చిత్రం-19

-గణేశ్వరరావు 

ఆర్టెమిజా జెంటిలెక్సి 17వ శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారిణి. ఆమె 1620లో గీసిన ఈ చిత్రం పేరు – జూడిత్, హోలోఫర్నెస్ తల నరకడం. ఓల్డ్ టెస్టమెంట్లోని కథ. అస్సిరియన్ ఆర్మీ జనరల్ హోలోఫర్నెస్ జుడిత్ ఉన్న నగరాన్ని ముట్టడి చేస్తాడు. బాగా తాగి ఉంటాడు. ఆమె అదే అదనుగా అతని తల నరికి, తన సేవకురాలితో సొంత ఊరికి తిరిగి వస్తుంది. ఈ ఇతివృత్తాన్ని ఆర్టెమిజా అందరినీ అబ్బురపరచేటట్టు స్పష్టమైన దృశ్య రూపంలో చూపుతుంది. చిత్రంలో ఆమె తలనుంచి చేతుల దాకా మెరిసిపోతూ, తన చర్యని భయానకంగా చూపిస్తూంటూంటుంది; ఆమె చేతుల్లో ఉన్న కండబలానికి తిరుగులేదని చెప్తుంది అది; తనకి ఎదురులేదని స్పష్టం చేస్తుంది. కాంతివంతమైన రంగు దుస్తులు, ఒంటి రంగు ఆమె ధైర్య సాహసాలను ప్రతిఫలిస్తున్నాయి. ఇటీవల వెలువడ్డ అర్టేమిజా జీవిత చరిత్ర ఈ చిత్రాన్ని మరో కోణంలో చూపుతోంది; చిత్రంలోని సన్నివేశానికి, ఆమె నిజ జీవితంలోని సంఘటనలకు కల సంబంధాన్ని సూచిస్తున్నాయి; జుడిత్ చిత్రించ బడ్డ తీరు, నిజ జీవితంలో ఆర్టెమిజా లోని కోపం, పగ తీర్చుకోవాలన్న దృఢ సంకల్పానికి అడ్డం పడుతోంది. అర్టేమిజా, tassi అనే వాడిచే రేప్ చేయబడింది. అంతే కాదు, తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టు వారికి చెప్పుకుంది, న్యాయం చెయ్యమని కోరింది, ఆ కోర్ట్ ట్రయల్ జరుగుతున్న సమయంలో ఏంతో మానసిక క్షోభ అనుభవించింది. ఇటీవల విడుదలైన ‘పింక్’ హిందీ చిత్రం గుర్తుకు రావటం లేదూ? గతంలో ఈ ఇతివృత్తంతో హిందీ, తెలుగు సినిమాలు చాలానే వచ్చాయి, వస్తాయి కూడా! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే – కళాకారిణిగా ఆమె ప్రతిభ – ఆమె మానభంగం…తర్వాత న్యాయస్థానంలో ఆమె ఎదురుకున్న అవమానం వలన – మరుగున పడింది. నిజానికి ఫ్లోరెన్స్ ఆర్ట్ అకాడమీ గుర్తింపు పొందిన మొట్టమొదటి స్త్రీ చిత్రకారిణి ఆమె, చారిత్రాత్మక, మతగ్రంథాల ఇతివృత్తాలతో చిత్రాలు గీసిన మొట్ట మొదటి స్త్రీ చిత్రకారిణి కూడా ఆమే! సమాజంలో ఎంతో పేరు గాంచినవాళ్ళు, ఆమె తోటి చిత్రకారులు, ఆమె కాలంలోని ప్రముఖ పత్రికలు – ఆమెను వక్రంగానే చూపించారు కానీ ఆమె ఘనత ను పేర్కొనలేదు. కేవలం ఈ మధ్యే ఆమెను బేరోక్ కాలంలోని సుప్రసిద్ధ చిత్రకారిణిగా గుర్తించి, ్పున:ప్రతిష్ట చేశారు. పురుషాధిక్యత నిండి ఉన్న సమాజంలో, ఏ కాలంలో నైనా.. ఏ రంగంలోనైనా ప్రతిభావంతులైన స్త్రీలకు గుర్తింపు అంత సులభం కాదు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.