అనుసృజన
నిర్మల
(భాగం-12)
అనుసృజన:ఆర్. శాంతసుందరి
హిందీ మూలం: ప్రేమ్ చంద్
మూడు గంటలకి జియారామ్ స్కూలునుంచి వచ్చాడు.వాడు వచ్చాడని తెలిసి నిర్మల లేచి వాడి గదివైపు పిచ్చిదానిఆ పరిగెత్తింది.”బాబూ, తమాషాకి నా నగలు తీస్తే ఇచ్చెయ్యవా? నన్నేడిపిస్తే నీకేం లాభం చెప్పు?” అంది.
ఒక్క క్షణం వాడు గతుక్కుమన్నాడు.దొంగతనం చెయ్యటం వాడికిది మొదటిసారి.ఇంకొకరిని హింసించి ఆనందం పొందేంత కరకుదనం ఇంకా వాడిలో చోటు చేసుకోలేదు.వాడి దగ్గర ఆ నగల పెట్టే ఉంటే, దాన్ని ఎవరూ చూడకుండా ఆ గూట్లో పెట్టేసేవాడే.కానీ అదిప్పుడు వాడి దగ్గర లేదు.వాడి స్నేహితులు ఆ నగలని ఎప్పుడో అమ్మేశారు.దొంగలు తమని తాము రక్షించుకునేందుకు ఎప్పుడూ అబద్ధాలనే ఆశ్రయిస్తారు.అందుకే,”అదేమిటమ్మా అలా అంటారు? నేనలాటి పని ఎందుకు చేస్తాను?మీతో పరాచికాలాడతానా?ఇంకా మీకు నామీద అనుమానమేనా?రాత్రి నేనసలు ఇంట్లోనే లేనని చెప్పా కదా? నేను అంత నీచుణ్ణని ఎలా అనుకుంటున్నారు?” అన్నాడు జియారామ్.
“లేదు బాబూ, నీ మీద అనుమానంతో కాదు, నువ్వు దొంగవనీ కాదు, తమాషాకి అలా చేశావేమోనని అంటున్నాను.”
“సరే పదండి అసలు మీ నగలు ఎవరు ఎత్తుకెళ్ళారో, దొంగ లోపలికి ఎలా వచ్చాడో చూద్దాం.”
“మొత్తం ఇల్లంతా గాలించాం, ఇంకా ఎక్కడ వెతకమంటావు?”
“అయినా మీరు అంత మొద్దు నిద్రపోతారేమిటి?”
***
నాలుగ్గంటలకి తోతారామ్ ఇంటికొచ్చాడు.నిర్మల పరిస్థితి చూసి,” ఏమంది? ఒంట్లో బాగాలేదా? ” అంటూ ఆశని ఎత్తుకున్నాడు.
నిర్మలకి ఏం జవాబు చెప్పాలో తెలీక మళ్ళీ ఏడుపు లంకించుకుంది.
అక్కడే ఉన్న పనిమనిషి,” ఇన్నేళ్ళుగా మీ ఇంట్లో పనిచేస్తున్నాను.ఎన్నడూ ఒక్క పూచికపుల్లైనా పోలేదు. లోకం ఇది నా పనే అంటుంది కదూ?” అంది.
చొక్కా గుండీలు విప్పుతున్న తోతారామ్ మళ్ళీ పెట్టుకుంటూ,”ఏమైంది? ఏదైనా వస్తువు పోయిందా?” అన్నాడు.
“అమ్మగారి నగలన్నీ ఎవరో దొంగిలించారు.”
“ఎక్కడ పెట్టావు?” అన్నాడాయన నిర్మలతో.
నిర్మల ఏడుస్తూనే రాత్రి జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది.కానీ జియారామ్ ని పోలిన మనిషి తన గదిలోంచి బైటికి వెళ్తూండగా చూశానని మాత్రం చెప్పలేదు.
తోతారం నిట్టూరుస్తూ,” మూలిగే నక్క మీదే తాటిపండు పడుతుంది.దేవుడికి మనమీద ఎందుకింత కక్ష?మనకి చెడ్డరోజులొచ్చినట్టున్నాయి…కానీ దొంగ లోపలికెలా వచ్చాడు? ఎక్కడా కన్నం వేసి లేదు ,ఏదారిన వచినట్టు? ఏం పాపం చేశానో ఇలాటి శిక్ష అనుభవించేందుకు! అయినా ఆ నగల పెట్టె గూట్లో పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను, నా మాట విన్నావా?” అన్నాడు.
“ఇలా జరుగుతుందని నాకేం తెలుసు?” అంది నిర్మల.
“అన్ని రోజులూ ఒకేలా ఉందవని తెలుసు కదా?ప్రస్తుతం మన పరిస్థితేమిటో నీకు తెలుసు.ఇంటి ఖర్చులకే ఉన్న డబ్బు సరిపోటం లేదు. మళ్ళీ నగలు చేయించాళంటే మాటలా? వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వస్తాను.కానీ నగలు దొరుకుతాయన్న ఆశైతే లేదు.”
“మరైతే ఏమ్దుకు రిపోర్టివ్వటం?”
“ఇంత నష్టం జరిగాక ఏమీ పట్టనట్టెలా ఉండమంటావు? మన అదృష్టం బావుంటే దొరుకుతాయి.లేకపోతే నగలెలాగూ పోనే పోయాయిగా?”
తోతారామ్ గదిలోంచి వెళ్ళబోతూ ఉంటే నిర్మల ఆయన చెయ్యి పట్టుకుని, ” వెళ్ళకండి.మొదటికే మోసం వస్తుందో ఏమిటో!”అంది.
ఆయన చెయ్యి విడిపించుకుని,” చిన్నపిల్లలా ఏమిటా మాటలు?పదివేలు చేసే నగలు పోతే మాట్లాడకుండా ఎలా ఉండను? పైకి ఏడవటం లేదు కానీ నా మనసు ఎంత మథనపడుతోందో చెప్పలేను…” అంటూ ఆయన గొంతుకి ఏదో అడ్డుపడ్డట్టు ఆగిపోయాడు. వేగంగా బైటికి నడిచి పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు.ఇన్స్పెక్టర్ అలాయార్ ఖాన్ కి ఆయన ఇంతక్రితం ఏదో కేసులో సాయం చేసి తప్పించాడు.అందుకే అతనికి తోతారామ్ అంటే అభిమానం.ఆయన వెంట ఇంటికి వచ్చి నిర్మల గది లోపలా, బైటా తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించాడు.చివరికి, ” నాకైతే ఇది బైటివాళ్ళు చేసిన పనిలా అనిపించటమ్ లేదు.ఇంట్లో వాళ్ళందరూ నమ్మకమైన వాళ్ళేనా లేక ఎవరిమీదన్నా మీకు అనుమానం ఉందా?” అన్నాడు.
తోతారామ్ అలాటివాళ్ళెవరూ లేరనీ పనిమనిషి కూడా చాలా కాలంగా తమ ఇంట్లో నమ్మకంగా పని చేస్తోందనీ.ఇక మిగిలినది తన ఇద్దరు కొడుకులూ, భార్యా, అక్కగారూ తప్ప ఇంకెవరూ లేరనీ అన్నాడు.
ఇన్స్పెక్టర్ మళ్ళీ ఇది ఇంట్లోవాళ్ళ పనిలాగే ఉందని గట్టిగా నమ్ముతున్నానని అన్నాడు.నగలు దొరికాయా సరే, లేకపోతే కనీసం దొంగనైనా తప్పకుండా పట్టుకుంటామని హామీ ఇచ్చి అతను వెళ్ళిపోయాడు.
ఆ తరవాత్ తోతారామ్ అతనన్నది నిర్మలకి చెప్పేసరికి ఆమె భయంతో వణికిపోతూ,” దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో పోనివ్వండి.మీ కాళ్ళు పట్టుకుంటాను ఇన్స్పెక్టర్ ని ఇక ఈ విషయంలో ఏమీ విచారణ చెయ్యద్దని చెప్పండి,” అంది.
“నువ్వెందుకంత బెదిరిపోతున్నావు? ఏమిటి సంగతి?”
“ఏం చెప్పను? అతను ఇది ఇంట్లో వాళ్ళ పనే అంటున్నాడు కదా…”
“అరే వాడేదో వాగాడు,వదిలెయ్.”
జియారామ్ తన గదిలో కూర్చుని దేవుణ్ణి తల్చుకుంటున్నాడు.వాడి మొహం పాలిపోయి ఉంది.పోలీసులు మొహం చూసి దొంగని పట్టేస్తారని విన్నాడు వాడు.గదిలోంచి బైటికి వచ్చేందుకు ధైర్యం చాలటం లేదు.తండ్రీ,ఇన్స్పెటరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినలేకపోవటం వాడికి భరించశక్యం కాకుండా ఉంది.ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాక పనిమనిషి తన గదివైపు రావటం చూసి,” ఇన్స్పెక్టర్ ఏమానాడు?” అని అడిగాడు.
పనిమనిషి ఇది ఇంట్లోవాళ్ళ పనే అన్నాడని చెప్పింది. “నేను చాలా మంచిదాన్నని కూడా అన్నాడు,” అంది సంతోషంగా.
“అయితే ఇక నేనొక్కణ్ణే మిగిలాను!” అన్నాడు జియారామ్.
“అవేం మాటలు బాబూ? నువ్వు అయ్యగారి కొడుకువి కదా? నువ్వలాటి పనెందుకు చేస్తావు?”
“నేనా రోజు ఇంట్లో లేనని నీకు తెలుసు కదా? నువ్వు సాక్ష్యం చెపుతావుగా?”
” అయ్యో, అలాటిదేమీ ఉండదు. అమ్మగారు అసలు ఈ విచారణ ఆపించమంటున్నారు.”
“నిజమా?” అన్నాడు జియారామ్.
“నిజంగానే, నగలు పోతే పోయాయి, వాకబు చెయ్యద్దని చెప్పండని ఒకటే గొడవ.కానీ అయ్యగారు ఒప్పుకోవటం లేదు.”
***
అయిదార్రోజులు జియారామ్ కడుపునిండా తినలేకపోయాడు.కొద్దిగా కతికి, ఆకలి లేదని లేచి వెళ్ళిపోయేవాడు.మొహం వాడిపోయింది నిద్ర కూడా సరిగ్గా పట్తటం లేదు.ప్రతిక్షణం పోలీసు భయమే వాణ్ణి తినేస్తోంది.వ్యవహారం ఇంత దాకా వెళ్తుందని తెలిస్తే అసలా పని చేసేవాణ్ణే కాదు.ఎవరో దొంగ లోపలికి దూరి ఎత్తుకుపోయాడని అనుకుంటారులే అని అనుకున్నాడే గాని ఇప్పుడు తన బండారం బైట పడేట్టుందని బెదిరిపోతున్నాడు.
ఏడో రోజున స్కూలునుంచి ఇంటికి చాలా విచారంగా వచ్చాడు.ఇప్పటివరకూ తను తప్పించుకుంటాననే అనుకున్నాడు.వస్తువులు ఇంతవరకూ దొరకలేదు అనుకుంటూ ఉంటే , అవి దొరికాయన్న వార్త ఇవాళ విన్నాడు.ఇప్పుడో ఇంకో క్షణం లోనో ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ని వెంటపెట్టుకుని వస్తాడు.తప్పించుకునేందుకు దారే లేదు.ఇన్స్పెక్టర్ కి లంచమిస్తే కేసు కొట్టెయ్యచ్చు, కానీ ఈ వార్త అందరికీ తెలీకుండా ఉంటుందా? ఇప్పటికే అందరూ ఇంటి సుపుత్రుడే తీసి ఉంటాడని చెవులు కొరుక్కుంటున్నారు.ఇక ఊరంతా తెలిసిపోతే తను ఎవరికీ మొహం చూపించలేడు.
కోర్టు నుంచి ఇంటికి రాగానే తోతారామ్ తల పట్టుకుని మంచం మీద కూలబడ్డాడు. ఆయన చాలా కంగారు పడుతున్నట్టు ఆయన మొహమే చెపుతోంది.
ఈ రోజింత ఆలస్యమైందేమిటి?బట్టలు మార్చుకోకుండా అలా కూర్చుండిపోయారేం?” అంది నిర్మల.
“నా బట్తలకేమైంది గాని, నువ్వీ సంగతి వినలేదా?”
“ఏ సంగతి? నాకేం తెలీదే!”
నీ నగలు దొరికాయి.ఇక జియారామ్ తప్పించుకోలేడు.”
నిర్మల ఈ మాట విని ఆశ్చర్యపోలేదు,” పోలీస్ రిపోర్ట్ ఇవ్వద్దని నేను మొత్తుకుంటూనే ఉన్నా.”
“అంటే నీకు వాడి మీద అనుమానం ఉండిందా?”
“ఎందుకుండదు? అతను నా గదిలోంచి బైటికెళ్ళటం చూశా కదా?”
“అయితే ఆ సంగతి నాకెందుకు చెప్పలేదు?”
“నేనలా చెపితే సవిత్తల్లి, పిల్లవాడి మీద అసూయతో అలా అంటోంది అనుకునేవారు.నిజం చెప్పండి,అలా అనుకునేవారా కాదా?”
“ఏమో అనుకునేవాణ్ణేమో.అయినా ఆ పరిస్థితిలో నువ్వు ఆ మాట చెప్పి ఉండాల్సింది.అప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఉండకపోదును. నీ విషయం ఆలోచించావే గాని దాని పరిణామం ఎలా ఉంటుందో ఆలోచించలేదు.”
“మరిప్పుడెలా?” అంది నిర్మల. ఆమె మొహంలో నిజమైన ఆందోళన కనిపించింది.
“ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్తాను,” అంటూ లేచి పైకి చూస్తూ,” ఇక అంతా ఆ భగవంతుడి చేతిలోనే ఉంది.ఒకటి రెండు వేలు ఉంటే లంచం ఇచ్చి వాళ్ళని ఆపచ్చు.కానీ నా పరిస్థితి నీకు తెలియందేముంది? నా నుదుటి రాతే బాలేదు.పైగా పాపం చేశాను, మరి శిక్ష అనుభవించాలిగా?ఒకడి బతుకు అలా తెల్లవారింది.వీడు పనికిమాలిన వెధవే,పొగరుబోతు, వదరుబోతు , పనిదొంగా, అయినా ఎంతైనా కన్న కొడుకు కదా, ఎప్పుడో ఒకప్పుడు బాగుపడకపోడు అనే ఆశ ఉండేది.కానీ వీడు చేసిన ఈ పనితో అదీ అడుగంటింది. ఈ బాధ భరించటం చాలా కష్టం.”
“డబ్బిస్తే పని జరుగుతుందంటే నేను ఏర్పాటు చెయ్యనా?”
“చెయ్యగలవా? ఎంత?”
“ఎంత అవసరమౌతుందంటారు?”
“వెయ్యి రూపాయలు లేందే అసలు మాట్లాడటమే సాధ్యం కాదు.ఒక కేసులో నేను ఎవరి దగ్గరో వెయ్యి లంచం తీసుకున్నాను.అది ఈరోజు ఇలా పోతుంది అనుకోవాలంతే.”
“సరే ఏర్పాటు చేస్తాను.మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రండి.”
***
తోతారామ్ చాలాసేపు వేచి చూశాక గాని ఇన్స్పెక్టర్ కి ఆయనతో మాట్లాడే తీరిక దొరకలేదు.చాలా కష్టం మీద కేసు మాఫ్ చేసేందుకు
ఒప్పుకున్నాడు.అయిదువందలకి పని జరిగిపోయింది.
” మొత్తం మీద సమస్య తీరిపోయింది.డబ్బు నీదీ, వాక్చాతుర్యం మాత్రం నాది.చాలా కష్టం మీద ఒప్పుకున్నాడు … జియారామ్ భోంచేశాడా?”అన్నాడాయన నిర్మలతో.
“ఎక్కడ? ఇంకా ఇంటికే రాందే?”
“పన్నెండయిపోయిందే? సియారామ్?”
“అన్నం తిని నిద్రపోయాడు.”
“అన్నయ్య ఎక్కడికెళ్ళాడని వాణ్ణి అడక్కపోయావా?”
“తనకేం తెలీదన్నాడు.”
తోతారామ్ మనసు కుదుటపడలేదు.చిన్నవాణ్ణి లేపి అడిగాడు.”నాకేం చెప్పలేదు,” అన్నాడు వాడు.
” వాడి ధోరణి ఎలా ఉంది ? సరదాగా బైటికెళ్తున్నట్టు కనిపించాడా, విచారంగా ఉన్నాడా?”
” సరదాగా ఉన్నట్టు కనిపించలేదు.గుమ్మం దగ్గర కాసేపు తచ్చాడి, లోపలికి రావాలా వద్దా అని తటపటాయించాడు.వెళ్లిపోతూ కళ్ళు తుడుచుకోటం చూశాను. ఈ మధ్య తరచు ఏడుస్తున్నాడు.”
తోతారామ్ భారంగా నిట్టూర్చి,” నువ్వు మంచి చేస్తున్నాననే అనుకున్నావు, కానీ శత్రువు కూడా నామీద ఇంత పెద్ద దెబ్బ తీసి ఉండడు! వాడి అమ్మే ఉంటే నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచిపెట్టేదా? తప్పకుండా చెప్పిఉండేది,” అన్నాడు.
నిర్మల అదేమీ పట్టించుకోకుండా,” డాక్టర్ గారింటికి వెళ్ళాడేమో, ఒకసారి వెళ్ళి చూసిరండి.వాడి స్నేహితులందరూ ఆయనకి తెలుసు. ఏమైనా తెలుస్తుందేమో?
అయినా ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా నాకు చెడ్డపేరు రానే వచ్చింది!” అంది నిర్మల.
“అలాగే వెళ్తానులే, ఇంకో దారేదీ లేదుగా?” అంటూ తోతారామ్ బైటికి నడిచాడు.
బైటికి రాగానే గుమ్మంలో డాక్టర్ నిలబడి ఉండటం కనిపించింది.
“ఏమిటి? చాలా సేపట్నుంచీ ఇక్కడే నిలబడి ఉన్నారా?” అన్నాడు తోతారామ్.
“లేదు ఇప్పుడే వచ్చాను.అర్ధరాత్రి దాటింది, ఇప్పుడెక్కడికి బైలుదేరారు?” అన్నాడాయన.
“మీ ఇంటివైపే.జియారామ్ బైటికెళ్ళి ఇంతవరకూ ఇల్లు చేరలేదు.మీ ఇంటిగ్గాని రాలేదు కదా?”
తోతారామ్ రెండు చేతులూ పట్టుకుని,” తోతారామ్ గారూ, మీరు కాస్త గుండె దిటవు …” అని డాక్టర్ సిన్హా వాక్యం ముగించే లోపలే తుపాకీ దెబ్బ తగిలినవాడిలా తోతారామ్ నేలకొరిగాడు.
*****
(ఇంకాఉంది)
ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.