కొత్త అడుగులు – 18
ఆమే ఓ కవిత్వం
– శిలాలోలిత
‘పద్మావతి రాంభక్త’ – అనే కవయిత్రిని గురించి ఈసారి పరిచయం చేస్తున్నాను. ‘నెచ్చెలి’ కాలమ్ ఉద్దేశ్యం కూడా అదే. ఇప్పటివరకూ పరిచయం కాని కవయిత్రిని ఎన్నుకోవడం. అందుకని నేను వారి వారి రచనలు నాకు తెలిసినప్పుడు రాస్తూవున్నాను. ఇదొక వ్యాసమో, సమీక్షో కాదు. ఆ లక్షణాలు లేవు. వీరి కవిత్వాన్ని చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతి, నాలో ఏర్పడిన స్పందనే ప్రధానంగా వుంటాయి. ఇదంతా ఇంతవరకూ ఇంత వివరంగా ఎందుకు చెబ్తున్నానంటే కొంతమందిని నీ రచనల పట్ల అసంతృప్తి పేరుకుపోయిన కొందరు పనిగట్టుకుని ప్రచారం చేయడాన్ని చూసి వారికి ఒక స్పష్టత కలగాలనే ఉద్దేశ్యమే ఈ జవాబు.
ఈ కాలమ్ కంటే ముందు ‘భూమిక’ పత్రికలో నాలుగేళ్ళపాటు ‘వర్తమాన లేఖలు’ అనే కాలమ్ రాసేదాన్ని. కవియిత్రుల, కవియిత్రులతో నాకున్న అనుబంధాన్ని, వారి వారి సాహిత్య కృషిని రాస్తుండేదాన్ని. ఆ కాలమ్ పర్పస్ అది. పుస్తకంగా కూడా వేసాను.
ఆతరం కవయిత్రుల తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఈమధ్య రాస్తున్న వారిని పరిచయం చేస్తున్నాను. గత ఏడాదిన్నరగా సాగుతోంది.
నాకేదో కీర్తి కాంక్ష కలగాలనో, ఇంకేదో ఆశించో, స్వలాభం కొరకు రాయడం లేదు. ఎంతమంది కవయిత్రులను పరిచయం చేస్తే అంత ఆత్మ తృప్తి నాకు.
ఇటీవలే పద్మావతి తన కవిత్వాన్ని నాకు పంపినప్పుడు ‘కొత్తవేకువ’ చూడగానే ఎంత ఆశాజీవో కదా అనిపించింది. ముఖచిత్రం దగ్గరే ఆగిపోతాం. అద్భుతంగా వుంది. కవిత్వం చదువుతున్నంతసేపూ, ఆమె అమాయకత్వం, ప్రకృతి ప్రియత్వం, ఖాళీతనం, కవిత్వ సృజన చేయాలన్న తపన కనిపిస్తాయి.
ప్రతి మనిషికి రెండు ముఖాలుంటాయి. ఒకటి భౌతిక ముఖమైతే, రెండవది అంతర్మఖం. పద్మావతి తనకుతాను తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈ కవిత్వం. ఒక స్వచ్ఛమైన తెల్లకాగితం లాంటి మనసుపై రంగులు ఒలకబోస్తూ పోతే, అక్షరంతో జతకట్టి కవిత్వమై మనముందుకొచ్చింది.
ఆ సహజత్వం, తెలివిడితనం, నేర్చుకోవాలన్న ఉత్సాహం కనబడతాయి. తనని తాను తరిచి చూసుకుంటూ, తనని తాను అంచనా వేసుకుంటూ చుట్టూ వున్న స్త్రీల సమస్యలతో పాటు కనబడుతున్న అనేక విషయాలపట్ల కవిత్వం రాస్తూపోయింది. ‘జీవించడం ఒక తప్పనిసారి యాత్ర’ అంటుందొకచోట ‘గాయలకథ’ కవితలో చిత్ర విచిత్రమైన మనసుకు తాకే అనుభవాల్ని పరుస్తుంది.
‘గాయం తొడుక్కొని మనిషి
అసలు ఉండడేమో
అయినా
గాయాన్ని రుచిచూడకపోతే
జీవితం గేయాన్నెలా పాడుతుంది’ అని తేల్చేస్తుంది.
ఇంకొకచోట – కనురెప్పలనిండా
ఈదుతున్న అందమైన కలలన్నిటినీ
గాయాలు కత్తిరించి పగతీర్చుకుంటాయి – అంటుంది.
పద్మావాతి విస్తృత అధ్యాయనం చేసింది. ఆ అధ్యాయన శీలత్వం ఆమె రచనలో స్పష్టంగా కనబడుతుంది. M.A., M.C.A. చేసిన ఈమె చదువులోనూ ముందడుగు వేసింది. విశాఖపట్టణంలో నివసిస్తున్న ఈమె సముద్రాన్ని తనలో ఇముడ్చుకుంది. చాలా చోట్ల కవిత్వంలో ఆమెకు అలుపే తెలియక అప్రయత్నంగానో సముద్రం అక్షరమై కూచుంటుంది. భావుకురాలు, సున్నితత్వానికే సున్నితమని కవిత్వం చెబ్తుపోతుంది. నిజానికి కవులు సాధారణంగా సున్నింతంగానే వుంటుంటారు. ఈమె మరింత ఎక్కువ.
ఈ ఉదయాలు సరిపోవనీ, కొత్త వేకవలు కావాలనీ, కొత్త జీవితాలు, కొత్త చిగుళ్ళతో, కొత్త బతుకుల్తో నిండిపోవాలనుకునే తపన ఈమెది.
కె. శివారెడ్డిగా, గుడిపాటి ముందుమాటలు రాసారు. ఈ కవయిత్రి ఎంత సున్నిత హృదయినో పదే పదే చెప్పారు. పద్మావతి మాటల్లో నేను ‘‘ఇన్నాళ్ళ కవిత్వ రచన – కాదు కవిత్వంలోనే జీవించింది నేననుభవించి కవితలు రాసే క్రమంలో నేను చాలా ఆనందంగా వున్నాను. ఒక స్థిరత్వం, ఒక నమ్మకం రావటానికవి కారణమయ్యాయి. యివి ఎట్టా స్వీకరించబడతాయో నాకు తెలియదు. నన్ను నేను బహిర్గతం చేసుకుంటూ వెళుతూ, విముక్తి మార్గం వెతుక్కున్నాను. ఈ కవితలన్నీ నేనే నేనులేని కవిత ఒక్కటి కూడా లేదు అని.
పుట్టింటినుంచి మెట్టునింటికి పోవడం కూడా మసే అవడం ఆమె అబ్జర్వేషన్ కి నిదర్శనం. శివారెడ్డిగారి మాటల్లో చెప్పాలంటే, ఆమె తన అంతరిక లోకాల సంచలనాన్ని వ్యక్తీకరించటానికీ కవిత్వం పంచ చేరారు. అది ఆమెకు ఒక మానసిక శాంతిని జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని గొప్ప సహానుభూతిని ప్రసాదించింది.
‘లోపలి ప్రపంచాన్ని శుభ్రపరిచే కవిత్వం’ – రాస్తున్నారామె. రాయకుండా ఉండలేని తనం ఆమెను ఆవహించింది. ఇది దోసం కాదు సుగుణం. ఇటీవల చాలామంది కవిత్వం రాస్తున్నారు. అయితే ఇతివృత్తంలో వైశాల్యం, అభివ్యక్తిలో వైవిధ్యం కనపరిచే వారు అరదు. ఆకొద్ది మందిలో ముందువరుసలో వుండే కవయిత్రి పద్మావతి.
*****
ఎంతో ఆత్మీయంగా నా కవిత్వంపై ఆమె అభిప్రాయాలను అందమైన వాక్యాలతో అందించిన శిలాలోలితగారికి
ధన్యవాదనమస్సులు