చూడలేను!
-డి.నాగజ్యోతిశేఖర్
కరగని దిగులుశిల
పగిలిన స్వప్న శిఖరంపై
సాంత్వన తడికై కొట్టుకులాడుతున్నది!
మలిగిన ఆశా మిణుగురులు రెక్కల సడి
వెతల దిగంతాల అంచుల్లో
నిశ్శబ్ధాన్ని ప్రసవిస్తున్నది!
కన్నీళ్ల మేఘసంచులు చిల్లులుపడి కంటిఆకాశం
దుఃఖ వర్ణం పూసుకుంటున్నది!
ఇప్పుడిప్పుడే విచ్చుకున్న
అస్తిత్వ రెక్కలకు ఆధారమివ్వని ఈనెల మనస్సులు
వివక్షతను ఈనుతున్నవి!
మేధస్సు చంద్రునిపై వెన్నెల సౌధాలు నిర్మిస్తున్నా…
ఆంక్షల రాహువులు
చీకటి అమవాసలై చుట్టేస్తున్నవి!
మాటల్లో ఆకాశంలో సగమైనా….
చూపుల్లో వంకరతనపు
ప్రశ్నాచిహ్నమై
స్వేచ్చా హృదయం మెలితిరుగుతున్నది!
శ్వేత కలల దేహంపై
పశు కంటక గాయాలు
నెత్తుటి గుర్తులై సలుపుతున్నవి!
వ్యక్తిత్వ చర్మం క్రింద జొరబడ్డ
పైశాచిక వాంఛల దావాగ్ని
బతుకును దహిస్తున్నది!
మూసుకున్న రెప్పల కప్పు కింద
ముసిరిన చీకట్ల తీగలు
ఆశల్ని ఉరితీస్తుంటే…
ఊపిరాడని ఉనికి
కొన ప్రాణంతో కొట్టుకులాడుతున్నది!
లోకం దృష్టిలో నువ్వో ఆదర్శవాది గా….
అభ్యుదయ మూర్తిగా చిత్రించుకొనేందుకు…
కట్టబెట్టిన రక్తపు మరకల్ని దాచిన ఈ
ధవళ వస్త్రాలు ….
కత్తిరించి అతికిన ఈ ఎగరలేని రెక్కలూ….
నాకెందుకు???
నన్ను అంబరానికెత్తిన
నీ చేతుల్లో కుత్తుకలు తెగిన
నా ఆశయాలు సమాధి
అవుతున్న వేదనా సన్నివేశాలు
ఇక నా కనులు చూస్తూ భరించలేవు!
అమ్మగా నా రక్తమాంసాలనే వెనుదీయక నీకు
పంచి ఇచ్చేయగలను….!
కానీ…
ఆమెకు….
నువ్వెప్పటికీ సమానతను
పంచలేవు!
ఈ వంచనా మాటలకింక స్వస్తి చెప్పి….
వేసుకున్న ముసుగు తీసేయ్….!
చూడలేకున్నా!
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి