రచయిత్రీ, చిత్రకారిణీ, అసామాన్యగృహిణి శివరాజు సుబ్బలక్ష్మిగారు! (నివాళి)
-నిడదవోలు మాలతి
శివరాజు సుబ్బలక్ష్మిగారు కథలు రాస్తారని నాకు చాలాకాలంగానే తెలుసు కానీ నేను చదివినవి చాలా తక్కువ. అది కూడా ఎప్పుడో కొన్ని దశాబ్దాలక్రితం.
నిజానికి బుచ్చిబాబుగారికంటే ఆవిడే బాగా రాస్తారని కూడా విన్నాను. అంచేత, 2006లో ఇండియా వచ్చినప్పుడు, హైదరాబాదునించి ఫోను చేసేను వారికథ ఏదైనా పంపితే అనువాదం చేసి తూలిక.నెట్ సైటులో వేసుకుంటానని. ఆవిడ “అలాగే మామనవడితో చెప్తాను” అన్నారు. ఆతరవాత మళ్లీ ఇప్పుడే, అదీ ముఖాముఖీ కలవడం. అంచేత నాకెంతో వుత్సాహంగా వుంది. సౌమ్యతో చెప్పి, నువ్వు కూడా వస్తావా అంటే వస్తానంది.
ఆగస్టు 23, 2009 శనివారం ఉదయం నేనూ, మాఅన్నయ్యా, సౌమ్యా బెంగుళూరులో సుబ్బలక్ష్మిగారింటికి వెళ్లేం. మేం వారింట వున్న గంటన్నరసేపూ ఆవిడ హాయిగా నవ్వుతూ, హుషారుగా ఇల్లంతా కలయదిరుగుతూ ఎన్నో కబుర్లు చెప్పేరు. తాను వేసిన పెయింటింగ్స్ చూపించేరు. ఆపక్కనున్న బాపు ఫొటో చూపించి తమకి బంధువులని చెప్పేరు.
“ఆవిడే బాపూకి బొమ్మలెయ్యడం నేర్పింది,” అన్నారు సుబ్బారావు.
తాను స్వయంగా పెట్టిన టీ, బిస్కెట్లూ, తెచ్చి, బల్లమీద పెట్టి, టీలోకి యేలకులు వొలుస్తూ కబుర్లు చెబుతుంటే ఎంత ముచ్చటగా అనిపించిందో చెప్పలేను.
“నాకు ఎనభైనాలుగేళ్లు,” అన్నారు మామూలుగా (ఇప్పుడు 85. సెప్టెంబరులో పుట్టినరోజు). ఆవిడ దత్తత తీసుకున్న మనవడు, సుబ్బారావు, “వంట ఆవిడే చెయ్యాలి. టీ ఆవిడే పెట్టాలి” అంటూ ఆప్యాయంగా ఆవిడకథలమీదా, బుచ్చిబాబుగారి కథలమీదా తన అభిప్రాయాలు చెప్పారు. నేను ఇంటర్వూ అనుకుంటూ వెళ్లలేదు కానీ ఆవిడ స్వభావతః రచయిత్రి కనక మాసంభాషణ అంతా సాహిత్యంమీదే నడిచింది.
తనపుస్తకాలు అడిగినవాళ్లందరికీ ఇచ్చేశాననీ, తనదగ్గర అట్టే లేవనీ చెప్పి, తనదగ్గర వున్న నాలుగు పుస్తకాలు మాత్రం తెచ్చి చూపించేరు. మూడు కథాసంకలనాలూ (కావ్యసుందరి కథ, మగతజీవి చివరిచూపు, ఒడ్డుకి చేరిన కెరటం), ఒక నవల (నీలంగేటు అయ్యగారు). తనకి బాగా నచ్చిన నవల “తీర్పు” అన్నది తరుణ మాసపత్రికలో ధారావాహికంగా వచ్చిందిట. కానీ ఇప్పుడు ఆవిడదగ్గర కాపీ లేదు.
జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రిగారు వాళ్లింట్లో చనువుగా తిరిగే ప్రముఖరచయితలలో ఒకరు. ఆవిడ కథలని “మనసులోంచి వచ్చినవి” అని మెచ్చుకున్నారుట. వయసుకి పెద్దే అయినా, “నన్ను పిన్నీ అని పిలవొచ్చా” అని అడిగారు. ఎందుకంటే బాపు అలా పిలుస్తున్నాడని. “దానికేంవుంది అలాగే పిలవమన్నాను” అన్నారు నవ్వుతూ.
ఆయనే ఒకసారి “ఆ నవలకంటె నాకు మీకథలే బాగున్నాయి” అని కూడా అన్నారుట.
“ఏ నవలండీ?” అని అడిగేను.
“అప్పటికే ‘చివరకు మిగిలేది’ వచ్చేసింది’ “ అని ఆవిడ చిన్న నవ్వుతో చెప్తుంటే మాకందరికీ కూడా నవ్వొచ్చింది.
ఆ వెంటనే నేను, “మాటొచ్చింది కనక అడుగుతున్నాను. ఆ నవల నేను ఈమధ్య మళ్లీ చదివేను. సౌమ్య కూడా చదివింది. ముందు మీరు మీఅభిప్రాయం చెప్పండి. తరవాత మేం మా అభిప్రాయాలు చెప్తాం” అన్నాను.
దానిమీద చిన్న చర్చ జరిగింది. సుబ్బలక్ష్మిగారు, “అందులో వర్ణనలూ, గోదావరీతీరంలో మనుషులనీ చిత్రించినతీరు బాగున్నాయి. కొందరు పాత్రచిత్రణ బాగులేదు అంటారు కానీ అందులో ఆయన చిత్రించింది ఒక్క దయానిధి మనస్తత్త్వం మాత్రమే. అది బాగా చేసేరు,” అన్నారు.
“దానికి సీక్వెల్ రాద్దాం అనుకున్నారా?” అని అడిగింది సౌమ్య.
“ఆయన ఏం రాయాలనుకున్నారో అది రాసేరు. దయానిధి మనసులో సంఘర్షణ రాయాలనుకున్నారు. రాసేరు,” అన్నారావిడ.
సుబ్బలక్ష్మిగారి మొదటి నవల “నీలంగేటు అయ్యగారు” ఎమెస్కోవారు 1964లో ప్రచురించారు. “నాగరీకులం, మాదే నాగరీకత అనుకునేవాళ్ల బతుకుల్లో చీకటీ, చీకట్లో బతుకుతున్నాననుకునే పొన్ని కళ్లద్వారా చూపించే కొత్తపద్ధతి నవల” అన్నారు ప్రచురణకర్తలు ఈనవలని.
పనిమనిషి పొన్నికోణంనుండి పెద్ద అయ్యగారింట జరిగే భాగోతం వివరించిన కథ నీలంగేటు అయ్యగారు.
మామూలుగా మన కథల్లో పనివాళ్లు కోకొల్లలు. అయితే అవన్నీ మధ్యతరగతి రచయితలు మధ్యతరగతి కుహనావిలువలు ప్రామాణికంగా తీసుకుని ఆకొలతలతో ఆవిష్కరించిన పాత్రలే. “అనాగరీకుల“యిన పనివాళ్ళు అమాయకంగా మోసగింపబడుతూనో, మోసపోతూనో ఉండే జనాలే. సుబ్బలక్ష్మిగారికథలో పొన్నిని ఒక బలమైన వ్యక్తిత్వంగల పాత్రగా చూస్తాం.
“పనిమనిషికోణంలోనుండి ఆవిష్కరించాలని మీకు ఎందుకు తోచింది?” అని అడిగేను నేను.
“నేను చూసేను. మనం పనివాళ్లని ఏదో అనుకుంటాం కానీ వాళ్లు చాలా విషయాలు గమనిస్తారు.” అన్నారు సుబ్బలక్ష్మిగారు. ఇది నాకు కూడా ఇష్టమయిన కోణం. చదువుకున్నవారిలో కంటే చదువుకోనివారిలోనే లోకజ్ఞానం ఎక్కువ. వాళ్లకున్నతెలివితేటలు పైతరగతివాళ్లలో తక్కువే అని నేను కూడా అనుకుంటాను. అంచేత ఆ నవల అమెరికా ఇంటికొచ్చేక మాలైబ్రరీలో చూడాలి అనుకున్నాను.
మాలైబ్రరీలో సుబ్బలక్ష్మిగారి పుస్తకాలన్నీ వున్నాయి. నాకు అట్టే టైము లేకపోవడంవల్ల గబగబ పేజీలు తిరగేశాను. “నీలంగేటు అయ్యగారు” నవల ప్రారంభంలోనే ఆసక్తికరంగా అనిపించింది నాకు. మొదటిపేరాలోనే రచయిత్రి భావుకత వెల్లడవుతుంది.
“నీలంరంగు గేటులోంచి గుత్తులుగా పూసిన తెల్లగులాబీ గుబురుగా చూడముచ్చటగా కనిపించి దారిన పోయేవారిని క్షణమయినా నిలబెడుతుంది. దూరంగా మైదానం చివర గుడిసెలో వున్న పొన్నమ్మ కూతుళ్లని వెంటేసుకుని ఇంటిపనులకోసం తిరుగుతోంది. అసలావీధిలో సగం ఇళ్లు తనవేనంటుంది. తను పని చేసుకు బతికినవే.”
మొదటివాక్యంలో ఒకతెల్లగులాబీ ప్రత్యేకతని వివరించేరు. పొన్ని కూడా తెల్లగులాబీలాగే ప్రత్యేకత సంతరించుకున్న వ్యక్తి. తాను ప్రవేశించిన నీలంగేటు అయ్యగారిజీవితంలో క్షణం కాదు శాశ్వతంగా నిలిచిపోయిన దీపశిఖ. ఇంటిపని కోసం తిరుగుతున్న పొన్ని “ఆవీధిలో సగం ఇళ్లు తనవేనంటుంది”. తనవేనని చెప్పుకోగల ఆత్మస్థైర్యం వుంది పనిమనిషి పొన్నికి.
ఆతరవాతి పేరాలో “అసలు సంగతి చెప్పదు” అంటూనే రచయిత్రి పొన్ని పూర్వకథ క్రోడీకరించి అసలుకథలోకి వచ్చేస్తారు.
పొన్ని గేటు తెరిచి లోపలికి అడుగెట్టబోతూంటే ఇంటివారి కుక్క ఆమెమీదికెగిరి చీరె చింపేసింది. ఎముకల్నించి చర్మాన్ని వేరు చేసింది. ఇంతలో కారొచ్చింది. కారులోంచి దిగిన ఎర్రటి, లావుపాటి తెల్లబట్టలమనిషి పైసలివ్వబోతే పుచ్చుకోదు.
“అది ఛస్తే ఆ ఉసురు మనకి” అని ధర్మగుణం చూపించి, పనివాడితో డాక్టరుదగ్గరికి తీసికెళ్లమని చెప్పి లోపలికి పోతాడాయన, ఆ తరవాత పొన్ని వారింట్లో పనిమనిషిగా కుదురుతుంది. వాళ్లు అదేదో కొండలకి ఆరోగ్యంకోసం వెళ్తూ, పొన్నిని కూడా తీసుకెళ్తారు. “అదేదో కొండలకి” అనడంలో రచయిత్రి సూక్ష్మదృష్టికి తార్కాణం. కథ పొన్నికళ్లలోంచి కనక ఆ కొండలపేర్లు పొన్ని చెప్పగలభాషలోనే ఉండాలి మరి.
అయ్యగారు వాళ్లతాహతుకి తగ్గట్టు ఆమెకి కట్టూ, బొట్టూ మప్పుతారు. అచిరకాలంలోనే అయ్యగారికి పొన్ని స్నేహితురాలయిపోతుంది. తనబాధలు చెప్పుకుంటారు దానికి. దాని కష్టసుఖాలు కనుక్కుంటారు. ఆయన మనసు చలించినప్పుడు “తమరు రాములోరంటోరు” అంటూ తప్పుకుంటుంది మర్యాదగా. అమ్మగారు, కోడలు, … అందరికథలూ పొన్ని ఏదోవిధంగా వింటూనే వుంటుంది. ఆఖరికి, ఇంట్లో కొడుకూ, కోడలూ, భార్యా … అందరూ తలో దారీ అయిపోయినతరవాత, అయ్యగారు జీవనసత్యాలను మననం చేసుకుంటున్నప్పుడు ఆయనకి మార్గదర్శకురాలుగా మిగిలింది పొన్నే. ఎందరో పనిమనుషులు వచ్చి పోయారు కానీ పొన్నిలాటి పనిమనిషి ఆయనకి మళ్లీ దొరకదు. పొన్ని గ్రహించుకున్న జీవితసత్యాలు ఆయనకి అర్థమవుతాయి. ఇది మనుషులగురించి రచయిత్రికి గల సూక్ష్మపరిశీలనకి నిదర్శనం.
సుబ్బలక్ష్మిగారి “మగతజీవి చివరిచూపు” సంకలనానికి ఆశీర్వచనము (ముందుమాట) రాస్తూ, సుప్రసిద్ధకవి ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు ఆమె శైలిగురించి ఇలా అంటారు, “ఈనాడు వస్తున్న కథలు ఇవి స్త్రీలు రాసినవి, ఇవి పురుషులు రాసినవి అని పోల్చుకోడానికి వీలు లేకుండా వుంటున్నవి. సుబ్బలక్ష్మిగారి కథలలోని విశిష్టత ఏమిటంటే వీటిలో చాలా భాగం ఇవి స్త్రీ మాత్రమే రాయగలదు అనిపించడం. పురుషుడు స్త్రీప్రకృతిని చిత్రించినప్పుడు అతడెంత నిపుణరచయిత అయినా పురుషనేత్రాలలో ప్రతిఫలించిన దృశ్యాలను మాత్రమే అతడు చిత్రించగలడు. స్త్రీలస్వభావాన్ని సాటి స్త్రీ వర్ణించినప్పుడు ఆ వర్ణన అన్యూనాతిరిక్తంగానూ, వాస్తవికతకు సన్నిహితంగానూ వుండడంలో ఆశ్చర్యం లేదు. … … ఈర్ష్యలతోనూ, ఆసూయలతోనూ, సంకుచితమైన స్వార్థదృష్టితో కూడిన ఈనాటి మనజాతికి అద్దం చూపించి తద్ద్వారా సంస్కరింపజూడడం ఈకథల లక్ష్యం అని చెప్పవచ్చు.” ముందు ముందు సుబ్బలక్ష్మిగారు “భర్తకంటె మంచికథలు రాయాలని నేను ఆశీర్వదిస్తున్నాను” అంటూ ముగించారాయన.
ఈసందర్భంలో నాకు మరొకవిషయం స్ఫురణకొస్తోంది. దంపతులిద్దరూ రచయితలయినప్పుడు రకరకాల వ్యాఖ్యానాలు వింటుంటాం. భర్తమూలంగానే భార్యరచనలు ఆదరణ పొందుతున్నాయనీ, అసలు భర్తే రాసి భార్యపేరుమీద ప్రచురిస్తున్నారనీ అనడం సర్వసాధారణం. ఈవాదనని ఖండించడానికి ప్రయత్నించడం నీడతో యుద్ధం చెయ్యడమే. పాఠకులు ఎవరికి వారే ఆ భార్యలరచనలు చదివి తమకి తాము నిర్ణయించుకోవాలి.
ఆమాటే ఆవిడమనసులో కూడా స్ఫురించిందేమో అన్నట్టు, సుబ్బలక్ష్మిగారు, “నేను వర్ణనలు మానేశాను. ఎందుకంటే ఆయన్ని చూసి కాపీ కొట్టేనంటారని” అన్నారు. నిజానికి ఆమె కథనంలో స్వతస్సిద్ధమయిన భావుకత పుష్కలంగా వుంది.
తనకథలగురించి మాటాడుతూ, “అందరూ ‘మనోవ్యాధికి మందుంది’ అంటారు కానీ నాకు చాలా నచ్చినకథ ‘ఒడ్డుకి చేరిన ఒంటికెరటం’” అన్నారు. ఆకథ ఏమిటంటే “ఆవిడ విడో. ఇంట్లోంచి బయటకొస్తేనే సాధించేవాళ్లూ, ఎదురొస్తుందనీ ... అలాంటప్పుడు అన్నగారు తన పిల్లల్ని అప్పచెప్తాడు. ఆవిడ అదేదో ఘనంగా అనుకుని, త్యాగం చేసి వాళ్లిద్దర్నీ పెంచుతుంది. ఉన్న ఆస్తి ఇంప్రువ్ చేయించి … పొలాలు బాగుచేయించి. కానీ వాళ్లుకూడా ఆవిడని సరిగ్గా చూడరు. కానీ ఆవిడ ఏదో ఆశించి చేయలేదు. తనఅన్న తనకి అప్పచెప్పాడు. అది తనకర్తవ్యం. అంతే.” అన్నారు. నాలుగురోజులకిందట లైబ్రరీకి వెళ్లి చూశాను. “ఒడ్డుకు చేరిన ఒంటికెరటం” అనువాదం చేసి తూలిక.నెట్లో పెడదాం అనుకుంటున్నాను త్వరలోనే. కారణాంతరాలవల్ల చేయలేకపోయేను.
ఆవిడ జ్ఞాపకశక్తికి మాత్రం జోహారు అనకతప్పదు. నాకంటే 12 ఏళ్లు పెద్ద అయిన సుబ్బలక్ష్మిగారు తాము రాసిన ప్రతికథలో ఇతివృత్తం, ఆకథవెనక కథ చెప్తుంటే నేను అవాక్కయిపోయేను. (నేనయితే కిందటేడు రాసినకథ కూడా మరోసారి చూడకుండా చెప్పలేను.)
సంఘంలో స్త్రీస్థానం పట్ల ఆమెకి నిర్దుష్టమయిన అభిప్రాయాలున్నాయి.
“స్త్రీ వంటింట్లో వుంది” అంటారు కానీ వంటిల్లు ఇంట్లో చాలా ముఖ్యమయిన స్థానం. భర్త బాధ పెడుతున్నాడని స్త్రీ ఇల్లు వదిలి వెళ్లిపోకూడదు. ముఖ్యంగా పిల్లలున్నస్త్రీలు వదిలి వెళ్లకూడదు. బయటికి వెళ్తే మాత్రం సుఖపడుతుందా? అదీ లేదు. భర్తని వదిలేసిందంటారు. పిల్లలు అన్యాయం అయిపోతారు. పుట్టింటివాళ్లు ఆదుకోడం మనసాంప్రదాయంలో వుంది కానీ అక్కడా సుఖంలేదు. అక్కడ మరదలికి చెయ్యాలి. డబ్బుంటే, ఆడబ్బు వాళ్లకి పెడితే. ఎందుకు పెట్టిందంటారు. డబ్బు లేకపోతే, మేం పోషిస్తున్నాం అంటారు.”
1998లో వేదగిరి రాంబాబు ప్రచురించిన “శివరాజు సుబ్బలక్ష్మి కథలు” సంకలనానికి ముందుమాటలో కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
“ఏది జరిగినా విడిపోవాలనే ఆలోచన రాకూడదు. అది కట్టుబాట్లని వెక్కిరించి … వివాహం అనే పదానికి అర్థం లేకుండా చేస్తుంది. అమ్మ అమ్మగానే పెరిగి ఆత్మాహుతికి ప్రతిబింబంగా తనదనే ప్రత్యేకతని అమ్మ అనే పదానికి అలంకరించాలి” ”
ఇలాటి అభిప్రాయాలు మనకి ఇప్పుడు కఠోరంగా వినిపిస్తాయి కానీ సందర్భాన్నిబట్టి అర్థం చేసుకోవాలి మనం. యాభై, అరవయ్యేళ్లక్రితం స్త్రీల పరిస్థితికి అనుగుణంగా ఆమె అభిప్రాయాలు వెలిబుచ్చారు ఆమె. (నేనిలా అంటున్నానని మీరేం అనుకోకండి అని కూడా అన్నారు నాతో!). అయితే ప్రస్తుతపరిస్థితులు గమనించి తదనుగుణంగా అబిప్రాయాలు మార్చుకున్నట్టు కనిపించలేదు. ఇది కూడా ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనమే. కొందరు ఆనాటి రచయిత్రులు 80వ దశకంలో స్త్రీవాదులమంటూ ప్రకటించుకున్నారు. సుబ్బలక్ష్మిగారిరచనలలో బలమైన స్త్రీపాత్రలు ఉన్నా, ఈవాదనలజోలికి పోకపోవడమే విశేషం.
నాకు అవతల మరోమీటింగు వుంది కనక ఆరోజు చర్చ అంతటితో ఆపవలసివచ్చింది. మళ్లీ కలిస్తే ఈ విషయం మరింత స్పష్టంగా చర్చించాలి అనుకున్నాను.
ఇటీవల రచయితపేరు పత్రికలో కనిపించకపోతే. “మీరు రాయడం మానేశారేం” అని అడగడం మనకి ఆనవాయితీ అయిపోయింది. నామటుకు నాకు ఈప్రశ్న న్యాయంగా తోచదు. స్వతఃసిద్ధంగా స్ఫూర్తిగల రచయితలెప్పుడూ రాయడం మానరు. మనసులో కథలూ, కవితలూ పచనం అవుతూనే వుంటాయి. ఒకొకప్పుడు కాగితంమీద పెట్టడానికి టైం పట్టొచ్చు. ఒకొకప్పుడు రాసి, ప్రచురణకి పంపకపోవచ్చు. సుబ్బలక్ష్మిగారు ఈచివరికోవలోకి వస్తారు.
“టీవీలో న్యూస్ చూసినప్పుడు దానిమీద ఓకథ రాసేస్తారు. అలాటివి చాలా వున్నాయి,” అన్నారు వారి అబ్బాయి సుబ్బారావు.
“నేను ఇప్పుడు నాజ్ఞాపకాలు రాస్తున్నాను. అప్పుడు ఆవూళ్లో వున్నాం. ఇప్పుడు ఈవూళ్లో వున్నాం అని కాక జరిగినవిషయాలు రాస్తున్నాను,” అని సుబ్బలక్ష్మిగారు తాను స్వదస్తూరితో రాస్తున్న కాగితాలు తెచ్చి చూపించారు. ఇప్పటికి 10-12 పేజీలవరకూ రాసేరుట.
అవి చూస్తుంటే నాకు మనసు పరవశించింది. ఆ రోజుల్లో మేం అందరం కాగితంమీద కలం పెట్టి చేత్తోనే రాసేవాళ్లం. తుడుపులూ, కొట్టివేతలూ లేవు. కట్ ఎండ్ పేస్ట్ లేదు. స్పెల్ చెకర్ లేదు.
“మీరు మళ్లీ తిరగరాస్తారా?” అని అడిగితే,
“లేదు, ఎలా తోస్తే అలా రాసుకుంటూ పోవడమే! మళ్లీ రాయడానికి బద్ధకం,” అన్నారు నవ్వుతూ.
“అవి నాకివ్వండి. తూలికలో పెడతాను” అని అడిగేను.
“అనువాదం చేసి పెడతారా?” అని అడిగింది సౌమ్య
“ఎలా పెట్టడానికైనా నాకు అభ్యంతరం లేదు. వున్నవి వున్నట్టు ఆమె దస్తూరితోనూ, ఆంగ్లంలోకి అనువదించి కూడా పెట్టగలను. నాకు అలాటి కథలు కావాలి,” అన్నాను.
సుబ్బారావు స్కాన్ చేసి పంపుతానన్నారు. కానీ ఏకారణంచేతో పంపలేదు.
“చేస్తాడు. ఏదైనా కావాలంటే చేస్తాడు.” అన్నారు సుబ్బలక్ష్మిగారు చిరునవ్వుతో. తను రాసుకోడానికి వాడుతున్న కాగితాలగురించి చెప్తూ, “వాడు ఆఫీసు పనికోసం తెచ్చుకున్నకాగితాలమీద రాసేస్తాను చిన్నపిల్లలాగే. నేను చిన్నపిల్లనే. పుస్తకంలో రాయడం అదీ ఏంలేదు,” అంటూ నిష్కల్మషంగా నవ్వుతుంటే, జీవితాన్ని ఆస్వాదించడం క్షుణ్ణంగా అర్థం చేసుకున్న మహామనీషి అనిపించింది నాకు.
సుబ్బలక్ష్మిగారు ద్రోణంరాజు సూర్యప్రకాశరావు, సత్యవతి దంపతులకు రెండవపుత్రిక, ముగ్గురు అన్నదమ్ములూ, ముగ్గురు అక్కచెళ్లెల్లమధ్య. సుబ్బలక్ష్మిగారి పుట్టినతేదీ గురించి చెప్పుకోవాలి. ఫ్రఖ్య వంశీకృష్ణ కథనం ప్రకారం ఆవిడ పుట్టినతేదీ సెప్టెంబరు 17, 1925 (సుజనరంజని, మే 2005). నీలంగేటు అయ్యగారు నవల వెనకఅట్ట మీద కూడా ఇదే తేదీ వుంది. కానీ వేదగిరి రాంబాబు ప్రచురించిన “శివరాజు సుబ్బలక్ష్మి కథలు” (1998) వెనకఅట్టమీద ఆమె పుట్టినరోజు 7-12-1925 అని వుంది.
తారీకులు, దస్తావేజులమాట – మనకాలంలో ఇంకా జీవించి ఉన్నవారి పుట్టినతేదీల విషయంలోనే ఇంత నిర్లక్ష్యం అయితే, ఎప్పుడో పూర్వకవుల కాలనిర్ణయం గురించిన చర్చలు తలుచుకుంటే నవ్వు రాదూ?
సుబ్బలక్ష్మిగారు తండ్రిదగ్గర సంస్కృతకావ్యాలు చదువుకున్నారు. పన్నెండవ యేట, శివరాజు వెంకట సుబ్బారావుగారితో పెళ్లి అయింది. ఆయన బియే పూర్తి చేసుకుని యం.యే. చదవడానికి మద్రాసు వెళ్లేరు. మద్రాసులో ఆదంపతులిద్దరికీ అనేకమంది ప్రముఖ రచయితలూ, చిత్రకారులూ, కవులతో పరిచయం అయింది.
“శివరాజు సుబ్బలక్ష్మి కథలు” (28 కథలు) సంకలనం ముందుమాటలో సుబ్బలక్ష్మిగారు తనకీ, బుచ్చిబాబుకీమధ్య గల బాంధవ్యాన్ని హృద్యమంగా, మరోకథగా మలిచారు.
కథలు ఎందుకు రాస్తారంటే, “ఉన్నదానితో సమాధానపడే మనసున్నవాళ్లకి ఇవి కావాలి, అవి కావాలన్న కోరికలు తక్కువే వుంటాయి. … కానీ వాళ్లమనసు కూడా తనకనే ప్రత్యేకత కావాలని పరితపిస్తుంది. .తనభర్త తన వునికిని గుర్తించాలన్న తపన …” అంటూ, గతాన్ని గుర్తు చేసుకుంటారు. గోదావరి గట్టుపై కూర్చుని ఈకథ ఇట్లా పూర్తి చేస్తే ఎట్లా వుంటుంది. అట్లా అడిగితే, తనకి ఎంతో గౌరవం ఇస్తున్న అనుభూతి మనసులో ముద్ర వేసుకుని… (అది) ఓకథ. …
ఇలా తనజీవితంతో ముడిపెట్టుకు ఆసంకలనంలో కథలు ఎలా మలిచేరో చెప్పినతీరు చూస్తే రెండూ మమేకమయినట్టు ఉంది కానీ ఏది స్వవిషయమో, ఏది కల్పనో స్పష్టం కాదు.
బుచ్చిబాబుగారికీ తనకీ గల ఆత్మీయత, అనుబంధం ఎలా చెప్పేరో చూడండి,
“మీరు కథలు రాస్తే నేను కథలు రాసేను. మీరు బొమ్మలు వేస్తే నేను బొమ్మలు వేసేను. .. మిమ్మల్ని గురువులా తలపోశాను. సన్నిహితుడిలా అరమరికలు లేకుండా మనసు విప్పి చెప్పుకున్నా. ..”
అంటూ ప్రేమపూర్వకంగా తనసంకలనాన్ని ఆయనస్మృతికి అంకితమిచ్చారు. సుబ్బలక్ష్మిగారి హృదయంలో బుచ్చిబాబుగారు చిరంజీవి.
నిజానికి సుబ్బలక్ష్మిగారి కథలూ, జీవితమూ క్షణ్ణంగా పరిశీలించి, సమగ్రమయిన అవగాహనతో రాయవలసిన అవసరం వుంది.
గంటన్నరసేపు క్షణాలమీద గడిచిపోయింది. నాకు అవతల మీటింగుకి టైమయిపోతోందని బయల్దేరేం. “మళ్లీ ఎప్పుడు చూస్తామో .. “ అని నేను అంటుంటే, “చూడం అనకండి” అన్నారావిడ! అచ్చతెలుగు సంప్రదాయం!!
వాళ్లబ్బాయి ఆటో స్టాండుకి తీసుకొచ్చి దిగబెట్టేడు మమ్మల్ని.
రచయిత్రీ, చిత్రకారిణీ, అసామాన్యగృహిణీ అయిన శివరాజు సుబ్బలక్ష్మిగారితో ఓపూటలో సగంసేపు – ఏనాటికీ మరిచిపోలేని అనుభవం.
ఫిబ్రవరి 6, 2021నాడు 95వ ఏట దివంగతులైయిన శివరాజు సుబ్బలక్ష్మిగారు సాహితీప్రపంచంలో ప్రత్యేకస్థానం సంతరించుకున్న రచయిత్రి.
*****
నిడదవోలు మాలతి ఏడు దశాబ్దాలుగా కథలు రాస్తున్నారు. 2001లో తూలిక.నెట్ ప్రారంభించి, మంచి కథలు ఇంగ్లీషులోకి అనువాదాలు చేసేరు.. ప్రధానంగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను విదేశీయులకి కథలద్వారా తెలియజేయాలన్న ఆశయంతో మొదలుపెట్టిన సైట్ అది. 2009లో తెలుగు తూలిక బ్లాగు ప్రారంభించి తమ కథలు, వ్యాసాలు, సమీక్షలు, కవితలు ప్రచురిస్తున్నారు. ఆమెసాహిత్యం ఆమెబ్లాగు www.tethulika.wordpress.comలో చూడవచ్చు. కథాసంకలనాలు, వ్యాససంకలనాలు అన్నీ తెలుగు తూలిక బ్లాగులో e-Book formatలో ఉచితంగా లభ్యం. స్వాతంత్ర్యానంతరం, తెలుగు రచయిత్రులు అసామాన్యమైన ప్రాముఖ్యం సంపాదించుకున్నారు. ఆ ప్రాముఖ్యతకి వెనుక గల సాహిత్య, సామాజిక, ఆర్థిక, కౌటుంబిక పరిస్థితులను విశ్లేషిస్తూ రాసిన పుస్తకం Women writers, 1950-1975. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ.
శివరాజు సుబ్బలక్ష్మి గారితో జరిపిన సంభాషణ తో బాటు వారి నవల పరిచయం చేసే విధానం హృద్యంగా గా ఉంది.సుబ్బలక్ష్మిగారి సాహిత్యం, జీవితం రెండూ వేర్వేరు కాదనేది మీరు చాలా బాగా తెలియజేసారు.పరిపూర్సుణ జీవితం గడిపిన సుబ్బలక్ష్మిగారికి సరియైన నివాళిని సమర్పించారు మాలతి గారూ