మానాన్న బడికి నాతోపాటూ వచ్చి జడుసుకొనేలా భయంకరంగా వున్న హెడ్మాస్టర్ గారిదగ్గర కూర్చోపెట్టి వారు నాతో ముచ్చటలాడేలా చేసి నా భయం పోగెట్టాడని చెప్పాకదా ! ఇంతకు పదింతలు భయాందోళనలను చెందిన సంఘటన ఒకటుంది. ఆ ఉదంతంలోనూ నాన్నదే ప్రధాన భూమిక. అప్పుడు నాకు మూడేళ్లు నిండి నాలుగో ఏడు నడుస్తూ వుండవచ్చు .అంటే బడి మెట్లు ఇంకా ఎక్కడం మొదలవలేదు. ఎందుకంటే ఆరోజులలో ఈ ‘కెజీ’ చదువులు లేవు.ఏంచక్కా పరుగులుపెడుతూ గెంతుతూ, రాగాలు తీస్తూ, అందాలనూ, అనాందాలను ఒలకపోసే వయసన్నమాట.
మాఇంటి ముందు భాగంలో వీధి సావిడిని ఆనుకొని ఒకగది, గదిని ఆనుకొని పంచపాళి వుండేవి . గది గుమ్మానికి ఎదురుగా పంచపాళిలోకి గుమ్మం, గుమ్మానికెదురుగా పంచపాళికి తూర్పు దిక్కున కిటికీ, కిటికీకి అవతల ధక్షిణ దిక్కుదాకా రాజునాన్నగారి భాగంతో కూడా కలుపుకొని నిమ్మ ,జామ,కొబ్బరి, మందార , పచ్చగన్నేరు, నందివర్ధనం వంటి చెట్లతో విశాలంగా పరచుకొన్న పెరడు. గది పేరు “నాన్న గది”. నాన్నగదికి ఉత్తరానవున్న వరండాలోకి ఒక కిటికీ. దక్షిణం వైపునుండి కొబ్బరిచెట్ల గాలి ధారాళంగా గదిలోకి వీస్తూ చాలాబాగుండేది. అప్పటి ఇళ్లల్లో కిటికీలు ఎలావుండేవంటే ఎంచక్క కిటికీ ఎక్కి కూర్చొని ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు. మాన్నాన్న ఆకిటికీలో చిన్నఅద్దంపెట్టుకొని గెడ్డం గీసుకొనేవాడు. గదిలో పందిరిమంచం,తిరుగుడుబల్ల ,పెద్దబల్లా, దానీమీద ఓ కోల అద్దం వుండేవి.గది గుమ్మం ల్లోంచీ, కిటికీలలోంచి యదేచ్ఛగా పిచ్చుకలు లోపలికి దూరి పంచపాళీ నాదులలో గూళ్ళు కడుతూ, గదిలో గడ్డీ , గాదరా రాలుస్తూ వుండేవి. రెట్ట వేసేవి. అంద్దం ముందు చేరి అంద్దంలోని పిచ్చుక ముక్కును పొడుస్తూ వుండేవి. నేను వాటితో ఆడుకొనేదాన్ని. ఒకరోజు పిచ్చుక బయటకు వెళ్ళిపోకోడదని గది తలుపు వేసాను. అంతటితో ఆగకుండా, అందకపోయినా , ఎగిరి మరీ గడియ వేసాను. పిచ్చుకతో ఆడుకొన్నంత సేపు ఆడుకొన్నాక తలుపు తీయబోయాను. రాలేదు. గడియ అందటం లేదు. ఎగిరి తీయబోయా. రావటం లేదు. అది బిగుసుకు పోయింది. చాలాసేపు అయిపోయింది. భయంతో తలుపులు బాదాను. సంగతి తెలుసుకొని ఇంటిళ్లి పాదీ బామ్మతో సహా సావిడిలోకి వచ్చి నాన్నగది గుమ్మందగ్గరికి చేరారు. రాజునాన్న, చిట్టిబామ్మగారు(రాజునాన్న తల్లి) కూడా వచ్చేసారు. బామ్మా ,చిట్టి బామ్మగారూ “ తలుపు బద్దలు కొట్టించు సోమయాజులూ! పిల్ల బెంబేలు పడిపోతోందంటూ తొందర చేసారు. రాజునాన్న “ అవునన్నయ్యా! ఇంకా ఎంతసేపు చూస్తావ్ , పోతే పోయింది వెధవ తలుపు” అంటూ ఒత్తిడి చేసాడు.
“ మరేం పర్వాలేదు, అదే తీసికోగలదు, అంటూ ఉత్తరంవైపునున్న వీధి కిటికీలొంచి నన్ను చూస్తూ “ ఏడుపుమాని నిదానంగా తీయడానికి ప్రయత్నించు వస్తుంది” అని చెప్పాడు.నన్ను నేను కుదుట పరచుకొని ఎగురుతూ ఎగురుతూ కొద్దికొద్దిగా అందుకొంటూ గడియ తీయగలిగాను. నాలుగేళ్ల వయసులో నాన్న నాకు చెప్పిన పాఠం అది. (నాన్న ఎప్పుడూ స్వయంకృషికి స్వంతంగా చదువుకొంటూ జ్ఞానాన్ని పెంచుకోవడానికీ పెద్దపీఠ వేసేవాడు. డిగ్రీలకోసం చదివే చదువులు చదువులు కావనేవాడు) .
రాజునాన్న భార్య పేరు కాంతం. వారికి సంతానం కలగడం బాగాఆలశ్యం అయింది. కాంతం పిన్ని నాచేత “ అమ్మా “ అని పిలిపించుకొనేది. ఎవరితోనన్నా చెప్పాల్సి వచ్చినప్పుడు “ఆళ్లమ్మా” “ఈళ్లమ్మ” అనేదాన్నట. “పాపాయి నన్ను ‘అమ్మా!’అని పిలిచాకే నాకు పిల్లలు కలిగార” ని ఆవిడ సంతోషంగా చెపుతూ వుండేది. ఒకరోజు రాజునాన్న “ పదవే! రైలు స్టేషన్ కి వెళదాం, మీ అమ్మ తమ్ముణ్ణి ఎత్తుకొని వస్తున్నాది, ఇంటికి తీసికొద్దాం ” అంటూ నన్ను రిక్షాలో కూర్చోపెట్టుకుని తీసికెళ్ళాడు. చంటిపిళ్లాడిని ఎత్తుకొని ఆవిడ రైలు దిగుతున్న దృశ్యం ఇంకానా కళ్లముందే వుంది. అది ఒక అత్యద్భుతదృశ్యం! రాజునాన్నకీ నాకు మధ్య పిల్లవాడిని ఎత్తుకొని పిన్ని కూర్చొంది రిక్షాలో. అలా ఇల్లుచేరాం . ఇహ అది మొదలూ ఎప్పుడూ వారింటిట్లోనేవుండేదాన్ని. ఆచంటివాడి బుగ్గ మీద నల్లని పుట్టుమచ్చ వుంది.వాడు “ చందురుని మించు అందమొలికించు’ శశి వదనుడు. వాడిని తనకాళ్లల్లో పడుకోబెట్టుకొని చెసే సపర్యలన్నింటికీ పిన్ని ప్రక్కన కూర్చుని , తువ్వాలు, వెండి ఉగ్గుగిన్ని, బేబీ పౌడరు, అంగారు అటూఇటూ గెంతులేస్తూ అందిస్తూ వుండేదాన్ని. వాడికి నేను “ధుం ధుం “ అని పేరు పెట్టాను. ఆతరువాత కొద్దినెలలకే నాకు స్వంత తమ్ముడు పుట్టాడు. కానీ “ధుం ధుం” గాడు ఆసరికే పాకడం, నిలబడి కాస్త అడుగులేస్తున్నాడు. అందువల్ల వాడితోనే ఆడేదాన్ని. బడినుండి రావడం తడవు వాడిదగ్గరకు పరిగెట్టేదాన్ని.
నా ఒకటవక్లాసు చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకంటే మానాన్న మొత్తం తన సంసారాన్ని విజయనగరం నుండి లచ్చమ్మ పేటకు మార్చాడు.అది ఒక పల్లె. అక్కాడా నాకు నలుగురు నాన్నలున్నారు. కానీ వారెవరూ నన్ను చేరదీయలేదు.వారెవరితోనూ నాకు దగ్గరతనంలేదు. కాకపోతే నావయసుకు అటూ ఇటూ వున్నవారి పిల్లలతో కలసి ఆడుతూ వుండేదాన్ని.
లచ్చమ్మపేటలో తాటాకునేసిన ఇల్లుమాయిల్లు . వీధిగుమ్మానికి ఇటూ అటూ మట్టి అరుగులుండేవి.అటువంటి చాగంటి అన్నదమ్ములకు చెందిన ఏకపెనక తాటాకు ఇళ్లవరుసకి మాయింటికి దూరంగా ఆచివరన రోడ్డు మీద ఒక బొగడచెట్టువుంది. వుండేది అని నేను దానిని గుర్తు చేసుకొంటూ ఎందుకు చెప్పటంలేదంటే బహుషా ఎప్పటికైనా నేనొచ్చి దాన్ని పలకరించకపోతానా అనే ఆశతో అనుకొంటా, పాపం ఇంకా బతికే వుందట!బాగామాను కట్టి విస్తరించి వుందట కూడా. అది వున్నది ఆ పల్లె లో కనక నేమో, ఇంకా ఈభూమిమీద దానికి నీళ్ళు చెల్లి పోలేదు. జనవరి 2020 లో విజయనగరం వెళ్లినప్పుడుకూడా ఆచెట్టుని చూడాలని ఆశపడ్డాను. కానీ కుదరలేదు. ఎప్పటికి కుదురుతుందో, లేక ఈలోగా ఈ భూమిమీద నాకే నూకలు చెల్లుతాయోమో ఎవరికెరుక!
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఒకరోజు నేను కొంతమంది నా యీడు పిల్లలతో కలసి ఆచెట్టుకింద ఆడుకొంటున్నాను. ఎవరో నన్ను పిలిచి “ నువ్వు ఎర్ర సోమయాజులు కూతురువేకదూ” అన్నారు. “ కాదు, నేను చాగంటి సోమయాజులు కూతుర్ని” అన్నాను. నాకంఠస్వరంలో చిన్ని పాటి గర్వం తొణికిసలాడినట్లు గుర్తు. అది పసిపిల్లలకు తండ్రిపట్ల సహజంగా ఉండేదే! “ ఆహా! అలాగా ! ఏంచేస్తాడేమిటి మీనాన్న” అన్నారు. “ సంత కెళ్లి కూరలు తెస్తాడు అన్నా” “ “అబ్బా! అంతపని చేస్తాడా ఎన్ని కూరలు తెస్తాడేంటి?” అని అడిగారు. వారి కంఠం లో ఏదో వెటకారపు ధ్వని ఉందని నేను పసిగట్టగలిగేనేమో, “ బస్తాతో బస్తాడు” అని చెప్పా.
విజయనగరంలో మాయింటితో కలుపుకొని వున్న మరో భాగపు ఇళ్లు కొండ నాన్నగారిది. అతనిని అంతా కొండబాబు అనేవారు. పేరు చాగంటి వెంకట సోమయాజులు. నలుపు లేదా చేమనచాయలో వుండేవాడేమోమరి కర్రి సోమమయాజులు అనేవారు.విజయనగరం ఎం ఎల్ ఏ పదవిలో కొన్ని సంవత్సరాల పాటు వున్నాడు.
నేను అలా సమాధానం చెప్పిన నాటికి చాలాఏళ్ల కిందటే నాన్న చిన్నాజీ , కుంకుడాకు, వాయులీనం వంటి కధలను రాసి భారతి వంటి మాసపత్రికలలో అచ్చులో చూసుకొన్నాడు. ఆవె(త కధను కూడా అప్పటికే రాసేసాడు. “ రాంషా” గారు దానిని అచ్చువేస్తానని పట్టుకుపోయాడని, అచ్చు ప్రతిని తనకు పంపలేదనీ తన దగ్గర కాపీ కూడాలేదని ఆ కధ పోయిందనీ నాతో చాలా సార్లు చెపుతూ వుండేవాడు. పిల్ల తప్పిపోతే తల్లి పడే వేదన వంటి వేదన ఆకధ పట్ల ఆయనకుండేది.
1951(50?) లో విజయనగరం హస్తబల్ హాలులో మూడురోజులపాటు జరిగిన అఖిల భారత రచయితల మహా సభలో మూడో రోజునాడు తాను అప్పటికి కొన్నికవితలను రాసి వున్నప్పటికీ, నిర్వాహకులు కవితను చదవమని సూచించినా, తాను కవితను కాదు – కధనే చదివి వినిపిస్తానని ప్రకటించి సభాముఖంగా వినిపించిన కధట అది ! ఆసభలో కవితాగానాలు, ఉపన్యాసాలు చేసిన వారిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు, విశ్వనాధ సత్యనరాయణగారు, తుమ్మల సత్యనారాయణ చౌదరిగారు,పింగళి- కాటూరికవులు,తల్లావఝల శివ శంకరశాస్త్రిగారు, శ్రీశ్రీ, సోమసుందర్, అనిశేట్టి, నారాయణబాబు గార్లు, అవసరాల సూర్యారావుగారు మొదలైన వారున్నారని తనకు జ్ఞాపకమన్నారు భమిడిపాటి రామగోపాలంగారు.‘తప్పిపోయిన ఆకధ’ సందర్భాన్నీ అది 1994లో దొరికిన ఉదంతాన్నివివరిస్తూ 1995 లో జరిగిన తొలి చాసో స్ఫూర్తి కి ఆంద్రప్రభలో ఈ వివరాలతో వున్న ఒక వ్యాసాన్ని గోపాలంగారు ప్రచురించారు.
“ ఆరోజు చాసో గారి కధ అయిపోగానే వెలువడిన చప్పట్ల లొంచి పౌరాణిక నాటకాలలొ కొన్ని పద్యాలకు వచ్చినట్టుగా ‘ వన్స్మౌ ర్” లురావడం విశేషం” అని చెపుతూ రామగోపాలంగారు ఇంకా ఆవ్యాసంలో ఏమి తెలియచేసారంటే –
“ చాసోగారు సభావిన్నపాన్ని ( ‘వన్స్ మోర్’ ని ) పాటించినంత నాటకీయంగానూ “ అభిసారిక మాసపత్రిక సంపాదకులు “రాంషా” కూడా పాటించారని చెప్పాలి. “ ఆ(వెత” కధలోని ఆఖరి వాక్యాలు చాసో గారు చదివేలోగా రాంషాగారు స్టేజ్ ఎక్కి; కధ అయిపోగానే చాసోగారి రెండుచేతులూ తనచేతుళ్లొకి తీసికొన్నారు. ఆయనతో ఏమీఅనలేదు, మైకులో “ ఈ కధని అభిసారికలో ప్రచురిస్తాను !” అని; వేరే మాట చాసోగారి నోటి నుండి రాక ముందే “స్క్రి ప్ట్” ని ఆయన చేతుల్లోంచి తీసేసుకొన్నారు. చకాచకా చొక్కా పైజేబులొంచి రెండు పదిరూపాయల నోట్లూ, ఒక అయిదు రూపాయల నోటూ తీసి సభకి ప్రదర్శించి , చాసోగారిచేతులో పెట్టేసారు. …. అయితే ఆకకధ నాటి నుంచి నేటివరకూ (1994 జనవరి రెండో తారీకు వరకు—అనగా చాసో చనిపోయిన రోజుదాకా) ఎక్కడ అచ్చయిందో ఎప్పుడు అచ్చయిందో (మనలో) ఎవరికీ తెలియలేదు. చాసో గారు తన నిరంతర అవిశ్రాంత ప్రాయాణాలలొ కనీసం కొన్ని డజన్లసార్లు సామర్ల కటలో దిగి రాంషాగరింటికి వెళ్ళి ఆ(వెత కధ అచ్చు కటింగ్, లేదా వ్రాత ప్రతికోసం వెతికి రోజులు అక్కడ గడిపారు” అని చెప్పారు.
చివరికి అసలు సంగతిగా గోపాలంగారు ఇంకా ఏమి చెప్పారంటే “ నాచాసో జ్ఞాపకాలలో అప్రకటితం అయిన చాసో కధ సహజంగానే వచ్చింది. ఆతరువాత పేపర్ లో వచ్చిన ఆవార్త చూసి పూషా మరింత పట్టూదలగా 1950లనాటి “ అభిసారికలన్నీ వెతికి 1952 జనవరి సంచికలో పడ్డ “ విందు” అనే కధ జిరాక్స్ తీయించి పంపారు. ఆ(వెత అంటే విం దే అయితే చాసో అంతటి రచయిత తన కధకి పెట్టుకొన్న హెడ్డింగ్ ని రాంషాగారు మారుస్తారని ఊహించక ఈ నలభై ఏళ్లుగా ఆకధకోసం వెతికిన వారందరూ ఆ(వెత కధకోసమే వెతికి వెతికి దొరకలేదని తేల్చుకొన్నారన్నమాట” అన్నారు.
నాన్న తప్పిపోయిన తన కధ కోసం పడిన వేదన, దాన్ని ఎలాగైనా దొరికించుకోగలగాలని పడిన తపన బాగా ఎరిగి వున్నదాన్ని కనక 1996 మద్రాసు లో జరిగిన రెండవ చాసో స్ఫూర్తి సభలో( 81వ జయంతి సభ) నేను ఆకధనే చదివి వినిపిస్తానని పట్టుపట్టి ఆసభలో చదివాను. మరుసటి రోజు మద్రాసు ఆకాశ వాణి వారు నాచేత వారి స్టూడియోలో చదివించి ప్రసారంచేసారు. నా అదృష్టం కొద్దీ మళ్లీ “ శ్రీ సాం స్కృ తిక కళాసారధి” మరియు “రేడియో చెట్ని” సంయుక్త ఆధ్వర్యంలో , సింగపూర్ నుండి ‘తెలుగు లాహిరి’ రేడియో కార్యక్రమంలో చాసో 106వ జయంతికి నన్ను 10నిముషాలు మాట్లాడి ఆడియో పంపమని అడిగితే – కాదు నేను చాసో కధనే చదివి పంపిస్తానని పంపగా 2021 జనవరి 17వతేదీన ప్రసారంచేసారు. ఆసక్తి గలవారు వినడానికి సులువుగా ఉంటుంది కదా అని లింకును ఇక్కడ ఇస్తున్నాను .
చాగంటి కృష్ణకుమారి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీలో పరిశొధన చేసి డాక్టరేట్ ను పొందారు. విజయనగరానికి చెందిన ఈమె ప్రముఖ రచయత చాగంటి సోమయాజులు గారి ( చాసో) కుమార్తె. 36 సంవత్సరాల ఉపన్యాసక వృత్తిలో ఆరు సంవత్సరాలు విజయనగరం మహారాజా మహిళాకళాశాలలో, మిగిలిన సంవత్సరాలు సింగరేణి మహిళా కళాశాలలోనూ పనిచేసారు.1993లో ఆసోసియేట్ ప్రొఫసర్ గా పదోన్నతి పొందారు. తెలుగు అకాడమి లో డెప్యుటేషన్ పై రసాయన శాస్త్ర పుస్తక, పదకోశాల ప్రచురణవిభాగంలో పనిచేసారు. వీరు రాయల్ సొసైటి ఆఫ్ కె మిస్ట్రి (RSC)లండన్. సభ్యురాలు.
ఇండియన్ కెమికల్ సొసైటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కెమిష్ట్రి, ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్,ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వారి కన్వె న్షన్ ల లోనూ వర్క్ షాపుల్లోనూ పత్రాలను సమర్పించి రెండుసార్లు సర్వోత్తమ పత్ర సమర్పణా అవార్డులను పొందారు.ఆకాశవాణి కేంద్రాలనుండి, ఇందిరాగాంధి సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి GYAN VANI కార్య క్రమాలలో వైజ్ఞానిక అంశాలపై సుమారు 80 ప్రసంగాలను ఇచ్చారు. RSC IDLS వారు, స్థానిక విద్యా సంస్థల వారు నిర్వహించిన సెమినార్లు, వర్క్ షాప్ లలో పాల్గొని సుమారు 50 జనరంజన వైజ్ఞానిక ఉపన్యాసాలను ఇచ్చారు.
ఈవిడ మంచి ఉపన్యాసకురాలు, పరిశోధకురాలు, అనువాదకురాలు. క్లిష్ట మైన వైజ్ఞానిక విషయాలను చక్కని తెలుగులో ఆసక్తి దాయకంగానూ, సుబోధకంగానూ, సరళంగానూ ఆద్యంతం ఆకట్టుకొనే శైలి లో చెప్పగల రచయిత్రి. ఎం.ఎస్ సి; పి.హెచ్.డి డిగ్రీలను ఆంద్రా యునివర్సిటి నుండి పొందారు. డిగ్రీ స్థాయిలో ప్రతిస్ఠాత్మక బార్క్ (BARC) స్కాలర్ షిప్, ఎం.ఎస్.సి.లో మెరిట్ స్కాలర్షిప్, పిహెచ్ డి ప్రోగ్రామ్లో యు.జి.సి.ఫెలోషిప్ ని పొందారు.
2000 లో లోహ జగత్తు. 2001 లో వైజ్ఞానిక జగత్తు. 2010 లో మేధో మహిళ , భూమ్యాకర్షణకి దూరంగా.. దూర దూరంగా… సుదూరంగా…. 2012 లో రసాయన జగత్తు. 2016 లో వైజ్ఞానిక రూపకాలు. 2017 లో జీవనయానంలో రసాయనాలు 2018 లో వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి ? 2019 లో కంటి వైద్యంలో ప్రాచీన భారత దేశ జ్ఞాన సంపద ( నిజానిజాలపై అమెరికా వైద్యనిపుణుల విశ్లేషణ) వంటి వైజ్ఞానిక శాస్త్ర గ్రంధాలను ప్రచురించారు. వీరు రచించిన పుస్తకాలను నేషనల్ బుక్ ట్ర ష్ట్ ,న్యూ ఢిల్లి; తెలంగాణ అకాడమి ఆఫ్ సై న్స స్ ,హైదరా బాద్; వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంటి ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థలు ప్రచురించాయి.
ఈమె రాసిన భారతీయ సాహిత్య నిర్మాతలు:చాగంటి సోమయాజులు(చాసో)మోనో గ్రాఫ్ ని సాహిత్య అకాడమి 2014 ప్రచురించింది
3 thoughts on “జ్ఞాపకాల ఊయలలో (భాగం-2)”
నా యీ జ్ఞాపకాలను ప్ర చురిస్తున్న పత్రిక సంపాదకులు. గీత గారికి మనసారా కృతజ్ఞతలు
నా యీ జ్ఞాపకాలను ప్ర చురిస్తున్న పత్రిక సంపాదకులు. గీత గారికి మనసారా కృతజ్ఞతలు
బాగా రాస్తున్నందుకు అనేక నెనర్లు కృష్ణకుమారి గారూ! ఈ నెల ఎపిసోడ్ చివర ఉన్న వీడియోలో మీ నాన్నగారి కథని మీరు ఉత్తరాంధ్రమాండలికంలో ఎంత బాగా చదివేరో!!
Thank you Dr.Geeta
Krishnakumari