విముక్త

-పద్మజ కుందుర్తి

 ఆఫీసులో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అనుపమకు ఈరోజు. అసలే కొత్తరాష్ట్రం కొత్త గవర్నమెంటూ కూడా కావటం తో రక రకాల పథకాలూ, లబ్ధిదారుల ఎంపికా, ఆతాలుకు ఫైళ్ళన్నీ ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా పేరుకుపోతున్నాయి. అసలే తరలివచ్చిన ఆఫీసు, హైదరాబాదు నించి వచ్చాక ఒక్కతే ఉంటుంది కనుక వీలైన, అన్నివసతులూఉన్న అపార్ట్మెంటు వెతుక్కోవడమే పెద్ద తలనెప్పిగా తయారైంది. మరీ దూరంగా పట్నంలో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లు దొరుకుతున్నా, కాస్త లేటైనా, తను స్కూటీమీద వెళ్ళేందుకు వీలుగా దగ్గరలో ఇల్లుతీసుకుందామని ఆలోచన. కారు ఎప్పుడోగానీ బయటికి తీయదు. ఆఫీస్ వెహికిల్ ఎలాగూ అందుబాటులో ఉంటుంది ఎప్పుడూ. 

       మరీ పల్లెప్రాంతం కావడం తో రకరకాల ప్రశ్నలతో విసిగించి, నాలుగేళ్ళపాటు   ఇల్లు ఖాళీ చేయకుండా అక్కడే  ఉంటానన్న గ్యారెంటీ ఇస్తేగానీ గానీ ఇల్లు దొరకలేదు అనుపమకి. మొదట విసిగించినా స్వతహాగా మంచివాళ్ళు కావటంతో పెద్దగా ఇబ్బందేమీ లేదు. పిల్లలు విదేశాల్లో ఉండటం తో అంత పెద్దఇంట్లో  ఒక్కరూ ఉండలేక అద్దెకిచ్చారు. ఏదన్నా పిండివంట వండినప్పుడో , మరీ ఆఫీసునుంచి లేటైనప్పుడో, ” ఈ పాటప్పుడు ఏం వండుకుంటావు లేమ్మా ” అంటూ ఏకూరో తెచ్చి ఇస్తుంది ఇంటావిడ. పెద్దమ్మా, పెదనాన్నా అంటూ వరసలు కలిపేసుకుని బాగానే ఉన్నారు.

      ఆఫీసులో చిన్న మీటింగ్ అటెండై తన డెస్క్ దగ్గరికి వచ్చేసరికి ఫోన్ ఒకటే మోగుతోంది. పావుగంట వ్యవధిలో మూడు మిస్స్డు కాల్స్ ఉన్నాయి. ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉండేలోగానే మళ్ళీ మోగింది ఫోను. ఫోను తీసి, “ హల్లో ..”.అన్న అనుపమకు అటునుంచి మౌనమే తప్ప సమాధానం లేదు. “హల్లో హల్లో”  అని పెట్టేసిన వెంటనే మళ్ళీ మోగింది ఫోను. కోపం గా ఫోన్ తీసి “ఎవరదీ ? ఫోన్ చేసిన వాళ్ళు మాట్లాడాలిగా …మాకు పనుల్లేవా ఇక్కడ? ఎవరు మీరు”  అని గద్దించింది. 

   అటువైపునుండి…..” హల్లో …ఫోన్ పెట్టెయ్యకు అనూ ….మాట్లాడేది నేను ….నేను”  అని చాలా చిన్న స్వరం ఉద్వేగం  తో వణుకుతూ వినిపించింది. ఒక్క సెకను పట్టింది అనుపమకు ఆ గొంతు గుర్తు పట్టడానికి. మనసులో అసహ్యం, బాధా, కోపం, జుగుప్సా లాంటి ఎన్నో భావాలు ముప్పిరిగొని ఆమెను ఒక్కసారిగా కుదిపేసాయి. ఠక్కున ఫోను పెట్టేసి ఒక్కసారి తలొంచుకుంది, ఆఫీసులో తనని ఎవరూ గమనించకూడదని. వణుకుతున్న చేతులని కంట్రోల్ చేసుకుంటూ చెమటతో తడిసిన నుదురు తుడుచుకుంది. మామూలుగా ఉండటానికి ఎంత ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు. టెన్షన్ వల్ల వచ్చిన తలనొప్పితో తల పగిలిపోయేలా ఉంది. పనిచాలా ఉన్నాకూడా ఆపూటకి పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేసింది.

   ఇంటి గెట్లో అడుగు పెట్టేసరికి ఓనర్స్ ఎక్కడికో ప్రయాణమవుతున్నారు. “ఈయన తమ్ముడికి బాగలేదమ్మాయ్. హైదరాబాదు వెళుతున్నాం. ఈయన కూడా కంటి ఆపరేషన్ చేయించుకోవాలట… నెలదాకా రాము. ఇల్లు జాగ్రత్త.”  అని చెప్పి వెళ్ళిపొయారు. ఇంట్లోకి వెళ్ళి మంచమ్మిద పడిపోయింది అనుపమ వెల్లువలా వచ్చే కన్నీళ్ళను ఆపే ప్రయత్నం చెయ్యలేదామె. ఎంతసేపు ఏడ్చిందో కళ్ళూ మొహం వాచిపోయాయి. అన్నం తినాలన్న మాటే మర్చిపోయింది. సాయంత్రం అయిపోయింది. పొద్దుగుంకటానికి సిద్ధం గాఉంది. కొంచెం నెమ్మదించాక,  లేచి ముఖం కడుక్కుని కాసిని కాఫీ కలుపుకుంది. కప్పుతీసుకుని నెమ్మదిగా మేడమీదకి వెళ్ళింది.

      పొలాల మీదనుంచి వీస్తున్న పైరగాలి కాస్త మండుతున్న ఆమె మనస్సును చల్లబరుస్తోంది. ఆ చల్లని గాలి ఆమె ముంగురులను సవరిస్తూ ఓదారుస్తోంది. కాసిని కాఫీ గుక్కలు ఆమె బాధని కొంత ఉపశమింపజేస్తున్నాయి ఆమె మనసు గతం లోకి పరుగులు తీస్తోంది. 

    “అబ్బాయికి రైల్వేలో మంచి ఉద్యోగం. దేశం లో ఎక్కడ తిరిగినా పాసులుంటాయి. ఒక్కతే ఆడపిల్లా, ఇద్దరు మొగపిల్లలు. పెద్దవాడిదేదో ప్రైవేటు కంపెనీ ఉద్యోగం. పెద్దకోడలు బ్యాంకి  ఉద్యోగి. తండ్రేమో రిటైర్డు ప్రభుత్వొద్యోగి. దేనికీ లోటులేని సంసారం. పిల్లాడు చక్కగా ఉన్నాడు. వంకపెట్టడానికి వీల్లేని సంబంధం.” అని నాన్న మురిసిపోతుంటే …”ఇంతకీ దానికిష్టముందో లేదో కనుక్కోండి తరవాతే పెళ్ళిచూపులు పెట్టుకుందాం” అంది అమ్మ. “దానిమొహం చిన్నపిల్ల దానికేం తెలుస్తాయి మంచీ చెడూ , పెద్దవాళ్ళం ఔనంటే …కాదంటుందా” అని  కొట్టిపారేసాడు నాన్న.

 “ అమ్మా నాకూ…. ఉద్యోగానికి వచ్చేనెల్లో ఇంటర్వ్యూ ఉందికదా… పైగా అతనిది సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం. నాదేమో స్టేటు గవర్నమెంటుది. అప్పుడు కాదంటే బాగోదేమో ఇంటర్వ్యూ అయ్యాక పెళ్ళి చూపులు అయితే బాగుంటుందేమో” అమ్మ దగ్గిర నసిగింది తను. అమ్మ చెప్పగానే ఇంతెత్తున లేచి, “ ఆలూ లేదూ చూలూ లేదూ అల్లుడిపేరు సోమలింగమనీ …ఇంటర్వ్యూనే కాని, వస్తుందో రాదో తెలియని ఉద్యోగాన్ని చూసుకొని మంచి సంబంధం వదులుకుంటామా …అయినా అదెంత పని అతనికి కావాలంటే ట్రా న్స్ఫర్  చెయించుకుంటాడులే …” ఎగతాళిగా నవ్వి దాటవేశాడు నాన్న.

    పెళ్ళిచూపుల్లో కూడా అతనికి చెప్పింది ఇంటర్వ్యూ సంగతి. “ఒక్కనెలపాటు మీరు మీ అభిప్రాయం చెప్పకండీ” అంటూ …అతనూ అంతే నవ్వేసి, “ఫర్వాలేదులెండి కొంచెం కష్టమైనా నేను ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. అయినా ఇంటర్వ్యూ కూడా కాలేదుగా” అని తేలిగ్గా తీసేసాడు. ఎవరూ కూడా తన మాటకి విలువివ్వలేదు. అసలు తనకి ఉద్యోగం వస్తుందని నమ్మలేదు. అమ్మ చెప్పినా నాన్న వినడు. మొత్తానికి వెంట వెంటనే అన్నీ జరిగి పదిహేను రోజుల్లో పెళ్ళైపోయింది.

    పెళ్ళయ్యాక ఆషాఢ మాసం అంటూ ఒక నెల ఇక్కడే ఉంది కనుక ఇంటర్వ్యూ కు హాజరైంది. శ్రావణ మాసం లో బొంబాయిలో కాపరం పెట్టించి ఒక వారం పాటు ఉండి, జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు అమ్మా నాన్నా. అతని కెప్పుడూ నైట్ డ్యూటీలూ …వేళకాని వేళలో రావటమూ, తినేసి వెళ్ళటమూ తప్ప నన్ను  బైటికి తీసుకుని సినిమాకో షికారుకో వెళదామన్న ధ్యాస ఉండేది కాదు. నెమ్మదిగా క్వార్టర్స్ లో పరిచయాలు పెంచుకుంది  చుట్టు పక్కల వాళ్ళతో వచ్చీరాని హిందీలో మాట్లాడుతుండేది  బోరు కొట్టకుండా. 

       నెమ్మదిగా రెండు నెలలు గడిచాయి. ఇంటర్వ్యూ రిజల్ట్స్ రాలేదనీ ఎవరో కోర్టు లో కేస్ వెయ్యడం వల్ల వాయిదా పడిందనీ తెలిసి బాధ పడింది తను. ఇంటిపక్క వాళ్ళతో బజారుకు వెళుతుంటే ఒకరోజు తెల్లగా బొద్దుగా ఉన్న ఒక గుజరాతీ ఆవిడ తనవైపు అదోలా చూస్తూ వెళ్ళడం, తన పక్కనున్నవాళ్ళు ఆవిడను చూస్తూ హిందీలో ఏదో అనుకుంటూ నవ్వుకోవడం చూసి ఎవరావిడా?  అని అడిగింది. వాళ్ళు వెకిలిగా నవ్వటమే గానీ సమాధానం చెప్పలేదు తనకు. ఇలా రెండు మూడు సార్లు జరిగేక తను గట్టిగా నిలదీస్తే ….వచ్చిన సమాధానానికి భూమి కంపించినట్లయ్యి కూలబడింది తను.

    పక్క క్వార్టర్ లో ఉండే అమ్మాయి తన ఈడుదే …”అక్కా ఆవిడ బీ బ్లాక్ లో మూడో నెంబర్ క్వార్టర్ లో ఉంటుంది. ఏడేళ్ళ క్రితం భర్త పోయాక ఆవిడకు ఉద్యోగమిచ్చారు. మీ వారికి మంచి దోస్తీ లే …అన్నకు డబల్ డ్యూటీ …అని నవ్వుకుంటున్నారు”  అని చెప్పింది. తను నాతో ముభావం గా ఉండటానికి ఇదేనా కారణం. భర్త లేని ఆడదని సాయం చేస్తూ ఉన్నారేమో …అంత మాత్రానికే ఎంత మాటలంటుంది పాడు ప్రపంచం …..ఇంతకు మించి చెడు ఆలోచించలేక పోయింది తన మనసు .

       కానీ మనసులో ఏమూలో చిన్న అనుమానం. మేము కొత్తగా పెళ్ళైన వాళ్ళలా ఉంటున్నామా? పక్క క్వార్టర్ లో ఉండే హీరాలాల్ ప్రతి ఆఫ్ డే రోజూ సరదాగా బయటికెళుతున్నాడు. అప్పుడప్పుడూ కుటుబంతో సినిమాలకు వెళతాడు. ఈయనకి ఒక్కడికేనా పని. అర్ధం కాని బాధేదో మనసులో మొదలైంది. “ఏమండీ! బోర్కొడుతోంది ఎక్కడికైనా వెళ్దామా?”  అని అడిగేసింది ఒకరోజు. “కుదరదు నైట్ డ్యూటీ ఉంది”  అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడతను. ఇంక ఆరాత్రి నిద్రపట్టలేదు. 

             తెల్లవారుతూనే లేచి గబగబా కాఫీ తాగి ఓ అరకిలో మీటరు దూరంలో ఉన్న B బ్లాక్ వైపు నడిచింది. కాలింగ్ బెల్  కొట్టగానే ఒక పది సంవత్సరాల బాబు తలుపు తీసాడు. “పప్పా దేఖో కోయీ ఆయా హై ఆప్కేలియే” అని ఇంట్లోకి వెళ్ళాడు. ఆ తెల్లని గుజరాతీ ఆవిడతోబాటు లుంగీ కట్టుకుని బైటకు వచ్చిన భర్తను చూసి నిర్ఘాంత పోయింది తను. భయంగా చూస్తున్న ఆవిడనీ…. నిర్లక్ష్యంగా చూస్తున్న భర్తనీ…. చూసి అసహ్యంతో నిలబడలేక వెనక్కి తిరిగి పరుగులాంటి నడకతో ఇల్లు చేరింది.

   ఇంట్లోకి ఎలావచ్చి పడిందో తెలియదు. ఏమీ చెయ్యలేని నిస్సహాయత. భాష రాక ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ.ఇలాంటి కష్టం ఒకటుంటుందని దాన్ని ఎదుర్కోవాలనీ తెలియని కొత్త అనుభవం ఏడ్చీ ఏడ్చీ కన్నీరు చారికలు కట్టిపోయాయి. విపరీతంగా జ్వరం. తనవొళ్ళు తనకే తెలియకుండా మంచమ్మీద పడుంది సాయంకాలం వరకూ. నెమ్మదిగా సాయంత్రానికి వెనక్కొచ్చాడతను. ఏమీ మాట్లాడకుండా స్నానం చేసి వంట చెయ్యలేదా అని అడిగాడు. ఆమెనుంచి సమాధానం రాకపొయ్యేసరికి చెప్పులు వేసుకుని గుమ్మం దాటుతున్న భర్తని, శక్తి అంతా కూడదీసుకుని గట్టిగా అడిగింది. 

        “ఇదంతా …ఇదంతా పెళ్ళికి ముందునుంచీ ఉందా? ఉంటే నాకెందుకు చెప్పలేదు. అసలు నన్నెందుకు పెళ్ళిచేసుకున్నారు.” అతను వెళ్ళబోయే వాడల్లా ఆగి ఏదో నిర్ణయించుకున్న వాడిలా తల పంకించి వెనక్కొచ్చాడు. “అవును… ఆవిడ పెళ్ళికి చాలా ముందునుంచీ నాకు తెలుసు. మేమిద్దరంకలిసే ఉంటున్నాం. అమ్మా వాళ్ళకు చెప్పి చూసాను వినక పోగా హడావుడిగా పెళ్ళిచేసారు. ఇది ఎప్పటికైనా నీకు తెలియాల్సిన విషయమే! నెమ్మదిగా చెబుదాం  అనుకున్నా …అతితెలివిగా ముందే తెలుసుకున్నావ్” అన్నాడు కోపంగా. తనే ఏదో మహాపరాధం చేసినట్లుగా. చెంపమీద ఛెళ్ళున చరుద్దామన్నంత కోపాన్ని దిగమింగుకుని,”  నేను తెలుసుకోవతం తప్పెలా అవుతుంది. ఇలాంటి చండాలం ఉన్నప్పుడు నన్నెందుకు మోసం చేసావ్? ” అని అడిగింది.

  “ఇందులో మోసమేంటి ఆవిడంటే ఇష్టం నీకు కూడా లోటు రానివ్వను” అన్నాడతను మామూలుగా …”అంటే!  నేను ఉంపుడుగత్తెనా! అడిగింది”  తను. నువ్వు ఉంపుడుగత్తె ఎలా అవుతావు నిన్ను పెళ్ళిచేసుకున్నాగ…” అన్నాడతను. “ఐతే అది ఉంపుడుగత్తా” …అడిగింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు పళ్ళు రాలతాయి జాగ్రత్త తను నా ప్రేయసి”  అన్నాడతను. “నోరు మూసుకు పడుండు …లేకపోతే పుట్టింటికి పోయి మీ అమ్మా నాన్నల పరువు గంగలో కలుపు నాకెందుకు”  అని విసురుగా వెళ్ళిపోయాడతను.

          ఆ రాత్రంతా నిద్రలేదు పిచ్చిదానిలా ఆలోచించింది. మళ్ళీ అతని మొహం చూడాలంటే అసహ్యం గా ఉంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయత …పోనీ ఆత్మహత్య చేసుకుంటే …మనసు ఎదురుతిరిగింది అతను తప్పుచేస్తే నువ్వెందుకు చావాలీ …అంటూ. తెల్లవారి తల్లికి ఫోను చేసి చెప్పుకుని ఏడ్చింది. తల్లి ఏడుస్తూ నువ్వు ముందు ఇంటికి వచ్చెయ్యి అంది. 

        మర్నాడు పొద్దున వచ్చాడతను. కనీసం తను తిన్నదో లేదో పట్టించుకోకుండా చాలా మామూలుగా ఉన్నాడతను. “నేను మావూరు వెళతాను చెప్పింది”  తను  వెంఠనే ఒక ఎగతాళి నవ్వు అతని మొహమ్మీద…… “వెళ్ళు… వెళ్ళి ఏంచేస్తావ్? మాయింట్లో అందరికీ తెలుసు ఈ విషయం. మీవాళ్ళతో చెప్పి నీ పరువు తీసుకుంటానంటే అభ్యంతరమేమీ  లేదు. కొన్నాళ్ళాగి అందరూ మొగుడొదిలేశాడు అంటే నువ్వేవస్తావ్” అన్నాడు. ఏమీ మాట్లాడలేదామె మర్నాడు టికెట్ కొని ట్రైన్ ఎక్కించాడామెను.

           తల్లీ తండ్రీ వచ్చారు స్టేషన్ కు .. “ఎంత దిగులు పడిందో పిల్లా …ఇంత చిక్కిపోయింది” అనుకున్నాడు నాన్న. తల్లి కావులించుకుని బావురు మంది. “అల్లుడుగారు ఎలాఉన్నారమ్మా” అని తండ్రి అడుగుతుంటే …తల్లివైపు చూసింది. ఇంకా చెప్పలేదని సైగ చేసింది తల్లి. ముభావంగా ఉన్న కూతురిని గమనిస్తూ ఏదో శంకించాడు తండ్రి. అయినా అచ్చమైన ఆడపిల్ల తండ్రిలా గుంభనం గా ఉండిపోయేడు.

    ఇంటికొచ్చాక తల్లి అన్నం కలిపి తినిపిస్తుంటే….. ఏడుస్తూ నాలుగు రోజుల ఆకలి తీరేలా ఇద్దరు తినే అన్నం తినేసి పడుకుంది. తను తేల్చుకోవాల్సిన విషయం ఇది.  ఇందులో అమ్మానాన్నలను అవసరమైతేనే ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకుంది. మర్నాడు అత్తవారింట్లో దించిన తండ్రితో “నేను సాయంత్రం వచ్చేస్తానాన్నా”  అని చెప్పి పంపించింది.

      అందరినీ కూచోపెట్టి  విషయం చెప్పింది. ఎవరూ పెద్దగా స్పందించలేదు. పైగా తప్పుదారిలో ఉన్న మొగుణ్ణి ఏలాగైనా  సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత భార్యదేననీ, అలా మొగుణ్ణి తన దారిలోకి తెచ్చుకోలేకపోవడం తన చాతగాని తనమేననీ తేల్చేసారు. అత్తగారైతే రహస్యం గా ” వాడు మొగవాడు  ఎలాగైనా ఉంటాడు. దాని దగ్గర  ఏమి నచ్చిందో వాడికి. ఆ హొయలేవో నువ్వూ చూపిస్తే నీదగ్గరే ఉంటాడు” అని  ఉచిత సలహా కూడా ఇచ్చింది.

    దుఃఖం పొంగుకొచ్చింది అనుపమకు చివరికి భర్త ఎలాంటివాడైనా ఆడది చాతగాకపోతే పడుండాలి అనిచెబుతున్న వాళ్ళ మీద అసహ్యం వేసింది. సాటి ఆడవాళ్ళుగా వాళ్ళ ప్రవర్తనకు సిగ్గనిపించింది. సాయంత్రం తండ్రి వచ్చేసరికి తండ్రికి విషయం చెప్పి, తను అక్కడినుంచి రావటమే తప్పన్నట్లు మాట్లాడి, పరువుగల కుటుంబమని చేసుకున్నాం. మా పరువు బజారున వేసింది మీ కూతురంటూ తండ్రినే తిట్టిపోసారు. అవమానం తో అన్నీ భరించి ఇంటికొచ్చి అమ్మనూ , తననూ తిట్టిపోసాడు తండ్రి .

    పదిరోజులు తండ్రి మాట్లాడక పొయినా అక్కడే పడుంది తను. ఈ పరిస్తితులలో తను గమనించుకోనేలేదు…నెలకూడా తప్పానన్న అనుమానం మొదలైంది. విషయం తెలిసిన నాన్న ఇంక పుట్టింట్లో ఉండటానికి వీల్లేదు, అల్లుడిగారి దగ్గర దించి వస్తాను పదమంటూ బలవంతం చేయసాగాడు.

    ఇంతలో దేవుడు కరుణించినట్లు ఇంటర్ వ్యూ లో సెలెక్ట్ అయ్యానని కాల్ లెటర్ వచ్చింది. పుట్టింటి కన్నా అదే కొండంత ధైర్యాన్ని ఇచ్చింది తనకు. నాన్న వారిస్తున్నా వినకుండా జాయినైంది. ఈలోగా నాన్న ఆయనకు ఎన్నోసార్లు ఫోన్ చేసాడు. పిల్లాడు పుట్టినా అత్తింటి వారు గానీ, ఆయనగానీ ఎవ్వరూ రాలేదు చూడటానికి. అమ్మే బాబు పెంపకం లో సాయం చేసింది. నాన్న బాధ చూడలేక…  “ఆవిడను వదిలేసి ఇటు వైపు ట్రాన్స్ఫర్ చేయించుకో మను నాన్నా…. కలిసుండటానికి నాకేమీ అభ్యంతరం లేదు” అనిచెప్పింది.

    “ఆ మాట నువ్వే చెప్పి ఒప్పించు” అని నాన్న వత్తిడి చేయడం తో రెండుమూడు సార్లు ఫోన్ చేసింది. ఆవిడలాగే ఉంటుంది ఉద్యోగం మానేసి కొడుకుని తీసుకుని వచ్చి కాళ్ళమీద పడితే దయతలచి ఇంట్లోకి రానిస్తాను. ఇద్దరూ ఒక ఇంట్లోనే ఉండాలి అని అతను చెప్పిన సమాధానం విని, నివ్వెరపోయింది. తండ్రి ఆ మాటకే  సంతోషించి, “అల్లుడుగారు క్షమించేసారు వెళ్ళమ్మా…నీకెందుకా ఉద్యోగం” అంటుంటే … “ఆడపిల్లలకు అమ్మానాన్నా కూడా అండగా లేకపోతే ఎలానాన్నా …అక్కడికి నేనెలా వెళ్ళను” అని ఏడ్చింది.

   అత్తారింట్లో అందరూ అబ్బాయి విషయం కప్పిపెట్టి. ఉద్యోగం కోసం మొగుణ్ణి వదిలేసిన దానిలా ప్రచారం చేస్తుంటే నిస్సహాయంగా ఊరుకుంది. పిల్లాడికి పదిహేను పదహారేళ్ళప్పుడు “అమ్మా! ఉద్యోగం కోసం నాన్నను వదిలేశావా నన్ను నాన్న ప్రేమకు దూరం చేసావా” అంటే ఎంత బాధ అనుభవించిందో తనకే తెలుసు.

      నిజం గానే తండ్రి ప్రేమకు దూరం చెశానేమో నన్న దిగులు ఆమెను వెంటాడి వేధించింది. ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ జాయినయ్యే శలవల్లో తండ్రిదగ్గరికి పంపించింది. నెలతిరక్కుండా తల్లిదగ్గరికి వచ్చి చుట్టేసుకుని…..” సారీ అమ్మా  విషయం  తెలియక నిన్ను నొప్పించాను. నాన్న చేసింది చాలాతప్పు. ముందుగా ఇంకొకావిడతో సంబంధం పెట్టుకుని నిన్ను మోసం చెయ్యటం తప్పు కదమ్మా”  అని ఏడుస్తుంటే … తన కొడుకు పెద్దవాడయ్యాడు, తన కష్టం సుఖం తెలుసుకున్నాడు. తండ్రిదగ్గరికి పంపించి మంచిపని చేసాను అనుకుంది.

   కొడుకు పైచదువులు చదివి, అమెరికాలో ఉద్యోగం చేస్తూ తను కోరుకున్న అమ్మాయిని పెళ్ళిచేసుకుంటానంటే ఆనందం గా దీవించింది. బాబు తో పాటుగా “అమ్మా” అని పిలిచే కోడలిని కూతురంత ప్రేమగా  చూసుకుంటోంది పెళ్ళికి కబురు పంపినా రాని భర్తని తలచుకు నిట్టూర్చిందేకానీ ఏవరినీ ఏమీ అనలేదు. అతను రిటైర్ అయిపోయాడని తెలిసింది. ఆరోగ్యం దెబ్బతిందని కూడా తెలిసింది. తనూ ఇంకా నాలుగేళ్ళలో రిటైరవబోతోంది.

     ఇంతలో అకస్మాత్తుగా ఏన్నో ఏళ్ళ తరువాత ఈరోజు అతన్నించి ఫోను….. ఎందుకో అర్ధం కాలేదు.ఇంతలో ఫోన్ మోగింది పొద్దుటి నెంబరేమో అని చూసింది కాదు ఇది ఇంకో కొత్త నెంబరు! తీయాలని పించలేదు కానీ పదే పదే మోగుతుంటే తప్పలేదు. అది తన భర్త అన్నగారి నుంచి, “అమ్మాయ్ వాడికి అసలు ఆరోగ్యం బాగాలేదమ్మా …ఒకసారి చూసిపో ..భార్యా భర్త లన్నాక గొడవలు వస్తాయి. పెరాలసిస్ తో కాలూ చెయ్యీ పడిపోయాయి. భర్తని ఈ పరిస్థితులలో పట్టించుకోక పోవడం న్యాయం కాదు ….” అతను మాట్లాడు తుండగానే ఠక్కున పెట్టేసింది ఫోను.

      ఇప్పుడర్ధమైంది విషయం అనుపమకు అతను తీవ్రమైన అనారోగ్యం తో ఉన్నాడు. ఇప్పుడతనికి సేవ చెయ్యటానికి ఎవరైనా కావాలి. జీతం భత్యం లేని సేవకురాలు ఇల్లాలికంటే ఇంకెవరుంటారు!!  కొడుక్కి ఫోన్ చేసింది. జరిగిన సంఘటనలు  చెప్పగానే …చాలా బాధ పడ్డాడు. “కొంచెం ఆలోచించుకుని సమాధానం చెప్పమ్మా..నువ్వూ పెద్దదానివి  అయిపోయావు. ఈ వయసులో ఈ జంఝాటాలు  ఎందుకునీకు? నీ కిష్టమైతే కాదనను కానీ ఆలోచించి నిర్ణయం తీసుకో” అన్నాడు.

         మర్రోజు ఆఫీసుకు వెళ్ళిందే గానీ పనిమీద మనసు లగ్నం  చెయలేకపోయింది. రెండుమూడు సార్లు భర్త దగ్గరినుంచి నిన్న వచ్చిన నెంబర్నించే ఫోన్ వచ్చిందిగానీ తియ్యలేదు. మనసంతా బాధ స్త్రీ గా  పుట్టటమే తను చేసిన తప్పేమో నన్న  అపరాధ భావన. తెచ్చుకున్న భొజనం సహించలేదు. ఆరాత్రంతా కూడా నిద్రకు దూరమై మనసు విలవిలలాడిపోయింది.

        మూడోరోజు చీకటి పడ్డాక ఆఫీసునించివచ్చి తాళం తీస్తుంటే గోడపక్కన క్రీనీడలో ఎవరో …ఉలికిపాటుతో చూస్తే ..అమ్మా నాన్న, తోడికోడలూ బావగారూ, ఇంకా వృద్ధురాలై నడవలేని అత్తగారూనూ …అందరూ  కలిసేవచ్చారని అర్ధమవుతూంది. ఉపోద్ఘాతం గా నాన్న మొదలెట్టారు. “చూడుతల్లీ …మేమూ పెద్దవాళ్ళమైపోయాం. మీ ఆయన తన తప్పు తెలుసుకొని ఇంటికి వస్తానంటున్నాడట. క్షమించి రమ్మనటం భార్యగా నీ ధర్మం. అయిందేదో అయిపోయింది ఇంక కలిసి ఉండండి” అని చెప్పాడు కోర్టులోని జడ్జ్ లాగా.

    తను అమ్మవైపు చూసింది అమ్మ తనవైపు జాలిగా చూస్తోంది. ఏదో చెప్పాలని ప్రయత్నించినా చెప్పలేని భయం ఆమెలో తనకు స్పష్టంగా తెలుస్తోంది.  బావగారు కూడా “ఇంకా ఈ పంతాలవీ ఎందుకమ్మా ఇద్దరూ కలిసి ఉండండి. నీకూ సంఘం లో గౌరవం ఉంటుందీ” అన్నాడు. తోడికోడలు …”  ఆవిడనుకూడా వదిలేసి నీదగ్గరికొస్తున్నాడంటే ఎంత అదృష్టవంతురాలివో చూడు ఇప్పటికైనా నీ నోములు ఫలించి ఆదేముడు నిన్ను కరుణించాడు”  అంది అదేదో సిరియల్ లోని కారెక్టర్ ఆర్టిస్టులా చేతులు తిప్పుతూ. 

      వయసైపోయినా గొంతులో ధాటి ఇంకా తగ్గని అత్తగారు “అందరూ ఇంతలాచెబుతుంటే మాట్లాడవేం” అని గద్దించింది. ఇంక సహనం చచ్చిపోయింది అనుపమకు, “ఏం మాట్లాడ మంటారు … ” పెళ్ళికి ముందే ఇంకో ఆడదాని తో కలిసి ఉంటూ నన్ను పెళ్ళిచేసుకుని మోసగించిన  మీ కొడుకుని ఇలా అడగలేక పోయారేం. అన్నీ తెలిసి హడావుడిగా పదిహేనురోజుల్లో పెళ్ళి జరిపించిన మిమ్మల్ని ఏమీ చేయలేక పోయాననేగా ఈ అలుసు.”

      ” అయినా మీరేంటి నాన్నా ధర్మం గురించి మాట్లాడుతున్నారూ…. మోసపోయాను నాన్నా అంటూ కన్నీటితో  వచ్చిన కూతురిని నిర్దాక్షిణ్యం గా తిరిగి భర్త దగ్గరకు పొమ్మనటధర్మమా?. ” ఏమిటి అక్కయ్యగారూ …నా నోములు ఫలించాయా …నా కాపురం బాగుంటే చాలనుకున్నారు గానీ భర్తనుంచి మోసపోయి వచ్చానే …ఈ బుద్ధులు అప్పట్లో మీ మరిదిగారికి ఎందుకు చెప్పలేదూ.”

     “ అందరూ మీ ఇంటి పరువునో గౌరవాన్నో కాపాడే వస్తువుగా నన్ను   చూసారేకాని… నేనూ మనిషినేననీ …ఆ చిన్నవయసులో దెబ్బతిన్న నా మనసుకు స్వాంతన కలిగించాలనీ … అతనిని సరైన దారిలో  పెట్టాలనీఒక్కళ్ళైనా అనుకున్నారా ..?” 

        “ పసివాడితో నేను ఎన్ని కష్టాలు  పడ్డానో ఏవరైనా గ్రహించారా. పిల్లాడు పుట్టినా చూడటానికి రానివాళ్ళకు,  ఇవ్వాళ నేనా ఇంటి కోడలినని గుర్తొచ్చిందా …?. అసలు ఈరోజుకి అతనికికూడా నేను భార్యనన్న సత్యం తెలిసిందా …. ఇప్పుడు అతడిని ఆమె వదిలేశాక …అతడికో సాయం కావాలి. ఇప్పుడు అతను మీకు భారమవుతున్నాడు.”

      ” ఇప్పుడాబరువు మీరు దించుకోవడానికీ  నా  నెత్తిన పెట్టడానికీ  వచ్చారంతే… ఎలాగూ పోయిన పరువు ఇప్పుడు మీకు కొత్తగా తిరిగిరాదు నాన్నా…ఇప్పటికైనా నామీద కనీసం ఆడపిల్ల నన్న జాలి చూపించండి ఇన్నేళ్ళుగా నేననుభవించిన బాధ చాలు”  అంది. తండ్రి విసురుగా కుర్చీలోనించి లేచి బయటికి వెళ్ళిపోయాడు.

    అత్తగారు విసురుగా ” మరి వాడిని వద్దను కున్నప్పుడు ఈ పసుపు కుంకుమలూ గాజులూ ఎందుకు ఈ ముత్తైదు తనమంతా వాడిచ్చినదేగా …. ఇవన్నీ పెట్టుకు కులుకుతున్నావు. మొగుడు కావాలా ఉద్యోగం కావాలా అంటే ఉద్యోగమే కావాలని వచ్చావు”  అంది కసిగా. 

        “ చూడండీ ఈబొట్టూ గాజులూ నా చిన్నప్పుడే వచ్చాయి నాకు. పెళ్ళయ్యాక ఈ మంగళసూత్రమూ దానితో బాటుగా కన్నీళ్ళే తోడుగా వచ్చాయి. ఈ ఉద్యోగం నేనో మనిషిగా నిలబడటానికి సాయం చేసింది. దీనికోసమేనా ఇంతదూరం వచ్చారూ”  అంటూ మెడలోని గొలుసు తీసి అత్తగారి చేతిలో పెట్టి, “ఇంక దయచేసి వెళ్ళిపోండి. అతనికీ నాకూఏ సంబంధమూ లేదు” అని రెండుచేతులు జోడించి బయటకు దారి చూపించిది. 

       అందరూ ఆమెను తిట్టుకుంటూ , నానా మాటలూ  అంటూ కారెక్కి వెళ్ళిపోయారు.  కన్నీళ్ళతో తల్లిమాత్రం కావులించుకుని మంచిపని చేసావ్ అన్నట్లుగా భుజం తట్టి వెళ్ళిపోయింది. వెనుతిరిగి ఇంట్లో కొస్తుంటే ఇంటిఒనరు ఆమెనే చూస్తూ నిలబడి ఉంది  అనుపమ తడబడుతూ అదికాదండీ …అని ఏదో చెప్పబోతుంటే …చటుక్కున కావలించుకొని ” ఎన్ని కష్టాలు పడ్డావమ్మా ..అసలు అన్నం తిని ఎన్నిరోజులైంది”  అని ఇంట్లోకి తీసుకు వెళ్ళి భోజనం పెడుతుంటే …అప్పుడు వచ్చింది గంగా ప్రవాహం లా ఏడుపు …

   ఆ వుధృతి తగ్గేదాకా ఏడవనిచ్చి,  పక్కనకూర్చొని కడుపునిండా భోజనం పెట్టి,  “మంచినిర్ణయం తీసుకున్నావమ్మా… ఇక దానిగురించి విచారించకు, మేము పెదనాన్నగారికి ఆపరేషన్ కి డేటు మూణ్ణెల్ల తరువాత దోరకడం తో  అనుకోకుండా రావడం మంచిదైంది.”  అని ధైర్యం చెప్పి పంపించింది. 

     కొడుక్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. కోడలు కూడా “మంచినిర్ణయం తీసుకున్నారు అత్తమ్మా …V R S తీసుకుని వచ్చెయ్యండి ఇక్కడికి పుట్టబొయే మనవరాలితో హాయిగా ఆడుకుందురు”  అని గుడ్ న్యూస్ కూ చెప్పింది.

      సంతోషంతో మనసు హాయిగా ఉంది ఆమెకు. ఏళ్ళతరబడీ మోసిన భారమేదో దించేసుకున్నట్లు తేలిగ్గా అనిపించింది. చాలారోజుల తరువాత ప్రశాంతంగా నిద్రపోయింది అనుపమ. రేపటి వెలుగురేకుల వేకువను  తలుచుకుంటూ 

****

Please follow and like us:

7 thoughts on “విముక్త (కథ)”

  1. ముగింపు చాలా బాగుంది ఈ రోజులో కూడా అలాంటి తల్లి దండ్రుల ఉన్నారు ఉద్యోగం రాక పోతే అప్పుడు కధ ఎలా ఉండెది

  2. పద్మజగారూ, ఒక జీవితాన్ని కథలో చూపించారు. వాస్తవానికి అద్దం పట్టింది.

Leave a Reply

Your email address will not be published.