బహుళ-6
కన్యాశ్రమం (కనపర్తి వరలక్ష్మమ్మ గారి కథ)
– జ్వలిత
అమ్మాయిలపై అత్యాచారాలు లైంగిక హింసలు పెరిగిన సందర్భంలో అత్యవసరమైన “కన్యాశ్రమం” అనే ఒక కథను గురించి రాయాలనిపించింది. కనుపర్తి వరలక్ష్మమమ్మ కన్యా శ్రమం అనే ఈ కథ ద్వారా ఒక సదాశయాన్ని ఆకాంక్షించారు. ఈకథ “ఆంధ్ర సచిత్ర వార పత్రిక”లో 9 నవంబరు 1960 నాడు ప్రచురించ బడింది. నాటి కథలన్నింటినీ సేకరించి భద్రపరిచిన “కథాప్రపంచం” నిర్వాహకులకు ధన్యవాదాలు.
అనాధాశ్రమం, వృద్ధాశ్రమం తెలుసు. కానీ ఈ ‘కన్యాశ్రమం‘ భావన ఏమిటో చాలామందికి తెలిసి ఉండదు. ఆనాడే అంటే దాదాపు 60 సంవత్సరాల క్రితం అంటే 1960లోనే ‘కన్యాశ్రమం‘ అనే కథను రాసిన ఆ కథయిత్రి ఎంత ముందు చూపు కలవారో మనం అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్ర్యానికి పూర్వమే బాల్యవివాహాలు, సతీసహగమనం నిరాటంకంగా సాగుతున్న కాలంలో, కన్యల గురించి ఆలోచించిన కథా రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమమ్మ. వరకట్నం అనే సాంఘిక దురాచారానికి బలవుతున్న ఎందరో బాలికల సంక్షేమాన్ని ఆలోచించి ఈ కథ రాసి ఉంటారు. కన్య అంటే నిఘంటు అర్థాలను వెతుక్కుంటూ పోలేదామె., పేద కుటుంబాలలోని అమ్మాయిలకు ఆశ్రయం కలిగించి, విద్యతో పాటు సంగీతం, చేతికళలు నేర్పించి ఆర్థిక స్థిరత్వంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి, అదేవిధంగా సరైన పెళ్లి సంబంధాలను వెతికీ కన్యాదానం చేసి వివాహం చేసేందుకు ఆచరణ యోగ్యమైన సహేతుకత గలిగిన ఒక కథ “కన్యాశ్రమం“.
ఇద్దరు మిత్రులు మూడు సంవత్సరాల తర్వాత కలిసి మాట్లాడుకుంటూ ఉన్నట్టు కథ ప్రారంభమవుతుంది. ఇద్దరి మధ్య సంభాషణలోని కథాంశం అంతా వివరించబడింది. మిత్రుడు రమణారావు ఇంటికి రాజేశ్వరరావు వస్తాడు. రామారావు కుమారుడు శ్యామ్ ను పలకరిస్తూ “మీ నాన్న పేరు ఏమిటి? మీ అమ్మ పేరు ఏమిటి?” అని అడుగుతున్న సందర్భంలో, తన మిత్రుడు తాను ప్రేమించిన జానకిని పెళ్లి చేసుకోలేదని అర్థం చేసుకుంటాడు.
ఆ విషయాన్ని మిత్రులిద్దరూ ఇంట్లో మాట్లాడకుండా బయటకు వెళ్లి మాట్లాడుకుంటారు. మిత్రుని మామయ్య అంటే రమణ రావు మామయ్య అతన్ని చిన్నప్పటి నుంచి పెంచి పోషించే బాధ్యత తీసుకొని చదివిస్తాడు. అతని కూతురు జానకిని మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అందుకు భిన్నంగా జరిగినందుకు మిత్రుడు రాజేశ్వరరావుకి కోపంగా, బాధగా ఉంటుంది.
కారణాలను వివరిస్తూ రమణ రావు తనను విదేశాలకు పంపి చదివించిన మామయ్య చనిపోవడం, తండ్రి గావుపట్టు పట్టి వరకట్నం మీద ఆశతో డీఎస్పీ కూతురు తో వివాహము నిశ్చయించడం, వరకట్నం అడ్వాన్స్ గా తీసుకొని తనకు పంపుతూ ఉత్తరంలో మేనమామ కూతురు జానకి రెండో పెళ్లి వాడితో పెళ్లి కుదిరిందని రాశాడని తెలియజేస్తాడు. జానకికి జరిగే అన్యాయాన్ని ఆపడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాడు. కానీ రమణారావు ఆపలేక పోతాడు. అతడు బాపట్ల చేరేటప్పటికి జానకి పెళ్లి జరిగిపోయినట్టు తెలుసుకొని. తండ్రి మీద కోపంతో జానకి వలె మరో వరకట్న బాధితురాలైన మాలతిని వివాహం చేసుకుంటాడు రమణారావు.
రెండో పెళ్లి భర్త తిండి పెట్టకుండా జానకిని వేధిస్తూ తల్లి దగ్గరికి పంపేస్తాడు. అప్పుడు జానకి కొందరికి ట్యూషన్లు చెప్పుకుంటూ బతుకుతున్న సమయంలో, ముసలి భర్త మూలవ్యాధి తో మరణిస్తాడు. అతనికి సంబంధించిన స్థిరచరాస్తులు కలిసి వచ్చి, జానకి కొత్త ఆలోచనలు కలిగిస్తాయి. తనకు జరిగిన కష్టంతో వచ్చిన అనుభవంతో ఆమె మరొకరి జీవితం అట్లా జరగకుండా చూడాలని లక్ష్యాన్ని కలిగిస్తాయి. అదే ‘కన్యాఆశ్రమం’ ఏర్పాటుకు కారణం.
అదే విషయాన్ని జానకి తనను చూడడానికి వచ్చిన రమణారావు దంపతులకు చెప్తుంది ఆశయమనే ఆశ ఉన్నప్పటికీ, తాను ఒక్కర్తే చేయగలిగిన పని కాదు కనుక, రమణారావు దంపతులను ఆ బాధ్యత తీసుకోమంటుంది. ఆ విధంగా చదువు, అందం, ఆరోగ్యం ఉండి డబ్బు లేని నిరుపేద మధ్యతరగతి కన్యలకు ఆశ్రయమిస్తుంది. వారికి సరైన సంబంధాలను వెతికి, కన్యాదానం చేసే బాధ్యత కూడా రమణారావు ధంపతులకే అప్పచెప్పింది జానకి. ఎంత మంచి ఆలోచన కష్టం వచ్చినప్పుడు తమ జీవితాలింతే అని నిరాశ చెందకుండా, ధైర్యంగా నిలబడింది. ధనం కలసి వచ్చి సౌఖ్యాలకు, వినోదాలకు అవకాశం ఉన్నా., స్వార్థం లేకుండా తన వలె కష్టాల్లో ఉన్న ఎందరో కన్యలకు, సాయంగా నిలబడి చదువు, సంగీతం వంటివి నేర్పించి, ఆత్మవిశ్వాసం కలిగించే ఆశయం గొప్పది. ఈ రెంటిని కన్యా శ్రమం అనే కథలో కనుపర్తి వరలక్ష్మమ్మగారు చక్కగా వివరించారు.
కథలోని పాత్రల చిత్రణలో రచయిత్రి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు. వ్యక్తులుగా ఎవరిని చెడ్డ వారిగా చూపించలేదు. వారి స్వార్ధ పూరిత ప్రవర్తనకు కారణాలను సామాజిక పరిస్థితులను ఆధారాలు చూపించి చర్చించారు. జానకిని వివాహం చేసుకున్న ఒక్క వ్యక్తిని తప్ప అందరిలో పశ్చాత్తాపాన్ని చూపించారు.
రమణారావు తల్లికి వరకట్నం పట్టింపు లేదు. తండ్రి కట్నం కోసం పట్టు పట్టడానికి కారణం, వరకట్నం ఇస్తామని వచ్చి అతనిలో ఆశలను పెంచిన కన్యల తండ్రులదే దోషమ మన్నట్టు వివరించారు. రమణారావు డిఎస్పి కూతుర్ని నిరాకరించి, మాలతిని వివాహం చేసుకున్న తర్వాత జానకి భర్త చేతిలో హింస బడుతూ పుట్టింటికి చేరడం చూసి తన తప్పు చేశానన్న అపరాధ భావనకు లోనవుతాడు అతడి తండ్రి. కొడుకు కోడలు మనవడితో ఇంటికి రావడంతో మనశ్శాంతిని పొందుతాడు.
జానకి పాత్రను చాలా ఉన్నతంగా చిత్రీకరించబడింది అని చెప్పడానికి జానకి చేత రచయిత్రి చెప్పిన మాటలే ఉదాహరణ. మీరూ చదవండి – జానకి కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకుని, “బావా! నా పెళ్లి సంగతి చూసావు కదా! కట్నం ఇచ్చుకునే శక్తి లేక ముసలివాడికని కట్టుకొని, ఈ గతికి వచ్చాను. మధ్య తరగతి కుటుంబాలలో పుట్టిన కన్నెపిల్లలకు వరకట్న పిశాచి పీడనగా బాధిస్తున్నాయి. అనేకమంది కన్నెలు దీనికి బలై పోతున్నారు. లేదా అవివాహితులుగా ఉండిపోతున్నారు. ఈ రెండు స్త్రీలకు దుర్భర కష్టాలే. దానికి నివారణ మార్గం, నాకు ఒకటే కనిపిస్తున్నది. ఈ ఈ ద్రవ్యంతో ఒక ‘కన్యాశ్రమం‘ పెట్టి, వరకట్నం ఇచ్చుకోలేని మధ్యతరగతి కుటుంబాలలోని కన్నెలకు, వరకట్న నిషేధదీక్షితులైన వరులను ఇచ్చి వివాహం చేద్దామని నా అభిప్రాయం” అన్నప్పుడు.
“ఆశ్రయం పెట్టినంతమాత్రాన తల్లిదండ్రుల చాటున ఉండే కన్నెలు అందరూ వచ్చి మన ఆశ్రమంలో చేరుతారా! వాళ్ళ వాళ్ళు అట్లా పంపడానికి ఒప్పుకుంటారా!వాళ్ళు వచ్చి ఇక్కడ ఊరికే ఉండగలరా” అని సందేహం వెళ్లబుచ్చుతాడు రమణారావు.
“వాళ్లు ఊరికే ఉండకూడదు. మేష్టార్లను పెట్టి వాళ్లకు ఇష్టమైన చదువు, సంగీతము చెప్పించి ప్రైవేట్ పరీక్షలకు పంపవచ్చును. వారికి తగిన సంబంధాలు వచ్చినప్పుడు వివాహం చేయవచ్చును. ఈ ఆస్తి ఎవరి స్వార్జితమో వారి పేరున ఈ కన్యాశ్రమం పెట్టవచ్చును” అంటుంది జానకి.
కథలు రాయడం అంటే కేవలం కష్టాలు కన్నీళ్లు చెప్పుకోవడమే కాక, సమాజంలో వాటికి కారణమైన అంశాలను చర్చించి, అనుచరణ యోగ్యమైన ఉపాయాలను సూచించడం, రచయితలు తమ రచనల ద్వారా విజయాన్ని సాధించినట్టే.
.అయితే 60 సంవత్సరాల క్రింద సూచించిన ఈ కన్యాశ్రమాలు ఇప్పటికీ చాలా అవసరం ఉన్నాయి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇదంతా చూసుకుంటుందిలే అంటే అది మనం తప్పులో కాలేసినట్టే. “భరోసా సెంటర్లు” వంటివి కొంత ‘కన్యాశ్రమం‘ పాత్రను పోషించినా, అవి ఇంకా విస్తృతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.
నాటి సమస్య ఇంకా కొనసాగుతుంది కాబట్టి సాహితీకారులు ఇటువంటి అంశాలపై ఇంకా రాతలు గానే కాదు చేతలు కూడా చేయవలసి ఉన్నది అనడానికి కనుపర్తి వరలక్ష్మమమ్మే ఆదర్శం.
****
“కన్యాశ్రమం” కథయిత్రి గురించి:
కనపర్తి వరలక్ష్మమ్మ
జననం – 1896 అక్టోబర్ 6
మరణం – 1978 ఆగస్టు 13
తల్లి – హనుమాయమ్మ
తండ్రి – పాలపర్తి శేషయ్య
*1909లో ఆమెకు 13వ యేట కనుపర్తి హనుమంతరావుతో వివాహమైంది, భర్త సహకారంతో ఉన్నత విద్యలు అభ్యసించి.
* 1921లో మహాత్మా గాంధీని కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు.
*1919లో సౌదామిని అనే ఆంగ్ల అనువాద కథ ఆమె మొదటి రచన,
* 1929 నుండి 1934 వరకు శారదలేఖలు పేరున గృహలక్ష్మి పత్రికలో రాశారు.
ఆమె అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు.
” ద్రౌపది వస్త్ర సంరక్షణ” – ద్విపద కావ్యం.
” లేడీస్ క్లబ్, రాణి మల్లమ్మ” వంటి నాటికలు,
పిల్లల కోసం పాటలు, నవలలు, పిట్ట కథలు రాశారు. ప్రముఖుల జీవిత చరిత్రలు రచించారు. తమిళం, కన్నడం, హిందీ భాషలలోకి ఆమె రచనలు అనువాదం అయ్యాయి.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత అవార్డు పొందారు.
* బాపట్లలో హితైషిణీ మండలిని స్థాపించి స్త్రీల అభివృద్ధికి కృషి చేశారు.
* గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలిగా సేవలందించారు.
*****
కలం పేరు జ్వలిత. అసలు పేరు విజయకుమారి దెంచనాల. స్వస్థలం పెద్దకిష్టాపురం,ఉమ్మడి ఖమ్మం. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని. ప్రస్తుతం సాహితీవనం మిద్దెతోట సాగు.
రచనలు-
1)కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం)
2)మర్డర్ ప్రొలాంగేర్-2008 (కవిత్వం,ఆంగ్లానువాదం)
(3)సుదీర్ఘ హత్య-2009(కవిత్వం)
(4)ఆత్మాన్వేషణ -2011(కథలు )
5)అగ్ని లిపి- 2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం )
6) జ్వలితార్ణవాలు- 2016(సాహిత్య సామాజిక వ్యాసాలు)
7) సంగడి ముంత- 2019(కవిత్వం)
8) రూపాంతరం – 2019 (కథలు)