రాగో

భాగం-6

– సాధన 

మర్కనాలో ఫారెస్టువారి నర్సరీ పనులు జోరుగా సాగుతున్నాయి. సమ్మె చేసి కూలిరేట్లు పెంచుకున్న కూపు కూలీలు ఆ రోజే పనుల్లోకి దిగారు. వీడింగ్ పని చకచకా సాగిపోతుంది.

సాయంకాలం ఆరున్నర అవుతుంది. ఊరి బయటే తెలుగు ప్రాంతీయ వార్తలు విని దళం ఊళ్ళోకొచ్చింది. మసక మసకగా ఉన్న వెలుతురు కాస్తా మనుషుల్ని గుర్తు పట్టరాని చీకటిగా చిక్కపడింది. అడవిని అనుకొనే ఉన్న చివరి ఇంటి ముందు దళం ఆగింది. దళ కమాండర్ ఆ ఇంటి దాదను తొందరగా ఊళ్ళోకి తోలాడు. బాగా చీకటి పడితే అందరూ గాటో తినేస్తారు. తిన్నాక అడిగితే అన్నం (గాటో) దొరకదు. వంట వండి పెట్టడం అంటే ఆలస్యం అవుతుందని కమాండర్ ఆ దాదను అన్నం జమ చేయడానికి తొందర చేశాడు.

ఆ ఇంటి చుట్టు వెదురు దడి అల్లి ఉంది. బలమైన కొయ్యలతో ఎత్తుగా ఉన్న ఆ దడిని దూకడం కష్టం. చుట్టూ దడి ఉన్న ఆ ఇంటికి ఎక్కడ సందు విడిచి దారి చేశారో కమాండర్ చూడసాగాడు. ఏ క్షణాన ఏం జరిగినా తప్పుకోవడానికి అవసరమవుతుంది.

ఇల్లిల్లు తిరిగి అన్నం, కూర జమ చేస్తున్నాడు దాద. ప్రతి ఇంట్లోనూ తొందర చేస్తున్నాడు. దాద చెప్పినట్టే ఎవరి దొప్పలు వారు చక చకా సర్దుకున్నారు. ఇంటికో దొప్ప తెస్తే దళానికి సరిపోతుంది. ఒక దొప్పలో కూర మరో దొప్పలో అన్నంతో ఊరి వాళ్ళంతా ఆ చివరింటికి చేరుతున్నారు. దొప్ప పెద్దగుంటే విస్తరాకు అవసరముండదని రూపి పావురాకులతో పెద్ద దొప్ప కుట్టి రాగో దగ్గరికొచ్చింది.

“రాగో! అన్నలొచ్చిండ్రు. పోదామా” – రూపి.

“ఇంగో” (ఇలాగే) – రాగో..

“బువ్వ దొప్ప తెస్తున్నావా” – రూపి.

“హిల్లే. లిత్తన్. మార్త. (లేదు, తిన్నా, ఒడ్సింది) ఏం చేయాలి” అంటూ రాగో చేతులు తిప్పుతూ రూపి వైపు చూసింది.

“బారామో! దట్” అంటూ (ఏంగాదూ! పోదాం) రూపి రాగోను నడవమంటూ ముందుకు దారి తీసింది.

“దొప్పలన్నీ వచ్చినయ్ అన్నా. అందరూ చేతులు కడుక్కోవాలి” అంటూ కమాండర్ తో చెప్పి ఆ ఇంటి దాద రూపివైపు చూశాడు. రూపి, ఆ ఇంటి దాత కలసి దళానికి తిండ్లు సర్దుతున్నారు. అన్ని దొప్పల్లోని అన్నమంతా ఒక గుల్లలోకి, కూరంతా ఒక గంజులోకి వంపారు. ఖాళీ దొప్పలు తలా ఒకటి ఇచ్చి దళం వాళ్ళు కూచోగానే వడ్డన ప్రారంభించారు.

ఊరి వాళ్ళందరూ వాకిట్లో నెగడుచుట్టు చేరి కబుర్లు మొదలెట్టారు. దళపు అన్నలను, అక్కలను వింతగా చూస్తూ రాగో రూపిని అంటి పెట్టుకొనే మెదలుతుంది.

“నీళ్ళక్కా” – తింటున్న దళ సభ్యుల్లో నుండి ఎవరో గాభరా చేశారు.

“రాగో నీళ్ళివ్వు” అంటూ సరం తప్పిన అన్నను చూయిస్తూ రూపి కదిలించింది.

రాగో సిగ్గుపడుతూ నీళ్ళిచ్చి వడ్డిచ్చే వారిలో కలిసిపోయింది.

భోజనాలు ముగిశాయి. వాకిట్లో నెగడు మండుతుంది. నెగడు చుట్టూ ఉన్న జనాలు అన్నలను చూసి సందు ఇచ్చిండ్రు. ఒకరి పక్కగా ఒకరు దళం వరుసగా నిలబడింది. కబుర్లలో పడ్డ జనాల దృష్టిని ఇటు మరల్చడానికి దళం పాటలందుకొంది. ముందుగా కమాండర్ గొంతు సవరించి పాట ఎత్తుకున్నాడు.

గేడే యాయల్ కోం రాం రాం            అడవి తల్లికి దండాలు

మావ యాయల్ గేడె తుకు రాం రాం  మా తల్లి అడవికి దండాలు

గేడే చిత్తురు మత్తే                        అడవి చల్లాగుంటే

గాటోతునే కరువు హిల్లే                 అన్నానికి కరువే లేదు

పంటాలోనూ వత్తే                        పంటాలింటి కొస్తే

పండుము కీకము                       పండుగ చేద్దాం

మెట్టాపొయిసీ, గుట్టా పొయిసి          కొండల నుండి, కోనల నుండి

గోదావరిని విత్ ముడ్ హూడా,         గోదావరమ్మ పరుగులు చూడు

వక్సురె వక్సురె తిర్సురె తిర్సురె       వంకలు తిరుగుతూ తిరుగుతు తిరుగుతూ

బేరసక్కునా పొంగుముడు హుడా     నదులేమో పారుతున్నయి.

దొడ్డతే కన్ హూడా                      వాగుల్లో ఊటలు చూడు

కై సువ్వతేరు హూడా                   చెలిమెలో నీరు చూడు

బేరస్ సర్నే మత్త జిల్లా                  జిల్లా చుట్టు నదులున్నా

గోండు దాదలార గడ్చురోలి              గోండు దాదల గడ్చురోలి

రేల రేల రేల రేల రేల రేలం             రేల రేల రేల రేల రేల రేలరే

…    …    …                       …    …   

…    …    …                       …    …   

ఆ తర్వాత ఈ మధ్యనే రాసిన అక్కల పాట పాడమని కమాండర్ గిరిజను పిలిచాడు. పాట పాడేముందు ఆ పాటలోని సంగతులు పరిచయం చేస్తూ గిరిజ ఇలా ప్రారంభించింది.

“అక్కలూ! దాదలూ.

నేను పాడే పాట అక్కల పాట. మన మాడియా కులంలో అక్కలెట్లున్నరో ఈ పాటలుంది. ఎగిరేకాడ అక్కలనెట్ల చూస్తరో ఇందులో ఉంది. పెండ్లి అయినాంక బలంవతంగా రవిక తీసేసి అక్కకు మారెడు తువ్వాల చుట్టబెట్టడం మంచిది గాదని ఉంది. ఇంకా అన్ని తీర్ల రివాజుల పేరుమీద ఆడోళ్ళను పెట్టే ఇబ్బందులన్నీ ఇందులో ఉన్నాయి. ఇష్టం లేకున్నా సరే, అయ్య కల్లు తాగినందుకని బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తే మనసులేని వాడికి ఉండనని ఆ పిల్ల ఇంకోనికి పోతే మళ్ళీ గుంజుకొచ్చి తన్ని గుద్ది పంచాయితీలు చేసే పెద్ద మనుషుల రీతి రివాజులు ఇందులో ఉన్నాయి. పెండ్లి నచ్చక తన బతుకు తాను బతుకుతానని కష్టం చేసుకునే అక్కల్ని ‘కేర్దే’ అని ముద్రేసి అల్లరి చేసుడు, ఆడదాన్ని మనిషిలాగ ఖాతరు చేయకపోవుడు మంచిది గాదనీ, ఈ రివాజులు మారాలనీ నేను పాడే పాటలో ఉంది. పెద్దమనుషులు కోపానికి రాకుండి. మేము చెప్పేది నిజమో, కాదో విచారం చేయండి” అంటూ మొదలెట్టింది పాట.

మీవా పొల్లు వెహల వార్ఖం              మీ పొల్లు చెప్పుతాం

మీవా కట్ల వెహల వార్ఖం                మీ బాధ చెప్పుతాం

పింజర్ తె మత్త రాగో లెక్క              పంజరంలో చిలుక లెక్క

నీవా సిన్వల్ కీత్తోరక్కా                  నీ బతుకు చేసిరక్కా

నీవా సర్నే రివాజు కీసి                  నీ సుట్టు రివాజులల్లి

నీవా కాల్కు ఉరుహ్త్తురక్కీ              నీ కాళ్ళూ విరిచిరక్కా

నీవా హక్కు, నీవా పిస్వల్              నీ హక్కు, నీ బతుకు

లిమ్మ రుతుల గుమ్మడి                లిమ్మ రుతుల గుమ్మడి

కేంజాలాసి వట్రి బాయి                   వింటానికి రావే అక్క

లిమ్మ రుతుల గుమ్మడి                లిమ్మ రుతుల గుమ్మడి

…    …    …                       …    …   

…    …    …                       …    …   

అందరూ చెవులు రిక్కించుకొని వింటున్నరు. అక్కలందరూ ఒక దిక్కే కూచున్నరు. రూపి పక్కనే రాగో కూచుంది. వాళ్ళకెదురుగా పడుచోళ్ళు, పెద్దాళ్ళు, మగాళ్ళందరూ ఉన్నారు. గిరిజ పాడే పాట అందరూ వింటున్నారు.

వింటున్న రాగోకు ఆ పాటలో తన జీవితమే కనపడసాగింది. “ఔను! ఆడదాని బతుకు పంజరంలో రాగో (చిలుక) జీవితమే అయ్యింది. దాని చుట్టు అన్నీ రివాజులే” అనుకుంటూ రాగో పెదవి విరిచింది – ఎదురుగా కూచున్న మగవాళ్ళను పట్టి పట్టి చూస్తుంది. వాళ్ళెవరిలోనూ చలనం లేదు. గిరిజ ఏ మాత్రం జంకు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళ మొగాలపైనే ఆ పాట పాడుతున్నందుకు రాగోకు ఎంతో ఊరటగా ఉన్నట్టనిపించింది. ఆ పాట తానే పాడుతున్నట్టు, అందరి మీద కసి తీర్చుకున్నట్టు రాగో మనసు వెచ్చగా ఉంది. మగాళ్ళు పల్లెత్తు మాట అనకుండా కూచున్నందుకు పరేషాన్ అయింది.

“రాగో, పాట మంచిగుంది” అంటూ రూపి జబ్బ పట్టుకొని కదిలించడంతో, రాగో ఈ లోకంలోకి వచ్చి “ఇంగో” అంది.

“మూడు నెల్లాయె అన్నలు రాక. పోయినసారి అన్నలు వచ్చిపోయిన తెల్లారే నువ్వు దిగినవ్. ఇవ్వాళ నీ కోరిక తీరిందే” అంటూ అన్నలను చూడాలని రాగో అడిగిన మాటను గుర్తు చేసుకుంది రూపి.

“ఇంగో. నువ్ చెప్పినవ్ గానీ అన్నలు మంచి మంచి మాటలు చెప్తరే” అంటూ రాగో మాట కలిపింది. అంతలో కమాండర్ ఉపన్యాసం మొదలు పెట్టాడు.

“సబ్బెటోరుకు హూండా (అందరికి) లాల్ సలాం!” అంటూ కమాండర్ ప్రజలందరికి లాల్ సలాం చెప్పి మాటల్లోకి దిగాడు.

“మనం పదిహేను రోజులు సంపు (సమ్మె) చేసినం. ఆఖరుకు గెల్సినం. సమ్మె పాడుచేయాలని జంగ్లాతు వాళ్ళు అన్ని తీర్ల చేసిండ్రు. మనం లేచి కాడికెల్లి లేబర్‌ను తెచ్చి పనులు నడిపియ్యాలనుకున్నారు. కూపులకాడ ఉండి మనం లేబర్లను వెనకకు పంపినం. పోలీసులొచ్చిండ్రు. వాళ్ళని చూసి బెదిరి పనులకు పోయి వొళ్ళెవరు లేరు. ఆఖరుకు జంగ్లాతు సాహెబులు కింది నౌకరు గాండ్లతోటి లీడింగ్ చేయించాలనీ చూసిండ్రు. వాళ్ళెంత చేస్తరు? గంట చేస్తే గంట కూచోవాలె. ఇగ కాదనుకొని మనమడిగిన రేటు ఇస్తామన్నారు. దీనంతటికి మీరందరూ ఒకటి గుండుడే కారణం, మనం ఒకటిగుంటే ఏ సర్కారోడు ఏం చేయలేడు, ఏ పోలీసోడు ఏం చేయలేడు” అంటూ చెబుతున్న కమాండరు వింటున్న వారిలో నుండి ఎవరో అడ్డుతగిలారు.

“ఆకులపుడు సంపు చేస్తేనే రేటు పెరిగింది దాద’. ఆ మాట ముగిసిందో లేదో మరో గొంతు వినపడింది.

 “అపుడు ఇంతకన్నా ఎక్కువ పోలీసోల్లచ్చి ఏం పీకిండ్రు” అని మరో దాద గొంతు కలిపాడు.

“రూపి! నేను ఆ పాట పాడిన అక్కతోని మాట్లాడుతనే. వింటదానే?” అంటూ రాగో అనుమానంగా అడిగింది.

“ఊరందరి ఆపతి విన్నపుడు నీ ఆపతెందుకు వినరే – చెప్పు” మంది రూపి.

“ఈడకాదు – చాటుకు” – రాగో.

“అయితే జెరారు. వీళ్ళ మాటలైనాంక మాట్లాడుదాం” అంది రూపి.

వీరిద్దరూ మాట్లాడుకుంటుండగానే గిరిజ వారివైపు రావడం రాగో చూసింది. రూపి చెప్పాలనుకునేసరికి గిరిజ వారిని దాటి పడి అవతల అడుగుపెట్టింది. మూత్రం చేసి వస్తున్న గిరిజకు రూపి, ఆమెతో పాటు మరో అక్క ఎదురయ్యారు.

“ఏం రూపక్కా! ఏం సంగతి?” – గిరిజ పలకరించింది.

“ఇది మాట్లాడుతదటక్కా. మా గోతే ఇది. పేరు రాగో” అంటూ స్నేహితురాలైన రాగోను పరిచయం చేసింది.

“ఏ వూరక్కా?” – గిరిజ.

మౌనం.

“ఏం పేరూ?” – గిరిజ.

మౌనం.

రాగో కళ్ళలోకి నీళ్ళు వచ్చేసినయ్. మరో ప్రశ్నతో అవి పై కురకడానికి సిద్ధంగా ఉన్నయి. నీరు నిండిన కళ్ళు నెగడు కాంతిలో మెరిస్తే రాగో తల వాల్చేసింది. ఇన్నాళ్ళకు “అక్కా’ అని నోటినిండా పిలిచిన పిలుపు విని రాగో కదలిపోయింది. మాట్లాడలేని రాగో విషయం కనుక్కోవాలని గిరిజ ఆప్యాయంగా ఆమె భుజంపై చేయి వేసింది. అంతే, రాగో వెక్కిళ్ళు పెట్టింది. మాట పెకలడం లేదు.

“ఏడ్వకక్కా. చెప్పు ఎవరేమన్నరు?” – గిరిజ.

జవాబుగా వెక్కిళ్ళు పెరిగాయి.

“దాదా! మేము ఆఖరి పాట పాడుతాం. వినండి” అన్న కమాండర్ గొంతు విన్న గిరిజ రాగోను చేయిపట్టి తీసుకపోయి తన పక్కన నిలబెట్టుకుంది.

అందరి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అందరూ ఆ టెన్షన్లో నిలబడి పిడికిలెత్తి గొంతు కలిపి అంతర్జాతీయ గీతం పాడుతున్నారు. ఆ పాట, ఆ తీరు తెలవని రాగో వారిలోనే నిలబడి ఉంది. తనకు తెలియకుండానే చేయి మాత్రం పైకెత్తింది.

అన్నలతో నిలబడ్డ రాగోని కొత్త మనిషిని చూసినట్లు రూపి అదే పనిగా చూస్తుంది.

పాట ముగిసింది. దళం వారు కిట్లు వేసుకుంటున్నారు. ఒకరొక్కరే అక్కడున్న జనాలకు “పోతాం దాదా” అంటూ చేతిలో చేయి కలిపి లాల్ సలాం అంటున్నారు.

రాగో, రూపీలను తీసుకొని గిరిజ పక్కకెళ్ళింది. రాగో సమస్య తెలుసుకోవాలన్న కుతూహలంతో రాగో, రూపిలను వివరాలు అడిగింది. కిందటిసారి జిల్లా బంద్ రోజున అడవిలో తారసపడిన దగ్గర్నుండి రాగో గురించి తనకు తెలిసిందంతా రూపి గడగడ వర్ణించింది. సంఘం పనంటే వెనుకా ముందు కాకుండా ఎంత కష్టమైనా సరే చేస్తుందనీ సీర్కదాద రాగో గురించి మీకు చెప్పే ఉంటాడనీ ఓ మాట కూడ కలిపింది. సమ్మె జరిగినన్ని రోజులు రాగో సమ్మెలో తనతో ఎంతో సహకరించిందనీ చెప్పింది. “రాగో మంచి పిల్ల. తీసుకోండక్కా” అంటూ రూపి కూడ చెప్పడంతో కమాండర్తో మాట్లాడి గిరిజ రాగోను వెంట పెట్టుకొని తన వాళ్ళలో కలిసింది.

రాగో, రూపిలు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి చూపుల్లో ఏదో తృప్తి కనపడసాగింది. ‘నీ బాధలు తప్పినయ్’ అన్న భావనతో రూపి వీడ్కోలు చూపులుంటే, ‘కొత్త ప్రపంచం. నేనెలా ఉండాలో’ అన్న భావన రాగో చూపులో ఉంది.

“పద రాగో, అన్నలు నడుస్తున్నరు” అన్న గిరిజ మాటతో రాగో ఆమె వెనుక నడిచింది.

దళం ఊరు దాటింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.