నిష్కల – 2 

– శాంతి ప్రబోధ

ఆఫీసు పని వత్తిడిలో ఉన్న నిష్కల  భోజన విరామంలో తల్లి పంపిన మెస్సేజ్ చూసుకుంది .
ఎప్పుడూ ఇంతే .. 

అమ్మ అమ్మే .. నాకు కొండంత అండ,  

పుస్తకాలలో చెప్పని పాఠాల్ని జీవిత అనుభవంలో నేర్చుకుంది అమ్మ. అనుభవసారంతో ఎప్పటికప్పుడు తనను తాను మలుచుకుంటూ, నాకు తల్లీ తండ్రీ మాత్రమే కాదు వెన్నుదన్నై నిలుస్తున్నది.  

అమ్మని హత్తుకుని తన ప్రేమని కృతజ్ఞతని తెలుపుకోవాలనిపించింది క్షణాన .  అమ్మ స్పర్శ కోరుకున్నది  నిముషాన . కానీఅందనంత దూరంలో నవ్వుతూ అమ్మ .. 

అమ్మ మొహం మీద నవ్వు ఎప్పుడూ చెదిరిపోదు . చెరిగిపోదు .  నిండుగా నవ్వుతూ ఉంటుందిఅట్లా నవ్వేప్పుడుకుడివైపున ఒకదానిమీద ఒకటి ఎక్కిన పళ్ళు అమ్మకే ప్రత్యేకంగా ఉన్నట్లనిపిస్తుందిసున్నితమైన మందహాసంతోనే అనేక మంది హృదయాల్లో చోటు సంపాదించుకుంది . ఒక్క నాన్న హృదయంలో తప్ప

ఎప్పటికీ తరగని ఆస్తి అయిన తన నవ్వుతో ఎన్నెన్నో కష్టాల కడలులు ఈదేసిందిఅంతంత మాత్రం చదువుతో అప్పుడు అంతటి కష్టాలను ఎలా ఎదుర్కోగలిగిందో .. 

 ఎందరికో మార్గదర్శకంగా ఉండే అమ్మ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని నమ్ముతుందిఎప్పుడూ కష్టాన్ని కష్టంగా తీసుకున్నట్లుగా కనిపించదు.   అదే అమ్మ విజయ రహస్యం అనిపిస్తూ ఉంటుంది

నేను అమ్మలా ఎందుకు ఉండట్లేదు .. ఒక్కోసారి బేలగా తయారవుతున్నానెందుకు .. నన్ను నేను ఇంకా మార్చుకోవాలి . చాలా మార్చుకోవాలి అనుకున్నది నిష్కల

ఫోన్లో వాల్ పేపర్  గా ఉన్న అమ్మ ఫోటో చూస్తూ అమ్మతో ఉన్న అనుభూతి పొందుతున్నతూ  ఆమె తలపుల్లోనే ఉన్నది

అమ్మ దృష్టిలో జీవితం ఒక ప్రయాణం అంతే ప్రయాణంలో ఎన్నో ఆనందాలు , సంతోషాలు , సమస్యలు , ఎన్నో బాధలు , దుఃఖాలు మరెన్నో పరిచయాలు .. అన్నీ కలిస్తేనే మన జీవితం అంటుంది

ఆమె దృష్టిలో  ఆనందంగా ఉండడటం అంటే ఆస్తులు , అంతస్తులు ఉండడం కాదుమనల్ని ప్రతి రోజు గుర్తుపెట్టుకుని ఆప్యాయంగా పలుకరించే మనుషులు ఉండడం.   తన ఆలోచనలకు తగ్గట్టుగానే తనని గుర్తుపెట్టుకునే మనుషుల్ని సంపాదించుకుంది . అందులోనే బోలెడంత ఆనందం ఆమెకు .  

మంచి మనిషిగా ఉండడంమనుషుల్లోని లోపాలను చూడకుండా ప్రేమించడం , సహాయం చేయడం , చేతనయింత చేయూత నివ్వడం , ఉన్నంతలో ఆనందంగా ఉండడం .. అమ్మకి తప్ప ఎవరికీ సాధ్యం కాదేమో .. 

తరం అమ్మాయినైన తనకి అమ్మకున్నంత ఓపిక ఉందా.. 

ఊహూ .. 

అమ్మను తలుచుకుంటూ ,  అమ్మ  పెంపకంలో పెరిగినందుకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది నిష్కల.
కానీ, అమ్మ అక్షరాల్లో అంతరార్ధం అంతుపట్టలేదు.
వెంటనే అమ్మతో మాట్లాడాలని నిష్కల మనస్సు తహతహ లాడింది
ఫోన్ చేద్దామని టైం చూసింది .
ఇండియా సమయం రాత్రి పదిన్నర గంటలు .
అమ్మ రాత్రి పదిగంటలకే నిద్రపోతుంది .
అంటే, అమ్మ నిద్రపోయి ఉంటుంది .
వద్దు, అమ్మని డిస్టర్బ్ చేయొద్దు .
ఒకసారి నిద్రలోంచి లేచిందంటే ఇక ఆమెకి నిద్రపట్టదు . రాత్రంతా జాగరమే .   సంగతి తెలిసీ ఎందుకు నిద్రలేపడం ..
ఇప్పుడొద్దు..
ఒకవేళ, అమ్మని డిస్టర్బ్ చేసి మాట్లాడినా రెండుమూడు నిముషాలకన్నా ఎక్కువ మాట్లాడడం కుదరదు.
ఆఫీసు పనిలో ఉంది కాబట్టి ఏవో పొడిపొడి మాటలు తప్ప ప్రశాంతంగా మది లోపల నుండి అలల్లా ఎగిసివచ్చే ముచ్చట్లని కట్టడి చేయాల్సి వస్తుంది.  అది ఇద్దరికీ ఇబ్బందే .
అమ్మ నిద్రలేచే సమయానికి చేద్దామని ప్రయత్నం మానుకుంది.
మళ్ళీ తన పనిలో పడిపోయింది నిష్కల .

***                             ***                                    ***

అప్పటికే ఒక కునుకు తీసిన సుగుణమ్మ మంచినీళ్ళ కోసం పక్కనున్న స్టూల్ పై చేత్తో తడిమి చూసింది.
నీళ్ల బాటిల్ కనిపించలేదు .
రాత్రిపూట నీళ్లు తాగితే ఇబ్బంది . తాగకపోతే మరో ఇబ్బంది .  ఏం చేయన్రా .. నాయనా ..  అనుకుంటూ పక్కమీద అటూ కదిలింది .
శోభా .. శోభా అంటూ గట్టిగా పిల్చింది జవాబు లేదు .
మరి కొద్ది సేపాగి మళ్ళీ కేకలేసింది .
శోభా .. శోభా ..ఏమైపోయావే .. శోభా .. గట్టిగా అరిచింది.  

కీచురాళ్ళ రొద, అప్పుడొకసారి ఇప్పుడొకసారి వినిపించే కుక్క భౌ భౌ లు, ఎప్పుడో ఒకసారి వినిపించే మోటారు సైకిల్ శబ్దం తప్ప ఏమీ లేని రాత్రి సమయంలో సుగుణమ్మ గొంతు ఖంగు ఖంగున నాలుగ్గోడల్లో.. . ఆగదిలోనే అరుపులు సుడులు తిరుగుతున్నట్లుగా ఉంది
అయినా , కోడలు వస్తున్న జాడ లేదు .
సమయం చూసింది . పదిన్నర కావస్తున్నది .
పక్క గొంతెండి పోతున్నది . నాలుక తడి ఆరిపోతున్నది . 
ఇప్పుడేం చేయను అనుకుంటూ నెమ్మదిగా పక్కమీద నుంచి లేచి కూర్చున్నది .
శోభ గదిలో వెలుతురును బట్టి కోడలు ఇంకా నిద్రపోలేదని నిర్ధారించుకున్నది సుగుణమ్మ .
ఒసే .. శోభా మరింత గట్టిగా అరిచింది .
ఊహూ .. అవతలనుండి జవాబులేదు. ఎటువంటి అలికిడి లేదు .
దీని మొదలారి పోనూ .. ఏమైంది దీనికిమంచినీళ్ల బాటిల్ పెట్టనేలేదు ..కోడలిపై కోపం బుసలు కొడుతున్నది ఆమెలో

కాటికి కాళ్ళుజాపుకున్న ముసల్దాన్ని చూస్తే దీనిక్కూడా లోకువగా ఉందేమో

కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకు లోకువేగా … అంతేఅంతే .. దీర్ఘంగా నిట్టూర్చింది సుగుణమ్మ.
ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టుంది నా బతుకని తన స్థితికి తానే తిట్టుకుంది.  

సరేలే .. ఏవనుకుని ఏం లాభం .. అవసరం తనది  తప్పుతుందా .. 

అసలే  గొంతు ఆర్చుకు పోతున్నది . అనుకుంటూ ఇక తప్పని సరై మంచం మీద నుంచి నెమ్మదిగా లేచింది .
నుంచుని చీరను సరిచేసుకున్నది . చెదిరిన జుట్టు ముడిని ఊడదీసి మళ్ళీ వేలితో ముడి చుట్టిందిపచ్చని  మొహంపై నలుపు తెలుపు రంగుల మేళవింపుతో జుట్టు మెరుస్తున్నది.  కానీ మొహం మాత్రం ముటముటలాడుతున్నదితన మంచం దగ్గర మంచినీళ్లు పెట్టని కోడలిపై ఆగ్రహంగా ఉన్నది.   

ముక్కుతూ మూలుగుతూ లేచి మంచానికి అనుకుని ఉన్న మూడుకాళ్ళ చేతి కర్రను అందుకున్నది.

నిజానికి మరీ అంత నడవలేని మనిషి , మంచానికే అతుక్కుపోయిన మనిషి కాదు సుగుణమ్మనునుపు నేలమీద నడిస్తే ఎక్కడ పడిపోతానో అన్న భయంతో మూడుకాళ్ళ కర్ర ఆసరా చేసుకుంటుందిరాత్రిపూట అయితే తప్పని సరిగా కర్ర కావాల్సిందే . అది లేకుండా ఒక్క అడుగుకూడా ముందుకేయదు.  

గ్లాస్ఈ పాలిష్ పెట్టిన మార్బుల్ పై నడుస్తూ రోజు నీటిచుక్క తడి ఉందేమో జారబోయి పక్కనున్న టేబుల్ సహాయంతో ఆపుకుంది . అప్పటి నుండి ఒకటే గోల . ఎక్కడపడిపోతానోననిఅందుకే మనవరాలు నిష్కల కొనిచ్చిన కర్ర అది

అందుకు సంతోషపడిందా లేదునన్ను మూడుకాళ్ళ ముసలమ్మని చేసేసావ్ అంటూ అంతెత్తున లేచింది . కానీ కర్రను వాడకుండా ఉండదుచేతిలో కర్ర ఉంటే ఆమెకదో ధైర్యంఅదో తోడు.  

చేతిలో కర్రను ఆడించుకుంటూ వంటగదివైపు అడుగులేస్తూ కోడలు గదికేసి ఒక కన్ను వేసింది .
గదిలో లైటు వెలుగుతున్నది .అంటే మెలుకువగానే ఉన్నట్లున్నది .

కావురం కాకుంటే .. నేను పిలిచినా పలకదా .. లోలోపల నుండి కోడలిపై కోపం మళ్ళీ బుస్సున తన్నుకొచ్చింది .
చేతికర్ర  టకటక చప్పుడు చేస్తూ నెమ్మదిగా వంట గదికేసి అడుగులు వేస్తున్నది .

చీమ చిటుక్కుమన్నా లేచే శోభ ఇంత చప్పుడు చేస్తున్నా లేవడం లేదంటే..  నిద్ర పోయిందేమో అనుకుంది .. 

చీకూ చింతా లేకుండా అంత నిద్ర ఎట్లా పడుతుందో దీనికి .. ఏమో ..మనసులో తలపిస్తున్నది

అంతలో అకస్మాతుగా కరోనా  తలపులు  మూలనుంచో వచ్చి ఆమె ముందు నిల్చున్నవి . 
లోకమంతా మాయదారి రోగంతో సతమతమవుతున్నది .   ఎంత వద్దని మొత్తుకున్నా వినదు .
యింట్లో ముసలిదొకటి ఉందన్న సోయే లేదు

స్కూటర్ వేసుకుని రయ్యి రయ్యిమంటూ ఊర్లు పట్టుకు తిరిగొస్తుంది.. కసిగా తిట్టుకుంది కోడల్ని .
అది రోగం మోసుకొస్తే .. అంటించుకొస్తే .. ఆసుపత్రి పాలయితే .. దానికి ఏమన్నా అయితే ..
అప్పుడు తన పరిస్థితి ఏంటి .. 

అగ్గికి వాయువు తోడైనట్టు  రోగం దాన్నించి నా దగ్గరకొచ్చి నన్నూ కావిలించుకుంటే .. ముసలి పీనుగు గతి ఏమిటి ..? 

లిప్తకాలంలో ఎన్నెన్నో ఆలోచనలు గజిబిజిగా .. 

లండన్ లో ఉన్న చిన్న కొడుక్కి లేకలేక పుట్టిన కవలల్ని చూడాలని ఎప్పట్నుంచో మనసు పీకుతున్నదివాళ్ళ చేతికి బంగారుగొలుసులు  చేయించి పెట్టింది .   పిల్లలు పుట్టాక కోడలు ఇటు రానేలేదుఅవి వాళ్లకు చేరలేదుమధ్యలో ఒక్కసారి కొడుకు వచ్చి వెళ్ళాడు కానీ కోడలు , పిల్లలు రానేలేదువాళ్లోచ్చినప్పుడు నాన్నమ్మ కానుకగా ఇవ్వాలనుకుందిఅప్పుడే పిల్లలకి ఏడెనిమిదేళ్ళొచ్చి ఉంటాయిదొరబాబుల్లాగా ఉన్న మనవల్ని చూడకుండానే పోతానేమో .. దిగులు మేఘం కమ్మేసింది

ఢిల్లీలో ఉండే రెండో కొడుకు ప్రభాకర్ కొడుకు కలెక్టర్ అవుతున్నాడని తెలిసింది .  చిన్నప్పుడు నాన్నమ్మా అని నా వెనక వెనక తిరిగిన చంటాడు తాటి చెట్టంత ఎదిగాడు . మర్రి వృక్షంలా మారుతున్నాడు .  నా కలెక్టర్ మనవణ్ణి కనులారా చూసుకోకుండానే కరోనా నన్నెత్తుకుపోతుందేమో .. సునామీ అలలా తాకిందా ఆలోచన
తండ్రి పోయినప్పుడు కూడా రాలేదు పెద్ద కొడుకు సుధాకర్.  తొలిచూరు సంతానమని ఎంత గారాభం చేసింది.   

పెద్దవాడైపోయాడుగా ..  వాడికి తల్లి అవసరం లేదేమో గానీ, తల్లి మనసు మాత్రం పిల్లలకోసం కొట్టుకులాడుతున్నది .  

అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదు గదా .. ఎందుకింత తాపత్రయపడతావ్ సుగుణా .. అని తనలో తానే అనుకున్నది.   

హూ .. బిడ్డలు ఎంత ఎదిగినా తల్లికి బిడ్డలే కదా .. అని తనను తాను సరిపెట్టుకున్నది . 
గత్తరొచ్చినట్టు జనాన్ని ఎత్తుకుపోతున్న మాయదారి రోగం కొడుకులున్న అమెరికాలోనూ, లండన్ లోనూ ఇంకా ఎక్కువే ఉందని వార్తల్లో వింటున్నది.  లండన్ లో మూడోసారి లాక్ డౌన్ పెట్టారట .  సుధా ఉన్న చోట కూడా చాలా ఎక్కువగా ఉందంటున్నారు .
ఢిల్లీలో  ఫర్వాలేదు . కాస్త తగ్గిందంటున్నారు .  ఎట్టా ఉన్నారో ..ఏమో .. 

చాపకింద నీరులా ఊరు వాడా చుట్టేసింది. ఎక్కడి వాళ్ళనక్కడే బందీ చేసింది మాయదారి కరోనా.. 

అయినా .. ముదనష్టం ఆగుతుందా .. కాలు నిలుస్తుందా .. ముసలిదాని ప్రాణాలమీదకు తెచ్చిందని పదే పదే తిట్టుకుంది  . 

ఎవ్వర్నీ చూడకుండానే పోతానేమో నన్న బెంగ మణెమ్మలో అంతకంతకు పెరిగిపోతున్నదిలోపలినుండి వణుకు వస్తున్నది
ఆమె కొడుకులు ఏడాది కాలంలో  ఒకటి రెండు సార్లకన్నా ఎక్కువ ఫోన్ చేయలేదు . చేసినప్పుడు కూడా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు రెండు మూడు పొడి పొడి మాటలు.. 

కొడుకుల ఆత్మీయ పలకరింపు కోసం తల్లి మనసు తపన పడుతున్నది . ఆమె తాపత్రయం వాళ్ళకర్ధంకాదు

ఒకటి రెండు సార్లు శోభ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడించింది .   

అది తెలిసి నువ్వు చెప్పడమేంటీ .. వాళ్ళకి తెలియొద్దూ ..  ఏం చేద్దాం , పిచ్చి సన్నాసులు .  పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారుగా తీరిక ఉండదు మరి అంటూ సమర్ధించుకుంటూ ఉంటుంది .   

చిన్న కోడలు కొద్దిగా నయంఅప్పుడప్పుడూ మనవళ్ల కబుర్లు చెబుతుంది .   శోభకు పిల్లల ఫోటోలు పంపుతుంది . అలాంటప్పుడు చాలా మురిసిపోతూ ఉంటుంది .  ఆకబుర్లే మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటుంది . కూతురికి చెబుతుంది . ఇంటికి వచ్చిన వాళ్లందరికీ కబుర్ల రికార్డు వేస్తూ ఉంటుంది . 

ఇంకో ఇంటికి పోయేదే కదా అని ఆడపిల్లని అంతగా పట్టించుకోకపోయినా , నెలకోసారన్నా ఫోన్ చేసి కడుపారా మాట్లాడే కూతురంటే కొద్దిగా అపేక్ష పెరుగుతున్నది

కరోనా వస్తుందేమోనని భయం పెనుభూతమై పెరిగిపోతున్న సుగుణమ్మకి మధ్య ఫోన్ చేసినప్పుడు చెప్పిన విషయం గుర్తొచ్చింది

సరళ  కూతురు పెళ్లి కుదిరేటట్లుందని చెప్పిందిగా ..  

నెలరోజుల ముందుగానే వచ్చి పెద్ద దిక్కుగా నిలబడాలని అన్నది సరళమనుమరాలు వీణ కూడా పెద్ద చదువులు చదివిందిపెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా పోతుందటదాని పెళ్లి చూడకుండానే పోతేనేమో .. 

దాని పెళ్ళికి లేత గోరింటాకు రంగుకు రుద్రాక్షపూలరంగుపై  జానెడంత మెరిసే జరీ అంచు చీర కొనుక్కోవాలనుకుంది.  

తన చేను చెల్కలపై వచ్చే రైతుబంధు డబ్బులన్నీ ఖాతాలో జమేసుకుంటున్నది .   కౌలు డబ్బులు వస్తాయి . పిల్లలు వచ్చినప్పుడు మనుమళ్ళు మనుమరాళ్ళకు తన పేరున ఏదన్నా కొనివ్వాలనుకుంది . సరళ కూతురు వీణకు కెంపుల హారం , చెవి జుంకాలు చేయించాలనుకున్నది . ఎన్నెన్ని ఆలోచనలు చేసింది .  

అయ్యో .. అన్నీ ఆవిరయిపోతున్నాయా .. 

అయ్యో .. ఏమిచేతురాభగవాన్ ..  తలపట్టుకున్నది  

మణెమ్మ అడుగులు ముందుకు పడలేదు

కొన్ని క్షణాలు బెల్లంగొట్టిన రాయిలాగా అట్లాగే ఉండిపోయిందిఅందుబాటులో ఉన్న స్టూల్ పై అలా కూర్చుండిపోయింది

ఆమె ఒంట్లో నిస్సత్తువ ఆవహిస్తున్నట్లున్నది 

కండ లేనివాడికే గండం తెలియదా .. ఊరంతా వివరం చెబుతానని పోతుందిఅయ్యో .. ముదనష్టపు మొహం ..ఎంత పనిచేసిందని నెత్తి కొట్టుకుంది.  

అప్పుడే మృత్యువు తనను వెంటాడుతున్నట్టుగా  బాధపడుతున్న సుగుణమ్మ .  

అయ్యయ్యో .. ఇప్పుడేం చేయను , కంపలో పడ్డ గొడ్డులాగా అయ్యిందే .. కోడల్ని తిట్టుకుంది .

నట్టింట్లో అచేతనంగా అలాగే ఉండిపోయింది.   నిలువెల్లా నిస్సత్తువ ఆవహించింది .  

కొన్ని క్షణాలు , నిముషాలు అలా దొర్లిపోయాయి

సునామీలా విరుచుకుపడ్డ  ఉద్వేగాల వేగం తగ్గింది స్థానంలోకి ఆలోచనల తెమ్మెరలు మొదలయ్యాయి

ఆలోచనల్లోంచి కొన్ని ప్రశ్నలు బాణాల్లా వచ్చి సూటిగా ఆమె హృదయాన్ని తాకడం మొదలు పెట్టాయి .  

జీవితాన్ని నిండుగా చూసిన నువ్వే అట్లా అనుకుంటే .. యాబైకి ఇంకా ఐదేళ్ల దూరంలో ఉన్న నీ కోడలి మాటేంటి .. ? తండ్రి ఆదరణ లేకుండా పెరిగిన ఆమె బిడ్డ మాటేంటి ?

నీకేదన్నా వస్తే చూసేది చేసేది కోడలే ..
కానీ, ఆమెకేదన్నా వస్తే చూసేదెవరు ? చేసేదెవరు .. ఉన్న ఒక్కనొక్క బిడ్డ అందనంత దూరంలో ఉంది అని  ప్రశ్నించింది ఆమె అంతరాత్మ .
నిజమే కదా .. శోభకేదన్నా అయితే .. ఎలా…. కాటికి కాళ్లు చాచిన ముసల్ది ఏం చేయగలదు ..?
అన్న ఉండి ఉంటే దానికి, నాకు కొండంత అండగా ఉండేది .  

దానికి తల్లి ఉండీ లేనట్టే .. ఆమె లోకం వేరు . ఎప్పుడూ కొడుకు మీదేకాని బిడ్డ మీద ఆపేక్ష చూపిందే లేదు .
శోభ చెల్లెలు రాధ కూడా దగ్గరలో లేకపోయే.  

తమ్ముడు మరదలు ఉన్నా వాళ్ళు పూనాలో ఉండిరి . అయినా ఒకరింటికి ఒకరు వచ్చి చెయ్యి సాయం చేసే రోగం కాకపోయే .. 

ఎంత సేపు నా గురించే ఆలోచించాను గానీ శోభ గురించి ఆలోచించన రాలేదే .. అనుకుందిశోభకేమన్నా అయితే తన గతి ఏమిటన్న ప్రశ్న ఆమెను మరింత ఇబ్బందికి గురి చేసిందిశోభ గురించి సానుకూల ఆలోచనలు మొదలయ్యాయి

అప్పటి వరకు మంచినీళ్లు పెట్టని కోడలిపై ఉన్న కోపం అంతా గాలి బుడగలా తేలి పగిలి పోయింది.

తాను నవమాసాలు మోసి కని పెంచి పెద్దచేసిన వాళ్ళకి బరువైపోయింది .   ఇన్నేళ్లు వాళ్ళ కోసం ఎంత ఆరాటపడింది .  ఇప్పుడు వాళ్ళకి కానిదైపోయింది .
కానీ .. శోభ అట్లా చేయలేదే .. అయినా అత్త బుద్ది కోడల్ని ఆడిపోసుకుంటూనే ఉంటుంది .  

అవునూ .. శోభ నన్నెందుకు చేరదీసినట్లు ..? ఆమెలో మరో ప్రశ్న మొలిచిందిఅప్పుడప్పుడూ ప్రశ్న ఆమెలో తలెత్తి చూస్తూ ఉన్నదే
మేనత్తనని రక్త సంబంధంతో తనను చేరదీసిందా .. లేకపోతే అత్తగారినని అక్కున చేర్చుకున్నదా ..
అసలు నేను దాని అత్తగారిని ఎట్లా అవుతానని తన మీద బాధ్యత వేసుకుంది .
ఇన్నాళ్లూ , ఇన్నేళ్లూ విషయం నేనెందుకు ఆలోచించలేదు .
అత్తగారిలాగే రంధ్రాన్వేషణ చేసి ఏవో సూటిపోటి మాటలు అంటూనే ఉన్నానే ..
నేనెన్ని అన్నా , వినీవిననట్లు ఉండిపోయే శోభ ఒక్కనాడయినా నన్ను పల్లెత్తు మాట అనలేదు .  ఆడిపోసుకోలేదు.   

మరి నేనెందుకు శోభను అట్లా చూసాను . ఎందుకు వేధించాను .. రకరకాల ప్రశ్నలు సుగుణమ్మలో చివుర్లు తొడుగుతున్నాయి .

ఆమె మనసుపొరల్లో ఏమి దాగున్నదో కానీ నా పెద్దరికాన్ని నిలబెడుతున్నది .
పిలవగానే వస్తున్నా అత్తా అనో , ఏం కావాలనో వచ్చి ఎదుట నిలుచుంటుంది. ఇబ్బంది కలగకుండా అన్ని అమర్చిపెడుతున్నది.   ఒంటరి ముసలిదాన్ని అనాథలా వదిలేయకుండా  ఆదరిస్తున్నది.అది కోడలిగా చేస్తున్నదో , మేనకోడలిగా చేస్తున్నదో , వృద్దురాలినన్న జాలితో చేస్తున్నదో , మనిషితనం నింపుకుంటూ చేస్తున్నదో ..
ఎట్లా చేస్తున్నా నాకు ఎటువంటి బాధ కలగనివ్వదు. కొత్తల్లుడిని మేపినట్టు మేపుతున్నది
అటువంటి సుగుణాల రాశి నా కోడలు . అయినా నేను ఆరడి పెడుతూనే ఉన్నానని తనను తాను మొట్టుకుంది సుగుణమ్మ .

అటువంటి దాన్ని, అసలేమయిందో ఏమిటో తెలుసు కోకుండా నోటికొచ్చినట్లు తిట్టుకుంటూనే ఉన్నాను..
దీని దగ్గరకొచ్చాక నాలుగేళ్లలో ఎప్పుడు ఇట్లా లేదు . ఎక్కడ తనకి బాధ కలిగించకుండా , ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నది
ఒకవేళ శోభకు ఆరోగ్యం బాగుండలేదేమో ..కోడలి గదిలోకి వెళ్లాలా వద్దా అని ఒక క్షణం తటపటాయించింది.
పరిపరివిధాల పోతున్న ఆలోచనలతో సుగుణమ్మలోని భయాలు చెదిరిపోయాయికొద్ది క్షణాల క్రితం ఆవరించిన నీరసం మాయమైంది.  

అడుగులు వెనుదిరిగి కోడలి గదివైపుకు మళ్ళాయి.

కళ్ళు మూసుకున్న కోడల్ని చూసింది
అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి శోభ గదిలో లైట్ ఆఫ్ చేసింది .
అత్తగారి చేతికర్ర ఆడిస్తున్న శబ్దానికి ఉలిక్కిపడ్డ శోభఎవరూ .. అత్తా .. ‘ అన్నది .
.. నేనేలే ..
ఏమైందే .. ప్రాణం బాగుండలేదా ..
పడుకో.. పడుకో  “అంటూ సమాధానం కోసం చూడకుండా వంట గదికేసి వెళ్ళింది సుగుణమ్మ.  

అత్తకు పెట్టి తాను తినేసి గిన్నెలన్నీ శుభ్రం చేసి, పొయ్యి దగ్గరంతా తుడిచి అద్దంలా పెడుతుంది శోభ

అటువంటిది ఇవ్వాళ అందుకు భిన్నంగా కనిపిస్తున్నది .  

పొయ్యిమీద కుక్కర్ అట్లాగే ఉంది . కూర గిన్నెలు, పెరుగు గిన్నె కూడా పొయ్యి గట్టు మీదే ఉన్నాయి

అంటే అన్నం తిన్నట్టు లేదు

సుస్తీ గా ఉండి తినలేదేమో .. తనే తప్పుగా ఆలోచించింది  అనుకుంటూ బాటిల్ సగం నీళ్లు నింపుకుంది
గ్లాసుడు నీళ్లు తాగి, బాటిల్ చంకలో పెట్టుకుంది .
చేత్తో కర్ర ఆడిస్తూ, మరో చేత్తో కాళ్లకు అడ్డుతగలకుండా చీర కుచ్చెళ్ళు పట్టుకుని నెమ్మదిగా పడకగది చేరుకుంది .

మంచం మీద నడుం వాల్చింది.  కానీ ఆమె కంటి మీద కునుకు రావడం లేదు .

మంచం పక్కనే ఉన్న సైడ్ టేబుల్ పై ఉన్న రిమోట్ అందుకున్నది . తన ఇంట్లో ఉన్నప్పుడు సౌకర్యం ఉండేది కాదు. హాల్ లో కూర్చుని టీవీ చూసేది .  

శోభ ఇంట్లో తనకి అందుబాటులో ఉండే విధంగా రూమ్ లోనే టీవీ పెట్టించిందని మనసులోనే శోభని మురుసుకుంటూ టీవీ పెట్టింది

ఇద్దరు కన్న బిడ్డల్ని బలి ఇచ్చిన సంఘటన పై వస్తున్న కథనం చూస్తున్న మణెమ్మలో వణుకు పుట్టించ్చింది.  

చదివేస్తే ఉన్న మతిపోయినట్లున్నది తల్లిదండ్రులకు . లేకపోతే కన్న బిడ్డల్ని , ఇరవై ఏళ్ళు పెంచి పెద్దచేసిన బిడ్డల్నిబలి ఇస్తారా..  

ఒక బిడ్డ నోట్లో త్రిశూలం తో పొడిచి , మరో బిడ్డ నోట్లో కలశపు చెంబు కుక్కి తలమీద డంబెల్ తో కొట్టి చంపేస్తారా ..  

  తల్లి చచ్చిన బిడ్డలు పుణ్యలోకాలకు వెళ్లారని తిరిగి వస్తారని వాళ్లేంత ఎంత గట్టిగా చెబుతున్నారు .. మూడేళ్ళ పిల్ల నడిగినా చెబుతుండే .. చచ్చినవాళ్లు తిరిగిరారని

ఆత్మ , పరమాత్మ , ముక్తి , మోక్షం , పునర్జన్మ , స్వర్గం , నరకం అంటూ తేరగా సమాజంపై పడి బతుకుతున్న వెధవల్ని తిడుతున్నారెవరో ..   

వీళ్ళ మూఢభక్తి , మన్ను మశానంగానూ …. ఇక చూడలేక ఛానెల్ మార్చేసింది .  

మూఢత్వం కన్న కూతుర్లనే ఇంత దారుణంగా హత్య చేస్తుందా ..  మనుషుల్ని ఇంత క్రూరంగా మార్చేస్తుందా .. 

అందుకేనేమో .. శోభ ఇటువంటి నమ్మకాలకు వ్యతిరేకంగా గ్రామాల్లో పిల్లతో, పెద్దలతో  పనిచేస్తున్నది అని తలపోసిందికోడలు చేస్తున్న పనిని మనసులోనే  మొదటిసారి హర్షించింది

 దేశ రాజధానిలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి .  . 

రైతుల ఆందోళనకు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులేనని, వాళ్ళని జైల్లో వేయాలని అంటున్నది నటి

మాటలు వింటున్న మణెమ్మలో ఆవేశం పొంగింది

టీవీ కట్టేసి , లైట్ ఆఫ్ చేసింది .   

గత కొన్ని రోజులుగా ఆమె రైతుల ఆందోళనలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నది .  

ఒక రైతు భార్యగా , రైతు కుటుంబీకురాలిగా రైతు సమస్యలు తనకి బాగా తెలుసు

రైతుల ఆందోళనలో న్యాయం ఉన్నది . అసలు నేనే కాదు . మనిషన్నవాడు రైతుకు మద్దతుగా ఉంటాడు

పల్లె విడిచి పట్నం చేరినా తాను తినే ముద్ద రైతు పండించిందే అని తెలిసిన వాడు  వీలైతే రైతుకోసం మాట్లాడతాడు . ప్రేముంటే రైతుకోసం కొట్లాడతాడు . అవేవీ చేతగాకపోతే అయ్యో అని సానుభూతి ప్రకటిస్తాడుకానీ ఈమె ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నది

రైతు తాను బతుకుతూ నలుగుర్ని బతికించాలని రోడ్డెక్కాడని  వానాకాలం చదువు చదివిన తనకే అర్ధమవుతున్నది ఆమెకు ఎందుకు అర్ధం కాలేదో ..  పట్నంలో పండుకొని రైతులను , వారి ఆందోళనను హేళన చేయడం గొప్ప అనుకుంటున్నదేమో ..? 

ఏంజేస్తాడు .. బతుకు మీద దెబ్బపడుతుంటే రైతు ఏం జేస్తాడు .. తప్పనిసరై రోడ్డెక్కాడు

తాను తినే ముద్ద రైతు పండించినదే అని మరిచిన వాళ్లే అడ్డం దిడ్డం ఆలోచన చేస్తారని తలపోసింది మణెమ్మ. 

లోకంలో మసిబూసి మారేడుకాయ మాటలు ఎక్కువైపోతున్నాయి. మాటలకే కదా నిండు జీవితం చూడాల్సిన ఇద్దరు ఆడబిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయిఅటువంటి మాటలే కదా అందాలభామ మాట్లాడింది

ఆలోచిస్తున్న ఆమె గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్లు  ఉక్కిరి బిక్కిరి అయింది

శోభ జీవితంలో శోభ లేకుండా పోయిందంటేకారణం ఎవరు

వెండిస్పూనుతో పెరిగిన పిల్ల , ఆడింది ఆటగా పెరిగిన పిల్ల , ప్రపంచమంతా సీతాకోకచిలకంత అందమైనదని, స్వచ్ఛమైనదని  నమ్మిన పిల్ల.  

రంగురంగుల ప్రపంచంలో ఊహలు రెక్కలు విప్పుకోకుండానే ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది అందుక్కారణం ఎవరు ?  

ఈతరాని పిల్ల నడిసముద్రంలో చిక్కుకుపోయింఅందుకు బాధ్యులు ఎవ్వరు
సమయం లేకుండా ఊరు వాడ పట్టుకు తిరుగుతున్న శోభని మొదట ఎన్నెన్ని తిట్లు తిట్టిందిమొగుడ్ని వదిలేసి కుటుంబ పరువు ప్రతిష్టలు మంటగలుపుతున్నదని తులనాడింది

కానీ ఇప్పుడిప్పుడే ఆమె చేస్తున్న పనిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నది .
ఎటువంటి పిల్ల .. ఎన్ని అగచాట్లు పడింది ..
కారణం ఎవరు నేనా , నా కొడుకా
ఒకరకంగా చెప్పాలంటే నేనే నేమో …  నా స్వార్ధమేనేమో .. ఆస్తి , అంతస్తు పై నాకున్న వ్యామోహమేనేమో .. 

తడిగుడ్డతో దాని గొంతు కోసేసాను …  

అంతలోనే , కొన్ని ఘడియల ముందు తనలో మెదిలిన భావనలు ఆమె ఒప్పుకోలేకపోయిందిఅందుకు అహం అడ్డు వచ్చింది

కొద్ది క్షణాల తర్వాతనేనొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు .. నేనేం చేయగలను నిమిత్త మాత్రురాలిని అని తనకు తాను సర్ది చెప్పుకో జూస్తున్నది సుగుణమ్మ . 

తాతకు దగ్గులు నేర్పాలనుకుంటున్నావా సుగుణమ్మా .. 
తగలబడిపోతున్న కోడలు జీవితాన్ని సరిదిద్దాలన్న ప్రయత్నం చేశావా ఏనాడైనా .. లేదు , ఏరు దాటాక  తెప్ప తగలేసిన చందంగా వ్యవహరించావు.
బాధితురాలినే నిందితురాలిని చేసి నిందించావు . అత్తింటి ఆరళ్ళు పెట్టలేనన్ని పెట్టావ్. అన్నిటినీ ఓర్చుకుంటూ నిబ్బరంగా కాలం వెళ్లబుచ్చుతున్న ఆమెని క్షణక్షణం కుళ్ళ బొడిచావని మరచిపోయావా సుగుణమ్మా ”  నిలదీసింది ఆమె ఆంతరాత్మ  

నిజమే, నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిందిఅత్తగా తన అధికారం చూపించుకుంది. చలాయించుకుందిఆమె అంటూ లేకపోతే అన్న తన కుటుంబానికి ఇంత చేసేవాడా .. ?  లేదుఅప్పుడు తన కుటుంబ పరిస్థితి ఎట్లా ఉండేదో ..  ఊహించడం కష్టంగా ఉంది ఆమెకు

చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టుగా చేసింది .   శోభ కోసం అన్న కట్టిచ్చిన ఇంట్లో ఉంటూ ఆమెనే ఇంట్లోంచి బయటికి గెంటివేసిన ఘనత తనది

అంత చేసినా , శోభ అదంతా మనసులో పెట్టుకోలేదు.  నన్ను నిర్లక్ష్యం చేయడం లేదు .
కడుపున పుట్టిన పిల్లలని అందలం ఎక్కించానని కొండెక్కినంత సంబరపడ్డాను . బాజా వాయించి చెప్పుకున్నాను .   సంఘంలో తన హోదా పెరిగిపోయిందని నలుగురిలో గర్వపడ్డాను. అహంభావిగా మారిపోయానుకానీ అదంతా తన అన్న పెట్టిన భిక్షేనని మరచిపోయిందిఅన్న తన బిడ్డ కోసం చేశాడన్న స్పృహేలేకుండా ప్రవర్తించింది

భర్త ఉన్నన్నాళ్ళు అప్పుడో ఇప్పుడో చుట్టం చూపుగా వచ్చి పోయే పిల్లలు  రాను రాను పిల్లల చదువులు , ఉద్యోగ బాధ్యతల నెపంతో రావడం తగ్గించేశారు .
భర్త చనిపోయాక  తమ దగ్గరకు రమ్మన్న పిల్లలతో సంతోషంగానే వెళ్ళింది .  

అమెరికాలో ఉన్న కోడలితో మాటలు కలపలేకపోయిందివాళ్ళ తిండి , అలవాట్లు అన్నీ తనకి విరుద్దమేనాయె .. అతి కష్టం మీద నెల రోజులుండి వెనక్కి  వచ్చేసింది .  
ఎవరి దగ్గరా ఎక్కువ కాలం  ఉండలేక పోయింది .  వాళ్ళ వాళ్ళ జీవన శైలిలో ఇమడలేకపోయింది. తన మాట వాళ్ళ ఇళ్లలో చెల్లదని అర్ధమై పోయింది .   

ఇంకా చెప్పాలంటే తాను వాడకంలేని చెల్లని పైసాలాంటిదని, మూలన పడిన వస్తువులాంటిదని అర్ధమైపోయింది .  
వెళ్తే చుట్టపు చూపుగా వెళ్ళాలి కానీ, అక్కడే పూర్తిగా ఉండకపోవడమే వాళ్ళకి, తనకి మంచిదని నిర్ణయించుకుని తన ఇంటికి తాను చేరిందిలంకంత ఇంట్లో ఒంటరై పోయింది

ఆర్ధిక సమస్యలు లేవుపిల్లల చదువుకు అన్న సర్దడం , తర్వాత సుధాకర్ అంది రావడంతో ఆస్తులు కరిగించు కోకుండానే చదువులు అయిపోయాయి

సరళ పెళ్ళికోసం ఐదు ఎకరాలు అమ్మారు .  కట్నం కోసం ఇరవై ఎకరాలు ఇచ్చారు.  

అది పోను నలభై ఐదు ఎకరాల ఆసామి తాను . కౌలుకిచ్చిందిఆర్ధిక ఇబ్బందులు లేవు .  

ఒంటరితనం కుంగదీయడంతో పాటు అనారోగ్య సమస్యలు ఒకొక్కటి వచ్చి పలకరించి వెళుతున్నాయి .   

వంటపని చేసుకునే జవసత్వాలు ఉన్నాయి . అయినా మనిషిని పెట్టుకున్నదికారు కొనుక్కుని డ్రైవర్ ని పెట్టుకున్నదిపిల్లలు దర్జాగా బతుకుతున్నారు . తనుకూడా ఉన్నంత కాలం దర్జాగా బతకాలని నిర్ణయించుకున్నదినచ్చిన బట్ట కట్టాలని , మెచ్చిన నగలు చేయించుకోవాలని అనుకుంది . అలా కొన్నాళ్ళు చేసిందిఇంటికి వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి  సంబరంగా చెప్పుకున్నది తర్వాత అందులో సంతోషం మాయమైపోయిందిఏకాకి జీవితం లోలోన తొలిచేయ్యడం మొదలుపెట్టిందిఅందరూ ఉండి ఎవరూ లేని అనాథలా బతుకున్నానన్న భావన కుంగదీయడం మొదలు పెట్టింది .    

అప్పటికి కూడా ఇంట్లోంచి తరిమేసిన శోభ  ఎట్లా ఉన్నదో పట్టిచ్చుకోలేదు . ఆమె ఒంటరి జీవితం గురించి ఆలోచించలేకపోయింది .  
కానీ , ఇప్పుడు.. రక్త మాంసాలు పంచి ఇచ్చిన పిల్లలకు తను పరాయిదై పోయింది
పరాయిదని ఛీత్కరించి, వెళ్లగొట్టేసిన శోభ పంచనే ఉన్నదిఆమెనే అక్కున చేర్చున్నది. అనారోగ్యంతో బాధపడుతున్న తనని అమ్మలా ఆదరించింది . తానే తల్లై సేవలు చేసింది .  

పాపం .. అయినా తద్దినాన్ని కొని తెచ్చిపెట్టుకున్నానని ఎప్పుడు అనుకున్నట్లు కనపడలేదు

 తానే ఓర్చుకోలేదు . ఊరుకోలేదుపొగలు చిమ్ముతూనే ఉన్నది . తోక తెగిన కోతిలా ఉన్నదిసుగుణమ్మ తన ప్రవర్తనకు తానే సిగ్గుపడింది క్షణంలో.  

ఎట్లాటి మనిషి, ఎట్లా ఉండాల్సిన మనిషి ఎట్లా బతుకుతున్నది .

చక్కదనాల బొమ్మఅమెరికాలో ఇంద్రభోగాలు అనుభవించాల్సిన మనిషి అనామకురాలిగా ఊరుగాని ఊర్లో అయినా వాళ్లందరికీ దూరంగా బతుకుతున్నది .  
ఒక్కసారిగా కోడలంటే జాలి ముంచుకొచ్చింది సుగుణమ్మకి .

అంతలోనే శోభ ఎప్పుడూ నవ్వు మొహంతోనే ఎలా ఉండగలుగుతుందిఆమెకు అస్సలు కోపం రాదా ..?  నెత్తి మీద పిడుగులు పడుతున్నా నవ్వుతూనే ఎదుర్కొంటుంది .  ధైర్యంగానే ఉన్నట్లుగా ఉంటుందిజీవితంపై ఆశతో ముందుకు సాగుతుంది . అదే భరోసా ఎదుటివాళ్ళకు ఇస్తుంది

చేజారిందనుకున్న జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్న శోభ పట్ల జాలి పోయి స్థానంలో  ఎప్పుడూ లేని గౌరవం చోటు చేసుకుంది

ఇప్పుడామె కళ్ళకి శోభ  చల్లని చందమామలా అనిపిస్తున్నది .  

ఎప్పుడో ఒకసారి సుగుణమ్మలో పశ్చాత్తాపమో , పరివర్తనో వస్తున్నట్లుగా ఉంటుంది .  అంతలోనే , ఆమె లోని అహం ముందుకు చొచ్చుకొచ్చి అందుకు ఒప్పుకోదు .
ఇప్పుడూ అంతేనా .. ఏమో ..!

అనుకోవడమే గానీఅంతా తలరాత .
దాని గాచారం ఎట్లా రాసి ఉంటే అట్లాగే నడుస్తుంది  కట్టలు తెంపుకుని వస్తున్న ఆలోచనలకు కళ్లెం వేస్తూ బలవంతంగా కళ్ళు ముసుకు పడుకుంది సుగుణమ్మ.
కానీ నిద్ర పట్టడం లేదు . ఏవేవో సంఘటనలు ఆమె కళ్ళ ముందుకొచ్చి కలవర పెడుతున్నాయి

గాచారం అని తప్పిచ్చుకోకు .  బంగారం లాంటి పిల్ల జీవితాన్ని నట్టేట ముంచింది నువ్వే .
తడిబట్టతో గొంతు కోసింది నువ్వే.. నువ్వే .. ముమ్మాటికీ నువ్వే  … ఎవరో గట్టిగా అరుస్తున్నట్లనిపించింది

నిజ్జంగా ఆమె మీద నీకు ప్రేముంటే నీ రాతను మార్చుకున్నట్టు  తలరాతను మార్చేదానివి కదా.. 

ఏం .. ఆమె తలరాత మార్చే శక్తి నీకులేదా .. ఉంది . అయినా పని చేయవు .  

అంతా స్వార్ధం .. నీ స్వార్ధం కోసం, నువ్వు అందలం ఎక్కడం కోసం మీ అమ్మాకొడుకులు పిల్లని పావుగా ఆడుకున్నారు

అయినా పన్నెత్తు మాట అనదు. అదే మీకు అలుసై పోయింది .  మీరు ఆడింది ఆట పాడింది పాటగా సాగిచ్చుకున్నారు .  

పోనీ .. మోడువారిన చెట్లు చిగురించడం లేదా .. ఆమె జీవితం చిగురించాలని ఏనాడన్నా ఆలోచించావా .. 

ఊహూ .. ఆలోచించవు . అట్లా ఆలోచిస్తే ఆమెతో వచ్చిన కలిమి అంతా కట్టకట్టుకుపోతుందేమోనని నీ భయం .. నిన్ను చూసే దిక్కుండదని లోలోపల బుగులుఅంతేనా .. అంటూ సుగుణమ్మ అంతరాత్మ ప్రశ్నిస్తున్నది .

అకస్మాత్తుగా  మధ్య టీవీలో చూసిన పెళ్లి సుగుణమ్మ కళ్ల ముందు ప్రత్యక్షమైంది .

 

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.