మానవీయ విలువల పరిమళాలు

(జమ్మిపూలు కథా సంపుటి పై సమీక్షా వ్యాసం)

 

-వురిమళ్ల సునంద

 
సాహిత్య ప్రక్రియల్లో  పాఠకులను అత్యంత ప్రభావితం చేసే శక్తి  కథ/ కథానికు ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
పిల్లలు పెద్దలు వినడానికి చదవడానికి చెవి కోసుకునే ఈ  ప్రక్రియ సాహిత్యంలో అగ్రగామిగా నిలిచింది.అందులో పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది కాల్పనికత అయితే పెద్దలు బాగా ఇష్ట పడేది యథార్థానికి దగ్గరగా ఉండే కథలనే. అందులో తమ జీవితాలను చూసుకుంటారు. సమకాలీన సమాజ పరిస్థితులు, వివిధ వర్గాల వారి జీవన విధానాలు,వ్యధలు మొదలైనవి ఆకలింపు చేసుకుంటారు.
ఇక ఈ కథా ప్రక్రియ పాశ్చాత్య సాహిత్య ప్రక్రియ. నెమ్మది నెమ్మదిగా ఈ ప్రక్రియ తెలుగు సాహిత్యంలోకి వచ్చింది.
ఆంగ్లేయులు చిన్న కథగా పేర్కన్న ఈ ప్రక్రియను  ‘కథానిక’గా పిలిస్తే బాగుంటుందని ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు సూచించినప్పటికీ ‘కథ’గానే పిలువబడుతుంది.
ఈ కథానిక ప్రస్తావన ‘అగ్ని పురాణం’లో ఉంది.ఈ పురాణ కర్త కథానికను ప్రత్యేక ప్రక్రియగా గుర్తించడమే కాకుండా  లక్షణాలు కూడా ఎలా ఉండాలో నిర్దేశించారు. ‘ఆద్యంతాలు లేనిదే అసలైన కథానిక’ అని చెకోవ్ అంటే కథంటే కథన రూపంలో ఆవిష్కృతమైన భిన్న నాటకమని హెన్రీ థామస్ అంటారు.
ఇక తెలుగు రచయితల్లో  ప్రముఖ రచయిత గోపిచంద్ గారు ‘ కథను ఏ రూపంలో రాసినా కథ ద్వారా పాఠకులకు ఒక సంస్కారాన్ని ఒక కొత్త దృష్టిని కలిగించడం ముఖ్యం’  అంటే.. ‘కథానికకు ఒక విస్పష్టమైన సంఘటనతో కథలో ప్రతి చిన్న విషయం కథానిక ప్రధాన లక్షణమైన కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉండాలని, అందులో ఓ మెరుపు, వేగం, వైచిత్రి, శిల్పం  వీటి మీద దృష్టి కేంద్రీకరించాలి. ‘ అంటారు పాలగుమ్మి పద్మరాజు గారు. ఇక ఆరుద్ర గారు కథ/ కథానిక రాయడానికి సరళమైన భాషతో పాటు పాత్ర శీలాన్ని,వస్తు గుణాన్ని, వాతావరణం, పరిసరాల గురించి క్లుప్తంగా, శక్తివంతంగా చెప్పడం లోనే రచయిత ప్రతిభ కనిపిస్తుందంటారు.అంతే కాకుండా కథ మొదట్లో కుతూహలం, ఆలోచన కలిగించడమే కాకుండా మధ్యలో చెప్పేది రక్తి కట్టించేలా ఉండాలని అంటారు.
అలా కుతూహలం ఆలోచన కలిగించడమే కాకుండా  హృదయాన్ని తాకి మనసును కదిలించేలా కళ్ళు చెమ్మగిల్లేలా  యధార్థ సంఘటనల ఆధారంగా చేసుకుని సమ్మెట ఉమాదేవి గారు రాసిన ఈ కథలు కథా సాహిత్యంలో *మానవీయ విలువల* *పరిమళాలని* చెప్పవచ్చు.
 ఇందులో గ్రామీణ జీవన విధానం అందులోనూ ఊరికి దూరంగా చేను చెలకలకు దగ్గరగా ఉండే లంబాడీ తండాల్లో ఉండే పిల్లలు, స్త్రీలు వారు ఎదుర్కొనే అనేకానేక సమస్యలు, వ్యధాభరిత జీవితాలను కథలుగా దృశ్యమానం చేసి  చదివిన ప్రతి ఒక్కరూ ఆలోచించేలా రాసిన ప్రతి కథ ఆల్చిప్పలో రూపు దిద్దుకున్న ఆణిముత్యం లాంటి కథే. 
ప్రతి కథా చదివిన తర్వాత అది మనను  వెంటాడుతూ నీవంతుగా ఏం చేస్తావ్  అని అడుగుతున్నట్లుగా, ఇలా ఉంటే బాగుంటుంది కదా అనిపించేలా ఉంటుంది.
ఇందులో ఉన్న పదిహేను కథల్లో  పన్నెండు కథలు తండా వాసుల కథలు, బిచ్చగాళ్ల  కథలు, రేషనలైజేషన్, ఆధునిక కాలంలో ప్రైవేటు పాఠశాలపై మోజు  , మరికొన్ని కారణాల వల్ల ఉపాధ్యాయుల వేదన, కష్టాలు వచ్చినప్పుడు చావడం పరిష్కారం కాదని చైతన్యం చేసే కథ ‌.ఇలా రాస్తూ పోతే పదిహేను కథలూ  కవయిత్రి చాలా దగ్గరగా వారి జీవితాలను పరిశీలించి రాసినవిగా తెలుస్తుంది. ఈ కథా సంపుటికి *జమ్మిపూలు* అని పెట్టడంలో ఔచిత్యం ఈ కథలు చదివితే గాని తెలియదు.
రచయిత్రికి పువ్వులంటే  ఇష్టమని వాటిని  దగ్గరగా పరిశీలిస్తే తప్ప ఈ సంపుటికి  *జమ్మిపూలు* అనే పేరు పెట్టలేరన్న విషయం తెలుస్తుంది.
 మారుమూల తండాల్లో చేసిన ఉద్యోగానుభవం రచయిత్రిగా ఈ కథలు రాయడానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు.  వారి సంస్క్రుతి సాంప్రదాయాలను ఎంతో లోలోతుగా అధ్యయనం చేసి రాసిన ఎంతో  గొప్ప కథలివి.
కథలు రాయడం ఒక ఎత్తు అయితే వాటికి చక్కటి శీర్షికలు పెట్టడం మరొక ఎత్తు.. ‘ఊరి ఉమ్మడి సిరి’ ఈ శీర్షిక చదవగానే ఏమిటా సిరి అని  కళ్ళు కథ వెనుక పరుగులు తీస్తాయి. *బడిని*   ఊరి ఉమ్మడి సిరిగ ఎందుకు భావించాలి. సరితా టీచర్ బడిని ఊరి ఉమ్మడి సిరి అని ఎందుకు అన్నది అక్కడి పిల్లల జీవన నేపధ్యం ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉంటుందో .. అలాంటి పిల్లలను బడికి రప్పించేందుకు వారి అమూల్యమైన బాల్యాన్ని ఆనందంగా గడిపేందుకు ఉపాధ్యాయులుగా ఏం చేయాలి? మంచి ఉపాధ్యాయుల పట్ల గ్రామస్తుల స్పందన ఎలా ఉంటుందో కొత్తగా వచ్చిన రఘురాం సారుకు అర్థమయ్యేలా చెప్పిన కథ ఇది.
ఈ కథలు  ప్రకృతిలోని అందాలను చూపిస్తాయి.. నిత్యం మారుమూల ప్రాంతాల్లో వెళ్ళే దారిలో రోడ్డుకు  ఇరువైపులా కనిపించే పంటచేలు, వాటిని పసిబిడ్డల్లా సాకి సమాజ ఆకలి తీర్చేందుకు అన్నదాత పడే కష్టనష్టాలు చదువుతుంటే సజీవ గాథలను చూస్తున్నట్టే ఉంటుంది..
మొదటి కథ *ద్వాలి*  చదువుతుంటే ‘ఆడవాళ్ళు రిజర్వేషన్స్ వల్ల  స్థానిక సంస్థల్లో వివిధ పదవులు చేపట్టినా’ వారు ఉత్తి రబ్బరు స్టాంపు లాంటి వారేనని ,పెత్తనమంతా భర్త, కుటుంబ సభ్యులదేననీ చూస్తున్న మనం ఇందులో  *ద్వాలి* కూడా అందులో కొట్టుకు పోయిందా గడ్డి పోచలా తలెత్తుకుని నిలబడిందా’ తెలుస్తుంది. అంతే కాకుండా ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ కథ చదవాల్సిందే. *రెడపంగి* *కావేరి*  కథ చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లకుండా ఉండవు. తాగుబోతు తండ్రి నుండి విడాకులు తీసుకున్న కన్నతల్లికి అయిన మారు మనువు వల్ల ఆ పసి మనసు కోల్పోయిన  ప్రేమ , వయసుకు మించిన పెద్దరికంతో తల్లి సుఖం కోసం తాను తీసుకున్న నిర్ణయం ,ఆ పసిపిల్ల నోటి నుండి వచ్చిన వయసుకు మించిన ఆరిందలాంటి మాటలు చదువుతుంటే గుండె పిండేయక మానదు.
  ఇక *జమ్మి పూలు* కథలో  ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించిన తీరు చూస్తే మనసు ప్రకృతిలోకి,ఆ అపురూప వనాల్లోకి పరుగులు తీస్తుంది. జమ్మిపూల సోయగంతో పాటు తనను తాను ఎలా రక్షించుకుంటుందో, ఆనాడు పాండవులు జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను ఎందుకు దాచారో ప్రతీకాత్మకంగా రాస్తూ అలాంటి జమ్మిపూవంటి చంప్లీ తన వెంట పడిన సాంబిరెడ్డికి ఎలా బుద్ధి చెప్పిందో తెలుసుకోవాలంటే ఈ కథను చదివి తీరాల్సిందే. ముఖ్యంగా నేటి ఆడపిల్లలు యువత తమకు నచ్చిన ఇబ్బందులు ఎలా లౌక్యంగా తప్పించుకోవచ్చో తెలుసు కోవడానికి ఈ కథ తప్పకుండా చదవాలి.
 *దశ్మీ* కథలో తనను ప్రేమించిన అబ్బాయికి ప్రేమంటే ఇరు వ్యక్తులకు సంబంధించిన విషయమే కాదు
ఇరువైపులా కుటుంబాలు కూడా ఆత్మీయంగా  కలిసి పోవాలని, అలా కలవలేనప్పుడు జీవితాంతం పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లిని నిలబెట్టుకోలేక పడే మానసిక ఒత్తిడి ఎలా ఉంటుందో నేటి యువతరానికి అర్థం అయ్యేలా రాసిన కథ. యువత ఇలాంటివి చదవాలి సాధ్యాసాధ్యాలు గమనించాలి.
 *బొడ్రాయి* కథలో సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ  ఊరిలో బొడ్రాయి వేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి. ఆడపిల్లలను పుట్టింటికి పిలుచుకునే ఆచారం, సమయం దాటితే  మూడు రోజుల వరకు ఊరి పొలిమేర దాటకుండా , వేరే వాళ్ళు ఊళ్ళోకి రాకుండా వేసిన కంచె.. పుట్టింటికి రావడానికి అత్త సంహరించిన తీరు.బొడ్రాయి పూజలు చేసేందుకు వచ్చిన పూజారిలో ఒకడు చేయబోయిన అత్యాచారం వాడికి ఎలా తగిన చేశారో ఈ కథ చదివితే తెలుస్తుంది.
పండని పంట పొలాలు పెరిగిన అప్పులు తీర్చుకోవడానికి  ఆ వూరి యువకులు ఏ దారి ఎన్నుకున్నారు? వారి బతుకు బాట లో జరిగిన సంఘటనలతో మనిషి పుట్టుక నుంచి మరణం దాకా తప్పని ప్రయాణంలో ఎదురైన అనూహ్య సంఘటనలు చదువుతుంటే చదవాలనే ఆసక్తి కలుగుతుంది. 
 *మనసు నిండింది* కథలో అడుక్కోవడం ఎలాంటి నీచమైన పనో, కష్టం చేసి సంపాదించి తీనడంలో ఆనందం  ఎలాంటిదో మనసు నిండింది కథ చదవాల్సిందే. 
మైసమ్మత్తో కథలో  చెంబట్కి పోవడం పదం చదివినప్పుడు మా చిన్నతనపు రోజులు గుర్తుకు వచ్చాయి. ఇండ్లలో మరుగుదొడ్లు లేక ఆడవాళ్ళు ఎలా ఇబ్బంది పడేవారో.. అయితే ఇందులో మాత్రం ప్రభుత్వం కొంత ఋణం ఇచ్చి కట్టుకోమన్నా దాని వల్ల అత్తా కోడళ్ళు ఒకరి మీద ఒకరు పుట్టిఃటోళ్ళకో స్నేహితులకో చెప్పుకునే అవకాశం పోతుందని,అది కట్టకుండా బాగుండుననే వరమ్మ బాధ,ఆ తర్వాత కథ  నాటకీయంగా నడిచిన విధానం బాగుంటుంది.. 
 *సూరిగాడు బళ్ళో చేరాడు* 
నేటి ఉపాధ్యాయులు బడిని కాపాడుకునేందుకు పడిన అవస్థలను హాస్యం మిళితం చేసి రాసిన విధం చాలా బాగుంటుంది. ఇంకా సంతకం,ఖేల్ షురూ మొదలైన కథలు  అందులోని సందేశాన్ని ఒడిసి పట్టుకోవాలంటే తప్పకుండా చదవాల్సిందే. *గంసీ* కథలో తాగుడు వ్యసనంలో ఎంత మంది సమిధలు అయ్యారో మరెంత మంది దయనీయంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారో
ఒక స్త్రీ జీవితంలో ఎదురైన ఆటుపోట్ల గురించి రాసిన కథ నేటికీ చాలా పల్లెటూర్లలో జరుగుతున్నది  పేపర్ లు చానల్ ద్వారా వింటూనే ఉంటాం.
 ఇందులో ఉన్న పదిహేను కథల్లో చాలా వరకు బహుమతులు వచ్చిన కథలే ఉన్నాయి.
 ఈ కథలను చదువుతుంటే వారి రచనా శైలిని బట్టి ఎంత చేయి తిరిగిన రచయిత్రనో తెలుస్తుంది. 
వీరు ఈ కథల సంపుటిలో మారు మూల గిరిజన తండాల్లో జరిగే సంఘటనల గురించి, వారిని వారి సంస్క్రుతిని కాపాడుకోవాల్సిన అవసరం గురించి రచయిత్రి పడే తపన కనిపిస్తుంది.
 వీరు ఈ కథల సంపుటినే కాకుండా, తనకు ఎంతో ఇష్టమైన పూల పేరుతో రేల పూలు కథా సంపుటి, సమ్మెట ఉమాదేవి కథానికలు,
అమ్మ కథల సంపుటాలతో పాటు
మా పిల్లల ముచ్చట్లు, అల్లరి కావ్య , పిల్లల దండు లాంటి బాల సాహిత్యం కూడా సృజన చేశారు.
ఈ కథల సంపుటికి ముందు మాట ప్రముఖ రచయిత్రులు
వాడ్రేవు వీలక్ష్మీ దేవి గారు, నెల్లుట్ల రమాదేవి గారు రాశారు.
ఇందులోని ప్రతి కథ మట్టి మనుషుల స్వచ్ఛమైన హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ కథల విలువల పరిమళాలు ఆస్వాదించాలంటే తప్పకుండా ఈ పుస్తకం కొనుక్కోవలసిందే..
ఈ పుస్తకాలు ప్రముఖ పుస్తకాల షాపులన్నింటిలోనూ లభిస్తాయి.
 
పుస్తకం పేరు: జమ్మి పూలు
రచయిత: సమ్మెట ఉమాదేవి
పేజీలు:154
వెల:160 రూ/
పుస్తక ప్రచురణ:2020 సంవత్సరం
ఈ పుస్తకాలు దొరుకు చోటు
సమ్మెట ఉమాదేవి
C/O శ్రీ బిడి కృష్ణ,
ఇంటి నెంబర్ 3-2-353
సెకండ్ ఫ్లోర్, స్వామి వివేకానంద స్ట్రీట్,
ఆర్ పి రోడ్, సికింద్రాబాద్-500003,
మొబైల్ నెంబర్:98494057
ఇమెయిల్

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.