మహాభాగ్యం
-ఆదూరి హైమావతి
పావన దేశానికి రాజు పరిమళవర్మ .వారిపూర్వుల్లా ధర్మపాలనచేస్తూ పేద ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే వాడు. రాజ్యం సుఖిక్షంగా ఉండటాన పరిమళవర్మకు తగినపని లేకపోయింది. రాజ్యపాలన కూడా తగిన మంత్రివ ర్యు లుండటాన వారికే అన్నీ వదిలేసి, సోమరిగా మారాడు.
క్రమంగా కూర్చుని తినటాన స్థూలకాయం వచ్చింది. లేచి ఏ పనీ చేయలేక పోయేవాడు. రోజంతా సింహాసనం మీదో, హంస తూలికాతల్పంలోనో గడిపే వాడు. ఎవ్వరికీ మహారాజుకు తన దినచర్య గురించీ చెప్పే ధైర్యంలేక పోయిం ది. అందంగా ఉండే పరిమళవర్మ స్థూలకాయంతో వికారం గా మారాడు.
మహారాణి అపర్ణాదేవి చాటుగా పితృసమానులైన రాజవైద్యులతో మహారాజు ఆరోగ్యం గురించీ తనకున్న భయాన్ని చెప్పుకుంది.
మహామంత్రితో చర్చించి రాజవైద్యుడు ఒక ఉపాయం చెప్పాడు మహారాణికి.
ఒకరోజున ఉదయాన్నే ఆమె తలతిరుగుతున్నట్లు నటించి రాజవైద్యుని పిలిపించింది. ఆయన అనుకున్న పధకం ప్రకారం “మహారాణీ ! మీకు వచ్చిం ది సామాన్యమైన శిరోభారంకాదు.మీ జాతకంలో శని నడుస్తు న్నాడు. మేమిచ్చే వైద్యంతో పాటుగా మీరు మనరాజ్య దేవత ఐన కాళికాదేవికి పూజాదికాలు చేయాలి. మీ దంపతు లిరువురూ ఉదయా న్నే లేచి ఏ ఆహారం తీసుకోకుండా మన నగరం సరిహద్దుల్లో ఉన్న కాళీమాతను కాలినడకన వెళ్ళి మండలం రోజులు పూజించాలి .ఆలయ శుభ్రతకూడా మీ భార్యా భర్తలిరువురే చేయాలి.
దానికి కావలసిన జలాన్ని పక్కనే పారుతున్నపావనీ నదిలో స్నానం చేసి భర్తమోసుకువస్తే, దంపతులిరువురూ పూజాకార్యక్రమం చేయాలి. మండలంపాటు చేస్తే మీకుపట్టి వున్న శనిప్రభావం పోయి మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.” అని చెప్పాడు.
అపర్ణాదేవి రాజవైద్యునితో ” వైద్యశేఖరా! మహారాజుగారు అంత శ్రమచేయ లేరు.ఇది తీరేదికాదు .మరేమైనా ఆలోచించ గలరు.”అంది.
“మహారాణీ గారు మన్నించాలి!ఇదితప్ప తమ శిరోభారంతీరే మార్గమే లేదు. ఆలోచించి నాకు కబురు పెట్టండి.ఏర్పాట్లు చేస్తాను ” అంటూ వెను తిరగ బోయాడు రాజ వైద్యుడు.
అంతావిన్న పరిమళవర్మ” వైద్యశేఖరా! ఆగండి. వెంటనే ఏర్పాట్లు చేయించం డి.మహారాణి శిరోభారంతో బాధపడుతుంటే నేను సహించలేను.” అన్నాడు.
మరేముంది? మరునాడు ప్రాతః కాలంలోనే మహారాజు, రాణీ కాలినడకన బయల్దేరారు.చల్లని పిల్లతెమ్మెరలు శరీరానికి తగులుతుంటే పరిమళవర్మ కు చాలా ఉత్సాహంగా ఉంది.అలానడుస్తూ నదీ తీరాన రాజవైద్యుడు చెప్పినట్లే కావడితో నీరు తెచ్చి పోస్తుండగా మహారాణి మెట్లు, ఆలయం కడిగింది.
అంతా అక్కడి పూజారి చెప్పినట్లే పూజాదికాలు కానిచ్చాక ఆయన ఇచ్చిన నువ్వుల బెల్లం పొగలి ప్రసాదంగా కడుపారా తిని, మరలా కాలినడకన అంతః పురం చేరారు ఇరువురూ. మొదట్లో నడకా, మెట్లమీదుగా కావడితో నీరు మొయ్య టం కష్టం అనిపించినా శరీరానికి శ్రమకలుగుతూ ఉత్సాహం పెరిగింది మహారాజుకు.
ఆరోగకరమైన ప్రసాదం తినడం, క్రిందకూర్చోడం అన్నీ మహారాజుకు ఉత్సాహాన్నిచ్చాయి. క్రమేపీ మండలం కాగానే ఆయన మునుపటి అందమైన పరిమళవర్మ గామారాడు. అపర్ణాదేవి ” రాజ వైద్యునితో ” వైద్య శిరోమణీ! మీవలన నాశిరోభారం తగ్గిపోయింది.ధన్యవాదాలు” అని చెప్పింది.
నడకా,శరీరశ్రమా అలవాటైన పరిమళవర్మ తానొక్కడే మహామంత్రి వెంట రాగా నడుస్తూ రాజ్యపాలనా విషయాలన్నీ చర్చించుకుంటూ కలకాలం ఆరోగ్యంగా ప్రజారంజకంగా పరిపాలించాడు.
ఎవరికైనా శరీరశ్రమను మించిన వైద్యమేలేదు. అందుకేపెద్దలంటారు శ్రమైక జీవన సౌందర్యం అని. శరీరం కదలాలి. మనస్సు నిలకడగా ఉండాలి. అప్పుడే మహాభాగమైన ఆరోగ్యం మనచెంతనే ఉంటుంది .
*****