవాలి అనుకుంది.తను కూర్చున్న చెట్టు పైనుండి రాలుతున్న పూలను ఏరుతూ ఆలోచనలో పడింది.
వీరు న్యూస్ పేపర్ తెరిచే ముందు తనకు, తన కళ్ళకు ఎదురుగా నిలబడి ఉన్న తన ఆదివాసీ గిరిజనులను దుఃఖంతో చూసాడు. క్యాంపస్లో మరణించిన తన సోదరీ సూర్తి పేరునే కలం పేరుగా మార్చుకుని ఎప్పటి నుండో తన అభిప్రాయాలను రాసి పత్రికలకు పంపిస్తుంటే మొత్తం మీద అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా తన వ్యాసం ప్రచురితమైంది.న్యూస్ పేపర్ తెరిచి మొదట తన సోదరి పేరును చూశాడు.కళ్ళలో నీళ్ళు నిండాయి.తర్వాత తన వ్యాస శీర్షిక చూసాడు.తనకు వినబడెట్లు చదివి విన్నాడు. పుస్పా వీరుకి ఏమైంది అన్నట్లు చిత్రంగా చూసింది.
4.
“ఒక్క రోజు గౌరవం, విలువలేరుగని ప్రభుత్వం”
అనే శీర్షికతో ఉంది. ఆ వ్యాసం మద్యలో నర్తిస్తున్న తమ వాళ్లను ప్రభుత్వం ఆడిస్తున్నట్లు ఉంది.తను ఊహించుకున్న బొమ్మ అక్కడ ఉండడం అతనిలో ఉస్తాహాన్ని నింపింది. చిత్రకారుడి పేరు చూసాడు లేదు.తన వ్యాసాన్ని ఆతృతగా చదివేసాడు.అటూ నుండి పాటలు వినబడుతున్న గానీ మళ్ళీ ఇంకో సారి చదవడం మొదలు పెట్టాడు.వ్యాసం ఇలా మొదలైంది.
ప్రభుత్వం, అభివృద్ధి ,విజ్ఞానం ఇవి పదాలే వీటిలో జీవం ఉంటే బాగుండేది. ప్రభుత్వం హక్కులు ఇచ్చాను అంటూనే జీవించే హక్కుకే ఎసరు పెట్టింది. అభివృద్ధి ఆవిష్కరణలను పరిచయం చేస్తూనే కాలి కింది నేలను సీసాలో బంధించేసింది. విజ్ఞానం మెదడును విసృత పరుస్తూ విద్యార్థుల ప్రాణాలను బలికొంటుంది.
ఇలా వ్యాసం సాగుతుండగానే ప్రభుత్వ వాహనాలు దిగాయి.మనసులో ఓ ప్రశ్న ప్రజల కోసం పనిచేసే వారికి ఏ. సి , కారు , బంగ్లాలు అవసరమా ? అవసరమైతే ఎంత వరకు అవసరం ? ఇవన్నీ రాజ్యాంగంలో ఉంటే బాగుండేది. లేకుంటే ఉన్నాయా ? ఏవో ఏవో ప్రశ్నలు అతని మెదడులో సీతాకోకచిలుకల్లా గాల్లోకి తేలుతున్నాయి.
వ్యాసం సగంలోనే ఆగిపోయింది.సౌండ్ బాక్స్లో పాటలు జోరందుకున్నాయి.
“ప్రపంచం కల్పించిన ఒక్క రోజు జీవితం మాది. ఏ రోజైతే మా ఆదివాసీ గిరిజనులు తమ ఆలోచనలను పంచుకొని తమ హక్కులు అభివృద్ధి గురించి ప్రపంచానికీ తమ మాటల్లోనే చెప్పుకోవాల్సిన అవసరం ఉందో ,ఆ రోజును కాస్త ప్రభుత్వం తమకు అనువుగా మార్చుకుంది. స్టేజ్ మీద ఉండాల్సిన వారు స్టేజ్ కింద, స్టేజ్ కింద ఉండాల్సిన వారు స్టేజ్ మీద. పండగలకు మాత్రమే గుర్తుకు వస్తారు ఎంటో” అని వీరు తనలో తను మాట్లాడుకుంటుండగానే,పది పోలీస్ కార్లు పెద్ద పెద్ద హారాన్లతో వచ్చాయి. వాటి మధ్య ఓ తెల్ల కారు. దానిలోంచి నల్ల కోటు వేసుకున్న ఓ వ్యక్తి దిగగానే, పోలీసుల హడావిడి అంతా ఇంతా కాదు.నల్ల కోటు వ్యక్తి స్టేజ్ ఎక్కేసాడు. పోలీసులు పెద్ద పెద్ద తుపాకీలు పట్టుకుని ముస్తాబై నిలబడ్డ వారి చుట్టూ నిలబడిపోయారు. వీరుకు నవ్వొచ్చింది. “రక్షణ ఎవరికో ?” అనుకున్నాడు. స్టేజ్ మీద గెస్ట్ స్పీచ్ మొదలు పెట్టాడు. ఆ స్పీచ్ చుట్టూ కిలోమీటర్ దూరం దాకా వినబడుతుంది.చప్పట్ల మీద చప్పట్లు. ఆ స్పీచ్ ఎప్పుడు ఉండేదే అనుకుని యూనివర్శిటీ పైకి చూసాడు.ఏవో ఛాయలు కనబడ్డాయి.గాలికి ఉపిపోతున్న జెండాలనుకున్నాడు.తడి ఎండిన తన కళ్ళను తడిచేసుకుని తన పక్కనే ఆడుకుంటున్న పుస్పాను నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి లేచి ఓ నాలుగు అడుగులు ముందుకు వేసి పైకి చూసాడు.
యూనివర్శిటీ ముఖ ద్వారానికి పైన మామిడి తోరణంలా విద్యార్థుల దేహాలు వేలాడుతున్నాయి. అటు ముగ్గురు ఇటు ముగ్గురు మద్యలో తన సోదరీ ఉన్నట్లు కనిపించారు. తను ఎప్పుడు వాళ్ల గురించే ఆలోచించడం వల్ల అలా కనిపిస్తున్నారనుకున్నాడు.మళ్ళీ చూసాడు అవి నిజమైన దేహాలు ప్రతి దేహం తన మెడలో తను ఏ కారణం చేత మరణించిందో రాసి ఉంది.
కళ్ళలో కన్నీళ్లు అగలేవు. డప్పుడోలు మోగుతున్నాయి.తన వాళ్ళు ఎప్పుడు డాన్స్ మొదలు పెట్టారో అర్ధంకాలేదు. నర్తిస్తున్న తన వాళ్లందరినీ ఆపమని చెప్పాలనుకున్నాడు. కానీ చుట్టూ ఉన్న బందోబస్తును చూసి ఆగిపోయాడు. “అయ్యో ఇదెక్కడి ఖర్మ తమ పిల్లల చావులకు తాము ఆడి పాడుతున్నారు. అమాయకత్వం ఎంతటి జబ్బో తనకు అర్థమయ్యింది. నర్తిస్తున్న తన వాళ్ళను చూసాడు. మీడియా కూడా బానే కవర్ చేస్తుంది.కానీ ఫోకస్ అంతా గెస్ట్ పైనే ఉంది. మీడియాను తిట్టుకున్నాడు. ఒక్కరోజైనా మా వాళ్ళను టివిలో చూపించండి అనుకున్నాడు.అంతా బాగానే సాగుతుంది.
5.
పుస్పా ఆడుతూ ఆడుతూ చుట్టూ వాతావరణం గమనిస్తుంది. దూరంగా ఓ చెట్టు అడుగున కుక్క ఉచ్చపోయాడం చూసి తను కూర్చున్న చోటు నుండి లేచి నిల్చుంది. పూలతో అలంకరించిన బొక్క గాజును చేతిలోకి తీసుకుని వాసన చూసింది. తను అనుకున్న ఉచ్చ వాసన ఆ బొక్క గాజుకు ఏమి అనిపించకపోవడంతో దానికి అంటిన దుమ్మును దులిపి తన నడుముకు ఉన్న గౌను తాడుతో దానిని కట్టి పక్కకు వేలాడదీసింది.
బొమ్మలా నిలబడ్డ వీరును చూసింది. అతడికి ఎదురుగా ఉన్న చెట్లు,గోడలపై పక్షుల నీడలు అన్ని అతడిలా గడ్డకట్టుకుపోయాయి.
అక్కడ ఉన్న చెట్లు ఆమెకు రెండు రకాలుగా అనిపించాయి. ఒకటి కుక్క ఉచ్చాపోస్తే పుట్టుకొచ్చే పుట్టగొడుగులు,పచ్చని పుట్టగొడుగులు. ఇంకొకటి చీమల పుట్టల్లా ఉన్నాయి.ఆమె ముందు నిల్చున్నాయి.
ఇంకో వైపు తిరిగి చూసింది.తమ వాళ్ళందరూ డాన్సులు చేస్తున్నారు. ఆ గుంపులో సల్కా బాయి కనిపించలేదు.నెమలి పించాల కిరీటాలను చూసి ఆనందంతో అక్కడ దగ్గరలో ఏమైనా పెద్ద రాళ్లు ఉన్నాయేమో చూసింది.ఎక్కడ కనిపించలేవు. ఆ రాళ్ళ మద్యలో లేకుంటే వాటి కింద నెమలి గుడ్లు ఉంటే ఇంటికి తీసుకుని వెళ్దాం అనుకుంది. ఎద్దుకొమ్ముల కిరీటాన్ని చూసింది. తండాలో మాయమైన ఎడ్లు అన్ని అక్కడే తెల్ల బట్టలు వేసుకున్న వారిలో కనిపించాయి.కొమ్ములోక చోట,వాటి దేహాలోక చోట.
ఇంకో వైపు తిరిగింది. యూనివర్సిటీ రోడ్డుకు అవతల ఉన్న పూల మొక్కల పై ఆమె దృష్టి పడింది. వెండిలా మెరుస్తున్న కంచె తీగలను గమనిస్తూ రోడ్డు వైపు నెమ్మదిగా అడుగులేస్తూ గమనిస్తుంది. నల్లగా మెరుస్తున్న రోడ్డు నల్ల పాము కుబుసంలా అనిపిస్తంది. చుట్టూ ఉన్న చెట్లు పక్షులు అడవి తప్పించి ఏమి కనిపించట్లేవు. దూరంగ పొట్లాడుతున్న పందులు.ఇంకో దగ్గర చెట్ల సన్నని కొమ్మల్ని పట్టుకు వేలాడుతున్న కోతులు. ఆమె దృష్టిలో ఆమె అడవి జంతువులు నల్లని పాము కుబుసం మాత్రమే ఉన్నాయి. తండా రోడ్డు మీదికి వెళ్ళినట్లే అనుకుంది. తన గజ్జల చప్పుడు రాకుండా అడుగులు వేస్తూ నడుచుకుంటూ వెళ్ళిన పుస్పాకు ఓ కారు గుద్దింది.”దా……. ద్” అన్న చప్పుడు పూర్తిగా బయిటికి రాలేదు.పైకి ఎగిరిన దేహం కిందికి చేరెలోపే గుండె దడ ఆగిపోయింది.ఆక్సిడెంట్ అవ్వడంతో సౌండ్ బాక్స్లు ఆగిపోయాయి. అందరి దృష్టి రోడ్డు వైపు మళ్ళింది.
అది చూసిన సల్కా “యాడియే” అంటూ బలంగా పరుగెత్తి అక్కడికి చేరుకోవాలని అనుకుని పరుగు తీసింది. జారి పడింది. ఆమె పన్ను విరిగి పై పెదవిలో గుచ్చుకుంది. అయినా పట్టించుకోకుండా అక్కడికి చేరుకోవడానికి కుంటుతూ పరుగులు తీసింది.
అది గమనించిన గెస్ట్ గుండె వేగం పెరిగింది. గొంతు ఎండిపోయింది. అతడిని స్టాఫ్ మరియు పోలీసులు కార్ ఎక్కించి పంపించేశారు.సల్కా బాయి తో పాటూ అందరూ రోడ్డు మీదకు చేరుకున్నారు. మీడియా వాళ్ళు చాలా వరకు గెస్ట్ కార్ వెనకాలే వెళ్ళిపోయారు. దారిన పోయే వారందరూ ఆగి చూస్తు ఉన్నారు. క్యాంపస్ ముందు ఉన్న కార్లు ఒక్కొక్కటిగా వెళ్లిపోయాయి.
ఉన్న మీడియా ఆ వార్తను కవర్ చేస్తూ “లంబాడి గిరిజన బాలిక ఆక్సిడెంట్ కి గురైంది” అంటూ “లంబాడి గిరిజన” అని పదే పదే అంటున్న జర్నలిస్ట్ ని కాసేపు గమనించాడు. అతడి దగ్గరికి వీరు నడిచి వెళ్లి
“గిరిజన దళిత ఇవ్వెనా కులాలు వెరేవి లేవా ఆ ఫలానా కులానికి చెందిన వారివెందుకు మెన్షన్ చెయ్యరు. మంత్రుల సినిమా యాక్టర్ల కులాలు ఎందుకు మెన్షన్ చెయ్యరు” అని అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో తోచక తడబడుతూ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఆ జర్నలిస్ట్.
వీరు కన్నీళ్లు నిండిన కళ్ళతో చుట్టూ చూసాడు.ఇద్దరు పోలీసులు తప్పించి వేరే పోలీసులందరూ వెళ్ళిపోయారు. సల్కా బాయి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంది. ఆమె నోట్లో నుండి రక్తం నిండిన లాలాజలం తీగలు తీగలుగా కారుతుంది. పుస్పా ఎముకలు చాలా వరకు విరిగిపోయాయి. చైనులతో జోడించి ఉన్న తోలుబొమ్మలా పడి ఉంది. పుస్పా దేహంలోని రక్తం ఆమె దేహం చుట్టూ నిండి రక్తం అంచు గడ్డ కట్టుకుపోయింది. ఆ గడ్డ కట్టుకుపోయిన ఎర్రటి అద్దంలో ఆకాశం, దాని కింద పుస్పా కోసం నిల్చున్న కొందరు మనుషుల దిగులు ముఖాలు కనిపిస్తున్నాయి. ఆ ఎర్రటి అద్దంలో అలా చనిపోయిన, చంపెయ్యబడ్డ పిల్లలు ఎందరో కనిపించారు వీరుకి.
ఎర్రగా మెరుస్తున్న బొక్క గాజు అంచు కొంచం విరిగింది. పుస్పా చేతిలోని ఐదు రూపాయిల బిళ్ళ ఎండకి మెరుస్తూ వీరు కళ్ళకు తాకింది. అప్పుడు అతను ఈ మెరుపులన్నా ఈ వ్యవస్థని చిల్చితే బాగుండు అనుకున్న
తన తెగ అయిన బంజారా గురించి రాస్తున్నాడు. 2018లో బల్దేర్ బండి (ఎడ్ల బండి) అనే కవితా ఈ సంకలనాన్ని వెలువరించాడు. ప్రస్తుతం ఆ పుస్తకంలోని జారేర్ బాటి (జొన్న రొట్టెలు) కవిత SR&BGNR GOVT DEGREE ART’S AND SCIENCE COLLEGE , ఖమ్మంలో పాఠ్యాంశంగా ఉంది. కవిత్వమే కాకుండా కథలు కూడా రాస్తున్నాడు.