బతుకు చిత్రం
– రావుల కిరణ్మయి
అదో పెద్ద అడవిలాగుంది.చుట్టూ ఎంత దూరం నడిచినా దట్టంగా అల్లుకున్న పెద్ద పెద్ద వృక్షాలు.
తాను ఆ చెట్లు ఎక్కుతున్నది.
బాగా విరగకాసిన పండ్ల తో చెట్లన్నీ గూని అవ్వ లా కనిపిస్తుంటే,ఎక్కిన చెట్లను దిగి ఆ చెట్ల వైపు పరుగు తీస్తున్నది.
చిత్రం….అక్కడికి వెళ్లి వాటిని అందుకొని అవి ఏ పండ్లు?..అని పరికిస్తూ…..జామ ,మామిడి,సపోటా….అంటూ ఒక్కో చెట్టును గుర్తిస్తూ పోతూ ఉంటే ఆశ్చర్యంగా పూలతోట లోకి చేరుకుంది.
పువ్వులు…..పిచ్చిపట్టినట్టుగా మొక్కల నిండా రంగు రంగుల పువ్వులు.ఒక్క రంగని కాదు.అసలు ఏ రంగు లేకుండా ఉన్నదో గుర్తించడం కష్టం గా ఉన్నది.
ఒక్కో మొక్కని తాకుతూ ఆ పూలను వాసన చూస్తూ….ఆశ్చర్యం….వాటికి వాసన లేదు.మళ్ళీ….మళ్ళీ….చూస్తున్నది.
ఈసారి మనసును ఆహ్లాదపరుస్తూ మైమరపింప చేస్తూ చందనం,గంధం,అత్తరు ఇలా అన్నీ కలగలిపిన వాసన…….
ముద్దబంతి పూవు,గులాబి,మల్లె,చామంతి….ఏ పూవు ముట్టుకొని వాసన చూసినా…..,
ఏదో మైకం కమ్ముకొని మనసు తేలిపోతున్న హాయి….అలా…అలా….సాగుతూనే ఉంది.
ఎకరాలు…ఎకరాలు విస్తరించినట్టున్న పూలతోటను దాటుతూనే……ఇవతలికి చేరుకుంది.అప్పటికే తన కాళ్ళు నీటిలో ప్రయాణించి నాచు పట్టినట్లుండి తాను ఆ నీటి పై తేలుతూ ప్రయాణిస్తుండగా…..చాలా సేపటికి..దూరంగా ఓడలు…కనిపిస్తుండడం తో అంతవరకు తాను తేలుతున్నది ఏరు పై అని అర్థమై…అలా ఈదుతూనే సాగుతూ…సాగుతూ…ఊరి లో వెలుగుతున్న దీపాలు చూసి ఆగి పోయింది.
ఎక్కడా తాను వెనుతిరిగి చూడటం లేదు.తా నడచి వచ్చిన దారి గురించి ఆలోచించడం లేదు.అడుగులు ముందుకు వేస్తూ….ఊరి పొలిమేరలో ఆగింది.కుక్క,గుఱ్ఱం,పులి,సింహం,తోడేలు వంటి క్రూర జంతువులన్నీ ఒకే చోట మందలా కనిపిస్తున్నాయి.
ఆశ్చర్యం…..వాటికి దగ్గరగా వెళ్ళినా….అవి తనను ఏమి చేయకపోవడం.తను వాటిని అదిలిస్తున్నది.వాటిలో కొన్ని దూరంగా జరుగుతూ తనకు దారి ఇస్తున్నవి.
వాటిని దాటుకొని నడుస్తుండగా కొన్ని వేల పక్షులు .వాటిలో తను గుర్తించ గలిగింది,కౌజులు,పావురాళ్ళు,నెమళ్ళు,బాతులు,కోకిలలు మాత్రమే పేరు తెలియని ఎన్నో పక్షులు వాటి గుడ్లతో సహా,వాటి గూళ్ళ లో నుండి అరుస్తూ చేస్తున్న శబ్దానికి ఆ ప్రాంతమంతా మారు మోగుతున్నది.వాటిలో రామచిలుకల అరుపు చాలా పెద్దగా వినిపిస్తున్నది.
అంతలోనే ఇంతకు ముందు తను దాటి వచ్చిన క్రూరమృగాల మంద,ఇవీ ఒకే దగ్గరగా కనిపిస్తున్నాయి.కానీ,అవి వాటిని ఏమీ చేయలేక పోతున్నాయి.
దీపాలు వెలుగుతూనే ఉన్నాయి.
దూరంగా అందంగా వజ్ర వైఢూర్యాలు,పట్టుబట్టలు,కిరీటం ధరించి దేదీప్యమానంగా వెలుగుతున్న సింహాసనం పై మహారాజు కూర్చుని ఉన్నాడు.ఆయన తల చుట్టూ సూర్యకిరణాలు వెదజల్లబడుతున్నాయి.
తాను చూసింది.కానీ ఆయనను పలకరించలేదు.బాగా చూసింది.
ఆయనా చూశాడు.
పలకరింపుగా నవ్వాడు.
అయినా,తను ఎందుకో నవ్వలేదు.దాటిపోవాలనే …నడక వేగం పెంచింది.ఇంకా ..ఇంకా ..పెంచింది.
అయన వారించలేదు.
తను పట్టించుకోలేదు.
సూర్యోదయం అయినట్టుగా తోస్తున్నది.
చీమలు ఆహారంతో బారులు తీరి పోవుచున్నవి.పెళ్లి అయిన స్త్రీ విధవ అయింది.అది చూసి తాను ధుఃఖిస్తున్నది.
ఆడవారెవరో ఓదార్చి చెరువు దగ్గరకు తీసుకెళ్ళి స్నానం చేయించి రాశులుగా పోసిన పిండివంటలను చెరువు మధ్యలో కూర్చుని తామరాకు మీద వడ్డించుకొని తాను తిని,తమలపాకు తీగ నుండి ఆకు తెంపుకొని పక్కనే ఉన్న వక్కల మూట నుండి వక్కలు తీసుకొని తాంబూలము తయారుచేసుకొని నములుతూ జన సమూహం తో నిండిన బజారు చేరుకున్నది.
బజారు లో హరికథ చెపుతున్న హరిదాసుకు ఆ పక్కనే ఉన్న ఆంజనేయస్వామికి దండం బెట్టి ముత్యాలు,రత్నాలు,బంగారు మురుగులు వారు తనకు బహుమతి గా ఇవ్వగా తీసుకుంటున్నట్లు,తరువాత వారిచ్చిన తెల్లచీరను ధరించింది.
ఎండలోనూ,నీడలోనూ,రాత్రి,పగలు తేడా లేకుండా నడక…నడక….నడక…..ఒకటే నడక………………….అలసిపోవడం లేదు.
ఎన్ని రాత్రులు,ఎన్ని రోజులు,ఎన్ని వారాలు,ఎన్ని నెలలు,ఎన్ని సంవత్సరాలుఇలా గడిచి పోయాయో తనకు తెలియడం లేదు.
అలా…అలా…చూడ చక్కగా ఏపుగా పెరిగిన పంట…..
ఎవరిదది?ఎవరిదై ఉంటుంది?
ఇంకెవరిది?తనదే…..
తనలో వెర్రి ఆనందం.అంతా నాదే….అంతానాదే…….పిచ్చిగా నవ్వుతూ ….పిచ్చిదైపోతూ విరగబడి…విరగబడి…నవ్వుకుంటున్నది.నవ్వుతూనే విశాలమైన వీధుల వెంబడి నడిచి తన అందమైన పెద్ద మేడను చేరుకుంది.
తన పెద్ద మేడ పక్కనే పెద్ద నది.
నది పక్కనే మేడ ఉందా?లేక నది ఒడ్డునే తన మేడ ఉందా?
ఏదీ అర్థం కావడం లేదు.
తను తన కూతురు తో మైలబట్టలు పిండడానికి నదికి వెళ్ళింది.బిడ్డను ఒడ్డునే కూర్చొమ్మని తాను బట్టలు పిండుతున్నది.ఎట్నుండి వచ్చిందో పెద్ద నల్ల తాచు బిడ్డను మొత్తం చుట్టేస్తున్నది.ఊపిరి ఆపాలని చూస్తున్నది.
బిడ్డ పెద్ద గా అరుస్తూ తల్లిని పిలుస్తున్నది.
బిడ్డ అరుపులకు బట్టలు వదిలి కూతురు వైపు గా పరుగెత్తుకచ్చి నీళ్ళను వేడి చేయడానికని పెట్టుకున్న పెద్ద పెద్ద పొయిరాళ్ళను అమాంతం లేవ నెత్తి దాని తోక పై వేసింది.రెచ్చిపోయిన తాచు కాటు వేయాలని కోరలు చాస్తుండగా చాకచక్యంగా,నిర్భయంగా దాని తలను తన గుప్పిట్లో బంధించి ఉరి పెడుతున్నట్టుగా నొక్కి పట్టింది.
తాచు గిల గిలా కొట్టుకుంటూ పట్టు సడలించడంతో తాడు లా దాన్ని గిర గిరా తిప్పి ఆవలకు విసిరేసింది.
కూతురులోనూ,తనలోనూ అలవి కాని ఆనందం.
మళ్ళీ తన పని లో నిమగ్నమయింది.
దూరంగా ఏడుపు…..చూస్తే…….
తన బిడ్డ పైకి దుముకటానికి సిద్ధంగా ఉన్న పులి….
శివంగిలా ఇందాకటి బండనే లేవనెత్తి పులి మీద కురికింది.
దెబ్బకు పులి తోక ముడిచి పరుగు తీసింది.కానీ పోయే ముందు బిడ్డను బలంగా తన గోళ్ళతో రక్కింది.
బిడ్డ ఒంటినిండా రక్తం. ……
రక్తం ఎర్రగా ఏరులవుతున్న దృశ్యం.
బిడ్డా…..బిడ్డా…..బిడ్డా….. బిడ్డా…..నిద్దట్లోనే కలవరపడుతూ,కలవరిస్తున్న జాజులమ్మను..,
అత్త ఈర్లచ్చిమి,
జాజీ…!ఓ జాజీ….!బిడ్డా…బిడ్డా…జాజీ..!ఓ…!పొల్ల….ఏమైందే..?అంటూ పిల్సుకుంట నిద్ర లేపింది.
అత్తా కుదుపులకు,పిలుపులకుమేలుకున్న జాజులమ్మ తన పక్కనే హాయిగా నిద్ర పోతున్న ముగ్గురు కూతుర్లను తల నుండి కింది దాకా తడిమి తడిమి చూసుకుంటున్నది.
జాజుల్లమ్మను చూసి విస్తు పోతూ…..
ఈర్లచ్చిమి తపేలాల కుండల నీళ్ళు తెచ్చి…
జాజీ…!చెయ్యిటువట్టు,అని కుడి చేతిలో నీళ్ళు పోసి కళ్ళు తుడుచుకో అన్నది.
జాజులమ్మఎందుకు?ఏంది?అని అడుగకుండానే,అట్లనే చేసీ అత్త తాగుమనగానే గట గటా తపేలాల నీళ్ళన్ని తాగింది.
ఈర్లచ్చిమి తపేలా తీసుకొని కోడలు తల మీద ప్రేమగా నిమురుతూ…,
జాజులూ…!ఏందే…?ఏమన్నకలవడ్డాదె?గట్ల మొత్తుకుంటివి?అని అడిగింది.
అత్తా…!అత్తా..!నా బిడ్డను పులి తన గోర్ల తోని మొత్తం రకుతాలు ఎల్లెటట్టు రక్కిన్దత్తా..!కొద్దిగైతే సం పుతుండేది.నేను బెదరగొట్టి కాపాడుకున్న…!అని ఇంకా దాని తాలూకు భయం కండ్లలో కనిపిస్తుండగా చెప్పింది.
పిచ్చిదానా….!కలకే గింత భయపడితే ఎట్లనే..?నీ బిడ్డల కేమిగాలే..!చూసుకున్నవ్…!గదా..!పో..!కాళ్ళు కడుక్కొచ్చుకోపో..!పీడకల మల్ల రాకుంట అని,లేపి తను కూడ బావి దాకా తోడు వెళ్ళి కాళ్ళు కడిగించింది.
ఇంట్లకు రాగానే భస్మం బొట్టు,ఆంజనేయుని బొట్టు పెట్టింది.మరోసారి మంచి నీళ్ళు తాగించింది.
జాజులమ్మ తెరిపికచ్చింది.
సమయం అర్ధరాత్రి.ఊరిలో కుక్కల చప్పుడు కూడా లేదు.ఇంటి అరుగుల మీద జాజులమ్మ మామ ఒక వైపు భర్త ఒకవైపు కుక్కినట్టున్న నులక మంచాల్లల్ల గురుకలు పెడుతూ హాయి గా నిద్ర పోతున్నారు.
ఈర్లచ్చిమి అన్నది.
జాజులూ………!తెల్లారటానికి ఇంకా చానా సేపే ఉన్నదే.పండుకోవే.ఏదో..ఏదో..సోచాయించుతవ్!ఇట్ల కలలు కని బెగ్గడిల్లుతవ్..!అని పడుకొమ్మని పురమాయించింది,తాను పడుకుంటూ….!
జాజులు మాట్లాడలేదు.మౌనంగా చాప మీద కొరిగింది.కానీ నిద్ర రావడం లేదు.కలలో తాను చూసిన దృశ్యాలే.ఒకదానికి ఒకటి పొంతన లేని దృశ్యాలు.అన్నీ అందమైనవే.పచ్చటి అడవి,నిండుగా కాసిన పండ్ల చెట్లు,అబ్బ…!ఆ సుందర దృశ్యాలన్నీ మళ్ళి ఒక్కసారి కలలోకి వస్తే ఎంత బాగుండు..!అంటూ.. మాటి మాటికి వాటిని గుర్తు చేసుకుంటూ ఆలోచనల్లోకి జారుకొని…ఆ పైన ప్రశాంతమైన నిద్ర లోకి జారుకుంది.జాజులు.
****
జాజులు అసలు పేరు జాజులమ్మ ఐనా అత్త ఈర్లచ్చిమి ముద్దుగా జాజులు అని పిలుస్తుంటది.ఈ ర్లచ్చిమికి ఇద్దరు కొడుకులే.ఆడపిల్లలు లేరు.పెద్ద కోడలు జాజులు.చిన్న కొడుకు చిన్న కోడలు కొంచెం చదువుకున్న వారు కావడం వల్ల పట్నంలో ఉంటూ ప్రైవేటు గా కంపెనీలలో పని చేసుకొని బతుకుతున్నారు.వారిని గురించి ఈర్లచ్చిమికి కానీ ఆమె భర్త రాజయ్యకు ఏ దిగులు లేదు.వారికి కూడా ఇద్దరు కొడుకులే కావడం కూడా దానికి మరో కారణం.
పెద్ద కొడుకు సైదులు కు చదువు అబ్బలేదు.మనిషికి లేని అలవాటు లేదు.అదేందో కొడుకు అలా ఎట్లా చెడి పోయాడో ఈర్లచ్చిమికి ఎంత ఆలోచించినా అర్థం కాదు.ఎన్నడు గారాబం చేసీ ఎరుగదు.చిన్నప్పటినుండే చదువు మీద శ్రద్ధ లేదని తెలుసుకున్నదై పొలం పనులు,కూలిపనులు ఇట్లా బతకటానికి తెరువు చూపిస్తూ అన్ని పనులకు పంపిస్తూ కష్టపడడం నేర్పింది.అయితే తానోటి తలుస్తే దైవమోటి తలచినట్టు పనిలో అలిసిపోయిన సైదులు అలసట మరిచిపోవడానికని కొంచెం టానికులాగా అలవాటు చేసుకున్నాడు.ఈర్లచ్చిమి కూడా, పోనీలే…కొడుకు కష్ట పడుతున్నాడుకదా..!ఆ మాత్రం కూడా తీసుకోకుంటే బలం లేకుంటయితడని అమాయకంగా వద్దని గట్టిగా చెప్పలేక పోయినది.కానీ
చిలికి చిలికి గాలి వానైనట్టు ఆ టానిక్కు కాస్తా రోజు రోజు కు డోసు పెరిగి సీసాలు సీసాలు ఖాళీ చేసేవరకు వచ్చింది.
మరీ విడ్డూరంగా తాగడానికి డబ్బుల కోసమైనా పనికి వెళ్ళాలనేన్తగా బానిసను చేసింది.
కొడుకు పరిస్థితి చూసి తల్లడిల్లుతున్న ఈర్లచ్చిమికి అయినవాళ్ళు పెళ్ళిచేస్తే పిచ్చికుదు రుతున్దన్నట్టుగా మంచి పిల్లను తెచ్చి పెళ్లి చేయమని సలహా ఇవ్వడం తో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టింది.
భర్త రాజయ్య కు మాత్రం ఏ యావా లేదు.
ఏందయ్యా…!పోరడు తెర్లైతాండు…!భయం చెప్పపోతివంటే….!
ఏందే….!ఆడి పెత్తనం బోడి పెత్తనమని ,నీ మాట మీద నేను వాని పెండ్లి నువ్వు చెయ్య మనంగానే చేత్తనానే అనేటోడు.
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి
రావుల కిరణ్మయి .తల్లిదండ్రులు అనసుర్య పుల్లచారి గార్లు.జననం హుజురాబాద్ ,తెలంగాణ.తెలుగు భాషోపధ్యాయిని.70 వరకు కథలు.100కు పైగా కవితలు.చైతన్య గీతాలు,బాలగేయాలు,వ్యాసాలు,వివిధ పత్రికలలో ప్రచురితాలు.ఔధార్యం కథా సంపుటి.జీవశ్వాస నవల.వివిధ సాహితి సంస్థల తో బహుమానాలు.ప్రశంసలు.సమాజాన్ని చైతన్య పరిచేవిధంగా రచనలు చేయడం పట్ల చదవడం పట్ల ఆసక్తి.