నా జీవన యానంలో- రెండవభాగం- 20
సర్పపరిష్వంగం – కథానేపధ్యం
-కె.వరలక్ష్మి
నా చిన్నప్పుడు మా ఇంటి వెనక వీధిలో పెద్ద తాటాకిల్లు వుండేది. ఆ ఇంటి యజమాని ఆయుర్వేదం మందులు అమ్మడానికి తరచుగా పడమటికి (రాయలసీమవైపు) వెళ్తూండేవాడు. మా వీధిలో చాలా కాపు కుటుంబాల్లో ఆయుర్వేద గుళికలు తయారుచేస్తూ వుండేవారు. అలా అమ్మడానికి వెళ్ళేవాళ్ళు ఆరేసినెలలు, ఇంకా పైన తిరిగి వచ్చేవారు. మధ్యలో అప్పుడప్పుడు ఓ కార్డురాసి క్షేమం తెలిపి పదో పరకో పంపిస్తూ వుండేవారు. పైన నేను చెప్పిన కుటుంబంలో పాతికేళ్ళు పైబడిన కొడుకు మొదలు చంకలోనో, కడుపులోనో పసిబిడ్డవరకూ వుండేవారు. అదుపులో పెట్టేవాళ్ళు లేక పిల్లలు అస్తవ్యస్తంగా పెరుగుతూండేవాళ్ళు. ఆ ఇంటి పిల్లలు వస్తే అందరూ జాగ్రత్తగా వుండేవారు ఏం పట్టుకుపోతారోనని. వాళ్ళల్లో ధర్మయ్య అనే వెర్రిబాగులవాడు, శివయ్య అనే పిక్ పోకెటరు వుండేవాళ్ళు. శివయ్య మీద కంప్లైంట్ వచ్చినప్పుడల్లా ఒక పోలీసొచ్చి ధర్మయ్యని స్టేషనుకి పట్టుకుపోయేవాడు.
“ఈ పోలీసోళ్ళింతే” అని అందరూ గుసగుసలాడుకునేవారు. పోలీసులంటే హడలి చచ్చే రోజులవి.
1987లో పిల్లవాణ్ణి స్కూల్లో దింపడానికొచ్చిన ఓ తల్లి తన పెద్దకొడుకు ఇంట్లో నాగరం పట్టుకుపోయాడని తనగోడు నా దగ్గర వెళ్ళబోసుకుంది. నాగరం అంటే లక్కతో పోతపోసి పైన బంగారు రేకు అతికిన శిరస్సుపైన ధరించే ఆభరణం, కలిగినవాళ్ళు రాళ్ళు పొదిగిన రాగిడీలు ధరిస్తే, మాములు జనాలు నాగరాలు ధరించేవాళ్ళు. నడినెత్తిన నాగరం పెట్టి అది జారిపోకుండా సన్నని నాగరం జడ అల్లేవారు. దానికింద అసలు జడో, ముడో వేసుకుని దాని మధ్యలో అర్థరూపాయి కాసంత బంగారు చేమంతి పువ్వు పెట్టుకునేవారు. జారిపడిపోకుండా నాగరానికి గడియ, చేమంతి పువ్వుకి స్కూ వెండితో చేసి వుండేవి. ఆనాటి నాగరాలు ఈ మధ్యనే మళ్ళీ వచ్చి వెళ్ళాయి.
ఈ కథలో నేను వర్ణించిన వూరు మా మన్యంలో వున్న మారేడుమిల్లి. మా స్కూలు పిల్లల్ని ఓసారి అక్కడికి విహారయాత్రకి తీసుకెళ్ళినప్పుడు అక్కడి సంత, పరిసరాలు చూడడం జరిగింది. గిరిజనుడొకాయన వాళ్ళు తెచ్చిన చింతపండు బుట్టలకి సంబంధించిన డబ్బులకోసం కొడుకుతో గొడవపడుతున్నాడు. పోలీసులకి చెప్తానని బెదిరిస్తున్నాడు.
పై సంఘటనలన్నీ కలిసి ’సర్పపరిష్వంగం’ కథగా రూపుదిద్దుకున్నాయి.
పోలీసులు దొంగల్ని ప్రోత్సహిస్తారనే నమ్మకం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వుంది. మా వెనకింటి శివయ్య పోలీసుల భయంతో రాత్రి చీకట్లో వచ్చి తెల్లవారకుండా వెళ్ళిపోతాడని చెప్పుకునేవారు. ఓసారి దొంగతనం తర్వాత రైలు బండిలోంచి దూకి కాలు పోగొట్టుకుని శాశ్వతంగా ఇంటికొచ్చి చేరాడు. నాగరం ఎత్తుకుపోయిన కుర్రాడు క్రమక్రమంగా దొంగగా మారి ఇంటికొచ్చినప్పుడల్లా తల్లిదండ్రుల్ని క్షోభకి గురిచేస్తూ, ఇప్పుడిక శాశ్వతంగా ఇంటినుంచి దూరమైపోయాడు.
ఇలాంటి సంఘటనలు నన్ను చాలా కుదిపేస్తూ వుంటాయి.
కొన్నిసార్లు నాకు కథలకి పేర్లు స్ఫురించకపోతే శ్రీశ్రీ ‘మహాప్రస్థానం ‘లోనో, తిలక్ ‘అమృతం కురిసినరాత్రి ‘లోనో వెతుక్కునేదాన్ని. ఈ కథకి పేరు అలా పెట్టిందే.
సర్పపరిష్వంగం
తూర్పు సముద్రతీరం నుంచి మూడుగంటల బస్సు ప్రయాణంలో కొండకోనల మధ్య వుంది ఆ వూరు. చుట్టూ వున్న చిట్టడవి ఆ వూరికి కంఠాభరణం, తూర్పున వున్న ఎర్రచెరువు ఆ ఆభరణంలో పతకం.
ఆ దరిదాపులోని వూళ్ళన్నిటికీ ఆ వూరే కూడలి. ఎందుకంటే అక్కడ వారానికొకరోజు సంత జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ ప్రభుత్వం వారి ఆఫీసు భవనాలు, స్కూలు, ఆ స్కూలుకు అనుబంధంగా వెనకబడిన తరగతుల హాస్టలు, కొండపై ఒకటీ కొండపాదంలో ఒకటి గెస్ట్ హౌస్ లూ వున్నాయి.
సంతరోజు అక్కడ ఇసకవేస్తే రాలనంత జనసందోహం వుంటుంది. అప్పుడప్పుడూ సినిమాల వాళ్ళొచ్చి ఆ ప్రాంతమంతా హడావుడి చేసిపోతారు.
ఆ వూళ్ళోకి అడుగు పెడుతూనే ఎదురయ్యే ఎర్రగోడల పోలీస్ స్టేషన్ పోలేరమ్మ గుడిలా విలక్షణంగా వుంటుంది. ఆ స్టేషన్లో నిరంతరం ఎర్రటోపీతో దర్శనమిచ్చే హెడ్డు పోతరాజు పోలేరమ్మ గుడిముందున్న పోతురాజులాగే ఎప్పట్నుంచో అక్కడ పాతుకుపోయాడు. పట్నంలో కాపురం వుంటున్న ఎస్సై అప్పుడప్పుడూ విజిట్స్ కొచ్చి వెళ్ళిపోతూండడంతో ఆ స్టేషన్ కి ఇంకా చెప్పాలంటే ఆ వూరి జనానికి ఎర్రటోపీ అనే మకుటం గల మహారాజు పోతరాజు.
ఆ రోజు..
ఉదయం ఎనిమిది గంటలవేళ కొత్తగా పెట్టిన నాయరుపాక హోటలు నుంచి అప్పనంగా తెప్పించుకున్న రెండు పెసరట్లు, వుప్మా లాగించి, పెద్ద గాజు గ్లాసుడు కాఫీ తాగి బ్రేవ్ మని తేన్చాడు పోతరాజు.
అదిగో, ఆ దుర్ముహూర్తపువేళ కొడుకుని రెక్కపట్టుకుని లాక్కొచ్చాడు మేదరి అప్పిగాడు.
వెదురు వేళ్ళతో బుట్టలు, తడికలు నేసినేసి నరాలు తేలి బిరుసెక్కిపోయివున్న వాడి చేతులు కుర్రాడి రెక్కని బిగించి పట్టుకున్నాయి. ఆ వుడుం పట్టునుంచి విడిపించుకోవాలని కుర్రాడు ఒకటే గింజుకుంటున్నాడు. బక్క చిక్కిన వాడి మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మాసిపోయిన నిక్కరు తప్ప వాడి ఒంటిమీద మరో ఆచ్చాదనలేదు. ఉంగరాలు తిరిగిన దుబ్బుజుట్టు వాడి ముఖం మీదికి పడి కళ్ళను సగం కప్పేసింది.
మాటిమాటికీ తల ఎగరేసి ఆ జుట్టును వెనక్కి విసురుకుంటున్నాడు. పెదవి మీద అప్పుడే నూగు కడ్తోన్న మీసకట్టు వాడి పదహారేళ్ళ ప్రాయాన్ని బైటపెడుతోంది. మేదరి అప్పిగాడి శరీరం బక్క చిక్కి వున్నా, మనిషి దృఢంగానే వున్నాడు. వాడి దృష్టిలో న్యాయానికి మారుపేరు పోలీస్ స్టేషన్. న్యాయమూర్తి హెడ్డు పోతురాజు. ఆ గేటులోకి అడుగుపెట్టగానే భయభక్తుల్తో వాడి శరీరం వంగిపోయింది. గోచీకాకుండా వాడి భుజం మీద మాసిన తుండుగుడ్డ వుంది. భయం వలన ముఖానికి పట్టిన చెమటను తుండుతో తుడుచుకుని, దాన్ని చంకలో ఇరికించుకుని వినయపూర్వకంగా వంగాడు. ‘చేతులు జోడించడానికి వీలుకాలేదెలాగా? ‘ అనే భావం వాడి ముఖంలో చూసి తృప్తి పడ్డాడు పోతరాజు.
“దండాలండి ఏడ్డుబావు” అన్నాడు అప్పిగాడు.
“ఏంటి సంగతి?” అన్నట్టు కళ్ళెగరేసాడు పోతురాజు సిగరెట్టు ముట్టించుకునే సందట్లో.
“ఈడు సినప్పిగాడండి”
“పెద్దప్పిగాడెవడు?” తన జోకుకి తనే పగలబడి నవ్వాడు పోతురాజు.
“నేనేనండి” భయం భయంగా అన్నాడు.
“అయితే నువ్వు పెద్దప్పిగాడివి, నీ కొడుకు సిన్నప్పిగాడూ నన్నమాట” దమ్ములాగి “ఇంతకీ ఏంటి కత?”
“ఈడండీ.. ఈ కుర్ర నమ్డీకొడుకు నాగరం (ఆడవాళ్ళు జుట్టులో ధరించే ఒక ఆభరణం) ఎత్తుకుపోనాడండి”
”ఏటీ, బంగారందే!”
“ఆయ్”
“ఎవరింట్లోది?”
“నా ఇంట్లో దేనండి”
“నిజం సెప్పు బక్కనాకొడకా!” బల్లమీద బాది పోతురాజు అరిచిన అరుపుకి అప్పుడే గేట్లోంచి లోపలికి రాబోయిన బక్క కుక్క తోకముడిచి పరిగెత్తింది. మనసులోనే తోకముడి చేసారు ఆ తండ్రీ కొడుకులు. తండ్రి చేతిలో వున్న సిన్నప్పిగాడి చెయ్యి గజగజ వణికింది. ఒకడుగు పక్కకి వేసి వాళ్ళ బాబును అంటుకుపోయాడు వాడు భయంగా చూస్తూ “పోలేరమ్మ తల్లి మీద పెమాణకవండి. ఈల్లమ్మలగ్గానికి ఆల్లమ్మ ఎట్టిందండి. అది ఈల్లప్పలగ్గానికి పనికొస్తాదని పదిలంగా దాసిందండి నా ఆడది”
బంగారం మాట వినేసరికి మళ్ళీ ఆకలి మొదలయ్యింది పోతరాజుకి.
“గుడిసెలో నాగరాలూ అయ్యీ ఎట్టుకునే ఇలా గోసిపాత ఎదవలాగ బతికేత్తన్నావన్నమాట”
“సత్తె పెమానకంగా అదితప్ప నాకాడ వుంకో బంగారం పిసరుంటే ఒట్టండి బాబయ్య. పెల్లికెదిగిన పిల్లకి ముక్కులోకి కూసెత్తుకాడ కుట్టించలేకపోనానండి ఈ బతుక్కొచ్చి”
“ఊ. ఎంత తూకం వుంటాది?”
“అయ్యన్నీ నాకేటెరికండి? పచ్చగా పసిమించి పోయీదండి తల్లిమాలచ్మి. ఏడు తలల నాగేంద్రుడి మీద సిన్నికిట్టుడు నాట్టెవాడతా వుంటాడండి. అరిసేతులో ఎట్టుకుని సూత్తా వుంటే ఆకిట్టపరమాత్మని సూసినట్టు కడుపు నిండిపోయీదండి. నా యాడదానికి అదంటే అంత పేనవండి” లాఠీ తీసుకుని, కుర్చీని బర్రున జరిపి లేచిన పోతురాజును చూసి ఠక్కున ఆగిపోయాడు పెద్దప్పడు.
“అయితే ఈడిసేత ఆ నాగరం ఎక్కడుందో సెప్పించాలన్నమాట”
“ఆయ్”
“ఆణ్ణొగ్గేసి నువ్వెల్లిపో. సందేలకల్లా సెప్పించే పూచీనాది”
“సిత్తవండయ్యా”
“పోర్ టొంటి! ఈణ్ణట్టుకెల్లి ఆ కోట్లో మూసెయ్”
“ఓరయ్యా, నన్నట్టుకెళ్ళిపో. నన్నిక్కడొగ్గెయ్య కోరయ్యా! ఇంకెప్పుడూ సెయ్యనే”
ఏడుస్తున్న కొడుకుని చూసి ఎక్కడో కలుక్కుమంది పెద్దప్పడికి. కాని, వాడి జన్మకల్లా విలువైన వస్తువుని వదులుకోడానికి సిద్ధంగా లేడు వాడు.
చేతులు నలుపుకుంటూ ఇంకా అక్కడే నిలబడ్డ అప్పణ్ణి చూసి “ఏంటి సంగతి ఇంకా నిలబడ్డావ్?” అన్నాడు పోతురాజు.
“బాబయ్యా! ముక్కుపచ్చలారని ముండాకొడుకండి, ఈ ఎదవనేటీ సెయ్యమాకండి. మాటల్లోనే బయపెట్టి కూపీ లాక్కోండి, సచ్చి మీకడుపున పుడతాను”
“పోర్ టొంటీ, ఈణ్ణి కూడా అందులో మూసీ”
“అయ్ బాబోయ్” నాలుగడుగులు వెనక్కి నడిచాడు అప్పిగాడు. “లేకపోతే ఏంట్రా, ఒళ్ళుకొవ్వెక్కిందా? మాకే ఎలాగ నడుసుకోవాలో సెపున్నావ్. ఇంకో నిముసం ఇక్కడ నిలబడ్డావంటే నువ్వూ నీ కొడుక్కి సాయంగా వూసెల్లక్కడతావ్”
భయంగా వెనక్కెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు పెదప్పడు. వాడికప్పుడన్పించింది. ‘పొరపాటు చేసేనా’ అని. దారిపొడుగునా కొడుకు కేకలు వాడి చెవుల్లో మారుమోగుతూనే వున్నాయి.
హెడ్డుగారు బైటికెళ్ళి అలా తిరిగొచ్చేసరికి చినప్పడి ఒళ్ళు చితకబొడిచేసుకుంది. చెప్పేసివాడు, కళ్ళు బైర్లు కమ్మి చతికిలబడిపోయాడు.
“సెప్పీసేడా?” వస్తూనే అడిగేడు పోతురాజు.
“సెప్పీసేడండి. ఎదవకి అనుభవం లేదు, నాలుగు తన్నీసరికి సతికిలిబడిలేసాడు” అన్నాడు ఫోర్ట్వంటీ.
“ఏవని సెప్పీసేడు?”
“నాగరవట్టుకుని ఈడు తిన్నగా పట్నం పారిపోయేడంట. అక్కడీడికెవడో తగిలి దగ్గరుండి అమ్మి పెట్టి ఎనభై రూపాయలిచ్చాడంట. ఈణ్నాడు మడత మంచాల లాడిజింగుకి అట్టుకెళ్ళి తొంగోబెట్టాడంట. కోడిపలావులూ, కొత్త సినిమాలూ అంటూ రొండోరోజుకి డబ్బులారిపేసేడంట. ఇంటికి రాడానికి సార్జీలిచ్చి పంపేసేడంట”
“ఏరా సిన్నప్పిగా, ఆడెవడో, ఎక్కడుంటాడో తెల్సా?”
“తెలవ దన్నట్టు తల అడ్డంగా వూపాడు సినప్పడు.
“ఆ కొట్టు చూపించగలవా?”
దానికీ అదే జవాబు.
“డొక్క సీరిగల్ను ఎదవా! ఏటీసేతకాని ఎదవ్వి దొంగతనం ఎలాగ సేసేవురా?”
“నానేటి దొంగతనం సెయ్యలేదండి. నా ఇంట్లో సొమ్ము నానట్టుకుపోయి అమ్ముకున్నాను, అది తప్పా?” ముక్కు పుటాలు అదురుతుండగా అన్నాడు వాడు.
“ఓసోసి, రోసం పొడుసుకొచ్చిందిరా మొగోడికి” అంటూండగా అయిడియా వచ్చింది. పోతురాజుకి. “పోర్ టౌంటీ ఆడికి సుబ్బారావొటేల్లో టీ అట్టుకొచ్చియ్యి” ఫోర్ ట్వంటీ బైటికెళ్ళేవరకూ ఆగి పోతురాజు ముఖంలో ఫీలింగు మార్చాడు. నవ్వు ముఖాన పులుముకున్నాడు. ఎప్పుడూ కరుగ్గా ముటముటలాడుతా వుండే ఆ మొకానికి నవ్వు అతకలేదు.
“ఇలారా సినప్పిగా.. ఇల్రా” అన్నాడు.
వాడు మళ్ళీ భయం భయంగా చూసాడు.
“నీకేం బయ్యంలేదు, ఇల్రా ఎహే” ఇంకా కదల్లేదువాడు.
“లెగవేట్రా నం కొడకా” ఆ అరుపుకి తుళ్ళిపడి ఆటోమేటిగ్గా లేచి నిలబడ్డాడు సినప్పడు. అడుగులో అడుగేసుకుంటూ పోతురాజు దగ్గరకి వచ్చాడు. చేతికందనంత దూరంలో నిలబడ్డాడు.
“ఏం లేదూ మన్లో మనమాట. నువ్వు జేబులు కొట్టగలవంట్రా?”
“అయ్ బాబో, నా కట్టాంటిది అలవాటు నేదండి”
“ఛా.. సెప్పెదవా” కవ్వింపుగా అన్నాడు పోతురాజు.
“సత్తెప్పెమానకవండి, మాయమ్మ మీదొట్టు, నాకేటి సేతగాదు”
“పోనీ, నేను నేర్పిస్తాను, నేర్చుకుంటావా.”
“ఏలాకోలాలేటండీ!”
“ఏలాకోలం కాదెహె, నిజంగానే సెప్తున్నాను.”
ఇంకా నమ్మకం కలగలేదు వాడికి. నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు.
“ఏటీ బొమ్మలాగ, సెప్పుబేగీ, ఆడొచ్చీగల్డు” బైట గుమ్మంవైపు చూస్తూ అన్నాడు పోతురాజు. అప్పటికి నమ్మకం కుదిరింది వాడికి.
“మరి దొరికిపోతే మీరు కోట్లో తీసీరూ!” వీపు మీది వాతల్ని తడుంకుంటూ అడిగేడు సినప్పడు.
“నేనుంటాను గదా నీ ఎనకాల. ఆ మద్దిన మోట్రసైకిలు లారీకి గుద్దేసి సచ్చిపోయిన ఈరబాబుగాడి ఉజ్జోగం ఏటనుకున్నావ్? ఇదే
“అట్ట సెయ్యడం పాపం గాదుంటండీ?”
విరగబడి నవ్వేడు హెడ్డు పోతురాజు. ఆ నవ్వుకి అతని బొడ్డు కిందికీ పైకి ఎగిరెగిరిపడింది. అతను కూర్చున్న డొక్కు టేబులు బాధగా కిర్రుకిర్రుమంది.
“ఎహె, ఏట్రోరే నీతులు సెపున్నావ్. కోటి ఇద్దెలూ కూటికోసవే అని ఇన్లేదా? పెద్ద పెద్దోల్లంతా చేసేదిదే ఆళ్ళు ఎదుటోడికి తెలిసినా దోసేత్తారు. ఈ పిక్ పాకెట్టుగాళ్ళు ఎదుటోళ్ళకి తెలకుండా జేబులు కొట్టేత్తారు. అంతే తేడా. నీకెందుకు ‘ఊ’ అను, ఎనకాతలుండి అంతా నేన్జూసుకుంటాను. ఇంకంతా డబ్బే. నువ్వు జూసిన లాడిజింగుకి బాబుల్లాటియ్యుంటాయి పట్నంలో. నువ్వు తలుసుకున్నప్పుడల్లా కోడికూరలూ, సినిమాలూ, అదురుష్టం బాగుంటే ఈరబాబుగాడిలాగ మోట్రసైకిలూ..”
కళ్ళముందు చిత్రించబడుతున్న రంగుల ప్రపంచం వాడి చిన్ని బుర్రమీద గాఢంగా పనిచేసింది. “నాన్రెడీ” అనేసేడు. ఆ హుషారులో వాడు తిన్నదెబ్బలనొప్పి మర్చిపోయాడు.
“అద్గదీ, అలాగుండాలి కుర్రోడంటే, రేపుణ్ణుంచి పొద్దున్నే వచ్చేయ్. మనోడొకడు నిన్ను సంతల్లో కట్టుకెల్లి ఆపని నేర్పించేత్తాడు. అదేం బ్రెమ్మ ఇద్దెకాదులే. నాల్రోజుల్లో వచ్చేత్తాది. వచ్చే సోమారం మనూరి సంతకల్లా రెడీ అయిపోతావు నువ్వు”
“మరి మా బాబు..”
”ఆడి సంగతి నేన్జూసుకుంటాన్లే. ఆడేవడిగినా నువ్వు నోరిప్పకు”
“అనాగేనండి”
“ఉంకోటొరేయ్ మన మద్దిన కుదిరిన ఈ ఒప్పందం మాట మూడో కంటోడికి తెలకూడదు. జాగర్త మరి.”
పోతురాజు అనుకున్నట్టే ఫోర్ట్వంటీ తీరిగ్గా టీ తాగి, దానికి ముందొకటీ ఎనకొకటి బీడీ దమ్ములు కొట్టి, కాళ్ళీడ్చుకుంటూ వచ్చాడు చల్లారిపోయిన టీ గ్లాసుతో.
“ఫోర్ టొంటీ, నువ్వర్జంటుగా ఈడి బాబునట్రా, పో”
ఆఘమేఘాల మీద పరుగెత్తుకొచ్చాడు పెదప్పడు. అంతకు ముందే చిన్నప్పణ్ణి పంపేసాడు పోతురాజు.
“మొత్తానికి కూపీ లాగేన్రా పెదప్పిగా. వస్తువెక్కడుందో తెల్సిపోయింది. మనూళ్ళో లేదది. పట్నంలో వుంది. పట్నం పోలీసోళ్ళకి సెయ్యి తడిపితేగాని పనవ్వదు. అందరూ నాలోటోళ్ళుండరు గదా” అన్నాడు బాధగా ముఖం పెడుతూ.
“అయ్ బాబో, మీకాళ్ళట్టుకుంటాను. నా బతుక్కొచ్చి వందలూ, ఏలూ ఎక్కడొస్తాయ్ దొరా! ఏదో పదో పరకో”
“ఓరప్పడూ నీకు వస్తువ కావాలనుకుంటే డబ్బు తెచ్చుకో, లేకపోతే లేదు. దీంట్లో నేన్తినేదేదీ లేదు. ఆపైన నీ ఇష్టం. ఇన్ని మాటలనవసరం” అన్నాడు నిష్టూరంగా.
“బాబ్బాబూ. నా తల తాకట్టెట్టి ఏభై రూపాయల్దెచ్చుకుంటానండి, ఏదో కానిచ్చెయ్యండి బాబూ!”
“ఏవోయ్ పోర్ టొంటీ ఆళ్ళకేవైనా నచ్చజెప్పగలవంటావా?
“ఏదో సూద్దాం రండి మరి. పోన్లెండి మీ జేబులోంచి మిగిలిన డబ్బులేసి అప్పడికీ పని సేసిపెట్టెయ్యండి.” అన్నాడు ఫోర్ట్వంటీ జాలిగా ముఖం పెడుతూ. అప్పుడే చూసొచ్చాడు అప్పడు ఎంత దరిద్రంలో బతుకుతున్నాడో.
పోతురాజు అనుకున్న దానికన్నా చురుగ్గా పని నేర్చేసుకున్నాడు చినప్పడు. మరుసటి సంతలో వీర విహారం చేసేసాడు. హెడ్డుగారి వాటా పోను వాడి జేబులో పాతిక రూపాయలు మిగిలాయి.
“ఇంకా కొత్తకదా, వుండే కొద్దీ ఆదాయం పెరిగిపోద్ది. ఎవడి జేబులో నిండు పర్సుందో, ఎవడి జేబులో వుత్తి పర్సుందో నీకే తెల్సిపోద్ది. కొత్తలో ఆదాయం తక్కువొచ్చిందని నీరుగారి పోకొరేయ్” అని ధైర్యం చెప్పాడు హెడ్డు. అప్పుడప్పుడూ హెడ్డుగారికి ఎక్కడైనా తీర్థాల్లో తిరణాలలో డ్యూటీ పడినప్పుడు ఆయన టికెట్టు లేకుండా ఎక్కిన బస్సులోనే, టిక్కెట్టు కొనుక్కుని చినప్పుడూ వెళ్తున్నాడు. ముందు సీట్లో ఆయన కూర్చుంటే, చివరి సీట్లో చినప్పుడు కూర్చుంటాడు. చినప్పడెవడో తనకి తెలీనట్లే నడుచుకుంటాడు హెడ్డుగారు.
అప్పుడప్పుడు చినప్పడు జనానికి దొరికిపోతే, పది మంది కలసి వాణ్ణి తన్నబోతే వెంటనే అక్కడ పోతరాజు ప్రత్యక్షమై, వాణ్ణి తిట్టరాని బండ తిట్లన్నీ తిట్టి, కొట్టినంత దూకుడు చేసి దూరంగా లాక్కుపోతాడు. ” జాగర్తగా నడుచుకో ఎర్రెదవ” అని ముద్దుగా ఓ జెల్లకొట్టి మళ్ళీ జనంలోకి వదిలేస్తాడు.
అలా చినప్పడు హెడ్డు పోతరాజుల పని మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగిపోతోంది.
ఈ రెండేళ్ళలోనూ చినప్పడు కోరమీసం పెంచాడు కోడికూర తిని తిని బాగా బలిసాడు. పట్నంలో హైక్లాస్ లాడ్జుల్లో మకాం. వాడిప్పుడు కేవలం హెడ్డుగారి బాకీ తీర్చడానికి మాత్రమే ఆ వూరి సంతకి వస్తాడు.
పెదప్పడు మాత్రం కొడుకు దుర్నడతకి విసిగిపోయి వాడినీ వదులుకున్నాడు తన బతుకులో విలువైన దనుకున్న నాగరం ప్రసక్తి వదులుకున్నాడు. ఎదిగిన కొడుకీతీరు కాగా వాడూ, వాడి పెళ్ళామూ గంపెడు పిల్లల్ని పెంచలేక చిక్కి సగమై జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు.
కాలం ఎప్పుడూ ఒక్కలా నడవదనడానికి నిదర్శనంగా చినప్పడికి అలవాట్లూ, వాటితో పాటు డబ్బు అవసరం పెరిగిపోయాయి. ఇప్పుడు జేబులు కొట్టే సమయంలో వాళ్లెవరూ పట్టుకోలేరు.
అందుకే మూడువారాలుగా సంతనుంచి అట్నుంచటే మాయమౌతున్నాడు హెడ్డు పోతురాజును కలవకుండా.
మొదటివారం ‘ఏమోలే’ అని వూరుకున్నా, రెండోవారం అనుమానం వచ్చింది. పోతురాజుకి. మూడోవారం సంతలో కాపేసి పట్టుకున్నాడు. ఈ మధ్య డబ్బులు సరిగా దొరకడం లేదనీ, వచ్చేవారం ఒక్కసారే బాకీ తీర్చేస్తాననీ ఒప్పుకున్నాడు చినప్పడు.
నాలుగో వారం సంతలో ఎన్ని జేబులు కొట్టినా నాలుగొందలు సంపాదించలేకపోయాడు. అందుకే హెడ్డుగారికి కనిపించకుండా అట్నుంచటే పట్నం బస్సెక్కేసాడు.ఆ పోవడం పోవడం సంవత్సరంపాటు ఆ వూరి పొలిమేరల్లోకి రాలేదు వాడు. తండ్రి మరణ వార్త తిరిగివాడిని ఊళ్ళోకి లాక్కొచ్చింది. హెడ్డుగారు స్వయంగా వెళ్ళి కలుసుకున్నాడు. పక్కకి పిలిచి బాకీ మాట ఎత్తి తిట్లు లంకించుకున్నాడు.
“ఎల్లకాలం ఎందుకివ్వాలేం!” అని పొగరుమోత్తనంగా అడిగాడు చినప్పడు.
అంతే…
సాయంకాలానికి లాకప్ లో వున్నాడు.
మర్నాడు పేపర్లలో ‘నక్సలైట్ చిన అప్పారావు ఎన్‌కౌంటర్ మరణం’ అని వార్త వచ్చింది.
అదే రోజు సాయంకాలం గొప్ప బహిరంగ సభలో మాట్లాడుతూ “పోలీసులు మా ప్రియమైన సోదరులు, వారులేని ఈ దేశాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదు. వారి నిస్వార్థ సేవకి ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేం” అంటూ ఒకటే పొగుడుతున్నారు మంత్రిగారు.
****
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.