యుద్ధం ఒక గుండెకోత-2
(దీర్ఘ కవిత)
-శీలా సుభద్రా దేవి
మానుషత్వానికీ అమానుషత్వానికీ
అక్షరతేడా ఒకటి మాత్రమే
ఆచరణ అనంతం
సంబంధ బాంధవ్యాలను సమూలంగా సమాధిచేస్తూ
సంస్కృతీ శిఖరాలను భుజాలకెత్తుకుంటూనే
సంఘజీవనాన్ని అపహాస్యం చేస్తూ
నేలనున్న చిరుమొలకలని విస్మరిస్తున్నారు
ఆలోచనల్ని కత్తిరించేసిన తొందరపాటు
వివేకాన్ని విస్మరింపచేసిన ఆవేశం
మనిషిలో మానవత్వాన్ని నిక్షిప్తంగా తొక్కేసి
రాక్షసమాస్కుని ముఖానికి తగిలించుకొని
ప్రపంచ శాంతి కుటీరంలో
విధ్వంసక వీరంగం చేస్తోంది
బిత్తరపోయిన పావురాలు
ప్రతిదేహానికీ అతిథి కావాలని
ఆకాశ విహారానికి బయల్దేరి
ప్రశాంతతకు వినాశకాలం లేదని చెప్తూనే
ప్రతిదేశం ముంగలిలోనూ రంగవల్లుల మధ్య
రక్తపుష్పాలై రాలిపోతున్నాయి
రక్త సంబంధాల్ని నేలరాలుస్తూ
మానవ సంబంధాలు
వ్యాపార లావాదేవీలుగా మారినప్పుడే
తొలి యుద్ధ మొలకకి నీరందింది
నేలా గాలీ నీరు మొక్కకి జీవనాధారాలే
ఇప్పుడు ఇక్కడ ఏదీ ఎవరికీ స్వంతంకాదు
ఆధిపత్య వ్యాపారి చేతి నీటితో
దప్పిక తీర్చుకుంటున్నప్పుడే
తొలి యుద్ధమొలక చిగురేసింది
ప్రపంచ దేశాలన్నీ తెలియకుండానే
వాస్తవాధీన రేఖల్ని దాటుతూనే ఉన్నాయి
యుద్ధమొలకకు గొప్పులు తవ్వుతూనే ఉన్నాయి
అదే ఇప్పుడు –
మనిషిని మించిపోయి
వాతావరణాన్నంతట్నీ ఆవరించుకొన్న వృక్షమై
యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది
తెలిసీ తెలియని తొందరపాటుతో
చిన్న గడ్డిపరక తలెత్తితే
తననీడని దోచేసుకుంటున్నదని విరుచుకుపడుతోంది
అప్పుడే –
సరిగ్గా అదే క్షణాన
రాక్షస నీడని ఢీకొని
శాంతిపావురం రెక్కలు చచ్చుపడ్డాయి
*****
(ఇంకా ఉంది)
రాక్షస మాస్క్ లు , రక్తపుష్పాలు. యుద్ధపు మొలకలు – సార్ధక పదప్రయోగాలు. 👌
ధన్యవాదాలు సుశీల గారూ