రమణీయం

బుద్ధుని జీవితం-ధర్మం-6

-సి.రమణ 

బౌద్ధ మూల గ్రంధాలు

త్రిపిటకములు:  పిటకం అంటే బుట్ట, గంప అని అర్థం. తథాగతుడు మహా నిర్వాణం చెందిన మూడు నెలల తర్వాత, ఆయన ప్రధాన శిష్యులు, భిక్షువులు కలసి బుద్ధుని బోధనలు, సందేశాలు, ధర్మోపదేశాలు అన్నిటినీ మూడు సంకలనాలుగా  విభజించారు.  వీటిని మౌఖిక  పఠనం  ద్వారా, శుద్ధ రూపంలో శిష్యపరంపర కాపాడగలిగారు. అపారమైన సూక్తులు,  ధర్మాలు,  బోధనలు సహేతుకంగా విభజించాలంటే విశేషమైన మేధస్సు కల వారై ఉండాలి. ఆ రోజుల్లో కాగితాలు, పుస్తకాలు కనీసం తాళపత్రాలు కూడా లేవు. కేవలం మాట,  మనసు, మేధస్సు మాత్రమే విభజన పరికరాలు. మూడు భాగములుగా విభజించిన  త్రిపిటకములే, బౌద్ధ మూల గ్రంథాలు. అవి 1.వినయ పిటకము, 2.సుత్త పిటకము, 3.అభిదమ్మ పిటకము.

1.వినయ పిటకము .ఇందు భిక్షువులు పాటించవలసిన నియమ నిబంధనలు ఉన్నాయి.

2.సుత్త పిటకము. ఇందులో బుద్ధుడు ఇతరులతో జరిపిన సంభాషణలు, ఉపదేశాలు, బోధనలు, భిక్షువులకు, ఉపాసకులకు ఇచ్చిన ధర్మ సందేశాలు పొందుపరిచారు.

3.అభిదమ్మ పిటకము. ఇందులో బౌద్ధ ధర్మ సిద్ధాంతాలకు లోతైన వివరణ, తత్వ పరమైన విషయాలపై ప్రసంగాలు, చర్చలు పొందుపరచారు.

గౌతమ బుద్ధుడు మహా నిర్వాణానికి  కొద్ది కాలానికి ముందు, రాజగృహలో (బీహార్ లోని పురాతన నగరం) ఏడు సంక్షేమ నియమాలు చెప్పాడు. అవి

      1.తరచూ సభ్యులందరూ కలసి సంఘ సమావేశాలు జరపాలి.

      2.ఐక్యంగా ఉండి సంఘ విధులు నిర్వహించాలి.

      3.సంఘ నియమాలు అందరూ పాటించాలి.

      4.సంఘ నాయకులను, అనుభవజ్ఞులైన సంఘ సభ్యులను గౌరవించాలి.

      5.అందరూ కలసి ప్రశాంతంగా, తమంతట తామే ఈ నియమాలను పాటించాలి.

      6.నియమాలను పాటించినంతకాలం వృద్ధి చెందుతారు.

      7.పాటించకపోతే పతనమవుతారు. 

ఎవరినీ ఎవరూ ఉద్ధరించలేరు. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నీకై నీవే తెలుసుకో. దేని వల్ల మానసిక సుఖ సంతోషాలు కలుగుతాయో, దానిని ఆచరించు. నీకు, సమాజానికి ఏది పనికి వస్తుందో దానిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనుసరించు. అజ్ఞానాన్ని జయించిన వాడే అర్హంతుడు అవుతాడు అని గౌతముడు చెప్పాడు.

బౌద్ధంలో మూడు రత్నాలు 

  1. బుద్ధం శరణం గచ్ఛామి:  నేను అంధ విశ్వాసాలకు బందీ కాకుండా, జ్ఞానాన్ని ఆశ్రయిస్తాను.
  2. ధర్మం శరణం గచ్ఛామి:  నేను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా, న్యాయానికే న్యాయమైన ధర్మాన్ని ఆశ్రయిస్తాను.
  3. సంఘం శరణం గచ్ఛామి:  అలౌకిక విషయాలు, విధానాల మీద ఆధారపడకుండా, సహచర మానవుల సంఘటిత శక్తిని ఆశ్రయిస్తాను.

మనసు  బ్రహ్మపదార్థం కాదు. ఆత్మలకు సంబంధించినది కాదు. పారలౌకిక విషయాలనుండి, ఆత్మల నుండి బయటకు వస్తే, మనసే అన్నిటికి మూలం, దుఃఖానికి కారణం అని తెలుస్తుంది. అప్పటిదాకా ఆత్మ, పరమాత్మల చుట్టూ తిరుగుతుంది ప్రపంచం. మనసుకి మనిషికి సంబంధించిన సిద్ధాంతమే బుద్ధుడు బోధించినది. బుద్ధుడు రాసిన గ్రంథం అంటూ ఏదీ లేదు. ఆయన బోధనలు, ఉపదేశాలు అనేక గ్రంథాలుగా ఏర్పడినాయి.

బుద్ధునికి ముందు సాంఖ్య సిద్ధాంతమే ప్రజలు విశ్వసించిన సిద్ధాంతం. జీవితంలో సంభవించే బాధలు, దుఃఖాలు  అనుభవించక తప్పదు అని చెప్తుంది సాంఖ్య సిద్ధాంతం. బుద్ధుడు చెప్పిన దుఃఖ నిర్మూలన గురించి తెలుసుకున్న ప్రజలు, చైతన్యవంతులై, అష్టాంగ మార్గాన్ని ఆచరించి, దుఃఖ విముక్తులై, శాక్యముని సిద్ధాంతాలు, సూత్రాలు పాటిస్తూ, భిక్షువులుగా, ఉపాసకులుగా, బౌద్ధాన్ని నలుదిక్కులా వ్యాపింపజేశారు.

బౌద్ధంలో బ్రహ్మవిహారాలుగా పేరుపొందిన నాలుగు భావాలు

1)మైత్రి-విశ్వప్రేమ -సకల జీవులపట్ల ప్రేమ కలిగి వుండటం

2)కరుణ -అన్ని జీవులపై కనికరం, దయ కలిగి వుండటం

3)ముదిత -ప్రసన్న చిత్తత, సర్వజనుల సంతోషమే తన సంతోషంగా భావించటం 

4)ఉపేక్ష -సమచిత్తత (కష్ట సుఖాలను ఒకేవిధంగా స్వీకరించటం)

బౌద్ధ సంస్క్రుతి నేర్పిన ఈ ఉదాత్తమైన  భావాలను ఉత్తమ విహారాలుగా చెప్తారు.

ప్రపంచంలో ప్రతి విషయం కార్యకారణ సంబంధం ద్వారా జరుగుతుంది. ప్రతిదీ మార్పుచెందేదే (ప్రతీత్య సముత్పాదం). ప్రతిదీ నశించేదే. ప్రతిదానికి మరొకటి ఖచ్చితంగా కారణం అవుతుంది. మొట్టమొదటగా బుద్ధుడు ప్రతిపాదించిన ఈ సూత్రం, శాస్త్రీయంగా, నేడు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది.

బుద్ధుని కాలంలో, ఉపదేశాలు, సందేశాలు, బిక్షు దీక్షలు పౌర్ణమి రోజున జరుగుతుండేవి. పౌర్ణమికి బౌద్ధంలో ప్రత్యేకత ఉంది. వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధుడు జన్మించాడు, జ్ఞానోదయం పొందిన రోజు, బుద్ధుడు మహానిర్వాణం చెందిన రోజు కూడా వైశాఖ పౌర్ణమియే. మరో విశేషమేమంటే బుద్ధుని భార్య యశోధర జన్మించినది వైశాఖ పౌర్ణమి నాడే. తరువాత వచ్చే జేష్ట మాస పౌర్ణమి రోజును, ఏరువాక పున్నమిగా జరుపుకునేవారు. మొదటి ధర్మచక్ర ప్రవర్తనం ఆషాడ పౌర్ణమి నాడు జరిగింది.  బుద్ధుడు బోధి పొందిన తరువాత శిష్యులకు మొట్టమొదటిసారి బోధ చేసింది, బౌద్ధ సంఘం పుట్టింది కూడా ఆ రోజే. మనకు  బౌద్ధం తోనే చాంద్రమాన పంచాంగం మొదలైనది.

బౌద్ధంలో వాడే కొన్ని పదాల గురించి తెలుసుకుందాము

బోధి:  అత్యున్నత జ్ఞానం, జ్ఞానోదయం

బోధిసత్వుడు: బుద్ధిత్వ ప్రాప్తికొరకు కార్యోన్ముఖుడై, పాటుపడుతున్న వ్యక్తి

 బుద్ధ, బుద్ధుడు:  పూర్ణ విముక్తిని సాధించి సర్వజ్ఞుడైన వ్యక్తి,  అంతిమ సత్యాన్ని చేరుకున్న వ్యక్తి

 విహారము:  బౌద్ధ భిక్షువులకు నివాస స్థలము, ఆరామము

 చైత్యము:  బౌద్ధుల ఆరాధనా స్థలము

 స్తూపము:  బుద్ధుని అవశేషాలపై నిర్మితమైన ప్రార్థనా మందిరము

 మోహము:  అజ్ఞానము, వివేకము లేకుండుట, ఆవిద్య

 ఆనాపానసతి: వచ్చిపోయే శ్వాసను గమనించడం, ఎరుక

  ఉపాసక: గృహస్థుగా ఉండే బౌద్ధ అనుయాయి

 సుత్త:  సూత్రము

 దమ్మ:  ధర్మం

 తణ్హ:  తృష్ణ, ఆరాటము, దాహము, కోరిక

 అరియ:  ఆర్య, ఉన్నత స్థాయి 

శాస్త: ఒక తప్పుడు భావాన్ని సంస్కరించి, దాని స్థానంలో కుశల భావాలను ప్రవేశపెట్టేవాడు (గురువు).

తథాగత:  అడుగడుగున యదార్థమునే, అనుభూతి పరమైన సత్యమునే  ఆచరిస్తూ, అంతిమ సత్యమును చేరుకున్న సర్వజ్ఞుడైన వాడని అర్థం. తన గురించి ప్రస్తావించేటప్పుడు, బుద్దుడు తనకు తనను సంబోధించు పదం తధాగతుడు.                 

ప్రపంచ తాత్విక చరిత్రలో, మహోన్నతమైన మానవవాద, హేతువాద తాత్విక శాఖగా, బౌద్ధాన్ని చెప్పవచ్చు. దీనిని ప్రాచీన కాలంలో ఉద్భవించిన, కులరహిత భావ విప్లవశాఖగా పరిగణించవచ్చు. భారతీయ తాత్విక చింతనలో బుద్ధుని బోధనలు ఉన్నతమైనవి. బౌద్ధం లాగా  మరేదీ  ప్రజలలోకి స్వచ్ఛందంగా వెళ్లలేదు. 

ప్రపంచంలో బుద్ధుడు అంతటి తాత్వికుడు లేడు. బౌద్ధానికి ధీటైన తత్వం మరొకటి లేదు. 

సంప్రదించిన గ్రంధాలు, లఘు చిత్రాలు:

1)బుద్ధ ధర్మ సారం – ఆంగ్ల మూలం: పి.లక్ష్మీ నరసు      తెలుగు: డి.చంద్రశేఖర్ 

2)బుద్ధుని బోధనలు – మూలం: వల్పోల రాహుల           తెలుగు: డి.చంద్రశేఖర్

3)గౌతమ బుద్దుడు – మూలం: ప్రొఫెసర్ మైకేల్ కారిథెర్స్ తెలుగు: డి.చంద్రశేఖర్  

4)బుద్ధుడు – బౌద్ధ ధమ్మము రచన: బి.ఆర్.అంబేడ్కర్ అనువాదం: డా.యెండ్లూరి 

5)విపశ్యన ధ్యానము – ఆచార్య శ్రీ సత్యనారాయణ గోయంకా

6)బుద్ధ-ధమ్మ-సంఘ – మూలం: ధర్మానంద కోసంబీ అనువాదం జె.లక్ష్మీరెడ్డి

7)బౌద్ధం అంటే – సంజీవదేవ్

8)బొర్రా గోవర్ధన్ – YouTube ఉపన్యాసాలు 

9)మిసిమి మాస పత్రికలు

*****

(ఇంకా ఉంది)

Please follow and like us: