మాతృదీవెన

-ఆదూరి హైమావతి 

 నారాయణపురం అనేగ్రామంలో అనంతమ్మ తన ఏకైక కుమారుడైన నారాయణతో జీవిస్తుండేది.ఆమె భర్త ఎండుకట్టెలు అడవినుంచీతెచ్చి అమ్మి సంసారం గడిపేవాడు. ఒకరోజున కట్టెలకోసం అడవికివెళ్ళి గంధం చెట్టు ఎండుకట్టెలు కొడు తుండగా నాగుపాము కాటేసి అక్కడికక్కడే మరణించాడు.

      అనంతమ్మ ఎంతో నిబ్బరంగా  తన గుడిసె చుట్టూతా కూర పాదులు పెంచుకుంటూ ,అవి అమ్ముకుని వచ్చిన సొమ్ముతో పొదుపుగా  ,కుదురుగా కుమారుని పోషించుకుంటూ జీవించేది.

   నారాయణ కూడా తల్లి రాగన్నం పెట్టినా, జొన్నన్నం పెట్టినా, గంజి ఇచ్చినా మారుమాట్లాడక త్రాగి చదువు కోసం పక్కూరుకు వెళ్ళేవాడు.వారి ఊర్లో ప్రాధమిక పాఠశాలమాత్రమే ఉండేది. పక్కూరు కొంచెం పెద్దది హైస్కూల్ వరకూ ఉంది. అదయ్యాక ‘ఏమిచేయాలా ‘అని తల్లీ కొడుకూ ఆలోచించేవారు.

 అంతా భగవంతుడైన ఆనారాయణునికే వదలి ప్రస్తుత చదువు కానిమ్మని తల్లి చెప్పినమాట విని రోజూ స్కూల్ కెళ్ళేప్పుడు తన మనసులో కోర్కె తీరేలా చేయ మని భగవతుని మనస్సులోనే ప్రార్ధిస్తూ , తల్లికాళ్ళకు మొక్కుకుని వెళ్ళేవాడు.ఆమె మనస్సు లో  “సామీ !ఆడికోరిక తీర్చు”అని దీవించేది.

 నారాయణకు చదువు ప్రాణమైతే ,ఆటలు అందులోనూ పరుగు పందెం చాలా ఇష్టం.స్కూలుకు తనతోటి వారు ఐదుమందీ నడచి వెళుతుంటే  నారాయణ మాత్రం పరుగుతో వెళ్ళి.వారు నడిచి వచ్చేలోగా మూడు మార్లు అటూ ఇటూ పరుగెత్తేవాడు. స్కూల్ ముందున్న బావి వద్ద కాళ్ళు, చేతులు, మొహం కడు క్కుని, ఒంటి చమట కడుక్కుని క్లాసులోకి వెళ్ళేవాడు.

  తోటివారు “ఒరే వీడు ఒలింపిక్సు లో పాల్గొని బంగారు పతకం గెలవాలని ఆశపడుతున్నాడురా!తిండికి ఠికాణా [గతి]లేదు కోర్కెలు మాత్రం ఆకాశానికి ” అని హేళన చేసేవారు. 

వారు హేళన చేసినప్పుడల్లా మనస్సులో అమ్మ పాదాలకు నమస్కరించుకుని , భగవంతుని ప్రార్ధించుకుని తన కోర్కె తీర్చమని కోరే వాడు .

 ఆఏడాది సంవత్సరాంతపు పోటీల్లో ఏడోక్లాసులో ఉన్న నారా యణ స్కూలు ఫస్టు వచ్చాడు.మరు సంవత్సరం, మండల  స్థాయి గ్రామీణక్రీడా పోటీల్లో నారాయణే ప్రధముడుగా నిలి చాడు. పదోక్లాసుకు వచ్చే సరికి జిల్లా స్థాయిలోనూ, రాష్ట్రస్థాయి లోనూ అనేక పరుగుపందాల్లో అనేకానేక ప్రధమ బహుమతు లతో,ప్రభుత్వ క్రీడా విభాగపు దృష్టిలో పడ్దాడు.

  వారు పదోక్లాస్ పరీక్షలు కాగానే అతడిని ఎంపిక చేసి గ్రామీణ క్రీడల విభాగంలో ,నగరంలో అటూ చదువూ, ఇటు క్రీడలో అభ్యాసమూ ఇవ్వసాగారు. గ్రామంలో వున్న వంటరి అమ్మను చూడను అప్పుడప్పుడూ వచ్చే వాడు. తల్లి తనకోసం దాచి ఉంచినసొమ్ము ఇవ్వగా దాన్ని భద్రంగా దాచుకునేవాడు. మిగతావారిలా బయట తిండ్లు తినక ,పరుగు పందెంలో పాల్గొన ను బలంకోసం  రాగిజావ త్రాగేవాడు.

 అతడి ఇంటర్ మీడియేట్ పరీక్షలుకాగానే జరిగిన క్రీడా పోటీల్లో దేశస్థాయిలో ప్రధముడుగా రావటాన నారాయణను ఒలింపిక్స్ కు ఎంపికచేసి ,ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వను వేరే స్థలానికి తరలించేప్పుడు వచ్చి, అమ్మకు మొక్కుకుని తన ధ్యేయం నెర వేరేలాగా దీవించమనికోరగా ఆపిచ్చితల్లి,

 ” నాయనా! నీపేరే నారాయణ, ఆనారాయడుడే నీ కన్నీ ఆయన్ని వేడుకో” అని చెప్పింది.

 నారాయణ ప్రత్యేక శిక్షణ అనంతరం ఒలుంపిక్స్ లో పాల్గొని గోల్డ్ మెడల్ అందుకున్నాడంటే అంతా అతడి దీక్ష, పట్టుదల,  ప్రేమ, భగవంతుని పై భక్తీ. పట్టుదలతో సాధిస్తే కానిదే లేదని నారాయణ అందరికీ చాటాడు. 

కనుక బాలలూ ! ఏదైనా ఒక ధ్యేయంతో ముందుకు  పట్టుదలగా సాగాలి, సాధించాలి. పల్లెవారైనా,పేదవారైనా నేనెందుకు  పనికి  వస్తాను? అనుకోక ‘ఎందుకుపనికిరాను? ఎందుకు చేయకేను?’ అనే పాజిటివ్ భావాలతో ముందుకుసాగితే సాధిచలేనిది ఏదీ లేదు.   

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.