పారని ఎత్తు
-అనసూయ కన్నెగంటి
ఒకానొక అడవిలో ఉదయాన్నే తల్లి జింక పిల్ల జింకా గడ్డి మేయసాగాయి. అలా గడ్డి తింటూ తింటూ పిల్ల జింక తల్లికి దూరంగా వెళ్ళిపోయింది. అది గమనించిన తల్లి గడ్డి తింటూనే మధ్య మధ్యలో దుష్ట జంతువులు ఏమన్నా వస్తున్నాయేమోనని తలెత్తి చుట్టూ ఒకసారి చూసి ఏమీ లేవు అనుకున్నాకా గడ్డి తినటం చేయసాగింది.
అలా చూడగా చూడగా కొంతసేపటికి దూరంగా వస్తూ ఒక నక్క తల్లి జింక కంటపడింది.
దానికి భయం వేసింది. అంతలోనే..
“ నేను ఇక్కడే ఉన్నాను కదా..! నా బిడ్దను తినేంత సాహసం నక్క చేయదులే “ అనుకుని గడ్డి తినటం మొదలు పెట్టింది. అది గమనించిన నక్క మెల్లగా పిల్ల జింక పక్కకు చేరింది. అలా చేరి..
“ నిన్నగాక మొన్న పుట్టిన పిల్లవి. భలే తింటున్నావే గడ్డి. చూస్తే ముచ్చటేస్తుంది “ అంది మెల్లగా..
“నేను ఎప్పుడు పుట్తానో నీకు తెలుసా?” అమాయకంగా అడిగింది పిల్ల జింక.
“ అయ్యో! భలేదానివే.నాకెందుకు తెలియదు. మీ అమ్మా, నేనూ మంచి స్నేహితులం. అందుకే కదా నేను నీతో మాట్లాడుతున్నా. నేను నీతో మాట్లాడుతున్నాను అని తెలిసి కూడా మీ అమ్మ ఏమీ భయపడకుండా తన తిండి తాను తింటుంది. మేమిద్దరం స్నేహితులం కాబట్తే. కావాలంటే చూడు..” అంది నక్క.
తలెత్తి తల్లి వంక చూసింది పిల్ల జింక. తల్లి జింక తలొంచుకుని గడ్డి మేయటం అది గమనించింది. దాంతో తన తల్లికి నక్క బాగా తెలుసు కాబోలు అనుకుంది మనసులో.
దాంతో నక్క పిల్ల జింకను మెల్లగా మాటల్లో దించింది.
“ ఏమిటో ఇప్పటి దాకా మాంసాహారమే తిన్నాను. కానీ ఇప్పుడు నాకు తినబుద్ధి కావటం లేదు. మీలా గడ్డి తిందామని అనుకుంటున్నాను. నువ్వేది తింటే అదే తింటాను. “ అంది పిల్ల జింకతో.
దాంతో పిల్ల జింకకు సంతోషం వేసి అక్కడక్కడా ఏపుగా పెరిగిన దుబ్బుల్ని చూపిస్తూ “ఇవి తిను బాగుంటాయి.” అంది.
“ అవునా? నువ్వెప్పుడైనా తిన్నావా?” అంది నక్క అప్పుడే చూస్తున్నంత కొత్తగా గడ్డి దుబ్బుల్ని చూస్తూ..
“ఓ..! బోలెడన్ని సార్లు..” అంది గర్వంగా పిల్ల జింక.
“ అయితే తినేస్తాను..” అని తింటున్నట్తు నటిస్తూ గడ్డిని కొరికి పడేయసాగింది. అలా పడేస్తూ..దుబ్బులున్న చోటుకల్లా వెళ్ళి మెల్ల మెల్లగా పొదల దగ్గరకి చేరువ అవుతూ..పిల్ల జింక తనని అనుసరించేట్టు చేయసాగింది.
అయితే దాని దుర్భుద్ధి తెలియని పిల్ల జింక నక్క వెనుకగా వెళ్లసాగింది.
నక్కకి చాల ఆనందంగా ఉంది పిల్ల జింక తన బుట్తలో పడబోతున్నందుకు. అయినా సందేహం వచ్చినప్పుడల్లా తలెత్తి అనుమానంగా తల్లి జింక వైపు చూస్తూనే ఉంది నక్క.
అయితే తల్లి జింక నక్క మనసులోని ఆలోచనను ముందే గ్రహించింది. ఎందుకంటే…
అది పిల్ల జింకా, నక్కా మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళిద్దరికీ దగ్గరగా వచ్చి వాళ్ల సంభాషణ విన్నది. అది నక్క గమనించలేదు. అంతే కాదు నక్క తన వైపు చూసినప్పుడల్లా జింక తనకేం తెలియనట్తే నటించసాగింది.
కాసేపటికి నక్క పొదలకు దగ్గరగా వెళ్ళింది. పిల్ల జింక కూడా నక్క వెనుకే అటుగా వెళ్లబోతుంటే..తల్లి జింక..
“ నక్క మామ మనం తినే ఆహారాన్ని తినాలని అనుకోవటం మంచి ఆలోచన. ఇద్దరూ ఇటు రండి. ఇక్కడ మరింత చక్కని లేత గడ్డి ఉన్నది..” అని గట్టిగా పిలిచింది.
దాంతో పిల్ల జింక చెంగు చెంగున దూకుతూ తల్లి వైపు వెళ్ళసాగింది. కాస్తంత దూరం వెళ్ళకా ..”ఇటు వైపు రా ..” అన్నట్టు పిల్లజింకకు సైగ చేసింది తల్లి. నక్కకు ఉసూరుమని అనిపించింది. నోటి దాకా వచ్చిన ఆహారం చేజారిపోయిందని బాధపడింది.
అంతే కాదు. “పోన్లే.ఇవ్వాళ కాకపోతే రేపైనా ఈ లేలేత పిల్ల జింకని తినకపోతానా? “ అని ఆలోచించసాగిందేమో..ఆ ఆలోచనల్లో తల్లి జింక సైగల్ని నక్క గమనించలేదు.
దాంతో..”వెళ్లకపోతే అనుమానం వస్తుంది. రేపు తినాలంటే ఇవ్వాళ అణకువగా ఉండాల్సిందే “ అని మనసులో అనుకుని ఏమీ తెలియదన్నట్టు దుబ్బుల్ని తింటున్నట్టుగా కొరికి కింద పడేస్తూ..పిల్ల జింక వెనకే వెళ్లబోయి దారిలో ఉన్న గుంటలో పడిపోయి “కెవ్వుమంది..”
తన ఎత్తు పారినందుకు మనసులోనే సంతోషిస్తూ “ భలే జరిగిందిలే. పద పద వెళ్ళిపోదాం “ అని తొందరపెట్టింది తల్లి జింక పిల్లజింకను.
“ అయ్యో! పాపం నక్క గుంతలో పడిపోయింది అమ్మా..! రక్షించుదాం “ అంది అమాయకంగా పిల్ల జింక.
“ నువ్వొట్టి అమాయకురాలవు. అది జిత్తులమారి. పైగా మాంసాహారి. నిన్ను మోసగించటానికి గడ్డి తింటాను అంది. అది నమ్మేశావు నువ్వు. దాంతో అది తింటున్నట్టుగా నటిస్తూ..పొదలవైపు నిన్ను తీసుకెళ్లసాగింది. నేను నిన్న పిలవకపోతే నిన్ను పొదల్లోకి లాక్కుపోయి తినేసేదే. “ అంది తల్లిజింక
“ కాదమ్మా! ఇప్పటిదాకా అది గడ్డి తిన్నది” అంది పిల్ల జింక అమాయకంగా.
“ అది తినదు. తిన్నట్టు నటిస్తుంది.అంతే .కావాలంటే నువ్వే చూడు..” అని గడ్డి దుబ్బుల దగ్గరకు తీసుకెళ్ళింది కూతుర్ని.
దుబ్బుల చుట్టూ కొరికి పడేసి ఉన్న గడ్డిని చూసి బాధపడుతూ..” అయ్యో! ఎంత ఆహారాన్ని వృధా చేసింది?” అంది.
“ మన ఆహారాన్ని వృధా చేయటమే కాదు. మన ప్రాణాలనే తిసేసేది. నేను ఉన్నాను కాబట్టి నిన్ను రక్షించుకున్నాను. రేపు నేను ఉండకపోవచ్చు. నిన్ను నువ్వే రక్షించుకోగలగాలి. కాబట్టి ఎవ్వరి మాటల వెనుక ఎలాంటి ఆలోచన ఉన్నదో గ్రహించి మెలగాలి. అంత త్వరగా ఎవ్వరినీ నమ్మకూడదు. అర్ధమైందా?” అంది తల్లిజింక.
“బాగా అర్ధమైందమ్మా! అలాంటి దుష్టులకు శిక్ష పడాల్సిందే .పద వెళ్ళిపోదాం..” అంది అరుస్తున్న నక్క వైపు చూస్తూనే తల్లి వెనకే నడుస్తూ.
*****