ఇది ఒక జీవన రంగస్థలి
పక్షులు గూళ్ళు చేరుకుంటున్నాయి
అచ్చం అమ్మ ఒడిలోకి చేరుకున్నట్లు
కోడి పిల్లలను డేగ కన్ను నుండి కాపాడుకుంటుంది ఎగిరెగిరి ఎదిరించి పోరాడే పటిమతో
గంతులేస్తున్న లేగదూడకు తల్లిఆవుపొదుగు పాలిస్తుంది లాలించి తాగించి నట్టుగా
పుడమి తల్లిలా నేలంతా పచ్చదనాన్ని పులుముకుంటుంది జగమంతా తనదే అన్నట్లుగా అంతా అమ్మ తత్వమే
అమ్మా
భూమ్మీద పడగానే ఎంత ఆనందించావో
నాకు ఊహ తెలియకముందే
వెళ్ళిపోయావు కదమ్మా
ఆలనా పాలనలో ఆటపాటలలో
అండగా నిలిచే అమ్మే లేకుంటే
తల్లి లేని పిల్లని అందరూ
జాలి చూపులు చూపిస్తున్నప్పుడల్లా
జలజల రాలే కన్నీళ్లతో కలతచెంది
బంథం తెగిపోయినట్లు
మాట వీగిపోతునట్లు
మనసు వాడిపోయినట్లు
కన్నకలలు చెదిరిపోతున్నట్లు అగుపించినప్పుడల్లా
నిన్నే గుర్తు చేసుకుంటున్నా
అమ్మ లేని లోకం అంధకారమేనమ్మా
అమ్మ బహురూపిణి
భారతీయ సంస్కృతికి నిధి కాని
విధివంచితురాలై
హింస, పగ, ప్రతీకార
వికృతరూపాల విషసంస్కృతిలో
విలవిలలాడిపోతున్న వనిత
ఇంకా నాగరికునిగా చలామణి
అవుతున్న ఓ మనిషీ
ఈ విషసంస్కృతికి తెరదించు
తెంపులేని ప్రేమానురాగాలు పంచుతూ అనుబంధాలను పెంచుతూ
యుగాంతం వారధిగా నిలిచిన
స్త్రీ మూర్తిని పరిరక్షించు
శిరస్సు వంచి నమస్కరించు