ఒక భార్గవి – కొన్ని రాగాలు -11

కమ్మటి పరిమళాలు వెదజల్లే కాపీ రాగం

-భార్గవి

మన దక్షిణాది రాష్ట్రాల వారికి పొద్దున్నే కళ్లు తెరవంగానే కమ్మటి కాఫీ చుక్క గొంతులో పడితే గానీ కాలకృత్యాలు మొదలవ్వవు
 
అసలు కాఫీ రుచంతా అది వెదజల్లే పరిమళంలోనే దాగి వుందంటారు కాఫీ శాస్తృజ్ఞులు.
 
అలాగే ఒక పాట కు కూడా రంగూ,రుచీ,వాసనా కలగజేసేది, ఆ పాటకు ఆధారమైన రాగమే.
మన జీవితాలలో కాఫీ కొక ప్రత్యేక స్థానమున్నట్టే,
 కర్ణాటక సంగీతంలో కాపీ రాగానికి కూడా ఒక ప్రత్యేక స్థానముంది.ఒక ఆర్తినీ,ప్రణయాన్నీ ,విరహాన్నీ , వేడికోలునీ,భక్తినీ పలికించే రాగం.
ఇంకా ఒక రకమైన జాలిని జాలుగా ఒలికించాలంటే కాపీ తోనే వీలవుతుంది.
 
ఇది ఇరవై రెండవ మేళకర్త అయిన ఖరహరప్రియ నుండీ జనించిన రాగం .ఆరోహణలో అయిదు స్వరాలుంటే ,అవరోహణలో యేడు స్వరాలూ వుంటాయి కానీ నడక వక్రంగా వుంటుంది,ఒక క్రమంలో వుండదు,అందుకే దీనిని ఒౌడవ ,వక్ర సంపూర్ణ రాగమంటారు
 
ఆరోహణ—–సరిమ పనిస
అవరోహణ—-సనిదనిపమ గరిస
 
ఈ రాగంలో మామూలుగా పలికే చతుశ్రుతి దైవతం బదులు శుధ్ధ దైవతం పలికితే ఒక రకమైన వేదనా,భక్తీ,నిర్వేదమూ పలుకుతాయని చెబుతూవుంటారు.అప్పుడప్పుడూ అన్య స్వరాలయిన కాకలి నిషాదమూ,అంతర గాంధారమూ కూడా ఈ రాగానికి వన్నెతెస్తూ వుంటాయి
హిందూస్థానీలో ఈ రాగానికి సమానమైన రాగము “పీలూ”.
 
త్యాగరాజ స్వామి కర్ణాటక కాపీ రాగంలో “మీవల్ల గుణ దోషమేమి,ఇంతసౌఖ్యమని” అనే కీర్తనలు చేశారు.
అందరికీ బాగా తెలిసిన కీర్తన ,యం యస్ సుబ్బలక్ష్మి నోట అతిమధురంగా వినపడేది,ఈ మధ్య రాహుల్ వెల్లాల్ అనే చిన్నారి బాలుడు కూడా అద్భుతంగా పాడుతున్నది “జగదోధ్ధారణ” అనే పురందర దాసు కీర్తన (కన్నడంలో).
ఈ కాపీ రాగాన్ని యెక్కువగా రాగమాలికలలో ఒక రాగంగా వాడుతూవుంటారు,సాధారణంగా రాగమాలికలలో  ఈ రాగం తర్వాత వచ్చే రాగం సింధుభైరవి.
 
సి.రాజగోపాలాచారి గారు తమిళంలో భక్తి,వాత్సల్యాలు ఉట్టిపడేటట్టుగా రాసిన “కురై ఒండ్రుమిల్లై “అనే కీర్తన లో కాపీ,సింధుభైరవి పక్క పక్కనే వస్తాయి,ఈ పాట యం.యస్ అమ్మ నోట “కణ్ణా ”  అన్న చోట వింటుంటే నిజంగా బాలకృష్ణుడక్కడ దర్శనమిస్తాడు.
 
అన్నమయ్య రచించిన “జో అచ్యుతానంద “అనే జోలపాట ,సుబ్బలక్ష్మి గళంలో వింటుంటే కాపీ రాగంలోని దివ్యత్వమంతా వర్షమై కురిసి మనసులని తడిపేస్తుంది,బంగారు గిన్నెలో పాలుపోసి ,చిన్నికృష్ణుడిని పిలిచే తల్లి యశోద కళ్లముందు సాక్షాత్కరిస్తుంది.
భద్రాద్రి రామదాసు కీర్తనలలో “చరణములే నమ్మితి” అనేది కాపీ రాగంలో కడు రమ్యము గా వుంటుంది .
 
జావళీ లకూ,పదములకూ కాపీ రాగాన్ని  యెక్కువగా వాడటానికి కారణం ముందే చెప్పుకున్నట్టు విరహమూ,ఆర్తీ,జాలీ  చక్కగా పలకడమే అనుకుంటా.
ధర్మపురి సుబ్బరాయర్ రాసిన “పరులన్నమాట నమ్మవద్దు ప్రాణనాయకా” జావళీని ,జావళీలు పాడటంలో ఘనత వహించిన బృంద,ముక్త పాడారు, బాగాపాప్యులర్ 
.
సినిమా పాటలలో నృత్య గీతాలకీ,సంగీత పోటీలలో పాడే పాటలకీ,విరహ గీతాలకీ ఎక్కువగా కాపీ రాగాన్ని ఉపయోగిస్తూ వుంటారు,అయితే ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే ,సినిమా సంగీతంలో కాపీ రాగఛాయలతో పాటు,దానికి దగ్గరగా వుండే పీలూ రాగఛాయలు కూడా కలగలసి పోయి వుండొచ్చు.
 
1935-50 ల మధ్యలో వచ్చిన తమిళ,హిందీ  సినిమాలలో  కూడా కాపీ రాగం ఆధారంగా చేసిన పాటలున్నాయి
 
కె.యల్ సైగల్ నటిస్తూ,స్వయంగా పాడుకున్న హిందీ “దేవదాసు” లో తిమిర బరన్ సంగీత సారథ్యం లో వచ్చిన పాట”బాలమ్ ఆయే బసో మోరే మన్ మే” అనే పాట లో కాపీ రాగం వినపడుతుంది.(1935)
 
ఇంకా1947 లో తమిళం లో వచ్చిన “మీరా” లో యం.యస్ .సుబ్బలక్ష్మి కూడా స్వయంగా నటిస్తూ పాడిన “నందబాలా యెన్ మనాలా ఇంగు వారాయ్ ” అనే పాటలో కూడా కాపీ రాగమే.
 
1951లో వచ్చిన “మన్ మగల్ “సినిమాలో సి.ఆర్ .సుబ్బరామన్ సంగీత సారథ్యంలో ఒక రాగమాలిక “చిన్నన్ చిరు కిలియే”యం.యల్ .వసంతకుమారి,వి.యన్ .సుందరం గానం చేశారు.  రచన సుబ్రహ్మణ్య భారతి   ,అందులో మొదటి రెండు ఖండికలు  వున్నది కాపీ లోనే
 
ఇక తెలుగు సినిమాల విషయానికొస్తే ,కాపీ రాగం లో పాటలు ,చాలా పాప్యులర్ అయినవి వున్నాయి.సంగీత దర్శకులలో యస్ .రాజేశ్వరరావు  ఈ రాగాన్ని యెక్కువ ఉపయోగించినట్టు కనపడుతుంది.
మల్లీశ్వరి—-పిలచిన బిగువటరా –భానుమతి పాడిన తీరూ,దేవులపల్లి రచనా ,రాజేశ్వరరావు సంగీత రచనా ఈ పాటను అనుపమానంగా నిలబెట్టాయి,”గాలుల తేలెడు గాటపు మమతలు ,నీలపు మబ్బుల నీడలు కదిలెను”అనంగానే మనలో కూడా యేవేవో జ్ఞాపకాల నీడలు కదులుతాయి.
ఇదే సినిమాలో భానుమతే పాడిన “కోతీ బావకు పెళ్లంటా ,కోవెల తోట విడిదంటా” అనే పాట కూడా ఈ రాగంలోనే వుంది,ఆ పాటకీ ఈ పాటకీ నడకలోనూ,స్వరరచన లోనూ వున్న తేడా సంగీత దర్శకుని ప్రతిభను తెలియ జేస్తుంది.
 
రాజేశ్వరరావు  అలవోకగా చేసిన ఇంకోపాట “అందాల బొమ్మ తో ఆటాడవా?”—దాశరథి కృష్ణమాచార్య రచన,పాడింది పి.సుశీల–చిత్రం “అమరశిల్పి జక్కన”
ఆత్రేయ రచనలో “సంగీత లక్ష్మి” సినిమాకి సుశీల,జానకి పోటాపోటీ గా పాడిన “రాసక్రీడ ఇక చాలు” అనే పాట ,కాపీ రాగంలోని అందాన్నంతా కుప్పబోసిన పాట,దీనికి కూడా రాజేశ్వరరావుదే స్వరరచన.
 
సంగీత దర్శకుడుగా యస్ .యమ్ .సుబ్బయ్యనాయుడుదొక విశిష్ట స్థానం,శాస్త్రీయ సంగీతం ఆధారంగా బాణీలు చెయ్యడంలో ఆయన దిట్ట. ఆయన సంగీత దర్శకత్వంలో 1954లో వచ్చిన”అగ్గిరాముడు “సినిమాలో ,ఆచార్య ఆత్రేయ రచనకు పి.భానుమతి ప్రాణం పోసిన “ఎవరురా నీవెవరురా “అనే గీతం లోకాపీ రాగం లోని అన్ని రంగులూ కనపడతాయి.
 పి.పుల్లయ్య బెంగాలీ కథ “స్వయం సిధ్ధ” ని తెలుగులో “అర్థాంగి” గా తీశారు.దానికి బి.యన్ .ఆర్ అని పిలవబడే భీమవరపు .నరసింహారావు గారు సంగీత దర్శకులు.అందులో పాటలన్నీ చాలా బాగుంటాయి కానీ “వద్దురా కన్నయ్యా” అని కాపీ రాగంలో చేసిన పాట అత్యద్భుతంగా వుంటుంది.ఈ పాట రచన ఆచార్య ఆత్రేయ అయితే పాటకి స్వరరచన చేసింది మాత్రం అప్పుడు బి.యన్ .ఆర్ దగ్గర అసిస్టెంట్ గా వున్న అశ్వత్థామ అంటారు.ఏంపాట !ఏంట్యూనూ!పాలుగారే ఒంటి తో ధూళిలో ఆడుకునే చిన్నికృష్ణుడు కళ్లముందు కదలాడుతున్న అలౌకిక భావన కలుగుతుంది.
పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం చేసిన “శ్రీకృష్ణార్జున యుధ్ధం”లో సుశీల పాడిన “నీకైవేచితినయ్యా” అనే పాటలో కూడా కాపీ రాగం వినపడుతుంది,అయితే పీలూ కూడా కలిసిందేమో నని అనిపిస్తుంది
 
ఘంటసాల గారు “పరమానందయ శిష్యుల కథ “కి సంగీత దర్శకత్వం వహించారు ,చాలా మంచి పాటలు చేశారు ,వాటిల్లో “కామినీ మదన రారా” అనే నృత్యగీతం ,ఆయనా, పి.లీలా కలిసి పాడింది యెంత బాగుంటుందో !పాటకి ముందొచ్చే ఘంటసాల ఆలాపన,చరణం చివర పి.లీల రవ్వ సంగతులూ,మధ్యలో వచ్చే నాదస్వరమూ విని తీరవలసిందే ,దీనికి కూడా కాపీనే ఆధారం.
 
ఇటీవల వచ్చిన సినిమాలలో కాపీ రాగ ఛ్ఛాయలలో వున్న పాటలలో”రోజా” చిత్రానికి ఎ.ఆర్ .రహమాన్ చేసిన  యస్ .పి. బాలు పాడిన”నాచెలి రోజావే” పాటను చెప్పు కోవచ్చు.
 
ఈ పాటికి కమ్మటి కాపీ రాగ పరిమళాలు మిమ్మలిని చుట్టుముట్టి వుంటాయని భావిస్తూ….,,
——శెలవ్  


*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.