దినచర్య
-పద్మావతి రాంభక్త
బహుశా మీరనుకుంటారేమో
నా ఖాళీ సమయాలన్నీ
అక్షరాలుగా తర్జుమా అవుతుంటాయని
ఉదయం లేచీ లేవగానే
నా మెదడు నిండా అంటుకున్న
కలల శకలాలను దులిపి
వాస్తవాన్ని కౌగిలించుకున్నప్పుడు
నిన్నటి జ్ఞాపకమేదో
నా మనసులోకి వద్దన్నా జొరబడి
వంటింట్లోని పోపుగింజలా
అక్షరమై చిటపటలాడుతుంది
లోపల వర్షం
బయట వర్షంతో జతగూడినపుడు
నేను తడిమేఘమై
కురిసిపోతుంటాను
కిటికీలోనుండి
ప్రవేశిస్తున్న రవికిరణాలలోని
వెచ్చదనాన్ని కట్టగట్టినపుడు
ఒక నులివెచ్చని వాక్యమై వాలిపోతాను
గడ్డకట్టిన కాలం
కన్నీటి సంతకాలతో
తుపానులతో సంక్షోభాలతో
వెంట తరిమి
అలజడి రేగినపుడు
పొయ్యి మీద కూరలా
కుతకుతా ఉడుకుతాను
ఆనందపు ఘడియలను
చల్లని మంచుముక్కలా ఆస్వాదిస్తూనో
వాడివాడి మాటలను
వేడిటీలా చప్పరిస్తూనో
ఆలోచనలను
మజ్జిగలా చిలుకుతుంటాను
మీరనుకున్నట్టు
నా ఖాళీ సమయాలు మాత్రమే
అక్షరాలుగా తర్జుమా కావు
పిండుతున్న తడిబట్టల నుండి
కారే నీటిచుక్కలలా
మనసు నలిగినపుడు
నేను అక్షరాలై రాలిపడుతుంటాను
నా ప్రతీ సందర్భాన్నీ
బ్రతుకు అనుభవంతో ముడేసి
వెల్లువెత్తించే వాక్యాలు
కొన్ని హృదయంలోకైనా
తప్పక చొచ్చుకుపోవాలి
ఎడతెగని పనులతో మొదలై
అలసటతో రెప్పలను హత్తుకునే
కనులతీరం వరకూ
నా ప్రతీ భావమూ అనుభూతీ
కవిత్వమై ప్రవహిస్తుంది
కలం కదిలించడానికి
నేను ఖాళీ ఘడియల కోసం
ఎదురుచూడను
అనుక్షణం కొత్తవాక్యాన్నై
జన్మించడం నాకిష్టమైన ప్రక్రియ
ప్రతిరోజూ మదిని మధిస్తూ
నన్ను నేను మరింత విస్తరించుకోవడమే
నా దినచర్య
****