బతుకు చిత్రం-2

– రావుల కిరణ్మయి

కంచే చేను మేసిన్దన్నట్టుగా కన్న తండ్రే కన్న కొడుకు కళ్ళ ముందే  జీవితాన్ని పాడు చేసుకుంటుంటే  చీమ కుట్టినట్టైనా లేకుండా ఆడు మగోడు వాడేమి  జేసినా చెల్లుతుందని మాట్లాడుతున్న భర్త రాజయ్యను ఓవైపు మందలిస్తూనే తల్లిగా ఒక దారికి తేవాలని పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఎంత మంది వచ్చి చూసినా ,అడిగేది ఆస్తి పాస్తులే మున్నాయి?పిలగాడు నెలకు ఏ మాత్రం సంపాదిస్తాండు?ఎంత పొడుపు చేస్తాండు?అనే.

వీర్లచ్చిమికి ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం అయ్యేది కాదు.తమ కొడుకు సంపాదనాపరుడే కానీ అంతకు మించి తాగుబోతు.పొడుపు చేసినా,తాగడం కోసం మాత్రమే కావడం తో తగని వ్యథ మొదలైంది.ఆమెకు .అయినా,ఆమెలో కొడుకు పట్ల ఏహ్య భావం లేదు.తన కొడుకు మద్యానికి బానిసె తప్ప ఇంకా వాడి లో నిటి నిజాయితీ,మానవత్వపు నైతిక విలువలు కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని అవి కూడా పూర్తిగా నశించక ముందే ఓ ఇంటివాన్ని చేసీ మళ్ళీ మనిషి లా చూడాలన్నదే ఆమె తాపత్రయం.అలాంటి సమయం లో ఓ రోజు పొరుగూరికి వెళ్లి వస్తుండగా…

అమ్మా  ..!నే నిమ్మలంగ వత్తగని మీరు నడువుండ్రి.అన్నాడు సైదులు.

అదేన్దిరా …!వచ్చిన పనైనంక నికి ఉర్లేంపని ?కొడుకా?కొత్త తావులకు ఎరిగినోళ్ళు లేని ఊర్లకు ఏకాకిగా పోవద్దని ఎన్కటెన్నడో పెద్దోళ్ళు చెప్పిండ్రు గని,మీరు ఒండ్రి ,నేనటెన్కత్తనని కొత్త ముచ్చట చెప్పకు.నడువ్..!అని వీర్లచ్చిమి సైదులును రమ్మంటుంటే…రాజయ్య మాత్రం ,

నీ యాడి  పెత్తనంకున వారెయ్య.వాన్నేమో!గా తీర్గ రా.. రమ్మని గడమాయిన్చవడితివి ?వాడేమన్న పాల్జీకె పోరడానే?దెంక పోను?ఎన్కటి శాత్రాలు అయ్యి ..ఇయ్యి అనుకుంట వానెనుక వడుతవ్? నాడు వాడెప్పుడన్నరానీ.అని ఆమెను మళ్ళీ మాట్లాడనియ్యకుండా నోరు మూయించి రెడీ గా ఉన్న బస్ ఎక్కించి తనూ ఎక్కి ,

నువ్ నిమ్మళంగనే రా ..రా..!కొడుకా…!అన్నడు.

బస్ బయలుదేరింది.వీర్లచ్చిమికి బస్ ముందుకు తమ ఊరు వైపు పరగు పెడుతుంటే ఆమె మనసంతా కొడుకు సైదులు మీదకే  వెనుకకే మరల సాగింది . ఎక్కడెక్కడ తిరిగి వస్తడో?కనీసం జేబులోని డబ్బులయినా తీసుకోకపోతినికదా!అనుకోని ఆ మాటే భర్త తోనూ అన్నది.

అయ్యా …!సైదులు గాని దగ్గర బస్ చార్జీలమందమే ఉంచి మిగతా పైసలు తీస్కరాక పోతిమిగదా?పైసలు ఎక్కువ తక్కువ లేకుంటేనన్న సక్కగ వచ్చునేమో!అన్నది మెల్లగ .

కొట్టకుండ తిట్టకుండ వడివెట్టి వట్టలు తీసుడంటే గిదేనే!వాని తాన పైసలు దీస్కొనత్తె వాడు ఎంత తిప్పల వడ్తడు ?ఊరి గాని ఊర్లె?మా జెప్పినవ్ గని తియ్ !మల్లగిన అనేవ్.అన్నాడు కసురుకుంటూ.

ఈర్లచ్చిమికి రాజయ్యమిడ కోపం తోని అరికాలి మంట నెత్తి కెక్కినట్టున్నా బస్సుల పరువు తీసుకోలేక నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నది.

అమ్మానాన్నలు బస్ లో తమ ఊరికి కదలగానే సైదులు బస్టాండ్లాగా ఉన్న రావి చెట్టుకింద ఉన్న సారాయి దుకాణం లో దూరాడు.

                       ****

జాజులూ ..జాజులూ …!ఇలారా బిడ్డా ..!మంచం లో మూలుగుతూ జ్వరం తో పడుకున్న జాజులమ్మ తండ్రి పిర్య కూతిరిని ప్రేమగా పిలిచాడు .

ఏందే ..?నాయ్నా ..?ఏమనిపిత్తాంది?చెప్పు ?అనుకుంటూ తండ్రి నుదురు మీద చెయ్యి వేసి అడిగంది.

సచ్చం జెప్పాల్నా బిడ్డా..?నేను నీ లగ్గం జేయ్యకున్తనే ఒడుత్తనేమోననిపిత్తాంది.అన్నాడు.

గదేందే..?బాపూ …!మిన్నిరిగి మీద వడ్డట్టు ఒక్కపారే గంట మాటంటివి?గీ పాటి జేరానికే సచ్చుడు బతుకుడు అనుకుంటే ఎట్లా?నువ్వేం ఫికరు జెయ్యకు!రెప్పొధ్ధటీలి ఆచారి గారింటికి పోయి మంచి మందు చేపిచ్చుకత్త.

అన్నది తడి  బట్టతో తండ్రి ఒంటిని తుడుస్తూ చల్లబరుస్తూ.

ఎడ్డిబిడ్డా ..!నీకు పీ మిఇడ కచ్చిపోతున్న జేరమే కనబడతాంది.మరి నాకు ?లోపల నీ నెత్తిన ఇన్ని అచ్చ్చింతలు పడేసెంత తాహతు నాకున్నదో లేదోనన్న మనాడే మసలుతాంది .అదే గిట్ల జేరమైతాంది.

ముగ్గురు మొగ పోరగాన్డ్లేనాయే!పిల్లలు లేని ఇల్లు పీరీల కొట్టమన్నట్టు ఆడపిల్ల లేని ఇల్లు గూడ అసొంటిదేనని మీయమ్మ ,నేను కాయిశు వడికనవడ్డ దేవుని కల్ల మొక్కి కాళ్ళు కడిగే ఫలం దక్కనిమ్మని వరాలు వడితే నువ్ పుట్టినవ్.ఎర్రగా జాజి పువ్వోలే అందంగా ఉన్నవని మీయమ్మ నీకు పేరు సుత జాజులమ్మనే పెట్టుకునే.మాయదారి నల్లతాచు పాలబడి జీవిడిశె.మీ యన్నలు ఎవనికి వాడు పనెత్కుంట కూడేడుంటే గూడాడన్నట్టు ఓ పొద్దు ఈడుంటే ఇంకో పొద్దు ఏ ఊర్లనో అన్నట్టు తిరగవట్టిరి.

బిడ్డా..!వాళ్లకు నీ లగ్గం మీద యావ ఇసుమంతయినా లేదు.ఎవనిచ్చ వాడు లగ్గాలు జేసుకున్నరు.వాళ్ళ రేవు వాళ్ళు  జూసుకున్నరు.ఇగ నిన్ను నేనే ఏ రేవన్న చెయ్యాలె.ఏం జె య్యల్నన్నాచేతిలో దమ్మిడీ లేకపాయే…అని దుఃఖం తో గొంతు పూడుకు పో తుంటే మాట్లాడుతుండగా,జాజులమ్మ..,

నాయ్నా..!ఎనుకటిదంతా మున్ధటేసుకొని ఎందుకే ఏడ్తవ్?నీకేం గాదు.నాకు నువ్వున్నవ్.అది చాలు.నువ్వే నా ధైర్నం.నువ్విట్లా డీలా పడితే నేను సుత దైర్నం జెడుత.అని వారించింది.

ముసలోడు పొళ్ళను ఏకాకిగ ఇడిశి  పెట్టి పోయిండు,లగ్గం జెయ్యకుంట అవుతలవడ్డడు.అని ఎన్నితీర్ల తిట్టుకున్నా తప్పులేదు బిడ్డా!నేనెంత తండ్లాడుతున్నా,కుదురుతలేదాయే !

ఇవన్నీ జూడపోయినా,పిల్ల కుందన మైతే మాకేంది?చెక్కనమైతే మాకేంది?పెట్టువోతలు,వరదక్షిణ మె త్తిత్తవో చెప్పమనవట్టిరి.ఈడికి ఇరవయి మంది సూసిపోయిరి.మొన్నా గా పొద్దు మంగలేన్కటి ,

ఇగ నువ్వు మొదటోనికేమిత్తవ్?గని ,మారు సంబందపోల్లనన్న జూడుమనే!పిల్ల జెల్లలు ఉన్టేంది?కడుపు కింత కమ్మగా దిని కంటి నిండా నిద్రన్న పోతది.అని ఎకసెక్కాలాడ వట్టె.! అని తండ్రి పడుతున్న ఆవేదన చూసిన జాజులమ్మ …,

బాపూ ..!ఇగ నువ్వు నా లగ్గం గురించి ఒక్క మాట మాట్లాడినా నా మీద ఒట్టే .నువ్వు నిమ్మళంగా ఉంటేనే నేనింత తినట ,లేకుంటే ఊరిడిశి యాడన్న బోతా!అన్నది.

జజులమ్మ ఈ తీరుగా మాట్లాడేసరికి పీరయ్య ఇంకేమీ మాట్లాడలేక మౌనం గా రోదించాడు.

పట్ట పగలు జరిగిన ఈ ముచ్చటంతా ఆమెకు ఆ రాత్రి పూట నిద్ర ను కరువు చేశాయి.

తండ్రి ,మనాదికి మందు లేదన్నట్టుగాతన మీద నె బెంగ పెట్టుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడని తాను తన తండ్రికి భారం కాకూడదని కళ్ళెదురుగా తిరుగుతుంటే ఇలాగే మదన పడుతాడని ఇంత కంటే తానే ఏ బావి లోనైనా దూకి చచ్చి పోవాలని నిర్ణయించుకుంది.

తండ్రి పాదాలకు దండం పెట్టి ఊరవతల విసిరేసినట్టున్న తమ గుడిసెల నుండి బయటపడి అర్ధరాత్రి ఒంటరిగా బావిని వెతుక్కుంటూ నడవ సాగింది.

సరిగ్గా అప్పుడే ఉరుము మెరుపు లేకుండా ఏదో మాయ లా హోరు మని వర్షం మొదలయింది.

వర్షాన్ని సైతం లక్క చెయ్యకుండా వడి వడి గా అడుగులు వేస్తూనే ఉంది.హఠాత్తుగా ఆమె కాళ్ళకు అడ్డంగా మెత్తగా ఏదో బలంగా తగిలి ,తూలిపడబోయింది.చిమ్మ చీకటి.

ఒక్కక్షణం …

మెత్తగా తగులుతుంటే ఇది ఖచ్చితంగాఏదో పామో ..!కుక్కో ..!నక్కో ..!అయి ఉంటుందనుకొని ఇవ్వాల తన పని అయిపోయినట్లేనని మనసులో అనుకుంటూనే …,

‘రోటిలో తల దూర్చి రోకటి పోయుకు వెరువ దీరునా?అన్నట్టు చావడానికి బయలుదేరి ఈ మాత్రం దానికే భయపడితే ఎలా?అని తనను తాను సమాధాన పరుచుకుంటూ ఒక్కసారి ఛమక్ మన్న మెరుపు వెలుగు లో చూసి అదిరిపడింది.

స్పృహ లేకుండా తలకు దెబ్బ తగిలి పది ఉన్న మనిషి.అందునా ..మగమనిషి.ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అతడు ,పగలు సారాయి దుకాణం లో చేరి పీకల దాకా తాగి ఇంటి దారి పట్టి దారి లో ఇలా తూలిపోయి బాటలో నున్న పోటురాయి పై పడి తలకు గాయమైన సైదులు.

చిక్కటి వర్షం అందునా ఊరికి కొత్త.అయిన వారినే ఆదుకొనే పరిస్థితి లేని ఈ కాలాన ఇలాంటి వర్షం లో ఎవ్వరూ పట్టించుకొనే పరిస్థితి లేక పోవడం తో దారికడ్డమై జాజులమ్మ పాదాలకు తగిలాడు.

జజులమ్మ తన పని మరిచి పోయింది.అతని దీనావస్థనుచూసి నిలువెల్లా కరిగి పోయి కరుణ కురిసి ఆ వర్షం లో తడిసి ముద్ధవుతూనే అతన్ని బలవంతంగా లేపడానికి ప్రయత్నిస్తూ బలమంతా ఉపయోగించి ఈడ్చుకుంటూ పాడు పడిన దేవాలయపు కళ్యాణ గద్దె మీదకు చేర్చింది.

ఆ కప్పు కింద అతడిని ఎలాగైనా కాపాడాలన్న ఆలోచనల్లోనే ఇంకా తడవని ఎండు చిత్తడి అంతా అతగాడి దగ్గరకు చేర్చి పక్కనే ఉన్న చెకుముకి రాళ్ళను ఒకదాని తో ఒకటి రాపిడి కలిగించి మంట పుట్టించింది.

చిత్తడంతా తెస్తూ మంటను ఎగదోస్తూ అతడికి వేడి తగిలేలా చేసిన ప్రయత్నం వృధా పోలేదు.వర్షం కూడా మందగించగా అతడి గాయానికి తన చీర కొంగు ను చింపి గట్టిగా కట్టుకట్టింది.దెబ్బ పెద్దది కాకపోయినా,కడితే మంచిదన్న ఉద్దేశ్యం తో అలా చేసింది.

దూరంగా నక్కల ఊళలు.ఎగిసిపడుతున్న మంటలు.స్పృహ లేకుండా అతను.

జాజులమ్మ కు ఆ దృశ్యం స్మశానాన్ని గుర్తుకు తెచ్చింది.భయం గుప్పిట్లో అతడి మిహాన్నే చూస్తూ మంటను ఎగదోస్తూ తానూ చలి కాచుకుంటూ ఆలోచనల్లో పడింది.

పాక లో అనారోగ్యం తో కుక్కిన పేను లా మంచానికే కరుచుకున్న తండ్రిని వదిలి పెట్టి తను బయలు దేరిన పనేమిటి?ఇప్పుడు చేసినదేమిటి?

బంధాలన్నీ తెంచుకుని శాశ్వతంగా ఈ లోకం నుండి నిష్కర మించాలని అనుకున్న తను,ఎవరో తెలియని ఒక మగ మనిషి ప్రాణాలు కాపాడడానికి సాహసించడమేమిటి?ఇప్పటికైనా,తను వచ్చిన పని పూర్తి చేసుకోవచ్చుకదా!

అవును నేను చచ్చి పోవాలి.అంటూ లేచి 

అమ్మా…!అన్న మూలుగులు వినిపించి వెనుతిరిగింది.

అతను కళ్ళు తెరవకుండానే మూలుగుతున్నాడు.

చలికి బాగా వణుకుతున్నాడు కూడా.మంట తగ్గు మొహం పట్టింది .అయ్యో ..!పాపం..!వనుకుతున్నాడని మళ్ళీ చిత్తడి పోగేసి మంట పెంచింది.అతడు కాస్త వెచ్చబడి చేతులను కాళ్ళ ను దగ్గరగా ముడుచుకొని పడుకోవడం తో,

అతని లోని కదలిక ను చూసి హమ్మయ్య..!అనుకొని ,

అచ్చంగా ఇతనున్నట్టే పాక లో నాయ్న ఉన్నాడు.నేను చచ్చిపోతే రేపటి నుండి ఇలాగే దిక్కు లేని వాడి లాగే పడుంటాడు.

అవ్వ పొయిన సంది కళ్ళల్లో వత్తులు వేసుకొని పెంచి పెద్ద చేసిండు.అలాంటి వాన్ని ఇలా వదిలివేసి తను చనిపోయి నాయ్ననూ ఆకలికి చంపటం ఎంతవరకు సమంజసం?అయినా తనెందుకు చావాలి?

పెళ్లి యే జీవిత పరమావధా?

ఆడ పిల్లలు పెళ్ళిచేసుకొని వెళ్ళిపోతే,మగ పిల్లలే వారిని సాదాలా?

మగపిల్లలు నిర్లక్ష్యంగా వదిలి వేస్తే వాళ్ళు అలాగే నరకం అనుభవించాలా?

పెళ్లి లేకుండా ఆడడానికి బతుకు లేదా?

పెళ్ళయిన తరువాత భర్త చనిపోతే ఇక ఆమె గతి అంతే కదా!అలాంటప్పుడు పెళ్లి అయినా కాకున్నా పెద్ద తేడా ఏముంది?

ఇలా ఆమెలో ఎన్నో ప్రశ్న ల వర్షం కురుస్తున్డగానే, 

తండ్రి  బాధను తీర్చేయాలనే చావుకు సిద్ధపడ్డ తను,ఇప్పుడు మళ్ళీ ఆ రెక్కలు విరిగి నిస్సహాయుడయిన తండ్రిని అమ్మలా సాకవలసిన బాధ్యత తన మీద నే ఉందని,తను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకొని అక్కడే కూర్చుంది పోయి పాక కే వెళ్ళాలనుకున్న ఆమె అలాగే నిద్ర లోకి జారుకుంది.

          ****

ఈర్లచ్చిమికి కంటిమీద కునుకు లేదు.అర్ధరాత్రి దాటుతున్నా కొడుకు సైదులు జాడ కనిపించక పోవడం తో మాటి మాటికి వాకిలి లోకి బజారు లోకి కొడుకు రాక కోసం కనుచూపుమేర వరకు చూసి వస్తూనే ఉంది.

మతి మాటికి కాలు గాలిన పిల్లిలా ఇంట్లోకి బయటకు తిరుగుతున్నా ఇర్లచ్చిమి ని,

మంచినీళ్ళు తాగడానికని లేచిన భర్త రాజయ్య ..

ఏందే?ఇంకా పండలే?ఆడికీడికి రాత్రిపూట దెయ్యమోలె ఏం పనికి తిరుగుతానవ్?అన్నడు.

నీకు నిద్రెట్ల పడ్తాందయ్య?చెట్టంత కొడుకు నది రాత్రైనా ఇంటికి ఇంకా రాక పాయే నని ఇసుమంతైనా రంది లేక …కనీసం ఆ యావ గూడ లేకుండా దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంటివి.?మీది కెళ్ళి వర్షం గూడ పడవట్టే.సల్లటి గాలి కూడా ఇసరవట్టే.

పోరడు బగ్గ తాగిసోయి లేకుండా యెడ సిక్కుక పోయిండో అని నేను తండ్లాడ్తాంటే …!అన్నది.         

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.