ఒక భార్గవి – కొన్ని రాగాలు -10
హాయిని గొలిపే హిందోళం
-భార్గవి
చక్కగా శ్రుతి శుభగంగా ఆలపించే హిందోళ రాగం వినంగానే , ఆత్మ ఆనందపుటలలలో తేలియాడి,దివ్య లోకాలలో విహరిస్తుందంటారు.
అసలు హిందోళ అనే పదానికి అర్థం ఒక రకమైన ఊపు,తూగు,లయ అని చదివాను.ఇంకా ఉద్వేగాలని ఉపశమింప జేసి మనసుకు ఓదార్పుని ఇస్తుందనీ,అందువలన రక్తపోటుని నియంత్రించడానికీ,ఆందోళన తగ్గించడానికీ “మ్యూజిక్ థెరపీ” లో ఈ రాగాన్ని వినియోగిస్తారని విన్నాను.
ఇది మంచి రక్తి రాగమని గాత్ర కచేరీలలోనూ,నాదస్వర కచేరీలలోనూ సంగీత విద్వాంసులు విస్తరించి పాడటానికి ఉత్సాహం చూపిస్తారు.
ఏ కాలంలోనైనా పాడటానికి అనువైన రాగం,ముఖ్యంగా భక్తి, కరుణ రసాలు బాగా పలుకుతాయి,శృంగార రసం కూడా అలవోకగా ఒదిగి పోతూ వుంటుంది.
చాలా జనాదరణ పొందిన రాగంగా కనపడుతుంది,యెందుకంటే జనసామాన్యం పాడుకునే చాలా లలిత,భక్తి గీతాలూ,సినిమా పాటలూ ఈ రాగాన్ని ఆధారం చేసుకున్నవే.
కొంతమంది కేవలం ఈ రాగం ఆధారంగా చేసుకున్న పాటలనే ఇష్టపడటం గమనించాను,ఈ విషయం తెలిసే కాబోలు వి.ఎ.కె. రంగారావు గారు ,ప్రముఖ నిర్మాత కె.మురారి గారి రహస్య ప్రేయసి గా హిందోళ రాగాన్ని పేర్కొన్నారు.
ఇక ఈ రాగ లక్షణాల గురించి చెప్పుకోవాలంటే ,ఆరోహణలో “సగమదనిస” అవరోహణలో “సనిదమగస” అనే అయిదు స్వరాలుంటాయి,అందుకే దీనిని పెంటటోనిక్ స్కేల్ కి చెందిన రాగము అంటారు.ఇది 20 వ మేళకర్త అయిన నటభైరవి నుండీ జన్యము అని కొంత మంది భావిస్తే ,ఇంకొంత మంది 8వ మేళకర్త అయిన హనుమత్తోడి నుండీ జన్యము అని భావిస్తారు.
ఇందులో పలికే శుధ్ధ మధ్యమం (మ అనే స్వరం)వలన ఈ రాగం అందంగా వినిపిస్తుందనీ,కైశికీ నిషాదమూ,సాధారణ గాంధారమూ దీనికి (ని,గ లు)జీవస్వరాలనీ చెబుతారు.ఈ రాగంలో రిషభమూ,పంచమమూ (రి,ప)లు వినపడవు ,అందుకే “శంకరాభరణం “సినిమాలో శంకర శాస్త్రి “శారదా నువ్వు పాడే హిందోళంలో రిషభం యెలా వచ్చిందీ ?” అని గర్జిస్తాడు.
హిందూస్థానీ సంగీతంలో హిందోళ రాగానికి సమానమైన రాగం మాల్కౌంస్ అని చెబుతారు.
ఈ రాగంలో కర్ణాటక సంగీతంలో ప్రాచుర్యంలో వున్న కృతులూ ,కీర్తనలూ చాలా వున్నాయి.
త్యాగరాజస్వామి రచించిన “సామజవరగమనా” అనే కృతి చాలా ప్రఖ్యాతి గాంచినది,ఈ కృతిని యథాతథంగా కొన్ని సినిమాలలో వాడుకుంటే,ప్రణయగీతంగా మార్చుకుని ఒక తెలుగు సినిమాలో వాడుకున్నారు(శంకరాభరణం),ఇంకా ఇదే పేరుతో ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది,అందులో కూడా ఈ మకుటంతో ఒక పాట కూడా వుంది.త్యాగరాజే చేసిన “మనసులోని మర్మములు “అనేది కూడా పేరొందిన కీర్తనే.
ముత్తుస్వామి దీక్షతర్ ఈ రాగంలో చేసిన “నీరజాక్షి కామాక్షి” అనే కృతి ప్రాచుర్యంలో వుంది.
“మామవతు శ్రీ సరస్వతి” అనే మైసూర్ వాసుదేవాచార్ కృతి ఈ రాగంలోనే వుంది.
జి.యన్ .బాల సుబ్రహ్మణ్యం రచించిన “సామగాన లోలే ” అనే కృతి చాలా బాగుంటుంది.
“భజరే గోపాలం” అనే సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన కొన్ని సంవత్సరాల క్రితం,రేడియోలో ప్రతి ఉదయం భక్తిరంజని లో వినపడుతూ వుండేది.అది వున్నది హిందోళరాగంలోనే.
అన్నమా చార్య పదాలలో బాగా అందరి నోళ్లలోనూ నానుతూ వుండే రెండు పదాలు వున్నది హిందోళం లోనే ,అవి “దేవ దేవం భజే దివ్య ప్రభావం,కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు”.ఈ మధ్య “దేవ దేవం భజే దివ్య ప్రభావం” అనే పదాన్ని ఒక తెలుగు సినిమాలో ఉపయోగించాక చాలా మంది గుర్తుపట్టి ఎక్కువగా పాడుకోవడం మొదలు పెట్టారు
మంగళం పల్లి బాలమురళీకృష్ణ గారు అనేక రాగాలలో థిల్లానాలను అనుపమానంగా చేశారు,వాటిలో హిందోళలో చేసిన థిల్లానా ఒక అద్భుతం.
ఇక సినిమాల విషయానికొస్తే ,తెలుగు,తమిళ ,హిందీ సినిమాలలో సంగీత దర్శకులు ఈ రాగాన్ని విస్తారంగా వుపయోగించినట్టు కనపడుతుంది,ఇంక మిగతా భాషలలో కూడా వుపయోగించి వుండవచ్చు నాకు అవగాహన లేదు కాబట్టి నాకు తెలిసినంతవరకూ చెప్పడానికి ప్రయత్నిస్తాను.
తెలుగు సినిమాలలో వివిధ సంగీత దర్శకులు ఈ రాగాన్ని యెలా మలుచుకున్నారో పరిశీలిస్తే వారి సృజనాత్మకత తెలియడంతో పాటు,ఆ రాగ స్వరూపం కూడా బోధ పడుతుందనే ఉద్దేశంతో ఆ పధ్ధతిలో చూద్దాం ఈ రాగంలో యెలాంటి పాటలున్నాయో.
చిత్తూరు వి.నాగయ్య గారు మంచి నటులే కాదు ,మంచి గాయకులూ సంగీత దర్శకులూ కూడా.ఆయన నటించి,సంగీత దర్శకత్వం వహించి,స్వయంగా పాడిన “వదల జాలరా” అనే పాట “యోగి వేమన “సినిమా లోది హిందోళ రాగంలోనే వుంటుంది,సాహిత్యం సీనియర్ సముద్రాల.
కేవలం గాయకులు గానే కాదు సంగీత దర్శకులుగా కూడా ఘంటసాల గారిది సమున్నతమైన స్థానం.ఆయన హిందోళలో మట్లు కట్టిన పాటలు భలే ప్రత్యేకంగా అనిపిస్తాయి నాకు,”శాంతి నివాసం” సినిమాలో పి.లీల పాడిన “కలనైనా నీ వలపే ” యెటువంటి పాట? సముద్రాల జూనియర్ సాహిత్యానికి పూర్తి న్యాయం చేయడంతో పాటు,రాగ స్వరూపం సంపూర్ణంగా సాక్షాత్కారమవుతుంది.
అలాగే “పరమానందయ్య శిష్యుల కథ” లో పి.లీల,ఎ.పి.కోమల కలిసి పాడిన “వనిత తనంతట తానే వలచిన”అనే పాటలో ఖణీగా వచ్చే స్వరాలు వింటుంటేనూ,అదే సినిమాలో పి.సుశీల పాడిన “ఓ మహదేవ నీపదసేవ “వింటుంటేనూ “ఆహా హిందోళ “అనిపిస్తుంది.
ఘంటసాల ప్రతిభ తెలిపే ఇంకో పాట “వినాయక చవితి” లో ఎ.పి. కోమల, సత్యభామగా నటించిన సావిత్రికి ప్లేబాక్ పాడిన “సరియా మాతో సమరాన నిలువ గలడా”అనేది.అయితే ఇందులో హిందోళ రాగంలో అన్య స్వరమైన పంచమం కలిసిందంటారు,సినిమా పాట రక్తి కట్టాలంటే ఇలాంటి ప్రయోగాలు సినిమా ఫీల్డ్ లో సర్వ సాధారణం.అసలు సినిమా పాట కు ఒక రాగం ఆధారం అని చెప్పడం కుదరదు చాలాసార్లు,అనేక రాగ ఛాయలు కలిసి వుంటాయి,జన రంజకత్వమే దాని పరమావధి,కేవలం సంగీత ప్రదర్శన కాదు.
యస్ .రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో హిందూస్థానీ పోకడలు యెక్కువగా కనపడుతూ వుంటాయి ,అందుకని ఆయన చేసిన పాటలలో మాల్కౌంస్ ఛాయలే కనపడతాయని చెప్పాలి.
“విప్రనారాయణ” లో “చూడుమదే చెలియా”అని ఎ.యమ్ .రాజా పాడిన పాట,”బొబ్బిలియుధ్ధం” లో భానుమతి పాడిన “శ్రీకర కరుణాలవాల “అనే పాట,”పూజాఫలం” లో యస్ .జానకి పాడిన “పగలే వెన్నెల జగమే ఊయల “అనే పాట రాజేశ్వరరావు మార్క్ మాల్కౌంస్ ను పట్టిచ్చే పాటలు.
పి.ఆదినారాయణ రావు గారుకూడా హిందూస్థానీ పోకడలతోనే బాణీలను రూపొందించే వారు.ఆయన చేసిన చాలా పాటలకు మాల్కౌంస్ రాగమే ఆధారంగా వుంటుంది,ఆయనకు ఆరాగమంటే మక్కువ యెక్కువ.కావాలంటే ఆయన చేసిన పాటలు చూడండి
అనార్కలీ —రాజశేఖరా నీపై మోజు తీరలేదురా—ఘంటసాల,జిక్కి
సువర్ణసుందరి—పిలువకురా అలుగకురా–పి.సుశీల
సువర్ణసుందరి (హిందీ)—-ముఝే నా బులా—లతా మంగేష్కర్
పెండ్యాల నాగేశ్వరరావు—-“జయభేరి” లో “నీవెంత నెరజాణ వౌరా” అని యం.యల్ వసంత కుమారి తో పాడించిన పాట హిందోళానికి చిరునామా అని చెప్పవచ్చు
ఇంకా ఆయన చేసిన పాటలు
మోహనరూపా గోపాలా—-ఘంటసాల–కృష్ణ ప్రేమ
జయవాణీ చరణ కమల సన్నిధి మన సాధన–పి.లీల బృందం—మహామంత్రి తిమ్మరుసు
శ్రీకరమగు పరిపాలన—పి.లీల బృందం—-మహాకవి కాళిదాసు.
అశ్వత్థామ కి ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడని పేరు,ఆయన హిందోళంలో చేసిన పాటలు—
“భళిరా నీవెంత జాణవౌరా”—యస్ .జానకి—దేవాంతకుడు.
“మనమే నందన వనమౌ గాదా”—జిక్కి—మా ఇంటి మహలక్ష్మి.
కె.వి.మహదేవన్ ప్రతిభ గురించి చెప్పే పనేలేదు
ఆయన చేసిన పాటల్లో యెన్నో సూపర్ హిట్లు
నన్ను వదలి నీవు పోలేవులే —ఘంటసాల ,సుశీల –మంచిమనసులు ,ఆరోజుల్లో చాలా పెద్ద హిట్టు ,ఆ ట్యూన్ ననుసరించి తర్వాత చాలా ట్యూన్లు పుట్టుకొచ్చాయి.
ఇంకా “సామజవర గమనా” అనే మకుటాన్ని తీసుకుని “శంకరాభరణం” లో బాలు,యస్ .జానకిలు పాడిన డ్యూయట్ కూడా చాలా పాప్యులర్
యస్ .పి.కోదండపాణి —మంచి కుటుంబం కోసం చేసిన “మనసే అందాల బృందావనం”అనే పాట హిందోళ రాగానికి మంచి ఉదాహరణ ,పి.సుశీల పాడింది
స్వర జ్ఞాని గా పిలవబడే ఇళయరాజా –సాగరసంగమమే ప్రణయ సాగర సంగమమే అనే పాట—సీతాకోకచిలుక సినిమాలో చేసి
సాగరసంగమం సినిమాలో—-ఓం నమశివాయ అనే పాట ఈ రాగంలో చేయడం విచిత్రం
కీరవాణి గారు కూడా ఈ రాగంలో పాటలు చేశారు “ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము” —-స్టూడెంట్ నంబర్ వన్ (చిత్రం )
ఆర్ .పి.పట్నాయక్ —చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా—“నీ స్నేహం ” సినిమాలో చేసిన పాట హిందోళ రాగ ఛాయల్లోనే వుంది.ఇంకా యెంతోమంది యెన్నో పాటలు చేసి వుండవచ్చు ,నేను ఒకటి రెండు పాటల చొప్పునే ఉదహరించాను.
మచ్చుకి రెండు మూడు పాటలు హిందీ సినిమాల్లోవి కూడా చూద్దాం
ప్రఖ్యాత దర్శకుడు నౌషాద్ కీ,మహ్మద్ రఫీ కీ మంచి పేరు తెచ్చిన పాట”బైజు బావరా” లోని “మన్ తరపత్ హరి దర్శన్ కిఆజ్ ” కి ఆధారం మాల్కౌంస్ రాగం
ఎంతో మంది ఇష్టపడే దర్శకుడు సి.రామచంద్ర అద్భుత సృష్టి “నవరంగ్ “లోని పాటలు ,వాటిల్లో రెండు పాటలకి ఈ రాగమే ఆధారం
.”ఆధా హై చంద్రమా రాత్ ఆధీ”—-ఆశా భోన్ స్లే
“ఛుపీ హై కహా”—–మన్నాడే
*****
వృత్తి వైద్యం—-MBBSDA