కలసి ఉంటే కలదు సుఖము

-అనసూయ కన్నెగంటి

వేసవి శెలవులకు వచ్చిన మనవడు సుశాంత్ ని  పొలం తీసుకెళ్ళాడు తాతయ్య. 

పొలంలో ధాన్యాన్ని రాశులుగా పోసి బస్తాలకు ఎత్తుతున్నారు పనివాళ్ళు. అక్కడికి  రివ్వుమని ఎగురుతూ గుంపులు గుంపులుగా  వచ్చి ధాన్యం రాశుల మీద వాలుతున్న  పిచ్చుకలను చూశాడు సుశాంత్.

    వాడికి చాల ఆనందం కలిగింది వాటన్నింటినీ ఒకచోట అలా గుంపుగా చూస్తే.

     “ తాతయ్యా ..అవి చూడు “ అంటూ తాతయ్య వేలు విడిచి పెట్టి అక్కడ కుప్పలు కుప్పలుగా పోసి ఉన్న ధాన్యం రాశుల దగ్గరకు వెళ్ళాడు. 

       పిచ్చుకలు కిచకిచమని అరుస్తూ వచ్చి వాలుతున్నాయి. అక్కడున్నవారు వాటిని తరిమేస్తున్నారు. వాటిని అంత దగ్గరగా చూసేసరికి చాల సంతోషంగా, సరదాగా అనిపించింది వాడికి. 

  కాసేపలా చూసి వెనక్కొచ్చి తాతయ్యని అడిగాడు…

  “ తాతయ్యా..! అవన్నీ గుంపులుగా వస్తున్నాయి కదా! లెక్కపెడదామంటే అవి ఎగిరిపోతున్నాయి కుదరలేదు.కానీ చాలా ఉన్నాయి. అవన్నీ ఎక్కడన్నా కలుసుకుని చెప్పుకుంటాయా ఇలా వెళదామని?” అని అడిగాడు.

     “ సుశాంత్ ఎవ్వరితోనూ కలవడని, ఎవ్వరితోనూ స్నేహం చేయడని తన కూతురు..కొడుకు గురించి  చెప్పి  చాల సార్లు బాధపడటం గుర్తుకు వచ్చింది తాతయ్యకి. దాంతో ..మనవడిలో  మార్పు తీసుకు రావాలని అనిపించింది. 

    ఆలోచించి ఇలా అన్నాడు.

   “వాటిని ఊర పిచ్చుకలు అంటారు. ఇవి పొలాల్లో తిరుగుతూ ఉంటాయి” అన్నాడు మనవడ్నే చూస్తూ. 

  “ అవునా  తాతయ్యా..! అయితే ఇవన్నీ  చెప్పుకుని వస్తాయా తాతయ్యా?” అన్నాడు అమాయకంగా.

   “ మొదట్లో ఒక్కొక్కటే విడి విడిగా వచ్చేవి. అప్పుడు రైతులు కర్రలతో తరిమివేసేవారు. ఒకసారి ఒక పిచ్చుక అలాగే ఒంటరిగా వచ్చి ఎన్నో కష్టాలు పడి తన బుజ్జిపొట్తని నింపుకుని తిరిగి వెళ్ళిపోతుంటే దార్లో ఇంకో పిచ్చుక నీర్సంగా ఎగురుతూ దానికి కనిపించిందంట.  “ఎందుకలా నీర్సంగా కనిపిస్తున్నావు?” అని ఈ పిచ్చుక అడిగిందట. 

   “ఉదయం నుండీ ఏమీ తినలేదు. తినటానికి ఎక్కడా ఏమీ దొరకలేదు “ అందట ఆ నీర్సపు పిచ్చుక. 

  “ అయ్యో! బాధపడకు. అక్కడ చాల ఆహారం ఉంది. వెళ్ళి కడుపునిండా తినిరా! “ అందట కడుపు నిండిన పిచ్చుక.

  “ అమ్మో! ఒక్కదాన్నీ వెళితే  కొడతారేమో? నువ్వు తోడు వస్తావా?” అని అడిగిందట.

   “ కొడతారు. భయపడితే ఎలా కడుపు నిండుతుంది? అయినా అడిగావు కాబట్టి వస్తాలే పద “ అని ఇద్దరూ కలసి వెళ్ళి తిని వస్తుంటే మరో పిచ్చుక ఎదురు అయ్యిందంట.

   దానికి జతగా మళ్ళీ వెనక్కి వెళ్లాయట ఈ రెండు పిచ్చుకలూ..ఆ మూడూ తిని వెళుతుంటే మరొకటి ఎదురు వచ్చిందట. మళ్ళీ ఇవన్నీ కలసి దానికి తోడు వెళ్ళాయట.  

     అలా వెళ్లటంతో  ఆ పిచ్చుకలకి ఒకటి అర్ధం అయ్యింది. ఇలా అందరం..కలసి వెళితే ఒకరికి ఒకరం ధైర్యం తోడు అని. అప్పట్నించీ అన్నీ కలసి గుంపులు గుంపులుగా  వెళ్ళి తింటూ ఉంటాయి.

    కలసి ఉంటే కలదు సుఖం అన్నారు ఇలాంటి పిచ్చుకల్ని చూసే. మనం అందరితో కలవాలి. అప్పుడే మనకు ఏదైనా అవసరం అయితే సహాయం చేస్తారు. వాళ్లకి అవసరం అయితే మనం సహాయం చెయ్యాలి..చీపుర్లు అన్నీ కలసి ఉంటేనే అంతా శుభ్రం చేయగలవు కదా. అలాగే కొన్ని తాళ్లు కలిసి పెద్ద బలవంతమైన ఏనుగును కూడా  పట్టి బంధించగలవు. అందుకే అందరితో కలవాలి. ”

   “ అర్ధమైంది తాతయ్యా..! నేనూ ఈ పిచ్చుకల్లాగే అందరితో కలసిమెలసి ఉంటాను తాతయ్యా..!”

           మురిపెంగా చూసాడు తాతయ్య సుశాంత్ వైపు.  

           *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.