చిత్రలిపి
“పలు గాకుల గోల …!”
-మన్నెం శారద
అక్కడేమిటో ఒకటే పాడు కాకుల గోల !
ప్రొద్దుటే వాటి సొమ్మేదో పోయినట్లు
వెర్రి గొంతులేసుకుని వెధవ గోల ….
నాలుగు మెతుకులకోసం నానా అల్లరీ చేస్తున్నాయ్ …
ఏమిటని చూద్దునా ..
గాయపడిన కాకొకటి వాటినడిమధ్యన మూలుగుతున్నది
దానికి సాయపడలేక
చేసే చేతులు లేక …
అవి బొంగరం లా చుట్టూ తిరిగి
అదేపనిగా ఏడుస్తున్నాయి …
సంగీతం తెలియని గొంతులూ …
సాహిత్యం తెలియని మనసులూ
మాటలు రాని నోళ్ళూ …
దేవుళ్ళని ..పూజల్నీ ఎరుగని ప్రాణులు
మనుషులచేసే కాలుష్యాన్ని శుభ్రపరిచి
రూపు గొంతూ లేదని హేళన కి
గురయ్యే పనికిమాలిన పక్షులు !
అంతే …అంతే …వాటి గోలంతే !
…ఇక్కడేమిటి అంతకు మించిన అరుపులు …కాకులు కావే మరి …
ముసలాయన చచ్చాడు ,,,వృద్ధాశ్రమం లో …
కొడుకులూ కూతుళ్ళూ దిగారు
విదేశాలనుండి …విమానాల్లో …
ఆ నగ నాదని …
ఈ నగ నాదనీ కూతుళ్ళూ
పొలం పుట్రా , కొంపాగోడుకోసం కొడుకులూ….
నిన్నటినుండి తన్నుకు చస్తున్నారు …
తెగడం లేదు రగడ
..సంగీత సాహిత్యాలు తెలిసిన మేధావులు
పాపపుణ్యాల గురించి అనర్గళం గా మాట్లాడగల మనుషులు వాళ్ళు
కాకులు కాదు కాదు వారు పాపం
పలుగాకులు !!!
*****