ప్రకృతి
-గిరి ప్రసాద్ చెల మల్లు
కృష్ణా నదిలోని
నల్లని గులకరాళ్ళ కళ్ళ చిన్నది
గోదావరంత పయ్యెద పై
నే వాల్చిన తలని నిమిరే
నల్లమల కొండ ల్లాంటి చేతివేళ్ళ చెలి
సోమశిల లాంటి ముక్కు
ఉచ్చ్వాస నిశ్వాసాలకి అదురుతుంటే
నా గుండెలపై వెచ్చని రామగుండం స్పర్శ
శేషాచలం కొండల కనుబొమ్మల మధ్య
గుండ్రని చందవరం స్థూపం లాంటి తిలకంలో
నా రూపు శాశ్వతం
ఫణిగిరి లాంటి నల్లని వాలుజడ
పిల్లలమర్రి ఊడల్లా ఊగుతుంటే
మదిలో ఏటూరు నాగారం టేకు ఆకుల సవ్వడి
గండికోట పినాకినిలా
మనసు లోతుల్లో దాచుకున్న తీపి గుర్తులు
ఒక్కొక్కటి జీవనపయనంలో
కోనసీమ ని మరిపిస్తుంది
పలనాటి చంద్రవంక నుదురు పై
లంబసింగి మంచుముత్యాల ముద్దులవర్షంలో
బమ్మెర పోతన శృంగార కావ్యాల అలక
అరకు పనసతొనల అధరాల సంతకంలో
నా జీవిత శతకం దాసోహం
ఆరని తడి రెంటచింతల ఎండలో సైతం
చిత్తూరు గులాబి గ్రానైట్ చెక్కిళ్ళపై
సిగ్గు దొంతరలు సువర్ణముఖి లాంటి
ముఖవర్చస్సు ని
తూర్పు కనుమల్లో సూరీడిలా దోచుకుంటున్న నేను
అదృష్టవంతుడిని
*****
ఆర్ట్: చంద్ర