నారిసారించిన నవల-16
తెన్నేటి హేమలత
-కాత్యాయనీ విద్మహే
‘లత’ గా తెలుగు నవలా సాహిత్యచరిత్రలో ప్రసిద్ధురాలైన తెన్నేటి హేమలత వందకు పైగా నవలలు వ్రాసింది. విజయవాడలో నిభానపూడి విశాలాక్షీ నారాయణరావు దంపతులకు 1935 లో పుట్టింది లత. ఆమె పూర్తిపేరు జానకీరామ కృష్ణవేణి హేమలత. అయిదవతరగతితో బడిచదువు ఆగి పోయింది. ఇంటిదగ్గరే సంస్కృతం, తెలుగు ఇంగ్లీష్ సాహిత్యాలు చదువుకున్నది. తెలుగు సాహి త్యంలో లబ్ధ ప్రతిష్టులైన వారు ఎందరో ఇంటికి వచ్చిపోతుండే వాతావరణంలో తండ్రితో పాటు కూర్చుని వాళ్ళను వింటూ గడిపిన కాలం ఆమెలో సాహిత్యాభిరుచిని అభివృద్ధి పరిచింది. ఏ గురు ముఖతః సంగీతం నేర్చుకొన్నదో తెలియదు కానీ చెప్పుకోదగిన సంగీతజ్ఞానం అబ్బింది. ఆకాశ వాణి ఉద్యోగ కాలంలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణతో ఏర్పడిన స్నేహం దానికి మరింత దోహదం చేసింది.ఆయన కట్టిన బాణీలకు పాటలు కూడా వ్రాసింది లత. తొమ్మిదేళ్ల వయసులో అంటే 1944 లో ఆమెకు తెన్నేటి అచ్యుతరావుతోవివాహం జరిగింది. అప్పటినుండి ఆమె తెన్నేటి హేమలత.
పద్దెనిమిదేళ్ల వయసులో(1952) నాటికి రేడియో ఉద్యోగిగా వృత్తి జీవితం ప్రారంభిస్తూనే రేడియో నటి, నాటక రచయిత కూడా అయింది లత. ( ఎబి ఆనంద్ ఇంటర్వ్యూ యు ట్యూబ్ ). దాదాపు అదే సమయంలో నవలా రచనను ప్రారంభించింది. 1982 లో నిడదవోలు మాలతికి ఉత్తరం వ్రాసేనాటికి ఆమె వ్రాసిన నవలలు వంద. 1997 లో మరణించేనాటికి ఆపదిహేనేళ్లలో లత మరిన్ని నవలలు వ్రాసి ఉంటుంది కదా ఆమె అంటుంది, కథారచయితా , సాహిత్య విమర్శకురాలు అయిన నిడదవోలు మాలతి. (Eminent scholars and othar esseys in Telugu literature 2012 e – book edition 2011) శతాధిక నవలారచయిత అయినప్పటికీ లత నవలలు అన్నీ ఇప్పుడు లభించటం లేదు. 35 వరకు నవలల పేర్లు తెలుస్తున్నాయి. 20 వరకు నవలలు అందుబాటులో ఉన్నాయి. నవలారచయిత్రిగా లత సాహిత్య దృక్పథాన్నిఅర్ధం చేసుకొనటానికి తగినంత మూల వనరు ఈ నవలలు.
1
50 వ దశకపు లత తొలి నవలలు ‘గాలిపడగలూ నీటి బుడగలూ ’, ‘రక్తపంకం’ ఈ రెండు నవలలు గురించి సాధికార సమాచారం ఇస్తున్న పుస్తకాలు రెండు. ఒకటి Eminent scholars and othar esseys in Telugu literature.రెండవదిTelugu women writers, 1950- 75 A critical study,2012 e -book edition 2011) రెండింటికి రచయిత నిడదవోలు మాలతి ( archves. org) విజయవాడ కేంద్రంగా వేశ్యావ్యవస్థలో స్త్రీల బాధామయ జీవితాలను చిత్రించిన నవలలు గాలిపడగలూ – నీటిబుడగలూ, రక్తపంకం. 1950ల తొలిభాగంలోనే విజయవాడ నగరం ఎలా విస్తరించిందో, అందులో ప్రతి వీధిమూలా వేశ్యాగృహాలు వెలసి విచ్చలవిడిగా స్త్రీశరీర విక్రయం జరగటం ఎలా భాగంగా ఉందో గుర్తించగలిగింది లత. ఆసక్తితో, సానుభూతితో వాళ్ళ జీవితాలను పరిశీలించి సాధికార సమాచారంతో లత వ్రాసిన నవలలు ఇవి.
గాలిపడగలూ – నీటిబుడగలూ నవల 1953 లో ప్రచురించబడింది. ఈ నవల ఇప్పుడు లభించకపోయినా నిడదవోలు మాలతి ఇంగ్లీష్ లోకి చేసిన అనువాదం(2002) అందుబాటులో ( thulika. net) వుంది. రాజమ్మ అనే స్త్రీ, సోడాలు అమ్ముకొనే ఆమె భర్త కలిసి నడుపుతున్న వేశ్యాగృహం కథాస్థలం. తల్లీ తండ్రి లేని తొమ్మిది మంది అనాధ బాలికలను చేరదీసి కూతుళ్లు, చెల్లెలి కూతుళ్లు, మేనగోడళ్లు అని చెప్పుకొంటూ వాళ్ళ శరీరాలు పెట్టుబడిగా రాజమ్మ, ఆమె భర్త కలిసి చేస్తున్న వ్యాపారంలో స్త్రీల జీవితాలు ఎంత హింసకు గురిఅవుతున్నాయో, పదేళ్లలో రోగాల పుట్టలై, వీధి బిచ్చగాళ్ళయి వాళ్లెలా నశించిపోతారో నిరూపించటమే ఈనవల ఇతివృత్తం. వారిలో సీత అనసూయ లను రాజమ్మ గృహం నుండి మద్రాసుకు ప్రయాణం చేయించి కథా స్థలాన్ని మద్రాసుకు మార్చి సినిమారంగం నేపధ్యంగా తరువాతి కథను నడిపించింది. సావిత్రి, సుమిత్ర, సీత,అనసూయ, జెన్నీ, అన్నపూర్ణ పేర్లు ఏమైనా కావచ్చు వాళ్ళు వేశ్యలుగా కొత్త అవతారాలు ఎత్తటానికి కుటుంబంలోనే కారణాలను గుర్తించి చూపింది లత. దగ్గర బంధువుల వల్ల తెలిసీతెలియని వయసులోనే అత్యాచారాలకు గురికావటం, వయోతారతమ్య వివాహాలు, ఫలితంగా అనుక్షణం భర్తల వల్ల అనుమానాలకు, అవమానాలకు గురికావటం వంటివి పరిణామం లో స్త్రీలను కుటుంబం బయటకు నెట్టి మరింత వంచనకు గురయ్యే పరిస్థితులను సృష్టించి అంతిమ గమ్యం వేశ్యాగృహం అయ్యేట్లు చేస్తున్నాయని వాళ్ళవాళ్ళ జీవిత కథనాల ద్వారా సూచించింది.
పవిత్రతను, పాతివ్రత్యాన్ని కాంక్షించే పురుషులే వేశ్యాగృహ పోషకులు కావటంలోని వైరుధ్యాన్నిలత ఎత్తిచూపింది. స్త్రీల ఆకలి అవసరాలు తీరటానికి పురుషుల వికృత లైంగిక ఆకలిని తీర్చటమే అనివార్యమైన మార్గంగా చేసిన సామాజిక దుర్మార్గం అర్ధమవుతుంటుంది ఈనవల చదువుతుంటే. విజయవాడ, మద్రాసు నగరాలు ఏవైనా ప్రపంచం మొత్తంలో ఏ భాగంలోనైనా మగవాళ్ల దృష్టి ఒక్కటేనని ఆ వేశ్యా స్త్రీలు అనుకొనటంలో, అనటంలో అనేకమంది పురుషులను దగ్గరగా చూసిన అనుభవమే కారణం అనుకోవచ్చు. కవులు, కళాకారులు, ఉన్నతోద్యోగులు, వ్యాపారవేత్తలు ఎవరైనా పైకి కనబడే వాళ్ళ మర్యాదకర సామాజిక జీవితానికి వేశ్యా స్త్రీలతో వాళ్ళ సంబంధాలకు మధ్య ఉన్న లోయను లత సునిశితంగా చూపింది. సినిమారంగంలో అవకాశలకోసం మద్రాసు చేరిన స్త్రీలు చిన్న చిన్న వేషాలు వేసే వాళ్ళు అనేకులు సమాంతరంగా శరీరాన్ని అమ్ముకొంటే తప్ప బతుకు గడవని పరిస్థితిలో ఉండటం కూడా లత దృష్టిని దాటిపోలేదు. నేరాన్ని నియంత్రించవలసిన, అరికట్టవలసిన పోలీసు వ్యవస్థ వేశ్యా వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలబడుతున్న విషయాన్ని, నేరంలో భాగస్వామ్యం వహిస్తున్నతీరును కూడా లత ఈనవలలో నమోదు చేసింది. ఈ గడచిన డెబ్బై, డెబ్భరెండు ఏళ్లలో రాజ్యం యొక్కఈ నేర స్వభావం మరింత తీవ్రమైందే తప్ప ఏమాత్రం తగ్గక పోవటం విషాదకరం.
వేశ్యా వ్యవస్థలో నలిగి విసిగి వీధిలోకి విసిరివేయబడిన స్త్రీల రక్షణ, పోషణ బాధ్యతలను తీసుకొని, వాళ్లకు గౌరవకరమైన జీవితాన్ని చూపించటానికి ఒక ఆశ్రమాన్ని పంతులు అనే ఆయన నిర్వహిస్తున్నట్లు, పార్వతి ఆ ఆశ్రమ నిర్వహణకు ధనం సమకూర్చటానికే సినిమాలలో నటించటానికి మద్రాసు చేరుకొన్నట్లు ఇతివృత్తంలో భాగంగా చిత్రించింది లత. అయితే ఇలాంటి ఆశ్రమాల నిర్వహణ ఎక్కువకాలం కొనసాగదని, ఒకళ్ళకో, ఇద్దరికో సంస్కరణ భావాలు ఉన్నంత మాత్రాన సమాజం మంచికి మారటం కష్టమన్న అభిప్రాయం కూడా లత వ్యక్తపరిచింది. వేశ్యలకు పెళ్లిళ్లు చేసి గౌరవకర జీవితం కల్పించటం అంత సులువు కాదని ఆమె అభిప్రాయం. సంస్కరణ ప్రయోజనాలను అందిపుచ్చుకొనాలనుకొనే స్వార్ధపరులైన ఆషాడభూతుల గురించి కన్యాశుల్కము నాటకంలో గిరీశాన్ని పాత్రగా చేసి గురజాడ చేసిన హెచ్చరికను అందిపుచ్చుకొన్నట్లుగా లత ఈ నవలలో ఒక సంస్కరణ వివాహాన్ని చేయించి అది స్త్రీకి నిత్య హింసగా మారి మళ్ళీ ఆమెను వీధులలో పడేసిన తీరును చిత్రించింది. ఈ అన్నిటి గురించి పార్వతికి వ్రాయాలని ఉంటుంది కానీ వ్రాయలేదు . మాధవీదేవి అనే రచయిత్రి పాత్రను ప్రవేశపెట్టి కథా గమనంలో ఆమె పార్వతిని కలుసుకొనే సందర్భాన్నికల్పించి పార్వతి కోరికమీద వాళ్ళజీవితానుభవాలను నవలగా వ్రాసినట్లు, ఆనవల పేరు గాలిపడగలూ – నీటిబుడగలో అని చెప్తూ ఈనవలను ముగించింది లత .
మధ్యతరగతి పాఠక ప్రక్రియ అయిన నవలను అధోజగత్తు మనుషులగురించి , ఇంకా చెప్పాలంటే కుటుంబానికి అవతల నేరస్థులుగా నిలబెట్టబడిన వేశ్యల పక్షాన వేశ్యల గురించి ఒక ఎగువ మధ్యతరగతి మహిళ వ్రాయటం పంథొమ్మిదివందల యాభయ్యవ దశకపు సాహిత్య ప్రపంచంలో ఒక సంచలనమే. అందువల్లనే అది ఒక స్త్రీ వ్రాయవలసిన నవలేనా అన్న విమర్శకు గురి అయింది. ఈ నవల కుప్రిన్ వ్రాసిన ‘యమా ది పిట్’ నవలను గుర్తుచేస్తుంది. లత ఈ నవలలో రచయితపేరుగానీ, రచనపేరుగానీ ప్రస్తావించకుండానే వేశ్యాజీవితాలను చిత్రించిన రష్యన్ నవలగా పేర్కొన్నది కుప్రిన్ రచనే అయి ఉండాలి. అలాగే వేశ్యా గృహం కేంద్రంగా దానికి పోలీసు న్యాయవ్యవస్థలతో వుండే సంబంధాలను విస్తృత స్థాయిలో ఇతివృత్తంలో భాగంచేసి రావిశాస్త్రి వ్రాసిన నవల రత్తాలు – రాంబాబు వచ్చింది ఆతరువాత రెండు దశాబ్దాలకు అని కూడా మనం గుర్తుంచుకోవాలి.
రక్తపంకం ప్రధమ ముద్రణ వుంది కానీ అందులో ప్రచురణ సంవత్సరం పేర్కొనబడలేదు. ప్రతుల సంఖ్య (1500 ) పేర్కొనబడింది. ‘ఈ నవలకి నాంది’ అనే శీర్షికతో వ్రాసిన ఉపోద్ఘాతం లో లత జులై నెల ఉదయం పదిగంటల వానలో పోస్ట్ మాన్ వచ్చి తనకు ఒక రిజిస్టర్ పార్సిల్ ఇచ్చి వెళ్లాడని, అందులో ఒక స్త్రీ తాలూకా జీవితానుభవాల కథనంతో కూడిన ఒక కాగితాల కట్ట, చనిపోతూ తన స్నేహితురాలు కోరిన ప్రకారం వాటిని లతకు పంపుతూ మరొక స్త్రీ వ్రాసిన లేఖ ఉన్నాయని చెబుతుంది. ఆ లేఖను బట్టి చనిపోయిన స్త్రీ , ఉత్తరం వ్రాసిన స్త్రీ ఇద్దరూ స్నేహితులే కాదు, లత సాహిత్యాభిమానులు కూడా అని, గాలిపడగలూ నీటి బుడగలు చదివి ఆడదాని వ్యధను స్త్రీ కనుకనే అలా చిత్రించగలిగింది అని గ్రహించగలిగిన సంస్కారులు అని, లత ఫొటోకు ఫ్రేము కట్టి పొగడపూల మాలవేసేంత ఆరాధన వాళ్లకు ఉన్నదని తెలుస్తుంది.
అందువల్లనే మరణించిన స్త్రీ తన జీవితానుభవాలను స్నేహితురాలచేత వ్రాయించి వాటి ఆధారంగా లత నవల వ్రాయాలని ఆకాంక్షించింది. ‘ఎందరెందరి అస్తికలు ఈ యమకూపంలో నిండి ఉన్నాయో , ఎందరెందరి రక్తంతో ఆర్యావర్తం పంకం అయిందో చెప్పటం నావిధి’ అనినమ్మి లత అట్లా తనకు పోస్టులో వచ్చిన స్త్రీ జీవితానుభాలు ఆధారంగా వ్రాసిన నవల’ రక్తపంకం’ ‘ గతమంతా తడిసెనురక్తముతో/ కాకుంటే కన్నీళులతో/ అన్న శ్రీశ్రీ పంక్తుల( మహాప్రస్థానం) ప్రభావం, స్ఫూర్తి రచయితగా తానుఏదివ్రాయాలో నిర్ధారించు కొనటం లో లతకు ప్రేరణ అనుకోవచ్చు. ఈ నాందీలో లత ఆ ఉత్తరం చదివేసరికి గాలిపడగలూ నీటిబుడగలూ వ్రాసినప్పుడు తిన్న తిట్లన్నీ యీ ఉత్తరంతో తీరిపోయినట్లు అనిపించిందని అంటుంది. అంటే గాలిపడగలూ నీటిబుడగలూ రేపిన దుమారం అప్పటికి ఇంకా పచ్చిగానే ఉన్నట్లు. అందువలన ఆ నవలకు కొనసాగింపుగా వచ్చిన ఈనవల 1950 వదశకం చివర వచ్చి ఉండటానికి వీలుంది. ఈ నవలను ఆమె ‘ పవనం లోంచి పవిత్రతను ప్రసాదించే ప్రభువు శ్రీవేంకటేశ్వరునకు కన్నీళ్లతో అంకితం’ ఇచ్చింది.
“ దేశచరిత్రని మానవ చరిత్రలోంచి విడదీసి అందులోంచి హిందూ సమాజాన్ని తుంచితే – ఆడదాని అస్వతంత్రత – ఆడదాని ఆర్ధిక మాంద్యం – ఆడదాని పాతివ్రత్యం – ఆడదాని పతనం – అన్నీ కలిసి రక్త పంకం కింద తయారయి – స్వఛ్ఛత మీదా – సత్యం మీద పవిత్రత మీదా మచ్చల్ని ఏర్పరుస్తున్నాయ్ – ఈ మచ్చల్ని చూసి ఏ సమాజమైనా సిగ్గుపడుతుంటే – హిందూ సమాజం దీనికి నీతిని కాపాడటం అని పేరు వుంచి తన ధర్మ పరాయణత్వానికి తనే గర్వపడుతున్నది.” ఇవి వేశ్యగా మారిన ఒక స్త్రీ జీవితానుభవ సారాన్ని వ్యక్తీకరించే మాటలు. ప్రేమించగలిగిన హృదయం, అనుభవించగలిగిన ఆరోగ్యవంతమైన శరీరం, ఆలోచించే మెదడు ఉన్న స్త్రీ తన కథను ప్రారంభించటానికి తెర ఎత్తటం వంటి మాటలు ఇవి. నవలలో తరువాతి కథ అంతా ఈ మాటల నుండి విస్తరించినదే. కృష్ణా జిల్లా కవుతరం దగ్గర చిక్కాల అనే పల్లెటూరులో మొదలై కాపురానికి వెళ్లిన మూడునెలలకే భర్త చనిపోయి, బావగారు తనమీద అత్యాచారం చేయబోతే తప్పించుకొని చద్దామని చెరువులో దూకగా రక్షించి తీసుకువెళ్లిన యువకుడు రాజమహేంద్రవరంలో పెట్టి తనలో కోరికలు రెచ్చగొట్టి అనుభవించి తల్లి కాబోతున్నదని తెలిసి ఒక అనాధ శరణాలయంలో చేర్పించి చేతులు దులుపుకొంటే ప్రసవించిన మరుక్షణం బిడ్డను దూరంచేసి మరొక శరణాలయానికి పంపిస్తే ఏమీ అనలేక , అక్కడ స్త్రీలను వ్యభిచారులను చేస్తున్న దుర్మార్గాన్ని సహిస్తూ అక్కడ ఉండలేక రిషివాలీ దగ్గర ఒక ఆధ్యాత్మిక ఆశ్రమానికి చేరి, ఆధ్యాత్మికత ముసుగులో అక్కడ స్వాముల శృంగార విలాసాల గురించి తెలిసి వెగటు కలిగి అక్కడి నుండి మరొక స్త్రీతో కలిసి పారిపోయి హైద్రాబాదు చేరి వేశ్య గా బతికి అనామకంగా మరణించిన స్త్రీ కథ ఇది. ఆ స్త్రీ పేరు రాజ్యం.
ఈ నవలకి నాందీ లోనే లత చనిపోయేనాటికి ఆమె వయసు నలభై అని చెప్పి ఇరవై అయిదు సంవత్సరాలనాడు ఆమె కథ ప్రారంభమయింది అంటుంది. 1955 తరువాత ఈనవల వచ్చిందనుకొంటే అక్కడినుండి ఇరవైఐదేళ్ళ వెనకకు వెళ్ళాలి.అంటే కథ 1930లలో రాజ్యం పదునాలుగు పదిహేనేళ్ల వయసులో ఉండగా మొదలైంది. పెళ్ళితోటే ఆ కథ మొదలైంది.పెళ్లినాటికి రాజ్యానికి14 ఏళ్ళు అని నవలలో చెప్పబడింది కూడా. భర్త తో సుఖసంసారం మూడునెలలు. అతని మరణానంతరం మూడేళ్లు అత్తగారింట్లో ఏకాకి జీవితం. ఆతరువాత రాజమండ్రిలో రాజశేఖరంతో గడిపిన కాలం నాలుగైదు నెలలు. మూడు నెలల కడుపు ఆరునెలలతరువాత ప్రసవం. అంటే ఏడాది దాటింది. అనాధ శరణాలయంలో గడిపిన కాలం ఎనిమిది నెలలు. స్వాములవారి ఆశ్రమంలో దాదాపు ఒకఏడాది తరువాత హైదరాబాద్. అంటే మొత్తం మీద కథ మొదలైన ఐదారేళ్ళకు1937 నాటికి ఆమె హైదరాబాద్ చేరిందనుకోవచ్చు.అక్కడ వేశ్యావృత్తిలో గడిపిన జీవితంలో ‘చాలా సంవత్సరాలు మామూలుగానే దొర్లిపోయాయి’ . అవెన్నో చెప్పలేము కానీ హైదరాబాద్ లో కలరా వ్యాపించటం గురించిన ప్రస్తావన ఉంది . 1904 నుండి 1948 వరకు కలరా గత్తర హైదరాబాద్ ను గడగడలాడించిన సందర్భాలు ఎన్నోఉన్నాయని చరిత్ర చెప్తున్నది. రాజ్యం హైదరాబాద్ కు వచ్చిన చాలాసంవత్సరాల తరువాత సంభవించిన విపత్తుగా పేర్కొనబడటాన్నిబట్టి 1945 – 1948 లమధ్యకాలపు విపత్తు అయి వుండాలి ఇది. ఆతరువాత కూడా జీవించి నలభయి ఏళ్ల వయసులో మరణించిన రాజ్యం కథ1955 వరకు కొనసాగే అవకాశం ఉంది.ఆరకంగా పాతికేళ్లకాలం మీద ఒకస్త్రీ జీవితంలో శారీరక వాంఛలకు, పాతివ్రత్యభావనకు మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణ, లొంగుబాటు, తిరుగుబాటు ఈనవలలో చిత్రితమయ్యాయి.
ఈ నవలలో కూడా లత స్త్రీ వేశ్య కావటానికి కారణాన్ని కుటుంబంలోనే చూసింది, చూపింది. పదిహేనేళ్లకు భర్త చనిపోయిన స్త్రీని ఆమెకీ శరీరంఉంటుంది, అనుభవాన్నికోరుతుంది అన్నవిషయాన్నేవిస్మరించి తెల్లచీరలతో, ఒంటి పూట భోజనాలతో జీతంలేని పనిమనిషిగా జీవితమంతా గడపమని శాసించే కులం , కుటుంబం , చాటుగా ఆమెను వేటాడి అనుభవించటానికి సిద్ధంగా ఉండే కుటుంబంలోని మగవాళ్ల వికృతులు , స్త్రీకి ఆరోగ్యకరమైన లైంగిక అనుభవాన్ని అభావం చేస్తాయి . వీటిపై తిరుగుబాటు చేసి బయటకు వస్తే పతిత గా నింద మోస్తూ నికృష్ట పరిస్థితులలో జీవితం వేళ్ళ దీయాల్సి ఉంటుంది .ఈ జీవిత సత్యాన్ని కథాక్రమంలో పాత్రల ఆలోచనలుగానో, అభిప్రాయాలుగానో , వ్యాఖ్యలుగానో భాగం చేసి నిరూపించింది లత.
లైంగిక వాంఛల సహజ పరితృప్తికి పెళ్లి ద్వారా ఒక ఆమోదయోగ్యమైన వ్యవస్థను ఏర్పరచుకొన్న తరువాత కూడా వాటిని నియంత్రించ చూచే కుటుంబవ్యవస్థ స్వభావాన్ని రాజ్యం అనుభవాల ముఖంగా చర్చకు పెట్టింది లత. రాజ్యానికి సుందరంతో పెళ్లి అయింది. వాళ్ళ కాపురం మొదలైంది అతనికి పద్దెనిమిదేళ్లు. ఆమెకు పదిహేను. భర్తకు భార్యపట్ల అభిమానం, ఆకర్షణ , మొహం. అతనివల్ల స్త్రీత్వం మేలుకొన్న భార్య ఆమె. అయితే భర్తతో నవవధువు పగలు మాట్లాడకూడదు. అత్త, ఆడబిడ్డ, తోడికోడళ్ల నిఘా మధ్య కొత్తదంపతులు పగటిపూట కలుసుకొనడం సాధ్యమే కాదు. రాత్రిళ్ళు భోజనాలు అయి అందరూ నిద్రపొయ్యారని నిర్ధారించుకొని అప్పుడు కొత్తకోడలు గదిలోకి వెళ్లాల్సిన సంప్రదాయ అలవాట్ల మధ్య కొత్త దంపతులకు ఊపిరి ఆడదు . నిషేధింపబడినదానిని రహస్యంగా పొందటానికి మార్గాలు వెతుక్కొనేట్లు చేస్తుంది.రాజ్యం చెరువు నీళ్లకు వెళ్ళినప్పుడు మామిడి తోటల్లోనో , చెరుకు తోటల్లోనో కలుసుకొనే ఏర్పాటు చేసేవాడు భర్త. ఆలాంటి ఒకసందర్భంలో తల్లి వాళ్ళను చూసింది. తల్లిని చూడగానే పారవశ్యంతో తన ఒళ్ళోతలపెట్టుకొని భార్య పడుకొని ఉన్నదన్న స్పృహకూడా కోల్పోయి లేచినిలబడ్డాడు. ‘పాడుదేశం భార్యనే రహస్యంగా కలుసుకోవాలి’ అని విసుక్కునే సుందరం ‘సిగ్గులేనిదానివి’ అని తన తల్లి భార్యను తిడుతుంటే అందులో తన బాధ్యత గురించి ఒక్కమాట అయినా అనకుండా , భార్యను పలకరించి ఓదార్చనైనా ఓదార్చక నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయినాడంటే కుటుంబం నిర్వచించిన లైంగిక నీతి ముందు పురుషుడు కూడా ఎంతనిస్సహాయుడో అర్ధం అవుతుంది.
ఈ లైంగిక నీతి ద్వంద్వ విలువలతో ఉండటం మరొక విషయం. పట్టపగలు ఇలా తోటల్లో కలుసుకొనటానికి సిగ్గులేదా నీకు అని ఆమె కొడుకును నిలదీయలేదు. సిగ్గుమాలిన పని చేసిన దరిద్రపు మొహం లోకానికి ఎట్లా చూపిస్తావు అని అనలేదు. కోడలిని నిలదీసింది. తప్పంతా కోడలి మీదే మోపింది. కొడుకు మామూలుగానే ఇంట్లో తిరుగుతుంటే కోడలు దోషిగా ముఖం చాటు చేసుకొని తిరగాల్సి వచ్చింది. ఆ తరువాత వారానికి జ్వరం వచ్చి కొడుకు మరణిస్తే కోడలి సిగ్గుమాలినతనమే అందుకు కారణమని అత్త తీర్పు ఇయ్యటం గమనించవచ్చు. కుటుంబ లైంగిక నీతి సూత్రాలను ఖచ్చితంగా అనుసరించి అమలు చేసే బాధ్యత స్త్రీదిగా చేయబడిన క్రమంలో కుటుంబ పరువుకు జవాబుదారీగా బాధ్యతతో ప్రవర్తించకపోతే శిక్ష అనుభవించవలసినది స్త్రీయే అవుతుంది. అది ఈ నాటికీ పరువు హత్యల రూపంలో కొనసాగుతూనే ఉంది.
హిందూ బాల వితంతువు గా రాజ్యం ఆహారంలో , ఆహార్యంలో , వ్యవహారంలో ఎదుర్కొన్న వివక్ష భర్త జ్ఞాపకాలతో పాటు శరీర అనుభవాలు కూడా గుర్తుకువస్తూ పడిన అంతరంగిక హింసకు హద్దు లేదు. ఒంటరితనాన్ని భరించలేక , యవ్వన ప్రవాహాన్ని నిరోధించలేక, భర్త జ్ఞాపకాలనుండి విడివడలేక , నిరంతర అవమానాలను సహించలేక లోలోపల పడిన వేదనకు అంతులేదు. స్నానా నికి చెరువుకు వెళితే వెంటాడే కరణంగారి పెద్దకొడుకు చూపుల నుండి తట్టుకొనటానికి ఇంట్లో దాక్కుంటే ,ఇంట్లో బావగారి రహస్య వేటకు బలి కాకూడదు అనుకొనేసరికి వీధిన పడాల్సి వచ్చింది. ఈ మొత్తం క్రమంలో పాతివ్రత్యాన్ని నిలుపుకొనటానికి మనశ్శరీరాలతో ఆమె చేసిన పోరాటాన్ని చూపించటంలో లత దృష్టి కోణం కనబడుతుంది. శరీరం క్షణభంగురమైనది. శారీరక వాంఛలు తుచ్చమైనవి. స్త్రీకి శీలం చాలా ముఖ్యం. పాతివ్రత్యం ఆదర్శం. ఈ రకమైన భావప్రచారంలో తయారైన బుద్ధికి, ప్రకృతి సహజమైన శారీరక సంచలనాలకు మధ్య లంగరు అందక ఎంతమంది స్త్రీలు తమను తాము హింసించుకొంటున్నారో , ఎంత నలిగి పోతున్నారో, అలసి పోతున్నారో రాజ్యం స్థితి చిత్రణ ద్వారా సూచించగలిగింది లత.
ఈ ఒత్తిడుల మధ్య రాజశేఖరంతో సంబంధం శరీరానికి సుఖకరంగానే ఉన్నా తాను పతితను అన్న బరువు ఆమె బుద్ధిని లాగుతూనే ఉన్నది. తాను గర్భవతి అని తెలిసాక రాజశేఖరం అనాధ స్త్రీల శరణాలయంలో తనను చేర్చినప్పటి నుండి రిషీవాలీ ఆశ్రమం మీదుగా హైదరాబాద్ చేరేవరకు ఆమె పతనం కాకుండా , పథ హీనురాలు కాకుండా ఉండటానికి అనుక్షణం ఆంతరంగిక బాహ్య యుద్ధాలు అనేకం చేయటం గమనించవచ్చు. ఇంత సంఘర్షణ తరువాత, తిరుగుబాట్ల తరువాత నిస్సహాయమూ, అనివార్యమూ అయిన పరిస్థితులలో రాజ్యం వేశ్యావృత్తిలోకి దిగినట్లు చూపటం ద్వారా ‘స్త్రీలు వేశ్యలుగా పుట్టరు, వేశ్యలుగా తయారుచేయబడతారు’ అని చెప్పదలచు కున్నది లత. అనాధ శరణాలయాలు అయినా ఆధ్యాత్మిక ఆశ్రమాలు అయినా స్త్రీల శరీరాలను సభ్య సమాజపు వికృత పురుష వాంఛలకు వినిమయ కేంద్రాలుగా మార్చిన సంగతిని లత ఆనాడే గుర్తించింది. గడచిన ఈ అరవై డెబ్బై ఏళ్లలో అవి స్త్రీ ల శరీరంతో వ్యాపారం చేసే కేంద్రాలుగా విస్తరించిన సంగతికి ఎన్నో ఉదంతాలు ఉదాహరణలుగా ఉన్నాయి.
రిషీవాలీ ఆశ్రమం నుండి పారిపోవాలనుకున్నపుడు ఆశ్రయం , ఆహరం ఎలా లభిస్తాయి అని చింత పడుతున్న రాజ్యం “ ఈ దేశంలో ఆడది ఇంకా అర్ధాన్నమై పోయిందెంచేత? వాళ్లకి చదువులేదు, వాళ్ళకాళ్ళమీద వాళ్ళు నిలబడగల గౌరవనీయమైన వృత్తిలేదు. చేస్తే అంట్లు తోముకొని బతకాలి. లేదా శరీరాన్నమ్ముకొని బ్రతకాలి.” అని బాధపడుతుంది. ఒక సారి ఇంటి గడప దాటిన స్త్రీ వెనక్కు తిరిగి సమాజంలోకి వెళ్లలేనప్పుడు, అమ్ముకొనటానికి శరీరం తప్ప నాదంటూ ఏమీ లేక వ్యభిచార గృహాలలోకి పోవటంకన్నా గత్యంతరం లేని ఆడదాని బ్రతుకు విషాదం అది.ఆకలి ఖరీదు ఆడదాని మానం ఖరీదుకన్నా ఎక్కువగా ఉన్నంతవరకూ ఈ అవస్థ తప్పదు అని సుగుణ చేసిన తీర్మానం గమనించదగినది.
లత హైదరాబాద్ మేందీ బజారును వర్ణిస్తూ ‘మానవత్వం తాలూకు మురికినంతటినీ ఈ డ్రయినేజీ స్పాంజిలా పీల్చుకుంటున్నది’ అంటుంది. ‘ప్రపంచ పాపాలకు అది చెత్తకుండీ’ అంటుంది. నరస మాటగా ‘కొందరు ఆడవాళ్లు ఈ పని చెయ్యకపోతే అందరాడవాళ్ళు పవిత్రంగా ఉండలేరం’టుంది. ‘వ్యభిచారం వివాహానికి పెట్టని కోట’ అంటుంది మరొక చోట. ఈ మొత్తంలో సభ్య సమాజం, మర్యాదాకరమైన కుటుంబం యొక్క సాపేక్షతలోనే వేశ్యావ్యవస్థ స్వభావాన్ని నిర్ధారించటం చూస్తాం. ఆ రకంగా లత వేశ్యా వ్యవస్థలో స్త్రీల జీవిత దౌర్భాగ్యాల గురించి ఎంత వేదన పడిందో ఇంత దుర్మార్గమైన వ్యవస్థను సృష్టించుకున్న సభ్య సమాజపు దౌర్బల్యాల గురించి, మత కుల కుటుంబ సంప్రదాయ నీతుల అమానవీయత గురించి అంతగానూ క్రోధాన్ని కనబరిచింది. వేశ్యా వ్యవస్థను సంస్కరణ పరిమితులనుండి కాకా ఆర్ధిక రాజకీయ కోణం నుండి వస్తువుగా చేసుకొనటం వలన రక్తపంకం మంచి నవల అయింది.
వేశ్యా వ్యవస్థ ఎలా నిర్మూలనం అవుతుంది అన్న ప్రశ్న కూడా ఈ నవలలో ఉంది. న్యాయ నిర్ణేతలు, సమాజ నిర్మాతలూ ఇంకా ఇతర విధాలైన మేధావంతులూ ఈ వ్యభిచార నరకంలోకి రావటం మానేసి దీని స్వరూపాన్ని విచ్ఛిన్నం చేయాలి అంటుంది రాజ్యం తో చివరివరకూ ఉన్న సుగుణ. రాజ్యం దగ్గరకు వచ్చే రచయిత మిత్రుడు రహస్య బహిరంగ వ్యభిచార గృహాల నిషేధం, అనాధ శరణాలయాల, స్త్రీల శరణాలయాల రద్దు, వృత్తిని వదిలేసిన స్త్రీలకు జీవనోపాధి కల్పన, పిల్లలు లేని వితంతువులకు మళ్ళీ పెళ్లి , స్త్రీపురుషులకు సమాన ఆర్ధిక స్వాతంత్య్రం, ఆరోగ్యంగా ఉన్నవాళ్లందరికీ వివాహం, వాటిలో కులభేదాలు కట్నం గొడవలు లేకుండా ఉండటం, పద్దెనిమిది ఏళ్లకు ముందు ఆడది, ఇరవై ఐదేళ్లకు ముందు మగవాడు సెక్స్ కు అలవాటు పడకూడదన్న సంస్కారం కలిగించటం మొదలైన సంస్కరణలద్వారా వేశ్యవ్యవస్థను నిర్మూలించ వచ్చు నంటాడు. ఇదంతా లత కన్న కల . ఇది అమలయ్యే బంగారు కాలం ఎప్పటికయినా వస్తుందా అన్న సందేహం ఆమెకు లేకపోలేదు. పెళ్లి , స్త్రీపురుషుల సంబంధాలు, మాతృత్వం మొదలైన అనేక విషయాలను సమాంతరంగా చర్చించిన బుద్ధి ప్రధానమైన నవల రక్తపంకం.
ఇక మిగిలిన లతా నవలలను సాంఘికాలు , పౌరాణికాలు అని వర్గీకరించి పరిశీలించవచ్చు.
*****
( ఇంకా ఉంది )
డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.