మన ‘వరాలు’

-ప్రసేన్

 

 “పెంటకుప్పలో పసికందును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు” “వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి. ఆసుపత్రిని ధ్వంసం చేసిన బంధువులు” వంటి  వార్తలు నాకు నిత్యకృత్యం. అయితే జర్నలిస్టుగా ఈ సందర్భాలలో నేను  గమనించిన  విషయం ఒకటుంది. పెంటకుప్పమీద దొరికిన పసికందు అన్ని సందర్భాలలోనూ ఆడపిల్లే.  ఆసుపత్రుల మీద దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ మరణించింది మగబిడ్డే. ఆడ శిశువు మరణిస్తే సంబంధిత బంధువులు ఏ గొడవా చేయకుండా నిశ్శబ్దంగా వెళ్లిపోయేవారు. లక్షలు ఖర్చు పెట్టి ఐయూవై, అయివైఎఫ్ చేయించుకున్న వారు కూడా ఆడపిల్ల పుట్టగానే మాకొద్దు అని వదిలేసి వెళ్లిపోయిన సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని.

నా ఈ అబ్జర్వేషన్ నన్ను బోలెడంత   మానసిక యాతనకు గురి చేసింది. ప్రపంచపు క్రూరత్వాన్ని అతి దగ్గరనుంచి అర్ధం చేసుకునేట్టు చేసింది.

ఇంట్లోకి ఆడపిల్ల రావడాన్ని ఎందుకు  సహించలేకపోతున్నారు. అమ్మాయి రాకను ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం లేదు అనేదంతా నా గొడవ కాదు కానీ ప్రపంచం గొడవ. అందుకే క్షమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ సరంభంగా చేసాం. తన నామకరణాన్ని కూడా సినిమా టైటిల్ లాంచింగ్ లా చేసాం.  తన బారసాల  అంగరంగ వైభవంగా చేసాం. తనదేదైనా జాతరే. నేనీ క్షమ కావ్యంలో చెప్పదలుచుకున్నదికూడా అదే. భారతదేశంలో ప్రతి ఇల్లు ఆడబిడ్డ రాకని వేడుక చేసుకోవాలి. వంశాన్ని పొడిగించడం లాంటి చెత్తను చెరిపెయ్యాలి. క్షమ నా మనవరాలు కావచ్చు. కానీ నిజానికి ఏ ఆడపిల్లయినా మన ‘వరాలు’. అందుకే నా గొడవే కానీ ప్రపంచం బాధ కూడా అన్నది.

జరగాల్సిన అతి పెద్ద మార్పుకోసం ఇదొక ఒక చిన్ని ప్రయాస. 

1

మేఘాలకు  గంధం పూసి

స్వర్గానికి మీగడ రాసి 

ఇంద్రలోకాన్ని తేనెలో ముంచి

అన్నీ కలిపి రంగరించి 

ఓ ముక్కను తుంచి

మా ఇంటికి పంపారెవరో !

2

క్షమది గుండాగిరీ 

మమ్మల్ని నిలువునా

కబ్జా చేసింది 

3

శూన్యాల గాయాల

వెదురు తునకలం మేం

తను రాగమూ గానమూ

4

క్షమ అల్లరిలో

ఇల్లంతా చిందర వందర

చెల్లాచెదురైన సామాన్లలో

తనకోసం

మమ్మల్ని మేం పారేసుకుంటాం

5

తను బా అంటే మాకు మంగళాశాసనం 

తను బ్రుబ్రు అంటే మాకు ప్రవచనం 

తను బూ అంటే మాకు ఆశీర్వచనం 

ఇంటిల్లిపాదికీ

ముక్కోటిన్నొకటవ  దేవత

నాస్తిక తాతకూ

తానొక క్షమానందస్వామిణి

6

మా సమస్యల

భవసాగరాల

వెతల రొదల

మెమరీ వైపవుట్ కు

పాస్ వర్డ్ క్షమ

7

మెరుపులు ఆపని

మిణుగురు తోట

సరిగమ తెలియని

పదనిస పాట

వరములు గుప్పిన

ఆకాశవాణి

పుట్టెడు మణుగుల 

క్షమంతకమణి 

8

బంపర్ ఆఫర్ రిటర్న్ గిఫ్ట్…

మేం తనకేమిచ్చినా

క్షమ వందరెట్లు తిరిగిచ్చేస్తుంది

9

క్షమ ఓ మహా క్రీడాకారిణి

మేమంతా మైదానమూ

ఆటబొమ్మలమూ

10

ఆస్కారూనందీమెగసెసే

పులిట్జరూనోబెలూజ్నానపీఠూ

క్షమ నాకు పెట్టిన ముద్దు

11

క్షమ గుక్కపట్టింది

ఇంటిల్లిపాదీ

కన్నీటిపర్యంతం

క్షమ కేరింతలు

ఇంటిల్లిపాదీ

నవ్వాపుకోలేక

వెక్కిళ్లు

12

పన్నాలోయ్ పన్నాలు

జెయింట్ వీల్

ఫ్లయింగ్ కిస్

అతామాజీ సటక్లీ

అన్నీ ఆటలే

మేం కేవలం

ఆటలో అరటిపండ్లమే

కెప్టెన్

ఫీల్డ్ అంపైర్

థర్డ్ అంపైర్

స్కోరర్ 

అన్నీ క్షమే

13

నేను చేసిన

అతి పేద్ద దొంగతనం…

నిద్రలో ఉన్నపుడు

క్షమ బుగ్గమీద ముద్దు

14

నా మెడచుట్టూ

క్షమ చేతులు…

నాకదే గజమాల

15

మా ఇంట్లో

ఒకరికి బిపి

ఒకరికి స్ట్రెస్

ఒకరికి షుగర్

క్షమ దివ్యౌషధం

16

మా క్షమ బాషా

తను ఒక్కసారి నవ్వితే

మేం వందసార్లు నవ్వినట్టే

క్షమ చంద్రబాబు కూడా 

తను నిద్రపోదు 

మమ్మల్ని నిద్రపోనివ్వదు

17

భుజాన  ఉప్పుమూట

వీపెక్కిన  గుర్రం ఆట 

మోకాళ్ళ ఊయల

మా అందరిమీదా తను

ఎక్కి దిగినట్టుoటుందే కానీ…

మా ఎగుడు దిగుళ్ళను కలిపే 

అసలు సిసలు నిచ్చెన తనే..

18

క్షమను పాలనురగతోనూ

ముద్దమందారాలతోనూ పోల్చొద్దు

తను గులాబీ వెలుగూ

వెన్నెల పరిమళమూ

19

క్షమ వచ్చాకే తెలిసింది 

అప్పటి దాకా

వెలుగు లేదని 

20

మా ఇంటి

ఆనందాల గది

తాళంచెవి క్షమ

21

పూలకోసం

ఊరంతా  తిరిగాం

క్షమ వచ్చాక

మాలోలోపల 

పూతోట  విరబూత

22

క్షమ చేష్టలన్నీ ఆల్చిప్పలే

మా ప్రతి అనుభూతి చినుకూ

మేలిమి ముత్యమే

23

నేనూ ఇందూ అనే

పండుటాకుల కొత్తచిగురు

క్షమ

24

అమ్మనీ కమ్మనీ దెబ్బ

పాట విన్నపుడు

దెబ్బ కమ్మగుండడం

ఎలానో అంతు చిక్కలేదు

క్షమ తన నాన్నమ్మను

చెంప మీద లాగి ఫెడీల్మని

కొట్టినపుడు నానమ్మ కళ్ల

మెరుపు సంబరంలో

కమ్మదనం అసలు అర్థం

తెలిసింది నాకు

25

అనువాదానికి లొంగట్లేదు

క్షమానుభూతి

26

మా ఇల్లొక సెలయేరు

క్షమ విసిరిన గులకరాయి

ఎన్నెన్నో అల్లరి అలలు

27

క్షమ ప్రతి కదలికలో

మా బాల్యాన్ని వెతుక్కుంటూ మేం

28

చిలిపిదొంగ..అల్లరి.. కొంటె

క్షమది కృష్ణతత్వం

మాకు  బాలకాండ 

29

క్షమ చెయితిరిగిన శిల్పి

మా లోపలి శూన్యాలనూ

శిల్పాలుగా చెక్కింది

30

మేం కేవలం అక్షరాలం

క్షమ భాష

క్షమ వ్యాకరణం

క్షమ కర్త కర్మ క్రియ

క్షమ అర్థమూ భావమున్నూ

31

ఏం చూస్తున్నావ్ తాతా…

గడిచిపోయిన బాల్యాన్నా!!

32

తెలుగు హిందీ ఇంగ్లీష్

జాంతా నై 

బృ భృ బుర్ డూర్ డూర్

ఇప్పుడిది

మా ఇంటి అధికార భాష 

క్షమ మాకు

అక్షరాభ్యాసం చేస్తోంది

33

చుక్కలు రెట్టింపై మెరుస్తున్నాయి

చంద్రుడు అదనంగా వెలుగుతున్నాడు

మబ్బులు మరింత కులుకుతున్నాయి

ఎందుకంటే

వాటిని చూసి క్షమ నవ్వింది

34

నేను తనకు ఊయల

తల్లి ఫీడింగ్ టేబుల్

తండ్రి రైమ్స్ 

నానమ్మ వాకర్

తాతయ్య  జోలపాట

ఎంతందంగా ఉందీ

మమ్మల్ని మేం కోల్పోవడం

35

నది కడుపున చేప జిగ్ జాగ్ పరుగు

ఆకాశంలో పిట్ట  మెలికల విన్యాసం

అడవిలో జింక రోలర్ కోస్టర్ నాట్యం

మా క్షమ అల్లరి

.

.

నది పారిన అడవి లోపలి ఆకాశం మేము..

36

నాలోపలి

కవిని చెరిపేసి 

పసివాడ్నయాను

క్షమ కావ్యం రాయడానికి

నిజానికి నా అక్షరాలన్నీ

ఉత్తి బోలు

అక్షరాలా స్వయంగా

క్షమే ఓ కావ్యం

*****

Please follow and like us:

One thought on “మన’వరాలు’ (కవిత)”

  1. క్షమే ఓ కావ్యం ❤️. నిజమే, అందుకే తాత గారి చేత36 ఆణిముత్యాల కవిత్వం రాయించింది..👍👌. పాప కు, దీవెనలు.sir!

Leave a Reply

Your email address will not be published.