అమ్మతనాలు
-పద్మావతి రాంభక్త
ఏ దేశమేగినా
ఎడారిలో ఒంటరిగా నిలబడి
సతమతమవుతున్నపుడు
నువ్వు అక్కడ ఎగరేసిన
అమెరికా టికెట్టు
నా భుజంపై పిట్టలా వాలింది
నేను ఉత్సాహపు ఊయలలో
ఊగుతూ తూగుతూ
ఊరంతా దండోరా వేసేసాను
నీకు నాపై ఉన్న ప్రేమ
ఎవరెస్టు శిఖరమంత
ఎత్తుగా అగుపించింది
నిరంతరం ఎన్నో కలలలో
తేలి తూలిపోయాను
రోజులు యుగాల రూపమెత్తి
కదలక మెదలక కలవరపరుస్తున్నట్టే
అనిపించింది
కళ్ళు కాలెండర్ కు అతుక్కుని
దిగాలుగా వేళ్ళాడుతున్నాయి
నిరీక్షణ నిస్సహాయతను తొడుక్కుని
ఎదురుతెన్నులను మోయలేని
మది విసిగిపోతోంది
ఇంతలో అనుకున్న సమయం
వాకిట్లో నిలబడి స్వాగతించింది
విశ్వాన్ని జయించినంత
ఉద్వేగంతో తుళ్ళితుళ్ళి పడ్డాను
లోహవిహంగం నింగిని
చీల్చుకుంటూ ముందుకు సాగుతోంది
మేఘాలను
వెన్న ముద్దలుగా చేసి
గుప్పెట్లో బంధిస్తూ
కాసేపు అల్లరి పిల్లనైపోయాను
గంటలు కవాతు చేస్తూ కదిలేకొద్దీ
కాళ్ళు తిమ్మిరెక్కాయి
నలిగిన కాగితమై పోతూ
ఇరవై నాలుగు గంటలను
అతిప్రయాసతో మోసాను
తీరా తీరం చేరగానే
పరవళ్ళు తొక్కే నదినై పోయాను
అలసటను అటకెక్కించి
నిన్ను ఆతృతగా గుండెలకు
హత్తుకున్నాను
ఇల్లు చేరాక వడ్డీని ముద్దులతో
ముంచెత్తి పొంగిపోయాను
మరునాటి ఉదయాన్నే
ప్రేమగా నోరు మెదపబోయేలోగా
పనియంత్రానిగా
తర్జుమా చేయబడ్డాను
నా స్ధానం అర్ధమవగానే
లోపలేదో భళ్ళున పగిలింది
కాలం మరోసారి పగబట్టి
కాటేసినట్టే అనిపించింది
అమ్మతనాలన్నీ
ఆయాల అవతారమెత్తి
మాతృత్వపు మమకారాలకు
తాకట్టు పెట్టబడ్డాయని
జ్ఞానోదయమైంది
డాలర్ల మోజుల మహేంద్రజాలం
వికృత రూపంతో వెక్కిరిస్తూ
నన్ను చూసి పగలబడి నవ్వుతోంది
ఏ దేశమేగినా
ఎందుకాలిడినా
ఒంటరితనం
కార్చిచ్చులా వ్యాపిస్తూ
నన్ను కాల్చేస్తూనే ఉంది
*****