చంద్రిక కథ

 -పి.జ్యోతి

వీరేశలింగం పంతులు గారిని ప్రధాన పాత్రగా చూపే సుబ్రహ్మణ్య భారతి గారి తమిళ అసంపూర్తి నవల –                  

చంద్రిక కథ తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి అరవంలో వ్రాసిన అసంపూర్ణ నవల. ఈ నవలను గోపాల, కృష్ణ, రాఘవన్ అనే ముగ్గురు మిత్రులు తెలుగులోకి అనువాదం చేసారు. నార్ల గారు కేంద్ర సాహిత్య అకాడమీ పక్షంగా కందుకూరి వీరేశలింగం జీవిత సాహిత్యాలను గూర్చి 1968 లో ఇంగ్లీషులో పుస్తకం వ్రాసినప్పుడు ఈ నవలను పేర్కోన్నారు. ఇంగ్లీషు స్వరాజ్య పత్రికలో శ్రీమతి ప్రేమానందకుమార్ గారు దీన్ని సమీక్ష చేసారు. అప్పడు బం గో రే (బండి గోపాల రెడ్డి) అనే రచయిత ఈ పుస్తకం గురించి తెలుసుకుని దీనికి సంబంధించిన సమాచారాన్ని, ఇతిహాసాన్ని సేకరించి, పుస్తకాన్ని సంపాదించి దాన్ని తమిళం తనకు రాని కారణంగా మరో ఇద్దరు మిత్రులతో కలిసి కూర్చుని అనువదించారు. తెలుగువారికి సంబంధించిన ఈ పుస్తకాన్ని 1971 లో తెలుగులోకి తీసుకురావడానికి ఒక తెలుగుభాషియుడు చేసిన కృషి, ఎవరి సహకారం లేకపోయినా పట్టుదలతో ఈ నవలను తెలుగు లో కి తీసుకువచ్చి అంత కంటే అమూల్యమైన సమాచారాన్నిమనకు అందించినందుకు తెలుగు భాషీయులందరూ వారికి రుణపడి ఉన్నాం….. ఈ నవలను తిరిగి ఇలా 2012 లో పునర్ముద్రించారు. తమిళంలో రాసిన ఈ నవల గొప్పదనం ఎంటి అన్నది మొదటి ప్రశ్న అవుతుంది. తెలుగువారు గర్వించదగ్గ మహామనీషి స్త్రీ జనోద్దరణకు నడుం బిగించి జీవితాంతం కృషి చేసిన శ్రీ కందుకూరి వీరేశలింగం, వారి శ్రీమతి రాజ్యలక్ష్మమ్మ గార్లు  ఈ నవలలో ని ముఖ్య పాత్రలు. 

నవల అనే కాల్పనిక మాధ్యమంలో విధవా వివాహాలకు సంబంధించిన ఇతివృత్తంతో కథ నడుపుతూ నవలలో కందుకూరి వీరేశలింగం గారి పాత్రను యధావిధిగా పేర్లతో సహా అలాగే వాడుకోవడం అన్నది అప్పట్లో జరిగిన ఒక గొప్ప సాహిత్య ప్రయోగం. అలాగే విధవా వివాహం అన్న విషయానికి సంబంధించి  తమిళుడైన సుబ్రహ్మణ్య భారతి గారికి కూడా వీరేశలీంగం గారు తప్ప దక్షిణ భారతదేశంలో మరో వ్యక్తి గుర్తుకు రాలేదంటే విధవా వివాహాలకు సంబంధించి ఎంత నిబద్దతతో వీరేశలింగం గారు పని చేసి ఉంటారో అర్ధం అవుతుంది. కొంత మంది సాహిత్యకారులు గురజాడ వారి కన్యాశుల్కంలో వీరప్ప పంతులు పాత్ర వీరేశలింగం గారే అని అంటారు. కాని భారతి గారు తమ తమిళ నవలలో కందుకూరి వీరేశలింగంగారిని ఒక కాల్పనిక పాత్ర లా కాకుండా యధావిధిగా వారిని వారి శ్రీమతి గార్లను తన నవలలో ప్రధాన పాత్రలుగా చేసుకున్నారు. 

నవలలోకి వెళ్ళబోయే ముందు బంగోరే గారి గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. తెలుగులో  సాహిత్య పురాతత్వశాస్త్ర పరిశోధకుడు బంగోరే. ఎన్నో విషయాలపై పరిశోధనలు చేసి అమూల్యమైన సాహిత్యపర సత్యాలను వెలికి తీసిన మహనీయుడు. సాహిత్య ప్రపంచం నుండి కాని ప్రభుత్వం నుండి కాని ఏ మాత్రం ప్రోత్సాహం లేకపోయినా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తన జీవితం మొత్తం పరిశోధనకు అంకితం చేసిన మహనీయుడు ఆయన. నెల్లూరు జర్నలిజం, బ్రౌను లేఖలు, బ్రౌన్ సేకరించిన తాతాచార్ల కథలు, కన్యాశుల్కం మొదటి ముద్రణ ప్రతి, కడప జిల్లా ఊళ్ళ పేర్లు, మాలపల్లి పై నిషేధాలు, వేమన పధ్యాల్లో ప్రక్షిప్తాలు, సీ.ఆర్ రెడ్డి రచనలు లాంటివి వెలికి తీసి అప్పు చేసి మరో తన సొంత డబ్బుతోనే ఆ అమూల్య సంపదను ప్రచురించి  తెలుగు సాహిత్యాన్నికి ఎంతో సేవ చెసిన నిశ్వార్ధపరుడు. చంద్రిక కథను ప్రచురించాక కూడా సుబ్రహ్మణ్య భారతి వీరేశలింగం సంబంధంగానూ  బ్రౌను సంబంధంగానూ అముద్రిత గ్రంధ చింతామణి సంచికల సంబంధంగానూ పరిశొధన కొనసాగించడానికి రాజమహేంద్రవరం వెళ్ళారు. నెల్లూరు నుండి రాజమండ్రీ వెళ్ళడానికి స్తోమత లెక మధ్యలో పరిశోధన ఆపేయవలసి వచ్చిందంటే వారి ఆర్ధిక స్థితి అర్ధం అవుతుంది. అయినా చేవ ఉన్నంత వరకూ సొంతంగా పరిశొధన చేస్తూనే గడిపారు. వ్యాపారాత్మకంగా కాకుండా సాహిత్యాభిమానంతో పరిశోధనల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన భం గో రే మేధస్సు రిత్యా ఒంటరయిపోయి నిరాశావాదాన్ని భరించలేకపోతున్నానని తన ఆఖరి జాబులో రాసి హిమాచల్ ప్రదేశ్ లో సట్లెజ్ నదీలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి జీవితం మరణం గురించి వివరంగా రాస్తూ ఈ నవల ముందుమాటలో సి.వి సుబ్బారావు గారు ఇలా రాస్తారు “ఆయన ఆత్మహత్య చరిత్రకారులు, పురాతత్వశాస్త్రవేత్తలకు చెప్పుకోకుండా మిగిలిపోయే కృతజ్ఞత”….. ఈ వాక్యాన్ని తెలుగు వచ్చిన వారందరూ తెలుగువారమని చెప్పుకునే వారందరూ చదువుకొవాలి. 

ఇక నవల విషయానికి వద్దాం. “చంద్రిక కథ” చదివితే భారతిగారికి వీరేశలీంగంగారిపట్ల ఉన్న గౌరవం అర్దం అవుతుంది. వీరేశలింగం గారు భారతి గారికన్నా వయసులో చాలా పెద్దవారు. కొంత కాలం మద్రాసులో జీవించారు. మద్రాసులోనే మరణించారు కాని ఏ రకంగా చూసినా వీరేశలింగం గారిని భారతి గారు కలుసుకున్నారు అని చెప్పడానికి ఏ సమాచారం లభించదు. వీరేశలింగం గారు మద్రాసులొ ఉన్న సమయంలో భారతి గారు మద్రాసులో లేరు. తమిళ మొదటి పత్రిక సంపాదకులు, సంఘ సంస్కర్త జి. సుబ్రహ్మణ్యయ్యరుగారు తోటి వీరేశలింగంగారికి పరిచయం ఉండిందేమో కాని దీనికి సంబంధించిన ఆధారాలు లేవు. ఈ అయ్యరు గారి వద్దే భారతి గారు పని చేసారు. హిందూ పత్రిక స్థాపనలో తనతో కలసి పనిచేసిన న్యాపతి సుబ్బారావు ద్వారా వీరేశలింగం పంతులుగారు గురించి జి. సుబ్రహ్మణ్యయ్యర్ తెలుసుకుని ఉండవచ్చు. ఆయ్యరుతో బాగా స్నేహం చేసిన గురజాడ అప్పారావు గారు కూడా వీరేశేలింగం గారి గురించి ప్రస్తావించి ఉండవచ్చు. ఈ నవలలో వీరేశలింగం గారి భార్య పాత్ర ఉన్నా ఆవిడ పేరు ఎక్కడా రాదు. పంతులుగారి భార్య అనే భారతి గారు సంబోధిస్తారు. కారణం వారికి వీరేశలింగంగారితో కుటుంబపరంగా స్నేహం లేదని అందువలన వీరేశలింగం గారి శ్రీమతి పేరు ఆయనకు తెలీయదని అర్దం అవుతుంది. అంటే కేవలం వినికిడి ద్వారానే విన్న సమాచారాన్ని బట్టీ భారతి గారు వీరేశలింగంగారిపై పెంచుకున్న భక్తి భావమే వారిని వారి శ్రీమతిని తన నవలలో పాత్రలుగా తీసుకునేలా చెసిందని అర్ధం అవుతుంది. ఒక తెలుగువానికి తమిళ కవి ఇచ్చిన గౌరవం అది. తెలుగు  మహనీయులను స్మరించుకోవడమే మరచిపోయిన తెలుగుజాతి అర్ధం చేసుకోవలసిన విషయం ఇది. అందుకే డా. చల్లా రాధాకృష్ణ శర్మ గారు ఈ నవల పరిచయ వాక్యాలలో భారతిది అన్య భాషాద్వేషమెరుగని మాతృభాషాభిమానం అంటారు. 

1917 లో భారతి గారు ఒక వ్యాసం రాసారు. అందులో వారి మాటలివి “తెలుగువారు తమిళుల్ని పరిపాలించిన చిహ్నాలు మన భాషలోనూ నిఘంటువులలోనూ చెరగని ముద్రలుగా నిలిచిపోయినవి. మన సంగీత నాట్యశాస్త్రాలు కూడా నేటి దాకా తెలుగులోనే మునిగివున్నాయి. మన గాయకులు పాడే కీర్తనలలో ఉత్తమమైనవి తెలుగు కీర్తనలే.. మన గ్రామాలలో నివసిస్తున్న తెలుగు రెడ్లు, నాయుళ్ళూ, తెలుగు బ్రాహ్మణ్య పురోహితులు, తెలుగు దేవదాసీలు రాయలవారి కాలంలో ఇక్కడికి వచ్చి స్థిరపడినవారే. మన వివాహసమయాలలో పాడే పాటా లాలీ మొదలైనవి కూడా తెలుగువారి సంప్రదాయానికి చెందినవే. మన భాషలో గమనం, సొగసు, ఎచ్చరిక, దొర, వాడిక, కొంచెం మొదలైన నూర్లకొలది తెలుగు మాటలు కలసి మెలసి పోయినవి” తెలుగు భాషకు, తెలుగువారికి ఒక తమిళ మహాకవి ఇచ్చిన గౌరవం ఇది. ప్రస్తుత తెలుగువారికి తెలియని విషయం ఇది.

ఈ నవలకు మూందుమాటలు రాస్తూ భం గో రే గారు ఈ నవలకు ముగ్గురు తెలుగులోకి తీసుకురావడం గురించి చెబుతూ తనకు తమిళం రాదు కావున రాఘవన్ గారు తమిళమూలం చదివి తెలుగులో డిక్టేట్ చేస్తుంటే, ఎస్. ఎస్. కృష్ణమూర్తి గారు వ్రాస్తుంటే వీరు మామూలు తెలుగులోకి పరివర్తన చేసుకుని సీరియల్ గా దీన్ని ప్రచురించారని చెప్పుకున్నారు. మద్రాసు వెళ్ళి ఈ నవల తమిళ ముద్రిత ప్రతిని సేకరించి తెలుగులోకి అనువదించి దాన్ని జమీన్ రైతు అనె చిన్న పత్రికలో సీరియల్ గా ఆరోజుల్లో వేసారట. ఈ నవల తో పాటు కందుకూరిగారి సంస్కరణల గురించి వారి నమ్మకాల గురించి కూడా కొంత పరిశొధన చెసారు భం గో రే గారు. వితంతు వివాహాలను జరిపించిన కందుకూరి గారు అదే శాఖ, అదే కులంలో వాటిని జరిపించేవారు కాని కులాంతర మతాంతర వివాహాల పట్ల వారికి అంతగా నమ్మకంలేదని కూడా కనిపిస్తుందని రాస్తారు భం గో రే గారు. అందువలన కొంత మంది వారిని బ్రాహ్యణ సంస్కర్తగా పేర్కొంటారు. 1898 లో బెంగాలీ బ్రాహ్మణ అమ్మాయి అయిన సరోజినీ దేవి చటోపాద్యాయ తెలుగు బలిజ అబ్బాయి అయిన గోవిందరాజుల నాయుడుగార్ల వివాహం వీరీశలింగం గారి అధ్యక్షతన జరిగింది. ఇది దక్షిణ భారతదేశంలో జరిగిన మొట్టమొదటి ముఖ్యమైన వర్ణాంతర  రాష్ట్రాంతర వివాహం.  దీన్ని గురించి కూడా పంతులుగారు తన స్వీయ చరిత్రలో చెప్పుకోలేదు అంటే వర్ణాంతర వివాహాల పట్ల వారికంతగా సముఖత లేకపోయి ఉండవచ్చు అని భం గో రే గారు అంటారు. పద్మిన్నీ సేన్ గుప్త ఆంగ్లంలో వ్రాసిన సరోజినీ దేవి చరిత్ర గ్రంధంలో ఈ వివాహానికి సంబంధించిన ఒక బ్రిటీష్ వనిత వ్రాసిన ఆంగ్ల గ్రంధంలో నుండి పునరుద్దరించిన భాగంలో కొన్ని వివరాలను తమ ముందు మాటలో ఇస్తారు భం గో రే గారు. 

సరోజినిదేవి మరియు నాయుడు గార్ల వివాహాన్ని జరిపించడానికి అప్పట్లో సరోజిని తండ్రి గారైన అఘోరనాధ్ చటోపాధ్యాయ గారికికూడా కందుకూరి గారే గుర్తుకువారడం వారి సంఘ సంస్కర్త కార్యక్రమాల వెనుక ఉన్న నిబద్దతకు గుర్తు. కాని ఈ వివాహాన్ని వీరేశలింగం గారు ఎక్కడా ప్రస్తావించకపోవడం చూస్తే ఇది వారు అంత ఇష్టపూర్వకంగా చేసిన వివాహం కాదేమో అన్న అనుమానం కొందరికి వస్తుంది. ఇదే కాకుండా మరో  ప్రముఖ వర్ణాంతర వివాహం కూడా వీరేశలీంగంగారి అధ్వర్యంలో జరిగింధి. కేంద్రమంత్రి మోహన్ కుమార మంగళం గారి తండ్రి కీర్తిశేషులు పీ.ఎస్.సుబ్బరాయన్ కూ రాధాబాయి గారికి జరిగిన వివాహాన్ని కూడా వీరేశలింగం గారే జరిపించారు. దీని గురించి కూడా ప్రస్తావన అతి తక్కువగా వస్తుంది. 

తన మరణానికి 13 సంవత్సరాలకు ముందే 1906 లో తన కులాన్ని తెలియజేసే బాహిరి చిహ్నమైన జంధ్యాన్ని విసర్జించిన పంతులు గారి పై అనుమానాలు ఉండడం సబబు కాదు కాని వర్ణాంతర వివాహాలనేవి అప్పటికి కేవలం intellectual పరిధిలో పై వర్గాల వారికి మాత్రమే పరిమితమై ఉండడంవల్ల వీరేశలీంగంగారు ఆ రకం వివాహాల పట్ల చర్చించేవారు కాదు అనుకోవచ్చు. వీరేశలింగం గారి గురించి పరిశొధన చేసి డాక్టరేట్ పొందిన అమెరికన్ యువకుడు లియోనార్డ్ కుడా వివాహాలు జరిపించడం వరకు మాత్రమే పంతులు గారు చేసేవారు కాని ఆ దంపతుల క్షేమసమాచారాలను వారు పట్టించుకోలేదనీ రాసారు. అయితే అప్పటి సమాజ పరిస్థితుల దృష్ట్యా వితంతు వివాహాల పట్ల పని చేయడమే పెద్ద మార్పు. వర్ణాంతర వివాహల పట్ల ఆలోచన మరో పెద్ద రెవెల్యూషన్. అందుకు పంతులు గారు సిద్దపడి ఉండకపోవడం ఆయన పరిధిని చెబుతుంది కాని వారి సంఘసంస్కరణల పట్ల అనుమానాలుండవలసిన అవసరం అక్కరలేదు. వారి జీవిన ప్రస్థానంలో వారిలో సాంప్రదాయం నుండి నవీనతకు వచ్చిన మార్పు కనిపిస్తూ ఉంది. ఏ మార్పు అయినా క్రమంగా రావలసిందే. వీరేశలింగం గారు అప్పటి పరిస్థితులలో సమాజంలో పెను మార్పులకు కారణం అయ్యారు ఆ మార్పులలో కొన్ని నిషిధ్దాలు వారి  మనసులో ఉండవచ్చు. కాని వారి ఉద్దేశాలలో నిస్వార్ధత గురించి అనుమాన పడవలసిన అవసరం లేదు.

 ఈ నవలను భారతి గారు 1904 కాల క్రమంలో రాసారు. అప్పటికి పంతులు గారు జీవించే ఉన్నారు. అయితే ఇది అసంపూర్తిగా మిగిలి ఉన్నందున నవల కాలమానం 1904 అని ప్రస్తావించినా ఇది భారతి గారు తన మరణానికి కొంచెం ముందు అంటే 1920 లో మొదలు పెట్టి ఉండవచ్చు అని అర్ధం చేసుకోవచ్చు. ఏనుగువాతబడి వీరి ఆరోగ్యం దెబ్బతిని మరణించిన తరువాత 1930 ప్రాంతంలో వారి వ్రాత ప్రతులు బయటకు తీసి గ్రంధరూపంలో వెలువరంచి ఉండవచ్చు. 1949 లో మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం భారతి రచనలపై కాపీరైట్ ను కొనివేసి భారతి సాహిత్యాన్ని ప్రజల ఆస్థిగా చేసి ఆయన కుటుంబ సభ్యులకు కొంత పైకం ఇచ్చి ఆదుకుని, ఆయన రచనలకు ప్రచారవిరివిని కలుగ చేయకలిగింది. తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆలోచించవలసిన మరో విషయం ఇది. గురజాడ గారు 1909 లోనే “In the Telugu country an author has generally to be his own publisher and book seller” అని రాసుకున్నారంటే అప్పటికీ ఇప్పటికీ తెలుగు సాహిత్య స్థితి ఎంత హీనంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

ఇక నవల కథకు వస్తే. ఇది కేవలం 50 పేజీల ప్రతి. తొమ్మిది అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. భారతి గారు ఇక్కడ చంద్రిక అని ప్రస్తావించిన అమ్మాయి ఒక చిన్న పాప. ఆ పాప జీవితాన్ని సంపూర్ణంగా చూపించే పెద్ద నవల రాయాలని భారతి గారి ప్రయత్నం అయి ఉండవచ్చు అని అర్ధం అవుతుంది. నవల వేలాంగుడిలో ఒక పెద్ద తుఫానుతో మొదలవుతుంది. ఒక బ్రాహ్మణ అగ్రహారంలో మహాలింగయ్య కూటుంబం ఉంటుంది. అతనితో అతని ముసలి తండ్రులు, వితంతువైన చెల్లెలు, భార్య అయిదుగురు కూతుళ్ళూ ఉన్నారు. ఒక మార్గశివరాత్రి నాడు తుఫానులో గ్రామం అల్లకల్లోలం అవుతుంది. మహాలింగయ్య కుటుంబం అంతా మరణిస్తారు. అతని వితంతువు చెల్లెలు, భార్య మాత్రం మిగిలి ఉంటారు. గర్బవతి అయిన భార్య మరునాడు ఒక కూతురుని కని చనిపోతుంది. అయితే మరణించే ముందు విశాలాక్షి ని పిలిచి వదిన గోమతి ‘నీవు రెండొ పెళ్ళి చేసుకో.. విధవా వివాహం నిషేధమేమీ కాదు. స్త్రీ పురుషులిద్దరూ యముడికి లోబడ్డవారే. స్త్రీలు పురుషులకు బానిసలు కారు. వారికి భయపడ్తూ బాధలనుభవించి దుఖించి క్షీణించి నశించిపోవాల్సిన అవసరం లేదు. ప్రురుషులు స్వార్ధపరులుగా వ్రాసిన శాస్త్రాలను చించి పొయ్యిలో పారెయ్.” అని చెబుతుంది. ఇది అప్పట్లో ఒక పెద్ద స్త్రీ వాద చర్చకు సరిపోయే సంభాషణ.

వదిన కన్న బిడ్డను వదిన కోరిక మీద చంద్రిక అని పేరు పెట్టి విశాలాక్షి వీరేశలింగం గారి వద్దకు చేరుతుంది. తనకు మరో వివాహం జరిపించాలని  కోరుకుంటుంది. 1904  లో ఒక స్త్రీ తన వివాహం గురించి తానే మాట్లాడుకోవడం నిజంగా చాలా పెద్ద విషయం. అయితే మొదట విశాలాక్షి తమిళ సంఘసంస్కర్త సుబ్రహ్మణ్య అయ్యర్ గారి వద్దకి వెల్తుంది. వారే పంతులు గారి వద్దకు ఆమెను పంపిస్తారు. విశాలాక్షి వారి వద్ద జాబు తీసుకుని రాజమహేంద్రవరం వెళ్ళి పంతులు గారిని కలుసుకుంటుంది. రాజ్యలక్ష్మి గారి ఆతిద్యంలో కొంత సమయం గడుపుతుంది. గోపాలయ్యంగార్ అనే తంజావూరు డేప్యూటి కలెక్టర్ గారు కూడా వితంతువుని వివాహం చేసుకోవాలని పంతులు గారి వద్దకు వస్తారు. ఇతనికి కొన్ని దుర్వ్యసనాలున్నాయ్. విశాలాక్షి అతన్ని మార్చుకుంటాననే నమ్మకంతో అతనితో వివాహానికి సమ్మతిస్తుంది. అయితే ఆ ఇంట యాదవ కులస్తురాలు, పనిమనిషి కూడా అయిన మీనాక్షిని చూసి గోపాలయ్యంగార్ ప్రేమిస్తాడు. పంతులుగారు పని మనిషి, మరో కులస్తురాలు అయిన మీనాక్షి తో ఈ వివాహం అంత బావుండదని సూచించినా ఆమెనే వివాహ మాడ తలచి, పంతులు గారిని ఒప్పించి మీనాక్షిని వివాహం చేసుకుంటాడు గోపాలయ్యంగార్. పంతులు గారి దంపతులు విశాలాక్షికి మరో సంబంధం చూసే ప్రయత్నంలో పడతారు. 

విశాలాక్షి కొన్ని రోజులు తన బాల్య స్నేహితురాలు ముత్తమ్మతో గడిపి రావడాని వెళుతుంది. ఆమె భర్త వకీలు సోమనాధయ్యర్. అతను వితంతువు అయిన విశాలాక్షి తో ఒక రాత్రి అసభ్యంగా ప్రవర్తించ బోతాడు. అక్కడ నుండి ఆమె  మరో స్నేహితురాలి ఇంటికి చేరుతుంది. అక్కడ ఒక సన్యాసి ఆమెను చూసి ప్రేమిస్తాడు. వారిద్దరూ పంతులుగారి వద్దకు వెళ్ళి వివాహం చేసుకుంటారు. విశ్వనాధ శర్మ,విశాలాక్షి ఇద్దరూ చంద్రికతో హాయిగా గడుపుతున్నప్పుడు కొన్ని కారణాల వలన విశ్వనాధ శర్మ పిచ్చి వాడవుతాడు. అన్ని రోజుల బలవంతపు సన్యాసం కూడా ఆ పిచ్చికి కారణం కావచ్చు. సోమనాధ అయ్యర్ తన చెడు తిరుగుళ్ళను మాని భార్య ముత్తమ్మ ప్రెమను పొంది సంసార జీవితంలో ని స్థిరత్వాన్ని ఆస్వాదించడం మొదలెడతాడు. ఈ నవల ఇక్కడ ఆగిపోతుంది

నవలలో విషయాలన్నిటీలో కూడా ఒక కొత్త ఒరవడి కనిపిస్తుంది. స్త్రీ లందరూ చాలా గట్టివారుగా కనిపిస్తారు. తమ సమస్యలను తామే పరిష్కరించుకునే ధీరలు వారు. అలానే ఎన్నో ఆధునిక భావాల ప్రస్తావన కూడా కనిపిస్తుంది. వితంతు వివాహం, వర్ణాంతర, వర్గాంతర వివాహం, సంసారంలో స్థ్రీ ప్రాధాన్యత, సన్యాస జీవితంలోని కష్టాలు, మనసును నిగ్రహించడం అనే గొప్ప సాంప్రదాయం మనిషికి వేసే శిక్ష, ఇలాంటి ఎన్నో విషయాలను రచయిత చర్చించే ఉద్దేశంతోనే ప్రస్తావించారు. ఈ అసంపూర్తి నవలలో కూడా భారతిలోని ఆధునిక భావజాల రచయిత కనిపిస్తారు. సంస్కరణోద్దేశము తోనే రచయిత ఈ నవలకు పూనుకున్నారని అర్ధం అవుతుంది. 

ఎన్నో చారిత్రిక విషయాలను ప్రస్తావించే ఈ నవలను తెలుగులో ఒక భాద్యతగా అనువదించిన భం గో రే గారి ప్రయత్నాన్ని అభినందించాలి. తెలుగువారి గౌరవాన్ని పెంపొందించే ఇటువంటి రచన సామాన్య పాఠకులకు చేరాలని ఇందులోని చారిత్రిక, సాంఘిక విషయాలపట్ల అవగాహన ఎందరికో కలిగాలనే కోరికతో ఈ పుస్తకాన్ని ఇలా మీ ముందుకు తేవడం జరిగింది. కావ్యా పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించిన ఈ పుస్తకం విశాలాంద్ర, నవోదయ లో కూడా దొరుకుతుంది.  

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.