కాలిఫోర్నియాలో ఘనంగా జరిగిన వీక్షణం-100వ సాహితీ సమావేశం
-ఎడిటర్
కాలిఫోర్నియా బే ఏరియాలోని “వీక్షణం” సంస్థాపక అధ్యక్షులు డా|| కె.గీత ఆధ్వర్యంలో జరిగిన 100 వ సాహితీ సమావేశం అంతర్జాల సమావేశంగా డిసెంబరు 12, 2020న విజయవంతంగా జరిగింది.
డా|| కె.గీత, శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు గార్లు స్వాగతోపన్యాసాలు చేశారు. ఈ సభకు విశిష్ట అతిథులుగా తానా పూర్వ అధ్యక్షులు శ్రీ జంపాల చౌదరి గారు, వంగూరి ఫౌండేషన్ సంస్థాపకులు శ్రీ చిట్టెన్ రాజు వంగూరి గారు విచ్చేసారు. ముందుగా జంపాల చౌదరిగారు మాట్లాడుతూ ఏ సంస్థ విజయానికైనా పేషన్ కలిగిన సారధులు ముఖ్యమని పేర్కొన్నారు. శ్రీ చిట్టెన్ రాజు వంగూరి వీక్షణానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమెరికాలోని రచయితలందరూ గొప్ప కథలు రాయాల్సిన ఆవశ్యకతని గుర్తుచేశారు. ఇటువంటి సాహితీ వేదికలు iఅందుకు స్ఫూర్తిదాయకాలవుతాయని అన్నారు.
ఆరు వేదికలుగా జరిగిన ఈ కార్యక్రమంలో తరువాత “డయాస్పోరా కథలు- స్థానిక కథా వస్తువులు” అనే చర్చా వేదిక ను శ్రీ మృత్యుంజయుడు తాటిపామల నిర్వహించారు. ఇందులో శ్రీ చిట్టెన్ రాజు వంగూరి, శ్రీ చంద్ర కన్నెగంటి, శ్రీ ఆరి సీతారామయ్య, శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు, శ్రీ అనిల్ రాయల్,డా|| కె.గీత గార్లు పాల్గొన్నారు. అర్థవంతంగా, ఆసక్తిదాయకంగా జరిగిన ఈ చర్చలో రచయితలు తమ సామాజిక పరిధిని పెంచుకున్నప్పుడే స్థానిక కథ వస్తువుల మీద రాయగలిగే అవకాశం ఉంటుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఆ తరువాతి కార్యక్రమం కవిసమ్మేళనంను శ్రీ మధు ప్రఖ్యా గారు నిర్వహించారు. శ్రీ క్రాంతి శ్రీనివాసరావు, శ్రీ విన్నకోట రవిశంకర్, శ్రీ అనంత్ మల్లవరపు, శ్రీమతి ఇంద్రాణి పాలపర్తి, శ్రీ తమ్మినేని యదుకులభూషణ్ , శ్రీ శ్రీధర్ రెడ్డి , శ్రీ ప్రసాద్ వరకూరు, శ్రీ చంద్ర హాస్ , శ్రీ తాటిపర్తి బాలకృష్ణారెడ్డి , శ్రీ దాసరాజు రామారావు, శ్రీ నాగరాజు రామస్వామి, శ్రీమతి షంషాద్, శ్రీ శశి ఇంగువ, శ్రీ దాలిరాజు, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి, శ్రీ సురేంద్ర దారా వంటి 25 మందికి పైగా ప్రముఖ కవులు విభిన్నాంశాల మీద కవిత్వం వినిపించారు.
తరువాతి కార్యక్రమం పత్రికా నిర్వహణ- స్త్రీల ప్రాతినిధ్యం చర్చా వేదికను శ్రీమతి శారద కాశీవఝల గారు నిర్వహించారు.
ఈ చర్చలో శ్రీమతి కాంతి పాతూరి (కాలిఫోర్నియా)కౌముది, శ్రీమతి లక్ష్మి రాయవరపు (కెనడా)తెలుగుతల్లి,శ్రీమతి దీప్తి పెండ్యాల (హ్యూస్టన్)మధురవాణి, డా||కె.గీత (కాలిఫోర్నియా) నెచ్చెలి పత్రికాధిపత్యం వహిస్తూ పాలొన్నారు. స్త్రీలుగా పత్రిక నిర్వహణలో తమ అనుభవాలను సభలోని వారితో పంచుకుని కొత్తగా పత్రికా నిర్వహణలోకి అడుగుపెడుతున్న స్త్రీలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆ తర్వాత డా||రమణ జువ్వాడి ప్రత్యేక అతిథి ప్రసంగం చేశారు. ఆ తరువాత శ్రీ కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్, డా|| కె.గీత పాడిన లలిత, జానపద గీతాలు అందరినీ విశేషంగా అలరించాయి. మధ్యాహ్నం నుండి నిరంతరాయంగా జరిగిన అష్టావధాన కార్యక్రమాన్ని శ్రీ రావు తల్లాప్రగడ గారు నిర్వహించారు. అవధాని శ్రీ శ్రీచరణ్ పాలడుగు గారిచే జరిగిన ఈ అష్టావధానంలో శ్రీ నాగ వెంకట శాస్త్రి గారు మంత్రోచిత ఆశీస్సులు అందజేయగా,ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు కీలకోపన్యాసం చేశారు. ఇందులో పృచ్ఛకులుగా శ్రీ రావు తల్లాప్రగడ, శ్రీ వికాస్ విన్నకోట, డా|| కె.గీత, శ్రీ శ్యామ్ సుందర్ పుల్లెల, శ్రీమతి సుమలత మాజేటి, శ్రీ మధు ప్రఖ్యా శ్రీమతి శారద కాశీవఝల గార్లు పాత్రలు వహించగా, శ్రీ రఘు మల్లాది సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరగా డా।। కొండపల్లి నీహారిణి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారధి సంస్థాపకులు శ్రీ కవుటూరు రత్నకుమార్, ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య అధ్యక్షులు శ్రీ రావు కొంచాడ గార్లు ప్రసంగించారు. ఈ సభకు చివరగా డా|| కె.గీత వందన సమర్పణ చేసి సభను ముగించారు. శ్రీమతి లక్ష్మి రాయవరపు, శ్రీమతి శ్రీదేవి యెర్నేని, శ్రీ కె.ఎస్.ఎం.ఫణీంద్ర గార్లు సాంకేతిక సహకారం అందించారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేకులు వీక్షించి, అభినందనలందజేసిన వీక్షణం 100 వ సాహితీ సమావేశాన్ని యూట్యూబు లో ఇక్కడ చూడవచ్చు.
*****