యదార్థ గాథలు

పరిమళించిన పరిమళ జీవితం

-దామరాజు నాగలక్ష్మి

పరిమళ  ఇద్దరన్నలకి అపురూపమైన చెల్లెలు. చెల్లెలిని చాలా ప్రేమగా చూసుకునేవారు. ఏదీ కాదనకుండా ఇచ్చేవారు. అన్నలంటే కూడా పరిమళకి అంతే ప్రేమ.  

చదువులో ఎప్పుడూ ముందుండే పరిమళ స్కాలర్ షిప్పుల మీద చదువు కొనసాగించింది. డిగ్రీ పూర్తవుతుండగా పెద్దన్న కామేశ్వర్ ఫ్రెండ్ సుదర్శన్ కి పరిమళ నచ్చింది. పెళ్ళి చేసుకుంటాను అన్నాడు. కానీ పరిమళకి చదువు పూర్తవ్వందే పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. అదే మాట చెప్పింది. 

సుదర్శన్  పరిమళా నువ్వు ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంత వరకూ చదువుకో, ఉద్యోగం కూడా చేద్దువుగాని అన్నాడు. 

అన్నలైన కామేశ్వర్, రామారావులు పరిమళని పెళ్ళికి వప్పించారు. పెళ్ళి చాలా వైభవంగా జరిగిపోయింది. 

పరిమళా సుదర్శన్ లు ఎటువంటి గొడవలు లేకుండా చాలా సంతోషంగా వుండేవారు. పరిమళకి డిగ్రీ మంచి మార్కులతో పాసయ్యింది. తరవాత ఉద్యోగానికి అప్లై చేస్తానని చెప్పి ప్రయత్నాలు మొదలు పెట్టింది.  మంచి పేరున్న కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 

ఒక ఆదివారం సుదర్శన్, పరిమళ ఇల్లంతా సద్దుకుంటున్నారు. సుదర్శన్ స్టూలు మీద ఎక్కి ఏదో అందుకోబోతుండగా అక్కడ నుంచి కింద పడ్డాడు. పరిమళ పరుగెత్తుకుని వచ్చేలోపునే లేవడానికి ప్రయత్నించాడు. నేలమీద పడినప్పుడు తలకి తగిలిన దెబ్బకి కళ్ళుతిరిగనట్లు అనిపించి నేలమీద అలాగే పడుకున్నాడు. 

పరిమళ  లోపలికి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి, సుదర్శన్ ని లేపింది. ఎంతకీ లేవట్లేదు. ఏమిటిలా నిద్రపోయాడు అనుకుంటూ బాగా తట్టి లేపింది. ఎటువంటి చలనం లేదు. చాలా కంగారు పడింది. ఊపిరి బాగానే తీసుకుంటున్నాడు అనుకుంటూ… పెద్దన్నకి ఫోన్ చేసింది. 

అన్నదమ్ములిద్దరూ కంగారు పడుతూ వెంటనే బయల్దేరి వచ్చారు.  పరిస్థితి చూసి హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. డాక్టర్లు చూసి ఒక 24 గంటలు చూద్దాం అన్నాం. 24 గంటలు కాదు కదా… 48 గంటలైనా లేవలేదు.  పరిమళకి ఊహించుకున్నఅందమైన జీవితం అంధకారం అయినట్లు అనిపించింది. ఏమవుతోందో ఆలోచించలేకపోయింది. 

నిరాసక్తంగా కూచున్న పరిమళకి అన్నలు ధైర్యం చెప్పారు. ఎవరేం చెప్పినా తన జీవితం తనదే అనుకుంది.  డాక్టర్లకి కూడా అర్ధం కాని పరిస్థితి అయిపోయింది. ఎవరో స్పెషలిస్టులని పిలిచి చూపిస్తున్నారు.  ఇంచుమించు కోమాలోకి వెళ్ళినట్లయిపోయింది పరిస్థితి. ఇలా ఎన్నాళ్ళో తెలియదు. 

తనకి తనే ధైర్యం తెచ్చుకుంది పరిమళ. హాస్పిటల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కావడంతో సుదర్శన్ అక్కడ వున్నా… తను ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టింది. ఆఫీసునుంచి రాగానే ఆసుపత్రికి వెళ్ళి రాత్రంతా సుదర్శన్ పక్కనే వుండేది. పక్కనే కూచుని అతనితో మామూలుగా ఉన్నప్పుడు కబుర్లు చెప్తున్నట్లుగా మాట్లాడుతుండేది. 

ఒకరోజు పరిమళకి చాలా నీరసంగా, తలతిరుగుతున్నట్లు అనిపించింది. డాక్టర్ కి చూపించుకుంటే గర్భవతి అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అవసరమా అనుకుంది. తర్జన భర్జన పడుతోంది.  హాస్పిటల్ లో వున్న లేడీ డాక్టర్ సునంద ధైర్యం చెప్పి, సుదర్శన్ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. ఈలోపున  మేమందరం నిన్ను చూసుకుంటాము. నువ్వు నిరాశగా వుండకు అని చెప్పింది. 

పరమళకి పరిస్థితులు ధైర్యం చెప్పినట్లు ఒకలాంటి మొండితనం వచ్చింది. ఏమైనా సరే నా జీవితాన్ని నేనే చక్కదిద్దుకోవాలి అనుకుంది. సుదర్శన్ ఇప్పటికి నెల రోజుల నుంచీ హాస్పిటల్ లోనే వున్నాడు ఒక వారం రోజులలో మామూలు మనిషి అయి ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంది. 

ఒక రోజున సుదర్శన్ పక్కన కూచుని పేపర్ చదువుతోంది. మంచానికి దగ్గరలో వుందేమో.  సడన్ గా ఏదో అలికిడి వినిపించింది. మంచం మీదకి చూసేసరికి సుదర్శన్ దగ్గు వినిపించింది. ఆశ్చర్యంగా అలాగే చూస్తోంది.  మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ నోట మాట రావట్లేదు. కళ్ళనించి నీళ్ళు కారుతున్నాయి. 

అప్పుడే  రూంలోకి వచ్చిన సిస్టర్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయింది. ఒక్క నిమిషం మళ్ళీ తేరుకుని డ్యూటీలో వున్న డాక్టర్ ని పిలుచుకు వచ్చింది.  డాక్టర్ వచ్చేసరికి పరిమళ సాయంతో సుదర్శన్ కూచోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 

డాక్టర్ వారించి హార్ట్ బీట్, బి.పి. అన్నీ చెక్ చేసి అన్నీ నార్మల్ వున్నాయి. మాకే ఆశ్చర్యంగా వుంది.  మీరింక రెండు రోజులు వుండి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నీ బాగానే వున్నాయి అన్నాడు.  ఈ రెండు రోజులు హడావుడి పడకండి అని బలానికి కొన్ని మందులు రాసి, సాయంత్రం ఒకసారి తలకి స్కానింగ్ తీద్దాం అనేసి వెళ్ళిపోయాడు.  

సుదర్శన్ కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు. పరిమళకి చెప్పలేనంత సంతోషంగా వుంది. రెండురోజుల్లో ఇంటికి వెళ్ళిపోయారు.  పరిమళ మన ఇంట్లోకి మూడో వ్యక్తి వస్తున్నాడని చెప్పేసరికి సుదర్శన్ చాలా సంతోషించాడు. మెల్లి మెల్లిగా మామూలు ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 

పరమళ ఏమాత్రం నిరాశపడకుండా తనకోసం పడిన కష్టానికి కృతజ్ఞతలు చెప్పాడు. పరిమళ కొన్నిరోజులు సుదర్శన్ ని ఇంట్లోనే వుండమని చెప్పి, తను 9వ నెల వచ్చేవరకు ఆఫీసుకి వెళ్ళింది. 

కొన్నాళ్ళకి పరిమళకి పాప పుట్టింది.  సుదర్శన్ ఉద్యోగానికి వెడుతున్నాడు. ఇద్దరూ పాపని చూసుకుంటూ చాలా సంతోషంగా వున్నారు. తన ఆత్మ స్థైర్యమే తనకి ఇంత ఆనందాన్ని ఇచ్చిందని పరిమళ అనుకుంటూ వుంటుంది. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.