యాత్రాగీతం

నా కళ్లతో అమెరికా

అలాస్కా

-డా||కె.గీత

భాగం-7

దెనాలి నేషనల్ పార్కు  సందర్శనకు ఉదయానే రెడీ అయ్యి మా రిసార్టు బయటికి వచ్చేం.

అనుకున్న సమయానికి బస్సు వచ్చింది. కానీ ముందురోజు లాంటి ఎర్రబస్సే ఇది కూడా.

అనుకున్న సమయానికి బస్సు వచ్చింది. కానీ ముందురోజు లాంటి ఎర్రబస్సే ఇది కూడా. అన్ని రిసార్టుల నించి ఎక్కించుకున్నా

సగం బస్సు కూడా నిండలేదు. 

కొండ తరవాత కొండ ఎక్కి దిగుతూనే ఉన్నాం. 

అక్కడక్కడా ఆగుతూ అక్కడక్కడా దుప్పుల్ని చూపిస్తూ బస్సు డ్రైవరు 

పార్కు చారిత్రక వివరాలు చెప్తూ ఉంది. 

సరిగ్గా గంట ప్రయాణం చేసేమో లేదో మా సిరి అలవాటు లేని బస్సు కుదుపులకి హడావిడి చేసింది.

బస్సు ఆపమని నేను సిరితో కిందికి దిగేను. ఒక వాంతితో డీలా పడిపోయిన పిల్లతో ఏదోలా బస్సులో ఎక్కేం గానీ, మళ్లీ వాంతులయితే వెనక్కి వెళ్లే బస్సులో వెళ్ళిపోదామని అనుకున్నాం.

అయితే అదృష్టం కొద్దీ కాస్సేపట్లోనే సర్దుకుంది. 

ఎక్కడా ఎత్తైన చెట్లు గానీ, మొక్కలు గానీ లేని అతి చిన్న గడ్డి కొండల మీదుగా అతిపెద్ద దెనాలి నేషనల్ పార్కులో ఉత్తరంగా మధ్యాహ్నం వరకూ ప్రయాణం చేసేం. ఎంతదూరం వెళ్లినా చూడాల్సిన అద్భుత దృశ్యాలు గానీ, గొప్ప జంతువులు గానీ కనిపించకపోవడం గొప్ప వెలితిగా అనిపించింది. 

మధ్యాహ్నానికి మా టూరులో చివరి పాయింటయిన ఉత్తర అమెరికాలోనే అతిపెద్దదైన పర్వతమైన మౌంట్ మెక్ కిన్లీ వ్యూ పాయింటుకి చేరేం.  

వ్యూ పాయింటులో కొద్దిగా ఎత్తుకి నడిస్తే దూరంగా విశాలమైన గడ్డి భూమి మీద ఆకాశపుటంచులో  అద్భుత మేఘంలాగా నిలబడ్డ మెక్ కిన్లీ పర్వతం ఫోటోలు తీసుకున్నాం. సిరి బస్సు దిగి పక్కనే ఉన్న రాళ్లతో ఆడసాగింది. తన దగ్గిర ఎవరో ఒకళ్ళం ఉండి, ఇద్దరిద్దరం వెళ్ళొచ్చాం. 

మధ్యాహ్న భోజనమంటూ ఏవీ లేకుండా ఒక అరటిపండు, ఒక బిస్కెట్టు, చిన్న చిప్సు ప్యాకెట్టు ఉన్న స్నాక్ బాగ్స్ మాత్రం ఇచ్చేరు. 

అక్కడ నుండి మళ్లీ వెనక్కి ప్రయాణిస్తూ వచ్చిన దారిలో రెస్ట్ ఏరియా దగ్గిర ఆపేరు. ఆ పక్కనే పెద్ద పెద్ద టెంట్లు వేసి ఉన్నాయి. 

ఒక దాంట్లో గిఫ్ట్ సెంటర్ నడుపుతున్నారు. మరొకదాంట్లో నేషనల్ పార్క్ చరిత్రకు సంబంధించిన విశేషాలు ప్రదర్శనకు ఉంచారు. వాటి బయట పెద్ద పెద్ద దుప్పి కొమ్ములు ఆడుకోవడానికి, ముట్టుకుని చూడడానికి అనుమతించారు. అక్కడ మా బస్సు ఒక అరగంట ఆగడంతో మేమందరం వాటిని ఒకదానితర్వాతొకటి తలల మీద పెట్టుకుని ఫోటోలు తీసుకుని, దుప్పుల్లా ఒకళ్ళ వెనక ఒకళ్ళు పడి ఆడుకుని, నవ్వుకున్నాం. అన్నిటికంటే నన్ను బాగా ఆకర్షించినది ఆ పక్కనే సన్నగా చిన్న ప్రవాహాలుగా విడిపోయి ప్రవహిస్తున్న నది. పార్కింగ్ లాటు నుంచి కొద్దిగా దిగువకి నడిచి సన్నని గులకరాళ్ల మీద నుంచి స్వచ్ఛంగా ప్రవహిస్తున్న ఆ నీళ్లలో చెయ్యి ముంచి, తల మీద  పవిత్ర గంగా ప్రవాహమని నీళ్లు జల్లుకుని మురిసిపోయాను.  

అల్లంత దూరాన పురాతత్వ రహస్యాల్ని దాచుకుని గడ్డకట్టిన హిమానీనదం అపురూపంగా కరిగి అత్యంత స్వచ్ఛంగా ప్రవహిస్తున్న నీరది. ఆ నీటిని తాకగానే అంతటి అద్భుతమైన భావనా కలిగింది నాకు.  

మళ్లీ గంటల తరబడి ప్రయాణం. అదేలాంటి గడ్డి కొండలు. బహుశా: శీతాకాలమంతా మంచుతో కప్పబడి ఉండడం వల్ల ఇక్కడ ఇంతకంటే ఎత్తు మొక్కలు, వృక్షాలు పెరగవన్నమాట. పిల్లలు అంతటి కుదుపుల బస్సులోనే బాగా నిద్రపోయేరు. 

నాకు ఇండియాలో రోజూ అతి మామూలుగా బస్సుల్లో వేళ్ళాడుతూ తిరిగిన రోజులు జ్ఞాపకం వచ్చేయి. ఇటువంటివి అలవాటు లేని పిల్లలు ఏం గోల పెడ్తారో అని భయపడ్డాం ఏం పేచీ లేకుండా కానీ బుద్ధిగా కూచున్నారు పాపం. ముఖ్యంగా మా సిరి. ఈ ప్రయాణంలో నిద్ర నీరసం వల్ల సగం, సరిగా తినక సగం డీలా పడిపోయింది. అయినా పేచీ పెట్టలేదు. 

రోజల్లా తిరిగినా గొప్ప విశేషం అని చెప్పుకోదగినవేవీ లేవు. అయినా  దెనాలి నేషనల్ పార్కుకి ఇంత పేరెందుకు వచ్చిందా అని భలే ఆశ్చర్యం వేసింది. నిజానికి అమెరికాలో మా కాలిఫోర్నియాకి దగ్గర్లో ఉండే నేషనల్ పార్కులు ఇంతకంటే చాలా గొప్పగా ఉంటాయి. నేను ఆకాశం కింద ఉండే ఏ భూభాగమైనా ఇష్టపడతాను కానీ, సత్య బాగా నిరాశ పడ్డాడు. 

పెద్దగా తిరగకపోయినా సాయంత్రం నాలుగైదు గంటల వేళ తిరిగి రిసార్టుకి వచ్చేసరికి అందరికీ ఓపిక మాత్రం అయిపోయింది నాకు తప్ప!

 

****

(ఇంకా ఉంది)

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.