లక్ష్మణశాస్త్రీయం
చుట్టుకునే బంధాలు (కథ)
రచన: వారణాసి నాగలక్ష్మి
గళం: లక్ష్మణశాస్త్రి
“పిన్నీ! వాట్ హాపెంటు అమ్మా?” అవతల్నించి ప్రశ్న. కత్తిదూసినట్టు.
గగనకి చాలా కోపం వచ్చినపుడు తన కంఠధ్వని కత్తితో కోస్తున్నట్టుంటుంది. మాట వేడిచువ్వతో వాత పెట్టినట్టుంటుంది.
పొద్దున్నే ఫోన్ చేసి పలకరింపుగా అన్నమొదటి వాక్యమే అది. ఎందుకో దానికి అక్క మీద చాలా కోపంగా, చిరాకుగా ఉందని అర్ధమైంది. గడియారం వైపు చూశా. నా యోగా క్లాసుకి టైమైపోతోంది.
“గగనా! ఏమిటైందో చెప్పకుండా అలా అడిగితే ఎలామ్మా?” అన్నా. ఏమైంది దీనికి మళ్లీ? ఈ మధ్య మరీ తల్లికీ కూతురికీ పడకుండా అయిపోతోందేమిటీ? ఎవరైనా దేశంలో ఉన్నన్నాళ్లూ తల్లిదండ్రులమీద చిర్రుబుర్రులాడినా, విదేశాలకి వెళ్లాక ఎక్కడలేని ప్రేమలూ ఒలకబోస్తారే!
“నీకు వినేందుకు టైముంటే చెప్తాను”. నిష్ఠూరం!
“అయిదు నిముషాలుందే. నేనో యోగా క్లాసుకి వెళ్తున్నానీ మధ్య. పద్మాంటీ వాళ్ల ఇంటి ఎదురుగా. ఆరున్నరకి అక్కడుండాలి” మాట్లాడుతూనే యోగా మాట్ తీసిపెట్టుకుని, మంచి నీళ్ల సీసా నింపుదామని వంటింట్లోకి వెళ్లాను.
“పిన్నీ! ఇపుడు మీకు ఆరుగంటలే అయిందింకా. అయిదు నిముషాల నడక. మనం ఇరవై నిముషాలు మాట్లాడుకోవచ్చు. ఇంత దూరంనించి నీతో అవసరం పడి ఫోన్ చేస్తే, నువ్వొక పది నిముషాలు ఆలస్యంగా వెళ్తే మాత్రం ఏమైంది?” అలకగా, డిమాండింగ్ గా అంది.
‘ఓసినీ’ అనుకున్నాను. “అలా కుదరదులే గాని, విషయం ఏమిటో చెప్పు”
“నెక్స్ట్ ఫ్రైడే నా ఫ్రెండ్స్ ముగ్గురు హైదరాబాద్ వస్తున్నారు పిన్నీ, ఒక వారం కోసం. ఇపుడు ఇంట్లో ఉంటున్నది అమ్మా నాన్నా ఇద్దరే కదా.. మామ్మకూడా ఇపుడు చిన్నమామ్మ దగ్గరే ఉంటోంది! మా ఇల్లు పెద్దది కదా అని మా ఇంట్లో ఉండచ్చని వాళ్లకి చెప్పాను. ‘అలా కుదరదు. ఎక్కడైనా హొటల్లో ఉండమని చెప్పు’ అంటోందిపుడు!! ఐ గాటె షాకాఫ్ మై లైఫ్! నేను కాలిఫోర్నియా వెళ్లినపుడు వీళ్లలో ఒకళ్లింట్లో ఉన్నాను రెండు రోజులు. ‘అమ్మా మాటిచ్చేశా కదా, ఈసారికి అడ్జస్టవు. నెక్స్ట్ టైమ్ అలాగే చెప్పచ్చు’ అంటే కనీసపు కర్టెసీ కూడా లేకుండా ‘నన్నడిగి మాటిచ్చావా?’ అంటోంది! ఏమైందీవిడకి?”
“వింతగా ఉందే” అన్నాను.
“సర్లే.. నీ అయిదు నిముషాలూ అయిపోయినట్టున్నాయి. థాంక్స్” అని ఠప్పున పెట్టేసింది.
నాకూ ఆశ్చర్యమే అనిపించింది. అక్కది ఇంటికే అంకితమైపోయిన గృహిణుల కోవ. బావగారూ, ఇద్దరాడపిల్లలు సుమనా, గగనా… వీళ్లే తన ప్రపంచం. కిందటేడాది దాకా అత్త మామల బాధ్యత ఉండేది. మామగారు చాలాకాలం అనారోగ్యంతో తీసుకుని కిందటి వేసవిలో పోయారు.
అత్తగారు, విజయవాడ దగ్గర్లో ఏదో పల్లెటూర్లో, భర్త పోయి ఒంటరిగా బతుకుతున్న తన చెల్లెలికి తోడుగా కొన్నాళ్లు ఉంటానంటే ఆర్నెల్ల క్రితం దింపి వచ్చారు బావగారు. అక్కడ పాడీ, పంటా, ఇంటి వెనకే కాపురమున్న పనివాళ్ల కుటుంబం, పల్లెటూరి వాతావరణం… ఇవన్నీ బాగా నచ్చేసి ఆవిడ అక్కడే ఉండిపోయారు. వీళ్లే అపుడపుడు కార్లో వెళ్లి చూసి వస్తున్నారు.
ఇద్దరు పిల్లలకీ మధ్య ఎనిమిదేళ్లు తేడా. సుమన చదువు పూర్తయేనాటికి గగన పదో తరగతిలోకొచ్చింది. బావగారిది తరచూ ప్రయాణాలుండే ఉద్యోగం కావడంతో పిల్లల బాధ్యత పూర్తిగా అక్క మీదే ఉండేది. పిల్లల చదువులు కాదుగానీ అక్కకి వాళ్లతో పాటు తనూ చదివినంత పనైంది. ఇంటెడు చాకిరీ చేసుకుని, మళ్లీ వాళ్ల పరీక్షలకీ, ఇంటర్వ్యూలకీ నిద్ర కాచి, అడిగినపుడల్లా వాళ్లకి టీ కాఫీలు చేసిచ్చి, ఏదన్నా తినాలనుందంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి తయారు చేసి అందించి, వాళ్లకి అవసరమైతే రికార్డులూ, మిస్సయిన క్లాసుల నోట్సులూ కూడా రాసిచ్చి… చేసి చేసి అలసిపోయింది.
సుమన ఇక్కడే ఎమ్ టెక్ చేసి తల్లీదండ్రీ చూసిన సంబంధం చేసుకుని ఇరవై నాలుగేళ్లకే అమెరికా వెళ్ళిపోయింది. గగన అలా కాకుండా ఎమ్మెస్ చేస్తాననీ, ఆ తర్వాతే పెళ్లి అనీ పట్టుపట్టి, కోరుకున్నచోట్ల సీటు రాక, వచ్చినచోట ఫీ వెయివర్ ఏమాత్రం లేకపోవడంతో మూడీగా అయిపోయి, చివరికి ఇంట్లో ఒప్పించి లోన్ తీసుకుని చదువుకి వెళ్ళింది. ఎమ్మెస్ అయినాక కూడా సరైన ఉద్యోగం రాక పీహెచ్డీలో చేరి నాలుగేళ్లయింది. ఇంక చదువు చివరికొస్తోందని అక్క ఎదురుచూస్తోంది. తనకి చదువులో వత్తిడీ, అక్కకి దాని పెళ్లి కాలేదని బెంగా కలిసి ఈ మధ్య ఇద్దరి మధ్యా అలకలూ, నిష్ఠూరాలూ, కోపాలూ ఎక్కువయ్యాయి.
అక్క బహు గుంభన మనిషి. పిల్లలైనా ఇంటి విషయాలు నాతో చెప్తారు గాని తను చెప్పదు.
పెళ్లవుతూనే వాళ్లత్తగారు చెప్పారట ‘ఇంట్లో సమస్యలూ గొడవలూ బయటివాళ్లకి చెప్పుకుంటే ఏముందమ్మా మనం తేలికైపోవడం తప్ప? సంసారంలో ప్రతి చిన్న గొడవ గురించీ, అభిప్రాయ భేదం గురించీ పుట్టింట్లోనో, ఇరుగుపొరుగులతోనో, స్నేహితులతోనో ఏదీ దాచుకోకుండా చెప్తారు కొందరు! శ్రద్ధగా వినేవాళ్లలో తొంభైశాతానికి అదో కాలక్షేపం! విన్నాక వాళ్లకీ వీళ్లకీ చిలవలు పలవలు కలిపి చెప్పడం సరదా. మిగిలిన పదిశాతానికి మనపట్ల అభిమానం ఉన్నా, వాళ్లు చేయగలిగిందేమీ ఉండదు అయ్యో అనడం తప్ప! అందుకే మన ఇంటి గుట్టు మనం కాపాడుకోవాలి. మన హుందాతనం మనం నిలుపుకోవాలి. నిగ్రహమనేది మొదట్లో సాధన చేస్తే తర్వాత అలవాటైపోతుంది’ అని.
“ఆవిడ వాళ్లింటి గుట్టు కాపాడుకుందుకు అలా చెప్పిందిలే” అన్నాను దాన్ని ఏడిపిస్తూ.
అక్క నవ్వేసి, “నువ్వు కోడలిగా ఉన్నపుడు అలాగే అనిపిస్తుందే. అత్తగారివైనపుడు అపుడు ఆ మాటలు నీకెంతో నచ్చుతాయి” అంది. నిజంగానే అత్తగారినయ్యాక ఆ మాటలు నాకెంతో నచ్చడం మొదలెట్టాయి.
***
మాది చాలా చిన్న కాలనీ. మొత్తం అరవై ఇళ్లు అంతే. ప్రతి నెలా మొదటి శనివారం సాయంత్రం నెలకొకళ్ల ఇంట్లో టీపార్టీ పెట్టుకుని, కాలనీ ఆడవాళ్లం కలుసుకుంటూ ఉంటాం.
ఇందిరా, రాఘవేంద్రా నలభయ్యో పడిలో ఉన్నసాఫ్ట్ వేర్ ఉద్యోగులు. మా వీధి చివరిల్లు అమ్మకానికి వస్తే మూడేళ్ల క్రితం కొనుక్కున్నారు. ‘పాపం పిల్లల్లేరుట’ అంటూ వాళ్లూ వీళ్లూ అనుకోగా విని నేనూ ‘అయ్యో పాపం’ అనుకోకపోలేదు. ఒక శనివారం మా టీపార్టీ వాళ్లింట్లో జరిగింది. ముందుగా మాలో మేం అనుకున్నాం, ఇందిర ముందు పిల్లల మాట ఎత్తి, తనని బాధపెట్టకూడదని.
తీరా చేసి వెళ్లాక మాటల మధ్య తనే తమకి పిల్లలు కలగకపోవడం గురించీ, ఇక పుట్టరని తెలిశాక తమ జీవితంలో తాము చేసుకున్న మార్పుల గురించీ కాజువల్ గా చెప్పి, ‘మా ఇంట్లో మేం ముసలివాళ్లమై మంచాన పడే వరకూ రబ్బర్ షీట్ల అవసరం ఉండదని తెలిసిపోయిందండీ’ అనేసరికి అందరం ఒక్కసారిగా నవ్వేశాం.
“పిల్లలూ, వాళ్ల బాలారిష్టాలూ, చదువులూ, పరీక్షలూ, పెళ్లిళ్లూ ఇవేవీ మా జీవితంలో ఉండవని తెలియగానే ఒక హాలీడే టైమ్ షేర్ కొనుక్కున్నామండీ. సమ్మర్ లో ఒకసారీ, వింటర్లో ఒకసారీ రెండు వెకేషన్స్ కి తప్పనిసరిగా వెళ్తాం. వాటిలో ఒకటి వీలైతే మా తోబుట్టువుల కుటుంబాలతో పెట్టుకుంటాం. రెండేళ్లకి ఒకసారి ఒక ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాం ఈ మధ్య. చూడాల్సిన దేశాలన్నీ రాసి పెట్టుకున్నాం, ఒక్కొక్కటే వరసగా చూసి రావాలని” అంటుంటే ఆ మొహంలో ఒక వింత మెరుపు.
తనంత ఓపెన్ గా మాట్లాడుతుంటే అడగాలనిపించి సూటిగా అడిగేశాను “ఇలా అని తెలిశాక కొంచెం కూడా నిరాశపడలేదా?” అని.
గల గలా నవ్వేసి “పడ్డాం. పడకుండా ఎలా అవుతుందీ?” అంది.
“ఎవరినీ పెంచుకోవాలనుకోలేదా?” అడిగింది ఎదురింటి ఉమ.
“లేదండీ. వి బోత్ ఆర్ హాపీ విత్ ఈచదర్. ఇక బయట ఎవరో ఒకరికి పరిమితం చేయాలనుకోలేదు మా ప్రేమని. దిల్ షుక్ నగర్ లో ‘అమృత బిందు’ ఆశ్రమం ఉంది కదా. అందులో పిల్లలకోసం ఒక యోగా టీచర్ నీ, ఒక సంగీతం టీచర్ నీ పెట్టి వాళ్ల జీతాలు మేం పే చేస్తున్నాం. వాళ్లకోసం వెతుకుతున్నపుడే యోగినీ మేడమ్ పరిచయం జరిగింది.
“నిజానికి మాకు మేమిద్దరమే చాలు. సినిమాలూ, షికార్లూ, పుస్తకాలూ, మ్యూజిక్ కాన్సర్ట్స్, డాన్స్ ప్రోగ్రామ్స్…అవసరాలకి సరిపడా డబ్బూ, ఎవరిమీదా ఆధారపడిపోనక్కర్లేనంత ఆరోగ్యం ఉండాలే గాని జీవితం హాయిగా గడపచ్చండీ” అంటుంటే “అంతే కాదు దంపతులిద్దరి మధ్యా సఖ్యత కూడా ఉండాలి… ముఖ్యంగా ఎంతగానో కోరుకున్నవి జరగనపుడు” అన్నాను. అంతా ‘అవునవును’ అంటుంటే తనూ ‘నిజమే’ అని ఒప్పుకుంది.
ఆవేళ వాళ్లపట్ల జాలితో వెళ్లినవాళ్లం, కాస్త అసూయ పడుతూ వెనక్కి తిరిగొచ్చాం! ఆ దంపతులని చూసొచ్చాక ‘అందినదానితో అందంగా ఎలా జీవించవచ్చో తెలియజెప్పడానికే వీళ్ల పరిచయం అయిందేమో’ అనిపించింది. ఇపుడు నా పిల్లలిద్దర్లో ఎవరికైనా పిల్లలు పుట్టరని తెలిసినా నాకంత బాధ కలగదేమో.
అమృత బిందు ఆశ్రమంలో పిల్లలకి యోగా నేర్పే ఆ టీచర్ పేరు యోగిని అవడం తమాషా! ఆవిడ దగ్గర మేం కూడా యోగా నేర్చుకోవాలనుకున్నపుడు ఇందిరే తమ డాబా మీద కావలసిన ఏర్పాట్లు చేసింది.
యోగాతో పాటు ఆవిడ మాకెన్నో నేర్పించింది. కనుముక్కుతీరూ మేని రంగూ ఎలా ఉన్నా, కేవలం కంఠస్వరాన్ని శ్రావ్యంగా మార్చుకోవడం, తీరువుగా కూర్చోవడం, నడవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, కోపతాపాలని అదుపులో ఉంచుకోవడం, ఆత్మ విశ్వాసంతో మెలగడం, తాను పొందినవాటిపట్ల కృతజ్ఞతగా ఉండడం…ఇవే మనిషిని అందంగా కనబడేలా చేస్తాయని ఆవిడ మాకు చూపించింది.
ఇంతవరకూ ఏ సమావేశమైనా ఆఖరి నిముషంలో వెళ్లే నేను, ఆవిడ పరిచయం తర్వాతే కొద్దిగా ముందుగా వెళ్లి స్థిమితంగా కూర్చోవడం, ఇతరుల సమయానికి విలువనివ్వడం నేర్చుకున్నాను. వాళ్ల డాబా మీదికి విస్తరించిన మామిడి కొమ్మల్నీ, వాటి మీదికి పాకి గాలికి ఊగే చమేలీ తీగ ఆకులూ మొగ్గల్నీ చూస్తూ కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు చేసుకోవడం కూడా దినచర్యలో నాకెంతో ఇష్టమైన భాగమైపోయింది.
ఎప్పటిలాగే క్లాసు ఏడున్నరకి అయిపోయింది. వెంటనే అక్కకి ఫోన్ చేశాను. బావగారు ఏదో పనిమీద వెళ్లారనీ, రాత్రికి వస్తారనీ చెప్పింది.
“అయితే ఖాళీగా ఉన్నావా ఇవాళ? నే రానా?… కలిసి గడుపుదామా?” అన్నా.
“అంతకంటేనా? రావే బాబూ!” అంది సంతోషంగా.
***
నే వెళ్లేసరికి అక్క, వాళ్లింటి ముందున్న చిన్నతోటలో ఉంది.
పలకరింపులయాక “ఇదిగో ఈ మాలీని పంపించేసి వస్తానే. ఒక్క పావుగంట. లోపల కూర్చో” అంది.
చుట్టూ చూస్తే లేతాకుపచ్చని ఆకులతో, దట్టమైన పసుపురంగు పూలతో ఉన్న తీగలు కింద పడున్నాయి. పందిరి మీదకి పాకి దట్టంగా అల్లుకుపోయిన పచ్చపూల తీగల్ని జాగ్రత్తగా కత్తిరించి తీసేస్తున్నాడు మాలీ.
“ఎంత బావున్నాయో ఆ పూలు, అలా కత్తిరించేశావేమిటే?” అన్నాను వాళ్లు చేస్తున్న పని చూస్తూ.
“ఈ తీగ వైల్డ్ గా పెరిగిపోతోందే. కంటింపైన రంగులో బోలెడు పూలు పూస్తోందని ప్రహరీ మీదికి పాకిద్దామని పెడితే, జాజి పందిరి మీదికి చకచకా పాకేసి చుట్టుకుపోతోంది” అంది.
“అయ్యో! పచ్చటి పూలూ, తీగలూ మనసెలా ఒప్పిందే బాబూ?” కాలి దగ్గర పడున్న పూలతీగని అపురూపంగా చేతిలోకి తీసుకున్నా.
“అదే మరి… ఆ పూల అందానికే ఇన్నాళ్లూ ఊరుకున్నాను గానీ, అది ఈ జాజితీగని బతకనివ్వడం లేదు. ఆ పూలు వీధికీ, ఇంటికీ అందాన్నిస్తున్నాయి నిజమే గాని ఈ జాజితీగ దేవుడిపూజకి సజ్జ నిండా పూలిస్తుంది! నా వేలిముడిలోకి దోసెడు మొగ్గలిస్తుంది! దేని దారి దానిదే. ఇపుడు మాత్రం ఏమైంది? ఈ మూల ప్రహరీగోడ మీద జాలీలాగా కట్టించాను చూడు. దానిమీదికి లాగి కట్టాం ఇప్పుడే. నెల రోజుల్లో దానికి అల్లుకుని, దాని మానాన అది బతుకుతుంది. ఈ జాజితీగ కూడా ఊపిరి పీల్చుకుంటుంది” అని, “దా.. వేడిగా ఏదైనా తాగుదాం” అంటూ వంటింట్లోకి దారితీసింది.
“పొద్దున్న గగన ఫోన్ చేసింది” అన్నా.
“ఏవిట్ట?” అంది తల తిప్పి చూస్తూ. తన పెదవుల మీద కనీ కనపడని ఒక నవ్వు.
“ఎందుకే అలా చెప్పావు? దాని ఫ్రెండ్స్ వస్తుంటే, ఇంత పెద్ద ఇంట్లో ఒక వారం రోజులుండడానికి చోటులేదా? అది కాలిఫోర్నియాలో వాళ్ల ఇంట్లో ఉన్నానని కూడా చెప్పింది కదా? దాన్ని వాళ్లెంతో బాగా చూసుకున్నారనీ…”
“కావచ్చు భానూ. వాళ్లని పిలిచి దానింట్లో హోస్ట్ చెయ్యమను! అది ఎంజాయ్ చేసిన సౌఖ్యాలకి నేను బదులు తీర్చాలనడమేమిటి?” అంది చాలా మామూలుగా.
నాకు షాక్ లాగా తగిలింది.
“అదేమిటే? అదెవరు నీకు? పరాయిదాని గురించి చెప్పినట్టు చెప్తున్నావు?” పిల్లల వెనకే వాళ్ల అవసరాలన్నీ తన నెత్తినేసుకుని తిరిగిన అక్కేనా ఇది?… కళ్లప్పగించి చూశాను.
“ఎవరా? ముప్ఫై దాటిన కూతురు. అదేనా అమెరికనైజ్ అయేది? నేను అవకూడదా?” అని చిన్నగా నవ్వి,
“ఇలా అది ఎవరో ఒకరి ఫేవర్స్ తీసుకోవడం, అవన్నీ నేను తీర్చడం…నాకు కొత్తేం కాదే. దాని ఫ్రెండ్స్ వస్తే వాళ్లు మనింట్లో మనుషుల్లాగా ఉంటారనుకున్నావా? వాళ్లకి మన భారతీయ వంటల రుచి చూపించాలి. మసాలా దోశెలూ, ఆలూ పరాఠాలూ, పెరుగు వడలూ ఇవన్నీ పెట్టాలి. మీ బావ రిటైరయారు కదా…ఊళ్లో టూరిస్ట్ స్పాట్స్ అన్నీ చూపించాలి. ఎందుకూ? వీళ్లు అక్కడికెళ్లి దానికి కృతజ్ఞతగా ఉండడానికి! అప్పటికీ ఊరగాయలు, పొళ్లు, తినుబండారాలు ఆర్నెల్లకోసారి కొరియర్ చేస్తూనే ఉంటాం. ఏం కావాలంటే అవి అడిగి చేయించుకుంటుంది. కానీ సంతృప్తి లేదే ఏం చేసినా. థాంక్యూ అన్న మాట లేదు దాని నిఘంటువులో”
నిజమే.. చిన్నప్పటినుంచి గగన కావాలన్నది డిమాండ్ చేసి చేయించుకునేది కానీ, మరీ అక్క చెప్తున్నట్టుగా అంత సెల్ఫిష్ గా మాకెపుడూ అనిపించలేదే?
“రెండేళ్లు ఎమ్మెస్ చేసింది. సగం ఫీజు మేమే కట్టాం. లివింగ్ ఎక్స్పెన్సెస్ మేమే పంపాం. ఏడాదికోసారి వచ్చింది గత ఆరేళ్లుగా. నీకు తెలియంది కాదు. అనుకున్నట్టు ఉద్యోగం రాలేదని పీ హెచ్డీ కి చేరింది. వచ్చే డబ్బు విరివిగా ఖర్చుపెట్టుకుంటోంది గాని, మాకైన ఖర్చులో కొంతేనా ఇద్దామని లేదు. రిటైర్మెంట్ కోసం దాచుకున్నది దానికి ఖర్చుపెట్టాం. ఎమ్మెస్ అయాక రెండేళ్లు నాన్చి, మేం చూసిన సంబంధమల్లా కాదని, చివరికి ఎవణ్నో ఇష్టపడ్డానని ఒప్పుకోమని షంటింది. నష్టపోయింది నా టైమ్ కదా. దానికేం? మాకిష్టం లేకపోయినా నీ ద్వారా మమ్మల్ని ఒప్పించింది. మామ్మా, తాతగార్ల మనసులు నొప్పించింది. ఎంగేజ్మెంట్ అయ్యాక వాడితో పడడంలేదు! వాడితో పెళ్లి కుదరదని తేల్చుకుందుకు మళ్లీ రెండేళ్లు. ఇంకేవో బెడిసికొట్టాయి. ఇపుడు మళ్లీ మేం చూసి కుదర్చాలనుంది దానికి. కానీ అక్కడుండి దీని తిక్కల్తో సర్దుకునేవాడు కావాలి. ‘నాకు మీరేం చూడక్కర్లేదు. నా సంగతి నేనే చూసుకుంటాను’ అని ఇన్నాళ్లూ అన్నాక ఇపుడు ‘మీరు చూడండి’ అనడానికి నామోషీ!
“మా బాధ్యతలయ్యాయని ఊపిరి పీల్చుకోవాలని మాకూ ఉంటుందిగా? నాకిపుడు అరవయ్యేళ్లు. పిల్లల చదువులూ, పెద్దదాని పెళ్లీ, పురుళ్లూ, ఆసుపత్రీ ఇల్లూ అన్నట్టు నాలుగేళ్ల పాటు సాగిన మామగారి అనారోగ్యం…ఇలా గడిచిపోయింది ఇన్నాళ్లూ. దీని పెళ్లై బాధ్యతలు పూర్తయితే నాకోసం ఎన్నో చేసుకోవాలనుంది. ఉండీ ఉడిగీ ఏదో ఒక పని పెడుతూనే ఉంటుంది ఇలా. అమ్మంటే అడిగినవన్నీ ఇచ్చే కల్పతరువులా కనిపిస్తోందేమో. అమెరికా అంటే అంత ఇష్టమైతే.. అక్కడి వాళ్లలా పదహారేళ్లనించీ కాకపోయినా పాతికేళ్లనించీ స్వతంత్రంగా బతకాలి. ఏదైనా కావాలంటే అడిగే పద్ధతొకటుంటుంది కదా భానూ? అడగమను… ప్రేమగా, రిక్వెస్టింగ్ గా. ఈ జబర్దస్తీ ఏమిటి? నా టైమ్ ని నా అంగీకారం లేకుండా దానికిష్టం వచ్చినవాళ్లకి ధారపోయడానికి కుదరదు.
“ఈ మధ్య మా మామగారు పోయాక ఓ మాట అనడం మొదలు పెట్టింది,. ‘మేం ఇద్దరం అక్కడ లేం. మామ్మ చిన్నమామ్మ దగ్గరే ఉంటోంది. నీ టైమంతా ఖాళీయే కదా’ అని! అక్కడికి నా టైమ్ వీళ్ల సేవలకోసమే ఉన్నట్టు! కిందటిమాటు అదొచ్చినపుడు రాంబాబాయ్ వచ్చి‘అక్కడే సెటిల్ అయిపోతారా? అమ్మా నాన్నా పెద్దవుతున్నారు. ఇద్దరూ దూరంగానే ఉంటే ఎలా?’ అంటే ‘అదేంటి తాతగారూ? నేను ప్రతి ఏడూ వచ్చి వెళ్తున్నా తెలుసా? ఎవ్రీ సింగిల్ ఇయర్!’ అంటోంది. నాకు నవ్వొచ్చింది”
“భలేదే. అదొచ్చి వెళ్లడమే నీకు ఫేవర్ అనుకుంటోందా?” అన్నాను.
“అదే చెప్తున్నా. మా అవసరాలకీ అనారోగ్యాలకీ తను తోడుండగలదా అని ఆయనడిగారు. అదేం చెప్తోంది? తనొచ్చి ఉన్నన్నాళ్లూ అమ్మకున్న వ్యాపకాలన్నీ మానిపించి, కావలసినవన్నీఅడిగి చేయించుకుని, షాపింగులు చేసుకుని, ఫ్రెండ్స్ దాన్ని చూడ్డానికొస్తే వాళ్లకి అమ్మచేత సేవలు చేయించి, వెళ్లే రోజు అమ్మా నాన్నా ఎయిర్పోర్టులో దింపితే, చేతులూపుతూ వెళ్తున్నానని చెప్తోంది గొప్పగా!
“ప్రతిసారీ అదొచ్చి వెళ్లాక మేం ఇంటికొచ్చి, నాలుగురోజులపాటు జ్వరం వచ్చినవాళ్లలా అయిపోయి, మెల్లిగా తేరుకుంటాం… తెలుసా? దాన్నించి ప్రేమ నిండిన చూపూ, ఇష్టంతో ఇచ్చే ఆలింగనమూ ఉండవే… వచ్చినపుడు ఎయిర్పోర్టులో ఇచ్చే ఒక హగ్గూ, వెళ్లేటపుడు ఇచ్చే రెండో హగ్గూ… అంతే”
ఇవన్నీ అక్క ఏ ఉద్వేగమూ కనపడకుండా కూతుర్ని స్కాన్ చేసిన రిపోర్టు చూపిస్తున్నట్టుగా చెప్తుంటే అవాక్కుగా వింటూండిపోయాను.
“భానూ! నేల నీటిఆవిరినందిస్తే ఆకాశం వాననీళ్ళిస్తుందే. ఒకవైపు నించే ఏదీ ప్రవహిస్తూ ఉండదు నిరంతరం! అందుకున్నదానికి ప్రతిగా ప్రేమా ఆపేక్షా అయినా ఇవ్వాలి కదా. మా మామగారు చూశావా ఏ చిన్న సేవ చేసినా ‘థాంక్యూ తల్లీ’ అనేవారు. ఆ కళ్లలోంచి వాత్సల్యం కురుస్తూ ఉండేది. కనీసం అది ఆశిస్తాం మనం, అందించే సేవలకి ప్రతిగా. పోన్లే కానీ. అయిందేదో అయిపోయింది. ఇపుడింక నా టైమ్ నాకు కావాలి. సెకండ్ ఇన్నింగ్స్ లో నా కోసం నేను గడపదలుచుకున్నాను. అదే చెప్పాను దానికి”
“మరి దాని పెళ్లి?” వెర్రిమొహం వేసుకుని అడిగాను.
“చేయననటం లేదే..మేం చూడాలంటే దాని ప్రవర్తనలో మార్పు రావాలి. నేను దానికోసం ఖర్చుచేసే సమయాన్ని అది గౌరవించాలి! ఖాళీగా ఉంది కనక కాలక్షేపం అందిస్తున్నానని అనుకుంటే కుదరదు. ‘అదో పెద్ద పీహెచ్డీ, నేను పనేమీ లేని హౌస్ వైఫ్’ అన్నట్టున్న దాని ధోరణి నాకు సరిపోవడం లేదు. నేను హోమ్ మేకర్ ని. దట్ వజ్ మై ఛాయిస్. అది పీ హెచ్డీ. అది దాని ఛాయిస్! ప్రేమతో అల్లుకునే అనుబంధాలకీ, ఊపిరాడనివ్వకుండా చుట్టుకునే బంధాలకీ తేడా ఉంటుంది!” అంది.
సాయంత్రం ఇంటికి వెళ్తూంటే అక్క గేటు దాకా వచ్చింది. అక్కతో పాటు పందిరి మీది జాజి తీగలు కూడా గాలికి తలలూపుతూ వీడ్కోలు చెప్పాయి.
*****
పేరు లక్ష్మణశాస్త్రి, పుట్టింది పెరిగింది కాకినాడ.
చదివింది గురుకుల పాఠశాల తాడికొండ, తరువాత కొన్ని యూజీలు, పీజీలు, ఇంకా వేలకొద్దీ పేజీలూ.
వృత్తి LIC of india లో అధికారిగా.
చక్కటి సంగీతమూ, సాహిత్యమూ బలమూ, బలహీనతానూ.
మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు రాజేశ్వరి గారూ!
చాలా బావుంది, ఇలా ఆలోచించటం అందరూ తల్లిదండ్రులు నేర్చుకోవాలి,నాకైతే చాలా చోట్ల నా అనుభవాలు కనిపించాయి వాడుకొని వదిలేసే బంధాల కు దూరంగా ఉండటం నేర్చుకోవాలి అవి మనం కన్నవాళ్ళైనా మనని కన్నవాళ్ళైనా,thank you కొత్తగా ఆలోచించమని చెప్పినందుకు.