కొత్త అడుగులు – 17

అడవితల్లి బిడ్డ వీణావాణి

– శిలాలోలిత

దేవనపల్లి వీణావాణి ప్రత్యేకమైన చైతన్యంతో రాస్తున్న కవయిత్రి. జూలపల్లి మండలం, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈమె, వృక్షశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అటవీశాఖలో మండలాధికారిగా ఏటూరి నాగారంలో పనిచేస్తోంది. ప్రకృతన్నా అడవులన్న అమితంగా ఇష్టపడుతుంది. వీటి ప్రతిఫలనాలు ఈమె కవితలన్నింటిలోనూ దాదాపుగా కనిపిస్తూనే వుంటాయి. అరణ్యమెంత గందరగోళమో, అడవెంత జ్ఞానచక్షుతో అడవితల్లి మనకిచ్చే అటవీసంపద, వర్షాలు కుడవడమేకాదు పేదల కన్నీళ్ళను సైతం అన్నంమెతుకులా ఓదార్చే త్యాగశీలోచాలా చోట్ల చెబుతూ పోయింది. అడవిగురించి చాలామంది ఇప్పటికే రాసివున్నప్పటికీ, శిలాఫలకం శిలాఫలకమే. మొదటి పుస్తకం ’నిక్వణ‘ (2018) కూడా కవిత్వ సంపదతో నిండివుంటుంది. రెండవ పుస్తకం ‘శిలాఫలకం’ (2020 మార్చి) మరింత గాఢతను సంతరించుకుంది.

కవయిత్రి తానెందుకు కవిత్వం రాస్తుందో చెప్పిందిలా. ప్రపంచంతో ముడివేసుకున్న దైనందిన జీవన రగడ నా ఉద్వేగాలను అనుక్షణం ప్రేరేపించింది.

బహుశా అందుకేనేమో హృదయానికి అందే ఆసుఖ దుఃఖతరంగాల ధ్వని నాలో కవిత్వమై ప్రతిధ్వనిస్తుంది. నా హృదయ వీణాతంత్రుల మీద మ్రోగించిన ఆనంద, విషాదరగ, విరాగ, విచలిత భావాల సమాహారమే ఈ ‘నిర్వణ’ అని ప్రకటించికొంది.

అలాగే ‘శిలాఫలకం’ గురించి కూడా, ‘శిలాఫలకం ఒక ఎడతెగని వెతుకులాట… ప్రకటించుకోకుండా నిలబడనివ్వని ఆరాటం… మనకు ముందు నీళ్ళు జల్లి మేల్కొల్పినట్లుగా ఓ గుంజాటన, సుఖదుఃఖాలు, ఆక్రోశం, ఆవేదన ఈ పేజీల్లో మడతలు మడతలుగా పేర్చాను.

వీణావాణి క్లుప్తతలోనే గాఢతను సాధించింది. తాను చేసిన పరిశ్రమవల్ల ఈ కవిత చూడండి చాలా చిన్నది.

పువ్వు

నేను కాసిని నీళ్ళను

వాగ్దానం చేసాను

తను నాకు చల్లని సాయంత్రాన్ని

బహూకరించింది.

నేను జానెడు జాగా నిచ్చాను

తను నా హృదయం

తట్టే స్పందన చూపింది

నేను తమన్నేవేసాను

తనుపువ్వై నవ్వి

త్యాగం నేర్పింది.

ఒక తాత్విక పరమైన గొప్ప దృశ్యావిష్కరణ చేసిన కవిత ‘నిశ్చలం’, ‘గేటెడ్ కమ్యూనిటీ’ గురించి రాస్తూ ‘మనుషుల మనుషుల నుంచి వేరవుతున్నారు

ఇంకో ప్రపంచపు గాలి వీచనీయని

అల్లంత గోడల రక్షణ కవచాల మధ్య

ఎవరి లోకంలోకి వారి మునక

ముందుతరాల సమసమాజ సావాసం

ఎలా కానుందో ఎవరి కెరుక..

మనిషి, తన మంచి తాను ఎలా తప్పిపోతున్న తీరును బాగా విశ్లేషించింది.

‘పెద్దమమతూ అనేక చిత్తు ప్రతుల మధ్య

అంగీకరించాల్సిన సంతకాలను

వెతుక్కుంటూ తప్పిపోయాను

ఆమె –

‘తప్పని సరిగా మెడ వంచుకోవాల్సినప్పుడు

గడపదాటుకుంటూ

ఇంటి దారితెలిసీ తప్పిపోయాను

అసలు తప్పిపోవడమే

జీవిత ఎముక మూలుగైనప్పుడు

కొత్త పొద్దు మొలుస్తున్న ప్రతిసారీ

ఇంకా తప్పి పోతూనే వున్నాను.

వివరణ అవసరం లేని కవిత ఇది. చాలా సరళమైన పదాలతో బతుకు దారి మళ్ళుతున్న స్థితిని చూపించింది.

అక్షరాల నిండా పచ్చరంగు నింపుకొని దృశ్యమానం చేసిన కవితలెన్నో వున్నాయిందులో. అడవిపాట విందామని ఓరాత్రి అడవిలోకి వెళ్తే,

‘అడవి రెండు గా చీల్చిన దారి

ఆకుపచ్చని సొరంగాన్ని తవ్వుకుంది

గొడ్డళ్ళమంద వచ్చిక,

‘నిన్న నవ్విన మర్రిమాను శవం

ఆపక్కనే ముక్కలైన వేపతల్లి

చెదిరిన చెట్లమీద గూళ్ళతొ బెదిరిన పిట్టల మూలుగులు

నిశ్శబ్దాన్ని శపిస్తున్నాయట’

మనం కదిలిపోయేలోగనే మరో మాట విసురుతుంది.

‘కాళ్ళను నరుక్కుంటున్న మనుషుల్ని చూసి నేను సొమ్మసిల్లాను

పారిపోలేని పచ్చనమ్మ చెప్పే వీడ్కోలు మాట

గొడ్డలి అంచుకు వినిపించిందో లేదో…

నీకేమైనా వినిపించిందా?’

అని పాఠకులను సూటిగా ప్రశ్నిస్తుంది. ఆమె హృదయం నిండా ఎంత మెత్తదనముందో, స్పష్టంగా కన్పిస్తుంది మనకు.

‘సముద్రాన్ని గురించి ఒకచోట, జీవితం లాగే అంతుబట్టని లోతు’ అంటుంది. సముద్రం అంతటా వుందని వివరిస్తూ, కవిత చివర్లో ఒక మాటంటుంది. ‘ప్రతికణంలోనూ రెప్పచాటు ఉప్పు కయ్యలోనూ, తడితడి గుండెలోనూ వుంటుందన్న నిజాన్ని చెప్పింది.

ఇంకొక చోట ‘ఎండుకళ్ళు’ అని కొత్త ప్రయోగం చేసింది.

కన్నీళ్ళురావు

ఇది ఎండుకళ్ళజబ్బట

ఇలా వాస్తవాల చెట్టు మీద వాలిపోతుంటాను – అంటుంది.

‘టెర్మినేటర్ సీడ్’ – ఆలోచనాత్మకమైన కవిత.

శత్రువు పథకం వేసి టెర్మినేటర్ బీజాన్ని

దేశం మీదికి వదిలినట్టున్నాడు

కత్తుల్లేని యుద్ధంలో మారకపు సొమ్ము మింగి

ఖాళీ డొక్కల్ని వెక్కరిస్తున్నాడు.

ఋతువుకోసారి రైతు మరణిస్తుంటాడు

మరో అవతారమై విత్తనం మోర విరుచుకుంటుంది

అక్కడ మనిషిలేడు – అని తేల్చేస్తుంది.

మనచుట్టూ జరుగుతున్న అనేకానేక మోసాలను ఇలా ఎప్పటికప్పుడు బట్టబయటు చేస్తూనే పోతుంది.

చెట్టు, పుట్టా, తీగ, తిప్పా, చీమ, ఒకటేమిటి అన్నింటిలో తనలో భాగస్వామ్యం చేసుకుంది! చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తేదట, ఎలావున్నావు అని చెట్టు అడిగిందట. నేను ఏడ్చాను

చెట్టూ ఏడ్చింది

నేను మాడిపోయాను

కొన్నాళ్ళ తర్వాత చెట్టు నీళ్ళోసుకుందట పిందెలతో

చెట్టు నవ్వింది

చెట్టు పోరాడుతుంది.

నేను కూడా అంటుంది. చెట్టు నేది పైకి కనిపించే రూపమైనా. ప్రతేక స్త్రీకావచ్చు అనిపిస్తుంది.

‘బడిపిల్లలు’ కూడా మంచి కవిత – ‘నిన్నటి మనవాళ్ళు, రేపటి పొద్దు పొడుపుల్ని

గెలుచుకునే పిల్లకలువలు వాళ్ళా అంటుంది.

‘అంతర్మఖం’ – కవిత ‘కంటివరదను ఎత్తిపోసే పనిలే చేతులు

కడగబడిన హృదయం

లోచూపును అలుముకుంది

కాలికి కాలును తోడు చేసాను

వంతెన కూలలేదు

నడక నేర్పింది అంతే..

అని ఎంతో నింపాదిగా చెబ్తుంది.

ఒకరు ముందు ఒకరు వెనుక మరణించిన తర్వాత వారి మధ్య నుండే ఫీలింగ్స్ని ‘నువ్వోదేవో’ కవితలో గాఢంగా చెప్పంది.

కాదేదీ కవితకనర్హం అన్నట్లుగా ‘పిపీలికం’ మీద కూడా కవితరాసింది.

స్త్రీలు ‘గాజుపూలు’ సుమా అంటూ వేదనంతాక్యుములో నింబస్ మేఘాలై

వేడెక్కిన నుదురుమీద కురిసి ఆవిరయిపోతోంది

చిమ్మిన దుఃఖజలాల్లో మునిగిన మెదడు

పట్టుకోసం పరితపిస్తుంది.

ఇంకొక చోట – ‘నల్ల సీతాకోకలరాగం

తీగలుగా అల్లుకొని

ఎక్కడ దించాలో తెలియని

దిగులు గంపను భుజం మార్చుకుంటాయి.

‘ఒక్కతీరుగాన్’… లో మనుషులంతా అద్దాలగానే ఉన్నాం

నడుస్తూ నడుస్తూనే తప్పిపోతున్నాం

చూస్తూ చూస్తూనే జారిపోతున్నాం

ఎక్కడికక్కడి ఎండమావి ముళ్ళమీద చిక్కుపడుతున్నం

ఒక్కతీరుగనే మాయమవుతున్నం

అందరం తీగలు కలుపుకుంటున్నం

అన్నీ సహజమేనన్నట్టు ముందుకు పోతుంటాం

‘పండుటాకు’ కవిత ఎంతో ఆర్తితో, దుఃఖంతో రాసిన కవిత. పట్టించుకోని తనం వల్ల తల్లి గుండె ఎలా ముక్కలవుతుందో రాసిన కవిత ఇది. ఊడుగుల వేణు (డైరెక్టర్) రాసిన కవిత గుర్తొచ్చింది. పట్నంలో స్థిరపడిపోయి, అమ్మ, నాన్నలను చూడలేక వాల్ల వాళ్ళ తండ్లాటను అద్భుతంగా రాసిన కవిత అది. మళ్ళీ అలాంటి భావాన్నే కలిగించిందిది కవిత చివర్లో అంటోంది. ఎన్నడూ లేంది ఆనాడు

ముడుచుకున్న కాళ్ళను మళ్ళి చాపలే

అమ్మే కదా ఎక్కడ వోతదనుకున్నా

ఇయ్యాల నాభుజం మీదనే వాలి

ఒడ్డులేని వాగు పక్కన చేరి

బూడిద కుప్పై కొట్టుకు పోయింది

ఎవరో అంటున్నారు

ఒక్కపండుటాకు రాలితే

చెడ్డేమన్న పడిపోతదా అని..

అమ్మ ఉత్తపండుటాకేనా… ?

రైతు జీవితం మీద రాసిన అద్భుతమైన కవిత – ‘ఇగనన్నా కాచుకోవాలె’ – ‘గోస వినబడకుండా చెవుల్ని కోసుకున్న సిద్ధాంతాలు

ఈనాడు అరికాళ్ళు కాల్చినాయి నిద్రనటించే వాళ్ళమీద

కదులుతున్న మట్టి సైన్యం

కత్తులెత్తకముంద

ఇగనన్న దేశం

ఆ అరచేతుల్ని కాచుకోవాలి

కంచం బోసి పోకుండా

అన్నం దేవళ్ళకు అందనివ్వాలె

కోల్పోయిన బాల్యం, జీవితం, కలలు, కల్లలు, నిర్వేదాన్ని ప్రకటించింది చాలాచోట్ల. వీణావాణి అడవిని, చెట్టుని, చిగురినీ, పచ్చదనాన్ని, ఆశావాద దృక్పథాన్ని ప్రాపంచిక సామాజిక అవగాహనతో ఎంతో ప్రతిభావంతంగా రాసింది. వస్తువిస్తృతి ఎక్కువ. ఏ అంశాన్ని తీసుకున్నా అడవి కళ్ళతోనే చూసింది. అంబలి తాగాల్సివస్తోన్న రైతులపట్ల అవగాహనతోనే రాసింది. ఒక విధంగా చెప్పాలంటే అత్యంత సహజమైన అడవితల్లి బిడ్డలా అన్పించింది.

‘అజ్ఞాతవాసి’ కవితలో చివర్లో అంటుందిలా. ఎక్కడో… ఏ అర్థరాత్రో ఏ అడవి మధ్యో నీవేషం

కమట్టిలో కలిసి వుంటుందా…?

‘శిలాఫలకమే’ మాట్లాడితే, గుండె విప్పితే ఎలా వుంటుందో రాసిన కవిత ఇది. పట్టంచికోని స్థితివల్ల తనెంత ధైన్యానికి లోనైందో వెల్లడించింది.

క్షణం తీరికలేని స్థితిని స్త్రీలెలా నెట్టబడతారో ఆదివారాలు పనిపాట్లతో ఎంత నలిగిపోతారో చెబ్తుంది. కవి ఆత్మగౌరవాన్ని ప్రకటించిన కవిత ‘బహుశా ఏమౌతుంది? వీపు’ నిష్క్రమణ విభిన్నాంశాలను తెలిపిన కవితలు.

లక్ష్మణ్, రాజకుమారి గర్ల సంతాన మేమి. ప్రస్తుతనివాసం హైదరాబాద్. అనేక సభల్లో పాల్గొన్నది. ‘నిక్వణ’ ఇప్పటివరకు 5 అవార్డులను గెలుచుకుంది.

చెట్టునుంచి ఆమెనెలా విడదీయలేమో, వీణావాణి మనసు నుంచి కూడా అడవిని విడదీయలేం. ఒక్కొక్కసారి ఒక్కొ అర్ధాన్ని వచ్చేట్లుగా రాయడంతో ఈమె ప్రతిభ అర్థమౌతుంది. పుస్తకాలు ఆసాంతం చదివించే గుణాల్ని కలిగివున్నాయి. వీలైతే మీరు చదవండి.

*****

Please follow and like us:

2 thoughts on “కొత్త అడుగులు-17 అడవితల్లి బిడ్డ వీణావాణి”

Leave a Reply

Your email address will not be published.