కనక నారాయణీయం -17
–పుట్టపర్తి నాగపద్మిని
కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కు గాంధీ పట్లా, విద్యార్థుల పట్లా ముఖ్యంగా స్వాతంత్ర్య సమరం పట్లా చాలా చిన్న చూపు ఉన్నట్టుంది!! పెనుగొండ లక్ష్మి లో భారతీయ సంస్కృతి పట్ల కళల పట్లా, చరిత్ర పట్లా అంతులేని గౌరవాన్ని ప్రకటించి పులకించిన తనకు , యీ మీనన్ భావాలను సమర్థించటం సాధ్యమా?? అన్న ఆలోచన మొదలైంది పుట్టపర్తి లో!!
తరగతిలో సంధుల గురించి పాఠం చెప్పి బైటికి వచ్చేస్తున్నప్పుడొక కుర్రాడు వచ్చాడు దగ్గరికి..’ ‘పెనుగొండలక్ష్మి ‘ కావ్యం మీదే కదా గురువు గరూ?? మా నాన్నగారు చెబుతుండేవారు, పన్నెండేళ్ళకు, ఎవరికైనా ఇటువంటి కావ్యం వ్రాయటం సాధ్యమా?? ఎంత చక్కటి భావాలు??ఎంత చక్కటి భాష?? ఈ పిల్లవాడెవరో కానీ, మహాకవి ఔతాడు తొందరలోనే..’ అన్నాడు మా చిన్నాన్న కూడా!! మాకూ మీ కావ్యంలోని విషయాలు వినిపించండి గురువు గారూ??’ ఒక విద్యార్థి తన దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంటే, ఒళ్ళు పులకించింది పుట్టపర్తికి!!
తన రచనలోని ‘ఎన్నడు నేర్చితో వలపు..’ పద్యాన్ని చదివి, అందులో కన్నడ రాజ్యలక్ష్మి కథా విశేషములు తెలుసుకునే కొద్దీ చవులూరించేదన్న విశ్లేషణతోనే ఆరోజు తరగతి సమయమైపోయింది.
మరో రోజు, తాను కళాశాల చెట్ల కింద కూర్చుని విజయ నగర చరిత్రకు సంబంధించిన నెవర్ టు బీ ఫర్గాటన్ ఎంపైర్ చదువుకుంటుంటే, ఒక విద్యార్థి వచ్చి, మీరు చదువుతున్న పుస్తకమేమిటి గురువుగారూ? అని అడగ్గానే, వాడికి, విజయ నగర రాజ్య విశేషాలు ఆ గ్రంధంలో ఉటంకించిన విధానం చెబుతుంటే, మరో పది మంది వచ్చి తన చుటూ చేరిపోయి, వింటూ కూర్చుండిపోయారు, వాళ్ళ తరగతికి పోకుండా!!
అసలే విజయ నగర చరిత్రంటే, ప్రాణం లేచి వస్తుంది తనకు!! పైగా వేసవి రాజధానిగా తమ పెనుగొండ విజయనగర సామ్రాజ్యంలో భాగం కూడా కదా!! వేసవి విడిది అంటే, అటు హంపీ వైపుకంటే, ఇక్కడ, ఎండ కాలంలో కాస్త ఉష్టోగ్రత తక్కువగా ఉండేదా?? నిజమే మరి, ఇక్కడి కొండల్లో, ఆ చుట్టు పట్ల ఉన్న అడవుల్లోని రక రకాల వృక్ష సంపద ఎంత గొప్పగా ఉంటుందో?? ఎక్కడ చూసినా దాడిమీ ఫల వృక్షాలే!! విరగ కాచిన దానిమ్మ పళ్ళ గుత్తులే!! పైగా అందులో అడవి జంతువుల కలకలం వినిపిస్తూనే ఉంటుంది. నెమళ్ళ గుంపులు వర్షాకాలంలో మోడాలు చూసి పురి విప్పి నర్తిస్తూ ఉంటే, ఆ సొగసు చూడ తరమా?? దుప్పులు విచ్చలవిడిగా పరుగులు పెడుతూనే ఉంటాయి – ఇప్పుడు కూడా!! అటువంటిది, మూడు వందల ఏళ్ళ క్రితమే కదా విజయనగర సామ్రాజ్య వైభవం ఇక్కడ స్వర్గమంటే ఇదేనేమోనన్నట్టుగా విలసిల్లింది?? ఆ కట్టడాలేమిటి?? వజ్రాలవంటి రత్న రాసులను వీధుల్లో కుప్పలుగా పోసి అమ్మటమేమిటి??
ఆ అశ్వ సంపద, గజ సంపద సైనిక సంపద – ఇవన్నీ చూస్తుంటేనే గుండెలదిరి పోయేవట, విదేశీ యాత్రికులకు!! రక్షణ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండేదట!! పైగా, ఏ చోట ఎటువంటి అసాంఘిక చర్య జరిగినా క్షణాల్లో రాజుకు వార్త చేరిపోయేదట!! గూద్ఢచారులూ ప్రజల్లో ఒకరై, ఇటువంటి విషయాలన్నీ ప్రభుతకు చేరవేయటం, పరిస్థితిని క్రమ శిక్షణలో పెట్టటం కూడ గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయేది కూడా!! దేశ విదేశ వాసులనూ, వ్యాపారస్తులనూ, యాత్రికులనూ ఎంతగానో ఆకర్షించింది యీ వీర విజయ గాధలే కదా!! చూస్తూ చూస్తుండగానే దీనికి దిష్టి తగిలింది. ఏ పాడు చూపులు దీన్ని తమది చేసుకోవాలని ఒ=ఉవ్విళ్ళూరాయో కానీ, అప్పటినుంచే విద్యారణ్య స్వామి అకుంఠిత దీక్షతో స్థాపించిన యీ రాజ్య రమ మెల్ల మెల్లగా మసక బారిపోయింది. అప్పటికే ఇక్కడ పాతుకుపోయిన ముస్లిం పాలకులకు కూడా ఎప్పటినుంచో కన్ను పడ్డది దీనిమీద!! వ్యాపారం చేసుకుంటాం, అనుమతించండి..అంటూ, వినయంగా వచ్చి, అంతవరకూ మనకు తెలియని పారశీక గుర్రాలను సైన్యంలోకి ప్రవేశ పెట్టారు వాళ్ళు అటు ముస్లిం రాజులనూ, ఇటు హిందూ రాజులనూ కూడా గాలం వేసి!!! మన స్థానిక పట్టుకంటే భిన్నమైన రంగు రంగుల వస్త్రాలతో ఆకర్షించి, అలవాటు పడేలా చేసి, ఇక్కడి ప్రజలనూ పాలకులనూ కూడా ప్రలోభంలో పడేశారు!! చివరికి, మన పాలకులను వారి వైపు మళ్ళించుకునేలా చేసి, అసలే హిందూ రాజ్యాలంటే, వాటి సర్వసత్తాక ప్రభుత్వ విధానాలంటే సరిపోని ముస్లిం రాజులు మరోవైపు హిందూ రాజ్యాలను కబళించేందుకు మార్గాలు వెదుక్కుంటూనే ఉన్నారు ఎప్పటికప్పుడు!! పారశీక, పాశ్చాత్య వ్యాపార సంస్థలు, బాగా వేళ్ళూనుకుని పోయాయి – యీ మధ్యలో!! కారణాలన్నీ కలిసి, మొత్తానికి, ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విజయనగర సామ్రాజ్యం – మెల్ల్లి మెల్లిగా పతనమైన పద్ధతి కలచి వేస్తుంది.
ఈ విషయాలన్నీ ఆవేశంగా పిల్లలముందు చెబుతుంటే, వాళ్ళు కళ్ళూ విప్పార్చి వినేవాళ్ళూ!! తక్కిన ఉపాధ్యాయుల వలె, పాఠం చెప్పి గది దాటిన వెంటనే, మీరెవరో, మేమెవరమో అన్నట్టు ఉండక, ఇటువంటి చరిత్ర ను విడమరచి స్నేహితునివలె చెప్పే పుట్టపర్తి అంటే ఆరాధనా భావం పెరిగిపోతున్నది, రోజురోజుకూ విద్యార్థుల్లో!!
చరిత్ర గురించి ఆసక్తికరంగా చెప్పే సంగతులటుంచి, వారి షాజీలోని పద్యాలు కూడా విద్యార్థుల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయట అప్పట్లో!! షాజీ తపస్వి వాళ్ళ మనసులను దోచుకున్నాడు. నిముష నిమిషానికీ ఎన్నెన్నో విధాల కనపడే పరమాత్మ ప్రతిభ చూచి ఆస్చర్యపోయే షాజీ!! తూర్పున ఉదయించే సూర్యునితో వసంతాలాడి కుంకుమమును అలదుకున్న దిక్కులనే భామినులకు మ్రొక్కే షాజీ!! కోయిలల ముద్దు పలుకులను వింటూ అద్భుతానంద వీధిలో ఉయ్యాలగూగే షాజీ!! విషము పూసిన వన్నెల విసన కర్ర పారశీకరాణి కోపాన్ని, శాంతముతో జయించి, ‘జ్ఞాన భూములను దిరుగు పైగంబరులను డీలుబడజేయు నినుప బేడీలు లేవు..’ అని సమాధానమిచ్చి, కొదమ నవ్వులు రాజుకు గుత్తకిచ్చి, తన మార్గమాన తాను వెళ్ళీపోయిన షాజీ!!
ఇందులోని దాదాపు పద్యాలన్నీ సరళసుందరంగా ఉండటం వల్ల కూడా విద్యార్థులకు తెగ నచ్చేశాయి.
పుట్టపర్తి కావ్యాలకన్న ప్రబంధ నాయికలు – వచన రచన నచ్చిన విద్యార్థులు లెక్కకు మిక్కిలిగా ఉండేవాళ్ళట!!
అందులో సత్యాదేవి, వరూధిని వంటి పాత్రలను పుట్టపర్తి పరిచయం చేసిన తీరు వాళ్ళను ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. (అప్పట్లో ఆ కళాశాలలో విద్యార్థులుగా ఉన్న రామమూర్తి, చౌడప్ప మొదలైన ఒకప్పటి విద్యార్థుల మాటలే దీనికి సాక్ష్యాలు) హాస్యరసస్ఫోరకంగా కూడా ఉన్న యీ పద్ధతి, అప్పుడు ఉన్న గంభీర వచనరచనా విధానానికి పూర్తిగా భిన్నంగా ఉండటం ఒకటి!! అంతే కాదు, మధ్య మధ్య అప్పుడున్న విషయాలను, పరిస్థితులనూ కూడా ప్రస్తావిస్తూ, చురకలు వేస్తూ సాగే వ్యంగ్య వైభవం – వారి మనసులను గిలిగింతలు పెట్టేదట!!
దీనికి తోడు,తమకింతవరకూ పరిచయమేలేని ప్రాకృత సాహిత్య వ్యాఖ్యలతో పుట్టపర్తి పాఠాలు, రసవత్తరంగా సాగేవి. ఇంత వైవిధ్యమూ, ఇంతటి వైశాల్యమూ ఉన్న మన భారత వాజ్మయ సంపదంటే, వాళ్ళ మనసుల్లో విపరీతమైన అరాధన పెరిగిపోతూ వచ్చింది.
మెల్లి మెల్లిగా యీ విషయాలన్నీ ప్రిన్సిపాల్ మీనన్ కు చేరవేయబడ్డాయి కూడా!!
ఒకరోజు, పుట్టపర్తికి ప్రిన్సిపాల్ నుండీ పిలుపు వచ్చింది.
‘క్లాస్ లో వాళ్ళకున్న పాఠాలకంటే వేరే పాఠాలే ఎక్కువయ్యాయట, మీ విద్యార్థులకు?’ ప్రశ్న.
‘లేదు మీనన్ గారూ!! క్లాస్ పాఠాలు తప్ప వేరే చెప్పటమే లేదు.’ సమాధానం.
‘అంటే, క్లాస్ తరువాత, చెబుతున్నారా??’
‘నేనేదో నా చదువు నేను చదువుకుంటూ ఉంటే, నా దగ్గరికి ఆసక్తితో వచ్చే వాళ్ళకు, నాలుగు మంచి మాటలు, అదీ సాహిత్య విషయాలే చెబుతున్నాను సార్!’ సార్ అని సంబోధించటం అసలు ఇష్టమేలేదు పుట్టపర్తికి!! కానీ, ఇప్పుడు తానున్న పరిష్తితిలో, తప్పదు. ఆత్మాభిమానాన్ని చంపుకుని మరీ కష్టం మీద సార్ అని పలుకగలిగారాయన!!
‘సార్ సార్ అంటూనే – మా రూల్స్ కు విరుద్ధంగా చేస్తున్నారు మీరు?? అసలు క్లాస్ తరువాత, మీరు వాళ్ళను అన్ నెసెసరీగా ఎంటర్టైన్ చేయటం ఎందుకు?? మీరు మాట్లాడటం వల్లే వాళ్ళూ మీదగ్గరికి వస్తున్నారు. విజయ నగరమూ, కృష్ణదేవరాయలూ అంటూ మాటల్లోపెట్టి వాళ్ళలో భారతదేశామంటే, ఏదో భక్తి పుట్టిస్తున్నారు!! అసలు అదంతా ఫర్గాటన్ ఎంపైర్!!!! ఇంకా ఎక్కడుగి??ఎప్పుడో, గాన్ విత్ ది విండ్!! ఇప్పుడున్న బ్రిటిష్ గవర్న్మెంట్ గొప్పదనమేమిటో చెప్పండి. ఈ ప్రభుత్వం పట్ల గౌరవం పెంచండి. దీన్ని ఎదిరిస్తే, ఫ్యూచర్ లేదని చెప్పండి.దిస్ ఈజ్ స్ట్రిక్ట్ వార్నింగ్ టు యూ అండ్ యువర్ స్టూడెంట్స్ టూ!! యూ కెన్ గో!!’
పుట్టపర్తికి ఆత్మాభిమానం బాగా దెబ్బ తిన్నది.
ఈ పరిస్థితుల్లో తానిక్కడ కొనసాగటం కష్టమేమో!!
తీవ్ర వేదనకు గురైన అయన రెండు మూడు రోజులు కళాశాలకు వెళ్ళలేదు – సెలవు పెట్టి!! వారిని ఆరాధించే విద్యార్థులు వారి గదికి వచ్చి వారు రాని కారణం తెలుసుకునే ప్రయత్నం చేశారు. పుట్టపర్తి స్వయంగా ఏమీ చెప్పకున్నా, ఆ నోటా, ఆ నోటా – యీ సమాచారమంతా వాళ్ళకు తెలిసింది.
పుట్టపర్తిని ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడంటూ, హర్తాళ్ మొదలు పెట్టారు వాళ్ళంతా కలిసి!!
ప్రిన్సిపాల్ కు ఇదంతా తలనొప్పిగా మారింది.
మరో వారం తరువాత, మళ్ళీ ప్రిన్సిపాల్ నుండీ పిలుపు.
‘విద్యార్థులను నా మీదికి రెచ్చగొట్టి, నువ్వు చేస్తున్నదేమిటి??’
సంబోధన నువ్వు లోకి మారటం గమనించిన పుట్టపర్తికి ఒళ్ళు మండిపోయింది. కానీ చిలుకూరి నరాయణ రావు గారు గుర్తుకు వచ్చి ఆగిపోయారు.
‘సార్!! నేనేవిధంగానూ దీనికి కారణం కాదు. నేనైతే, ఒక్క మాట కూడా చెప్పనేలేదు. ఇది నిజం!! వాళ్ళు యీ విధంగా ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ, దేశం గురించి మీరన్నమాటలు, బాధ కలిగించేవి. దయచేసి, ఇంకెప్పుడూ, మన దేశాన్ని తక్కువ చేస్తూ మాట్లాడకండి.ఈ గడ్డ మీద పుట్టి, యీ దేశాన్నీ, ఇక్కడి సంస్కృతినీ తక్కువ చేసి మాట్లాడటం, మీవంటి పెద్దవారికి తగని పని. ఉద్యోగరీత్యా మీరు నాకు ఉన్నతాధికారే కావచ్చు. కానీ, దేశాభిమానం విషయంలో, నేనే మేలు మీకన్నా!! మీకు నా వైఖరి నచ్చకపోతే, ఇప్పుడే వెళ్ళిపోతాను..’ అనేశారు.
పుట్టపర్తి మాటలతో మీనన్ కోపం తారస్థాయికి చేరుకున్నది. కానీ, విద్యార్థులను అదుపులోకి తెచ్చుకోవటం ఎంత కష్టమో ఆయనకు బాగా తెలుసు.
పుట్టపర్తి మాటలతో మీనన్ కోపం తారస్థాయికి చేరుకున్నది. కానీ, విద్యార్థులను అదుపులోకి తెచ్చుకోవటం ఎంత కష్టమో ఆయనకు బాగా తెలుసు. అందుకనే కాబోలు ‘దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్ ఫార్ యూ. ప్లీజ్ బీ కేర్ఫుల్ నౌ ఆన్ వార్డ్జ్..’
పుట్టపర్తికి ఇది చాలా మనోవేదనగా తయారైంది. తానిక్కడ పనిచేస్తున్నది చిలుకూరి వారి మాటమీద గౌరవంతో!! పైగా అఖండ మేధో సంపన్నతతో విశ్వాన్నే అబ్బురపరుస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పనిచేసిన కళాశాలలో తానిప్పుడు పనిచేస్తున్నానన్న ఆరాధనాభావంతో!! అంతే కానీ, యీ ఉద్యోగమే పరమావధి కాబట్టి అనుకుని కాదు. పైగా విద్వాన్ పరీక్ష అనుభవాన్ని బట్టి, విద్వత్తుకున్న విలువ ఇప్పటికే తన జీవితంలో నిరూపించబడింది కూడా!!
పోనీ ఒకసారి సెలవుపెట్టి పెనుగొండకు వెళ్ళి, అయ్యగారికి ఇక్కడి పరిస్థితి విశదపరచి, వారేమంటారో వింటే??
ఈ ఆలోచన రాగానే, పుట్టపర్తి రెండురోజులు సెలవు పెట్టి పెనుగొండకు చేరుకున్నారు.
(సశేషం)
****