గోపికాబొమ్మలు
-వసంతలక్ష్మి అయ్యగారి
మొన్న సంక్రాంతికి ముందూ వెనుక …రెండుమూడు పేరంటాలకి వెళ్లివచ్చాను.మా కొత్త ఫ్లాటుకొచ్చాకా గేటుదాటి బయట యిరుగుపొరుగు నాకు బొత్తిగా ఎవ్వరూ తెలియదు.నలుగురి తో పరిచయాలిష్టపడతానుకనుక పిలిచినచోటకల్లా వెళ్లాను.కొత్త కనుక ”సునిశిత పరిశీలనకుపెద్దపీటవేసి కూర్చోబెట్టి …నోటికి చిన్నిషీల్ తాళంవేశాననొచ్చు.‘‘
నా మూలాలు తూగోజీ కోనసీమవే అయినా…ఊహ తెలిసినప్పటినుండీ హైదరాబాదీ నే!అంచేత భాష అర్థమవకపోవడం వంటి యిష్యూస్ అస్సలు లేవు.పైగా అన్నియాసలమాధుర్యాన్ని ఆస్వాదిస్తాను,ఆనందిస్తాను,తనివి తీరా!!
ముక్కనుమ నాడు సాయంత్రం నేను వెళ్లిన వారిల్లు పేరంటాళ్లతో సందడిగా అప్పటికే ఉంది.ఆవిడముందురోజు సంకష్టహరచతుర్థి నోము పట్టారట…కేవలం సంకష్టని మాత్రమే అంటున్నారు..పేరంటాళ్లతో!!
అంతలోనే నాలాంటి సంశయొకరు “సంకష్టికి ఏంచేస్తవక్కా..సంకటిగినచేసితినాల్నా ‘అంది. “లే అక్కా ..ఒక్కపొద్దుండాలే”అనిమొదలెట్టి బ్రీఫ్గా నోముగురించిచెప్పారు!
ముందురాత్రి పంతులయ్య తొమ్మిదికొచ్చి బెల్లంపాకం పట్టిన నువ్వులను కొండగా చేసి పూజచేస్తారట.వాయనంలో పండు తాంబూలంతో పాటు యీ నువ్వు పట్టీ కూడా చేర్చి మరునాడు తాంబూలంతో పంచుతారట.ఆమె ఒకపొద్దుండి రాత్రి పూజైనంకనే ఫలహారంతిన్నదట!.
ఇంతలోసంశయ…‘‘నువ్వులు గుట్టలెక్క పోషుడేనా …”
”లే అక్కా…బెల్లంతోని పాకంగట్టికొండలెక్కపెట్టాలే.పూజమొత్తం అయ్యవారే చేస్తడు‘‘
దేవుడి గదిగానీ..పూజలందుకున్నదేవుణ్ని గానీ చూడమని ఎవరినీ లోపలికి రమ్మనలేదు.అంతా విశాలమైన డ్రాయింగు రూమ్ కే పరిమితం!
ఆవిడకు అయిదుగురు పెళ్లిళ్లైన అమ్మాయిలూ,కొడుకూ,కోడలూ నట.అత్తమామలతో అంతా కలిసిఓయాభైమందుండగలిగినంత యిల్లు!!తోటికోడళ్లంతా యీమధ్యే చుట్టుపక్కల్లోనే ఎవరిళ్లు వారు కట్టుకుని విడివడ్డారట.కానీ పేరంటానికందరూ హాజరై కళకళలాడుతోందిల్లంతా!అమెరికాలోనున్న ఆడపిల్లలు తప్ప అక్కడకి మిగతా చాలా బంధువర్గం విచ్చేసి సరదాగా మాటల్లో మునిగి తేలుతున్నారు.
వీరుగాక బయటివారంతా యీవిడకు గుడిలో తరచు కలుసుకునే నేస్తాలని నాకిట్టే అర్థమైందనుకోండి.అందరూపెద్దలేననవచ్చు.నన్ను పిలిచిన ఆనిండైన యిల్లాలు సాదరంగా నన్ను గేటులోనే రిసీవ్ చేసుకోవడమే కాదు..‘‘రండక్కా ”అంటూ ఆలింగనమొనర్చారు.ఖంగు తిన్న నేను…ఏమోలే..నాకంటే చిన్నావిడేమో..లేదా నేను నాకే తెలీనంత ముసలైయ్యానేమో..అనుకుంటూ హాల్లో సెటిలయ్యాక అర్థమైంది …మిత్రబృందంలో ప్రతివారు మరొకరికి అక్కేనని!డౌటెక్కడొస్తుందంటే..అక్కడున్నవారంతా మాబాగా ఒడ్డూ పొడవూ ఉండిఅచ్చం గోపీబొమ్మలనబడే మెగా సైజు గొబ్బెమ్మల్లా ఉన్నారు.
పైగా నా హోస్టు గారు…హెడ్ గొబ్బమ్మ.లేదా గోదా గొబ్బెమ్మ అనిపించారు.సింపుల్ గా మీకు చెప్పాలంటే…నామటుకునేనో సన్నజాజి తీగలా ఉన్నాననేసుకునిదూదిపింజలా ఫీలై ఓ రీలు వేసుకున్నాను.
అదిసరే…‘’అసలావిడ ”తనసైజుకుతగ్గట్టే నుదుట పెట్టుకున్నపేద్దసైజు కుంకుమబొట్టు,తలకి జారుముడి,జరీ చీరమాటటుంచి అందమైన మెరుపుగుళ్లతో కుట్టిన డిజైనర్ బ్లౌజు…చేతికీమూలనుండి ఆమూలవరకు రంగురంగుల చెంకీలద్దిన గాజులు…కాళ్లకి మెరుపులపట్టాలూ!!మోకాళ్ల ఆపరేషనును ఏమాత్రం ఖాతరు చేయని చలాకీ చురుకుదనం..డ్రెస్సింగేకాదు..వారి చతురోక్తులసరససంభాషణలు వింటుంటే లేచివెళ్లబుద్ధికాలేదు.
ఇంతలో ప్లేట్లలో కచోరీ కి ఆలూ చిప్పులు చేర్చి టీయిచ్చారు.వేళతోనూ,వయసుతోనూనిమిత్తముండని చిరుతిండి ”చిప్”!!అందరూ లాగించనారంభించాం.తెలివిమీరిన తిండిప్రియులుకచోరీలో మసాలాను దులిపేసి లాగించారు…జాగ్రత్తపరులుకడుపులో జాగా లేదంటూ జరిపేశారు!సరుకు తాజాగా ఉందని ముక్తకంఠంతో చిరునామా తెలుసుకోగా జనరల్బజార్ లో మహంకాళీ గుడి ఎదురుంగుండే లవ్లీ దుక్నంలైతేనే గంతమంచిగుంటయని తేల్చి చెప్పారు.ఔనక్కా..బేసన్పల్లీలు,బాదంబర్ఫీలు,సకినాలు,బూందిలడ్డు,కొబ్బరుండలు,కాజుపట్టీలు,యిట్ల వందరకాలుదొర్కుతై యాడ..అని మరోయిల్లాలు ఉవాచ!నాసీపీయూలోకి మరింతసమాచారమనమాట!!
ఇంతలోనే ఆల్చమైపోయిందమ్మా…అనుకుంటూ వాళ్లమెయిడూ వస్తూనే లోపలికెళ్లిపోయి,యిల్లూకే గుడ్డ కొత్తదొకటి తెస్తూ,మరోచేత చిక్కటి పసుపు ముద్దను కాస్తపలచనచేసి యెంతో ప్రొఫెషనల్ గా వంగికూర్చుని ముత్తైదువలఅనుమతులు తీసుకుంటూ పాదాలకిందపట్టాపరచి పసుపు ను వైనంగా,పట్టించినతీరు పేరంటానికే సొబగులద్దినట్లనిపించింది.అంతలోనే ఓ తోటికోడలు గదమాయింపు..‘‘ఏంయాదమ్మా..యీ మద్దెల నువు పసుపుకుంకానికి రమ్మంటేగూడ కతలువడ్తున్నవూ..యేదో అంటరు పెద్దోల్లు..నువ్ జెప్పక్కా…”
‘‘ఆఁ.గదేందో అంటరుగాదూ..గిదీనికి మాత్రమూ…పిల్వంగనే..ఉరుకులాడుకుంట ఊర్లుగూడదాటిపోవ్వాల్నంట‘‘!!
పాతకతలు మనకెందుకుగానీ..తనపని ముచ్చటగా ముగించి యాదమ్మజంపిచ్చేసింది లోపలికి.గదులుపాడవకుండా యింటావిడ పట్టావేయిస్తే..మనమ్మలక్కలున్నారే…తీరొక్కపోజులిచ్చియింటికాడ బెడ్షీట్లన్నికరాబైతయనివాపోవడం చూస్తే నాకు మరోసారి నవ్వాగలేదు.
ఆఁ..యీమధ్య పేరంటానికి జంపకానాలుపరిచే కాన్సెప్టే గాయబ్!దీవాన్లు,కుర్చీలు..రిక్లైనర్లు,సోఫాలూనూ!
మరోపక్క చిన్నలు తమకంటే పెద్దలకు వంగి దండాలెట్టేయడం….అర్చకులుసంస్కృతం లోదీవెనెలిచ్చే లెవెల్లో దీవిస్తున్నట్టు పెద్దలు పెదవులుకదిపేయడం గమనించి ముసిముసిగా నవ్వుకున్నాను.
సరేసరిఅందివ్వగానే.. పసుపుకుంకాలద్దేసుకుంటూ…క్షణంపాటు కళ్లు మూసేసిప్పపంచానికి ప్రదర్శించుకునే పతిభక్తి,తాళిబొట్ల గలగలలు,గంధం పరిమళాలు,తలలో పూలుచెక్కుకోవడాలు యాంత్రికంగా జరిగిపోతున్నాయి! వేడుకలంటే యివే మరి!
మాయిళ్లల్లో వాయినం చీరకొంగులోకి తీసుకుంటూ…యిస్తినమ్మా వాయనం అని యిచ్చే ఆవిడంటే…పుచ్చుకొంటినమ్మా వాయనం ..అంటూ మూడేసిసార్లు గొణుగుడు సాగుతుంది.అలా వరుసగా హాలంతాకాసేపు గొణుగుణుధ్వనులు గుట్టుగా జరిగిపోతున్నాయి.అయితే యిక్కడి వారు వాయనమిస్తూ ‘‘ నేనిస్తి..నేనిస్తి”అంటుండగా అసంకల్పితంగా నేను..నాకిచ్చినపుడు..,” నేపుస్తి..నే పుస్తి”అనేశాను..గొణుగే కనుక వేరెవ్వరికీ తెలీలేదు.కానీ మీకందరికీ యీముక్కచెప్పే వరకూ నాలోనేను జపించి తపిస్తూనే ఉన్నానంటే నమ్మండి!
”మాఅత్తమ్మ చేషిన నోములన్నీ ఆమెచేయమని జబర్దస్తి చేయకున్నగాని…పెల్లైనకాడికెంచి నేనుగూడ అన్ని పట్టిన…!!‘‘అందాయింటావిడ.మాది
జైంట్ ఫామిలీ( joint)అని బోలెడు జోకులు నవ్వుతూనే చెప్పారు.“పదమూడేండ్లకే పెండ్లి జేషేషి నన్ను యింట్లకెల్లి యెల్లగొట్టిన్రు‘‘అంటుంటే…నాకు నవ్వాగదే..!!
‘‘షీషలల్ల లీలు [నీళ్లనమాట]నింపమంటే ధబ్ మని కిందేషేషే దాన్ని…అన్నిషీషలూగట్లనేపలగగొట్టిన..‘చిన్నగున్నను‘గదా..“అంటూంటే ..మరీ నవ్వాగడంలేదు..!!
[ఆపుకున్నాననుకోండి]…ఆవిడత్తగారూ ఓ మూల జారినభుజాలు బుజబుజమంటూకులికారు.బాగా పెద్దావిడ..నడుముకుబెల్టు శ్రద్ధగా పెట్టుకుని,కళ్లకి జోడేకాదు చేతికర్రకూడా ధరించారు.
.‘‘యిగ పద్నాలుగువడేవరకు నాకు మా పెదపాప పుట్టేషింది“ అన్నారు…వామ్మో..!అనుకున్నా..[అనలే.]!
అపుడు మరో ముదుసలి మహిళందుకున్నారు….“ఆఁ చిన్న గున్నగానీ మస్తు నేర్చుకోని..మంచిగనే అన్నిపనులు జేషేటోల్లం.గిప్పుడూ …వేజ్ (age)లొచ్చినంక చేసుకున్నగానీ..యీకాలం ఆడపిల్లలకేంపనొస్తదనీ…కొబ్బరికాయకొట్టుడుగూడషేతకాదు..ఊదుబత్తి సూపినట్టు గోల్ గోల్ గ తిప్పుతున్నరుదాన్నిగూడ!యిగయేమనాలే?‘‘అన్నారు.అందరూ గొల్లుమన్నారుకనుక నేనూ గొల్లాను…దాచుకున్నపాతభళ్లుని జోడించేసి.
అంతలో మరో వీరవనితారత్నం గిరిజగారు అందుకుని…
‘‘నేనైతే మాయింట్ల ఒవ్వలుకూ బయపడ..ఎందుకుబడాలే…నాకొడుకుకుగూడా..”
అంతలో మరో జాణగారన్నారూ..‘‘ మీరు అంకులుకే బయపడరుగదాంటీ’‘
ఔగదా..ఎందుకుబయపడాల్నమ్మా..నాక్దెల్వకడుగుతా..మనమేం తప్పుచేషినమని..రెక్కలు ముక్కల్జేస్కోని పెంచినం..ఉత్తపున్నానికి పెద్దగైన్రా?‘‘
“అయ్యో..గంతమాటనకు గిజ్జక్కా…నేనైతే నాకోడల్నేమన్నఅనాల్నన్నగానీ..కొడుకుకోపమైతడని గమ్ముగుంట”…..‘‘కదక్కా..”అంటూ నాకేసి చూశారు …హోస్టు …భారీ గొబ్బెమ్మ!
ప్రస్తుతానికి ఆ సీనుకి తటస్థంగా తలూపాను.
అపుడుగిజ్జక్క..‘‘యిప్పటికైతె నేనిట్లనే ఉంట…పిల్లలకు బయపడుడేందనీ…?”
ముసలావిడందుకుని బాంబులాంటి వేయివరహాల ఛమక్కు విసిరారు.
”మంచిగన్నవ్..మన కడుపులకెల్లి ఆల్లు పుట్టిన్రు బిడ్డా..ఆల్లకడుపులమనమైతే బుట్టలేకదా‘‘
వామ్మో …మళ్లీ నవ్వులపువ్వులు వెల్లువలా విరిసాయి.
ఇంకా చాలా పేలాయి .పేలుతూనే ఉన్నాయి,,
అలా …అక్కడున్నఆడవారంతా ఎంతెంతో సంపన్నులు.ధనకనకవస్తువాహనాదులేకాదు …భారీకాయాలుసైతం వారి సొంతం.ఐతేనేం…ఏమాత్రం తమనీ,తమ జీవితాలను బరువనుకునిబాధపడటం లేదు.చిద్విలాసం…సావకాశం..వారికి వరం!చికాకులకు దూరం!
వారి సంభాషణల్లో ఎక్కడా జీవితాశయాలనో…జీలకర్రనో….
కెరియరనో..మిరియమనో..ఒత్తిడనో…కొత్తిమీరనో…టార్గెట్టూ ..తాటిచెట్టూ అంటూ బేజారులు ఏవీ లేవు!అనిర్వచనీయమైన అమాయకత్వం..మంచితనం…వారి సొంతం. సంబరమేప్రధానమన్నట్టుగా యీ హోమ్ మేకర్లూ,హౌస్హోల్డర్లూ,,,సరదాలు చేసుకోవడం నాకు చాలాఅంటే చాలా నచ్చింది.
హాఁ..మాయిళ్ల్లో వెళ్లొస్తామండీ అంటూ వెడలుతాం.మంచిదమ్మా..అని అటువారు శలవిస్తారు.వీరు వెంటనే అనే మాట…“పోయిరా అక్కా..మల్లరావాలే..ఎప్పటికి వొస్తనే ఉండాలే!!“అంటూ ముక్తాయింపు స్వరంలా మళ్లీ మళ్లీ మనం ఫేడౌటయ్యేదాకా వల్లెవేస్తారు.
*****
అయ్యగారి వసంతలక్ష్మి
24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను.
హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను.
పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ స్వచ్ఛందంగా 2010 లో గావించాకా పలు టీవీ చానెళ్లలో రాజకీయాలపై ప్రసారమైన కామెడీ కార్టూన్లలో పలువురు మహిళా నాయకుల .. మరెందరో యితరకార్టూన్ క్యారెక్టర్లకు గళపోషణ గావించి తెలుగురాష్ట్రాల్లో ఏకైక మహిళా మిమిక్రీ కళాకారిణి గా పేరు తెచ్చుకున్నాను.
సంగీతమంటే ప్రాణం. వంటిల్లు వదలడం అంటే బాధ!లలితమైనా శాస్త్రీయమైనా ..పాట విని నేర్చుకుని పాడగలిగే ప్రతిభ వుంది. ప్రస్తుతం యేడాదిగా వసంతవల్లరి పేరున యూట్యూబ్ చానెలు పెట్టి పలువురు ప్రముఖుల కథలను నా గళంలో అందిస్తున్నాను.