యుద్ధం ఒక గుండెకోత-1

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

బాధ

సన్నటి సూదిములుకై

రక్తంలో ప్రవేశించింది

నరాల్ని కుట్టుకుంటూ రక్తంతోబాటుగా

శరీరమంతటా ప్రవహించటం మొదలైంది

శరీరంలో ఎక్కడో ఒకచోట

ఉండుండి ప్రవాహమార్గంలో

సున్నితమైన నరాల గోడల్ని తాకుతూ

స్పందనల్ని మీటుతూ

చురుకు చురుకు మనిపిస్తూనే ఉంది

హాహాకారాల్ని ఆహ్లాదంగా పరిగణించలేంకదా

ఆక్రందనల్ని ఆనందంగా ఆస్వాదించలేంకదా

చాటున మాటేసి పంజా విసిరినా

పంజాదెబ్బ పడేది అమాయకులమీదే

గాయం అయ్యేది తల్లి గర్భంపైనే

ఆకాశం పిడుగై వర్షించినా

పక్షులకు ఆశ్రయమైన ఏ మహావృక్షమో

కాలిబూడిద కావలసిందేకదా

అనాథపక్షులు కకావికలై పోవాల్సిందేకదా

పెనుబాంబులుగా రూపాంతరం చెందిన

లోహ విహంగాలు పెఠేలు మంటే 

ఎక్కడో ఏ మూలో

ఒక తల్లిపేగు ఖణేలుమంటుంది

ఏ పరిస్ధితులు ఆకాశంనిండా

యుద్ధమేఘమై అలముకొన్నా

దుఃఖం భూగోళమంతా వర్షిస్తుంది

వేలు ఎవరిదయితేనేం

కన్నుమాత్రం మనందరిదీనీ

కాలుస్తున్నది మన యిల్లు కాదని

మూడంకెవేసి ముడుచుకు పడుకొన్నా 

మంటసెగ మనచుట్టూరా ఆవరించకమానదు

చేతులు మొదలంటా కాలేవరకూ

బాధని సహించాల్సిందేనా?

ఎవరికి వాళ్ళమే ఆకుల్ని వెతుక్కుంటూ

మంటల్ని చల్లార్చుకోవాల్సిందేనా?

చేతిగాయాలనైతే చూపగలుగుతాం

కడుపులో జ్వలిస్తున్న దుఃఖపు మంటని 

ఎలా చల్లార్చుకోగలం?

కనిపించకుండా రక్తంలో ప్రవహిస్తూ

నిలువెల్లా గాయాల్ని చేస్తున్న

ములుకుల్ని ఎలా తొలగించుకోగలం?

*   *   *

తాకట్టుగా మారి ఇనప్పెట్టెలో చేరిన యింటిని 

విడిపించటానికి డబ్బు పంపుతానని బాసలు చేసి

ఇకమీదట మన జీవితాలు పూలతేరుమీదేనని

రాత్రి చెవిలో ఒలికించిన తేనె సోనలు

ఏ మేఘాల అంచుల్లో ఒదిగిపోయాయో

ఆఘమేఘాలమీద ఒడిలో చేరటానికై వస్తున్నానంటూ

క్షణాల్లో హృదయాల్తో వూసులాడుతానని

గుసగుసగా చేసిన వాగ్దానాలు

ఏ గాలి తెరల్లో చితికిపోయాయో!

మృత్యువు వెనకనే తరుముతుంటే

ప్రాణాల్ని గుప్పిట్లో బంధించే లోపునే

కాళ్ళు లిప్టులౌతూ జారిపోతాయి

మెట్లు స్కేటర్లై కదిలిపోతూనే ఉంటాయి

భయంవెనకే తల్లి పిలుపూ వెంటాడుతుంది

తండ్రిచేసిన అప్పులూ తరుముతాయి

నిస్సహాయత్వం మైంలా కమ్మేస్తుంది

ఒకే ఒక్కక్షణం

మృత్యువుకి దొరికిపోతారు

ఎటువెళ్ళాలో తోచని పరిస్థితి

విజయగర్వంతో మృత్యువు పొగై

ఊపిర్ని బంధించటానికి పైకి ఉరుకుతుంది

ఒకే ఒక్కదారి ముందున్న కిటికీ!

ముందు వెనకలు చూసే ఆలోచన మూసుకుపోతుంది

అంతే

ఇక అటువైపే పరుగు

అది ఏ అంతస్తో గుర్తురాదు

కళ్ళకి కనిపించేది

భ్రాంతిలా మైమరపింపజేస్తుంది

ఆ క్షణంలో 

అమ్మ ఒడిలోకి దుముకుతున్నంత ఆర్తితో

ఒకే ఒక్క గంతు –

తలకిందులుగా మృత్యుకుహరంలోకి

సాగిపోతూ సోలిపోతూ…..!

ఒకే ఒక్క క్షణం అమ్మ గుర్తుకొస్తుంది

నేలని తాకుతున్న తలలో ఆశలు చిట్లుతాయి

అనంతదూరంలోని అమ్మ పొట్టలో

అప్పుడే రక్తంతోపాటు

ప్రవహిస్తూ వస్తున్న సూదిమొన

చురుక్కు మనిపిస్తుంది

శవాలు కాల్తున్న వాసనలో

ఏ దేశపు ఆచూకీ తెలియదు

ప్రవహిస్తున్న ఆ రక్తధారలలోని ఏ బిందువూ

వర్ణవిభేదాల్ని విక్షేపం చేసి చూపదు

కుళ్ళిపోతున్న శవాల్ని ఆక్రమిస్తున్న క్రిములు

ఏ వూరో ఏ దేశమో చిరునామాలు తెలుసుకొని

రంగూ రుచీ వాసనల్ని ఆస్వాదించవు

ఏనాడో గతించిపోయిన కణాల్ని

మనలోకి మనమే ఆవాహన చేసుకొంటున్నాం

రూపురేఖలు తీర్చిదిద్దుతున్నాం

ఒక గొప్ప ఆవిష్కారం చేస్తున్నామని గర్వపడుతున్నాం

ప్రపంచాన్ని జురాసిక్‌ పార్కు చేసుకొంటున్నాం

ఈనాడు భూగోళాన్ని శాసిస్తున్నవి

పురాతన శిథిలాల నుండి బయటకు వస్తున్న

నరభక్షకాలైన భయంకర డైనోసార్లే

వాటిని మనమేకదా

దీర్ఘనిద్రనుండి మేల్కొల్పుతున్నాం

స్వయంకృతాపరాధానికి

ప్రపంచమంతా జరిమానా కట్టాల్సిందే

మృత్యువు కారుమబ్బుల్లా

మన జీవితాలపైన పరచుకొంటుంటే

ఇన్ని రోజులుగా సమకూర్చుకున్న

శ్రమఫలితాల్ని దోచేస్తుంటే

నిర్జన ఎడారిలో దిక్కులేని వారమౌతున్నాం

మనకోసం

మనకో తోడును

తక్షణం వెతుక్కోవలసిందే

*   *   *

అర్ధరాత్రి ఉండుండి ఉలికిపడ్తాం

నిద్రలో కూలిపోతున్న భవిష్యత్‌ హర్మ్యాల్నీ

కళ్ళముందే కిటికీలలోంచి జారిపోతున్న కలలపంటల్నీ

ఆర్తితో వెతుక్కుంటాం

తల్లడిల్లుతున్న పసివాళ్ళ ప్రాణాల్ని

నిద్రలోనే కొంగులు పట్టి ఆపుకోవాలనుకుంటాం

మృత్యువు తీసుకెళ్ళిపోతున్న ప్రాణాలనుండి

ప్రశ్నలు జారిపడిపోతున్నాయి

ఒక్కో ప్రశ్న ఒక్కో కత్తికోత

నిజానికి మనం మతాల్ని

తొమ్మిది నెలలూ కడుపులో మోయంకదా!

తల్లుల్లారా! మీరన్నా చెప్పండి

మీరెవరైనా మీ గర్భంలో మతాన్ని దాచుకొన్నారా

మన ఒడిలోకి చేరాకే కదా

వాళ్ళు రాముళ్ళో, రహీములో

బుష్‌లో, లాడిన్లో

గాంధీలో, గాడ్సేలో అవుతున్నారు

మన గర్భంలోనే కదా తల్లి థెరీసా కళ్ళు విప్పింది

మన గర్భంలోంచే కదా

కుష్టురోగులకు సేవలు చేస్తున్న బాబా ఆమ్టే జన్మించాడు

మనకు తెలియకుండా

రాక్షసులెప్పుడు ఊపిరిపోసుకున్నారో

గర్భస్థ శిశువులనైనా, పుట్టాకయినా

ఇకనుండి మనం అనామికలుగానే పెంచుదాం

పుట్టాక వారిపేరు వాళ్ళే సంపాదించుకొంటారు

వాళ్ళ భవిష్యత్‌ వాళ్ళే నిర్మించుకుంటారు

ఎక్కడో సున్నితమైన కదలిక

పూరేకుమీద పడిన మంచు బిందువు

అసహాయంగా చిట్లిపోయిన సవ్వడి 

దాక్కోవాలని ప్రయత్నించిన కన్నీటిబిందువు

ఆవిరి అయిపోతున్న శబ్దం

అలసిపోయిన తల్లిగర్భంలో 

మెత్తని మృత్యుకత్తి పేగు తెంచిన చప్పుడు

కూలిపోతున్న బహుళ అంతస్తుల సౌధాల క్రింద

నలిగిపోతున్న ఆక్రందన

ఎక్కడో వృద్ధుల వడలిన కన్రెప్పల అడుగున

కన్నీరు ఇగిరిపోయిన ఎడారి మైదానాలు

పంచ భుజి కోణంలో గుచ్చుకొన్న

కొత్త పెళ్ళికొడుకు గుండె

సప్తసముద్రాల అవతల

రంగుల కలల్లో తేలిపోతున్న అమ్మాయి

ముచ్చటగా పెళ్ళికి వేయించుకొన్న మెరుపుగాజుల మధ్య

చివరిసారిగా కొట్టుకొన్న అలజడి

విచ్చుకొన్న క్లస్టర్‌ నేత్రం విరజిమ్మిన నిప్పురవ్వలు

జనానాలో నిద్రిస్తున్న తల్లిగుండెని కాల్చిన వాసన

శరణార్ధి శిబిరాలలోని అనాథ బాలల్ని

ఆవరిస్తున్న పెనుచలి

రాత్రి తాగిన తల్లిపాల నురుగు

వెక్కి వెక్కి నిద్రలోనే కనుమూసిన పసిపాప పెదాలపై

రక్తపు డాగుతో మమేకం అయిన ప్రకంపనం

ప్రార్థనలో మునిగిపోవాలని

మూసిన కనురెప్పల కింద దూరిన మృత్యువు

రేపటి తొలి వెలుగు చూడనీకుండానే

మందిరాలముందే శిలువలకు వేలాడదీసి

ఆర్పేసిన హృదయ దీపాలు

భవంతులు క్రూరమృగాలు దాగిన కొండగుహలై

జనావరణాలు నిర్జీవ సముద్రాలై

ఊపిర్లు విషసర్పాల బుసలై

ప్రాణాలు భయం కలుగులో దాగిన మూషికాలైన భయానక ఆలోచనలు

అంతరంగాన్ని మెలిపెడ్తుంటే

కంఠానికి గుచ్చుకొన్న సూది మొన చేస్తున్న గాయం బాధ!

సమర శంఖంలోంచి

చుక్క చుక్కై ఒక్కొక్క చినుకై

రాలుతున్న రక్త బిందువులు

సహస్రాబ్ధికి కొన్న కొత్త చీరమీద

మాయని అసహజ చిత్రాల్ని లిఖిస్తున్నాయి

*   *   *

దిక్కుల్ని నలువైపులా పాతుకొని

యుద్ధానికే కర్మబద్ధులైపోయి

మానవత్వాన్ని సమర రంగంలో నిలువెల్లా పాతిపెట్టాక

ప్రాణాలు ఏ దిక్కులో దీపమై కొడిగట్టాయో!

అంతఃకరణలో ఆధిక్యభావాన్ని నింపుకొని

పశుత్వపు మారువేషంతో

ప్రపంచ స్వేచ్ఛని తూట్లు తూట్లుగా కుమ్మి

అమాయకంగా శాంతివాక్యాల చొంగ కారుస్తూ

ఎంత తిరిగితేమాత్రం ఏముంది!

గంగిగోవు తొడుగుని వంటినిండా కప్పుకొని

అందర్నీ మందలోకి కలుపుకోవాలని

ఎంత ప్రయత్నిస్తేమాత్రం ఏముంది!

పగలూ, ప్రతీకారాలూ ఎప్పుడూ విధ్వంసకారకాలే

సామరస్య భావంతో సమస్యల్ని పరిష్కరించకపోతే

పెంచుకొంటున్న కొద్దీ రగులుతూనే వుంటాయి

దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు

ఇక 

మలిగిపోతున్న చివరిప్రాణం

రాస్తున్న మరణ శాసనంలో

ఆఖరు సంతకం క్లస్టరు బాంబుదైనా కావచ్చు

అణుక్షిపణిదైనా కావచ్చు

విర్రవీగే అహంభావం మూలాల్ని కదిలించి

ఆమూలాగ్రం వణికించగలిగే జీవాయుధానిదైనా కావచ్చు

ఇంక ఆ తర్వాత

పశ్చాత్తాపంతో వంచుకోటానికి శిరస్సులూ ఉండవు

సిగ్గుతో తలదాచుకోటానికి ముడుకులూ ఉండవు

దహన శేషాలైన బూడిద కుప్పలు తప్ప

ఆనాడైనా –

మనస్ఫూర్తిగా

చిన్ననాడు గోరు ముద్దలతోబాటు

శిఖరాగ్రాలకు దారులు వేసిన అమ్మని పిలిచి చూడు

ఒకనాడు ఛీదరించుకున్నావని మర్చిపోయి

నీ పిలుపుకు కదిలి

సమాధుల్లోంచి వచ్చి సేదతీరుస్తుంది

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.