కనక నారాయణీయం -16
–పుట్టపర్తి నాగపద్మిని
పుట్టపర్తి సాహిత్య జైత్ర యాత్ర, విజయ మార్గాన ప్రయాణిస్తున్న సమయంలో ఒక రోజు..!!
పుట్టపర్తి వారిని కొప్పరపు సుబ్బయ్య హఠాత్తుగా తన గదికి పిలుస్తున్నారని ప్యూన్ వచ్చి చెప్పాడు. హఠాత్తుగా ఇప్పుడీ పిలుపేమిటి??
‘ఇదుగో సామీ..నీకేదో అనంతపురం కాలేజీ నుంచీ జాబొచ్చిందే!! అంతా ఇంగ్లీష్ లో ఉండాది..మద్రాసోళ్ళు నిన్ను విద్వాన్ అన్నారు. వీళ్ళేమంటుండారో నిన్ను..సూడు …’ నిండారా నవ్వుతూ, ఆ లేఖను పుట్టపర్తి చేతుల్లో పెట్టారు కొప్పరపు సుబ్బయ్య గారు.
అనంతపురం ప్రభుత్వ కళాశాల నుంచా?? ఏమిటై ఉంటుంది?
తానేమీ వారికి ఏదైనా ఉత్తరం వ్రాయనేలేదే??
నేరుగా ప్రొద్దుటూరుకే తాను పనిచేస్తున్న పాఠశాలకే ఉత్తరమా??
ముడివడిన భృకుటితో, ఉత్తరం చేతుల్లోకి తీసుకున్నారు పుట్టపర్తి.
కొప్పరపు సుబ్బయ్యగారిలోనూ ఉత్కంఠ!!
పుట్టపర్తి కంటే ఆయనకే ఎక్కువ ఆత్రుతగా ఉన్నట్టుంది!!
లేఖను మొదటిసారి చదవటం పూర్తైంది.
నమ్మలేక పోతున్నారు పుట్టపర్తి.
ఈ వార్త నిజమేనా??
వెంఠనే అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ తాత్కాలిక బోధకునిగా వచ్చిచేరాలన్నది అందులోని సారాంశం. ఈ ఉత్తరానికి సమాధానం గా తానే వీలైనంత త్వరగా, వెళ్ళి అక్కడి అధికారులను కలిసి, వారాదేశించిన పనిలో చేరిపోవాలట కూడా!!
ఇది నిజమేనా??
వారంటున్న పోస్ట్ ఏమిటి?
తాను యీ ఉద్యోగానికి దరఖాస్తు కూడా పెట్టుకోలేదే??
తన పేరు వారిదాకా ఎలా వెళ్ళింది??
దానికి ప్రత్యక్షంగా మౌఖిక పరిచయం, పరీక్ష వంటివేమీ జరుగనేలేదే??
ఇవన్నీ కాకుండానే, తననీ విధంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ అనే అధికారి ఆదేశించడమేమిటి??
పుట్టపర్తి ముఖంలో ప్రశ్నార్థకం!!
ఇదంతా చూస్తున్న కొప్పరపు సుబ్బయ్యగారి ముఖంలోనూ అంత పట్టని ఆత్రుత!!
రెండవ సారి కూడా చదివిన తరువాత, ఉత్తరంలోని సారాంశం చెప్పారు పుట్టపర్తి వారికి!!
సుబ్బయ్య గారూ ఆలోచనలో పడ్డారు.
అక్కడే ఉన్న మరి ఇద్దరు ముగ్గురు ఉద్యోగులకీ, చాలా ఆసక్తిగా ఉంది, సుబ్బయ్యగారి నిర్ణయం ఏమై ఉండబోతున్నదో అని!!
సుబ్బయ్యగారనేశారు, ‘రేపు చెబుతాను పుట్టపర్తీ !! నీవూ ఆలోచించు, ఏమి చేద్దామా అని!!’
తల పంకించి, పుట్టపర్తి కొప్పరపువారి గదినుండీ బైటికి వచ్చేశారు.
తనకిక్కడ ఉద్యోగమిప్పుడు!! మరి అక్కడికి ఆ తాత్కాలిక ఉద్యోగం మీద వెళ్ళవలెనంటే, సెలవు ఇవ్వవలె కదా!! దానికి సుబ్బయ్యగారు అంగీకరిస్తారా మరి??
పైగా ఏదో కొన్నినాళ్ళ ముచ్చట కోసం, యిక్కడ సుఖంగా జరిగిపోతున్న జీవితాన్ని వదిలి వెళ్ళాలా??
జీతం పదహైదు రూపాయలే ఐనా, కుటుంబం నడిచిపోతూనే ఉంది హాయిగా!!
కరుణ, తరులత కుమార్తెలున్నారు.తన రాతకోతలూ, మద్రాసు ఆకాశవాణి ప్రయాణాలు నిరంతరాయంగా జరిగిపోతున్నాయి.
ఇప్పుడీ అవకాశం ఎట్లా వచ్చిందో కూడా తెలియదు.
సందిగ్ధంలో పుట్టపర్తి!!
***
ఇంటికి చేరుకుని, యీ విషయం అర్ధాంగి కనకవల్లికి చెప్పారు. ఆశ్చర్యపోవటం ఆమె వంతైంది.
‘ఇదేమిటి?? ఈ విధంగా అదృష్టం వెదుక్కుంటూ రావటమంటే, ఇదేనా?? ప్రొద్దుటూరు వదిలి బైటి ఊరికి వెళ్ళిన దాఖలాలేలేని తనకు, ఈ విధంగా భర్త ఉద్యోగం కారణంగా అనంతపురం వంటి పెద్ద వూరికి, వేసవి విడిదీ పైగా అత్తిల్లు ఐన పెనుగొండకు దగ్గరగా ఉండబోవటం, ఆనందంగా కూడా ఉంది. కానీ తాను ఇద్దరు ఆడపిల్లలతో అక్కడ ఒంటరిగా ఉండగలదా?? భర్తకు ఎప్పుడూ సాహిత్య వ్యవసాయం తప్ప మరో ధ్యాసే ఉండదు. ఇంటి సరుకులూ, పిల్లల అవసరాలూ, భర్తకు కావలసిన వ్రాత వస్తువులు మొదలు బీడీ వంటివి కూడా తానే తేవాలె!! ఇక్కడైతే అమ్మావాళ్ళున్నారు, చెట్టంత తమ్ముడు అప్పళాచార్యులూ, ముగ్గురు చెల్లెళ్ళూ, అంతా ఉన్నారు. ఎప్పుడైనా ఏ అవసరమైనా తల్లి శేషమ్మ, వెంటనే వాలిపోతుంది. పైగా వానర సేన వంటి శిష్య బృందమూ వుందిక్కడ!! అక్కడ అనంత పురంలో ఉండవలసే వస్తే’’ ..ఇవన్నీ ఆలోచించే వయసు కూడా లేదు కనకవల్లికి!!
అమ్మ శేషమ్మ చెవిన యీ వార్త వేసింది. అల్లుడు నిర్ణయం, పాఠశాలలో సెలవు గురించి అనుమతీ – ఇవన్నీ ముందు తేలవలె కదా!! అన్నదామె!!
***
ఆలోచనలతో ఆ రాత్రి నిద్దురే లేదు పుట్టపర్తి కి!!
మరుసటి రోజు పాఠశాలలో అడుగు పెట్టిన కొద్ది సేపటికే, సుబ్బయ్యగారు పిలుస్తున్నారని వారి నౌకర్ వచ్చి చెప్పాడు.
‘ఏమనుకుంటున్నావ్ పుట్టపర్తీ??’
”నేననుకునేదేమున్నది సుబ్బయ్య గారూ?? అసలీ అవకాశాం నాదాకా ఎట్లా వచ్చిందన్నదే నాకు అర్థం కావటం లేదు. సరే ఎటూ వచ్చింది కాబట్టి, మీరేమంటే అదే చేస్తాను. తాత్కాలిక సెలవుకు సంబంధించిన పోస్టు కదా!! ఎన్ని రోజులుంటుందో తెలియదు. ఇక్కడేదో, మీ చల్లని నీడన నేనూ నా కుటుంబమూ, హాయిగానే ఉన్నాము. అక్కడికి వెళ్ళి మిమ్ములను ఇబ్బంది పెట్టటమౌతుందేమో, అని నా భావన.’
సుబ్బయ్యగారు, సాలోచనగా రెండు నిముషాలాగారు.
ఒక్క ఉదుటున కుర్చీలోంచీ లేచి, పుట్టపర్తి కూర్చున్న చోటికి వచ్చి, భుజాల పైన చేతులేసి అన్నారు,’నీవు రేపే పోయి అక్కడ చేరిపో పుట్టపర్తీ!! ఇక్కడ సంగతి నేను చూసుకుంటానులే!! మంచి అవకాశం. చిన్నవయసులో వచ్చింది కదా నీకు?? వదులుకోవడమెందుకు?? ఒకవేళ అక్కడ నీకు నచ్చక లేదా ఏదైనా కారణం తో, వెనక్కొచ్చేసినా, నాకేమీ ఇబ్బంది లేదు. నీ సత్తా నాకు తెలుసు కదా!! మాకు కూడ మంచి పేరు తీసుకురా..అక్కడ!! సరేనా??’ అని భుజం తట్టారు కొప్పరపు సుబ్బయ్యగారు, ప్రేమగా పెద్ద మనసుతో!!
***
ఇంకేముంది??
పాఠశాలలో యీ వార్త క్షణాల్లో [పాకిపోయింది.
పుట్టపర్తికి అనంతపురం కళాశాలలో తాత్కాలిక పద్ధతిని పనిచేసే అవకాశం వెదుక్కుంటూ వచ్చిందనీ, కొప్పరపు సుబ్బయ్యగారు, దానికోసం పుట్టపర్తికి సెలవు మీద వెళ్ళి పనిచేసే అనుమతిని కూడా ఇచ్చేశారనీ, పుట్టపర్తి యీ రోజో రేపో, అనంతపురానికి వెళ్ళీ అక్కడ చేరిపోనున్నారనీ, తెలిసిన అక్కిన పండితులలో, కాస్త కలవరమూ, కాస్త ఆనందమూ కూడా!!
శుభాకాంక్షలు చెప్పేవారు కొందరూ, ‘ఇదిగో మళ్ళీ, యీ ప్రొద్దుటూరుకేమి వస్తావుగానీ, అక్కడే వుండిపో నాయనా, ఇక్కడేం ఉంది?? పైగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నావు కదా!! అదృష్టం కదా!!’ అని సలహా ఇచ్చేవాళ్ళు కూడా!!
‘ఆ..ఇదేం పెద్ద ఘన విజయమా?? మేమూ అనుకుని వుంటే ఇటువంటి అవకాశాలు ఎన్నెన్ని వచ్చి పడేవో మా ఒళ్ళోకి?? ఏదో, సుబ్బయ్యగారి అండన చల్ల కదలకుండానడిచిపోతుంది బతుకు బండి అనుకుని పట్టించుకోలేదు గాని !!’ అని మూతి విరిచిన వాళ్ళూ వున్నారు.
ఏది ఏమైనా, ముందు పుట్టపర్తి వెళ్ళి, కళాశాలలో చేరి, అక్కడి అనుకూలాలు చూసుకుని మళ్ళీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాల్సి వస్తే, అప్పుడు ఆలోచిద్దాం అనే నిర్ణయం తీసుకొనటం జరిగింది– అత్తగారితో కూడా మాట్లాడిన తరువాత!!
***
పుట్టపర్తి అనంతపురం కళాశాలలో ప్రిన్సిపాల్ ముందు నిలుచున్నారు.
‘వెల్కం పుట్టపర్తీ !! హార్టీ కంగ్రాచులేషన్స్ !! మొత్తానికి మా కళాశాలలో టెంపరరీగా పనిచేసేందుకు మీరు రావటం, మాకు చాలా సంతోషం. ఇక్కడ పనిచేస్తున్న చిలుకూరి నారాయణ రావుగారికి హెల్త్ బాగలేక వారు కొన్ని రోజులు సెలవు మీద వెళ్ళి పోయినారు. ఆ ఖాళీలోకి మరెవరినైనా తీసుకోవలసి ఉంటుంది కాబట్టి, ఆ కాలిబర్ ఉన్నవాళ్ళను సూచించే రెస్పాన్సిబిలిటీ వారి పైనే పెట్టటమైంది. వారి సూచన ప్రకారమే, మీకు లెటర్ వ్రాయటం జరిగింది. జాగ్రత్తగా పని చేయండి. విద్యార్థులు మీకు తెలుసు కదా, ఒట్టి మంకీస్ !! వాళ్ళతో అలర్ట్ గా ఉండండి. ఎక్కువగా వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోవద్దు. అసలే రోజులు బాగా లేవు. ఏదో సామెత చెబుతారు కదా, పులిని చూసి..అన్నట్టు, గాంధీ అనీ, ఇండిపెండెన్స్, స్ట్రైక్ అనీ అనుకుంటూ, వాళ్ళు తోకలు ఊపితే, కట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళను కంట్రోల్ లో పెట్టవలసిన బాధ్యత కొంత మీదే కూడా!! మీరు చూస్తే యూ లుక్ వెరీ యంగ్!! ఎట్లా వాళ్ళను కంట్రోల్ లో పెడతారో చూస్తాను..’ ఇదీ ఆ మీనన్ అనే పేరున్న కళాశాల ప్రిన్సిపాల్ ధోరణి!!
ఆయన వాక్ప్రవాహం ఆగి, తానక్కడినుంచీ బైటికి వచ్చేసిన తరువాత, పుట్టపర్తికి ముందు ఎంతో సంతోషం వేసింది. చిలుకూరి నారాయణ రావుగారు, తన తండ్రిగారు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారికి ఆత్మీయ మిత్రుడు. వారి కారణంగానే తనకీ అవకాశం వచ్చిందన్నమాట!! ఈ సంగతి తమ తండ్రిగారికి కూడ తెలుసో తెలియదో మరి!!కేవలం విద్వాన్ అర్హతతోనే యీ అవకాశం రావటానికి కారణం, డిగ్రీ కంటే అసలైన యోగ్యతకే పట్టం అన్నది ఆనాళ్ళలోని న్యాయం!!
వీలైనంత తొందరగా యీ సంగతి పెనుగొండకు వెళ్ళి అయ్యకు తెలియలేయాలి!!
కానీ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కు గాంధీ పట్లా, విద్యార్థుల పట్లా ముఖ్యంగా స్వాతంత్ర్య సమరం పట్లా చాలా చిన్న చూపు ఉన్నట్టుంది!! పెనుగొండ లక్ష్మి లో భారతీయ సంస్కృతి పట్ల కళల పట్లా, చరిత్ర పట్లా అంతులేని గౌరవాన్ని ప్రకటించి పులకించిన తనకు , యీ మీనన్ భావాలను సమర్థించటం సాధ్యమా?? అన్న ఆలోచన మొదలైంది పుట్టపర్తి లో!!
(సశేషం)
****
Nechheli Reagane modata sampaadakeeyam, ventane chadive seershika Kanaka Narayaneeyam. Visista vyakthulu vaari gurinchi thelisikovatam chaalaa baavundi. Chakkagaa vivaram gaa chepthunnaaru. Abhinandanalu Naga Padmini Gaaru.