అనుభవాల దారుల్లో…
సిలికాన్ లోయ సాక్షిగా- డా||కె.గీత కథల సంపుటిపై సమీక్ష
-డా. నల్లపనేని విజయలక్ష్మి
ఆంధ్రుల కలల తీరం అమెరికా. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇంటికొక్కరు ఉన్నత విద్య కోసమో, ఉద్యోగాలను వెతుక్కుంటూనో రెక్కలు కట్టుకొని అమెరికాలో వాలుతున్నారు. అలా వెళుతున్న వారిలో కవులు, రచయితలు కూడా ఉంటున్నారు. వారు తమ అనుభవాలను, అనుభూతులను, సంఘర్షణలను, మాతృభూమి నుండి వెంట తీసుకొని వెళ్ళిన జ్ఞాపకాలను తమ రచనల్లో వ్యక్తీకరించడంతో గత రెండు దశాబ్దాలుగా తెలుగులో డయాస్పోరా సాహిత్యం ఊపందుకున్నది. విభిన్న సంస్కృతులకు నెలవైన అమెరికా సమాజ చిత్రాన్ని సమగ్రంగా మన ముందుంచిన ‘సిలికాన్ లోయ సాక్షిగా’ కథా సంపుటి తెలుగు డయాస్పోరా సాహిత్యహారంలో మణిపూస.
పుట్టి పెరిగిన వాతావరణానికి, సంస్కృతికి, బంధువులకు దూరంగా వెళ్ళిన వారు తమకు పూర్తిగా కొత్తదైన వాతావరణానికి, సంస్కృతికి, భిన్న నేపథ్యాలు గల స్నేహితులకు దగ్గరయ్యే క్రమంలో ఎంతో సంఘర్షణకు గురవుతారు. వారు ఎదుర్కొనే అనుభవాలు, మానసిక వేదనలు ఇక్కడి వారికి పెద్దగా పట్టవు. తమ పిల్లలు భూతల స్వర్గంలో నివసిస్తున్నారన్న విశ్వాసం ఇక్కడి వారిది. గ్రీన్ కార్డులు, వీసాలు, డాలర్లు, సౌకర్యాలు గురించి మాత్రమే వారి ఆలోచనలు. ఇక్కడి వారికి, కొత్త జీవితం గురించి కోటి ఆశలతో అమెరికా చేరే వారికి అక్కడి సాధక బాధకాల గురించి తెలియజేస్తుంది ‘సిలికాన్ లోయ సాక్షిగా’ కథా సంపుటి. ఈ సంపుటిలోని కథలు సాధారణమైన కథలు కావు. అమెరికా జీవితం అనే పట్టకం ప్రతిబింబించే ఇంద్రధనుస్సు వర్ణాల వెనుకనున్న చీకటికోణాలను దృశ్యరూపంలో మన ముందుంచిన ఆదిత్య కిరణాలు.
ఈ కథా సంపుటి రచయిత్రి కె. గీత. వీరు కథ, కవిత్వం, వ్యాసం, నవల – ఇలా అనేక ప్రక్రియలను తన రచనలతో పరిపుష్టం చేసిన సృజనశీలి. వీరి ‘ద్రవభాష’ కవితా సంపుటికి అజంతా అవార్డు, సమతా రచయితల సంఘం అవార్డు లభించాయి. కవితా ఖండికలకు రజనీ కుందుర్తి, దేవులపల్లి అవార్డులతో సహా అనేక అవార్డులు అందుకున్నారు. ‘వీక్షణం’, ‘తెలుగు వికాసం’, ‘గాటా’ సంస్థల నిర్వాహకులుగా, బాటా తెలుగు బడి ‘పాఠశాల’ కరికులం డైరెక్టరుగా, సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వాహకులుగా, ‘నెచ్చెలి’ అంతర్జాల వనితా మాస పత్రిక సంపాదకులుగా తన ప్రతిభను నిరూపించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి.
వివిధ సంస్థల బాధ్యతలను ప్రణాళికాబద్ధంగా నిర్వర్తించడంలో అనుభవజ్ఞులైన వీరు కథా రచనను సైతం ఎంతో మెళకువతో, ప్రణాళికాబద్ధంగా చేస్తారనడానికి గొప్ప ఉదాహరణ ‘సిలికాన్ లోయ సాక్షిగా’. ఆత్మాశ్రయ కథలే అయినా వ్యక్తిగత భావోద్వేగాలకు కాక సామాజిక సమస్యల విశ్లేషణకు ప్రాధాన్యం ఇవ్వడం, సంఘటనల ద్వారా కాకుండా పాత్రల ఇంటరాక్షన్ ద్వారా కథలను నడిపించడం, రెండు విభిన్న సంస్కృతుల మధ్య సర్దుబాటు చేసుకొనే క్రమంలో ఎంతటి సానుకూల దృక్పథం, సహనం అవసరం అవుతాయో ఎలాంటి సుదీర్ఘ భాషణలతో పని లేకుండా పాఠకులకు అర్థమయ్యేలా చేయడం, అమెరికా వాస్తవ రూపాన్ని స్పష్టంగా ప్రదర్శించే క్రమంలో ‘ఇండియా గొప్ప, అమెరికా చెత్త’, లేదా ‘అమెరికా గొప్ప, ఇండియా చెత్త’ వంటి అభిప్రాయాలను పాఠకుల మీద రుద్దకుండా సమతుల్యతను పాటించడం కథనం మీద వీరికి గల పట్టును నిరూపిస్తాయి.
‘సిలికాన్ లోయ సాక్షిగా’ కథా సంపుటిలో పద్దెనిమిది కథలున్నాయి. వీటన్నింటిలో ప్రధాన పాత్ర సుప్రియ. పరిణత మనస్తత్వం గల విద్యావంతురాలు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్యగా అమెరికాలో అడుగు పెడుతుంది. ఆమెకు, ఆమె కుటుంబానికి ఎదురైన రకరకాల అనుభవాల సమాహారంగా ఈ కథలు కనిపిస్తాయి. కాథరీన్, బబిత, లక్ష్మి, ప్రశాంతి, కరుణ, అలీసియా, జార్జి, ఆంటోనియా, మెరాల్డా, జెస్సికా, గౌరి, లెవ్, మరియా, సౌమ్య, జీనా మొదలైన పాత్రలు వచ్చి పోతుంటాయి.
‘ఆరడుగుల స్ఫురద్రూపి చక్కని వ్యాయామ శరీరం, చురుకైన కళ్ళు, చెదరని చిరునవ్వు.’ (బెనర్జీ), ‘ఆ అమ్మాయి ఫాషనబుల్ బట్టలు వేసుకుని, మంచి మేకప్ తో ఉత్తరాది నుంచి వచ్చిన సినిమా ఏక్టరులా నాజూగ్గా ఉంది.’ (లక్ష్మి) మొదలైన క్లుప్త వర్ణనలు ఆయా పాత్రల రూపాలను మన కళ్ళ ముందుంచుతాయి. ‘డెబ్భై అయిదేళ్ళ తన మెడ చర్మం మీద నవ్వు, గాలికి కదిలే కోనేటి అలల్లా పొరలుగా కదిలింది.’, ‘జూన్ నెల సాయంత్రపు వెల్తురు చెట్ల మధ్య నుంచి ఆకాశమంత దీపానికి చిల్లులు పడ్డట్టు చెల్లాచెదరుగా ముక్కలు ముక్కలుగా నేల మీద పర్చుకుంటూంది.’, ‘చెట్లన్నీ పసుపుగా, ఎర్రగా మారి చిత్రకారులెవ్వరో కాలాన్ని కుంచెగా మార్చి అదే పనిగా వర్ణచిత్రాలు గీస్తున్నట్లున్నాయి’ వంటి వర్ణనల్లో రచయిత్రి లోని కవయిత్రి పలకరిస్తుంది.
ముగ్గురు స్నేహితురాండ్ర మాటల్లో మూడు సంస్కృతులలోని మంచి చెడులను విశ్లేషించిన కథ ‘అమీగాస్’. వర్ణనల్లో కథాంశాన్ని సూచించిన కథ ఇది. జీవన స్థితిగతులను మెరుగుపరచుకోవడానికో, బిడ్డలకు మంచి భవిష్యత్తు నందించాలనే ఆశతోనో అమెరికా వెళ్ళిన వారికి మేడిపండును చూసి మోసపోయామని గ్రహించేసరికే ఆలస్యం జరిగిపోతుంది. ఆర్ధిక స్థితి మెరుగు పడుతుందేమో కాని పిల్లలు అక్కడి సంస్కృతికి అలవాటు పడిపోతారు. తల్లిదండ్రులను పట్టించుకోకుండా వెళ్లిపోవడం, డైవోర్స్ లు, సహజీవనాలు, సింగిల్ మామ్ జీవితాలు- వీటితో అమెరికన్ సంస్కృతిలో మమేకమైన బిడ్డలను చూసి బాధతో నిట్టూర్చడం, పరిస్థితులతో రాజీపడడం మినహా గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కథ ప్రారంభంలోని ‘బైట ఎండ వేయి విద్యుద్దీపాల్ని ఒక్కసారి వెలిగించినట్లు కాంతివంతంగా ఉంది.’ అన్న వర్ణన ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళిన వారికి అమెరికా ఎంత కాంతివంతంగా కనిపిస్తుందో సూచిస్తుంది. అమెరికన్ సమాజంలోని సమస్యలు అన్నీ అనుభవంలోకి వచ్చాక వారి మనఃస్థితి ఎలా అస్థిరంగా మారుతుందో చివర్లో కనిపించే ఈ వర్ణన ద్వారా సూచించారు రచయిత్రి. ‘ఉదయం సూటిగా ఇంట్లోకి పడిన ఎండ మాయమై పదకొండు గంటల వేళ బైటే వాకిట్లో చెట్ల సందుల్లోంచి ముక్కలు ముక్కలుగా పడ్తుంది. ఆకుల నీడల్లో దోబూచులాడుతూ వెల్తురు కుంచెతో గొప్ప చిత్రాలు అదే పనిగా గీస్తున్నట్లు గాలి కదలికలకి నేల మీద రకరకాల వెల్తురు నీడల చిత్రాలు మారుతున్నాయి.’
శీర్షికలో వ్యంగ్యంగా కథాంశాన్ని స్ఫురింపజేయడం ‘స్పానిష్షూ..ఇష్షూ’, ‘ఫీనిక్స్’ కథల్లో కనిపిస్తుంది.
కుల వివక్ష, వర్గ వివక్ష వంటివి మన దేశంలోనే అధికమని అమెరికా వంటి దేశాలలో అలాంటి వివక్షలు ఉండవని, ప్రతిభకే పట్టం కడతారని మనం విశ్వసిస్తాం. ఒకప్పుడు నల్ల జాతీయుల పట్ల వివక్ష ఉన్నా ఇప్పుడు అది చాలా వరకు సమసిపోయిందని వింటున్నాం. అయితే ఇప్పుడు కూడా అక్కడ వర్గ వివక్ష చాలా ఎక్కువగా ఉందన్న విషయాన్ని‘స్పానిష్షూ..ఇష్షూ’ కథ తెలియజెపుతుంది. ఇప్పుడు అక్కడ వివక్షకు గురవుతున్నది స్పానిష్ వారు. వీరు పొట్ట కూటి కోసం అమెరికాకు వలస వచ్చినవారు. పెయింటింగ్, గార్డెన్ కటింగ్, ఇళ్ళల్లో పనులు చవకగా చేసి పెడతారు. వీరిని మధ్య తరగతి, ధనిక అమెరికన్లు తమలో కలుపుకోరు. అందుకు వారు వలస జీవులు కావడం కూడా ఒక కారణం కావచ్చు. ఉద్యోగావకాశాల కోసం వలస వెళ్ళిన మధ్య తరగతి ఇండియన్లు కూడా వారి పట్ల అదే విధమైన వివక్షను ప్రదర్శించడం విచిత్రం. సమస్యను మానవీయ కోణం నుంచి స్పృశించిన రచయిత్రి కథాంశాన్ని శీర్షికలో ధ్వనింపజేశారు.
‘ఫీనిక్స్’ కథలోని ముఖ్య పాత్ర పేరు ఫోంగ్ లీ. ఫోంగ్ అంటే చైనీస్ భాషలో ఫీనిక్స్ అని అర్థం. తన పిల్లల కోసం తానే దహనమైపోయే పక్షి ఫీనిక్స్. తన కొడుకు కోసం దేశం కాని దేశం వస్తుంది ఫోంగ్ లీ. స్నేహితులకు, బంధువులకు, ఇష్టమైన మాతృ దేశానికి దూరమయ్యానన్న బెంగతో కృశించిపోతుంది. పలకరించేవారు లేక ఒంటరితనం వల్ల కలిగిన ఆవేదనలో దగ్ధమౌతుంది. ఈ కథాంశాన్నంతటినీ ఒక్క మాటలో స్పురింపజేయగల శీర్షికను ఎంచుకోవడంలో రచయిత్రి గొప్ప ప్రజ్ఞ కనబరిచారు.
మన దేశం నుండి కాని, ఇతర దేశాల నుండి కాని అమెరికా వెళ్ళిన వారికి అక్కడ కుదురుకునే క్రమంలో ఎదురయ్యే అనుభవాలను కథా వస్తువులుగా మలచుకున్నారు రచయిత్రి. విద్య, వైద్యం, ఉద్యోగాలు, వివాహ వ్యవస్థ, పిల్లల పెంపకం, ఇన్స్యూరెన్స్ లు, రిపేర్ లు, డ్రైవింగ్ లైసెన్స్ లు, – ఏ ఒక్క అంశమూ రచయిత్రి దృష్టిని దాటుకొని వెళ్ళలేదు.
తేలికగా సంపాదించుకోవాలని ఆశ పడితే ఎటువంటి మోసాలకు గురయ్యే అవకాశముందో ‘వర్క్ ఫ్రం హోమ్’ కథ తెలియజెపుతుంది. కొత్తగా అమెరికా వెళ్ళే వారికి కరదీపిక వంటిదీ కథ. డిపెండెంట్ వీసా మీద అమెరికా వెళ్ళిన స్త్రీల పరిస్థితిని వివరించిన కథ ‘డిపెండెంటు అమెరికా’. అర్హత ఉన్నా ఉద్యోగం చేయడానికి అనుమతి దొరకదు. టాలెంట్ ఎంత ఉన్నా ఇంటిని నిగనిగలాడించడంతో సరిపెట్టుకొని నాలుగు గోడల మధ్య కాలం గడపవలసిన పరిస్థితి. వీసా స్టేటస్ మార్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు, ఎదురుచూపులు – వీటి మధ్య నలిగిపోయే స్త్రీల అంతరంగాలను రచయిత్రి ఈ కథలో చక్కగా ఆవిష్కరించారు.
అమెరికాలో 12వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. అయితే ఆ తరువాత కళాశాల విద్య ఎంత ప్రియమో వివరిస్తుంది ‘కాలేజీ కథ’ కథ. ‘యూ నో ప్రియా, మా కాలేజీలో 50 ఏళ్ల ప్రొఫెసర్ ఇంకా తన కాలేజీ చదువు కోసం చేసిన అప్పు తీరుస్తూ ఉందట’ అన్న కాథరీన్ మాటలు అక్కడి కాలేజీ ఫీజుల పరిస్థితిని కళ్ళకు కడతాయి. అక్కడి కంటె ఇండియాలోని విద్యార్థుల పరిస్థితి చాలా మెరుగన్న విషయాన్ని రచయిత్రి స్పష్టం చేశారు.
అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఎంత కష్టపడాలో దానిని నిలబెట్టుకోవడానికి అంతకు మించి కష్టపడవలసి ఉంటుందన్న వాస్తవాన్ని వివరించిన కథ ‘డ్రైవింగ్ లైసెన్స్’. ఒకసారి పింక్ స్లిప్ అందుకుంటే అది డ్రైవింగ్ హిస్టరీలో మచ్చగా మిగిలి వెన్నాడడం, అధిక మొత్తం జరిమానాగా కట్టవలసి రావడం, ఇన్స్యూరెన్స్ ప్రీమియం పెరిగిపోవడం, ట్రైనింగ్ క్లాసులకు అటెండయి మళ్ళీ టెస్ట్ వ్రాయవలసి రావడం గమనించినపుడు అమెరికాలో డ్రైవింగ్ కు సంబంధించిన నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో తెలుస్తుంది.
కనీస అవసరాలు తీరని వారికి సహాయం చేయడానికి ఏర్పాటు చేయబడ్డ కమ్యూనిటీ సెంటర్లలో అందరికీ సహాయం అందకపోవడం, అందినా అది చాలీ చాలని సాయమే కావడం, టాక్స్ బెనిఫిట్ కోసం రెండు మూడు రోజుల్లో డేట్ అయిపోయే సరుకులను పెద్ద పెద్ద స్టోర్ల వారు కమ్యూనిటీ సెంటర్లకు డొనేట్ చేయడం, కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి కాకుండా నిబంధనల పేరుతో పరిమిత ఆహారాన్ని అందించి మిగిలిన వాటిని డేట్ అయిపోయాయని డస్ట్ బిన్లలో పడెయ్యడం, చవకరకం బియ్యాన్ని అందించడం గమనించినపుడు వ్యవస్థాగతమైన లోపాలు, పేదల పాట్లు ఎక్కడైనా ఒక్కటే నన్న సత్యం బోధపడుతుంది. (ఫుడ్డు – వేస్టు ఫుడ్డు)
అప్పటివరకు చక్కని జీవితం గడిపిన కుటుంబాలు రెసిషన్ కారణంగా రోడ్డున పడడం, అవకాశాలు వస్తాయనే ఆశతో కార్లను ఇళ్ళుగా మార్చుకొని దుర్భర జీవితాలను గడపడం ‘హోం లెస్’ లో కనిపిస్తాయి. ఇన్స్యూరెన్స్ లేకపోతే వైద్యం అందని దుస్థితిని, సొంత వైద్యాలు చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకొనే అభాగ్యుల దైన్యాన్ని వ్యక్తం చేసిన కథ ‘ఇల్ హెల్తు – ఇన్స్యూరెన్సు’.
అమెరికన్ సంస్కృతిలో అతి సాధారణమైన సహజీవనం పద్ధతి స్త్రీల మీదనే బాధ్యతల భారం మోపేదిగా, పురుషుడిని బాదరబందీలు లేని స్వేచ్ఛాజీవిగా తయారుచేసేదిగా మారిపోయిందని ‘సింగిల్ మామ్’ కథ చదివినపుడు అర్థమౌతుంది. ప్రత్యేకంగా చూడడం, మాటలతో వేధించడం వంటి సామాజికపరమైన ఒత్తిడులు లేకపోయినా సగానికి పైగా యువతులు ఒంటరి తల్లులుగా బాధాకరమైన జీవితాలు గడుపుతున్న సమాజపు వాస్తవ స్వరూపం వ్యక్తమౌతుంది.
అమెరికాలో స్వంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడాలో తెలియజెప్పిన కథలు ‘ఓపెన్ హౌస్ -1’ ‘ఓపెన్ హౌస్ -2’. కొనే వ్యక్తి, అమ్మే వ్యక్తి ఒకరి నొకరు చూసుకోకుండానే లావాదేవీలు జరిగే తీరు, మనిషిని మనిషి నమ్మే పరిస్థితి లేక సంస్థలు మధ్యవర్తిత్వం వహించే విధానం అవగతమౌతాయి. మాట సాయం దొరకడం సైతం అరుదైన చోట ప్రతి ఖరీదైన వస్తువుకు ఇన్స్యూరెన్స్ లేకపోతే ఎంత ఇబ్బంది పడవలసి ఉంటుందో వివరించిన కథలు లాప్ టాప్ -1, లాప్ టాప్ -2.
ఛైల్డ్ కేర్ కు ఎంతో ప్రాధాన్యత నిచ్చి కొన్ని ఉద్యోగాలకు ఆ కోర్స్ లో సర్టిఫికేషన్ ను అర్హతగా ఉంచిన అమెరికాలో పిల్లలకు మాత్రం తల్లిదండ్రులను గౌరవించడం నేర్పబడడం లేదనే అంశాన్ని ‘ఛైల్డ్ కేర్’ కథ ద్వారా రచయిత్రి ఎత్తి చూపారు.
కొనుక్కున్న వస్తువుకు చిన్న రిపేరు వచ్చినా దానిని ప్రక్కన పెట్టి కొత్తది కొనుక్కోవలసి రావడం, రిపేరు చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో స్వంతంగానే చాలా పనులు చేసుకోవలసి రావడం, పాత సామాన్లను వదిలించుకోవడానికి సైతం డబ్బు ఖర్చు పెట్టవలసి రావడం వంటి అంశాలను ప్రస్తావించిన కథ ‘రిపేర్ ఇన్ అమెరికా’.
స్వేచ్ఛగా జీవించగలిగే అవకాశం, ఓపిక ఉన్నన్నాళ్ళు ఏ విధమైన అంక్షలు లేకుండా పని చేసుకోగలిగే అవకాశం, మనుషుల్లోని స్నేహ స్వభావం – వీటి వల్ల భిన్న సాంస్కృతిక నేపథ్యాలు గలవారు అమెరికన్ సమాజంలో సులువుగా కలిసిపోగలుగుతున్నారని ‘లివ్ ఎ లైఫ్’ కథ స్పష్టం చేస్తుంది.
కమ్యూనల్ వంటిళ్ళు వస్తే ఆడవాళ్ళకు వంట పని తగ్గుతుంది. వారి సృజనాత్మక ప్రతిభకు మెరుగు పెట్టుకునే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం, ఎప్పటికైనా అలా జరిగితే బాగుండుననే ఆశ ఆలోచనాపరులకు ఉంది. అయితే కమ్యూనిస్టు దేశాలలో సైతం అది సాధ్యం కాలేదని, ఇజ్రాయిల్ లోని కిబుజ్ ల సంస్కృతిలో తప్ప ఇంకెక్కడా కమ్యూనల్ వంటిళ్ళు లేవని ఈ కథ వల్ల తెలుస్తుంది. బహుశా కొన్ని ఆశలు ఎప్పటికీ నెరవేరవు కాబోలు. అందరూ గొప్పదిగా భావించే కమ్యూనిస్టు సమాజంలోని లోపాలను ఈ కథలోని లెవ్ పాత్ర ద్వారా చెప్పించారు గీత.
ఈ కథామాలిక ఒక దశాబ్ద కాలపు అమెరికా సాంఘికజీవనానికి దర్పణం. ఇందులోని పాత్రలు సజీవాలు. మనల్ని కదిలిస్తాయి. కంట తడి పెట్టిస్తాయి. తోటి మానవుల పట్ల సహానుభూతిని ప్రదర్శించమంటాయి. దిక్కు తోచని స్థితిలోనూ ధైర్యాన్ని వీడకుండా పోరాడడమెలాగో బోధిస్తాయి.
ఒక వైపు మానవ సంబంధాలలో అత్యంత ప్రమాదకరంగా మారిన ఆర్ధిక లావాదేవీలలో మనుషులపై నమ్మకం శూన్యమైపోయిన తీరును, మరొక వైపు ‘అననుకూల పరిస్థితుల్లోనూ ప్రయత్నం మానని గొప్ప లక్షణమే లేకపోతే మనిషి కొత్త ఆవిష్కరణలు చేసేవాడు కాదేమో’ అంటూ మనిషిలోని సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించారు గీత.
‘అసలు కలల్లో ఎవరికైనా ఒకప్పుడు గుచ్చుకున్న పగిలిన గతపు ముక్కలే వేరు వేరుగా ఎక్కడెక్కడో అతుక్కుని కనిపిస్తాయి’ వంటి తాత్వికమైన వ్యాఖ్యలతో ఆలోచింపజేస్తూ, అందమైన ప్రకృతి వర్ణనలతో అలరిస్తూ, అమెరికాను భూతల స్వర్గంగా భావించే అనేకమంది భ్రమలను తొలగిస్తూ సిలికాన్ లోయలో విహరింపజేశారు గీత.
డా. నల్లపనేని విజయలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాల, గుంటూరు లో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. వీరి కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.