పల్లె ఒడిలో సంక్రాంతి తడి
-కొట్నాన సింహాచలం నాయుడు
పండగ వచ్చిందంటే అందరికీ ఒకటే పండగ. నెలగంటు పెట్టిన వెంటనే నాన్న సున్నం డబ్బా తెచ్చేవాడు. నీలిమందు తెచ్చేవాడు. ఇల్లంతా పట్లు దులిపి శుభ్రం చేసేవాళ్ళం. సున్నం లో నీలిమందు కలిపి అన్ని గోడలకు వెల్ల వేసే వాళ్ళు. ఒకరు సున్నం వేస్తుంటే ఒకరు నిచ్చెన పట్టుకునే వాళ్ళు. తడిగా ఉన్నంతవరకు నీలంగా ఉన్న గోడలు ఆరగానే తెల్లగా మెరిసే వి. ఊర్లో ఎవరి గోడలు తెల్లగా ఉన్నాయో అని అందరూ చెప్పుకునే వాళ్ళు. సున్నం వేయగానే చెల్లెళ్ళు గిలక బావి నీళ్లు చేదతో తోడి తెచ్చే వాళ్ళు. బిందెలకు బిందెలు ఇల్లంతా పోసి కడిగే వాళ్ళు. ఎంత బాగా కడిగారు అన్నది మండువా అనుకుని ఉన్న ఎర్ర గడప తేటు తో తెలిసేది.
అమ్మకు తాతయ్య పెట్టిన సారెతో వచ్చిన ఇత్తడి అండా, డెక్సా, బిందెలు, కంచు గిన్నెలు, బకెట్లు, చెంబులు, మరచెంబులు, గ్లాసులు, పళ్ళాలు, అన్నీ నాగావళి కి తీసు కెళ్ళే వాళ్ళు. పాత మరకలు, సున్నం వేసిన కొత్త మరకలు పోయేవరకు ఒండుమట్టి, చింతపండు తో బాగా రుద్ది తోమేవాళ్లు. నాగావళి నీళ్ళల్లో బిందెల మెరుపు కనిపించే వరకు మళ్లీ మళ్ళీ కడిగే వాళ్ళు. అన్నీ తెచ్చి మళ్లీ అట్టుగ బళ్ళల మీద అమర్చే వాళ్ళు. అమ్మ అట్టుగ నిండా సామాన్లు సర్దుకు నేది. అమ్మ వద్దు అన్నా ఎవరో ఒకరు నిచ్చెన పట్టుకునే వాళ్ళు.
గడపలో పురి చుట్టి కొత్త ధాన్యం పోసే వాళ్ళం. సంవత్సరం తినటానికి సరిపడా పోసి మిగిలినవి కళ్ళం లోనే షావుకారు కు అమ్మే వాడు నాన్న. చాకలి గవిరి ఉతికి తెచ్చిన పట్టి, మంచాలన్నిటికి నేసే వాడు. ఒక పక్క నాన్న లాగి చుడుతుంటే మరోపక్క పట్టి అందించే వాళ్ళం. నులక మంచాలు అన్నీ బిగించే వాళ్ళం. ఇంటి నిండా చుట్టాలు ఉంటారు అంటూ అన్నీ సిద్ధం చేసే వాళ్ళం.
పండగ ముందు వచ్చే లక్ష్మివారం నాన్న పట్నం సంతకు వెళ్లే వాడు. జానెడు పొడవున్న పొట్లాలు బోలెడు తెచ్చేవాడు. బంగళా దుంపలు, అల్లం, వెల్లుల్లి, శనగపప్పు, ఎండు మిరపకాయలు తెచ్చేవాడు. పసుపు కొమ్ములు తెచ్చేవాడు. నల్ల మిరియాలు, చీమ మిరపకాయలు తెచ్చేవాడు. అగరవత్తులు, అరటిపళ్ళు, కొబ్బరి కాయలు, అగ్గిపెట్టెలు కర్పూర బిళ్ళలు తెచ్చేవాడు. కజ్జి పుండలు, చక్కిరాలు తెచ్చేవాడు.
రంగు రంగుల బట్టలు తెచ్చేవాడు. అన్నకు, నాకు బిన్నీ నిక్క ర్లు, చుక్కల చొక్కాలు, నలుగురు చెల్లెళ్ళు కు నాలుగు రంగులు, చేతులకు బుట్టలు ఉన్న గౌన్లు తెచ్చేవాడు. మేనత్త లకు కాటన్ చీరలు, మామయ్యలకు, గ్లాస్కో పంచెలు, లాల్చీలు తెచ్చేవాడు. అమ్మకు నాన్నకు తాతయ్య కొనేవాడు కాబట్టి తెచ్చే వాడు కాదు అని మాకు మెల్లగ అర్థమయ్యేది. ఒక్కో పాత గాజు కొలత కు తీసుకెళ్ళి నలుగురికి గాజులు తెచ్చేవాడు. ఎర్రసబ్బు, పాండ్స్ పౌడరు, గోళ్లకు రంగు సీసా తెచ్చేవాడు. ఎరుపు, గులాబీ రంగు రిబ్బన్లు తెచ్చేవాడు. బంగారం ష రాబు దగ్గరకు వెళ్ళి అమ్మ ముక్కు కమ్ములు, చెవి కొప్పులు షైనింగ్ చేయించి తెచ్చేవాడు. అమ్మ రాయించిన చీ టీ లో అన్నీ తెచ్చేవాడు. అందులో రాయని ఒక సిగరెట్ పాకెట్ తెచ్చుకునే వాడు. మరో సంవత్సరం పట్నం వెళ్ళటానికి సరిపడా తువ్వాలు తెచ్చుకునే వాడు. కనుమ రోజు కోడిమాంసం తో జతగా రెండు సవకలు ఒక గ్లాసు నీళ్లతో తాగేందుకు బ్రాందీ తెచ్చేవాడు.
పండగకు ఎక్కువ అవసరం అయ్యేది నూనె. పక్కనే సంతోష పురం లో ఉన్న గానుగ దగ్గరకు నువ్వులు పట్టుకెళ్లి నూనె తెచ్చేవాడు. తె లక పిండి తెచ్చేవాడు. పొలం కు వెళ్లి పండుగరోజు అతి ముఖ్యమైన అప్పాల కోసం అవసరం అయిన మంచి గుమ్మడి కాయ తెచ్చేవాడు. పండగరోజు పెద్దల కు అన్నం పెట్టేందుకు పొడవు చిక్కుడు కాయలు, బీరకాయలు, వంకాయలు తెచ్చే వాడు. కొత్త ధాన్యం నాగూరు మిల్లుకు తీసుకువెళ్ళి బియ్యం తెచ్చే వాడు. ఆ ఊర్లో ఉన్న పెద మేనత్త ముచ్చట్లు తెచ్చేవాడు.
అమ్మ కందులు, పెసలు, మినుములు డాబా మీద ఎండబెట్టేది. ఎనక మనిషి సాయంతో వాటిని తిరగలి పట్టి పప్పులు చేసేది. ఎండు మిరప కాయలు దంచి కారం చేసేది. పసుపు కొమ్ములు ఆరబెట్టి దంచి కొత్త పసుపు చేసిది. కొత్త బియ్యం నాన బెట్టి ఆర బెట్టి తెచ్చేది. రోట్లో పోసి దంచుతూ అరిసెల కోసం పిండి చేసేది.
మినుములు నానపెట్టి ముద్ద చేసి చిన్న ఒడియాలు అప్పడాలు చేసేది. అప్పడాలు చేసేటప్పుడు ముద్ద రుబ్బటం నుండి నువ్వు లు కలిపి, ఇంగువ కలిపి బంకలా సాగ దీసే వరకు చాలా మందికి పని ఉండేది. అప్పడాలు పామి డాబా మీద దుప్పటి పైన ఎండబెట్టి వరకు ఇల్లంతా అద్భుత మైన వాసన ఉండేది. ఇంటి నిండా అమ్మలక్క ల కదలిక ఉండేది. ఎండలో నే దుప్పటి మీద ఒడియా లు ముద్దుగా చేసి మధ్యలో నత్త పెట్టీ ఎండే వరకు ఉంచే వాళ్ళు. ఎండిన ఓడియాలు అప్పడాలు గల గల శబ్దం చేస్తూ రేకు డబ్బాల్లో చేరి పోయేవి.
అమ్మ పండగ పని అయిపోయిందా లేదా అని అడగటానికి అమ్మమ్మ రోజుకు రెండు సార్లు వచ్చేది. అవ్వలేదు రా నువ్వు చే ద్దువు అంటూ అమ్మ తిట్టేది. చిన్న పిల్లలతో చెయ్యలేవు అని సాయం చేయటానికి వ స్తే పొమ్మంతా వేటమ్మ అంటూ అమ్మమ్మ గొణుగుతూ వెళ్ళిపోయేది.
పందెం కోడి ఎలా ఉందో చూద్దాం అని మామయ్య వచ్చేవాడు. నాన్నతో గెలుపు అవకాశాలు చర్చించి వెళ్ళేవాడు. కోడి పెంచటం అంటే ఎవరైనా మా బావ తరువాతే అని ఊరంతా చెప్పేవాడు. రూపాయి పట్టుకుని సిత్తు పక్కుకి వెళ్లిన అన్న లక్షలు ఖర్చు పెట్టిన ఆనందం పొందేవాడు. అర్థ రూపాయి లాభంతో వచ్చి ఆరు సార్లు చెప్పేవాడు. పేకాట లో ఎవరు ఎంత సంపాదించింది పొల్లు పోకుండా చెప్పేవాడు. తన రూపాయి పోయిన రోజు పోగొట్టు కున్న వాళ్ళ లెక్కంత చెప్పేవాడు.
చెల్లెళ్ళు ఆవుపేడ పిడకలు చేసేవాళ్ళు. రింగుల్లా చేసి డాబా మీద ఆరబెట్టి వాళ్ళు. బాగా ఎండిన తరువాత నులక తాడుతో మాల చేసేవాళ్ళు. భోగి మంటల్లో వేయటానికి చెక్కలు, కర్రలు ఎండబెట్టి వాళ్ళు. ఎద్దుల కొమ్ములకు కట్టటానికి, ఆవుల మెడలో వేయటానికి, రంగుల మాల చేసే వాళ్ళం. తాతయ్య వాళ్ళు ఏమి కొన్నారో తెలుసుకోవటానికి ఏదో ఒక పని పెట్టుకుని రోజుకు నాలుగు సార్లు వెళ్లే వాళ్ళం. జాన కత్తయ్య లీక్ చే స్తుందేమో అని పెద మామయ్య కళ్ళు మిట కరించే వాడు. గాంధీ మామయ్య బయటకు తీసుకువచ్చి మొత్తం చెప్పేసేవాడు.
ఇప్పుడయితే చాలా పండగలు ఉన్నాయి కాని అప్పట్లో పండగ అంటే ఒక్కటే. తెల్లవారే సరికి వీధిని అనుకుని ఉన్న తూరుపు గోలి గోడల పక్క కూర్చుని నులి వెచ్చని ఎండలో చలి కాగుతు ఉన్న రోజుల్లో వచ్చేది పండగ. కల్లంలో వరిగడ్డి కుప్పలమీద వెల్లకిలా పడుకుని వేడిని అనుభవిస్తూ ఉన్న రోజుల్లో, చల్లని నీళ్లలో మునిగి, మెరిసే ఇసుక దిబ్బలమీద, రాతి గుట్టల మీద కూర్చుని వెచ్చదనం పొందే రోజుల్లో, పంటల బరువు తగ్గించు కొని పొలాలన్నీ తేలిక పడి ఊపిరి పీల్చుకుంటూ ఉన్న సమయంలో, అలసిపోయిన ఊరోళ్ళు పశువుల శాలల్లో ముచ్చట్లు చెప్పుకుంటు న్నపుడు, తీరిక దొరికిన పశువులు ఏలిక తో ఆటలాడుకుంటున్నప్పుడు వచ్చి అందరినీ మళ్లీ పనిలో పెట్టే పండగ ఇది.
పిల్లల మొల తాడు నుండి అమ్మల మెడతాడు వరకు కొత్త మెరుపులు దిద్దుకునే పండగ ఇది. గంగిరెద్దుల వాళ్ళ పాటలతో, జంగాల పొగడ్తలతో ఊరు ఊరంతా ఉత్సాహం నింపుకున్న పండగ. మూడు రోజుల ఆ పండగ కోసం మూడు తరాల కుటుంబాలు ముసి ముసి నవ్వులతో ఎదురు చూసే క్షణాలవి. ముద్దు ముచ్చట్ల తో ముస్తాబు అయ్యే సమయమది. పండగ రాక ముందే పరవశం పరవళ్ళు తొక్కే పరిచయ మది. కంటికి కనపడ కుండానే మనసంతా వెలిగిస్తున్న భోగి మంట ల తేజంలా.. మింటిని వీడకుండా నే కళ్ళముందు నిలబడిన పూర్వీకుల ఆశీర్వచనం లా…. ఇంటికి రాక ముందే వినపడుతున్న మేనత్త ల కాలి అందెల సవ్వడి లా….
భోగి
పండగ మరో మూడు రోజుల్లో వస్తుంది. ఊరంతా కలసి బండి పూసి తోటవైపో ఏటివైపో వెళ్ళేవాళ్ళం. వరదల్లో కొట్టుకొచ్చి గట్టున ఇసుకలో ఇరుక్కున్న పెద్ద చెట్టును ముక్కలు చేసి బండికి ఎక్కించే వాళ్ళం. తోటలో అయితే గాలివానకు విరిగి కింద పడి ఉన్న కొమ్మలను బండికి ఎక్కించే వాళ్ళం. బండి నిండా తెచ్చిన కర్రలు ఊరు ప్రారంభంలో గోర్జి మొదలయిన చోట పొగ పోసి ఉంచే వాళ్ళం. ఊరులో అందరికి సంకేతం అందేది. ఈ పెద్ద కర్రల పొగ మీద గంట గంటకు ఒక కర్ర చేరేది. ఈ మూడు రోజుల్లో ఎవరు పొలం కు వెళ్లినా ఎండిన కర్ర కనిపిస్తే తెచ్చి ఇందులో వేసే వాళ్ళు. ఎవరికి ఎక్కడ ఏ ఎండు పుల్ల కనిపించినా ఇక్కడ చేరేది. గంట గంటకూ, పూట పూటకూ, రోజు రోజుకూ ఈ కట్టెల కుప్ప పెరిగేది.
భోగి రోజు ఉదయం. అమ్మ ఎప్పటిలానే నాలుగున్నరకు లేచేది. నాన్న ఈ ఒక్క రోజు అందరినీ లేపేవాడు. నిద్ర ముఖాలతో అందరం ఇల్లంతా కలియ తిరిగే వాళ్ళం. పక్కనే పెదనాన్న గారింట్లో, చిన నాన్న గారింట్లో కూడా అలికిరి వినపడేది. లేస్తూనే నాన్న ఒక్కక్కొరికి ఒక చెక్క ముక్క చేతిలో పెట్టే వాడు. ఏదో ఒక మంచం కొయ్య లేదా కుర్చీ కాలు చేతికి అందేది. పనికి రాదు అనుకున్న ప్రతి వస్తువు చేతిలోకి వచ్చేది. చెల్లెల్లు మాల కుట్టిన పిడకలు కొట్టు గదిలో వెతికి బయటకు తీసే వాళ్ళు. అన్న, నేను, చెల్లెళ్ళు నాన్నతో బయటకు వచ్చే వాళ్ళం. ప్రతి ఇంటి నుండి ఇలానే భోగి వైపు దారి కట్టే వాళ్ళు. ప్రతి చేతిలో ఇలానే ఏదో ఒక కర్ర ఉంది. ఆడ పిల్లల చేతిలో అదనంగా పిడకలు ఉండేవి. కర్రలు అన్నీ భోగి కోసం వేసిన కట్టెల కుప్ప మీద పడేవి. పిడకలు బోగి కర్రలకు మాలలుగా వేసి అలంకరించి ఉంచేవాళ్ళం. అప్పటికే ఊరి చాకలి ఎవరూ అక్కడికి చేరక ముందు భోగికి నిప్పు పెట్టేవాడు. అందరూ ఆన్ని వైపుల నుండి నిప్పు పెట్టే వాళ్ళు. మెల్ల మెల్లగా మంటలు పైకి లేచేవి. చల్లని చలిగాలి. వెచ్చని భోగి మంట.
గాలి అగ్ని జ్వాలలను నలు వైపులా విసిరేది. ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని ఉండేవాళ్ళం కానీ వెనకడుగు వేసే వాళ్ళం కాదు. ఒక్కో ఇంటి నుండి మరో నాలుగు నాలుగు చేతులు భోగితో చేయి కలిపేవి. భోగి మంటలు ఇంకా ఇంకా పైకి లేచేవి. కబుర్లు, కేరింతలు, మునుకోలు కర్రతో మంటలు లేపే ప్రయత్నాలు, కాలని కర్రకు నిప్పు అందించే యత్నాలు; ఇలా ఊరు ఊరంతా ఇక్కడే ఉంది భోగి మంటలకు చేయూత ఇచ్చేది. ఈ రోజుతో చలి మాయమవుతుంది అనే వాళ్ళు కొందరు. ఊరులో ఒక్క పాత వస్తువు కూడా మిగల లేదు అని కొందరు అనే వాళ్ళు. పోయిన సారి కంటే ఇంకా ఎత్తు లేచాయి మంటలు అని మరి కొందరు అనే వాళ్ళు. రాబోయే సంవత్సరం ఇంకా బాగుంటాయి పంటలు అని అందరూ అనే వాళ్ళు.
భోగి మంటలు మెల్లగా అవరోహణలోకి వచ్చేవి. ఒక్కో జ్వాలా ఆగి పోయేది. ఒక్కొక్కరు నాగావళి వైపు సాగి పోయే వాళ్ళు. మెల్లగా ఉదయ వెలుగులు ఆవరించేవి. తెల్లగా తెలవారినట్టు అనిపించేది. అంతవరకూ ఎర్రగా లేచిన మంటలు ఇప్పుడు తెల్లని గుట్టలుగా మిగిలినట్టు. మంటలు ఆరినా నిప్పులు అలానే ఉండేవి. ఎర్రని యజ్ఞగుండం లా ఉండేది. అక్కడక్కడా నివురు తెల్లని విబూది గుట్టల్లా కనిపించేది. పిడకల మాలలు తెల్లని వెండి ఉంగరాల్లా కనిపించేవి. ఎవరి మాలలు ఆనవాళ్లు వాళ్లకు కనిపించేవి. ఆన్ని వాసనలను దహించే అగ్నికి వాసన ఉంటుందని అప్పుడే తెలిసేది.
భోగి మంటలు ఆరిపోయాక అందరం నాగావళికి వెళ్ళేవాళ్ళం. కొందరు బావి దగ్గరకు వెళ్ళేవాళ్ళు. స్నానం చేయకుండా ఇంటికి మాత్రం ఎవ్వరూ వెళ్లే వాళ్ళు కాదు. లేత ఉదయ కాంతుల్లో నాగావళి అందమే వేరు. వెచ్చని భోగి మంటల అనుభూతి ఇంకా ఉంది. చల్లని నాగావళి నీళ్ళల్లో మునక తప్పదు అని తెలుసు. అమ్మ ఒడిలో వాలిపోవటం కష్టం కాదు అని కూడా తెలుసు. నీళ్ళల్లో ఉన్నంత వరకు బాగుండేది. ఇసుకను తాకి ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. బయటకు వస్తేనే చలి తెలిసేది. అందుకే రావాలని అనిపించేది కాదు. అంత చలిలోనూ నీళ్ళల్లో ఆటలు. రాయి మీద ఉన్నవాళ్లను నీళ్ళల్లో తోయటం, నీళ్ళల్లో ఉన్న వాళ్ళను తల ముంచి ఉంచటం, చలి చలి అంటున్న వాళ్లపై నీళ్లు విసిరి చూడటం ఇవన్నీ నాగావళి నేర్పిన ఆటలు. ఏ ఆటకైనా సమయం ఉంటుంది కానీ నాగావళిలో ఆటకు ఉండేది కాదు. ఏ సమయంలో అయినా ఆడుకోవచ్చు. ఎంత సేపయినా ఆడుకోవచ్చు. బావి దగ్గర రెండు చేద ల నీళ్లు సరిపోయినా, గోలెం దగ్గర నాలుగు దొకిల నీళ్లు సరిపోయినా ఊరు ఊరంతా నాగావళి చేరేది ఆట కోసమే. స్వచ్ఛమైన, స్వేచ్చ్చాయుత ఆటలు. వణికించే చలిలోనూ, వేకువ చలి గాలుల్లోనూ వేడిని ఇచ్చే వెచ్చని ఆటలు.
పండగ సూర్యుడు మరింత త్వరగా వచ్చేసి నట్టు ఉండేది. అందరం ఇళ్లకు చేరుకునే వాళ్ళం. ముంగిట్లో అలికి ముగ్గు పెట్టి ఉండేది. బట్టలు మార్చుకుని భోగి దగ్గరకు వెళ్లే వాళ్ళం. గుత్తులుగా పడి ఉన్న పిడకల బూది ఇంటికి పట్టుకెళ్ళేవాళ్ళం. అందరం బొట్టు పెట్టుకునే వాళ్ళం. గుట్టలుగా పడి ఉన్న కట్టెల బూది ఒకదగ్గర చేర్చే వాళ్ళం. పశువుల శాల దగ్గరకు వెళ్ళేవాళ్ళం. అక్కడ అలికి, ముగ్గు పెట్టి, గొబ్బెమ్మలు పేర్చి ఉండేవి. ఆవులకు, ఎడ్లకు బొట్టు పెట్టి మొక్కే వాళ్ళం. కాస్సేపు అక్కడే ఉండి ఆవుతో మాట్లాడే వాడిని. ఎప్పటి లాంటి రోజు కాదిది. మరో సంవత్సరం మరపు రాని రోజిది. పశువులతో కలసి మనుషులు చేసుకునే పండగ రోజు.ఉట్టి మీద వెన్న సాక్షిగా, కల్లంలోని ఎన్ను సాక్షిగ మనిషి జీవితంలో పచ్చదనం నింపిన పశువులు తృప్తిగా చూస్తున్న రోజు.
ఆవును వదిలి ఇంటికి చేరేసరికి ఆకలి వేసేది. వంటింట్లో అందరం కూర్చునే వాళ్ళం. ఇది జానకత్తయ్య చేసిన మినప కుడుము. ఇది సోములు పిన్ని చేసినది. ఇది పెద్ది చేసినది. ఇది పిన్ని చేసినది. ఇది మనం చేసినది అంటూ పళ్లెంలో పెట్టేది అమ్మ. అందులో నెయ్యి బెల్లం వేసేది. మినప కుడుము తింటే బలం అవుతాం అని చెప్పేది. కుడుము తినటంతో భోగి అయిపోయేది. ఇక ఆ తరువాత ఎప్పటిలా నే ఉండేది. అయితే ముందు ముందు పండగ, కనుమ, ముక్కనుమ ఉన్నాయన్న ఆనందం భోగి ఇచ్చేది.
ఇంటి నిండా దినుసులు కనిపించేవి. ఊరి నిండా మనుషులు కనిపించే వాళ్ళు. వీధి నిండా ముగ్గులు కనిపించేవి. గాలినిండా పేడ నీటి వాసనలు అనిపించేవి. ద్వారాల నిండా తోరణాలు వేలాడేవి. కల్లాల నిండా ధాన్యాలు కనిపించేవి. చెట్ల నిండా పక్షులు కనిపించేవి. శాల నిండా పశువులు కనిపించేవి. ఆకాశం నిండా సూర్యుడు కనిపించే వాడు.నేల నిండా అడుగులు కనిపించేవి. మనసు నిండా ఆశలు అనిపించేవి. భోగి మంటలు పంపిన ఆనవాళ్లు తగిలి ఊరంతా ఒక యజ్ఞ వేదికలా కనిపించేది. పంచ భూతాల్లో పవిత్రత తొంగి చూసేది. మూడు రోజుల పెద్ద పండగకు ఈ భోగి ఒక ప్రాంగణం లా అనిపించేది. ముల్లోకాల్లో సంచరించే పితృ దేవతలకు మొదటి పిలుపులా అనిపించేది.
పెద్ద పండుగ
పెద్ద పండగ పెద్ద వాళ్ళు మాత్రమే చేసుకునే పండగ అనుకునే వాడిని. తెల్లవారే సరికి నాన్న గుమ్మడికాయ కోసే వాడు. అమ్మ బెల్లం నీళ్ళు మరగబెట్టేది. అందులో గుమ్మడికాయ ముక్కలు వేసేది. ఉడికిన తరువాత పొయ్యిలో మంటతగ్గించి వరి పిండి కలిపేది. నెయ్యి, యాలకులు వేసి బాగా కలిపి దించేది. వేరే బాణలి లో నూనె వేసి మరిగించి, ఈ ముద్దను చేతులతోనే పప్పలు చేసి ఒక్కొక్కటి అందులో వేసి వేపేది. అప్పుడే ఆవి అప్పాలు అయ్యేవి. తరువాత అరిసెలు చేసేది. అరిసెలు అసలు నచ్చేవి కావు. తినటం వరకు ఎందుకు ? అవి చేస్తున్నప్పుడు వచ్చే వాసన భరించలేక ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవటం బాగా గుర్తు.
నాలుగైదు రకాల కూరలు కోసేవాడు నాన్న. ఖచ్చితంగా వంకాయ అందులో ఉండేది. వాటిని కూర చేసి కలగూర అనేవాళ్ళు. పప్ప లు అప్పాలు గా, కూర కలగూర గా అవ్వడమే పెద్ద పండుగ విశేషం అనుకునే వాడిని. గుమ్మడి కాయ అప్పాలు గానీ అరిసెలు గానీ, ఆ వంకాయ కానీ అసలు ఇష్టం ఉండేదికాదు. అందుకే పెద్ద పండగ నా లాంటి చిన్న వాళ్లకు సెలవు దండగ అనిపించేది. కనుమ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన రోజులు.
అప్పాలు కలగూర కంటే పెద్ద విశేషం తరువాత జరిగేది. కొత్త పంచెలు, లాల్చీ లు, చీరలు, మా బట్టలు అన్నీ దేవుడి దగ్గరకు తెచ్చి వాటికి పసుపు రాసేవాళ్ళు. దేవుడి కి చూపించి ఉంచేవాళ్లు. నాన్నకు అన్నయ్యకు నాకు మూడు ఆకుల్లో భోజనం వడ్డించి వాటిని దేవుడి దగ్గర పెట్టేవాళ్ళు. మరో మూడు ఆకుల్లో భోజనం వడ్డించి డాబా మీదకు తీసుకుని వెళ్ళేవాళ్ళం. నీళ్ళు చల్లి మొక్కే వాళ్ళం. ఎవరికి మొక్కుతున్నాం అని అడిగితే పెద్దలకు అనే వాళ్ళు. మెల్లమెల్లగా తెలిసేది పెద్దలు అంటే పోయిన వాళ్ళు అని. అనుక్షణం మనల్ని కాపాడే పూర్వీకులు అని. పంటలు పండి న ఆనందంలో వాళ్లకు బట్టలు, భోజనం పెట్టాలి అని. పెద్దలు వస్తారా అని అడిగితే అరుగో అక్కడ కూర్చున్నారు అని ఎత్తుగా ఉన్న ఎర్ర పెంకుల ఇంటి పైన కూర్చున్న కాకుల్ని చూపించే వాళ్ళు. మనం వెళ్ళాక వచ్చి తింటారు అనే వాళ్ళు. అందులో ఉన్న పెసర పప్పు తప్ప ఏదీ తినబుద్ధి కాదు, ఎలా తింటారు అనుకునే వాడిని.
మళ్లీ మళ్లీ వెళ్లి మెట్లమీద నుండి మెల్లగా తల పైకి ఎత్తి చూసే వాడిని. నిజంగానే పెద్దలు తినటం కనపడేది. ఒక్కో కాకికి ఒకర్ని అన్వయించి చూసే వాడిని. లెక్క సరిపోయేది. లెక్కకు మించిన పూర్వీకుల బంతి భోజనం వింతగా అనిపించేది. ఆ క్షణంలో నల్లని కాకులు అందంగా కనిపించేవి. వాటి అరుపులు మధురంగా వినిపించేవి. ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాల కూడదు అని ఎందుకు అన్నారో కాని ఈ రోజు అది నిజం. ఈ పెద్ద పండగ రోజు ఎవరింట్లో వాళ్ళే భోజనం చేయాలి. వేరే ఇళ్లకు వెళ్ళకూడదు. ఆడపిల్లలు కూడా అందుకేనేమో మెట్టినింట ఇవన్నీ చేసి కనుమరోజు మాత్రమే పుట్టింటికి వస్తుంటారు.
డాబా మీద నుండి ఊరు ఊరంతా చూసేవాడిని. కొందరు డాబా ల మీద ఉన్నారు. కొందరు నిచ్చెన వేసి పెంకు టిల్ల మీద అన్నం పెడుతున్నారు. కొందరు ఇంటి ముందు నిలబడి తమ మిద్దె ఇంటి కప్పుల మీద అమరుస్తు న్నారు. అయితే అన్ని ఇళ్ళమీద పెద్దలు కూర్చున్నారు. మిగిలిన రోజుల్లో వీళ్లంతా ఎక్కడ ఉన్నారో అనుకునే వాడిని. అప్పుడు గుర్తు వచ్చేది. చెట్లమీద కబుర్లు ఆడుకుంటూ కనిపించటం. ఒక చెట్టు మీద నుండి మరో చెట్టుకు వెళ్లే ఆటలు ఆడుకుంటూ ఉండటం.
పెద్దలు మనల్ని ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉంటారని అనే వాళ్ళు. కంటికి రెప్పలా కాపలా కాస్తు ఉంటారని అనేవాళ్ళు. ఒక్కోసారి అది నిజమే అనిపించేది. మావిడి తోటలో తిరుగుతున్నప్పుడు కాని, పొలం గట్లమీద నడుస్తున్నపుడు కాని ఒక్కసారిగా చాలా కాకులు నా చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉండేవి. ఆ గోలకు విసుగు వచ్చేది. కానీ కాస్సేపటికి తెలిసేది. నా దగ్గర్లోనే ఒక పాము ఉన్నట్టు. లేదా కొంచం దూరంలో ఎలుగుబంటి ఉన్నట్టు. అందుకే పెద్దలు నన్ను హెచ్చరిస్తూ జాగర్తలు చెపుతున్నట్టు.
మధ్యాహ్నం అయ్యేది. కాళ్ళు కడుక్కుని దేవుడి దగ్గర పెట్టిన భోజనాలు తీసుకుని తినే వాళ్ళం. వారికం కోసం ఒక అప్పా తినే వాడిని. పైకి చూసే వాడిని అమ్మ వైపు. అప్పుడు తెచ్చేది అమ్మ. మినప పప్పు గారెలు. సగం చప్పటివి. సగం బెల్లం పాకం పట్టినవి. చప్పటి వి తింటుంటే పాకం వి తినాలి అనిపించేది. పాకం వి తింటుంటే చప్పటీ వి తినాలని అనిపించేది. అందుకే మార్చి మార్చి తినే వాడిని. వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అని నేను చదువుకున్న మాటలు గుర్తొచ్చి చెప్పేవాడిని. అవే మాటలు అమ్మ అందరితోనూ చెప్పేది. మెల్లగా నా గారెల ఇష్టం ఊరంతా తెలిసింది. కొత్త కొత్త రుచులు తెలిసేవి.
ఒకసారి “అమ్మా ఈ కాకిని తోలవచ్చు కదా అలా ప్రహరీ మీద కూచుని ఉంటుంది ఎప్పుడూ” అన్నాను. అమ్మ నవ్వేది. ఎంత కొట్టినా వెళ్లదు అని చెప్పింది. అది మీ నాన్నమ్మ అని చెప్పింది. నాకు నిజమే అనిపించేది. నాన్నమ్మకు కోపం వచ్చేది కాదు. మెత్తని మనసు. మెల్లగా నడిచేది. అడుగులో అడుగు వేసుకుంటూ తూర్పున ఉన్న చిన్నాన్న గారి ఇంటినుండి మా ఇంటికి పడమర ఉన్న పెదనాన్న గారింటికి వచ్చేది.ఏమి చెప్పేది కాదు. ఏమి తినేది కాదు. కేవలం చూసి వెళ్ళేది. ఎప్పుడైనా నోరు తెరిస్తే బాబు తిన్నా డా అనేది. ఆరడుగులు ఉండేది. లావుగా ఎర్రగా పండిన గుమ్మడి కాయ లా ఉండేది. చేతి కర్ర పట్టుకో కుండానే నూరేళ్ళు నవ్వుతూ బతికింది. ఒంటినిండా బంగారం తో పచ్చగా మెరిసేది. వడ్డాణం నాకు తెలియక ముందే తీసేసారు కాని చెవులు, ముక్కు కనిపించ నంత బంగారం ఉండేది. మెడ తిరిగేది కాదు. కాళ్ళకు, చేతులకు కూడా వెండి కడియాలు ఉండేవి. నాన్నమ్మ రూపం కళ్ళ ముందు కన పడగానే కాకిది ఎంత అదృష్టమో అనుకున్నాను.
ఇప్పుడు నాకు గుమ్మడికాయ అప్పాలు అంటే ప్రాణం. పండగ వస్తుందంటే గుమ్మడి కాయ అప్పాలు ఎంత త్వరగా అవుతాయా అని ఎదురు చూస్తాను. రెండు మూడు రోజులైనా ఉండేటట్టు చేసి పెట్టమంటాను. గుమ్మడి లోని గింజలు ఎండబెట్టి ఒలుచుకుని తింటూ ఉంటాను. ఇప్పుడు ప్రతి పూట పెట్టినా విసుగు రాని కూర వంకాయ. పెళ్లికి, గృహప్రవేశానికి ఎవరైనా పిలిస్తే అక్కడకు వెళ్లి వంకాయ ఎక్కడుందో ముందు వెతుకు తాను. ఎన్ని రకాలుగా చేసినా అంతే ఇష్టంగా తింటాను. అయితే ఆమ్మ చేసే వంకాయలో కందులు వేసేది. ఎలా చేసేదో తెలియదు కానీ ఎంత తిన్నా ఆకలి తీరేది కాదు. ఇంకా ఇంకా తినాలి అనిపించేది.
ఇప్పుడు అరిసెలు కూడా ఇష్టం. ఇప్పటికీ ఊరినుండి ఎవరొచ్చినా చేసి పంపిస్తుంది అమ్మ. నిజానికి ఒక్కోసారి ఉదయం అరిసెలు తిని ఆఫీస్ కి వెళతాను. మధ్యాహ్నం సరదాగ తినటానికి పట్టుకు వెళతాను. సాయంకాలం వస్తున్నప్పుడు ఆకలిగా ఉంటుందని తింటాను. బాల్యంలో ఇష్టంలేనివి అన్నీ ఇప్పుడు నా ఇష్టాలు మారిపోయాయి. అన్నీ నాతోనే ఉన్నాయి. నేను ఎంత దూరంగా ఉన్నా అవి నన్ను వదలలేదు.
పెద్ద పండగ మళ్లీ వచ్చింది. గుమ్మడికాయ కోసే నాన్న లేడు. కూరగాయలు తెచ్చే నాన్న లేడు. నాన్నమ్మ కు అన్నం పెట్టే నాన్న లేడు. ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు. అందుకేనేమో కొత్త కాకి కూడా ఇంకా కనపడలేదు. అందుకేనేమో నాన్న కనిపిస్తూ కనుమరుగు అవు తూ తిరుగుతున్నాడు. చిన్న పిల్లాడిలా కాళ్ళకు అడ్డం పడుతూ ఆపుతున్నా డు. ఏ పని చేయాలి అన్నా ముందు ముందు నడుస్తూ త్రోవ చూపిస్తున్నాడు. అన్నం తిందామంటే నా కంటే ముందు కూర్చుని పిలుస్తున్నాడు. గుమ్మడికాయ కోయాలనీ వెళితే కత్తి పేట అందిస్తు న్నాడు. పెద్దలకు అన్నం పెడదాం అని డాబా మీదకు వెళితే వెతికి వెతికి అందరినీ తీసుకు వస్తున్నాడు. నాతోనే కూర్చుని తింటున్నాడు. నా చేయి పట్టుకుని తినిపిస్తున్నా డు. ఎక్కిళ్ళు వస్తుంటే నెత్తిన కొట్టి నీళ్ళు ఇస్తున్నాడు. ఎవరో అన్నారు. మనిషి చంద్రుడి మీద నడవటం వెనక దైవం నేలమీద నడవటం అనే అద్భుతం ఉంది అని. నేను ఇంకా ఊపిరి తీస్తున్నాను అనే నిజం వెనక నాలో నాన్న వెలిగించిన అఖండ జ్యోతి ఉన్నట్టు.
కనుమ
పెద్ద పండగ రాత్రి నిద్ర పట్టేది కాదు. ఎప్పుడు తెల్ల వారుతుందా అని ఎదురు చూసే వాడిని. మండువా లో కాలికి తాడు కట్టి ఉంచిన కోడి పుంజు కనుమ రోజు కూడా సమయానికే కూసేది. గబగబా లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని గుమ్మడి కాయ అప్పాల మాలలు పట్టుకుని అన్న, నేను, చెల్లెళ్ళు శాలకి వెళ్ళేవాళ్ళం. ఒక్కో అవు మెడలో ఒక మాల, ఒక్కో ఎద్దు మెడలో ఒక మాల వేసే వాళ్ళం. వాటికి మొక్కి కాస్సేపు అక్కడే ఉండే వాళ్ళం. ఆ తరువాత ఒక్కోమాల లోంచి ఒక్కో అప్పా తీసి ఆయా ఆవుకో, ఎద్దుకో తినిపించే వాళ్ళం. అవి తింటున్నప్పుడు వాటి కళ్ళలోకి చూసే వాడిని. తిండి పెట్టే వాళ్ళ వైపు తృప్తిగా చూస్తూ తినేవి. అదే సమయం అనుకుని తెల్లావుతో ఆడుకునే వాడిని. ఒళ్లంతా పామే వాడిని. దాని మెడ మీద ముఖం పెట్టీ కంఠాన్ని నిమురుతూ ఉండేవాడిని. చెవి పెట్టీ అది చెప్పే గుసగుసలు వినేవాడిని. అప్పాలన్ని తిన్నాక వెనక్కు చూస్తూ చూస్తూ ఇంటికి చేరేవాళ్ళం.
తూర్పు పడమర ల్లో విశాలమైన మెట్ట పొలం, ఉత్తరాన ఊరిని బయట ప్రపంచానికి కలిపే గో ర్జీ, దక్షిణాన నాగావళి నీ దాటించే కాలిబాట ఉండేవి. ఉదయం నుండి ఈ దారుల్లో చుట్టాల రాక కనిపించేది. ఎప్పుడో దారి తప్పి లోకాలన్నీ తిరిగిన పక్షి తన గూడు కనుక్కున్న ప్పటి ఆనందం చుట్టాల కళ్ళలో ఉండేది. అమ్మా నాన్న ఉన్నా లేకున్నా తాము తిరిగిన గడపల్లో కాస్సేపు తిరగాలి అని, తాము నడచిన ఊరిలో మరోసారి గడపాలని ఎంతో ఆనందంతో వస్తున్న చుట్టాలు వాళ్ళు. కొత్త ముడు లు బంధించి లాక్కు పోయాయి కాని లేదంటే వీళ్ళందరూ ఈ ఊరి పేగు బంధా లే. ఇక్కడి అమ్మల ఒడిలో బతుకు పాట విన్న వాళ్ళే. ఇక్కడి ఉయ్యాల ల్లో ఊగి జోలపాటలు విన్న వాళ్ళే. మెట్టినిళ్ళ లో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత సుఖం అనుభవిస్తున్నా అన్నీ ఆ ఇళ్ళ చూరుల్లో పెట్టీ గుప్పెడు చిరునవ్వు మాత్రం తమతో తెస్తున్న ఈ ఊరి ఆడ పడుచులు.
ఊరి మధ్య సున్నం మట్టించిన రాతి గొడ్డ ఉండేది. చుట్టూ చాలా ఖాళీగా ఉండేది. ఉదయం తొమ్మిది గంటలకు అందరూ అక్కడ చేరిపోయే వాళ్ళు. కోడి పుంజు పెంచిన వాళ్లంతా వాటిని తీసుకుని వచ్చే వాళ్ళు. మంగలి గౌరోజి, సింహాద్రి వాటి కాళ్ళకు కత్తులు కట్టే వాళ్ళు. నాకు నచ్చేది కాదు. కోడి ఎంత బలమైన దైనా కత్తి తగిలితే పోతుంది. అదృష్టం మీద ఆధారపడే పోటీ ఎందుకు అనేవాడిని మామ లతో. కత్తి తగలకుండా ఎలా ఎగిరి తన్నాలో కోడికి తెలుసు అనే వాళ్ళు. కత్తులు లేకపోతే రోజంతా తన్నుకుంటూ ఉంటాయి అనే వాళ్ళు. పోటీల్లో కొన్ని కోళ్లు పారిపోయి ఓడి పోయేవి. కొన్ని కత్తి తగిలి అక్కడే కూలి పోయేవి. ఓడి పోయిన కోడిని గెలిచిన వాళ్లకు ఇచ్చేసే వాళ్ళు. లేదంటే పెంచుకున్న మమకారం తో వండుకు తిందాం అనే సెంటిమెంట్ తో డబ్బులు ఇచ్చేదే వాళ్ళు. నాన్నకు కోడి పెంచటం గొప్ప ఆనందం. ప్రత్యేకించి రైస్ మిల్లు లో మెత్తని తవుడు తెచ్చి చిన్న చిన్న ఉండలు చుట్టి పెట్టే వాడు. రక రకాల గింజలు తిని పించే వాడు. మంచి నీళ్ళు తాగించి మూతి కడిగే వాడు. రెక్కలు నిమురుతూ నొక్కుతూ వ్యాయామం చేయించే వాడు. కత్తులు కట్టక పోతే ఖచ్చితంగా గెలుస్తుంది అన్నంత బలంగా పెంచేవాడు.
ఇంటి నిండా మేనత్తలు. తాతయ్య ఏడు దశాబ్దాలు నిండాక మూడో పెళ్లి గా నా న్నమ్మ ను చేసుకున్నాడు. ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్లకు జన్మ ఇచ్చిన నాన్నమ్మ నిండుగా కనిపించేది కాని తాతయ్యను ఎప్పుడూ చూడలేదు. ఈ ముగ్గురు కొడుకు లు తప్ప తాతయ్యకు అందరూ కూతుళ్లు మాత్రమే. మూడు మనువుల సంతానానికి ఈ ఇల్లే పుట్టిల్లు అయ్యింది. అందుకే మధ్యానం అమ్మ అన్నాలు పెట్టే సమయానికి ఇంటీ నిండా మేనత్త లు. ముగ్గురు మాత్రమే అల్లుళ్ళు. మేనత్త ల కబుర్లు వింటుంటే సమయం తెలిసేది కాదు. మూడు తరాల కబుర్లు, జిల్లా మొత్తం అల్లుకున్న బంధాలు కళ్ళ ముందు కదిలే వి. తాతయ్య ఎక్కడికి వెళ్ళినా గంటలు కట్టిన ఎడ్లబండి మీద వెల్లేవాడట. తాతయ్య బండి మీద ఉంటే ఎండ తగలకుండా గుబ్బ గొడుగు పట్టుకుని ఎనక మనిషి ఉండేవాడట. కిరీటం లేని మహా రాజ ట. లీటరు పాలు పెరుగు ఒక్కడే తినేవాడట. మేనత్త లు ఎన్ని సార్లు వచ్చినా ఈ కబుర్లు ఉండేవి. మళ్లీ పండగ వచ్చే సమయానికి కొత్త గానే ఉండేవి. లోకానికి నవ్వులు నేర్పటానికి అత్తలని పంపి ఉంటాడు విధాత. ఏ ఒక్క అత్త ఏ క్షణం లోనూ చిరునవ్వు లేకుండా కనిపించే ది కాదు. నన్ను లాక్కుని ఒడికి హత్తుకుని నవ్వుల ముత్యాలు రాల్చే వాళ్ళు. మనసు అల్లుకుని మమత విచ్చుకుని ప్రేమామృత వర్షం కురిపించే వాళ్ళు.
కనుమ రోజు మా భోజనాలు తాతయ్య వాళ్ళింట్లో. అదో దేవలోకం. తాతయ్య వాళ్ళ మొత్తం ఐదు కుటుంబాలు ఒకటే వంట. మండువా అందరినీ కలిపి ఉంచేది. పెద తాతయ్య వాళ్ళింట్లో భోజనం చేయాలి అందరూ. ఆ తాతయ్య గుర్తు లేడు. అయితే పెద అమ్మమ్మ పిడికెడు మనిషి ఉండేది. దాన్ని చూస్తే నాకు చాలా కోపం వచ్చేది. చిన్నప్పుడు అట్లకాడ కాల్చి నా పొట్ట మీద చురకలు పెట్టింది. అలా అయితే ఏ రోగాలు రావట. నేను ఎక్కడికి వెళ్ళినా బు స్కో టు తీయాలంటే భయం. పువ్వు లులా ఆ మచ్చలు ఎంటి అని అడుగుతుంటారు. అప్పుడు దీన్ని గుర్తు చేసుకోవాలి. ఒకటి రెండు కాదు. పొట్ట నిండా ముగ్గు వేసినట్టు కాల్చింది. అలాంటి సందర్భంలో దాని మీద కోపంతో పాటు ఒకింత గర్వం గా ఉండేది. నేను పుట్టినప్పుడు తాతయ్య ఎంత గొప్పగా ఆలోచించి ఉంటాడో తెలిసేది. నన్ను రక్షించేందుకు, ఆరోగ్యంగా పెంచేందుకు ఎన్ని ప్రణాళికలు వేశాడో తెలిసేది.
భోజనాలు చేశాక అసలు కార్యక్రమం ఉండేది. మా ఆరు గురుకి తాతయ్య ఇచ్చే పండగ కట్నం. తాతయ్య చుట్టూ తిరుగుతూ ఉంటే జానక త్తయ్య కు అర్థమయ్యేది. వాళ్ళ సంగతి చూడు మామయ్య అని చెప్పేది. తాతయ్య మెల్లగా లాల్చీ జేబులో చేయి పెట్టేవాడు. నాణాల పరిమాణం బట్టి ఒక్కొక్కటి బయటకు తీసే వాడు. ముందు అనుకున్న అంచనా ప్రకారం ఒక్కొక్క రి చేతిలో పెట్టేవాడు. ఒక్కొక్కరి చేతిలోని రూపాయి బిళ్ళ చాలా అపురూపంగా కనిపించేది. ఇంటికి రాగానే అమ్మ అడిగేది. తాతయ్య ఏమి ఇచ్చాడని. ఏమి ఇస్తాడో తెలుసు. కానీ అమ్మ కూడా ఒకింటి ఆడ పడుచు కదా…పుట్టింటి గొప్పలు విందామని అయి ఉంటుంది.
సాయంకాలం యాత్ర జరిగేది. ఏటి పక్క మామిడి తోటలో దుకాణాలు పెట్టే వాళ్ళు. పిన్నేసుల లా నుండి పూసల వరకు, బూరల నుండి వర్త గారెల వరకు అన్ని దొరికేవి. నెయ్యల ఉండలు చాలా బాగుండేవి. రంగు రంగుల రిబ్బన్లు వేలా డుతు ఉండేవి. చెంప పిన్నులు, లబ్బరు గాజులు దొరికేవి. పౌడర్లు, గోళ్ల రంగు సీసాలు దొరికేవి. తిలకం బోట్లు కనిపించేవి. పది పైసలు కే మెడలో కి గొలుసు దొరికేది. రబ్బరు బంతులు దొరికేవి. ప్లాస్టిక్ విజిల్ లు దొరికేవి. పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉండేవి. తోటంత తిరిగే వాళ్ళం. అలసి పోతే చెట్టు వేళ్ళ మీద కూర్చునే వాళ్ళం. దాహం అయితే పక్కనే ఉన్న నాగావళి లో నీళ్ళు తాగే వాళ్ళం. ఏమి కావాలన్న దొరికే ఊరు మాది. ఎన్ని యుగాలైన తరగని పచ్చదనం, ఎన్ని తరాలు వెనక్కి వెళ్లి చూసిన చెరగని బంధాల వెచ్చదనం మా ఊరు సొంతం.
ఎప్పటిలానే రాత్రి అయ్యేది. రాత్రి భోజనం అద్భుతంగా ఉండేది. మా ఇంటి కోడి, మా చెరువు చేప, మా నాగావళి రొయ్య, మా పందెం గొర్రె మాంసం. ఏది కావాలంటే అది దొరికేది. ఇవన్నీ ఎప్పుడూ ఉన్నా కనుమ రోజు రాత్రి భోజనం మరింత తియ్యగా ఉండేది. అత్తల కబుర్లతో.. ఇగటా లతో. రాత్రి పదకొండు వరకు మాట్లాడుకుంటూ తరువాత డాబా మీద కు వెళ్లే వాళ్ళం. బొంతలు, దుప్పట్లు, తలగడలు, చాపలు, పట్టుకుని. వెల్లకిలా పడుకుని ఆకాశం వైపు చూస్తుంటే అప్పుడు అనిపించే ది. అంత పెద్ద ఆకాశంలో ఏ చుక్కా ఒంటరి కాదు. ఇంత పెద్ద కుటుంబంలో ఏ ఒక్కరూ ఒంటరి కాదు.
తెల్లవారితే ముక్కనుమ. కొండమీదకు వెళ్లే వాళ్ళం. రాళ్లపై జారుతూ గుహల్లో దాగుడు మూతలు ఆడుతూ జరిగిపోయే ది. కొండమీద నుండి తోటల మధ్యన ఊరు మరింత అందంగా కనిపించే ది. ఊరి చుట్టూ తిరిగే నాగావళి, రాళ్ళు, ఇసుక దిబ్బలు ఆహ్లాదకరంగా ఉండేవి. ఇది పూర్తిగా ఆటవిడుపు సమయం. తోటలు తిరగాలి అన్నా, పొలాలు తిరగాలి అన్నా, కళ్ళంలో వరి కుప్పలు ధాన్యపు పురులు చూడాలన్న, చుట్టాలు కి గొప్పగా చూపించాలన్న ఈ ముక్కనుమ చాలా అనువైన రోజు.
ముక్కనుమ సాయంకాలం అత్తలకు వీడ్కోలు. అప్పాలు, అరిసెలు, బూరెలు, కూరలు, కొబ్బరి కాయలు, కూర గాయలు, పచ్చళ్ళు అన్నీ సంచుల్లో పెట్టేది అమ్మ. ఈ లోగా అత్తలు మూడిళ్ళ లో అందరికీ చెప్పి అరుగుల దగ్గర ఎదురు చూసే వాళ్ళు. అమ్మలు పెట్టిన ఒక్కో సంచి ఒకరం తీసుకుని నలువైపులా ఆయా అత్తల ను తీసుకుని వెళ్ళేవాళ్ళం. నేను ఎక్కువగా నాగావళి అవతల ఉన్న అత్త ని చేయి పట్టుకుని నది దాటించి తీసుకెళ్లే వాడిని. దారిపొడవునా కబుర్లు చెప్పేది. కాళ్ళు కదలక పోయినా అడుగులు వేసేది. కళ్ళ ముందు మసక పొరలు వచ్చినా కదిలిపోయే ది. నాగావళి దాటగానే సంచి తీసుకుని ఇక ఉండు నాన్న అని చెప్పేది. నా చేతిలో సంచి అత్త తీసుకున్నప్పుడు తేలిక పడినట్టు కాకుండా బరువు పెరిగి నట్టు ఉండేది. బంధం వీడినట్టు ఉండేది. బోగీలో అగ్నికి పాత వస్తువులు ఇచ్చినా, పెద్ద పండగ రోజు పూర్వీకులకు పెద్దలకు అన్నం పెట్టినా, కనుమ రోజు అత్త చేతిలో ఈ సంచి పెట్టినా నేను చూసింది ఒక్కటే. పంటలు తీసుకుని ప్రేమలు పంచటం. బంధాలు పెంచుకుని బరువులు తగ్గించటం. క్షణాలు తీసుకుని యుగాలు దాటడం.
*****
విజయనగరం జిల్లా నాగావళి ఒడ్డున ఉన్న పిట్టలమెట్ట గ్రామంలో పుట్టి బాల్యమంతా ఊరిలోను గడిపి తరువాత గుంటూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాల తాడికొండలో చేరాను అక్కడ పదవతరగతి వరకు చదివి తరువాత సివిల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చేసి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వ శాఖలో ఇంజనీర్ గా చేస్తున్నాను . బాల్యం నుండి సాహిత్యం, సంగీతం, నాటకాల అంటే చాలా మక్కువ. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను.