నా జీవన యానంలో- రెండవభాగం- 18

ఏ గూటి సిలక – కథానేపధ్యం

-కె.వరలక్ష్మి

సరిగా గమనించగలిగితే జీవితాల్లోని కదిలించే సంఘటనలన్నీ కథలే.

మా అత్తగారికి కొడుకు తర్వాత ఐదుగురు కూతుళ్ళు, అంటే నాకు అయిదుగురు ఆడపడచులు. అందులో పెద్దమ్మాయి భర్త ఇంజనీరు కావడంతో ఆమె జీవితం ఆర్థికంగా బావుండేది. మిగతా నలుగురివీ అంతంతమాత్రపు ఆర్థిక స్థితులు. దాంతో ఆవిడ చాలా అతిశయంతో డామినేటింగ్ పెర్సన్ గా వుండేది. కాని, ఆమెకు పిల్లలు కలగలేదు. అప్పటికి మెడికల్ ఫీల్డ్ ఇంతగా డెవలప్ కాలేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి మా చిన్నమ్మాయిని పెంపకానికి ఇమ్మని వాళ్ళ అన్నయ్యని అడిగిందట. ఆయన సరేనని తనని ఇంటికి పిలిచేసారు. కన్నబిడ్డను ఇంకొకరికి ఇచ్చెయ్యడం అనే ఊహనే నేను భరించలేక ఏడుస్తూ కూర్చున్నాను. ఆవిడ పదిహేను రోజులు నా దగ్గర వుండిపోయి ప్రయత్నించినా ఉత్తచేతుల్తోనే పంపించాను. తర్వాత రోజుల్లో మా నాలుగో ఆడపడుచుని రెండోకాన్పుకి తీసుకొచ్చినప్పుడు ఆ పాపాయిని తన దగ్గర వుంచేసుకుంది. క్లారిటీ లేక వాళ్ళు ఇద్దరు పిల్లలు చాలనుకుని వేసెక్టమీ చేయించేసుకున్నారు. వీళ్ళు పిల్లను ఇవ్వమని నిష్కర్షగా అడగలేక, అలాగని వదిలి వుండలేక నలిగిపోయేవాళ్ళు. అటు పెద్దావిడ పాపాయిమీద పెంచుకున్న మమకారం వల్ల వీళ్ళు చూడ్డానికి వెళ్తే భరించలేకపోయేది. పాపాయి వీళ్ళకెక్కడ దగ్గరైపోతుందోనని భయపడిపోయి వాళ్ళని రావద్దని చెప్పేది. అలా గొడవలు మొదలై నాలుగేళ్ళు పెంచిన పాపాయిని కన్నవాళ్ళు తెచ్చేసుకున్నారు. ‘పిల్లల మీది మమకారాలు మనుషుల్ని ఎలా బొమ్మల్ని చేసి ఆడిస్తాయోకదా!’ అనిపించింది నాకు.

అప్పటికి  పెద్దావిడ వాళ్ళు వి.టి.పి.ఎస్ క్వార్టర్స్ లో వుండేవాళ్ళు. పాపాయి తల్లివాళ్ళు రాజమండ్రిలోని ఒక స్లమ్ ఏరియాలో వుండేవాళ్ళు. ఆ స్లమ్ ఏరియానే బేక్ గ్రౌండుగా తీసుకుని, దానికి అనుగుణంగా పాత్రల్ని కూర్చి రాయడం జరిగింది.

ఏ గూటి సిలక

ఆ పూరి గుడిసెల మధ్య ఎప్పటిలాగే తెల్లారింది.

ప్రకృతి ప్రసాదించిన వెలుగు రేఖలతో బాటు పరిసరాల దుర్గంధం కూడా నిస్పక్షపాతంగా ఆ గుడిసెల్లోకి ప్రసరిస్తోంది.

ఆ గుడిసెలకి అవతల కొంత దూరంలో ప్రవహిస్తున్న మురికి కాలవ చీకట్లో ఆడవాళ్ళకీ, వెలుతుర్లో మగవాళ్ళకి బహిః ప్రదేశంగా ఉపయోగపడుతోంది. నిరంతరం ఝమ్మని ఆ కాలువ నంటిపెట్టుకుని వుండే ఈగలు, దోమల్లాగే ఆ గుడిసెల్లో పిల్లలు కూడా మురికి ఓడుతూ వుంటారు.

అక్కడ చావుపుట్టుకలకి ఒక్కలాగే సంబరాలు జరుగుతాయి. పుడితే నవ్వుల మధ్య, చస్తే ఏడుపులు మధ్య కల్లుకుండలు ఖాళీ అవుతాయి. కోడిపుంజుల తలలు తెగుతై, ఆస్తి తగాదాలు అంతస్తుల తేడాలు లేవక్కడ. అయినా, ఏ రోజు ఏదో ఒకచోట గొడవ జరుగుతూనే వుంటుంది. ఆవేశంతో ఒళ్ళు మరిచిపోయి బతుకుల్లోని రహస్యాలన్నీ బట్టబయలు చేసేసుకుంటారు. అంతలోనే అన్నీ మరిచిపోయి అవసరానికి కలిసిపోతారు.

తమ బతుకుల్లోని చీకటిని గురించి ఆలోచించడానికి కూడా టైం లేనంత బిజీ మనుషులు వాళ్ళు. ఎంత బిజీ మనుషులో అంత లేజీగానూ గడిపేయగలరు వాళ్ళలో కొందరు.

మొగుడు రెక్కలు ముక్కలు చేసుకుని తెచ్చింది సినిమాలకి, షోకులకి క్షణాల్లో ఆర్పేసే ఆడంగులున్నారు వాళ్ళలో –

పెళ్ళాం వూపిరంతా ధారపోసి వూడిగం చేసి తెచ్చింది. తన్ని లాక్కుని తాగి తగలేసే ప్రబుద్ధులున్నారు వాళ్ళలో. ఇద్దరూ సంపాదించినా అధిక సంతానం కావడంతో సగం పొట్టలైనా నింపుకోలేని నిస్సహాయులూ వున్నారు వాళ్ళలో.

అన్నిటికీ అతీతంగా ఆ గుడిసెలకి రాణిలా వెలిగిపోతోంది మణెమ్మ ఒక్కతే. .

మణెమ్మ మొగుడు సూరీడు మంచి మనిషి. ఎంత మంచి మనిషంటే. తన పనేమో, తానేమో తప్ప ఎవరి జోలికీ పోడు, సంపాదించి తెచ్చిన డబ్బులు పెళ్ళాం చేతిలో పోస్తాడు. పెళ్ళాం చేసిపెడితే తప్ప బయట చిరుతిళ్ళేవీ తినడు. తాగుడులాంటి పెద్ద అలవాట్లు కాదుకదా, చుట్ట, బీడీలాంటి చిన్న అలవాట్లు కూడా లేవు. నోట్లో వేలు పెట్టినా కొరకలేని మెత్తని మనిషతను. మొగుడి మెత్తదనం వల్లో, పరిసరాల ప్రభావం వల్లో మణెమ్మకి నోరు పెద్దది.

అందరి కష్టాల్లోనూ తృణపణమో సాయం చేసి ఆదుకునే మణెమ్మ మంచి పేరుతో బాటు, నోటి దురుసుతనంతో ఎదుటివాళ్ళని ఎంత మాటైనా అనేసి చెడ్డ పేరు కూడా తెచ్చుకుంది. వెనక ఎవరేమనుకున్నా ఆవిడ ఎదుట మాత్రం నోరెత్తడానికి ఆ వాడకట్టులోని ఎవరికీ దమ్ముల్లేవు.

రోజూ తలనిండా పూలెట్టుకుని సింగారించుకుంటుందని, మొగుడితో కలిసి వారానికో సినిమా చూస్తుందని, నెలకో కొత్తకోక కొనుక్కుంటుందనీ ఆడవాళ్ళందరికీ ఆవిడంటే కడుపుమంట.

మొదట్లో ‘వాళ్ళే పుడతార్లే తొందరేంటి? ఆలీసెంగా పిల్లలు పుడితే ఈలోగా బతుకులో అందాలన్నీ అనబగించెయ్యొచ్చు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుట్టకపోడు’ అనుకుంటూ నిర్లక్ష్యం చేసిన మణెమ్మకి అనుమానం ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగిపోయింది.

అప్పుడు మొదలైంది ఆవిడ చెట్లకీ పుట్లకీ మొక్కడం, మందులూ మాకులూ మింగడం. ఎవరో చెపితే చివరికి చిన్నాపరేషను కూడా చేయించుకుంది. ఊహూ. ఫలితం మాత్రం సున్నా. సూరీడులోనూ ఏ లోపం లేదన్నారు డాక్టర్లు. ఇంకేం చెయ్యాలో తోచక సమయం దొరికినప్పుడల్లా పుట్టని పిల్లల్ని తలుచుకుని కుమిలిపోవడం మొదలు పెట్టింది మణెమ్మ. ఫలితంగా దుక్కలాంటి మనిషి చిక్కి సగమయ్యింది.

తల్లో పూలెట్టుకోవడం మానేసింది. వారానికో సినిమాకి, నెలకో కొత్త కోకకి తిలోదకాలిచ్చేసింది. ఏదో దిగులు ఎల్లప్పుడూ ఆవిడ ముఖంలో తాండవిస్తోంది. ఇదంతా భరించలేకపోయాడు సూరీడు. భార్యని సాధ్యమైనంత వరకూ ఊరడించాలని ప్రయత్నించాడు. ‘నీకు నేను, నాకు నువ్వు పిల్లలం’ అన్నాడు.

‘ఎదవ పిల్లలున్నోళ్ళకేం సుకం? మంది సూడు రాజా బతుకు’ అన్నాడు. పిల్లలున్నోళ్ళంతా ఎందుకొచ్చిన పిల్లలురా దేవుడా అని ఏడుస్తున్నారన్నాడు. వెయ్యి చెప్పాడు, లక్ష చెప్పాడు, మణెమ్మ మనసు మాత్రం మార్చలేకపోయాడు.

ఇంకా ఈ మధ్య సూరీడుని చూస్తే చాలు పూనకం వచ్చిన దానిలా అయిపోతోంది. తోక తొక్కిన తాచులా లేచి నోటికొచ్చినట్లు తిట్టేస్తోంది.

ఏదో ఒక చంటి పిల్లని తెచ్చి పెళ్ళాం ఒంట్లో వెయ్యడం తప్ప మరేం చెయ్యలేననుకున్నాడు సూరీడు.

అందుకే, చెప్పాపెట్టకుండా ప్రయాణమైపోయి పక్క వూళ్ళో వున్న సీతిని వెంటబెట్టుకొచ్చాడు. సీతి – మణెమ్మ చెల్లెలు. రెండేళ్ళ సీతి కొడుకుని చంకనెత్తుకుని, నిండు గర్భంతో వున్న సీతిని వెంటబెట్టుకొచ్చిన మొగుణ్ణి అర్ధం కానట్టు ప్రశ్నార్థకంగా చూసింది మణెమ్మ.

”సీతి ఇక్కడే నీళ్ళాడుతుంది” ఎటో చూస్తూ అనేసి బైటికి అదేపోక పోయాడు సూరీడు.

వచ్చిన నాలుగు రోజులకే నొప్పులు మొదలై పండంటి ఆడపిల్లను కన్నది సీతి.

ఆ పిల్ల భూమ్మీద పడ్డమే మొదలు మణెమ్మ కళ్ళకి వెలుగులొచ్చాయి. మంత్రసాని బొడ్డుకొయ్యడమే తరవాయి పిల్లనందుకుని నీళ్ళతో శుభ్రంగా తనే కడిగింది. మెత్తని పొడిబట్టతో తడి ఒత్తింది. ఆ చిన్ని మాంసపు ముద్దలాంటి పసికందు మణెమ్మ మనసులో ఏవో మూలల్ని కదిపి కుదిపింది. దాని చిన్ననోరు, బుల్లి కళ్ళు, మెత్తని అరచేతులు పదే పదే ముట్టుకుని పరవశించిపోయింది మణెమ్మ. బావ సూరీడు ముందే చెప్పి తీసుకురావడంతో పిల్లకి పాలియ్యడం తప్ప ఇక దాన్నేమీ పట్టించుకోవడం మానేసింది సీతి. పెద్ద కుర్రాడే తన కన్నవాడు, ఈ పిల్ల తనకే మీ కాదన్నట్టు ప్రవర్తించేది. అది ఆకలికి ఏడుస్తున్నా సరే, మణెమ్మ వచ్చి ఎత్తుకుని తన పొత్తిళ్ళలో వేస్తే తప్ప గమనించనట్టే వుండిపోయేది.

తల్లికి మంచి తిండి, పిల్లకి పొట్టనిండా పాలు, మణెమ్మ మనస్ఫూర్తిగా చేసే పాలన పొషణలో పిల్ల నెల్లాళ్ళకే బంతిలా, పూలచెండ్లు తయారైంది. ఇప్పుడు మణెమ్మ మనసులో వ్యధంతా మంత్రం వేసినట్లు మాయమైంది ఆ పసిదాని తోడిదే మణెమ్మ లోకం.

మణెమ్మ ఇప్పుడెవ్వరినీ విసుక్కోదు. సూరీడుని కోప్పడదు. ఎప్పుడూ నవ్వుతూనే వుంటుంది. ఆ నవ్వుల వెలుగుల్ని నలుగురికీ పంచుతోంది.

ఇప్పుడావిడకి సినిమాలు, చీరలు గుర్తె రావడం లేదు. వారానికోరోజు బజారు కెళ్ళి పిల్లకి రంగురంగుల గౌన్లు, బూరలు కొనుక్కొస్తుంది. డబ్బంతా తగలేస్తున్నారెందుకని సీతి కోప్పడుతుంది. “నీకేం తెలీదు పో, ఇది నా బంగారు తల్లి” అని ముద్దులాడుతుంది మణెమ్మ పసిదాన్ని.

మూడో నెల రాగానే సీతి మొగుడొచ్చాడు భార్యని వెంటబెట్టుకెళ్ళాలని. పిల్లని చూస్తూ “అచ్చం పెద్దమ్మనాగే వుంది” అన్నాడు. మణెమ్మ సంతోషించింది.

“సీతిని తీసుకెల్తా” అన్నాడతను.

మణెమ్మ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి, పిల్లదాన్ని తీసుకెళ్ళిపోతారేమోనని, అదిలేని తన బతుకెంత శూన్యమో గుర్తుకొచ్చి వణికిపోయింది.

“అప్పుడే ఏం తొందర? అయిదో నెల్లో పంపిత్తాలే” అంది.

“ఏం తొందరా? అక్కడ ముసిల్దానికి నాకూ వండుకోలేక పేనం సాలొచ్చేత్తంది. సూసుకునే ఓపికుంటే పిల్లదాన్నుంచేసుకో” అన్నాడు సీతి మొగుడు.

మణెమ్మ ఆనందానికి హద్దులు లేకపోయాయి. మరోసారి తర్కిస్తే ఎక్కడ తిరిగిపోతాడోనని ఆ మాటే ఖాయం చేసుకుంది. మర్నాడే గుడిసెల వాళ్ళందర్నీ పిలిచి భోజనాలు పెట్టింది. పిల్లని ఉయ్యాల తొట్టిలో పెట్టి సిరిదేవి (శ్రీదేవి) అని నామకరణం చేసింది. కూర్చున్న చోట కూర్చోకుండా, నిల్చున్న చోట నిల్చోకుండా తిరిగింది మణెమ్మ ఆ రోజంతా. ఇంత సంతోషం తన జీవితంలో ఎప్పుడూ అనుభవానికి రాలేదనుకుంది. పసిదాన్ని పదే పదే ముద్దుల్లో ముంచెత్తింది. తన దిష్ట తగులుతుందేమోనని గుప్పెడు మిరపకాయలు దిష్టి తీసి పోసింది.

సీతికి బంతిపువ్వు రంగు చెమ్కీ చీర, చంద్రయ్యకి పంచె చొక్కా తెప్పించి ఇచ్చింది. ఖర్చులకుంచమని వందరూపాయలిచ్చింది. కూడా వెళ్ళి, దగ్గరుండి బస్సెక్కించి వచ్చింది.

తను అనుకున్నది సాధించిన సూరీడు ఆరోజు గుండెల మీద చెయ్యేసుకుని నిశ్చింతగా నిద్రపోయాడు.

మణెమ్మ నవ్వుతూ గలగలా తిరిగితేనే ఆ ఇంటికి అందం, సూరీడుకి ఆనందం.

మానవ మాత్రుడు అనుకున్నట్టు రోజులు గడిస్తే ఇక చెప్పుకోవాల్సిందే లేదు. తానొకటి తలిస్తే విధి మరొకటి తలచడమే సాధారణం.

సిరిదేవిని వదిలేసి వెళ్ళిన సీతి మరో మూడునెలలోనే గర్భవతి అయ్యింది. అయిదోనెల గర్భంతో వుండగా చంద్రయ్య వెంట తాపీ పనికెళ్ళిన సీతి గోడకూలి ఎత్తుమీదనుంచి కిందపడిపోయింది. పదిరోజులు హాస్పిటల్లో పడకెయ్యవలసి వచ్చింది.

కబురు తెలిసిన మణెమ్మ కూతురుతో సహా వెళ్ళి ఆ పదిరోజులూ దగ్గరుండి సీతిని జాగ్రత్తగా చూసుకుంది. హాస్పిటలుకైన ఖర్చులన్నీ తనే పెట్టుకుంది.

ఇంటికి పంపిస్తూ డాక్టరమ్మ చెప్పిన కబురు ఇద్దరి గుండెల్లోనూ ఇనుపగుండై పేలింది. సీతికి గర్భవిచ్చిత్తికావడంతో సరిపోలేదు, ఇక పిల్లలు పుట్టరు.

పసిదాన్ని గట్టిగా గుండెలకి హత్తుకుని రక్తం ఇంకిపోయిన ముఖంతో చూస్తున్న మణెమ్మ భుజాన్ని ఆప్యాయంగా స్పృశించిది. సీతి “అప్పా! నా కొక్కడే బిడ్డ, నీకొక్కతే కూతురు” అంది. ఆ మాటకి తేరుకున్న మణెమ్మ నవ్వి చెల్లెలి చెక్కిళ్ళు ముద్దాడింది. చంకనున్న సిరిదేవి ఏడుపు మొదలు పెట్టింది.

“ఇదింతేనే, నేనెవ్వరితో మాట్లాడకూడదు. ఎవ్వర్నీ ఇష్టంగా సూడకూడదు. ఎందాకా ఎందుకు, మీ బావకి తలకి నూనెడుతుంటే ఎంత కోపమో దీనికి. చంకలోంచి జారిపోయి, నేలమీద పడి దొర్లి ఏడుస్తాది” అంది మణెమ్మ కూతుర్ని ముద్దాడుతూ.

సీతి కళ్ళల్లో నీళ్ళూరాయి.

పెద్దమ్మ దగ్గరిది దొరబిడ్డలా పెరుగుతూంది. తన మొగుడు చంద్రయ్య తాగుబోతు మేళం. ఉన్న ఒక్క బొట్టిడికి ఒంటినిండా గుడ్డ, కడుపు నిండా తిండి సూడడు. పోన్లే, దేవుడిలాగ ఒకందుకు మేలే సేసేడు అనుకుంది కళ్ళెత్తుకుంటూ.

ఆ రాత్రి చంద్రయ్య “ఒదినా! పిల్లదాన్నింకా మాకాడ ఒగీసుకుంటాం. మాకు మాత్రం ఆడబొట్టి ఒద్దేటి?” అన్నాడు.

అప్పుడే నోట్లో పెట్టుకున్న అన్నం ముద్ద గొంతుక్కడ్డం పడి కొరకబోయింది మణెమ్మకి. కుక్కి మంచంలో పడుకున్న సీతి చటుక్కున లేచి కూర్చుంది. “ఏం, మాటకి నీతీ జాతీ నేదేటి? ఇచ్చేసిన పిల్లని ఏవని ఒగీసుకుంటావయా? అదప్పకాడ రాజానాగ పెరుగుతాంది. నువ్వూ నేనూ పెంచేత్తావేంటి?” అంటూ విరుచుకుపడింది.

“ఆ… ఆ, నా బిడ్డ నాకు బరువేటి? గంజినీళ్ళు పెంచుకుంటానేటనుకున్నావో” అన్నాడు చంద్రయ్య.

“అంతే, నీ పెంపకంలో గెంజినీళ్ళు తాగి బతకాల్సిందే అగొ చూడు. బొట్టిణ్ణి పెంచుతున్నావు కదా” అంది సీతి.

“ఒదినీ, ఉన్నమాట సెప్తున్నాను, నా కూతురు నచ్మీతల్లి. అది పుట్టగానే మా మేస్త్రి నాకు రెండు రూపాయల జీతం పెంచేసినాడు. దాన్ని నీకిచ్చేసిన కాణ్ణుంచి సానా ఇబ్బందైపోతంది” అన్నాడు చంద్రయ్య.

“అది నీ ఇంట్లో పుట్టిందా నీకదురుష్టం పట్టెయ్యడానికి, ఉప్పుడా అదురుష్టం పోడానికీను?”

“అదేటిది, ఎక్కడ పుడితేనేవే ఎర్రిమొకవా? అది నా కూతురుకాదేటి?” ఈలోగా మణెమ్మ లేచి చెయ్యి కడుక్కుని సంచిలోంచి యాభై రూపాయలు తీసి చెంద్రయ్యకందించింది.

చెంద్రయ్య ముఖం వెలిగిపోయింది “నాన్టెప్పలే, నా కూతురు నచ్మీ తల్లి, దాని పేరెత్తితే డబ్బులు వరంనాగా కురిసేత్తాయి” అంటూ బైటికి పోయాడు.

“సిగ్గులేనోడు, సిగ్గులేనోడనీ..”

చెంద్రయ్య వెళ్ళిన వైపు చూస్తూ తిట్టుకుంది. సీతి. “నువ్విలాగ నేర్పించినావంటే ఇంకంతేనోలప్పా. ఆడసలే గుడినీ, గుళ్ళో లింగాన్ని మింగేటోడు” అంది.

నిద్రపోతున్న చంటి పిల్లని ఆర్తిగా గుండెలకి హత్తుకుని మాటలురాని మూగజీవే అయ్యింది మణెమ్మ.

ఆ సమయంలో బస్సుల్లేక కానీ, తక్షణం తన ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడుంటే ఏదో కుట్ర చేసి తన బంగారు తల్లిని లాక్కునేలా వున్నారు అనుకుంది.

ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా… అని కళ్ళల్లో వత్తులేసుకుని కూర్చుండి పోయింది. కోడికూత వినపడగానే లేచి చంటిదాన్ని చంకలేసుకుని బస్సుస్టాండు వైపు నడిచింది. నిద్రపోతున్న చెల్లెలికి కూడా చెప్పాలనిపించలేదామెకి.

ఆవాడ కట్టులో మణెమ్మ మహారాణి, మణెమ్మ కూతురు యువరాణి. ముట్టుకుంటే మాసిపోయే రబ్బరు బొమ్మలా వుంటుంది సిరిదేవి. దానికిప్పుడిప్పుడే అడుగుతీసి అడుగెయ్యడం వస్తోంది.

సిరిదేవి నెమ్మదిగా గుమ్మం దిగి వాకిట్లో కూర్చుని ఆడుతూ వుంటుంది. దారినపోయే అందరి కళ్ళూ దాని మీదే దిష్టి తగిలి పిల్ల చిక్కిపోతుందేమోనని మణెమ్మ భయం అక్కడికీ దాన్ని గుమ్మం దిగకుండా చెయ్యాలని శతావిధాల ప్రయత్నించింది. కానీ, దానికిష్టమైన పని చెయ్యనివ్వకపోతే తిక్క పేచీ మొదలెడుతుంది.

అందుకే వాకిలంతా పేడతో అలికి, రాళ్ళు రప్పలు లేకుండా గచ్చులా తయారుచేసింది.

ఎప్పట్లాగే ఆ రోజు సాయంత్రం సంధ్యవేళ ముఖం మీద రూపాయంత చాదు బొట్టుతో, ముక్కు చివర నల్లచుక్కతో, కళ్ళనిండా కాటుకతో చుట్టూ బొమ్మలో వాకిట్లో కూర్చుని ఆడుకుంటుంది. సిరిదేవి. గుమ్మంలో పొయ్యి ముందు కూర్చుని అన్నం వండుతున్న మణెమ్మ మాటిమాటికీ ఆ పిల్లని చూసుకుని మురిసిపోతూంది. దాని ప్రతి కదిలికా ఆమెకెంతో మురిపెంగా వుంది.

అదుగో.. మళ్ళీ.. అప్పుడొచ్చాడు చంద్రయ్య.

వస్తూనే పిల్లనెత్తుకుని చంకనేసుకున్నాడు.

చూరు కింద నుంచి వంగి చూసిన మణెమ్మ మనసు గిలగిలలాడింది.

దూరం నుంచి ఆనందించవలసిందేకానీ, ఆ వాడకట్టులో ఎవరికీ సిరిదేవిని ముట్టుకునే హక్కులేదు.

“వదినే బాగున్నారా?” అన్నాడు చంద్రయ్య పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ, పిల్లని పైకి ఎగరేసి పట్టుకున్నాడు. వార్చబోయిన అన్నం గిన్నె నేలమీద ఎత్తేసి పరుగెత్తింది మణెమ్మ.

”ఏంటి సెంద్రయ్యా, సంటిదానితో మోటుయవ్వారాలు?” అంది పిల్లని లాక్కుని గుండెలకి హత్తుకుంటూ.

“ఓలమ్మో, అంతలోనే బెగిలెత్తిపోతున్నావేటొదినే, ఎంత గారాబాలైనా మరీ అంతిదికూడదు” అన్నాడు చంద్రయ్య.

పిల్లని చంకనెత్తుకునే చుట్టంతో సహా అందరికీ మళ్ళీ బియ్యం పడేసింది పొయ్యిమీద.

‘ఏం పని మీద వచ్చినా?” అడిగింది మణెమ్మ.

చెవిలోంచి బీడీ ముక్క తీసి పొయ్యిలోని నిప్పుతో అంటించుకుని తీరిగ్గా ఒక దమ్ములాగి చెప్పాడు చెంద్రయ్య. “ఏ చెణంలో పడిపోనాదో నీ చెల్లెలు. ఆయాల్టినుంచీ దానికి మందుల్లేని రోజు లేదు. కూలీనాలీ పనికి రావన్నాడు డాట్టరు. ఇంకో పక్క ఆ ముసిల్దాయొకతి, ఆ పల్లెటూళ్ళో పనుల్లేక, ఉన్నరోజు ఒక్క సీతి సంపాదనతో సంసారాన్నీడ్వలేక సచ్చిపోతున్నాననుకో వదినే”

ఆ మాటే సూరీడు వచ్చాక మళ్ళీ చెప్పాడు.

“అయితే ఏటంటా వింతకీ?” అన్నాడు సూరీడు.

“ఏటుంది, ఇక్కడైతే రోజువారీ ఏదో పనిసేసుకోవచ్చు, మీ పంచనే ఇంత ఉడకేసుకుతింటాం.” అన్నాడు జాలిగా. “కన్న రుణానికి ఈ గుంటని కల్లతోనైనా సూసుకుందావని ఆస” అన్నాడు చివరగా తన కూతురు వాళ్ళదగ్గరున్న విషయాన్ని గుర్తుచేస్తూ. ఆ మాట వాళ్ళ మీద బాగా పనిచేస్తుందని తెలుసు చంద్రయ్యకి.

సూరీడుకి మొదటిసారిగా అనిపించింది. ‘తానీ విషయంలో పొరపాటు చేసానా’ అని ఆ పెంచేదేదో ఎవరూ లేని ఏ అనాధ పిల్లనో పెంచుకోవాల్సింది అని కూడా అనుకున్నాడు.

మౌనం అంగీకారంగా తీసుకున్న చంద్రయ్య, మూడోరోజుకల్లా కుటుంబంతో తరలి వచ్చాడు.

వచ్చిన పదిరోజులు ఏం బుద్దిగా వున్నాడో చంద్రయ్య, ఆ తర్వాత అంతా మాములే.

సాధారణంగా కూలికెళ్ళకుండా కుక్కి మంచంలో ముసుగెట్టుకుని పడుకుంటాడు. వెళ్ళిన రోజు కూలి డబ్బులన్నీ కల్లుపాకకి సమర్పించేసి వస్తాడు. తరచుగా మణెమ్మని, సూరీడుని డబ్బులడిగి తీసుకుంటాడు. అలా తీసుకునేటప్పుడతని ధోరణి అదేదో తన జన్మహక్కు అన్నట్లుంటుంది.

అదనంగా వచ్చిపడిన కుటుంబ భారాన్ని మోయలేక సూరీడు అప్పులు చేయాల్సివస్తోంది. అది ఎన్నాళ్ళో సాధ్యం కాక మణెమ్మ కూడా కూలీనాలీ చెయ్యడానికి సిద్ధపడింది.

మణెమ్మ ఇప్పుడు మహారాణికాదు.

పెంచిన మమకారం అనే ‘కీ’ నడిపిస్తున్న బొమ్మ.

కష్టసుఖాల్లో ప్రమేయం లేని కాలం మరో ఏడాది ముందుకు సాగిపోయింది.

మణెమ్మ కూతురు సిరిదేవికిప్పుడు రెండేళ్ళు. ఇప్పుడు దాని పోషణలో తేడా ఎంతగా వచ్చిందో చెప్పెయ్యచ్చు. మణెమ్మ సాయంత్రం పనిలోంచి వచ్చేవరకూ అది మురికి కాలువల్లో యధేచ్చగా ఆడుకుంటుంది. దాని తిండికి ఇప్పుడొక టైమంటూ లేదు. చెంద్రయ్య, సీతి, ముసిల్ది అందరితోనూ తలా ఒక ముద్ద తినిపిస్తుంటారు. చంద్రయ్య అప్పుడప్పుడు ఆ పిల్లని రోడ్డుమీదికి ఎత్తుకుని పోయి బిళ్ళలు, జీడీలు కొనిపెడుతుంటాడు. ఆ రోజంతా ఈగలు దాని ఒంటిమీద ఝుమ్మని మూగుతుంటాయి. అవన్నీ చాలవని ఆ పిల్లకూడా ఆడుతూ ఆడుతూ మట్టి బాగా తింటూ వుంటుంది. ఇప్పుడిప్పుడు దానికి బాన పొట్ట, పుట్టల్లాంటి చేతులు, కాళ్ళు తయారవుతున్నాయి.

ఆ పిల్ల ఇప్పుడు చెంద్రయ్యకి బాగా చేరికైంది. సీతిని అమ్మ అని, చంద్రయ్యని నాన్న అని అంటూంది. మణెమ్మని చూసినా మీదికి ఉరకడం మానేసింది. మణెమ్మ రాగానే ముందు దాని ఒళ్ళు రుద్ది నీళ్ళు పోస్తుంది. అది కంటకం దానికి.

ఇదంతా మణెమ్మకి కడుపుకోతగా తయారైంది. భరించడం ఇక సాధ్యం అనిపించలేదు.

ఆ రోజిక అమీ తుమీ తేల్చెయ్యాలనుకుంది.

పనిలోకి వెళ్ళబోతున్న సూరీడుని చెయ్యిపట్టి ఆపేసింది.

వాకిట్లో కుక్కి మంచంలో చిరిగిన దుప్పటి కప్పుకుని పడుకున్న చంద్రయ్య దుప్పటి కంతలోంచి బీడీపొగ గుప్పుగుప్పున వదుల్తున్నాడు. ఆ మంచం పక్కనే నేలమీద కూర్చుని సీతి కొడుకుతో ఆడుతోంది సిరిదేవి.

చెంద్రయ్య కప్పుకున్న దుప్పటి లాగి దూరంగా విసిరికొట్టింది. మణెమ్మ. అనుకోని ఉధ్రుతానికి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు చెంద్రయ్య. ఆశ్చర్యపోతూ లేచి కూర్చున్నాడు.

“ఎన్నాల్లిట్టా?” గట్టిగానే అడిగింది మణెమ్మ.

“ఎట్టా?” అన్నాడు చంద్రయ్య కాస్త సర్దుకుని.

“అదే, సెట్టంత మగోడివి, దున్నపోతులాగున్నోడివి ఇట్టా కూకుని తింటం ఎన్నాల్లని?”

వ్యంగ్యంగా నవ్వేడు చంద్రయ్య. “ఏం, బాధగా వుందా వదినే? ఒకరి సొమ్ముకి మనం అనిపించేటప్పుడు తిరిగి ఏదో ఇదంగా రునం తీర్చుకోవడం సబువేనా కాదా?”

“అంటే?”

“అర్ధంకాపోటానికేటుందిందులో. ఉప్పుడు కొత్తగా నేను ఇప్పిసెప్పాల్సింది ఏదీలేదు” అన్నాడు నిర్లక్ష్యంగా చంద్రయ్య.

“పోనీ ఇంతకావాలని అడగరా సెంద్రిగా, నానిత్తాను. అదట్టుకుని పిల్లనొగ్గేసి ఎలిపోండి” అన్నాడు సూరీడు.

“ఓరొల్లకోరా అన్నా! గొడ్డల్లకేం దెలుత్తా దేహ బిడ్డల సారాయం” మణెమ్మ కోపం నషాళానికంటింది.

“ఓరొరేయ్, ఓరి సెంద్రిగా! తచ్చణం ఇక్కణ్ణించి పొండిరా. నా గుమ్మంలో మరొక్క చౌణం వున్నారంటే నరికి పోగులేట్టీగల్ను” అంది మండిపడుతూ.

“నా పిల్లనిచ్చి, నానెల్లిపోతాను”

పిల్లనివ్వడానికెలాగూ ఒప్పుకోరని పాతపాటే పాడబోయాడు చంద్రయ్య.

“దానికి ఊహ తెలిసొత్తాంది. బలవంతంగా ఎత్తుకెల్లినా ఆల్లకూడా ఎలాదేటి” అని ధీమా మణెమ్మకి “పోరా, నీ పిల్లని నువ్వే అట్టుకుపో” పైకి మాత్రం బింకంగా అంది.

చివ్వుమని లేచాడు చంద్రయ్య. పెళ్ళాన్నీ, ముసిల్దాన్నీ ఒకో తన్ను తన్ని లేపాడు. నిమిషాల్లో ప్రయాణం కట్టేసాడు ఆడుకుంటున్న పిల్లనెత్తుకుని చంకనేసుకున్నాడు.

“ఇది నాయం కాదురా సెంద్రయ్యా! అదికాదు పద్దతి, పిల్లని కన్నది నువ్వైనా, పెంచింది మణెమ్మ. పిల్లదానికి ఎవురిమీద ఎక్కవ పేణంవుందో, అదెవరికాడుండాలనుకుంటందో తేల్చుకోండి ముందు” అంది.

పిల్లని కుక్కి మంచంలో కుదేసాడు చంద్రయ్య. “నీకెవరు కావాలోలమ్మా?” అడిగింది ముసలి పిల్లని.

అది మణెమ్మవైపు దృష్టి నిలిపింది. మణెమ్మ గుండె సంతోషంతో ఎగిసిపడింది. కానీ, చివరికి “నాన్న” అని చెంద్రయ్యకి చేతులందించింది.

చెంద్రయ్య విజయగర్వంతో ముందుకడుగేసాడు.

మణెమ్మ గుండె కుంగిపోయి నిలువునా కుప్పకూలిపోయింది.

 

****

( వచ్చేనెలలో మరోకథ)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.